2, నవంబర్ 2013, శనివారం

ప్రజాస్వామ్యం లో ఏకాభిప్రాయ పాత్ర ఎంతవరకూ! - అధిష్టానాలు ప్రజాస్వామ్యబధ్ధమా!!


“In a democracy dissent is an act of faith. Like medicine, the test of its value is not in its taste, but in its effects.” 
J. William Fulbright 


“I think we Americans tend to put too high a price on unanimity, as if there were something dangerous and illegitimate about honest differences of opinion honestly expressed by honest men.”

 J. William Fulbright

  “In unanimity there may well be either cowardice or uncritical thinking.” Donald Rumsfeld




 The decision doesn't have to be logical, it was unanimous. -  Harry S Truman


రెండు  మూడు  నెలల క్రితపు మాట! భారత దేశంలో ఉన్న పెద్ద పార్టీల్లో ఒక పార్టీ తమ ప్రధాన మంత్రి అబ్యర్ధిని ప్రకటించింది. అదే పార్టీలో ఉన్న ఒక పెద్దాయన ఆ అభ్యర్ధిత్వాన్ని, ఆ అబ్యర్ధి తన శిష్యుడైనప్పటికీ, వ్యతిరేకించారుట. 

ఇక చూసుకోండి మొదలయ్యింది మీడియా అల్లరి. ముఖ్యంగా ఆంగ్ల చానెళ్ళల్లో.  ఆంగ్ల చానెళ్ళల్లో యాంఖర్లు లేదా ప్రెజెంటర్లు దాదాపు అందరూ ఈ అల్లరికి సూత్రధారులుగా నిలిచారు. న్యూస్ రీడర్లు అంటే  వాళ్ళు నామోషీ పడతారుష. పాపం న్యూస్ రీడర్  అంటే వ్రాసిచ్చినది చదివే జీతానికి పనిచేసే గుమాస్తా మాత్రమే అని వారి బంగారు అభిప్రాయం, వీళ్ళైతే, ఒక కొత్త పేరు (వాళ్ళకు కాదు తాము చేసే పనికి) తగిలించుకుని తమ తమ భావాలను, దురభిప్రాయాలను, ప్రెజ్యుడీస్ లను, తమకు  లాభమనుకునే వాళ్ళ పక్కనుంచి "వార్తా వ్యాఖ్య"  పేరిట  తెగ పేలిపోవచ్చు, ప్రేక్షక/పాఠక బుర్రలను బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నమూ చెయ్యవచ్చు. ఇలాంటి వార్తలు చూపించవచ్చా, వార్తలను వక్రీకరించి "ప్రచారం" (ప్రసారం కాదు) చెయ్యవచ్చా అన్న అనవసర విషయాల జోలికి వెళ్ళే ప్రయత్నమే కనపడదు. 

సరే,  అసలు విషయానికి వస్తే, ఈ మీడియా అల్లరి చూస్తె, ప్రతి పార్టీ కూడా, ఎలెక్షన్ కమీషన్ కంటే కూడా , ఈ టి వి/పత్రిక  "అధినేతల" ముందు  తమకున్న ప్రజాస్వామిక విధేయతను నిరూపించుకోవాలి అన్నట్టుగా ఉన్నది. ఏమిటి ఈ మీడియాకు ఉన్న అభ్యంతరం, ఆ పార్టీలో అంతర్గత వైరుధ్యాలు ఉన్నాయట, ప్రధాని అబ్యర్ధి ప్రకటించే క్రమంలో ఏకాభిప్రాయం లేదట. 

ఏమి ఏకాభిప్రాయం లేకపోతే, ప్రజాస్వామ్యానికి ఏమన్నా నష్టమా.   

కొన్ని పార్టీల్లో, ఏకాభిప్రాయం పేరిట జరిగే నాటకాలు చూస్తుంటే, నవ్వు వస్తుంది. నాయకుడు అవుదామని తాపత్రయ పడి తనవంతు ప్రయత్నం చేసి, ఆవతలి అబ్యర్ధికి ఆ నాయకత్వం, "ఏకాభిప్రాయం"  పేరిట పార్టీ అధిష్టానం కట్టబెట్టే  నిర్ణయం తీసుకుంటే, పాపం ఈ మనిషి ఏడుపు మొహం పెట్టుకుని, తన ప్రత్యర్ధి పేరు తానే ప్రతిపాదిస్తాడు, మరొకరు సెకండ్ చేస్తారు, మరింకెవ్వరూ నిలబడరు. ఆ విధంగా నాయకత్వ ఎన్నికను ఎలాగోలాగా జరిపించి, మా పార్టీలో ఏకాభిప్రాయంతోనే అన్నీ జరుగుతాయి అని ప్రస్తుతానికి, బాకులు, చాకులు, కత్తులు కనపడకుండా జాగ్రత్త పడుతూ, ప్రకటించేస్తారు. మీడియా వాళ్ళు బర బరా సంపాదకీయాలు కూడా గీకేస్తారు, ఆ ప్రజాస్వామ్యపు తీరును మురిపెంగా చూసుకుంటూ. 

రెండో రోజు నుంచి, తాను  ప్రతిపాదించిన మనిషిని పడగొట్టటానికి (వేరే పార్టీ వాళ్ళు కానే కాదు, అదే పార్టీ వాళ్ళే) ఎక్కడలేని ద్వేషంతో ప్రతి రాయీ కదిల్చి చూస్తూనే ఉంటారు. అలాంటి ఏకాభిప్రాయమా ప్రజాస్వామ్యం అంటే!!??

బి జె పి  కూడా  దాదాపుగా అలాగే తమ నాయకుణ్ణి ప్రకటించింది. అందులో అంత అభ్యంతరం  చెప్పాల్సినది, మీడియాలో రోజుల తరబడి నానా యాగీ చెయ్యటానికి ఏమున్నది. ఎవరన్న ప్రేరేరింపించి,  ఈ పని చేయిస్తుంటే తప్ప!

ఏకాభిప్రాయానికి అంతటి అవసరం ఉండి ప్రాధాన్యం ఇవ్వాలి అన్న దృక్పథం ఉండి  ఉంటే, మన రాజ్యాంగంలో, ప్రతి ఎన్నిక అలాగే జరగాలి అని వ్రాసేవారు. అలా వ్రాయలేదే! ప్రధాన మంత్రి ఎవరు అవ్వాలి, ఫలానా పార్టీ అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఏ వ్యక్తికి ఐతే, పార్లమెంట్ సభ్యుల్లో ఎక్కువమంది అనుకూలంగా ఉన్నారో, ఆ వ్యక్తే,  ప్రధాన మంత్రి. అటువంటి వ్యక్తి అప్పటికి పార్లమెంటుకు ఎన్నిక అయ్యి ఉండనవసరం లేదు. ప్రధాని ఐన ఆరు నెలలోపుగా లోకసభ-రాజ్యసభకు ఎన్నిక అవ్వాలి. అలా కాని పక్షంలో ప్రధాని పదవికి అనర్హుడు. కాని ఆ ఆరు నెలలలో ప్రధానే. రాజ్యాంగంలో ఎక్కడా కూడా పార్టీ అధిష్టానం పాత్ర గురించి వ్రాయనేలేదు. 

కాని జరుగుతున్నది ఏమిటి? ఎన్నికలు అవుతాయి. ఇక అంతే  పాపం ఆ ఎన్నిక అయిన సభ్యులకు ఏమాత్రం స్వాతంత్ర్యం లేదు. వాళ్ళను తమ కనుసన్నులలో అధిష్టానం ఉంచుకుని, ఆ అధిష్టానంలో ఉన్న నాయకుల  (వాళ్ళు వాళ్ళ జన్మలో ఎక్కడా కూడా ఎన్నిక అవకపోయినా సరే, వాళ్ళ  స్వరాష్ట్రంలో వాళ్ళు గెలవటం మాట అటుంచి, వాళ్ళెవరో ప్రజలకు తెలియని వారు),  మాట  ప్రజలచేత ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, విని తీరవలసినదే.  నోటికి అడ్డూ అదుపూ ఉండాలన్న ఇంగితం లేని ఒక అధిష్టానపు పెద్దమనిషి, స్వంత రాష్ట్రంలో  వారు ముఖ్యమంత్రి అవ్వాలని 2 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారుట, ఆవతలి పార్టీ మనిషిని దాదాపుగా 56 శాతం మంది మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటున్నారుట. అది ఈ అధిష్టానపు పెద్దకు ప్రజల్లో ఉన్న పలుకుబడి!!

ఈ అధిష్టానం పాత్ర  గురించి ఏ మీడియా కూడా  కిమ్మనదు. కారణం వాళ్ళకే తెలియాలి. అధిష్టానం అనేది ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకం కాని నిజానికి పార్టీ అధిష్టానం, ఆ అధిష్టానికి ఉన్న అపరిమిత అధికారాలు చెలాయిస్తూ ఉంటుంది.

వేరే పార్టీల గురించి మాట్లాడేప్పుడు, ఆర్ ఎస్ ఎస్ మాట ఎందుకు వింటారు అని మండి  పడుతుంటారు, ఈ మీడియా "పండితులు". ఎందుకూ కొరగాని అధిష్టానం మాట వినగా లేనిది, సామాన్య ప్రజలే సభ్యులుగా కల, అతి క్రమశిక్షణ కలిగిన సంస్థ ఆర్ ఎస్ ఎస్ మాట  వినటంలో తప్పేమున్నదో నాకు మాత్రం అర్ధం కాదు. 

విదేశీ ఇజాలతో ఇక్కడ పార్టీలు పెట్టుకోగా లేనిది, విదేశాలనుంచి  వచ్చే  నిధులతో నడిచే పార్టీలు, విదేశాలనుండి  వచ్చే ఆదేశాలను అనుసరించే పార్టీలు ఉన్న మన దేశంలో, స్వదేశీ సంస్థ ఐన, అది కూడా సామాన్య ప్రజల కూటమి ఐన ఆర్ ఎస్ ఎస్ మాట బిజెపి  వింటే వచ్చే నష్టం ఏమిటి! 

 ప్రార్ధన స్థలాల్లో ఫలానా  పార్టీకి గంప గుత్తగా వోటు వెయ్యండి అని ప్రచారం చేసి గుంపులు గుంపులుగా వోట్లు వేయిస్తున్నప్పుడు , అలాంటి గంప గుత్త  వోట్ల కోసం దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, లౌకిక వాదాన్ని ముసుగుగా తొడుక్కుని, దేశానికి తీరని ద్రోహం చెయ్యటానికి కూడా  వెనుకాడని సందర్భాలు అనేకం ఉన్న మన దేశంలో,    అక్కడ కనపడని తప్పు,          ఆర్ ఎస్ ఎస్ లోనే శోధన చేసి కనిపెట్టాలని ఏమిటి ఈ తాపత్రయం.చాలా చిత్రమైన ఆలోచనా ధోరణులను చూస్తున్నాము ఈ రోజున. 

సరే బిజెపిలో  ఒకరిద్దరు వ్యతిరేకించినా సరే, ఒకాయన్ని ఎన్నుకున్నారు. మరి మిగిలిన పార్టీల్లో పరిస్థితి ఏమిటి:

  1. సమాజ్ వాది  పార్టీలో ములాయం మీద నుంచుని పార్టీ అధ్యక్షుడు అవ్వాలని ఎవరన్న అనుకోగలరా. లల్లూని కాదని ఆయన భార్య తప్ప అది కూడా ఆయన అనుమతితో, పార్టీ నాయకత్వం చేబట్టగలరా? ఆ శ్రీవారు జైల్లో కూచున్న తరువాత కూడా.
  2. అలాగే అన్నా డి ఎం కే, డి ఎం కె, తృణమూల్, తెలుగు దేశం పార్టీల్లో కూడా  ఏకాభిప్రాయం చాటున జరుగుతున్నది ఏమిటి, ప్రజాస్వామ్యమే! ఈ పార్టీల్లో నాయకత్వ ఎన్నిక ఎలా జరుగుతున్నది???
  3. ఇక కాంగ్రెస్, ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. విదేశీ  అయినా సరే, ఇంటిపేరు బట్టి అక్కడ పార్టీ నాయకత్వం. అంతకంటే భిన్నంగా అక్కడ జరుగుతుందా!
 బిజెపిలో కనీసం ఆ నటన లేదు. వాళ్ళు ఎంతటి ప్రజాస్వామ్యం వాళ్ళ పార్టీలో తీసుకు రాగలిగారు అనేది, మిగిలిన పార్టీలతో పోల్చి చూసి, పది దాకా ఉన్న స్కేలు మీద,  ఒక్కోక్కళ్ళకీ మార్కులు ఇస్తే, బి జె పి కే ఎక్కువ మార్కులు  వస్తాయి. అక్కడ ఎవరూ కూడా  కుటుంబాలు పాతుకుపోలేదు.  

అధిష్టానం తీరు తెన్నులు, అసలు అధిష్టానానికి ఉన్న రాజ్యంగ గుర్తింపు ఏమిటి అన్న విషయం మీద మునుపు ఇదే బ్లాగులో ఒక వ్యాసం వ్రాయటం జరిగింది. ఈ కింది లింకు నొక్కి ఆ వ్యాసం చదువ వచ్చు:


పార్టీలకు అంతర్గతంగా కావలిసిన పనులు చేసుకోవటానికి కొంతమంది సమర్ధులైన వారు అవసరం.  కాని ఎలాంటి వారు ఈ అధిష్టానంలో ఉండాలి అన్న విషయం మీద కొంత ఆలోచన చేసిన మీదట నాకు అనిపించిన కొన్ని విశేషాలు. 

"అధిష్టానం అనేది మా అంతర్గత వ్యవహారం, మా ఇష్టం, చైనా వాణ్ణి తెచ్చి పెట్టుకుంటాం! వాళ్ళంటే మాకు భలే ఇష్టం, అధిష్టానంలో ఎవరు ఉండాలి అన్నది మా ఇష్టం, ప్రజలేవరు చెప్పటానికి"  అని రాజకీయ పెద్దలు అహంకరించటానికి వీలు లేదు అని నా ఉద్దేశ్యం. 

ఆ పార్టీలు మనను పరిపాలించటానికి ఎన్నికల్లో నుంచుంటున్నాయి. మనను పరిపాలింటానికి ఎవర్ని పడితే వాళ్ళను మన ముందు పెట్టి వీళ్ళనే ఎన్నుకోండి అని చెప్పే అధికారం ఈ పార్టీలకు ఎవ్వరూ ఇవ్వలేదు. కాబట్టి పార్టీల్లో ఉండవలసిన ప్రజాస్వామ్య విధానాలు, వాళ్ళ అంతర్గత వ్యవహారం ఎప్పటికీ కాదు. అది కూడా  ప్రజలకు సంబంధించినదే కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిన జరగవలసినదే. 

  1. అధిష్టానంలో ఒకే కుటుంబానికి చెందిన వారు ఒకరి కంటే ఉండకూడదు. ఇక్కడ కుటుంబం అంటే కంపెనీ చట్టం  ప్రకారం దగ్గిర బంధువుల నిర్వచనాన్ని తప్పకుండా పాటించాలి. కంపెనీ చట్టంలో లేని దగ్గిర బంధువులను, రాజకీయ నాయకుల అతి తెలివిని దృష్టిలో ఉంచుకుని, విడాకులు తీసున్న భార్య కాని భర్త కూడా దగ్గిర బంధువులుగా వర్తించాలి. 
  2. రెండు రకాల అధిష్టానాలు ఉండాలి. రాష్ట్రానికి ఒక అధిష్టానం, కేద్రానికి ఒక అధిష్టానం. రాష్ట్ర అధిష్టానానికి, కేంద్ర అధిష్టానికి ఉన్న అధికారాలు ఉండాలి. రాష్ట్రం వరకూ వారిదే చివరి మాట. కేంద్ర అధిష్టానాన్ని సంప్రదించాల్సిన అవసరం ఉండకూడదు.
  3. అధిష్టానపు సభ్యులు అందరూ కూడా తప్పనిసరిగా ఎప్పటికప్పుడు, ఏరోజున చూసినా సరే, గడిచిపోయిన  పది సంవత్సరాల్లో మూడు సార్లయినా ప్రజల చేత, అంటే  లోక్ సభకు కాని రాష్ట్ర శాసన సభకు కాని  ఎన్నిక అయ్యి ఉండాలి. ఈ మూడు సార్లల్లో ఒకసారి మాత్రమే ఎగువ సభకు ఎన్నికయ్యి ఉండవచ్చు. అలా లేని వారు అప్పటికే సభ్యులుగా ఉన్నా సరే వెనువెంటనే ఆ సభ్యత్వం  కోల్పోతారు. 
  4.  
    ఇలా కొన్ని కొన్ని నిబంధనలను ఆలోచించి, పెద్దలందరూ (రాజకీయ నాయకుల్లో అలాంటివాళ్ళు ఎవరన్నా మిగిలారా!) ఒకచోట కూచుని, రాగద్వేషాలకు పోకుండా (సాధ్యమా!) మన రాజ్యాంగాన్ని ఈ అధిష్టానం / పాలిట్ బ్యూరో అనే అచ్చోసిన ఆంబోతు ను కట్టడి చేస్తే కాని ప్రజాస్వామ్యం సవ్యంగా ఉండే అవకాశం లేదని నా ఉద్దేశ్యం.



3 కామెంట్‌లు:

  1. మన దేశ రాజకీయ పార్టిలలోని అంతర్గత ప్రజాసామ్యం నేతిబీరకాయ చందమే.... ఉన్న వాటిల్లో బిజెపి నయం... వేరొకరిని నాయకుడిగా ప్రకటించగానే మరొకరు పైకి ఏడిచేపాటి ప్రయాసామ్యం అయినా ఉన్నది.. అధినేత, అధిష్టానం లాంటి పదాలున్న కాంగ్రెస్సులో ప్రజాసామ్యానికి తావెక్కడ...??? ఇక కమ్యునిస్టుల విషయానికొస్తే, సినియారిటి ప్రకారం గుమాస్తాలు ఆఫీసర్లు అయ్యే ఆఫీసు పద్దతే కానీ...ప్రజాసామ్యం కానరాదు...

    రిప్లయితొలగించండి
  2. మీరు చెప్పింది అక్షర సత్యం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ప్రపంచంలోనే అతి నిబద్ధత ప్రమాణాలు కలిగి నిజమైన జాతీయతా ధృక్పధంతో మరియు సేవాపరాయణులైన సభ్యులతో నిస్వార్ధంతో పనిచేసే సంస్ధ అని నా అభిప్రాయం. ఎక్కడైనా లక్షలాది సభ్యులు గల సంస్ధలలో ఒకరిద్దరు స్వంత భావోద్రేకాలతో ప్రవర్తిస్తే అది సంస్ధకు వర్తించదు. ఒకవేళ్ సంస్ధ ఆదేశాలతో చేస్తే అప్పుడు సంస్ధకు వర్తిస్తుంది. ఈ విధంగా చూస్తే ఆర్.ఎస్.ఎస్. కు ఎటువంటి మచ్చ లేదు కానీ కుహనా లౌకిక వాదులు, పార్టీలు ఎందుకు ఇటువంటి సత్ప్ర్రవర్తన గల సంస్ధను ఆడిపోసుకుంటారో నాకు అర్ధ్హం కాదు. మరి ఈ లౌకిక కాంగ్రెస్ పార్టీ వాదులు ఎంతో భద్రతా ఏర్పాట్లు గల దేశ రాజధానిలోనే వేలాది సిక్కులను ఊచకోత కోసారు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ వారిమీద ఏమి చర్య తీసుకుంది. మరి అటు వంటి కాంగ్రెస్ ను ఈ కుహనా లౌకిక వాదులు, పార్టీలు ఎందుకు దూరం పెట్టరో కనీసం ఎందుకు విమర్శించరో నాకు అర్ధం కావడంలేదు. ఇది నా తెలిసీ తెలియని అభిప్రాయం. తప్పులుంటే క్షమించగలరు.

    రిప్లయితొలగించండి
  3. మొదటిసారి కిందినించి పయిదాకా కాంగ్రెసు లో ప్రజాస్వామ్యబధ్ధంగా యెన్నికయి 104 డిగ్రీల జ్వరంతో హాజరయిన బోసుని క్రూరంగా తనంతట తనే రాజీనామా చేశేలాగా ప్రవర్తించిన వెధవలు కాంగ్రెసువాళ్ళు. మిగతా పార్టీ లన్నీ ఆ తానులో ముక్కలే కదా. కాంగ్రెసు సంసృతిలో రాజకీయాలు వెల్గబెట్టే యే పార్టీ కూడా అంతర్గత ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వరు, భాజపా తో సహా.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.