17, మార్చి 2014, సోమవారం

అలనాటి లీలా మహల్

ఇదంతా ఇప్పుడు వ్రాయటానికి కారణం, ప్రేరణ ఈ మధ్య మార్చ్ 8, 2014 నుండి 14 వరకూ నేను విజయవాడలో ఉండి  పలు పాత ప్రాంతాలు తిరుగులాడటం. ఏమున్నది గర్వకారణం! పాతను తుడిచేసి కొత్తచేస్తున్నారు. ఎక్కడ చూసినా రియల్ ఎస్టేటు రాబందుల మయం, మాయ. కాస్త నాలుగు వందల గజాల స్థళం ఉంటే చాలు వాళ్ళని అల్లించి-బెల్లించి అక్కడున్న పాత కట్టడాన్ని "కొట్టేసి" కమర్షియల్ కాంప్లెక్స్ లేదా అపార్ట్మెంట్లు. ఇంతే! ఇంతకు మించిన అభివృద్ధి  మనకు తెలుసినట్టు  లేదు. పాత నగరాన్ని అలాగే ఉంచి కొత్త నగరం కట్టుకోవటం మనకు తెలియదు.  తెలిసినా డబ్బులు ఎలా వస్తాయని, పాతవన్నీ డబ్బులు చేసుకోవటం. అదే ఈరోజు అందరికీ తెలిసిన అద్భుత ఆర్ధిక శాస్త్ర పరిజ్ఞానం.

ఆలా తిరుగుతూ పాత బస్ స్టాండ్, మమతా, మనోరమా  హోటల్ ప్రాంతంలో లీలా మహల్ ఎలా ఉందో అని వెడితే ఏమున్నది అక్కడ? సినిమా హాలు లేదు! "కొట్టేశారు". కొట్టేసి ఏమి పెట్టారు?  ఒక కార్ల పార్కింగ్ నడుస్తున్నది. అలనాటి మన లీలా మహల్ లేదు. ఎన్ని జ్ఞాపకాలు ఎన్నెన్ని గుర్తులు ఈ సినిమా హాలు చుట్టూ ఉన్నాయి. నాకే కాదు వేల మందికి!
 లీలా మహల్ డిసెంబరు 31,  1944లో ప్రారంభోత్సవం చేసినప్పటి ఫోటో 

విజయవాడ లేదా విజయవాడ పరిసర ప్రాంతాల్లో పుట్టి పెరిగి ఆంగ్ల చిత్రాలంటే అభిమానం ఉన్న వారందరికీ గుడి లాంటిది "లీలా మహల్". సినిమా హాలు పైన ఉన్న సరస్వతీ దేవి బొమ్మ అందరికీ చిరపరిచితం.  ఈ హాలులో నా చిన్న తనంలోమా మేనమామ శ్రీ శుద్దపల్లిచంద్ర మౌళి (ఆయనే నాకు ఆంగ్ల సినిమాలు పరిచయం చేసినది) తీసుకు వెళ్ళిన
   శ్రీ శుద్దపల్లి చంద్రమౌళి 

ఆంగ్ల సినిమాలు చూసి ఉండవచ్చు, సరిగ్గా గుర్తు లేదు.  కాని నా అంతట నేను ఒంటరిగా లీలామహల్లో చూసిన మొదటిది    "ది డిసర్టర్"  అనే సినిమా, అది కూడా   1973లో.  అప్పట్లో ఆ హాలులో మూడు తరగతులు ఉండేవి. ఏభై పైసలు (నేల క్లాసు అని పిలిచినా చెక్క కుర్చీలు ఉండేవి), రూపాయి పదిహేను పైసలు (దీన్నే కుర్చీ క్లాసు అంటే  కుర్చీ ఆ కుర్చీకి కొద్దిగా కుషన్  ఉండేది), రెండు  రూపాయలు (బాల్కనీ అంటే ఇప్పుడు మేజ్ నైన్  ఫ్లోర్ అంటున్నారే,   అలా హాలులో కొంత భాగం బాల్కనీగా మెట్లు ఎక్కి వెళ్ళాలి,  అక్కడికి  ప్రవేశం ప్రత్యెక ఏర్పాటు). నేల మరియు కుర్చీ క్లాసులకు బయట నుంచి లైన్లు ఉండేవి అంటే టిక్కెట్టు తీసుకున్న తరువాతే లోపలకు ప్రవేశం, బాల్కనీవాళ్ళకు టిక్కెట్లు కౌంటర్ లోపలే ఉండేది. 

నాకు బాగా గుర్తు,  రూపాయి పదిహేను పైసలకు టిక్కెట్లు  ఇచ్చే ఆయన, ఎప్పుడూ చిరచిర లాడుతూ-తీవ్రమైన అజీర్తి రోగంతో బాధ పడుతున్న వాడిలాగా ఉండే వాడు (ఇది పూర్తిగా మా ఊహ మాత్రమే)- ప్రేక్షకులను ఎప్పుడూ విసుగ్గానే చూసేవాడు, ఆయనకి  జీతం ఎవరి వల్ల  వస్తున్నదో గమనించుకోకుండా! 

మరొక ఇద్దరు గుర్తుకు వస్తున్నారు. ఒకరు ఆ హాలు ప్రొజెక్టర్ ఆపరేటర్, అప్పటికే బాగా పెద్దాయన చక్కటి తెల్లటి యూనిఫామ్ లో చెరగని చిరునవ్వుతో,  చలాకీగా సినిమా నడిపిస్తూ కనిపించేవారు. యూనిఫామ్ అంటే తెల్లటి నిక్కరు, బెల్టు లోపలికి టక్ చేసిన తెల్ల చొక్కా. మరొకరు ఆ హాలు గెట్ కీపర్ చాలా లావుగా ఉండేవాడు చెవులకు, ఒక చేవుకు అనుకుంటాను రింగు ఉండేది. మిగిలిన గెట్ కీపర్లు కూడా వాళ్ళే కనపడేవాళ్ళు, అంటే చీటికి మాటికి వాళ్ళను వెళ్ళ గొట్టి కొత్తవాళ్ళను పెట్టె వాళ్ళు కాదన్న మాట. లీలా మహల్ ఒక్క దాంట్లోనే సినిమా వెయ్యటం చాలా సులభంగా చూడగలిగే వాళ్ళం, ప్రొజెక్టర్ రూం అందరికీ చూసే చోటనే  ఉండేది, వాళ్ళు వెనుక తలుపు తీసి ఉంచేవాళ్ళు, పిల్లలం అప్పుడు ప్రొజెక్టర్  తిరగటం, రీళ్ళు వెనక్కి తిప్పటం వంటి ప్రక్రియలు ఆశ్చర్యపోతూ చూసే వాళ్ళం.

ఒక సినిమా చూసేసిన తరువాత మర్చిపోయ్యే, మర్చిపోనిచ్చే  హాలు కాదు లీలా మహల్. ఒక సినిమాకి వెడితే పది రాబొయ్యే సినిమాల "ట్రైలర్లు" వేసి మన్ని ఆకర్షించి మళ్ళీ  మళ్ళీ  సినిమాలు చూసేట్టు చేసేవాళ్ళు.
లీలా మహల్ వ్యవస్థాపకులు శ్రీ గిరిజా ప్రసాద్
ఎప్పుడన్నఅటు పక్కనుంచి వెడుతూ సైకిలు అలా ఫుట్ పాత్  కు ఆనించి తాళం వేసి లోపలకు వెళ్లి అక్కడ ఉన్న రాబొయ్యే సినిమా స్టిల్స్ చూడటం ఒక  అనుభూతి. అలా వెళ్ళినప్పుడు ఆ సినిమా హాలు అధిపతి గిరిజా ప్రసాదు (అప్పటికి ఆయనేవ్వరో తెలియదు) ఒక వెదురు కుర్చీలో కూర్చుని కనిపించేవారు. 
అలా మొదలయిన నా ఆంగ్ల సినిమా ప్రస్తానం (ప్రేక్షకుడిగా) పెరిగి పెరిగి అదొక పెద్ద హాబీగా మారింది. ప్రస్తుతానికి పూర్తి క్లాసిక్ సినిమాలను మాత్రమె చూసే దశకు రిఫైన్ అయ్యింది. ఒక పెద్ద ఆంగ్ల సినిమా డాటాబేస్ తయారు అయ్యింది నా దగ్గర. ఈ మొత్తానికి మూలం లీలా మహల్. 

సామాన్యంగా లీలా మహల్లో ఆంగ్ల సినిమాలు మాత్రమె వచ్చేవి. కాని 1972 లో అనుకుంటాను "జై బంగ్లా" అనే హిందీ సినిమా ఈ హాలులో వస్తే, మా మేనమామ మా పిల్లలు అందరినీ, (దాదాపు 10 మందిమి-నేను, మా తమ్ముళ్ళు, కజిన్స్ కలిసి) తీసుకు వెళ్ళాడు. ఇది అప్పుడే ముగుసిన బంగ్లా దేశ్ యుద్ధం, ముక్తి బాహిని వాళ్ళు పాకిస్తాన్ సైన్యాన్ని ఎలా ఓడించారు విషయం మీద తీసిన ఊహాజనిత సినిమా. అప్పుడు పైన చెప్పిన గేట్ కీపర్, ఇంతమంది  పిల్లల్ని చూసి  ముందుగానే మమ్మల్ని  లోపల కూచోపెట్టి,  మా మామయ్యకు టిక్కెట్లు తెచ్చి ఇచ్చాడు. అప్పట్లో పిల్లలతో వెడితే అలాంటి మర్యాదలు ఉండేవి! ఇవ్వాళ సినిమాకు వెడితే మానేజరు రూపంలో ఉండే రౌడీలు, జంతువుల్లాగా ప్రవర్తించే గెట్ కీపరులు ఎక్కువగా  కనపడతారు.  ఇప్పుడు కూడా మంచి వాళ్ళు ఉండి  ఉండవచ్చు కాని వాళ్ళను చూసే అదృష్టం నాకు కలగలేదు. 

సామాన్యంగా లీలా మహల్లో సినిమాలు రెండు మూడు రోజులకి మించి ఆడేవి కాదు. లిథో ప్రింట్ లో తయారయిన బ్లాక్ ఆండ్ వైట్ పోస్టర్లు ఊరంతా అంటించే వారు, హాలులో మాత్రం వాళ్లకు వచ్చిన ఫారిన్ కలర్ పోస్టర్లు అంటించే వాళ్ళు.ఈ సినిమా హాలు వాళ్ళు గోడల మీద పోస్టర్లు అంటించే  వాళ్ళు కాదు, మునిసిపాలిటీ అనుమతి తో నగరంలో అక్కడక్కడా చిన్నపాటి హోర్డింగులు ఉంచేవాళ్ళు, తమ తోటి ఆంగ్ల సినిమా హాలు అయిన నవరంగ్ టాకీస్ తో కలిపి ఈ హోర్డింగులు ఉండేవి. హోర్డింగ్ అంటే పెద్ద ఏర్పాటు ఏమీ కాదు, రెండు సర్వే  దుంగలకు రెండు పోస్టర్లు అంటించే పెద్ద రేకు ఒకటి బిగించి, ఆ దుంగలను రోడ్ మార్జిన్లో ఎవరకి అడ్డం లేని చోట ఏర్పాటు చేసేవాళ్ళు మా ఇంటి దగ్గరలో, నేను కాలేజీకి పొద్దున్నే వెళ్ళే మార్గంలో లీలా మహల్ పోస్టర్లు అంటించే ప్రత్యెక హోర్డింగ్ ఉండేది. ప్రతిరోజూ దూరం నుంచే తెలిసి పొయ్యేది కొత్త సినిమా వచ్చేసిందని. ఇక టిక్కెట్ డబ్బులకు ఆరాటం, ఎలాగోలాగ రెండు మూడ్రోజులు టిఫిన్ మానేసి (మా నాన్నగారు రోజుకు నలభై పైసలు ఇచ్చేవారు, టిఫిన్ ఒక్కంటికి  ఇరవై పైసలు ఉండేది అప్పుడు) ఆ డబ్బులతో సినిమాకు చేక్కేయటం, ఆ సినిమా చూస్తుండగానే మరి కొన్ని సినిమాల ట్రైలర్లు, వాటిల్లో కొన్నిటిని గుర్తుంచుకుని చూడటానికి ఎదురు చూడటం! అలా నా కాలేజీ జీవితం మొత్తం గడిచి పోయింది. మా కాలేజీ షిప్ట్ కాలేజీ, మాకు పొద్దున్న 7:30 లకు క్లాసులు మొదలయ్యి, మధ్యాహ్నం 12:10 వరకూ క్లాసులు. ఈ ఏర్పాటు సినిమాలు  చూడటానికి అద్భుతంగా ఉండేది. 

లీలా మహల్లో మరొక చిత్రం చేసేవాళ్ళు. అదేమిటంటే ఒకే టిక్కెట్ కు రెండు సినిమాలు. సామాన్యంగా ఆంగ్ల సినిమాలు గంట, గంటన్నర కంటే ఉండేవి కాదు. ఒక్కో సారి గంట లోపు సినిమాలు కూడా వచ్చేవి. అలాంటప్పుడు ఇంటర్వెల్ దాకా ఒక సినిమా, ఇంటర్వెల్ తరువాత మరొక సినిమా చూపే వాళ్ళు. లేదంటే, ఇంటర్వెల్ దాకా కార్టూన్ సినిమాలు ఉడీ-ఉడ్పెకర్, టాం ఆండ్  జెర్రీ ఇంకా అనేకం ఈ హాలు ద్వారానే మాకు పరిచయం. ఎక్కువగా మేము మార్నింగ్ షోకు ఆదివారం సినిమాలకు వెళ్లినట్టు గుర్తు. ఇంటినించి వెళ్ళటం రావటం కూడా పదకొండో నెంబరు మీదే! 

అపట్లో ఎయిర్ కండిషన్ ఉండేది కాదు, సాయంత్రం ఫస్ట్ షోకి వెడితే, కాస్త చీకటి పడంగానే తలుపులు  తీసేసే వాళ్ళు, చక్కటి గాలి వేసేది. అలా చూసిన సినిమాలు ఎన్నో, ఇప్పుడు గుర్తుకు వస్తే "నోస్టాల్జియా" (పాత జ్ఞాపకాల యావ) తప్ప మరొకటి లేదు. Nostalgia కు సవ్యమైన తెలుగు మాట ఇంతవరకూ నా దృష్టికి రాలేదు, అందుకనే అదే పదాన్ని వాడవలసి వచ్చినది. 

 ఈ హాలులో సినిమాలు నేను ఎక్కువగా చూసినది ఏభై పైసల టిక్కెట్లోనే. విజయవాడలో మరే హాలులో అయినా సరే బాల్కనీకి వెళ్ళగలిగిన స్థోమత ఉన్న నేను, ఈ హాలులో మాత్రం, "నేల" టిక్కెట్టుకే వెళ్ళే వాణ్ణి.  ఆ హాలులో అమలు పరిచిన పరిశుభ్రత, "నేల" టిక్కెట్ లో కూడా  శుభ్రంగా సినిమా చూడగల వాళ్ళు మాత్రమే (కూచుని అటూ  ఇటూ ఉమ్మేయటం, సిగిరెట్లు తాగటం, వెర్రి వాగుడు వాగుతూ ఉండటం, సీట్లెక్కి అరవటం, కాయితాలు ఎగరెయ్యటం వంటి "అలాగా పనులు" చెయ్యని వాళ్ళు) ఉండటం, అన్నిటికన్నా ముఖ్య కారణం. పైగా వారానికి రెండు  నుంచి మూడు సినిమాలు మారిపొయ్యేవి, అవ్వన్నీ చూడటానికి "మనీ మానేజిమెంట్"
నేను,  నా బాల్య మిత్రుడు ప్రఖ్యా రామశాస్త్రి,
కారణాలు. ఇలా నేను ఆ హాలులో ఎక్కువగా నా బాల్య మిత్రుడు శాస్త్రి తో చూసాను. ఇద్దరం కూడా చూసేది అమెరికన్ సినిమాలు, లేదంటే బ్రిటిష్ సినిమాలు వెరసి ఆంగ్ల సినిమాలు. అదుకనే నేమో ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకుని అమరికన్ పధ్ధతిలోనే సినిమా చూసేవాళ్ళం, ఒకళ్ళొకొకళ్ళు డబ్బులు పెట్టుకోవటం అలవాటు మాకు కాలేదు. ఇదే,  మా ఇతర ఫ్రెండ్ల దగ్గిర నాది విచిత్ర ప్రవర్తనగా ఉండేది. ఏమి చేస్తాం మన అలవాటు మనది. ఇలాగే
 ఆప్పటి  మా "సినిమా గాంగ్" ఇప్పటి రూపాల్లో 
గుంపుగా ఎప్పుడన్నా సినిమాలకు వెడితే పైన చెప్పిన బాల్య స్నేహితుడు (మాకు కజిన్  కూడా) శాస్త్రి తో పాటు మా పిన్నిగారబ్బాయిలు విష్ణు శాయి కలిసే వాళ్ళు, ఎక్కువగా విష్ణు మాతో బాటు చాలా సినిమాలు చూశాడు, అదే అమెరికన్ పధ్ధతిలో. నా తృప్తి ఏమంటే మా ఇద్దరు పిల్లలకి కూడా ఈ హాలులో సినిమాలు చూపించ గలిగాను. 

మీరు చెబితే నమ్మరు  గుండమ్మ కథ, మిస్సమ్మ, ఆత్మా గౌరవం సినిమాల తరువాత,  నాకు శంకరా భరణం సినిమా వచ్చే వరకూ, తెలుగు సినిమాలు  చూడనే లేదు. ఈ రెండు కాలగమనాల మధ్య వచ్చిన సినిమా ఏక్టర్లు, వాళ్ళ సినిమాలు, ఆ దర్శకులు నాకు తెలియనే తెలియదు. కారణం, టైమేది! లీలా మహల్లో ఆంగ్ల సినిమాలు చూడటానికి అలవాటుపడి, పోస్టర్ల దగ్గిర నుంచీ తెలుగు సినిమాలంటే ఏవగింపు మాత్రమే కలిగేది. 1990 లు వచ్చాక రాజేద్ర ప్రసాద్ సినిమాలు చూసేవాడిని. ఇప్పుడిప్పుడు కొత్త దర్శకులు (వంశీ, శేఖర్ కమ్ముల, ఇంద్రగంటి, రాజమౌళి, వంటి వారు) వచ్చి  సినిమాలు వాటిల్లో కొన్ని మంచివి కూడా, ఆంగ్ల సినిమాలకు దీటుగా తెలుగు తీయటం ఒక గొప్ప మార్పు. ఇప్పుడు వచ్చే తెలుగు సినిమాలు టెక్నికల్ గా హాలీఉడ్ సినిమాలకు దీటుగానే ఉన్నాయి,  కానీ, ఏదో లోటు.


1980లు వచ్చేప్పటికి లీలా మహల్ కూడా మారుతూ కనపడింది, వాళ్ళు తెచ్చే సినిమాల నాణ్యతలో తేడా వచ్చేది, ఒకప్పుడు క్లాసిక్ సినిమాలు మాత్రమే తీసుకు వచ్చే లీలా మహల్, ఆంగ్లంలో సినిమాల పేరిట వచ్చే చెత్తను కూడా తీసుకు రావటం మొదలు పెట్టారు, జనంలో మారిన టేస్ట్ 
 1980/90 లలో లీలా మహల్ రూపం. మాకు తెలిసిన 1970లలో లీలా మహల్  ఫోటో లేదు 
కారణాన వాళ్ళకు నచ్చే సినిమాలు తేవా లన్న తహతహలో ఇలాంటిది జరిగి ఉండవచ్చు. 


లీలా మహల్ ప్రాభవం తగ్గటానికి ముఖ్య కారణం ఎన్ టి రామారావు. తెలుగు నాట సినిమాలు నాశనం  అవ్వటానికి ఆయన వేసిన పునాది స్లాబ్ సిస్టమ్! అంటే  హాలు నిండినా,  నిండక పోయినా సరే, ఆ హాలు కపాసిటీ ప్రకారం వినోదపు పన్ను కట్టాలి. ఇది ఎలా ఉంటుంది అంటే  ఒక రచయితా తానూ వ్రాసిన పుస్తకాన్ని పదివేల  కాపీలు వేశాడు అనుకుందాము, అవ్వి అమ్ముడయినా కాక పోయినా, ప్రింట్ అవ్వంగానే మొత్తం పదివేల కాపీలకు సేల్స్ టాక్స్ కట్టు అన్నట్టుగా ఉంటుంది. 

ఆంగ్ల  సినిమాలు ఆడేదే రెండు  మూడు రోజులు.  ఏదో రెండు వందల మంది వస్తే చాలు ఆ హాలు ఖర్చులు పోను సామాన్య లాభం వచ్చేది, హాలు నడుపుతూ ఉండేవాళ్ళు. వచ్చిన కలెక్షన్ ప్రకారం టాక్స్ కట్టుకునే వాళ్ళు. అలా సరదాగా ఆంగ్ల సినిమాలు నడుపుకుంటున్న లీలా మహల్ కు,  ఈ స్లాబ్ సిస్టం అశనిపాతమే అయ్యి, చివరకు ఆ హాలు పతనానికి దారి తీసింది. స్వయంగా సినీ నటుడైన ఎన్ టి ఆర్ ఇలా సినిమా హాళ్ళ  వెన్ను విరవటం  ఏమిటో ఇవ్వాళ్టికీ నాకు అర్ధం కాని మిష్టరీ. 

 1990 లు వచ్చేప్పటికి మనకు శాటిలైట్ చానెళ్ళు ముఖ్యంగా స్టార్ మూవీస్ రావటంతో లీలా మహల్ కు మరొక పెద్ద దెబ్బ తగిలింది. ఇదివరకు ఎప్పుడో  సినిమా హాల్లో వస్తే మాత్రమే చూడగల ఆంగ్ల సినిమాలు రోజులో నాలుగైదు సార్లు ఆదే  సినిమా,  ఇంట్లోనే ఉన్న టి వి లో రావటం మొదలు పెట్టి, సినిమా హాలల భవితవ్యం ప్రశ్నార్ధకం చేసేసింది. 

ఈ దెబ్బతో లీలా మహల్లో తెలుగు సినిమాలు, అందులోనూ పరమ చెత్త సినిమాలు (స్లాబ్ సిస్టం ప్రకారం హాలు నిండితేనే లాయికీ మరి) తేవటం మొదలు పెట్టారు. కొనసాగలేక,  కొన్నాళ్ళు మూసి ఉంచారు, మరి కొంత కాలం ఏదో పెళ్లిళ్లకు వాటికి ఇచ్చారు. నేను చివరిసారి చూసినప్పుడు  హాలును రీమోడల్  చేస్తున్నారు, మాకు తెలిసిన గేట్ కీపర్లు అందరూ ఉత్సాహంగా పనిచేస్తూ కనిపించారు. లోపలి వెళ్ళి  మేము ఎక్కువసార్లు కూచుని సినిమా చూసిన సీట్లో కూచుని వచ్చాను.  టి వి పోటీ, ఇంకా ఆపైన వచ్చిన ఇంటర్ నెట్ డౌన్లోడ్ దెబ్బలు  తట్టుకోలేక పోయింది లీలా మహల్. చివరకు లీలా మహల్  మరణించింది, "కొట్టేశారు".  ప్రస్తుతం కారణం తెలియదుకాని ,  లీలా మహల్ ఉన్న జాగా ఖాళీగా ఉన్నది, కార్ పార్కింగ్ గా వాడుతున్నారు. 
 లీలామహల్ ను పడగోడుతున్నప్పటి దృశ్యం 
 అలనాటి లీలా మహల్లో సినిమాలు చూసిన ఆంగ్ల సినిమా అభిమానులు హాలును పడగోడుతున్నప్పుడు కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారుట. కొందరు మాత్రం, చెత్త సినిమాలు వేసే కంటే ఇలా కూలగొట్టటమే  మంచి పని అని నిరాశతో వ్యాఖ్యానించారని "ది హిందు" పత్రిక వారు వ్రాసారు  

లీలా మహల్ గురించిన మరొక ముఖ్య విషయం.  జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు క్రమం తప్పకుండా ఈ హాలులో సినిమాలు చూశేవారు. అందుకనే కాబోలు ఆయన వ్రాసిన నవలల్లో కొన్నిటిలో ఆ ఆంగ్ల సినిమా టేకింగ్ చాయలు కనపడతాయి,  పాతిపెట్టిన నాణెములు, కడిమి చెట్టు మొదలుగా గల నవలల్లో. ఆయన సినిమాకు రావటమే చిత్రంగా ఉండేదట, ఆయన దర్జాగా రిక్షాలో వచ్చి సూటిగా
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు
బాల్కనీలోకి వెళ్ళి తనకు నచ్చిన సీట్లో కూచునేవారట. ఆయన రాక చూసి హాలు వారు టిక్కెట్ తీసుకెళ్ళి ఇస్తే వెంటనే డబ్బులు ఇచ్చేవారు. మేము విశ్వనాథ వారికి ఉన్న ఆంగ్ల సినిమా చూసే అలవాటె మాకూ ఉన్నదని మాకు ఎంతో గర్వంగా ఉండేది. శ్రీ విశ్వనాథ 1976లో మరణించారు.  ఇప్పుడు కనుక ఉండి  ఉంటే ధుమ ధుమలాడుతూ,  కోపంగా ఏదో మనకు అర్ధం కాని తెలుగులో ఒక పద్యం వ్రాసేవాళ్ళే!

నా జ్ఞాపకాలను వ్రాయటానికి ముఖ్య కారణం నేను ఈ మధ్య విజయవాడ వెళ్ళిరావటం అయితే, ముఖ్య వివరాలు, ఫొటోలు  దొరికినది మాత్రం  హిందూ వార్తా పత్రికలో వచ్చిన రెండు  వ్యాసాలు. 

ది హిందు  2012 జూన్ 15-An iconic landmark fades into history

ఏది ఏమైనా లీలా మహల్ అంటే అప్పటి రోజుల్లో 1950 ల నుంచి 1980 లవరకూ విజయవాడ లో పుట్టి పెరిగిన ఆంగ్ల సినిమా అభిమానుల జీవితాల్లో భాగం, వాళ్ళ జ్ఞాపకాల్లో కలకాలం ఉంటుంది.

 

 

 

 

 


12 వ్యాఖ్యలు:

 1. చాలా బాగుంది సార్. విజయవాడ లయోలా కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు మేమూ ఆ హాలుకి వెళ్ళేవాళ్ళం. మీ అంతగా హాలుని అబ్సర్వ్ చెయ్యలేదు గానీ ఆ వాతావరణం ప్రత్యేకంగానే ఉండేది!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. Thank you Hari Babu garu. Yes Leela Maha is a cut apart from other Cinima Theatres. One parellel is Navarang, which I think is still standing and showing some movies. Next time I go to Vja. I must verify.

   తొలగించు
 2. మంచి టపా. నిజంగా nostalgia. విజయవాడ లీలామహల్ వైభవంగా వెలుగుతున్న కాలంలో అక్కడ సినిమాలు చూసాం గాని (1960 లలో), దాన్ని కూలగొడుతున్నప్పుడు చూసిన సాక్షులుగా నిలిచిపోయే దురదృష్టం తగల్లేదు. అప్పటి లీలామహల్ memories ఉండటమే నయం.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. Thank you Narasimha Rao garu. You had seen the movies in Leela Mahal during an epic era of English Movies. Really fortunate. I had seen mostly during 1970s and very early part of 1980s and witnessed the dwindling Hollywood but still enjoyed the then movies. In those days, India was used to get only such good movies but now with simultaneous releases, we are getting all and sundry English movies and its becoming a problem in choosing a good movie.

   తొలగించు
 3. సినిమాహాళ్ళ మీద స్లాబ్ పద్దతి తెచ్చింది, సినిమా హాళ్ళోలందరూ సినిమాలు నడవడంలేదని ట్యాక్సులు ఎగ్గొట్టేస్తూ ప్రభుత్వ ఆదాయానికి చిల్లు పెట్టేస్తున్నారనే.

  ఎప్పుడూ ఒక కులం మీద పడి ఏడవడమే తమరి కులపిచ్చి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఎన్ టీ ఆర్ ప్రభుత్వాధినేతగా ఉండి చేసిన ఒక పని విమర్శించగానే అందులో కులాన్ని చూసిన మీరు, ఎంతటి కుల గజ్జి, కుల అహంకారం, కుల రోగంతో ఎంతగా బాధపడుతున్నారో తెలుస్తూనే ఉన్నది.

  ఒక వ్యవస్థలో ఒక తప్పిదం జరుగుతూ ఉంటె ఆ తప్పిదాన్ని ఎలా సరిదిద్దాలో ప్రభుత్వాధినేతకు ఉండాలిసిన కనీస జ్ఞానం. అంతే కాని, తప్పిదం జరుగుతున్నది కదా అని ఆ వ్యవస్థనే సర్వనాశనం చేసె పనులు చేస్తే ఎలా! సినిమా నటుడయ్యి ఉండి, అందులోనే డబ్బులు, కీర్తి సంపాయించుకున్న ఎన్ టీ ఆర్, ఇలా స్లాబ్ సిస్టం ప్రవేశపెట్టి సినిమా హాళ్ళను నాశన చెయ్యటం ముమ్మాటికీ తప్పే. ఎన్ టీ ఆరే కాదు "మీ కులం" కాని వాడు చేసినా సరే అది తప్పే మరి. అదెప్పటికి తెలుసుకుంటారో కదా అనే నా బాధ.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. చాలా బాగుంది ! లీలా మహల్, నవరంగ్ దియేటర్లలొ ఇంగ్లీష్ సినిమాలే ఆడుతుండెవి. నేను లీలా మహల్లో రెండొ మూడొ సినిమాలు చూసినట్లు గుర్తు. కానీ నవరంగ్ లోనే కొన్ని సినిమాలు చూశాను. అక్కడి క్యాంటీన్ లో చాయి అద్బుతంగా ఉంటుంది.మా కజిన్ ఒకాయన టైలర్ ఉన్నాడు విజయవాడలో. అతనికి చదువు లెదు . కాని ఎప్పుడూ నవరంగ్ లో వచ్చే ఇంగ్లీష్ బొమ్మలనే చూసె అలవాటు అతనికి. అందుకే మేమెప్పుడు కలిసినా రా "రాజా" (నా పెట్ నేం) అంటూ నవరంగ్ కు తీసుకు వెళ్ళి, సినిమాతో పాటు మధురమైన చాయి తాగించేవాడు . అలా నవరంగ్ గుర్తుండి పోతుంది.

  మీరు మీ జ్ణాపకాలు గుర్తుకు తెచ్చుకుని,దాని గురించి సవివరంగా చెప్పడం , అంతే కాకుండా ఆ హాల్ ఒనర్ గారి చిత్రం తో పాటు, మీ అప్పటి మిత్రుల ఇప్పటి పోటోలతో సహా ప్రచురిస్తూ శ్రమ తీసుకుని తెలియ చెయ్యడమ్ గొప్పగా ఉండి, మీరు చెపుతున్న నా లాంటి నొస్తాజియలిస్త్ లకు గొప్ప అనుభూతిని మిగుల్స్తుంది . అందుకే నవరంగ్ తో నా అనుభవం కూడా మీ టపాలోనే చెప్పేసి నవరంగ్ టీ తాగిన అనుభూతిని మరొక సారి పొందుతున్నాను . సినిమా హాల్ పాత చిత్రంతొ పాటు దానిని పడగొడుతున్న ద్రుశ్యాలు చూస్తుంటే ఒక మనిషి జీవిత చరిత్ర లాగా లీలామహల్ చరిత్ర టపా సంపూర్ణంగా ఉంది. చదివే ఒపిక ఉన్న వారికి ఒక పాత సినిమా చూసిన మదురానుభూతిని కలిగిస్తుంది అనటంలో నా కైతే సందేహం లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నమస్తే, మీరు రాసిన వ్యాసం ఎందుకనో ఈ రోజే నా జి మెయిల్ కి వచ్చింది. అద్బుతం. అలనాటి జ్ఞాపకాలు కొన్ని తీపిగా మరి కొన్ని చేదుగానే ఉంటాయి. కలగలపు అన్నమాట. ఇక లీలా మహల్ విషయాని వస్తే... నేను గుంటూరి నుండి ప్రత్యేకం గా వచ్చి జరుగుతున్నా ఆట అయిన దాక ఎండలో నుంచొని ... నేల టిక్కెట్టు దొరకబుచుకొని చూసిన సినిమా ...ఎంటర్ ది డ్రాగన్. వేరేవి చూడ లేదు. ఎందుకంటే... అక్కడ వేసిన సినిమాలన్నీ గుంటూరు లీల మహల్లో వేసే వారు. రెంటి యజమానులు ఒకరే అని అనుకొంటాను. అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కృష్ణారావు గారూ,

   మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. నిజమే జ్ఞాపకాలన్నీ కూడా తీపిగానే ఉండాలని లేదు కాని, సామాన్యంగా తీపి జ్ఞాపకాలనే ఎక్కువ గుర్తు ఉంచుకుంటాము. ఎంటర్ ది డ్రాగన్ సినిమా నాకు గుర్తు ఉన్నంతవరకూ కూడా విజయవాడలో నవరంగ్ లో వచ్చింది. నాకు బాగా గుర్తు, అప్పుడే అప్పటి రాష్ట్రపతి పక్రుద్దిన్ ఆలీ అహ్మద్ మరణించారు. ఏమో అప్పట్లో ఎంటర్ ది డ్రాగన్ సినిమా పాపులారిటీ ప్రకారం, నవరంగ్ లీలామహళ్ళల్లో రెండు థియేటర్లల్లో ఇచ్చారేమో. నేను నవరంగ్ లో చూసి ఉంటాను, మీరు లీలా మహల్లో చూసి ఉంటారు.

   అవును లీలా మహల్ అని ఆంధ్ర ప్రదేష్ లో ఎక్కడ ఉన్నా ఒక కుటుంబానికి చెందిన అన్నదమ్ములవే.

   తొలగించు
 7. వెనకటికి ఓ అమ్మాయి ఓ పెద్దాయన్ని (జార్జ్ బెర్నార్డ్ షా అనుకుంటా) అడిగిందిట, "రైల్లో ప్రయాణించేటప్పుడు ఉత్కంఠతతో చదివించే పుస్తకం ఏమన్నా చెప్తారా?" అని.

  దానికి ఆ పెద్దాయన, "నీ చిన్నప్పటి వ్రాసుకున్న డైరీ చదువుకో, ప్రపంచాన్ని మర్చిపోతావు" అని.

  మీ ఈ రచన ఓ సారి వెనకటి రోజులకి తీసుకెళ్ళిందండీ !!

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.