31, ఆగస్టు 2014, ఆదివారం

న్యూస్ లాండ్రీ లేదా చానెళ్ళ చాకి రేవుచాలా కాలం నుంచి నాకొక ఆలోచన ఉన్నది.ఇన్నన్ని న్యూస్ చానెళ్ళు, న్యూస్ పేపర్లు ఉన్నాయి కదా వీటిలో వచ్చేది అంతా న్యూసేనా లేదా వ్యాపార ప్రకటనల మధ్య  వీలు చూసుకుని చోటు నింపే వ్రాతలా/కూతలా, అని. ప్రింటులో కనిపిస్తే చాలు నిజం అని నమ్మేసే అంతటి  నమ్మకం ఒకప్పటి ప్రింటు మీడియా ప్రజల్లో తీసుకు రాగలిగింది. కాని, ఎలెక్ట్రానిక్ మీడియా అంతటి అదృష్టానికి కూడా  నోచుకోలేదు పుడుతూనే పుంజీల కొద్దీ చానెళ్ళు కుక్క గొడుగుల్లా పుట్టేసి, తలా ఒక గొడుగు కిందికి చేరిపోయి, పబ్బం గడుపుకుంటున్నాయి.   

 ఈనాటి మీడియా గా పిలవబడుతున్న కార్పొరేట్ హౌస్ ల "వార్తా దుకాణాలు" ప్రింట్ కానివ్వండి, ఎలెక్ట్రానిక్ కానివ్వండి అంతటి నమ్మకాన్ని కలిగిస్తున్నదా!   నా అనుమానాలు నాకు ఉన్నాయి. ఈ విషయంలో మిగిలిన ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయం మీద "సర్వే"   ఏ మీడియా వారన్నా చేస్తారా అని నా ప్రశ్న. ఇంతవరకూ అలాంటి సర్వే ఏదీ తలబెట్టిన మీడియా వారు లేరు కదా! 

ప్రతిరోజూ ఎస్ ఎం ఎస్ ప్రశ్నలే! వాటికి జవాబులేన్ని వచ్చాయో తెలియదు! కాసేపు  స్క్రోలింగ్ చెయ్యటం  ఆపైన కొద్ది సేపటికి ఇంతమంది అనుకూలం, మరింతమంది ప్రతికూలం అని ఒక  "పై గ్రాఫ్" చూపించెయ్యటం ఆనవాయితీ. పొరబాటున కూడా  ఒక ప్రశ్నకు మొత్తం ఎన్ని ఎస్ ఎం ఎస్ లు వచ్చాయో ఏ చానెల్ కూడా చెప్పదు, స్టేట్ సీక్రెట్ అయినా లీక్ అవుతుందేమో కాని, ఈ విషయం మటుకు బయటకు రాదు. 

ఉదాహరణకు ఒకానొక ముఖ్యమైన రాజకీయ ప్రశ్న మీద 3 ఎస్ ఎం ఎస్ లు వచ్చాయనుకుందాము. అందులో ఇద్దరు అనుకూలంగా, ఒకళ్ళు వ్యతిరేకంగా ఓటు వేస్తె, మనకు మీడియాలో చూపించేది ఏమిటి! ఆ మూడు ఎస్ ఎం ఎస్ ల లోని వచ్చిన ఓట్లను శాతం కిందకు మార్చి చూపించటం. అప్పుడు జవాబు, "67%" అనుకూలం, 33 శాతం ప్రతికూలం అని చెప్పేసి ఊరుకుంటారు. నిజానికి మొత్తం ఓట్లెన్ని అని చెప్పకుండా ఈ శాతాలు మాత్రమే చూపించటం వల్ల, ఆ చూపించిన శాతాలకు ఏమన్నా గణింపు ఉంటుందా, ఉట్టి గణాంకాల గారడీయే కాని, ప్రజాభిప్రాయం తెలుస్తుందా! 

అందుకే స్టాటిస్టిక్స్ కు ఒక అపప్రధ ఉన్నది  "అబద్ధాలు, మరీ అబ్ధదాలు, స్టాటిస్టిక్స్" అని. ఆ అపప్రధను ప్రతి రోజూ  నిజం చేసే మీడియాను సమీక్షించే వాళ్ళే లేరా అని అనుకుంటే అరణ్య రోదనమే కదా. కనీసం ఒకరి కార్యక్రమాలు మరోకరన్నా  సమీక్షించుకుంటారంటే, వీళ్ళ మధ్య ఎంతటి "ప్రొఫెషనల్ కర్టెసీనో", ఒక పత్రికలో మరొక పత్రిక గురించి వ్రాయటం కాని, ఒక చానెల్ లో మరొక చానెల్ (తమ సిస్టర్ చానెల్ కానిది) గురించి చెప్పటం కాని జరగనే జరగదు. ఏదన్నా తప్పుడు వార్త  వ్రాసినా ప్రసారం చేసినా అలాంటి పొరబాటు గురించి వ్రాసినప్పుడైనా సరే బ్రాకెట్టులో "మా పేపరు కాదు" అని వ్రాస్తారే తప్ప, ఫలానా పేపరు బాధ్యత లేకుండా ఇలా తప్పు వార్తా వ్రాసింది అని పొరబాటున కూడా వ్రాయరు. ఎందుకని! ప్రొఫెషనల్ కర్టెసీ, ఇవ్వాళ వాళ్ళకి అయ్యింది రేపు మనకి అవ్వచ్చు కదా అన్న భవిష్య  దర్శనం అనబడే ఒకరి వీపు మరొకరు చమ్మగా  గోకుకొనుట అను ఆనవాయితీ లేదా గౌరవ సాంప్రదాయం. పైగా దురాచారాలు పోవాలని పెద్ద స్లోగన్లు. ఇలా ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పకుండా ఎస్ ఎం ఎస్ పోల్ నిర్వహించటం దురాచారం కిందకి రాదా?

ఇంతటి ఉపోద్ఘాతం ఎందుకు అంటే, నేషనల్ మీడియాగా పిలవబడే ఢిల్లీ లోకల్ మీడియా చానెళ్ళను సమీక్షించటానికి క్లాత్ లైన్ అనే చక్కటి కార్యక్రమం, మధు ట్రేహాన్  అనే ఆవిడ నిర్వహిస్తున్నది, అని చెప్పటానికి.  ఆవిడ కూడా ఒకప్పటి (ఆరోగ్యకరమైన) మీడియానే. ఇవ్వాల్టి మీడియా ఆవిడ కార్యక్రమాన్ని చూపిస్తుందా, పొరబాటున చూపించదు. అందుకని ఆవిడ, ఆవిడ టీమ్, తమ కార్యక్రమాలను యు ట్యూబ్ లోకి అప్లోడ్ చేస్తారు. వారి యు ట్యూబ్ చానెల్ ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు:


క్లాత్ లైన్ పేరిట ఉన్న ఈ యు ట్యూబ్ చానెల్ లో ప్రతి వారం, ఆంగ్ల/హిందీ చానెళ్ళల్లో జరిగిన అవకతవకల గురించిన విమర్శ, మంచి కార్యక్రమాల మీద పొగడ్త ఉంటాయి. అంతే కాదు, అరివీర బహయంకర న్యూస్ యాంఖర్ల ఇంటర్వ్యూలు ఉంటాయి. పోలీసు ఇంటరాగేషన్ లాగ, కాంగ్రెస్ వకాల్తా పుచ్చుకున్నట్టుగా బాహాటంగా కనపడటానికి సిగ్గు పడకుండా తన ఇంటర్వ్యూలను నడిపే కరణ్ థాపర్,  మధు ట్రెహాన్  ఇంటర్వ్యూ చేస్తుంటే చూడండి ఎన్ని మెలికలు తిరిగిపొయ్యేడో! అలాగే మరొకావిడ తన అద్భుత జర్నలిస్టిక్ టాలెంట్ తో పద్మశ్రీ కూడా  సంపాయించుకుని, చివరకు రాడియా టేపుల్లో అపకీర్తి మూటకట్టున్నావిడ ను కూడా అలాగే చానెల్ లో ఇంటర్వ్యూ చెయ్యబడింది. ఇంటర్వ్యూ కూడా చూడండి:

 మరొకటి, మనందరికీ తెలిసిన పెద్ద స్టింగ్ ఆపరేషన్, పాపం మన బంగారు లక్ష్మణ్ మీద జరిగింది. మీడియా లెక్క ప్రకారం బంగారు లక్ష్మణ్ ఒక్కడే అవినీతి రాజకీయ నాయకుడు, మరెవ్వరూ లేరు అనుకునేట్టుగా స్టింగ్ ఆపరేషన్ కు ప్రచారం కలిగించారు. అలా ప్రచారం చెయ్యటం లో ఉద్దేశ్యం, మీడియా స్వాతంత్ర్యం మాత్రమే ఒక్కటేనా అంటే, జవాబు చెప్పటం కష్టం. సరే స్టింగ్ ఆపరేషన్ నిజానికి చేసిన మనిషి ఏమయి పొయ్యాడు? అతని దీన గాధ  ఏమిటి ఒక్క చానేలన్నా చూపించిందా? నాకు తెలిసి ఇంతవరకూ లేదు. తెహల్కా గురించి చిలవలు పలవలుగా ( మధ్య చానెల్ పరువు పోయ్యేవరకూ) పొగడ్తలే కాని,   మొట్టమొదటి స్టింగ్ ఆపరేషన్ చివరకు ఏమయ్యింది చేసిన మనిషి ఎలా బతుకుతున్నాడు, తోటి చానెల్ వాళ్ళు పట్టించుకోక పోవటం మన మీడియా స్వాతంత్ర్యానికి గీటు రాయి విషయంలో న్యూస్ లాండ్రీ స్టింగ్ ఆపరేషన్ చేసిన మాథ్యూ శామ్యూల్ తో ఇంటర్వ్యూ ప్రసారం చేసి మనకు తెలియని విషయాలు ఎన్నో తెలియచేశారు. చూడండి ఇంటర్వ్యూ : ఇంతవరకూ న్యూస్ లాండ్రీ గురించిన మంచి మాటలు చెప్పాను కాని, ఈ చానెల్ కొంత వామ పక్షపు వాసనలు  వేస్తూ ఉంటుంది.  కానీ,  ఈ వామ పక్షపు వాసనలు అందులో కొన్ని కార్యక్రమాల్లోనే మరీ విపరీతంగా వస్తూ ఉంటాయి. అటువంటి కార్యక్రమాల వల్ల, ఈ మీడియా చాకి రేవు పని, ఏదన్న ఇజపు ప్రచారం కోసమా అన్న అనుమానం కూడా వస్తూ ఉంటుంది.మీడియా సమీక్ష చేస్తున్న ఈ న్యూస్ లాండ్రీ ఇలా ఇజపు వాసనలు కూడా  కొట్టకుండా ఉండి, నిజమైన నిష్పాక్షపాత చాకి రేవు మరి ఇంకా ఎంతయినా బాగుంటుంది.మనకు తెలుగులో కూడా, మీడియా చాకి రేవు ఉంటే బాగుండును అనే ఆలోచన రావటానికి అనుగుణంగానే మన తెలుగు పేపర్లు  చానెళ్ళు ప్రవర్తిస్తున్నాయి. ఈ విషయంలో ఒకప్పుడు పి  మీడియా కబుర్లు గా ఉన్న బ్లాగ్, ప్రస్తుతం మారిన పరిస్థితులవల్ల "తెలుగు మీడియా కబుర్లు" బ్లాగ్ ఉన్న మన రామూ  గారి బ్లాగ్ లో,ఆయన 2013లోనే వ్రాశారు. తెలుగులో V6 అనే చానెల్ లో తీన్ మార్ అనే కార్యక్రమంలో మీడియా కార్యక్రమాల మీద విసుర్లు ఉన్నాయని. సరే ఒక మీడియాలో ఒక కార్యక్రమం ఒక మంచి "మొదలు".  ఈ విషయంలో రామూ గారు ఆయన బ్లాగులో వ్రాసిన వ్యాసం ఈ కింది లింకు నొక్కి చదువుకోవచ్చు 
నియంత్రణ లేనిది ఏదైయినా సరే దారి తప్పుతుంది,  అందుకని మన తెలుగులో కూడా  న్యూస్ లాండ్రీ లాగ ఒక యూ ట్యూబ్ చానెల్ మొదలవ్వాలని నా కోరిక, దారి తప్పిపోయిన మన మీడియాకు కొద్దిలో కొద్దిగా చెక్ పాయింట్ గా ఉండాలని నా ఆకాంక్ష. 

మన తెలుగులోనూ "మాజీలు" ఎందరో ఉన్నారు, ఊరికే పొద్దు గడవని  పానెల్ చర్చల్లో పాల్గొనే బదులు, ఇలాంటి మీడియా చాకి రేవు తెలుగులో మొదలు పెడితే బాగుండును. మన లాంటి వాళ్ళు ఆ చానెల్ కు మనకు కనపడిన మీడియా అవక తవకలను "రిపోర్ట్" చేస్తూ మీడియా స్వాతంత్ర్యాన్ని కాపాడే కర్తవ్యాన్ని కొంతలో కొంత నెరవేర్చచ్చు. 


1 వ్యాఖ్య:

  1. బాగున్నది. ఇంటర్వు చేసే వాళ్ళనే ఇంటర్వు చేస్తే ఎలాగుంటుందో....అందుకే అన్నారు "అడిగే వాడికి చెప్పే వాళ్ళు లోకువ"అని....

    "మన తెలుగులోను మాజీలు ఎందరో ఉన్నారు, ఊరికే పొద్దు గడవని పనే చర్చల్లో పాల్గొనే బదులు, ఇలాంటి మీడియా చాకిరేవు తెలుగులో మొదలెడితే బాగుండును." ....వారేమన్నా మహాత్ములా...నిన్న మొన్నటిదాకా ఇప్పుడు చేసే వాళ్ళ పనినే చేశారు కదా... అదీకాక, వారి వ్యాపారాన్ని వాళ్ళే పాడుచేసుకుంటారా....? రేపటి నుండి చానళ్ళ ఉదయపు పేరంటానికి ఎవరు పిలుస్తారు...?

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.