21, సెప్టెంబర్ 2014, ఆదివారం

అరుదైన ఇంటర్వ్యూ - కిశోర్ కుమార్ సచిన్ దేవ్ బర్మన్ గురించి

 జననం 1 అక్టోబర్ 1906 :: మరణం 31 అక్టోబర్ 1975 
 జననం 4 ఆగష్టు 1929 :: మరణం 13 అక్టోబర్ 1987 
కిషోర్ కుమార్ మన హిందీ సినిమాలకు దొరికిన ఒక అద్భుత గాయకుడు. ఆయనకు సంగీతం వచ్చా, ఏ ఘరానా కు చెందిన వాడు, ఆయన సంగీత గురువు ఎవరు అన్న ప్రశ్నలకు తావు లేదు. ఆయన పాడిన పాటలకు ఉన్న జనాదరణే  పెద్ద కొలమానం. 

సామాన్యంగా కిషోర్ కుమార్ ఇంటర్వ్యూలు ఇవ్వటం వంటి పనులు చెయ్యటం చాలా తక్కువ, ఆయనకు మీడియా అంతగా ఇష్టం ఉన్నట్టుగా లేదు! ఆయనకు ఉన్న ఏకైక వీడియో ఇంటర్వ్యూ గురించి మునుపు వ్రాసిన గుర్తు. ఈ కింది లింకు నొక్కి ఆ వ్యాసం చదువుకోవచ్చు.


పైన చెప్పిన వ్యాసం చివర నా దగ్గర ఉన్న ఒక అపురూప ఆడియో ఇంటర్వ్యూ గురించి చెప్పటం జరిగింది. ఇప్పటికి ఈ ఆడియో ఫైలు నాకు దొరికింది. ఆ ఇంటర్వ్యూ వివిధభారతి వారు ప్రసారం చేశారు . ఇంటర్వ్యూ చేసినది ప్రముఖ రేడియో వ్యాఖ్యాత శ్రీ అమీన్ సయానీ (బినాకా గీత మాలా ఫేం). ఆ ఇంటర్వ్యూ అంటే నిజానికి కిషోర్ కుమార్  కుమార్ తన గురించి చెప్పుకున్నది కాదు. ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ సచిన్ దేవ్ బర్మన్ మరణించినప్పుడు, ఆయనకు నివాళి అర్పిస్తూ కిషోర్ తన జ్ఞాపకాలకు నెమరు వేసుకోవటమే ఇందులో మనకు వినిపిస్తుంది.


సినిమా సంగీతం లో తనకు గురువు, హిందీ సినిమాల్లో తనకు మొట్ట మొదటి  "బ్రేక్" ఇచ్చిన సచిన్ దేవ్ బర్మన్ గురించి, కిషోర్ ఏంతో హృద్యంగా, నిష్కపటం గా తన జ్ఞాపకాలను శ్రోతలతో పంచుకున్నారు. అలా పంచుకుంటూ, అక్కడక్కడా సచిన్ దేవ్ గొంతును, బెంగాలీ యాసతో  ఉన్న  ఆయన మాటలను అనుకరిస్తూ చెప్పటం జరిగింది. 

ఈ ఇంటర్వ్యూలో మధ్య మధ్యలో ఇంటర్వ్యూ చేసిన అమీన్ సయాని ప్రశ్నలు, అక్కడక్కడా నవ్వులు (సంతాప కార్యక్రమంలో నవ్వులు రావటం ఏమిటీ!), పాటల ముక్కలు తీసేసి, మొత్తం కిశోర్ కుమార్ మనతో మాట్లాడుతున్నట్టుగా తయారు చేశాను. నాకు చేతనైనంత వరకూ ఆడాసిటీ సాఫ్ట్వేర్ వాడి ఎక్కడా సౌండ్ ఎక్కువ తక్కువలు కాకుండా చేశాననే అనుకుంటున్నాను ఇంకా ఆలస్యం దేనికి ఈ కింది ప్లేయర్ లో కిషోర్ జ్ఞాపకాల ను వినండి:

 

సచిన్ దేవ్ బర్మన్, కిషోర్ కుమార్ ఒకే నెలలో, అంటే అక్టోబరులో సచిన్ దేవ్ బర్మన్ 1975 లో,  కిశోర్ కుమార్ పుష్కరం తరువాత 1987 లో, మరణించటం యాదృశ్చికం. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.