25, సెప్టెంబర్ 2014, గురువారం

పుస్తక సేవ

 
అది సెప్టెంబరు 8, 1974.  సైకిలేసుకుని  విజయవాడ ఏలూరు రోడ్ మీద జాయ్ గా జోరుగా వెడుతున్నాను. అప్పటివరకూ చందమామలు, తెలుగులో టామ్  సాయర్, హకల్బెరి ఫిన్, కాంచన ద్వీపం, రాజు పేద  మాత్రమే తెలిసిన నాకు ఇంకా అలాంటి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు. ఒక్కొక్క సారి అనుకున్నది అనుకున్నట్టుగా దొరుకుతుంది. అలాగే ఆ రోజున మెడికల్ అసోసియేషన్ హాలులో జరుగుతున్న రష్యన్ పుస్తక ప్రదర్శన నా కంట పడింది. లోపలికి వెళ్ళటానికి టిక్కెట్టు ఏమన్నా ఉన్నదా అని పరకాయించి చూసి, హమ్మయ్య లేదని కుదుటపడి, సైకిలు తాళం వేసి, సగం ప్రాణం అక్కడే వదిలి, లోపలకి వెళ్ళి  చూస్తే  ఏమున్నది! ఒక అద్భుత ప్రపంచం! విశాలాంధ్ర పబ్లికేషన్ వాళ్ళు ఏర్పరిచిన రష్యన్ పుస్తక ప్రదర్శన. పేరుకి రష్యన్ పుస్తకాలు కాని అన్నీ తెలుగులోనే ఉన్నాయి అంతే  అదొక అద్భుతమైన మొదలు. 

ఈ పుస్తకాల రేట్లు ఎంతెంత ఉంటాయో అని జేబులో ఉన్న కొద్దిగా ఉన్న డబ్బులు తడివి చూసుకుంటూ పుస్తకాలన్నీ చూస్తున్నాను. చూసి చూసి  చివరకు  దిటవు గుండెలు, కొమ్ముల గొర్రె పిల్ల పుస్తకాలు రెండూ నా దగ్గర ఉన్న కాసిని డబ్బులతోనే కొనగాలిగాను. దిటవు గుండెలు పుస్తకం రెండు  రూపాయలు, కొమ్ముల గొర్రెపిల్ల రూపాయి లోపలే,  ఆపైన 10% డిస్కౌంట్. 

వెనువెంటనే గాలిలో తేలిపోతూ ఇంట్లో పడి దిటవు గుండెలు చదవటం మొదలు పెట్టాను, రెండ్రోజుల్లో చదివేశాను. నేను ఆ పుస్తకాన్ని ఇంతవరకూ పది సార్ల  పైనే  చదివాను. ఏముంది ఆ పుస్తకంలో! రెండో ప్రపంచ యుద్ధ
సమయంలో ఆక్రమణకు గురైన రష్యా, జర్మన్ సైన్యాన్ని ఓడించటంలో  ప్రధాన పాత్ర పోషించిన ఒకానొక గెరిల్లా దళం కథ.  అది కథ కాదు నిజమే అని చెప్పటానికి ఫొటోలు కొన్ని ఆ పుస్తకంలో ఉన్నాయి. ద్మిత్రీయ్ మెద్వదేవ్ రచించిన ఆ పుస్తకాన్ని ఉప్పల లక్ష్మణ రావుగారు తెలుగులోకి చక్కగా అనువదించారు, ఎంత చక్కగా అంటే, ఒక్కసారి మొదలుపెడితే చివరివరకూ చదివించగలిగేంత చక్కగా ఉంటుంది ఆ అనువాదం. 

ఇక ఆ తరువాత విశాలాంధ్రకు రెగ్యులర్ ఖాతాదారుని అయిపోయ్యాను. ఎన్నెన్నో పుస్తకాలు,  మాక్జిం గోర్కీ ఆత్మకథ మూడు భాగాలు, అతరిక్ష యానం గురించిన అయిలీత, ఛుక్ గెక్ అన్నదమ్ముల కథ, తిమూర్ అతని దళం, వర్షంలో నక్షత్రాలు, ఇంకా రష్యన్ కామిక్స్ అనేకం.

అలా కొనుక్కుని చదువుకున్న అనేకానేక పుస్తకాలు ప్రస్తుతం జ్ఞాపకాల్లోనే ఉండిపోయినాయి. పుస్తకాలు విజయవాడలో మా ఇంట్లో ఒక పెద్ద పెట్టెలో సురక్షితంగా ఉన్నాయనే అనుకుంటున్నాను. 

సినిమాల్లో అన్నట్టుగా, "కట్ చేస్తే", 2014 సవత్సరం అంటే  నాలుగు దశాబ్దాల తరువాత, నా దగ్గర ఉన్న కొన్ని  పుస్తకాలు స్కానింగ్ చెయ్యటానికి ఇవ్వటానికి వెళ్ళి మన శ్యామ్ నారాయణ గారి అడ్డాలో కూచుని  ఉండగా, అక్కడ కుప్పలు కుప్పలుగా రష్యన్ పుస్తకాలు కనపడ్డాయి, వాటిల్లో పార్టీ ప్రచార పుస్తకాలన్నీ పక్కకి తోసేసి (సుత్తులూ కొడవళ్ళ పుస్తకాలని  అనేవాళ్ళం), కథలు, కామిక్కులు, నవలలు ఏరి చూడటం మొదలు పెట్టాను. పాత జ్ఞాపకాలన్నీ పైకి వస్తున్నాయి. శ్యామ్ చెప్పిన  ప్రకారం ఆ పుస్తకాలన్నీ అనిల్ బత్తుల అనే ఆయన తెచ్చి ఇచ్చారని స్కాన్ చెయ్యాల్సి ఉందని చెప్పారు. 

కాసేపట్లో అనిల్ బత్తుల అక్కడి రానేవచ్చారు. పరిచయాలు అయినాక చాలా సేపు ఆ పుస్తకాల గురించి సంతోషంగా మాట్లాడుకున్నాము. అప్పుడు తెలిసింది ఆయనకు ఉన్న పుస్తక ప్రేమ. పుస్తకాలు చదవటమే కాదు, వాటిని జాగ్రత్త పరచటం, లేనివి సేకరించటం మనం అందరం చేస్తూనే ఉంటాము. కాని అనిల్ ఒక అడుగు ముందుకు వేసి తనకు నచ్చిన ఆ రష్యన్ పుస్తకాలన్నీ కూడా సేకరించి, వాటి గురించి వ్రాయటానికి ఒక ప్రత్యేక బ్లాగు ఏర్పాటు చేశారు. అందులో క్రమం తప్పకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రష్యన్ పుస్తకం గురించి వ్రాస్తూ, పుస్తక ప్రియులను ఊరిస్తున్నారు. అక్కడ ఆయన వ్రాసిన పుస్తకాలు అన్నిటినీ శ్యామ్ నార్యాయణ  గారి ఆధ్వర్యంలో మనసు ఫౌండేషన్ వారు చేస్తున్న పుస్తక యజ్ఞంలో స్కాన్ చేయించి అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చే చాలా పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. వారి బ్లాగును ఈ కింది లింకు నొక్కి చదువ వచ్చు:


ఆయన ప్రయత్నం పూర్తిగా విజయవంతం కావాలని నా ఒక్కడి  ఆకాంక్షె  కాదు అలనాడు రష్యన్ పుస్తకాలు చదువుకుని ఆనందించిన వారందరి కోరిక. ఆ అద్భుత ప్రయత్నంలో మనం కూడా మన వంతు సహాయం  చెయ్యవచ్చు. చాలా చిన్న విషయం, ఎవరి దగ్గర ఉన్న రష్యన్ పుస్తకాలు వారు ఒక సారి చూసుకుని, వాటిల్లో ఇప్పటికే అనిల్ తన బ్లాగులో పరిచయం చెయ్యని వాటి గురించి సమాచారం అనిల్ కు ఇస్తే చాలు, ఆయన ఆ పుస్తకాలను మీ నుండి  తీసుకుని, చక్కగా స్కాన్ చేయించి మీ పుస్తకాన్ని మీకు సురక్షితంగా తిరిగి పంపే ఏర్పాటు చేస్తారు. అనిల్ ఈ మెయిల్ చిరునామా fualoflife@gmail.com 

అప్పటి సోవియట్ ప్రభుత్వం తమ ఇజాన్ని మన దేశంలోకి దిగుమతి చేసే ఊదేశ్యం తో ఎంతో ఖర్చుతో, ప్రయాసపడి చక్కటి పేపర్ల మీద చక్కటి రష్యన్ కథలు, నవలలు, కామిక్స్ మనకు ఎంతో తక్కువ ధరకు, దాదాపు ఉచితంగా (జమీల్య కొత్త పుస్తకం 25 పైసలకు కొన్న గుర్తు) ఇచ్చి అద్భుతమైన "పుస్తక సేవ" చేశారు. ఈ విషయంలో విశాలాంధ్ర పబ్లిషర్స్ ను కూడా  అభినందించాలి. 

నువ్వోకందుకు ఇస్తే, నేనొకందుకు తీసుకున్నాను అన్న చందాన, తెలుగులో రష్యన్ పుస్తకాలకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు పాపం ఆ పుస్తకాలు అలా ప్రచురించి ఒక ఇజానికి తీసుకొద్దామనుకున్న పేరుమటుకు అంతగా  వచ్చినట్టు లేదు మరి. కారణం ఏమయినా రష్యా వారు వారి సాహిత్యాన్ని తెలుగులో మనకు అందించే ప్రయత్నాన్ని  అభినందించాలి. 

పుస్తక సేవా స్పూర్తిని అంది పుచ్చుకుని, అనిల్ బత్తుల గారు అలనాటి రష్యన్ తెలుగు పుస్తకాలన్నీ కూడా స్కాన్ చేసి రాబొయ్యే తరాలకు అందించటానికి చేస్తున్న ప్రయత్నం ఎంతో అద్భుతమైనది. ఇలాగే అనేక అనేక మంది "అనిల్" రావాలని, మన తెలుగు పుస్తకాలు మరుగున పడిపోకుండా కాపాడుకునే ప్రయత్నం మరింత ముమ్మరం కావాలని ఆశిస్తున్నాను. 

 

6 కామెంట్‌లు:

  1. శివరాం గారూ
    దిటవు గుండెలు పుస్తకం ఎక్కడైనా దొరుకుతుందా ఇప్పుడు? Any idea?

    రిప్లయితొలగించండి
  2. Ditavu Gundelu is available now which is printed again and is available in market. But this book does not have any photos which the first and original edition has. Further this reprint has many unwanted and unwarranted commy comments in the book taking away our interest.

    If you want this book you can get it from market.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Karthik,

      I purchased this second print also and just now I am seeing it and I find that Pictures are printed in this version also but the paper used is not that good compared the the original Russian book.

      తొలగించండి
  3. "తెలుగులో రష్యన్ పుస్తకాలకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు పాపం ఆ పుస్తకాలు అలా ప్రచురించి ఒక ఇజానికి తీసుకొద్దామనుకున్న పేరు మటుకు అంతగా వచ్చినట్లులేదు."

    శివరాం ప్రసాద్ గారూ,
    సోవియట్ పుస్తకాలపై మీ పరిచయం అద్భుతం. కాని ఈ ఒక్క వ్యాఖ్య విషయంలో నేను కాస్త విభేదిస్తున్నానండీ. ఎందుకంటే ఒక ఇజాన్ని ప్రచారం చేద్దామనుకుని సోవియట్ రష్యా భావించి ఉంటే ఒక కమ్యూనిజం పుస్తకమో, మరే సిద్ధాంత పత్రికనో అన్ని భారతీయ భాషల్లో ముద్రించి వదిలిపెడితే చాలు కదా. కానీ వారు ఆ పని మాత్రమే చెయ్యకుండా అంతకు వంద రెట్టు మిన్నగా సాహిత్యానికి అవకాశమిచ్చారు. ఇది కూడా కేవల ప్రచార దృష్టిలో కాకుండా సోవియట్ ప్రజలకు ఆనాడు కల్పించిన చౌక ధరలకు సాహిత్యాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలకు అందించారంటే నిజానికి ఇంకా దగ్గరగా ఉంటుందనుకుంటాను. ఏదేమైనా సోవియట్ సాహిత్యం కొన్ని తరాల ప్రపంచ ప్రజలకు కనువిందు చేయడమే కాక విశ్వసాహిత్యాన్ని అంత చౌకగా పాఠకులకు అందించడంలో అనితర సాధ్యమైన చరిత్ర సృష్టించింది. ఈరోజు విశాలాంద్రలో అడుగు పెడితే ఆ ధరలకు ఒళ్లు వాచిపోతుంది మనకు. ప్రజాశక్తితో పోలిస్తే కూడా విశాలాంధ్ర ఇప్పుడంత అన్యాయంగా తయారైంది. అదే సమయంలో నేటికీ లాభాపేక్ష తగ్గించుకుని ప్రజలకు నిజంగా సాహిత్యం అందించాలనుకునే లక్ష్యంతో పనిచేస్తున్న సాహిత్య సంస్థలు నేడు కూడా ఉన్నాయని మీకు తెలుసు. కానీ వాటికి సొంత షాపులు లేవు. మార్కెటింగ్ నైపుణ్యాలు లేవు. తమ పుస్తకాలను ఎలా అమ్ముకోవాలో తెలీని తనంలో నిస్సహాయంగా ఉన్న అలాంటి సంస్థ పీకాక్ క్లాసిక్స్. గత పదేళ్లలో వంద అపూర్వ పుస్తకాలను చౌక ధరతో తీసుకువచ్చిన ఇలాంటి సంస్థ ఇప్పుడు అన్ని రకాల సమస్యలతో కొట్టుమిట్టులాడటం నిజంగా విషాదకరం. చేయవలసిందల్లా వ్యక్తులుగా శక్తి ఉంటే ఇలాంటి సంస్థల పుస్తకాలు కొనడం, వాటి గురించి కాస్తింత ప్రచారం చేయడం. సోవియట్ తరహా సాహిత్య షేరింగ్‌ను ఇప్పటికీ కొనసాగిస్తున్న సంస్థలకు ఆదరణ లేకపోవడమే అసలైన సమస్య. 1983లో నేను తిరుపతి విశాలాంద్రలో కొన్న ప్రశాంత ప్రత్యుాషాలు, అజేయ సైనికుడు పుస్తకం నేటికీ నా వద్ద భద్రంగా ఉంది. దాదాపు 400 పేజీలు పైగా ఉండే ఆ పుస్తకం వెల ఆరోజు కేవలం ఆరు రూపాయలు అంటే నమ్ముతారా. గోర్కీ అమ్మ పూర్తి వెర్షన్ పుస్తకాన్ని కూడా అదే ధరకు కొన్నాను అప్పట్లో. ఇప్పుడు మాత్రం ఏవి తల్లిీ నిరుడు కురిసిన గ్రంథ సమూహములు అని పాడుకోవల్సిందిే. చాలా మంచి పరిచయం చదివించినందుకు ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి
  4. రాజుగారూ చాలా కాలానికి నా బ్లాగుకు వచ్చి కామెంటినందుకు సంతోషం, ధన్యవాదాలు. అందరి అభిప్రాయాలు అన్ని ఒకటే అవ్వాలని ఏమి లేదు కాబట్టి, రష్యన్ పుస్తకాలు కారుచవకగా ఎందుకు ఇచ్చారు అన్న విషయం మీద నా అవగాహన నాది, మీ ఉద్దేశ్యం మీది.

    మీ బ్లాగు( http://blaagu.com/chandamamalu/ )బాక్ అప్ జరుగుతున్నది. నిన్న సగంలో అల్లాగే నిద్దరపోయాను. ఇవ్వాళ సాయంత్రం అఫీసు అయిన తరువాత ఎంతవరకూ అయ్యిందో చూసి మళ్ళీ కొనసాగించాలి.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.