2, అక్టోబర్ 2014, గురువారం

ఆలనాటి గాంధీ గారి రైలు ప్రయాణం - మరి ఈనాడో!


బొమ్మ కర్టెసీ గూటెన్ బర్గ్ వెబ్ సైట్

గాంధీగారి  రాజకీయ భావాలతో నేను ఏకీభవించకపోయినా, ఆయనంటే వ్యక్తిగతంగా గౌరవం.  పదవుల కోసం వెంపర్లాడలేదు, తాను  నమ్మిన
 పోర్ బందర్ లో గాంధీగారి జన్మస్థానం 
సిద్దాంతం కోసం కుటుంబ బాధ్యతలు కూడా పెద్దగా పట్టించుకోకుండా, ప్రజల మనిషిగా తన జీవితం అంతా గడిపాడు. 2003 లో అనుకుంటాను, పోర్ బందర్ వెళ్ళవలసిన ఆఫీసు పని పడింది. ముంబాయి నుంచి సరిగ్గా 24 గంటల ప్రయాణం. అక్కడకు వెళ్ళి  నేను చేసిన మొదటి పని గాంధీ గారి జన్మస్థానమైన ఆయన ఇంటిని దర్శించటం.   ఆ ఇంట్లోకి వెళ్లి, గాంధీ గారు పుట్టిన చోటును చూస్తున్నప్పుడు, ఒక తెలియని, అనిర్వచనమైన అనుభూతి. ఆ ఇంటిని గాంధీ గారి స్మృతి  చిహ్నంగా ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారు. పోర్ బందర్ నడిబోడ్డులో ఉన్నది గాంధీ గారి ఇల్లు. పోర్ బందర్ ఒక చక్కటి రేవు పట్టణం, మరైన్  డ్రైవ్ (ముంబాయి) లాంటి సముద్రపు ఒడ్డు  ఉన్నది. 

ఈ సారి గాంధీ జయంతికి ఏమన్నా వ్రాద్దామా అని ఆలోచన వచ్చింది. ఆలోచనైతే వచ్చింది కాని, ఆలోచన మాత్రమే వచ్చి ఉపయోగం ఏమున్నది! ఏమి వ్రాయాలి? గాంధీ గారికి జై అని వ్రాసి ఊరుకుంటే అందులో ఏమున్నది! గూటెన్ బర్గ్ ప్రాజెక్ట్ వారి వెబ్ సైటులోకి వెళ్ళి, గాంధీ గారు వ్రాసిన వ్యాసాలు ఏమన్నా దొరుకుతాయా అని వెతుకుతుంటే, అలనాడు గాంధీ గారు 1917లో,  అంటే దాదాపుగా 100 సంవత్సరాల క్రితం, అప్పుడే దక్షిణ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చి, ఇంకా ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ, భారత దేశ యాత్ర చేసినప్పుడు, తనకు కలిగిన అనుభవాలను ఒక చిన్న వ్యాసం వ్రాసి ప్రచురించారు. ఆ వ్యాసం పేరు "భారత రైల్వేలలో మూడో తరగతి"  (Third Class in Indian Railways). ఈ విషయం మీద వ్రాస్తూ, ఆ వ్యాసాన్ని యధాతధంగా తెలుగులోకి అనువదిద్దాము అనిపించింది. మరి ఆ యాత్ర పూర్వాపరాలు? 

గాంధీగారు భారత దేశ యాత్రకు ఎందుకు బయలుదేరారు? అందుకు ప్రేరణ ఎవరు, కారణం ఏమిటి,  అని ప్రశ్నించుకుంటే, 1982లో రిచర్డ్ అటెన్‌బరో తీసిన గాంధీ సినిమా గుర్తుకు వచ్చింది. గాంధీ గారేమో విదేశీ వస్తు బహిష్కరణ ఒక ఉద్యమంగా మొదలు పెట్టి స్వాతంత్ర్య ఉద్యమం  నడిపి, తద్వారా బ్రిటిష్ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ కొట్టాలని తన అహింసా ఆయుధాన్ని ఎక్కు పెట్టారు.  కాని పాపం ఆయనకు తెలియదు, తన గురించి సినిమా తియ్యాల్సి వచ్చేప్పటికి, విదేశీయుడు, అందునా బ్రిటిష్ వాడైన అటెన్‌బరోనే తియ్యాల్సి వస్తుందని.

ఏది ఏమైనా,  అద్భుతమైన సినిమా, అద్భుతమైన దర్శకత్వం, అద్భుతమైన నటులు, అద్భుతమైన సంగీతం (రవిశంకర్) అన్నీ అద్భుతాలే అందులో. పరమాద్భుతం, 
 భాను అథియా 
మొట్టమొదటిసారిగా భారతీయ వ్యక్తికి ఆస్కార్ ఎవార్డ్ వచ్చింది ఈ సినిమాలోనే. భాను అథియా గారికి ఆ సినిమాలో "కాస్ట్యూంస్" అంటే దుస్తులకు ఆ అవార్డు వచ్చింది. ఆవిడే గైడ్ సినిమాకు, లగాన్ సినిమాకు కూడా "కాస్ట్యూమ్స్" సమకూర్చారుట. గైడ్ సినిమా ఎప్పుడో 1960లలో వచ్చింది, లగాన్ గాంధీ సినిమా తరువాత వచ్చి, ఆస్కార్ గెలుచుకున్నంత పనిచేసింది కాని, గెలుపు మన ఖాతాలో పడలేదు. అథియా గారితో ఇంటర్వ్యూ రీడిఫ్ డాట్ కామ్ వారి వెబ్సైటులో ఉన్నది ఈ కింది లింకు నొక్కి చదువుకోవచ్చు: సరే విషయంలోకి వస్తే, గాంధీగారికి గోపాల కృష్ణ గోఖలేగారు చేసిన ఉత్ప్రేరకమైన  ఉపదేశం, ఆయన్ను భారత దేశ యాత్రకు పురికొల్పింది. గాంధీ సినిమా లో ఈ చారిత్రాత్మిక సంఘటన ఎలా చూపించారో చూడండి:ఇక చదవండి, రైళ్ళల్లో  గాంధీ గారి అనుభవాలు. ఆంగ్లంలో ఉన్న ఈ వ్యాసం నాకు చైతనైనంత వరకూ తెలుగులోకి అనువదించాను. ఆంగ్ల మూలం చదవాలనుకునే వారు ఈ కింది లింకు నొక్కి చదువుకోవచ్చు:


                             
****************************************  
దక్షిణ  ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చి, ఇప్పటికి రెండేళ్ళకు పైగా అయిపోయింది. ఈ సమయంలో నాలుగోవంతు, భారతీయ రైళ్ళల్లో మూడో క్లాసులో,  ప్రయాణం చేస్తూ గడిపాను. ఎక్కడో ఉత్తరాన ఉన్న లాహోర్, కింద దక్షిణానికి,  కరాచీ నుంచి కలకత్తా వరకూ,  ఇలా జరిగింది నా ప్రయాణం ఈ మూడో  తరగతి ప్రయాణాన్ని ఎంచుకోవటంలో ఇతర కారణాలు ఉన్నప్పటికీ, తరగతిలో ప్రయాణించే భారతీయుల స్థితిగతులు పరిశీలించటం అనేది ముఖ్య కారణం. నాకు చేతనైనంతవరకూ నిశిత పరిశీలన చేశాను. ఈ సమయంలో దాదాపు అన్ని రకాల రైల్వేలను చూశాను. 

అడపాదడపా ఆ రైల్వే కంపెనీల యాజమాన్యాలతో, నేను చూసిన లోపాల గురించి ఉత్తర ప్రత్యుత్తరాలూ జరిపాను. ఇక ఈ విషయాలు చూస్తూ ఊరుకోకుండా,  ప్రెస్ వాళ్ళను పిలిచి వాళ్ళకు చెప్పాల్సిన సమయం వచ్చింది అని  అనుకున్నాను.  ప్రజలను  ఉత్తేజితులను చేసి వారు ఎదుర్కొంటున్న కష్టాలు సమసిపోవటానికి ఉద్యమోన్ముఖులను చెయ్యాలి. ఈ సమస్యలు ఇంకెన్నాళ్ళు ఇలా అపరిష్కారంగా ఉండాలి?   రైల్వే కంపెనీ వాళ్ళు ఆ సమస్యలను పెద్దగా కష్టపడకుండా  పరిష్కరించగలిగి ఉండికూడా మెదలకుండా  అలా ఊరుకుంటున్నారు.


నెల పన్నెండున (సెప్టెంబరు 1917) బాంబే నుంచి  మదరాసుకు,  మైలులో   పదమూడు రూపాయల తొమ్మిదణాలతో ఒక టిక్కెట్టు కొన్నాను. ఆ పెట్టె మీద  22 మంది మాత్రమే ప్రయాణించాలని వ్రాసి ఉన్నది. అందులో కూచోవటానికి మాత్రమే సౌకర్యం ఉన్నది. బెర్తుల మీద పడుకుని ఎంతో కొంత సుఖంగానూ సురక్షితంగానూ నిద్రపొయ్యే అవకాశం లేదు. మదరాసు చేరటానికి రెండు రాత్రుల ప్రయాణం. ఆ రైలు పూనా చేరేప్పటికి, ఇరవై రెండేమిటి, అంతకంటె ఎక్కువ మందే  పెట్టేలోకి చేరిపొయ్యారు. అది కూడా మాలో కొద్దిగా ధైర్యవంతులు అడ్డుకున్నాము కాబట్టి,  రద్దీ ఆమాత్రంతో ఆగింది. కానీ,  రాను రాను  లోపలకి దూసుకొచ్చే ప్రయాణీకుల రద్దీ ఆపటం అసాధ్యమైపోయింది.  మాలో వీరులు కూడా ఓడిపోయి కూచున్నారు. గార్డులు, రైల్వే ఉద్యోగులు వచ్చి మరికొందమంది ప్రయాణీకులను లోపలకు తోసే ప్రయత్నమే చేశారు.
 

ఇలా ప్రయాణీకులను పెట్టెల్లోకి కుక్కేస్తున్నందుకు, ఒక  మీమన్ వర్తకుడు ధిక్కార ధోరణితో నిరసన తెలిపాడు. అతను విచారంతో చెప్పాడు, తనకు    రైల్లో అది ఐదో రాత్రట.  గార్డు అతన్ని అవమానించి, రైలు గమ్యానికి చేరాక అతన్ని మానేజిమెంటు వారికి అప్పగించాడు. ఆ రాత్రిలో చాలా భాగం దాదాపు 35 మంది ప్రయాణీకులు ఆ పెట్టెలో ఉన్నారు. కొంతమంది నేల మీద దుమ్ములో పడుకున్నారు, కొంతమంది నుంచునే ఉన్నారు. ఒక సమయంలో ఒక యుద్ధమే జరిగబొయ్యింది కాని, ప్రయాణీకుల్లో పెద్దవాళ్ళు కలగచేసుకుని నివారించారు. దాంతో ఉన్న అసౌకర్యానికి తోడు కోప తాపాలు చూసే ఖర్మ తప్పింది.

మొత్తం ప్రయాణంలో ఆ పెట్టెను ఒక్కసారి కూడా శుభ్రపరచలేదు. ఆ కారణాన  అందులో నడిచినప్పుడల్లా,  కింద కూచున్న ప్రయాణీకుల మధ్యలో తోసుకుని తిరుగుతున్నప్పుడు, మట్టిలో కాళ్ళీడ్చుకుంటూ నడవవలిసి వచ్చింది. చివరకు, ఉచ్చ దొడ్లు కూడా శుభ్రం చెయ్యనేలేదు. అందులో నీళ్ళు లేవు.


చండాలంగా, మురికిగా కనిపిస్తున్న తినుబండారాలు, అపరిశుభ్రమైన  చేతులతో పాముతూ అమ్ముతున్నారు. అవి ఉంచిన బుట్టలు వంటివి కూడా మురికి కూపాలుగా ఉన్నాయి. ఇక వాటిని తూచే తక్కెడల గురించి చెప్పుకోకపోవటమే మంచిది. ఆ తిండి వస్తువులు, అప్పటికే లక్షలకొద్దీ ఈగలు   రుచి చూసినవే! అవి కొనుక్కుని తింటున్న ప్రయాణీకులను  ఎలా ఉన్నాయని అడిగాను. అందులో చాలా మంది బూతులతో కూడిన  జవాబులు చెప్పినా, అందరి అభిప్రాయం ఒక్కటే, అప్పుడున్న పరిస్థితుల్లో  అంతకంటె ఏమి దొరుకుతాయని.  ఏది దొరికితే అది తినటమే గత్యంతరమని వాళ్ళ అభిప్రాయం.  రైళ్ళ ప్రయాణాల్లో  కష్టాలు తగ్గించుకోవటానికి  కొంతమంది ప్రయాణీకులు, ఉపవాసం చేస్తారు. 

సరే చివరకి గమ్యానికి చేరుకున్నాక తెలిసింది అక్కడి రిక్షావాడు, తాను అనుకున్నంత ఇస్తేనేకాని,  నేను చేరవలసిన చోటుకు తీసుకు వెళ్ళడని.  నేను వాడితో కొంత వాదించి, అధికారికంగా నిర్ణయించినంతే ఇస్తాను అని చెప్పాను. నా వ్యతిరేకత వాడి మీద ఏమీ పనిచెయ్యలేదు. వాడికి ఒక హెచ్చరిక చేశాను, నన్ను రిక్షాలోంచి లాగెయ్యనన్నా  లాగెయ్యాలి, లేదా నేను పోలీసులను పిలు స్తాను అని.

తిరుగు ప్రయాణం కూడా అంతకంటె గొప్పగా ఏమీ జరగలేదు . నేనొచ్చేప్పటికే ఆ రైలు పెట్టె కిక్కిరిసి ఉన్నది. నా స్నేహితుడు సహాయపడకపోతే, నాకు సీటే దొరికేది కాదు. ఆ పెట్టెలోకి ఎక్కవలసినదానికన్నా ఎక్కువ ఎక్కినవాళ్ళల్లో  నేను కూడా చేరిపొయ్యాను. నేనెక్కిన పెట్టె తొమ్మిది మంది కూచోవటానికి, కాని ఎప్పుడు చూసినా 12 మంది ఉంటూనే ఉన్నారు. ఒకచోట, ఒక రైల్వేముఖ్యోద్యోగి, నిరసన తెలుపుతున్న ప్రయాణీకుణ్ణి బూతులు తిట్టటమే కాకుండా, అతన్ని తంతానని బెదిరించి ఆ ప్రయాణీకుని ముఖం మీదే తలుపులు మూసేశాడు.

ఈ కంపార్టెమెంటులో  మాత్రం ఉచ్చలదొడ్డిగా పిలవటానికి అవకాశం ఉన్న ఏర్పాటు ఒకటి ఉన్నది. యూరోపియన్ పధ్ధతిలో నిర్మించబడ్డ ఆ దొడ్డి, ఆ విధంగా ఉపయోగించటానికి వీల్లేకుండా అయిపోయి  ఉన్నది. అందులో ఒక పంపు గొట్టమైతే ఉన్నది కాని, నీళ్ళు రావటంలేదు.  ఉచ్చల దొడ్డి, ఎంత దుర్మార్గమైనంత చండాలంగా ఉన్నది అంటే,  లోపల ఎంతో  మట్టి పేరుకుపోయి, సబ్బు నీళ్ళు వంటివి చూసి కొన్ని యుగాలయినట్టున్నది. అందులోకి అడుగుపెడితే ఎటువంటి  రోగాలు అంటుకుంటాయో అని హడిలిపొయ్యాను.

రైలు పెట్టె,  అసాధారణంగా,  రకరకాల జనంతో నిండి ఉన్నది. బలంగా కనపడే పంజాబీ సాయిబులు, శోత్రియంగా కనిపిస్తున్న ఇద్దరు తమిళులు, మరో ఇద్దరు సాయిబులు  తరవాత మాతో చేరారు. వీళ్ళు, తాము లంచాలిచ్చి తమ సౌకర్యాలు ఎలా సంపాయిచుకోవాలిసి వచ్చిందో చెప్పారు. వాళ్ళల్లో ఒక పంజాబీకి రైల్లో అది మూడో రాత్రి, బాగా అలిసిపొయ్యాడు. కాని పడుకోవటానికి వీలు లేదు.  తాను రోజంతా సెంట్రల్ స్టేషన్లో కూచుని, టిక్కెట్లకోసం ప్రయాణీకులు పడే పాట్లు, టిక్కెట్ల కోసం లంచాలివ్వటం చూస్తూ గడిపానన్నాడు. మరొకాయన చెప్పాడు,  తాను ఐదు రూపాయలు చెల్లిస్తే  కాని తనకు టిక్కెట్టు,  సీటు దొరకలేదని. వాళ్ళు ముగ్గురూ లూధియానా వెళ్ళాలి, ఇంకా అనేక రాత్రులు రైల్లోనే గడపాలి. నేను చెప్పినది ఏమీ అసాధారణమైనది కాదు, సర్వ సామాన్యమైన విషయం.

నేను రాయిచూర్, ధోండ్, సోనేపుర్, చక్రధర్‌పూర్, పురూలియ,  అస్సంసోల్ ఇంకా అనేక కూడళ్ళల్లో దిగాను.  స్టేషన్లకు అనుబంధంగా ఉండే ప్రయాణీకులు ఉండే సత్రాల్లో గడిపాను. ఆ సత్రాలు చాలా నీచంగా   ఒక పధ్ధతి అంటూ లేనివి, శుభ్రత అంటె ఏమిటో తెలియని ప్రదేశాలు, గందరగోళ పరిస్థితి, నిరంతరం   కఠోరమైన శబ్దాలతో రణగొణ ధ్వని. ప్రయాణీకులు కూచోవటానికి బెంచీలు లేవు, చివరకు కూచోవటానికి సరిపొయ్యే చోటే లేదు. వాళ్ళు  దుమ్మూ దూగరతో ఉన్న ఆ నేలమీదే చతికిలపడి కూచోవాలి, అక్కడ దొరికే చండాలపు, అపరిశుభ్ర తిండే తినాలి. వాళ్ళు తినేయ్యగా మిగిలినవి ఎక్కడ పడితే అక్కడ పారెయ్యటానికి,  ఉమ్మెయ్యటానికి వాళ్ళకు ఇష్టం వచ్చినంత స్వతంత్రం మటుకూ ఉన్నది. వాళ్ళు ఇష్టమైన రీతిలో కూచోవచ్చు, ఎక్కడపడితే అక్కడ పొగ తాగొచ్చు.

ఈ సత్రాల్లో ఉండే పాకి దొడ్లు వర్ణించటానికి వీల్లేనంత చండాలంగా ఉంటాయి.  ఉన్న చట్టాలను ఉల్లఘించి బూతులు మాట్లాడినా కూడా అక్కడి పరిస్థితులను వర్ణించటం నా తరం కాదు. మర్యాద కరమైన భాషలో అక్కడి విషయాలను చెప్పలేను. బ్లీచింగ్ పౌడరు, ఫినాయిలు వంటివి తెలిసినట్టే లేదు. కోట్ల ఈగలు ఝుమ్మంటూ ఎక్కడ పడితే అక్కడే తిరుగుతూ, అక్కడ పరిస్థితిని  ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాయి. మూడో తరగతి ప్రయాణీకుడు అంటే ఒక అసహాయ మూగ జీవి. అతనికి ఫిర్యాదు చెయ్యటం తెలియదు, చెయ్యాలనీ తెలియదు. ఒక్కోసారి అలా చెయ్యటం చావును కొని తెచ్చుకోవటమే అవ్వచ్చు.  సోనేపూర్లో ఐతే ఈగలతో పాటు, కందిరీగలు వచ్చిపడ్డాయి. ఒకానొక రాజరికపు రాజధానిలో ఉన్న మూడో క్లాసు బుకింగ్ ఆఫీసు, ఒక నల్లటి  బొరియ,  ధ్వంసం చేసి పడగొట్టెయ్యాలి తప్ప,  దాన్ని బాగు చెయ్యటం అసాధ్యం. 

ఇటువంటి పరిస్థితుల్లో ప్లేగు వంటి మహమ్మారి వ్యాధులు భారత దేశంలో ప్రబలినాయంటే, ఆశ్చర్యం ఏమున్నది? వేరే విధంగా జరగటానికి అవకాశమే లేదు, ప్రయాణీకులు అందరూ ఎంతో  కొంత చెత్త వదిలేసి వెళ్తూ ఉంటారు. ఒక్క భారతదేశపు  రైళ్ళల్లోనే ఎక్కడపడితే అక్కడ అన్ని తరగతుల్లోనూ,అక్కడ ఆడవాళ్ళున్నా సరే,  పొగ తాగని వాళ్ళు అభ్యంతర పెట్టినాసరే,  సిగిరెట్టులు, బీడీలు, చుట్టలు యెధేచ్చగా  కాలుస్తుంటారు.  పొగ తాగే వాడు ఇతర ప్రయాణీకుల అనుమతి తీసుకోవాలని ఉన్న నిబంధన  ఉన్నప్పటికీ కూడా,  ఇదంతా జరుగుతున్నది. అంతటి భయంకరమైన యుధ్ధం జరుగుతున్నప్పటికీ(అప్పుడు మొదటి ప్రపంచ యుధ్ధం ముమ్మరంగా జరుగుతున్న రోజులు), ఈ చండాలపు అలవాటును మాత్రం భారతీయులు వదులుకోలేకపోతున్నారు. యుధ్ధం అనేది మురికిలో ఉంటానికి, తొక్కిడి భరించటానికి ఒక సాకు ఎంతటికీ కాదు.

మొదటి శ్రేణి తరగతి ప్రయాణీకుల పరిస్థితి, మూడో తరగతి ప్రయాణీకుల పరిస్థితి బేరీజువేసుకుని చూస్తే, మొదటి శ్రేణి తరగతి ప్రయాణీకులు, మూడోతరగతి ప్రయాణీకుల కంటే ఐదు రెట్లు ఎక్కువ ధర చెల్లిస్తున్నారు, నిజమే. కాని,  వాళ్ళకు ఇచ్చిన సౌకర్యాల్లో ఐదో వంతు,  పోనీ పదోవంతైనా మూడో తరగతి ప్రయాణీకులకు ఇవ్వటం లేదు. తమ వంతు సౌకర్యాలను అడగటం న్యాయమైన విషయమే కదా! టిక్కెట్టు  ధరకు, ప్రయాణీకునికి ఇచ్చే సౌకర్యానికి మధ్య కొంత పొంతన ఉండవద్దా? ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న మూడో తరగతి ప్రయాణీకులే, మొదటి తరగతి ప్రయాణీకుల సౌకర్యాలకు డబ్బులు ఇస్తున్నారన్న విషయం అందరికీ తెలిసినదే మరి. తప్పకుండా మూడో తరగతి ప్రయాణీకుడు, ప్రయాణం కనీస సౌకర్యాలు అనుభవించటానికి అర్హుడే.

మూడో తరగతి ప్రయాణీకులకు కనీస సౌకర్యాలు ఇవ్వకుండా, లక్షల్లో ఉన్న ప్రజలకు, చక్కగా ఒక పధ్ధతి ప్రకారం నడుచుకోవటం, శుభ్రంగా ఉండటం, చక్కగా జీవించటం, సాధారణ, నిరాడంబర జీవిత విధానాలు  బోధించే ఒక అవకాశం ప్రభుత్వం రైల్వే కంపెనీలు పోగొట్టుకున్నట్టే.  మూడో తరగతి ప్రయాణీకులకు రైలు ప్రయాణంలో  వాళ్ళకు ఒనకూడే అనుభవం, చక్కగా  క్రమశిక్షణగా ఉండటం  తెలుసుకోవటానికి బదులుగా, ఆరోగ్యం,  మంచి ప్రవర్తనల మీదున్న నమ్మకాలను తుడిచి పారేసేట్టుగా తయారవుతున్నది. పైన చెప్పబడిన దుష్టత్వం, చండాలపు పరిస్థితులు చక్కబరచటానికి, నేను కొన్ని సూచనలు చెయ్యదలుచుకున్నాను. వాటిలో ముఖ్యమైనది:

సామాన్యంగా పై క్లాసుల్లో ప్రయాణీంచే వైస్రాయిలు, మిలిటరీ కమాండర్లు, రాజులు, మహారాజులు, ఇంపీరియల్ కౌన్సిలర్లు, ఇంకా ఇలాంటివారు ఏ మాత్రం ముందు హెచ్చరిక లేకుండా  వారి చేత మూడో తరగతి ప్రయాణం చేయించాలని గౌరవపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. అప్పుడు  తప్పకుండా మూడో తరగతి ప్రయాణీకుల పరిస్థితిలో గొప్ప మార్పు  వస్తుంది. ఫిర్యాదు చెయ్యకుండా, కిమ్మనకుండా కష్టాలు భరిస్తూ ప్రయాణాలు సాగిస్తున్న కోట్ల మందికి వాళ్ళు చెల్లిస్తున్న టిక్కెట్ల ధరలకు తగినంత సౌకర్యం పొందుతారు, ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్ళేప్పుడు, సామాన్య మనిషికి ఉండవలసిన కనీస సౌకర్యాలతో వెళ్ళగలుగుతారు.

                                      ****************************************                                                   
                        
సరే గాంధీగారి వ్యాసం చదివేశాము. కానీ ఇప్పుడు ఒక ప్రశ్న సహజంగా ఉత్పన్నమవుతుంది. అదేమిటి? రైళ్ళల్లో  ప్రయాణించే చివరి తరగతి ప్రయాణీకులకు   (1970ల్లో మూడో తరగతిని తీసేసి,   రెండవ తరగతిని చివరి తరగతి చేశారు) ఇచ్చే సౌకర్యాలలో ఏమన్నా మార్పు వచ్చిందా అని బేరీజు వేసుకుని చూస్తె కొన్ని విషయాలు  అవగతం అవుతాయి. 

 1. ప్రస్తుతానికి అంటే 2014 లో, దశాబ్దాలు ప్రచారం చెయ్యగా చెయ్యగా, రైళ్లల్లో పొగరాయుళ్ళ  దుశ్చర్యలు తగ్గాయి. కనీసం బాగుండదని,  సిగ్గుపడి సిగిరెట్లు రైళ్ళల్లో అందరి మధ్యా పొగతాగే వాళ్ళు తగ్గారు. 
 2.  మా చిన్న తనంలో మూడో తరగతి అంటే ఉట్టి చెక్క బల్లల మీద కూచోవాలి, కుషన్ ఉండేది కాదు. మూడో తరగతి తీసేసి, రెండో తరగతినే చివరి తరగతి చేసినాక, అన్ని సీట్లకు కుషన్లు అమర్చారు. ఆ కొత్తల్లో మన జనం వాటిని వేళ్ళతోనో, బ్లేళ్ళతోనూ కోసి, బొక్కలు పెట్టి యధాశక్తీ తమకు జన్మతః వచ్చిన సివిక్ సెన్స్ బయట పెట్టుకున్నారు. ఇప్పుడిప్పుడే అటువంటి పన్లు చెయ్యకుండా ఉండటం నేర్చుకున్నారు. 
 3. రైళ్ళ పరిస్థితి మెరుగు పడిందనే అనుకోవాలి. బెర్తులు, చైర్ కార్లు వగైరా వచ్చినాయి, గరీబ్ రథ్ లు కూడా ప్రజల అందుబాటులోకి వచ్చినాయి. సెకండ్ ఏ సి వంటి సౌకర్యాలు వచ్చినాయి. 
 4.  ఇక రద్దీ విషయం లోకి వస్తే పరిస్థితి ఏమిటి! 1917 పరిస్థితే ఇప్పుడు కూడానూ.  దగ్గిర దూరాలైతే పరవా లేదు. ఇప్పటికి కూడా హఠాత్తుగా  రాత్రి ప్రయాణాలూ, కుటుంబాలతో రాష్ట్రాలు దాటి వెళ్ళాలంటే నరక ప్రాయమే. పాపం గాంధీ గారు 22 మంది ఎక్కాల్సిన పెట్టెలో 35 మంది ఎక్కితేనే బెంబేలెత్తి పోయి, హడిలి ఆ విషయం తన వ్యాసంలో రద్దీకి ఉదాహరణగా వ్రాసారు. కాని ఈ పక్క ఫోటోలలో  రైళ్లల్లో  ఇప్పుడు ఉన్న రద్దీ చూస్తే,   గాంధీ గారు ఎంత భయపడిపోయ్యేవారో, ఝడుసుకునే వారో కదా! 
 5.  రైళ్ళల్లో లంచాల విషయం చూస్తె పరిస్థితి ఏమీ మారలేదు.
 6. మొదటి తరగతి, రెండో తరగతి సౌకర్యాలలో ఉండే అంతరం దాదాపుగా అలాగే ఉండేట్టుగా, మన రైల్వే వారు జాగ్రత్త పడుతున్నారు.
 7. ఇక రైళ్లల్లో  అమ్మే తిండి పదార్ధాలు, రైల్వే బ్రాండుగానే ఉంటున్నాయి, గతిలేక కొనుక్కోవటమే కాని, 1917 కు ఇప్పటికి మార్పనేది లేకపోగా అవ్వి అలాగే ఉంటాయని ప్రజలు నమ్మే స్థితికి దిగాజారిపోయ్యారు. 
 8. రైల్వే స్టేషన్లకు అనుబంధంగా ఉండే సత్రాలు (ప్రస్తుతం వాటిని రిటైర్మెంట్ రూములని పిలుస్తున్నారనుకుంటాను) పరిస్థితి బాగుపడిందనే ఒప్పుకోవాలి. అన్ని స్టేషన్లలోనూ, తగినన్ని రూములు లేకపోకపోయినా, ఉన్నంతవరకూ, తరువాతి రైలు వచ్చేవరకూ విశ్రాంతి తీసుకోవటానికి, ఒకటి రెండు  రోజులు ఉండటానికి సౌకర్యవంతంగానే ఉన్నాయని, నేను చూసినంతవరకూ అనిపిస్తున్నది. 
రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ స్పీకరు వంటి వారు విమానాల్లో, లేకపోతె  తప్పని పరిస్థితుల్లో రైళ్ళల్లో ఫస్ట్ ఏసి లోనో ప్రయాణం చెయ్యకుండా, చెప్పా పెట్టకుండా హఠాత్తుగా , జనరల్ కంపార్ట్ మెంట్లో ప్రయాణం చేసి జరుగుతున్న విషయాలు గమనించి, ఆకళింపు చేసుకుని, జరుగుతున్న దుశ్చర్యలకు అడ్డుకట్ట వేస్తూ, ఇంకా చెయ్యవలసిన పనులను తమంతట తాము అంచనా వేసి ఆ పనులు జరిగేట్టుగా చూడగలిగితే, అంతకు మించిన నివాళి గాంధీ గారికి మరొకటి ఉండదు. 1917 లో గాంధీ గారు బ్రిటిష్ ప్రబుత్వాన్ని, అప్పటి రైల్వే అధికారులను కోరినది అదే కదా మరి! 

మన పెద్దలు, 1917లో గాంధీ గారు  కోరిన ఆ పని చెయ్యగలరా!?  లేక గాంధీ జయంతి సందర్భంగా కెమేరా వంక చూపు నిలిపి, పూలు చల్లేసి చేతులు దులుపుకు వెళ్లి పోతారా? సహజంగా, రెండోదే సౌకర్యకరమైనది, రాజకీయంగా తెలివైన పని, ఆ వైపుకే ఎక్కువ మంది మొగ్గు చూపించే అవకాశం బాగా ఉన్నది. పాపం గాంధీ గారు, ఆయన ఆత్మకు శాంతి కలుగు గాక.

సరే వేరేవాళ్ళందరినీ అనుకున్నాం కానీ ప్రయాణీకులమైన మనం చెయ్యాల్సినది ఏమీ లేదా! ఎందుకు లేదూ? చాలా ఉన్నది. 
 1. మన ప్రయాణాలను సాధ్యమైనంతవరకూ  ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అడ్డదారుల్లో కాకుండా, టిక్కెట్లు సవ్యంగా అధికారికంగా కొనుక్కుని వెళ్ళాలి. 
 2. ఎక్కడైనా సరే ఒక పద్ధతి ప్రకారం, లైనులో నుంచుని ఎక్కాలి, దిగాలి, టిక్కెట్లు తీసుకోవాలి. తోసుకోవటం అనే అనాగరిక చర్యకు ఏమైనా సరే దిగజారకూడదు. 
 3. ప్రయాణాల్లో సాధ్యమైనంత వరకూ పండ్లు మాత్రమె కొనాలి, లేదంటే ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహార పదార్ధాలు తినాలి. ఇలా చెయ్యటం వల్ల  చెత్త అమ్మేవాళ్ళ వ్యాపారాలన్నీ మూలపడతాయి, ముఖ్యంగా మన ఆరోగ్యాలు చెడవు. తిన్న తరువాత మిగిలిన చెత్తను నియమిత స్థానంలో పడెయ్యాలి కాని, ఎక్కడ పడితే అక్కడ విదచిమ్మకూడదు, రైల్లోంచి బయటకు విసరాకూడదు. 
 4. రైల్వే  వాళ్ళు కూడా రైళ్లల్లో, ప్రతి చెత్తా అమ్మనివ్వ కూడదు. ప్రయాణాల్లో చూస్తుంటే, బిర్యానీలు అమ్ముతుంటే ఎగబడి కొనుక్కు తింటారు, అవి ఏమిటో ఎక్కడ చేశారో అన్న జ్ఞానమే లేదు. తరువాత ఆరోగ్యం చెడి ఏడవటం!  ప్రయాణాల్లో తినతగ్గ ఆహార పదార్ధాలు, పానీయాలు మాత్రమే రైళ్లల్లో అమ్మాలి. ఏది పడితే అది అమ్మినా మనం కొనకుండా ఉండాలి, కొని ప్రతి చెత్తా అమ్మేవాళ్ళను ప్రోత్సహించకూడదు. 
 5. రైల్వే వారి నిబంధనలు అన్నీ పాటిస్తూ ప్రయాణం చేస్తూ, తోటి ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా నడుచుకోవాలి. అల్లరి, ఆగం చేసుకుంటూ, కనపడిన వాళ్ళతోనల్లా తగాదా పెట్టుకుంటూ ప్రయాణాలు చెయ్యకూడదు. 
 6. ఒక్క మాటలో చెప్పాలంటే నాగరిక మైన మనుష్యుల్లాగా ప్రవర్తిస్తూ ప్రయాణాలు చెయ్యటం నేర్చుకుంటే అందరికీ సుఖం 
ఆ విధంగా ప్రయాణాల్లో శుభ్రత పాటిస్తూ, అవినీతిని ప్రోత్సహించకుండా, తోటి ప్రయాణీకులను గౌరవిస్తూ ప్రయాణాలు చెయ్యగలిగితే గాంధీ గారికి అంతకంటే గొప్ప నివాళి  ఈ అక్టోబరు రెండున మనం ఇవ్వగలిగేది మరేమీ లేదు.  

************************************************
చందమామ అభిమానులకు "చిత్రా" గా తెలిసిన ప్రముఖ చిత్రకారుడు శ్రీ రాఘవులు గారు, చందమామ పత్రికలోకి రాక పూర్వం "బాల" మాస పత్రికలో గాంధీ గారి మీద వ్యాసానికి వేసిన బొమ్మలు (ఫిబ్రవరి 1948)
బొమ్మలు పంపిన శ్యాంనారాయణ గారికి ధన్యవాదాలు


************************************************ 


6 వ్యాఖ్యలు:

 1. బాగుంది వ్యాసం. ప్రయాణికులకు మీరిచ్చిన సూచనలు బాగున్నాయి. మన నేతలు గాంధీ వారసులమని ఫోజు పెట్టడానికే తప్ప తనిఖీలు చేసి ప్రయాణికుల బాగోగులు పట్టించుకుంటారనుకోను. ఎవరైనా అలా చేస్తే బాగానే ఉంటుంది. ఎంతో కొంత మార్పు వస్తుంది. సిగరెట్ వాడకం తగ్గినట్లే ఇతర అంశాలలోనూ మార్పులు రావాలి. మరో విషయం గాంధీ గారు రిక్షాతొక్కే కార్మికుని రిక్షా వాడు, వాడు అన్నది మీ అనువాద లోపమా? అలాగే ఉన్నదా? నా ఉద్దేశం గాంధీజి అతడిని ఏమని సంబోధించాడనేది తెలుసుకోవడానికి మాత్రమే.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Gandhi wrote "wala" and for that translation cannot be other than what I wrote. Further you do not seem to be understanding that Gandhi "also" was a human and he started to be referred to as "Mahatma" much much later than 1917 ie. when Gandhi wrote the article under discussion.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. గాంధీని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే తెలుగులో ఉన్న అవకాశాలేమిటి ప్రసాద్ గారు?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. కొండలరావుగారూ మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు. నాకు కూడా తెలుగులో గాంధీగారి గురించిన పుస్తకాల గురించి పెద్దగా తెలియదు. ఈ మధ్యనే నేను, దినకర్ జోషీ గారు వ్రాసిన (గుజరాతీలో) శ్రీమతి కూచి కామేశ్వరి గారు తెలుగులోకి అనువదించిన పుస్తకం"మహాత్మునికి గాంధీకి మధ్య" ఎమెస్కో వారి ప్రచురణ చదివాను. గాంధీగారి గురించి సామాన్య జనానికి తెలియని అనేక విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ముఖ్యంగా గాంధీ గారి పెద్ద కుమారుడు హీరాలాల్ గురించిన వివరాలు, గాంధీగారికి, హీరాలాల్ కు మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు, చివరకు హీరాలాల్ దీన పరిస్థితి ఈ పుస్తకంలో ఉన్నాయి, వీలైతే చదివి చూడండి.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.