26, అక్టోబర్ 2014, ఆదివారం

ఏలూరిపాటి అనంతరామయ్య గారి ఉపన్యాసాలు :: పద్యాల తోరణం కార్యక్రమ అభిమానులకు ఒక శుభవార్త

 శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య గారు ఫోటో కర్టెసీ అనంత సాహితి బ్లాగ్
నిన్న మొన్నటివరకూ శ్రీ ఏలూరిపాటి అనంత రామయ్యగారి ఫొటో మన వెబ్ ప్రపంచంలో దొరకాలంటే గగనం! కాని నిన్న మన బ్లాగ్ లోకంలో వెతుకుతుంటే నన్ను ఆశ్చర్యానందల్లో ముంచి వేసిన ప్రకటన ఒకటి. అనంతరామయ్య గారి భారతం ఉపన్యాసాలు రోజుకొకటి మనకు అందచేస్తామని వారి అబ్బాయి, ఏలూరిపాటి వెంకట రాజ సుబ్రహ్మణ్యం గారి వారి బ్లాగ్ "జనారణ్యేంద్రుని విజయ గర్జన"లో చేసిన ప్రకటన చూశాను .  వారి బ్లాగు ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు. 

జనారణ్యేంద్రుని విజయ గర్జన 

 జనారణ్యేంద్రుని విజయ గర్జన బ్లాగు లో శ్రీ సుబ్రహ్మణ్యం గారు తన స్వానుభానువాలను వివరిస్తూ ఎన్నెన్నో మంచి విషయాలను సోదాహరణంగా అందచేస్తున్నారు.  తప్పక చదివవలసిన బ్లాగు రచనలు.   


అనంతరామయ్యగారు చెప్పిన మహాభారత ఆధారమైన ఉపన్యాస పరంపరలోని మొట్టమొదటి ఆడియో ఫైలును నిన్న (25 10 2014)న,  ఇప్పటికే పోస్ట్ చేసి అందరికీ అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమాలను మనకు అందించటానికి "అనంత సాహితి" అనే  పేరుతో ఒక ప్రత్యెక బ్లాగు ఏర్పరిచి ఆ ఆడియో ఫైళ్ళను అక్కడ పొందుపరుస్తున్నారు. ఈ కింది లింకు నొక్కి అక్కడ అప్లోడ్ చెయ్యబడ్డ మొదటి ఉపన్యాసం వినవచ్చు:

అనంత సాహితి

ఇంకా మరొక అద్భుత విషయం, సాహిత్య కార్యక్రమాల మీద మక్కువ ఉన్న అందరికీ కలకాల గుర్తుండిపొయ్యే అద్భుత కార్యక్రమం "పద్యాల తోరణం". దూరదర్శన్, సప్తగిరి చానెల్లో ఎన్నెన్నో వారాలపాటు సాహిత్య అభిమానులను అలరించింది. అసలు ఆ కార్యక్రమం పేరులోనే ఉన్నది చమత్కారం. ఒకవిధంగా చదివితే పద్యాల తోరణం గా అనిపిస్తుంది, మరొక రకంగా మాట విరిచి చదివితే పద్యాలతో రణం అంటే  పద్యాలే ఆయుధాలుగా యుద్ధం అనిపిస్తుంది. నిజానికి ఇది ఒక అంత్యాక్షరి వంటి పోటీ పరీక్ష. మనకు తెలిసిన అత్యాక్షరీ పోటీలు అన్నీ కూడా సినీ గీతాల ఆధారమైనవి మాత్రమే. కాని పద్యాల తోరణం, కేవలం మన పద్య సాహిత్యంలో ఉన్న పద్యాల ఆధారమైనది. ఈ కార్యక్రమం మీద అభిమానంతో మునుపు నా బ్లాగులో వ్రాసిన వ్యాసాలను ఈ కింది లింకులు నొక్కి చదువుకోవచ్చు. 

పద్యాలతో "రణం" వ్యాసం

పద్యాలతో"రణం" ఆడియో 

పై కార్యక్రమంలో అనంతరామయ్యగారి పద్యాల ధారణా శక్తి, ఒక్కొక్క పద్యం మొదటి మాట చెప్పంగానే ఆ పద్యం పూర్వాపరాలు చెప్పటం, పాల్గొనే పోటీ దారులందరికీ స్పూర్తిదాయకం, వినే శ్రోతలకు/ప్రేక్షకులకు ఎంతో సమాచారం పద్యాల గొప్పతనం తెలియచేప్పేదిగా ఉండేది. అంతే కాదు ఆ కార్యక్రమం తీర్చి దిద్దిన విధానం, నిర్వహించిన తీరు అద్భుతం.

పద్యాల తోరణం కార్యక్రమ అభిమానులకు ఒక శుభవార్త ఈ కింది ఇమేజి ఫైలులో ఉన్నది: 

 పద్యాలతో రణం కార్యక్రమం లో ని కొన్ని భాగాలనైనా చూసే అవకాశం త్వరలో ఉన్నది అనిపిస్తున్నది. కాకపొతే కాపీ రైట్ అనుమతి తీసుకోవాలని ఆ అనుమతి దూరదర్శన్ వారు ఇవ్వాలని తెలుస్తున్నది. 

 

                              

**************************************** పద్యాల తోరణం అభిమానులు అందరి తరఫునా దూరదర్శన్ వారికి నా విజ్ఞప్తి ****************************************

పైన చెప్పిన అనుమతి వెనువెంటనే ఇప్పించమని అంతే  కాకుండా, మరింత పెద్ద మనసు చేసుకుని వారి వద్ద (దూరదర్శన) ఉన్న పద్యాల తోరణం కార్యక్రమ వీడియో ఫైళ్ళు అన్నీ కూడా యు ట్యూబులోకి అప్లోడ్ చెయ్యమని నా కోరిక. కారణం పద్యాల తోరణం మన తెలుగు వారి సాహిత్య సంపద, అటువంటి సంపద  ప్రజా బాహుళ్యంలోకి రాకుండా ప్రభుత్వ కార్యాలయల్లోని బీరువాల్లో మగ్గి నశించిపోవటం  ఎంతమాత్రం సమంజసం కాదు. ఆకాశవాణి  వారు దశాబ్దాల పాటు తయారు చేసిన అద్భుత కార్యక్రమాలను,  తీరు తెన్నూ లేని విధానాలతో ప్రజలకు దూరం చేసేశారు. కనీసం దూరదర్సన్ వారైనా ఇటువంటి సాహిత్య సంపదను ప్రజలకు అందుబాటులోకి తేవాలని, అలా అందుబాటులో తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నవారికి సహకరించాలని నా కోరిక.                  
 ****************************************                             

    ఈ కోరిక నా ఒక్కరిదే కాదు, "పద్యాల తోరణం"  కార్యక్రమ అభిమానులు అందరిదీనూ

 **************************************** 
అనంతరామయ్యగారి ఉపన్యాసాలనూ , పద్యాల తోరణం  కార్యక్రమ వీడియోలను మనందరికీ అందించటానికి అవిరళ కృషి చేస్తున్న శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్యగారి కుమారుడు, శ్రీ  ఏలూరిపాటి వెంకట రాజ సుబ్రహ్మణ్యం గారికి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు
 **************************************** 
                   


 

 

 

 

 

 

 

 

2 కామెంట్‌లు:

  1. శ్రీకప్పగంతు శివరామ్ ప్రసాద్ గారికి నమస్కారములు
    మీరు చూపిస్తున్న అవ్యాజమైన అభిమానానికి కృతజ్ఞతలు. మీరు అన్నట్లు పద్యాలతోరణం మన సాహితీ సంపదే. దీనిని పరిరక్షించి ముందుతరాలకు అందించాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇందులో భాగంగా నేను చేస్తున్న చిన్న ప్రయత్నమే అనంతసాహితీ డాట్ ఓఆర్ గ్ వెబ్ సైట్. మీరు చూపించిన అభిమానానికి ఆ ఆంధ్రవ్యాసులవారు సంప్రీతులై అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను.
    -ఏలూరిపాటి

    రిప్లయితొలగించండి
  2. నా బ్లాగుకు వచ్చి వ్యాఖ్య వ్రాసినందుకు ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారూ.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.