18, జనవరి 2015, ఆదివారం

స్వర్గంలో కోలాహలం

                            

**************************************** 

ఈరోజున వ్రాసినచిన్న వ్యాసంలో  చాలా మంది పెద్ద రచయితల పేర్లు  వాడటం జరిగింది. పూర్తిగా హాస్యం  కొరకు మాత్రమె అని, ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశ్యం లేదని, ఆ రచయితలందరికీ నమస్కరిస్తూ,  విన్నవించుకుంటున్నాను.

ఇది చదవటానికి ముందుగా,  ఈ కాస్తా వ్రాయటానికి ప్రేరణ 2011 లో వచ్చిన ఒక వార్త. ఈ వార్త గురించి నేను మూడు వ్యాసాలు ఈ బ్లాగులోనే వ్రాశాను. కానీ ఫలితం శూన్యం. ఆ మూడు వ్యాసాలూ చదివిన తరువాత ఈ కింది హాస్య రచన చదివితే బాగుంటుందని నా అభిప్రాయం.

****************************************

 
 ఎడమ పక్కన పేపరు/చానెళ్ళ వాళ్ళు చూపించిన  సమాధి, కుడి పక్కన తెలుగు వెలుగు పుస్తకంలోని చలం గారి సమాధి  
మునుపు చలంగారి సమాధి గురించి వ్రాసిన మూడు వ్యాసాలూ ఈ కింది లింకులు నొక్కి చదువుకోవచ్చు
 1. చలం గారి సమాధి వివాదం
 2.  చలం గారి సమాధి మరో కోణం 
 3. గవర్నర్ గారి స్పందన 


స్వర్గంలో కోలాహలం
"ఏమిటిది రంభా, నా ఊర్వశి  ఏదీ?" అంటూ గడ్డం నిమురుకుంటూ గుండీలన్నీ తీసేసిన చొక్కా, లోపలి  బనీను కనపడుతూ,  కల్పవృక్షం పక్కనుంచి వచ్చారు చలం. అప్పుడే పొద్దుటి కోటాగా తాగిన కప్పు అమృతం మజాలో ఉన్నారు ఇంకా. "ఏమోనండీ, ఇవ్వాళ డాన్స్ డ్యూటీ ఆవిడగారిదే అనుకుంటాను. ఈ ఇంద్రుడు మమ్మల్ని ప్రతిరోజూ డాన్స్ అంటాడు, చేస్తున్న మాకే విసుగ్గా ఉన్నది, ఆయన, ఆయనతోబాటుగా ఆ గడ్డపాళ్ళు  అదేలెండి మునులు, ఎలా చూస్తున్నారో యుగాలనుంచీ  నాకేమీ అర్ధం కావటంలేదు".

"
రంభా! బాగానే వంటబట్టిందే నా ధోరణి . ఏమిటి,  మాటల్లో ఇంగ్లీషు తెగ దంచేస్తున్నావు డాన్స్, డ్యూటీ అబ్బో చాలా టింగ్లీషే వచ్చిందే! అవున్లే ఎటుచూసినా తెలుగువాళ్ళే ఈ స్వర్గంలో,  నీకు టింగ్లీషు   ఇంతగా వంటబట్టడంలో ఆశ్చర్యం ఏమున్నది.  ఈ సారి, మీ ఇంద్రుడు నిన్ను  భూలోకానికి డ్యూటీ వేస్తే,.....అవునూ చివరిసారి ఎప్పుడు వెళ్ళావూ, ఒక కల్పం అయ్యి ఉండదూ! సరే, మళ్ళి నీకు భూలోకపు డ్యూటీ పడితే, నువ్వు  హాయిగా తెలుగు చానేళ్ళల్లో వార్తలు చదువుతూ బతికెయ్యచ్చు .  సర్లే,  రంభా మీ కష్టాలు మీవి. ఆ సిల్క్ స్మిత ఏమన్నా ఈ స్వర్గంలోకి వచ్చిందా....పోయి ఆవిడను అడుగు కొత్త నాట్య భంగిమలు నేర్పుతుందేమో. ఆవిడ మీద ఒక సినిమా కూడా తీశారుట ఇప్పుడు ఆ భూలోకంలో.  ఆ హాలు పక్కన ఉన్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో కదా!"

"లేదండీ చలం గారూ, మీరోజుల్లో అంటె సినిమా హాళ్ళు,  ఇళ్ళ మధ్యే ఉండేవి, పైగా అవి అప్పట్లో ఎ సి కూడా కాదు.  కాని,   ఇప్పుడు సినిమా హాళ్ళకి కనుచూపు మేరలో ఇళ్ళు ఉండవు అన్నీ కాంప్లెక్స్ లేనుట. చాలా ఊళ్ళల్లో అవేమిటి మాల్స్ ట అందులోనే ఒక ప్లోరులో ఈ సినిమా హాళ్ళు ఉంటాయట, ఇప్పుడు హాలు అనటం లేదు స్క్రీన్ అని అంటున్నారు".   

"పోనీలే జనం సుఖపడిపోతున్నారు. 1950 వరకూ దుస్సహమైన  ఆ సినీ శబ్దాలు వింటూ బెజవాడలో ఆ లక్ష్మీ టాకీసు పక్కనే  ఎలా ఉన్నానా అని ఇప్పటికీ నా ధైర్యానికి, గుండె బలానికి ఆశ్చర్యపోతూనే ఉంటాను.  అలా అక్కడే భూలోకంలోనే నేను పడ్డ కష్టానికి,  నాకు నరకంలో పడవలసిన శిక్ష అక్కడే అనుభవించటం వల్ల,  నన్ను తెచ్చి ఈ స్వర్గంలో మీ పాలన పడేసి ఉంటారని నాకు అప్పుడప్పుడూ అనిపిస్తూ  ఉంటుంది, ఏమంటావు!!" అన్నారు సరదాగా నవ్వుతూ.

"ఏమిటండీ ఇలా మొదలెట్టారూ.    చలం గారూ,
ఈ మధ్య  మీరు కూడాను, ఎక్కడో  మొదలుపెట్టి మరెక్కడికో వెళ్ళిపోతున్నారు. మీకు కూడా సావాస దోషం ఏదో పట్టినట్టుంది. లేకపోతే, ఎక్కడి సిల్కు స్మిత మీద సినిమా, ఎక్కడెక్కడి పాత పురాణం అంతా విప్పారే. సరె,  నాకెందుకండీ కొత్త భంగిమలూ, ఈ ఇంద్రుడు అక్కడా ఇక్కడా వాణ్ణి చెడగొట్టు వీణ్ణి చెడగొట్టు అని నన్నెప్పుడు పంపాడు.  ఎప్పుడూ ఆ మేనకేగా వెళ్ళేది నాకేమో డబుల్ డ్యూటీ,  ఆవిడ పని నా పని చెయ్యలేక వళ్ళు హూనం, పేరేమో ఆవిడకి.  ఇలాంటి గోలలు లేకుండా ఉంటే, నేను హాయిగా , బోలెడంత ప్రాక్టీసు చేసుకుని అద్భుతమైన డాన్స్ చెయ్యగలనండీ.  సరే కాని, నేను, తిలోత్తమా ఉలూచీ అందరం కలిసి పిక్నిక్ కి వెళ్తున్నాం, మీరుకూడా వస్తారా, శ్రీనాధుడూ, పెద్దన్నా గారు కూడా వస్తారుట. తెనాలి రామలింగం గారు కూడా వస్తానని బెదిరిస్తున్నారు".

"వద్దులే రంభా, వాళ్ళు,  వాళ్ళ పద్యాల చిట్టాలన్నీ  విప్పి చంపుకు తింటారు, నాకు విసుగు. నాకు ఊర్వశి కావాలి" అని కొంటెగా నవ్వుతూ, "సరేకాని రంభా, ఎన్నిసార్లు అడిగినా చెప్పవేమిటి. ఇదేమో మగాళ్ళ స్వర్గం, ఇక్కడ మాక్కావాలిసినవె అన్నీ చూడటానికి మీరందరూ అప్సరసలూ వగైరాలు ఉన్నారు. మరి ఆ పక్కనున్న  ఆడవాళ్ళ స్వర్గంలో ఎలా ఉంటుందో!"

"ఏమో బాబూ నాకేమి తెలుసు. మమ్మల్ని అటుకేసి వెళ్ళనివ్వరు, తొంగి చూసినా తప్పంటారు  బృహస్పతి గారు, మేము చెడిపోతామట, అంటే ఏమిటోకదా.......!"అంటూ వంటికి ఉన్న ఆభరణాలన్నీ గలగలా మొగేట్టుగా రంభ చలంగారికి ఒక పెద్ద దణ్ణంపెట్టి, "మహానుభావా నాకేమీ తెలియదు, మీరసలే రచయితలు, ఆ భూలోకంలో  ఉన్నప్పుడు వాళ్ళను వ్రాసి వ్రాసి హడలగొట్టారు. తరువాత అక్కడే వ్రాయటం మానేసి ఊరుకున్నారు. ఇక్కడికి వచ్చి చిత్రమైన  కబుర్లతో మమ్మల్ని హడలగొట్టకండి. వ్రాయకపోవటమే  అలవాటయ్యి ఇక్కడకొచ్చి కూడా వ్రాయటమే మానారు. వ్రాయటం మొదలెట్టండి చలంగారూ, ఈ ఇంద్రుడూ, బృహస్పతీ,  ఈ మగ దేవతలూ వాళ్ళందరూ మీ రచనలు చదివితే కాని బాగుపడేట్టు లేరు."


"ఈ ముసలాయనకి, ఆడవాళ్ళ స్వర్గం విశేషాలు కావాలిట.........               వి.  శే.  షా.  లు .........." అని గొణుక్కుంటూ వెళ్ళిపోయింది.

చెయ్యి కళ్ళమీద పెట్టుకుని దూరానికి చూశారు చలం. అలా దూరానికి చూస్తున్న చలం గారికి, తనవైపే గబగబా వస్తున్న నండూరి సుబ్బారావు గారు కనిపించారు. చలం గారికి కంగారు పుట్టింది, "ఏమిటిది ఇలా వస్తున్నారు మన లాయరు గారు,
కొంపతీసి కొత్త ఎంకి పాటేమీ రాయలేదు కదా! ఈ మధ్య ఈయన వ్రాసే ఎంకి పాటలు చేతకానివాడు  పెట్టే కాఫీ లా ఉంటున్నాయి. చెప్తే వినడు. ఊహూ వ్రాస్తాడు.ఎందుకైనా మంచిది ఈ పొదలో దూరతాను"  అని అందులోకి ఒక కాలు పెట్టి దూరేలోపునే  నండూరి దగ్గరకు రానే వచ్చారు. వస్తూనే సుబ్బారావుగారు, చాలా ఆదుర్దాగా ఉన్నారు. చలం  దగ్గరగా వచ్చి, రహస్యం  చెబుతున్నట్టుగా "చలంగారూ! ఏమిటిదంతా మీ సమాధి తవ్వి పారేస్తారుట, గోల గోలగా చెప్పుకుంటున్నారు" అన్నారు. "నాకు సమాధేమిటి సుబ్బరావు గారూ ఏమిటిది". ఈలోగా అటుగా వెళ్తున్న విశ్వనాథ వారు వీళ్ళ మాటలు విని ఆగారు. సుబ్బారావుగారు చనువుగా సత్యనారాయణ గారూ అని పిలిచారు. విశ్వనాథ గారు, "ఎవరది! చలమా, ఏమి కావలుయును , స్త్రీ స్వాతంత్ర్యము గురించి మరియొక నుపన్యాసము నిలువబెట్టి నాకు జెబ్బుటకు గాదు కదా?"

"ఎంతమాట సత్యనారాయణగారూ . మీకు చెప్పగలనా నేను! ఇదేదో మన నండూరి నా సమాధి తవ్వేస్తునారని...."

"సమాధి అనగా నేమి. అది ఒక చమత్కారమైన స్థితి, ఇటు నిద్రయూ గాదు, అటు మెళుకవా గాదు.బయట జరుగుచుండునవి తెలియుచునే యుండును గాని నీవు ఏమీ చలింపవు. అదియొక ఆలోచనా పధ్ధతి, యోగులకే పట్టివ్వదు మరి...."

"ఆ సమాధి కాదు మహానుభావా, నాకు కట్టిన సమాధిటండీ  బాబూ...."

"మీకు సమాధేమిటి, దహింపబడకుండానే ఈచోటికి వచ్చి ఉన్నారా.  అయినా మీ కన్నా మూడేళ్ళ ముందు ఇక్కడికి వచ్చి ఉన్నవాడను నాకేల తెలియును మీ విషయములు, నన్నేల అడిగెదరు.... థూ.,...థూ...ఇవ్వాళ ఇంద్రుడికి గట్టిగా చెప్పాలి స్వర్గంలోకి ....ప్రతివాడూ వచ్చేయ్యటమే". అంటూ రుసరుసలాడటం మొదలెట్టారు విశ్వనాధ.

"అయ్యా సత్యనారాయణ గారూ, మీ అబ్బాయి అదిగో 'రచయితల సంతానం పేటలో' కూచుని మీ వేయిపడగలు తెలుగులోకి  తర్జుమా చేస్తుంటె ఏదో అనుమానం వచ్చి  మీ కోసం వెతుక్కుంటున్నాడు....చూడండి బాబూ" అన్నారు అప్పుడే అటుకేసి వచ్చిన పాలగుమ్మి పద్మరాజుగారు, చలంగారికేసి చూసి కన్ను మలిపి.

"ఏమిటీ? వేయిపడగలు తెలుగు జేయుటయా! నేనేమి భాషలో వ్రాసితిని? అది తెలుగు కాదేమి?" అని కళ్ళెర్ర చేస్తూ పంచె అంచును విసురుగా  లాల్చీ జేబినందు కూరి,పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నిష్క్రమిస్తున్నారు విశ్వనాథ.

"ఆ వ్రాశారులెండి తెలుగు...అంతా ఇనప గుగ్గిళ్ళూ......." అంటూ చలం ఏదో అనబోతుండగా.....


"గుగ్గిళ్ళు కాదండీ సజ్జలు...సజ్జలు  అనండి" అన్నారు గోపీచందుగారు.  "అదేమిటి మన రామేశ్వరశాస్త్రిగారు అలా...కోపంగా...."

ఇది చెవినబడి విశ్వనాథ గిరుక్కున వెనుతిరిగి ఇదిగో "గోపీచందూ, నాకెప్పటినుండియో అనుమానముగనే ఉన్నది. నీవు పండిత పరమేశ్వరశాస్త్రి  వీలునామా అను ఒక గ్రంధము నన్ను ఊహించుకునే వ్రాసితివి. ఇప్పటికి దొరికినారు. మీరు తప్పక చెప్పవలయును ఎందులకు మీకు నామీద ఇంత.....
" అంటూ  అక్కడనుంచే అరవటం మొదలుపెట్టారు.

"మీ సజ్జలు గూల ఇదెక్కడి గొడవయ్యా బాబు. ఇప్పుడు మీరూ, చలమూ కలిసి సత్యనారాయణగారితో వాదం వేసుకుంటె తెగేదేనా, బ్రహ్మరుద్రాదులు వచ్చినా కూడా మీకు సంధి కుదరదే, ఇప్పుడేమి చెయ్యాలి...... ఇప్పుడు ఎలా......... ఏమండోయ్ కృష్ణశాస్త్రిగారూ...." అంటూ పిలుస్తూ హడావిడి పడుతున్నారు పాలగుమ్మి పద్మరాజు గారు.   

కానీ,  ఈలోగానే పెద్ద కోలాహలంగా పెద్ద గుంపు అటుకేసి వస్తున్నది. వాళ్ళదరూ పడీ పడీ నవ్వుతున్నారు, తుళ్ళుతున్నారు.  ముందుగా భమిడిపాటివారు ఆడుగులువేస్తుంటే, మునిమాణిక్యంగారు, విలాసంగా వక్కపొడి కాబోలు నములుతూ వస్తున్నారు, వారి వెనకనే ముళ్ళపూడి, బాపు ఒకరి భుజం మీద మరొకరు చేతులు వేసుకు వస్తున్నారు. జంధ్యాల ఏదో చెబుతున్నారు, రేలంగి, పద్మనాభం, గిరిజ, శివరావు, రాజబాబు ఇంకా చాలామందే ఉన్నారు. చాలా పెద్ద గుంపే ఉన్నది వాళ్ళ వెనుక.  అప్పుడప్పుడూ జోకు బాగున్నప్పుడల్లా రమణగారు ఘాట్టిగా ఒక్క విజిల్ వేస్తున్నారు. "ఏరా! ఈ భూలోకపు అలవాటు నీకు ఇంకా పోలేదురా" అంటూ బాపుగారు చిద్విలాసంగా నవ్వారు.  "నువ్వు మటుకు ఇక్కడికొచ్చి నీ పైపు గురించి బెంగెట్టుకోలేదూ" అంటూ నవ్వారు ముళ్ళపూడి. వాళ్ళు వేసుకునే జోకులూ వాళ్ళ నవ్వులూ అందులో ఉండే ఆనందం అంతా చూసేప్పటికి అక్కడ వాతావరణం అంతా చల్లపడిపోయింది.

విశ్వనాథవారు,  వారి కోపం కూడా మర్చిపోయి, తన విశ్ణుశర్మ ఇంగ్లీషు చదువు లో కొన్ని జోకులు వాళ్ళకు చెబుతూ వాళ్ళతో కలిసి వెళ్ళిపోయారు. మిగిలిన అందరూ హమ్మయ్య ఇవ్వాళ్టికి గండం గడిచిందిరా బాబూ అని ఊపిరి పీల్చుకున్నారు.

ఈలోగా శ్రీ శ్రీ అక్కడకు మట మటలడుతూ వచ్చి, "ఏమయ్యా గోపీచందూ ఈ ఇంద్రుడుకి బుధ్ధి ఉన్నట్టు లేదు, మన్ని తీసుకొచ్చి ఈ పాత చింతకాయ పచ్చడి బూర్జువా స్వర్గంలో వీళ్ళతో పెట్టటం ఏమిటయ్యా, మన సమ సమాజపు స్వర్గం ఏదీ!  మన కామ్రెడ్లు ఆ నరకలో పడి ఉంటె మనం ఇక్కడా? మావో లేడు, లెనిన్ లేడు ఏమయ్యారు వీళ్ళందరూ"  అంటూ కోపంగా చకచకా నాలుగు పద్యాలు విసిరారు. 

వడ్డాది పాపయ్య గారు తన కుటీరంలోచి ఈ గోలకి విసుక్కుంటూ వచ్చి, "ఏమయ్యా చలం, ఇలా రా ఒకసారి. నువ్వు ఆ రంభతో సరసాలడుతున్నప్పుడె, నాకు చికాకు పుట్టింది. ఇట్టారా, నీ కథలకు నేను బొమ్మలు వెయ్యను కాని, నీకు ఊర్వశిని చూపిస్తాను, అదేలే నేను వేసిన బొమ్మ".  ఇలా అనంగానే, చలం గారు వ పా గారి కుటీరంలో కి వెళ్ళి ఆయన వేసిన ఊర్వశి బొమ్మ చూసి మత్ర ముగ్ధులు  ఐపొయ్యారు. "సరే చలం,  వాళ్ళేదో నీ సమాధి అంటె నువ్వు కూడా అలా కంగారు పడి విశ్వనాథ వారినా అడిగేది. ఏమీ లేదయ్యా, అక్కడి పేపర్లు ఇవ్వాళ ఏదో ఒకటి పట్టుకుని గోల గోల చెయ్యటం ఆ తరువాత వదిలెయ్యటం. అప్పుడెప్పుడో రెండేళ్ళ క్రితం  అదేదో కొత్త గోల ఒకటి ఆ చానెళ్ళ వాళ్ళు  మొదలు పెట్టారు. అరుణాచలం లో మీ సమాధి తవ్వేస్తున్నారానీ దాన్ని రక్షించాలనీనూ. ఇప్పుడు ఆ విషయం ఏమయ్యిందో తెలియదు ఎవరికి వాళ్ళు కిమ్మనకుండా ఉన్నారు. నీకు సమాధి ఎవరు కట్టారయ్యా, మీ అమ్మాయనుకుంటాను నీ భస్మం పట్టుకొచ్చి మీరు ఉన్న ఇంట్లోనే ఒక చెట్టు మొదట్లో ఉంచిందని, ఆ పురాణం సుబ్రహ్మణ్య శర్మ తన తెలుగు వెలుగు పుస్తకలో వ్రాశాడే,  ఏడీ ఆయన"  అంటూ అటూ ఇటూ చూశారు.

"అవునవును నిజం,  నేను ఉన్న విషయమే వ్రాసినది.  అంతే కదా సీతా" అంటూ తన ఇల్లాలి వంక చూశారు సుబ్రహ్మణ్య శర్మ గారు. "సరేకానీ! ముందా సిగిరెట్టు ఆవతల పారెయ్యండి, స్వర్గం వచ్చినా పట్టుకు ఊరేగుతున్నారు" అనారు పురాణం సీత గారు  కోపంగా.      

ఇలా స్వర్గలో కూడా అప్పుడప్పుడూ టీ కప్పులో తుఫానులు వస్తాయి కాబోలు అనుకుంటూ ఉంటున్నాను ఈ లోగా  చూస్తే ఏమున్నది భూలోకంలోనే, రేపు ఆఫీసుకు వెళ్ళాలిరా బాబూ అని దిగులుగా అనుకుంటూ ఆదివారం పొద్దున్నే కలలొంచి బయటపడి  నిద్రలేచాను.  

1 వ్యాఖ్య:

 1. KSRP garu:
  Woke up at 3am and was excited to see your mail and after reading about Chalam-Rambha dialog, Chandamama blogs, listening to Balamurali's Suprabhatam and finally into Radio personalities.

  Transported me into good old days and I sincerely wish they kept the tapes. What I was told is that the cost of tapes was so high they had to recycle per orders (comparatively paper is cheaper to produce and file for long time though it will deteriorate ...in time).

  We knew a Station Director who tried to salvage but his hands were tied with the then bureaucracy....'

  Our hope is some tech savvy grandfather who had access to Radio/spool tape and passion to record has done some good long-lasting work for next generations...

  May be an advertisement in local papers will be of help..

  Send direct mail with some of these AIR articles in a file to Gollapudi garu and he will be able to help identify and share more of those times...He is very accessible...

  BS Murthy (Burra) link is not working....

  BTW...Ex tempore is ఆశువు (in Ushasri's article)

  Your interest, passion and tech savvy nature to provide such wonderful and varied pieces of nostalgic info is highly commendable. I do similar (with a lot of technical, internet and more importantly time due to early retirement) but you beat me hollow! I have a good western music collection but you seem to find time enjoy, recall and write about it. Kudos to you.

  I will be in HYD Feb 6 to Mar 5. See if you can visit at that time.

  2015-01-18 0:18 GMT-06:00 SIVARAMAPRASAD KAPPAGANTU

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.