12, మే 2015, మంగళవారం

అరుదైన అద్భుత చిత్రం

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి అరుదైన అపురూప చిత్రం  చిత్రకారుడు శ్రీ వెంబు


సీతమ్మను శ్రీలలితాపరమేశ్వరిగా రామాయణ కల్పవృక్ష మహాకావ్య రసబ్రహ్మ విశ్వనాధ వారు దర్శిస్తున్నట్లుగా సుమారు 40 సంవత్సరాల క్రితం శ్రీ వెంబు వేసిన చిత్రం.   ఈ చిత్రాన్ని స్వయంగా వారే తన వీరాభిమాని, మితృలు అయిన మా మామగారు, తెనాలి తాలూకా గొడవర్రు అగ్రహారం వాస్తవ్యులు, జంధ్యాల వెంకటేశ్వర్లు గారికి (1919-1980) బహుకరించారుట. మా మామగారు (ఆయన కీర్తిశేషులైన సంవత్సరానికి మా పెళ్ళి అవటంతో ఈ విషయాలు నాకు తెలియలేదు) స్వయంగా కవి, మీదుమిక్కిలి విశ్వనాధవారి అభిమానం చూరగొన్నవారైవుండటం చేత, కవిసామ్రాట్టులే స్వయంగా మా మామగారిని పిలిచి మన స్నేహానికి గుర్తుగా ఈ చిత్రాన్ని ఇచ్చారని తెలిసింది. ఈ  అద్భుతమైన బొమ్మను ఆయన ఎంతో  సంతోషంతో ఫ్రేం కట్టించుకుని దాచుకున్నారు.  అటువంటి అపురూప చిత్రం బ్లాగులోకంలో అందరికోసం నేను అందచేస్తున్నందుకు  చాలా సంతోషంగా ఉన్నది. చిత్రాన్ని అందచేసిన మా బావమరిది శ్రీ సోమయాజులు గారికి ధన్యవాదాలు. 

చిత్రకారుడు శ్రీ వెంబు గురించి వివరాలు తెలియటం లేదు. వెంబు గారి గురించి తెలిసినవారు దయచేసి ఆయన గురించి తెలుపగలరు. 


విశ్వనాధవారు "కల్పవృక్ష రహస్యములు" అనే తన పుస్తకంలో ఇలా వ్రాస్తారు:

ఇది రామ కధ కాదు.ఇది సీత కధ.-సీతాయాశ్చరితం మహత్. రామా+ఆయనము.రామా -స్త్రీ. ఆమె యొక్క గమనము.రామశబ్ధమునకు 'రమ్' ధాతువు మీద నీవు వ్యుత్పత్తి చెప్పుదువో వ్యుత్పత్తియే యిచ్చట రామా శబ్దమునకు చెప్పి శ్రీదేవి అని సమన్వయించుకొనవలెను. శ్రీదేవియొక్క తత్త్వమునకు, సృష్టి మూలహేతువైన  తత్త్వమునకు భేదము లేదు”. తరువాత అరుంధతితో పలికిస్తారు-“ సీత వట్టి ప్రకృతి కాదు. శ్రీదేవి. సాన్ఖ్యమతమునందు ప్రకృతి జడపదార్ధము. అద్వైతమతాదులట్టులుంచి శ్రీవిధ్యయందు పరమేశ్వరి తానే బ్రహ్మ పదార్ధ కల్పురాలు. సృష్టికి పరమేశ్వరునికంటే ఆమె మూలహేతువు. అందుకనియే వాల్మీకి,  రామాయణమును "సీతాయాశ్చరితం మహత్" అన్నారు. “రాముడు, సీత లక్ష్మీనారాయణులు. పార్వతీపరమేశ్వరులు. ప్రకృతిపురుషులు”. విశ్వనాధవారు యింకా యిలా వ్రాస్తారు.

“సీత రామచంద్రుని చిత్తపదము

రామచంద్రుండు జానకీ ప్రాణపదము

రామ సర్ప ఫణామణి రమణి సీత

ధరణిజా జీవితా తప సరణి స్వామి
*****************************
మరొక ఆసక్తి కరమైన విషయం, మా మామగారు జంధ్యాల వెంకటేశ్వర్లు గారు, విశ్వనాథ వారి ఒక గ్రంధానికి కృతిభర్త అర్థాత్, విశ్వనాథ వారు తాను రచించిన ప్రద్యుమ్నోదయం ప్రబంధం  ఆయనకు అంకితం ఇచ్చారు. ఆ కార్యక్రమపు ఫోటో ఈ కింద చూడవచ్చు. 
కవిసామ్రాట్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి నుండి ప్రద్యుమ్నోదయం ప్రబంధాన్ని స్వీకరిస్తున్న  శ్రీ జంధ్యాల వెంకటేశ్వర్లు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.