13, ఆగస్టు 2018, సోమవారం

ఒక ఆలోచన లేదా సూచన




ఆవతలి వాడు చెప్పేది, ఆ విషయం మనకు ఉపయోగపడేదే అయినాసరే, ఎందుకు వినాలి అన్న మొండితనం  చాలా మందిలో  చూస్తుంటాము.  ఇక్కడ పార్కింగు చెయ్యద్దు అంటే, అక్కడే డబుల్ పార్క్ చెయ్యటం, లేదా బైకు సైడు స్టాండు వేసి మరీ పార్క్ చేసే ప్రభుద్దుల్ని మనం రోజూ చూస్తూనే ఉంటాం. ఆఫీసుల్లో మెట్లమీద ఉమ్మెయకుండా, ఇక్కడ ఉమ్మకండిరా అని బోర్డు పెట్టినా సరే అక్కడే తమ చండాలపు అలవాట్లతో (కిళ్ళీలు,గుట్కాలు) ఆఫీసుల్లో గోడలు, మెట్లు నాశనం చేసేవాళ్ళను చూస్తూనే ఉన్నాము. ఈ చెత్త అలవాటు పోగొట్టటానికి మెట్ల మీద అన్ని రకాల మతాల బొమ్మలు పెట్టినవాళ్ళూ లేకపోలేదు. ఈ ఉమ్మెత్త గాళ్ళను ఆపటానికి దేముడు "భయం" తీసుకు రావలిసిందే కానీ , వాళ్లకు వాళ్ళే బుద్ధి తెచ్చుకుని ప్రవర్తిస్తారని  అనుకోవటం అత్యాశే!

ఇక డ్రైవింగు చేసేప్పుడు సెల్ మాట్లాడకండిరా , అది మీకే కాదు, మీ డ్రైవింగ్ వల్ల రోడ్డు మీద ఉన్న ఇతరులకు కూడా ప్రమాదానికి దారి తీస్తుంది, ప్రాణాలు పొయ్యే ప్రమాదం ఉన్నది  అని ఎన్ని చెప్పినా, ఫైను వేసినా, ప్రకటనలు గుప్పించినా, మనం రోజూ చూస్తూనే ఉంటాము,  బైకుల మీద వెళ్ళే వంకర మెడగాళ్ళని. ఏమిటో వీడు చేసే అణాకాణీ గుమాస్తా ఉద్యోగానికి, లేదా చేసే బటానీల వ్యాపారానికి అంత డ్రైవ్ చేస్తూ కూడా, అదీ బైకు మీద, మాట్లాడాల్సినంత గొప్ప విషయం. పక్కన ఆపుకుని ఆ అద్భుత విషయం మాట్లాడుకోవచ్చు కదా!

ఇక ఇప్పుడు హాండ్స్ ఫ్రీ ఫోను కారుకు అనుసంధించి, మాట్లాడేసుకోవచ్చు. డ్రైవింగ్ చేసేప్పుడు ఫోను మాట్లాడ కూడదు అన్నది, ఒక చేత్తో ఫోను పట్టుకుంటారని, ఒంటి చేత్తో డ్రైవింగ్ చేస్తే మాత్రమె ప్రమాదం జరుగుతుందని  కాదు. డ్రైవింగ్ చెయ్యటం అనేది ఎంతో జాగ్రత్తగా మన చెవులు, కళ్ళు, బుద్ది పెట్టి చెయ్యవలసిన పని. అటువంటి పనిచేస్తూ, ఫోను మాట్లాడుతుంటే, హాండ్స్-ఫ్రీ అయినా సరే, చెవులు/బుద్ధి మాట్లాడే విషయం మీద ఉంటాయి కానీ, డ్రైవింగ్ మీద ఉండవు. ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువ.  కాబట్టి, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఏవిధంగానైనా సరే,   ఫోను మాట్లాడటం ప్రమాదకరమే. 

ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో!

డ్రైవింగ్ లో  సెల్ వాడకుండా ఉండటానికి నా దగ్గర కొన్ని ఆలోచనలు ఉన్నాయి.

  1. సెల్ ఫోనులు హమేషా దగ్గరలో ఉన్న టవరుకు సిగ్నల్ పంపి(Send) మళ్ళీ తీసుకుంటూ(Receive) ఉంటాయి. అంటే ఒక సెల్ ఫోన్ ఒక టవర్ ప్రాంతంలో ఉండగా, మరో టవర్ ప్రాతానికి వెళ్ళే లోపల ఒక టవర్ నుంచే ఈ సిగ్నల్ పంపిణీ పనిచేస్తుంది. 
  2. ఒక వ్యక్తి వాడే సెల్ ఫోన్,  ఒక టవర్ నుండి మరో టవరుకు తన సిగ్నల్ పంపటం మధ్య ఉండే వ్యవధిని లెక్కగట్, టి ఆ సెల్ ఫోన్ ఎంత వేగంగా ప్రయాణిస్తున్నదో  గమనించి, ఆ వేగం ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే, ఆ సెల్ ఫోను నుంచి కాల్స్ వెళ్ళటం కాని, రిసీవు చేసుకోవటం కాని  లేకుండా ఆపేసే ప్రత్యెక ఏర్పాటు చెయ్యాలి. అలాగే ఒక టవర్ పరిధిలోనే ప్రయాణిస్తున్నా కూడా, ఆ సెల్ ఫోను కదలిక వేగాన్ని ఆ టవర్లో పసిగట్టే ఏర్పాటు చెయ్యాలి. ఈ ఏర్పాటును ఓవర్ రైడ్ చెయ్యటానికి ఏ విధయమైన అవకాశమూ ఫోనులో ఇవ్వకూడదు.   ఈ విషయంలో టెక్నికల్ గా తెలిసిన వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది.
  3. సరే, మాకు అబ్బో ఎంతో జరూరు పనులు ఉంటాయి అనుకునే వాళ్ళ కోసం ఏర్పాటు ఏమంటే, వాళ్లకు ఇన్వర్డ్ కాల్ వస్తుంటే, ఒక్క ప్రత్యెక మైన బీప్ రావాలి . ఆ బీప్ రాగానే అది వాళ్లకు ఒక ఇన్వర్డ్ కాల్ వస్తున్నట్టు సంకేతం అన్న మాట. అప్పుడు వాళ్ళు ప్రయాణిస్తున్న వాహనాన్ని పూర్తిగా ఆపితేనే, వాళ్ళు ఆ ఇన్వర్డ్ కాల్ తీసుకోగలగాలి. 
  4. అలాగే, ఒక వ్యక్తికి మనం కాల్ చేస్తుంటే, ఆ వ్యక్తి అప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటే (ప్రయాణం చేస్తున్నదీ లేనిదీ పాయింటు 1  లో సెల్ టవర్ కు  తెలుస్తుంది), మనకు ఒక మెసేజీ రావాలి, ఆ వ్యక్తి ప్రయాణం లో ఉన్నాడు, కాసేపాగి చెయ్యండి. మరీ అర్జెంటు అయితే, ఫలానా  బటన్ నొక్కండి. అలా నొక్కగానే పైన చెప్పిన బీప్ ఆ వ్యక్తికి వస్తుంది. అతను వాహనం ఆపి ఆ ఇన్వర్డ్ కాల్ తీసుకుంటాడు.
  5. ఈ వ్యవహారంలో, ప్రయాణిస్తున్నప్పటికీ, డ్రైవ్ చెయ్యకుండా వెనుక కూచున్న వాళ్లకి, లేదా రైలు/బస్సు లో ప్రయాణిస్తున్న వాళ్లకి ఏవిధంగా అడ్డంకి కాకుండా ఉండాలి అని  చూడాలి.ఈ పాయింటు కొచెం కష్టమైనది. కానీ ఆలోచిస్తే ఉపాయం దొరక్కపోదు.
ఒక దురలవాటును, పైగా ఆ దురలవాటున్న వ్యక్తికే కాదు, ఆ వ్యక్తివల్ల ఇతరుల ప్రాణానికి కూడా ముప్పు ఉన్నప్పుడు, ఆ విషయం మీద తప్పనిసరిగా ఒక విస్తృతమైన చర్చ జరిగి, అటువంటి ప్రమాదాలు జరగకుండా ఆపే ఉపాయాలు కనుక్కోవాలి కానీ,  ఆ దురలవాటును సమర్ధిస్తూ పిడివాదాలు చెయ్యకూడదు.






 




4 కామెంట్‌లు:

  1. అత్యాస పడుతున్నట్టుందే! :) మనం మారం,ఎన్ని జరిగినా,ఎంత జరిగినా!!

    రిప్లయితొలగించండి
  2. మీ ఆలోచన ఆసక్తికరంగా ఉంది. TRAI వారికి సూచించండి.

    చాగంటి వారి గురించి మీరు రెండు పోస్ట్ లు వ్రాసినట్లు ఈరోజు "మాలిక" లోనూ, "శోధిని" లోనూ కనబడుతోంది. కానీ క్లిక్ చేస్తే మీ బ్లాగ్ లో ఈ క్రింది విధంగా చూపిస్తోంది.

    // "క్షమించండి, ఈ బ్లాగ్‌లో మీరు వెతుకుతున్న పేజీ లేదు." //

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ సంతృప్తికరంగా రాక ఆ వ్యాసాలను తొలగించాను. మళ్ళీ వ్రాయాలి.

      తొలగించండి
  3. చాల స్ఫూర్తి దాయకం వ్యాసం . ప్రస్తుతం ఇలా చెప్పగలిగే వారు (వ్రాసే) లేరు . ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.