అమరావతి కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అమరావతి కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, మే 2010, బుధవారం

అమరావతి కథలు మరో ఆరు కథలు

ఒకసారి తరచి చూసుకుంటే అమరావతి కథలు ఈ మధ్య వ్రాయలేదని అనిపించింది. వెను వెంటనే, ఒక ఆరు కథల గురించి మునుపు తెలుగు వికీపీడియాలో వ్రాసినవి ఇక్కడ మళ్ళి ప్రచురించాను . ఇంతటితో నేను వికీలో అమరావతి కథల గురించి వ్రాయటం ఆపేశాను. మిగిలిన కథలను కాల క్రమెణా వీలును బట్టి నా బ్లాగులోనే వ్రాసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను.


అమరావతి కథలకు ఉన్న ముఖ్య లక్షణాలలో మొదటిది, మళ్ళి మళ్ళి చదివించగల శక్తి. ఒకసారి చదివి చూడండి.

31.మాయ

  • ముఖ్య పాత్ర -చిల్లరకొట్టు సుబ్బయ్య
  • బాపు బొమ్మ -ఇనప్పేట్టె కింద పడి పడి ఉన్న మనిషి, అంత బరువు మీద పడి కూడ చేతిలోని నోటును వదలని ఆ మనిషి చెయ్యి. కథలోని సుబ్బయ్య ఎంతటి డబ్బు మనిషో, డబ్బుకి అతని ప్రాణానికి ఉన్న లంకె ఎంత గట్టిదో బొమ్మ చక్కగా వ్యకపరుస్తున్నది.
  • కథ -చిన్నతనంలో సుబ్బయ్య మరమరాలు అమ్ముకుని బతుకినా, అంచెలంచెలుగా పెద్దవాడయి ఒక చిల్లరకోట్టు, ఆ కొట్టు మీద సంపాదనతో రెండిళ్ళు, చాలా రొక్కం సంపాయించుకున్నాడు. కాని మనిషికి దబ్బుయావ ఎక్కువవటంచేత, పెళ్ళాన్ని, కొడుకులను కూడ నమ్మకపోగా, సరైన తిండి కూడ తాను తినడు వారినితిననివ్వడు. చిల్లరకొట్టు సంపాదనతో పాటు తాకట్టులు, అప్పులు మీద కూడ సంపాదన. కాని చివరకు ఒకరోజురాత్రి బాగ ఆకలివేసిన సుబ్బయ్య వంటింట్లొకెళ్ళి తినటానికె ఏమైనా ఉన్నదేమో అని వెదుకుతుంటే, తన పెళ్ళాం పిల్లలు తనకు మాత్రం పచ్చడి కూడు పెట్టి వాళ్ళు పప్పు కూరలు చేసుకు తింటున్న విషయం అతనికి తెలుస్తుంది. ఆ దెబ్బతో "పెళ్ళాం పిల్లలు మాయ!, మాయ! మాయ!" అని గొణుక్కుంటూ డబ్బు సంచులూ, ప్రాంసరీ నోట్లూ గుడెలకి హత్తుకుని ప్రాణావిడుస్తాడు. డబ్బు మనిషికి అందరూ దూరమే, డబ్బు అతని వెంటరాదు. ఈ విషయం తెలియ వచ్చేసరికి, జీవితలో ఆలస్యం అయిపోతుంది . ఈ జీవిత సత్యాన్ని, తన చక్కటిశైలిలో రచయిత తన చిన్న కథలో ఇమిడ్చారు.

32.నివేదన

  • ముఖ్య పాత్ర -కోటిలింగం
  • బాపు బొమ్మ -దేవుని ముందు తనకు తానే హారతి అయిపోయినట్టుగా కోటిలింగాన్ని చిత్రణ, కథలో అతనుతన్ని తాను నివేదించుకున్న విషయం సూచన ప్రాయంప్రాయం.
  • కథ - కోటిలింగం తన భార్య అరోగ్యం కోసం మొక్కుకుంటాడు. కాని అమె దక్కక కోటిలింగం దాదాపుపిచ్చివాడయిపోతాడు. ఆ పిచ్చిలోనె మహశివరాత్రి నాడు పరమేశ్వర దర్శనంకోసరం వెళ్ళి అక్కడ జనసందోహంలో దర్శనం దొరక్క గుళ్ళో అభిషేకం పూర్తయ్యేప్పటికి గుడి బయట మరణిస్తాడు. అతని మరణాన్ని, అతని చేతిలోని కొబ్బరికాయ టప్ మని పగిలి రెండుగా విడిపోయింది అని వ్రాసి సూచించారు.

33.ధర్మపాలుడు

  • ముఖ్య పాత్రలు -మున్సబు హనుమయ్య
  • బాపు బొమ్మ -పెద్ద పెద్ద మీసాలతో హనుమయ్య, అతని మీసాలకు త్రాసులు అతని ధర్మ పాలనకు నిదర్శనం
  • కథ -ధర్మాన్ని పాలించేవాడు ధర్మపాలుడు. హనుమయ్య ఒక పరగణాకు మున్సబు. సిస్తులు వసూలుచెయ్యటంలో అతని నేర్పు, అతని న్యాయ వర్తనకు చక్కటి ఉదాహరణలివ్వ బడ్డాయి కధలో. ఒకానొకసంవత్సరం పంటలు సరిగా పండక శిస్తు వసూళ్ళు బాకీ పడతాయి. పైఅధికారి వచ్చి శిస్తు కట్టని వారినిశిక్షించాలంటాడు. గ్రామీణులతోపాటు, తనని కూడ కట్టెయ్యమని, వారిని కొట్టినట్టు తనని కూడ కొట్టమని అధికారికి విన్నవించుకుంటాడు. మా దగ్గర డబ్బుల్లేవు కాని దెబ్బలకు సిద్ధమేనయ్యా అని ఆ అధికారికి తన న్యాయ వర్తనద్వారా ఉన్న విషయం తెలియచెప్తాడు. ఆ అధికారి, ఆ సంవత్సరానికి శిస్తు మాఫీ చేయిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. హనుమయ్య పాత్రద్వారా పరిపాలనా దక్షత గల ఒక అధికారి ఎలా ఉండాలో చక్కగా చెప్పించారు రచయిత.

34.నాన్న - నది

  • ముఖ్య పాత్రలు -సీతయ్య, అతని తండ్రి
  • బాపు బొమ్మ -మూడు తరాలుగా ఉన్న పురుషాకృతులు కృష్ణా నదీ ప్రవాహంగా వెయ్యటం చక్కగా ఉన్నది. కధా వస్తువను బొమ్మలో చక్కగా చూపించారు.
  • కథ - సీతయ్య తండ్రి మరణించినాక, అతను పడిన దు:ఖం, తన తండ్రితో అనుబంధపూర్వక పాత జ్ఞాపకాలదొంతర, ఈ కథలో ముఖ్యాంశాలు. చివరలో సీతయ్యకు తన తండ్రి మీద ఇంత దిగులు పడుతుంటే, తటాలున తాను కూడ, తన పిల్లలకు తండ్రే అని తడుతుంది. తన తండ్రి తనకు ఎలా మార్గదర్శనమిచ్చాడో అలాగే తానుకూడా, తన పిల్లపట్ల తన బాధ్యత నిర్వర్తించాలన్న విషయం అవగతమయ్యి కొంత స్వాంతన పడతాడు . దాదాపు అందరి జీవితాలలోను ఎదురయ్యే సంఘటనలను, జీవిత సత్యాలుగా తీర్చి, సందేశాత్మకంగా కథారూపమిచ్చారు రచయిత.

35.కీలుగుర్రం

  • ముఖ్య పాత్రలు- ఎవరూ లేరు
  • బాపు బొమ్మ- కీలుగుర్రం మీద ఉన్న పరమేశ్వరుడు చేతిలోని చర్నాకోలతో అర్చకుడు సూరయ్యను దెబ్బవేస్తున్నట్టు, ఆ పక్కనే బూబి , కధాంశానికి దర్పణం
  • కథ - ఈ కథ కూడ అమరావతి గుళ్ళో జరిగే సంరంభాలలో ఒకటైన కీలుగుర్రం ఉత్సవం గురించి. పాపంచేసినవాడు అర్చకుడైనా సరే దేవుడు క్షమించడు అన్న విషయం చెప్పబడింది. అటువంటి ఊరేగింపులలో, గ్రామ ప్రాంతాలలో జరిగే హడావిడి యావత్తూ కళ్ళకు కట్టినట్టు వర్ణించబడినది.

36.అచ్చోసిన ఆంబోతులు

  • ముఖ్య పాత్రలు-ఆంబోతు, వీరడు
  • బాపు బొమ్మ- అచ్చోసిన ఆంబోతు మీద వీరడు ఊరిలోని దుర్నీతిపరులను హడలెత్తిస్తున్నట్టు
  • కథ-ఊళ్ళొ జరిగే అన్యాయాలకు, నోరులేని జంతువైనా, అచ్చోసిన ఆంబోతుగా తీవ్రంగా స్పందిస్తూ, అన్యాయపరుల పని పడుతుంటుంది. వీరడు రౌడీ, తాగుబోతు గా పిలవబడుతున్నా, దుర్మార్గులను అదిలించిబెదిరించి తెచ్చిన సొమ్ము బీదవాళ్ళకు ఆ దుర్మార్గుల చేతులో దెబ్బతిన్నవారికి పంచిపెడుతూంటాడు. ఈఇద్దరూ కలసి ఊరిలోని దుష్టుల ఆటలు ఎప్పటికప్పుడు కట్టిస్తూ ఉంటారు. ఆందుకనే, కథ పేరు ఏకవచనంలో కాకుండా బహువచనంలో ఉన్నది!! "అల్లుడికి అన్నం పెట్టి తను పస్తుండాలి", "తాతలు సంపాదిస్తే మేమంతా మీ దగ్గరకు ఎందుకు వస్తామండీ?" వంటి వ్యాక్యాలు కథలో అతి తక్కువ మాటలతో ఎంతో చెప్పినాయి.
మిగిలిన కథల గురించి వీలుని బట్టి ప్రచురించటం జరుగుతుంది

23, అక్టోబర్ 2009, శుక్రవారం

అమరావతి కథల సమీక్ష 6

అమరావతి కథలకు ఉపోద్ఘాతమా!! అని అనిపించి, ఈరోజున మరో ఐదు కథల గురించి ఇక్కడ ఉంచటం జరిగింది. కథలను చక్కగా వ్రాయగల శక్తి ఉన్నా రచయిత సత్యంగారు
26.భోజన చక్రవర్తి
ముఖ్య పాత్ర-అప్పంభొట్లు
బాపు బొమ్మ-అప్పంభొట్లు పీటమీద దిట్టంగా కూచుని, తన ముందు విస్తట్లోకి వడ్డించబడుతున్న భక్ష్య భోజనాలను ఆరగిస్తున్నట్టు వేశారు. సామాన్యంగా ఒక బొమ్మలోని వస్తువులు గాని, మనుషులు గాని ఒకే నిష్పత్తిలో వేయటం జరుగుతూ ఉంటుంది. కాని ఈ బొమ్మలో, అప్పంభొట్లును చాలా పెద్దగాను, బొమ్మలోని మిగిలినవి-వడ్డిస్తున్న మహిళ, భోజ్య పదార్ధాలు-అతని లో సగంకూడ లేనట్టు వేసి, అప్పంభొట్లు తిండి పుష్టి ముందు ఇతరాలన్నీ కూడ తీసికట్టు అని సూచించారు.
కథ-తిండి పుష్టి గల అప్పంభొట్లు అనే వ్యక్తి కథ వినోదాత్మకంగా చెప్పబడింది. అతని "తినగల శక్తి" కి ఉదాహరణగా మూడు సంఘటనలు వర్ణించబడినవి. ఆ వర్ణనలో చక్కటి హాస్యం తొణికిసలాడుతుంది. అప్పంభొట్లు తిండిపోతుకాదని అతని తినే పద్దతే అంతని తెలుస్తుంది. అతను తిని ఊర్కోడు, దానికి తగినంత శ్రమ కూడ పడి తిన్నదానిని హరాయించుకోగల శక్తి చూపిస్తాడు. గ్రామంలో ఇతరులకి అంతో ఇంతో సహాయపడుతూ తన జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. తన తదనంతరం, తన తద్దినానికి తిండి పుష్టి గల భోక్తలను పెట్టమని చివరికోరిక కోరతాడు తన కొడుకుతో. "తండ్రిలాంటి తిండి పుష్టి ఉన్నవాడు కన్పించలేదు. ఉన్నా, అలా పెట్టగల తాహతూ కుదరలేదు. అతని మనవలకీ, మునిమనవలకీ అప్పంభొట్లు ఆహారలీలలు చెప్పుకోవటమే మిగిలింది" అని చెప్తూ ముగించి, తరాలు మారేటప్పటికి వచ్చి పడిన జీవనవిధాన మార్పు సూచించారు రచయిత.

27.నావెళ్ళిపోయింది
ముఖ్య పాత్రలు-పడవ వాడు రంగయ్య, వ్యాపారి సుబ్బయ్య
బాపు బొమ్మ-సుబ్బయ్య నోరు పెద్ద సుడిగుండంలాగానూ, అందులో రంగయ్య అతని పడవ లోపలకు లాగబడుతున్నట్లు వెయ్యబడింది.
కథ-అమరావతి నుండి ఆవలి గట్టుకి కృష్ణా నదిమీద పడవ నడుపుకునే రంగయ్య జీవనం ఈ కధాంశం. అతను, అమరావతి గ్రామ ప్రజల మధ్య మనిషిగా వారి నవ్వులూ, కన్నీళ్ళూ పంచుకుంటూ వారి జీవితాలలో కలసిపోయి బతకటం చక్కగా సంఘటనాపూర్వకంగ చెప్పబడింది. వ్యాపారి సుబ్బయ్యకు తన తండ్రి చేసిన అప్పు ఏరోజుకారోజు సంపాదనలోనుండి జమవేసి మిగిలిన దాంతో తన బతుకు లాక్కొస్తుంటాడు రంగయ్య. వ్యాపారి సుబ్బయ్య దౌర్జనంగా రంగయ్య పడవను తన దొంగవ్యాపారానికి వాడుకోవటమే కాక, తన దొంగ సరుకు బయటబడినప్పుడు, తనను రంగయ్యే బయటపెట్టి ఉంటాడన్న భ్రమలో అతని మీద పగ బట్టి, అతని పడవను అప్పుకింద జమచేసి బలవంతంగా తీసుకునె వెళ్ళిపోతాడు. "ఇంతకాలం అందర్నీ ఆవతలొడ్డుకు చేర్చాను. బగమంతుడు నన్నీ వొడ్డునే వొదిలేశాడా!" అని రంగయ్య కుమిలి పోయ్యాడు అని చెప్తూ కథ ముగించారు రచయిత.

28.నీరు నిలవదు
ప్రధాన పాత్రలు-ఊరిలోని అమ్మలక్కలు
బాపు బొమ్మ-కృష్ణానదిలో నిలబడి గుంపులు గుంపులుగా, నీళ్ళు తెచ్చుకుంటూ, బట్టలుతుక్కుంటూ, స్నానంచేస్తూ కబుర్లాడుకుంటున్న మహిళలు. నదీ ప్రవాహం, వారు నుంచున్నంతమేరా మకిలిగాను వారిని దాటిన తరువాత శుభ్రంగాను ఉన్నట్టుగాను వేసి, కథలోని రచయిత చెప్పదలచిన విషయ్యాన్ని చూపించారు
కథ-ఉదయాన గ్రామ మహిళలు రకరకాల పనులకోసం కృష్ణానదిని చేరి, అక్కడ వారు ఆడుకునే మాటలే ఈ కథ. ఆ మాటల్లోంచి రచయిత చేయించిన వారి అంతరంగ దర్శనం కథ ఉద్దేశ్యం. ఒకళ్ళ మాట మరొకరు చొరబడకుండా,ఒకరిమాటకు మరొకరు అడ్డొస్తూ, ఒకరు చెప్పిన విషయాన్ని మరొకరు ఖండిస్తూ, అక్కడలేనివారి గురంచి చెప్పుకోవటం, కొంత కావాలని, మరికొంత సహజంగా ఏదైనా వార్త ఒకరినుంచి మరొకరి వచ్చేటప్పటికి ఎలా మారి వికృతరూపం చెందుతుందో సోదాహరణ పూర్వకంగా చెప్పబడింది. ఎవరెన్ని కబుర్లు చెప్పుకున్నా అవేమీ కాలగమనంలో నిలిచేవి కావని నదీ ప్రవాహ గమనంలో కలసి పోతాయని కాని వాటి రుచే మిగులుతుందని తేల్చి చెప్పి కథ ముగిస్తారు రచయిత.

29.ఎంగిలా?
ముఖ్య పాత్రలు-రామశాస్త్రి, శ్రీదేవమ్మ
బాపు బొమ్మ-పరమేశ్వరుని అర్ధనారీశ్వర రూపంలో వేసి, ఆరూపంలోని శివుని రామశాస్త్రి, పార్వతీ దేవిని శ్రీదేవమ్మ మొక్కుతున్నట్ట్లు వేసి కథలో వారు తమ అమాయకత్వంలో పార్వతీ పరమేశ్వరులను వేరువేరుగా భావించి విడివిడిగా పూజించటం సూచించారు. అదేవిధంగా, భార్యా భర్తలు పార్వతీ పరమేశ్వరుల లాగ జీవించాలని మరొక చక్కటి భావనను కూడ స్పురింపచేశారు.
కథ-సాంసారిక విషయాలమీద ఎంత మాత్రం దృష్టి సారించక దైవ ప్రార్థనే పరమావధిగ ఒకరు శివుని, మరొకరు పార్వతీ దేవిని పూజిస్తున్న నవ దంపతుల కథ ఇది. ఈ కథలో వారిద్దరూ సాంసారిక జీవనం వైపుకు మళ్ళిన విధానం ఐదు మన్మధ బాణాలుగ వర్ణించటం (ముళ్ళపూడి వెంకటరమణ కనిపెట్టినవి ఈ బాణాలు)ఒక చక్కటిప్రక్రియ.శివపార్వతులే ఏక శరీరంగా ఉండి భార్యా భర్తలు ఉండవలసిన విధానం సూచిస్తున్నప్పుడు, భర్త ముద్ద నోటికి అందిస్తున్నప్పుడు, "ఎంగిలి కాదో" శ్రీదేవమ్మ అని అనటం "ప్రసాదమనుకోరాదో అని రామశాస్త్రి తానప్పుడప్పుడే అర్ధం చేసుకుంటున్న విషయాన్ని చమత్కరించి తెలియ చెప్పటం కథకు పెట్టిన పేరు "ఎంగిలా?" అన్న ప్రశ్నకు సమాధానంగా ఉన్నది.

30.బాకీ సంగతి
ముఖ్య పాత్రలు- రంగయ్య, పంతులు
బాపు బొమ్మ- రంగయ్యనే కాడెద్దుగా కట్టి దున్నిస్తున్న పంతులు. చిన్న రైతులను ఏ విధంగా పీడించి పిప్పి చేస్తున్నరో, కధా విషయాన్ని చక్కగా చూపించారు బాపు.
కథ రంగయ్య తన తండ్రి చేసిన అప్పును ప్రతి సంవత్సరం చెల్లు వెస్తూనే ఉంటాడు. అయినా సరే బాకీ మొత్తం కట్టలేదని, పంతులు అతని ఎద్దుల్ని జప్తు చేసి పట్టుకొని పోతాడు. తన ఎద్దులు లేక పొవటంతో వ్యవసాయం ఎలా కొనసాగించలో అన్న ఆరాటంతో పంతులు మీద మండిపడుతూ అతని ఇంటి ముందు నుంచుని కేక వేస్తాడు రంగయ్య. కథలో సంభాషణలు చాలా తక్కువ. రంగయ్య ఆక్రోశంతో, కోపావేశంలో తనలో తను అనుకునే మాటలు, అపరాధభావంతో ఉన్న పంతులు మనసులోని భావనలతో రచయిత కథ నడిపారు.కథ చివరలో, ఎద్దుల్ని వదిలి పెడుతూ పంతులు అన్న విషపు మాటలకు ("...... మీ నాన్న చేసిన బాకీ కదా!పూర్తి చేస్తే చచ్చిన ఆయన ఆత్మ శాంతిస్తుందని ... సరే ...ఇచ్చినంతే చాలు...ఇవ్వని వాళ్ళని పీడిస్తానా"), రంగయ్య అమాయకంగా "ఎప్పటికిమల్లే బాకీ జమేసుకోండయ్యా! మా అయ్య బాకీ తీర్చకుండా ఉంటానా?నేను పోతే నా కొడుకు చేత బాకీ తీర్చేట్టు వొట్టేయించుకుని పోతానయ్యా!" అని సమాధానమిస్తాడు. ఈ ఉదంతాన్ని హృదయాన్ని హత్తుకునేట్లు రచించి, రైతులను తర తరాలుగా పీడిస్తున్న నీచులు పరివర్తన చెందుతారేమో అని రచయిత ఆశపడినట్టు కనిపిస్తుంది.

17, అక్టోబర్ 2009, శనివారం

అమరావతి కథలు సమీక్ష 5


పండుగలు, పండుగ రోజున పొద్దున్నే తలంట్ల హడావిడి, తరువాత కొత్త బట్టల ధరించటం ఆ కొత్త బట్టల్లో మురిసిపోతూ చుట్టాలింటికి, స్నేహితులదగ్గరకి వెళ్ళటం, ఎంత హాయి అయిన రోజులు-దాదాపు పది, పదిహేను సంవత్సరాలు వచ్చేవరకు ఉంటుంది ఈ అమాయకమైన సంతోషం, ఆనందం. ఆ తరువాత ఏమౌతుందో మరి కనపడదు మాయమైపోతుంది. కారణం, ఎవరికివారికి తనంతట తానుగా అలోచించగలుగుతున్న విషయం తెలియటమా, లేక రేపొకరోజు ఉన్నది, ఇలాగే గడిపెయ్యలేము అన్న నిజం గ్రహింపుకు రావటమా, కొద్ది కొద్దిగా నాది, నేను, లాంటి అలోచనలు చిగురించటమా, లేక వీటన్నిటి కలగలుపా? తెలియదు!!! కాని, ఆనాటి ఆనందాలను మళ్ళీ మళ్ళీ నెమరేసుకుంటూ ఉంటే ఎంతో ఉత్తేజం హుషారు కలుగుతుంది కదూ. అలాంటి అవకాశాలను అమరావతి కథలు అనేకసార్లు కలుగ చేస్తాయి. ఈ దీపావళి పండుగ శుభ సందర్భంగా హాయిగా చదివి ఆనందించుదురు గాక.

ఈ దీపావళీ సందర్భంగా,లక్ష్మీ దేవి మీ అందరిమీద తేజోమయమైన ఆశీస్సులు కురుపించాలని ఆకాక్షిస్తూ, జయదేవ్ గారు నామీద ప్రేమతో పంపిన కార్టూన్ శుభాకాంక్షలను మీ అందరితో పంచుకుంటూ మరొక్క ఐదు "అమరావతి కథలు" అనేటువంటి "మణిపూసలు".

21.లేగదూడ చదువు
ముఖ్య పాత్రలు-చిట్టి, లేగదూడ
బాపు బొమ్మ-అమాయకంగా చిన్నారి చిట్టి తాను నేర్చున్నాననుకున్న అక్షరాలు లేగదూడకు చూపించబోతుంటే, ఆ అక్షరాలను నాకి చెరివేస్తుంటుంది లేగదూడ. ఈబొమ్మ కొంచెం పెద్దదిగా ఉంటే బాగుండును, ముద్దులొలికే ఈ రెండు ప్రధాన పాత్రలను చక్కగా చూడొచ్చు అనిపించే విధంగా చిత్రించారు.
కథ-గ్రామీణ వాతావరణాన్ని చక్కగా మన కళ్ళముందుంచారు రచయిత. పిల్లలు పొద్దున్నే లేవటం, బడికి వెళ్ళటం, లేగదూడ గంతులు, నాలుగేళ్ళు నిండని చిన్నారి చిట్టి చదువుకోవాలనే తాపత్రయం, చిట్టి-లేగదూడల సాన్నిహిత్యం కథలోని ఆకర్షణలు. గ్రామీణ ప్రాంతంలోని పిల్లల అమాయకత్వం, ముద్దు ముచ్చట్లు ఎత్తిచూపుతూ, చివరలో "బళ్ళోవెయ్యని పసిపాపకటే,నోరులేని లేగదూడకంటే చాలా చదువుకొన్నాం మనం కాని...." అని ముగిస్తూ మానవత్వపు విలువలు మృగ్యమైపోతున్న ప్రపంచంమీద ఒక చురక వేసి ముగించారు.

22.ఆవతలొడ్డు పొంగింది
ముఖ్య పాత్రలు-పిల్లలు
బాపుబొమ్మ-కృష్ణమ్మ తల్లి శిరోజాలే అలలుగా వాటిమీద పిల్లలుతో నిండిన లంక, పైన పూర్ణ చంద్రుడు, పిల్లల వంక మురిపెంగా చూస్తున్నట్టు కృష్ణమ్మ.
కథ-స్థూలంగా, చీకటిపడేప్పటికి లంకలో చిక్కుకుపోయి గాభరాపడుతున్న ఒక అభాగ్యుణ్ణి రక్షించటానికి పిల్ల సైన్యం మొత్తం ఒక పడవను ఎత్తుకుకుని పోయి ఆ లంకలో వాళ్ళూ చిక్కడిపోవటం, వారిని రక్షించటానికి వారి పెద్దలు పడ్డ ఆరాటం, కంగారు, ఇంతాచేసి చివరకు, పిల్లలంతా పెద్దల్ని చూసినాక, తాము తెచ్చుకున్న ప్రమాద పరిస్థితి మర్చిపోయి, ఆటల్లో మునిగి పోవటం, ఒక దృశ్యకావ్యంగా కనపడుతుంది. అప్పటి కాలంలో పిల్లలు "చర్ పట్టి, కుందులు" అనే ఆటలు ఆడుకునేవారని చదువరులకు తెలుస్తుంది. పిల్లల్లో ఉండే సహజ సాహసాసక్తి, పరోపకార బుద్ధి చక్కగా వర్ణంచబడింది.అంత రాత్రిపూట, ఊళ్ళోని పిల్లలూ పెద్దలూ లంకలోకి చేరటమే ఆవతలొడ్డు పొంగటం.

23.మే! మే! మేకపిల్ల
ముఖ్యపాత్రలు-బాలుడు పోలయ్య, గ్రామీణులు
బాపు బొమ్మ-మెడనున్న తాడుతో సహా పారిపోతున్న మేకపిల్ల ఒక పక్క, అమాయకపు ఆనందంతో తెళ్ళిపోతున్న పోలయ్య మరొకపక్క, మధ్యలో నాలిక బైటపెట్టినా రౌద్రం లేని అమ్మవారు, నాకీ బలులు కావాలా అనుకుంటున్నట్టుగా చక్కటి చిత్రం.
కథ-ఇక్కడకూడ సంఘటనా వర్ణనమే కాని, అంతర్లీనంగా జంతుబలుల గురించిన మానవత్వపు వీక్షణ కనపడుతుంది. ముత్తాలమ్మ జాతర్లో తనకు కావలిసిన దానికోసం దేవుడి పేరు చెప్పి గణాచారి గలాభా, ఇదే సందని గ్రామీణులందరూ తప్పతాగటం, గ్రామీణ జాతర విశేషాలను అద్దంపడతాయి. బలికోసం తేబడ్డ మేక మీద జాలిపడి పోలయ్య దానిని వదిలించటం, అది సురక్షితంగా పారిపోవటం చూసి పోలయ్య అనందించటంతో కథ ముగుస్తుంది.

24.కాకితో కబురు
ముఖ్య పాత్రలు-పల్లె పడచు జువ్వి,చింతాలు మామ,
బొమ్మ-జువ్వి చొట్టూ చేరిన కాకులు, ఉడుతలు, ఛిలుకలు. సూచనప్రాయపు బొమ్మ కాదిది, సీదాగా కధాంశ ప్రతిబింబమే.
కథ-ప్రధానాంశం జువ్వి , చింతాలు మధ్య ఉన్న ప్రేమానురాగాలు. చింతాలు కోసం పరితపించి పోతూ, జువ్వి తన మనోభావాలను కాకులతోనూ, ఉడుతలతోనూ, చిలకలతోనూ అమాయకంగా పంచుకుంటూ ఉంటుంది.చింతాలు మావ కోసం దిగులుతో ఏడ్చి, తానేడ్చినట్టు చింతాలుకి తెలియ కూడదని అనుకుంటుంది. ఆర్ధిక పరంగా సమాజంలో అట్టడుగున ఉన్న చింతాలు-జువ్వి ల ఉదాత్త మనోభావాలు, వారి వారి ప్రేమ వ్యక్తీకరణ చక్కగా మలచారు రచయిత.

25.తులసి తాంబూలం
ముఖ్య పాత్రలు-వామనాచార్లు, ఆయన భార్య తాయారమ్మ
బాపు బొమ్మ-తులసి కోటకు చెరొకపక్క ఆకలితో డస్సిపోయి చేరగిలిపడి ఉన్న వామనాచార్లు-తాయారమ్మ దంపతులు
కథ-ఏ రోజుకారోజు భక్తులు ఇచ్చే కానుకలమీద ఆధారపడి జీవించే ఒక పూజారి దీన గాధ. పాదుకల పళ్ళేంలో పడిన ఒక అర్ధరూపయతో ఆరోజు గడుస్తుందని ఆశ పడిన వామనాచారి, ఆ అర్ధ రూపాయ సుబ్బయ్య పాలిట పడటంతో దిమ్మెరపోతాడు. ఆరోజుకి తిండి లేక పోతే తులసి ఆకులే వారికి ఆహారమవుతాయి. దేవుడిచ్చింది తమకింతేనని తృప్తిపడిన ఆ పేద దంపతులకు తులసి తాంబూలంతోనే నోరు పండిందని చెప్పి కథ ముగిస్తారు రచయిత.

14, అక్టోబర్ 2009, బుధవారం

అమరావతి కథలు సమీక్ష 4

పొద్దున్నే స్కూలుకి వెళ్లేముందు, అన్నంలో ఆంధ్ర మాత (అదెనండి గోంగూర పచ్చడి) కలిపి అందులో మీగడో అప్పుడే తీసిన వెన్నో మిళాయించుకుని తింటూ ఉంటే కలిగే ఆనందం, తిన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు అటువంటి అవకాశం ఎక్కడో మారుమూల గ్రామాల్లో తప్పితే లేదు కదా! శారీరక జిహ్వకు కలిగే ఆ ఆనందం తృప్తి, సుఖం మనం ఇప్పుడు కొనుక్కుందామన్నా లేదు. కాని, మానసిక జిహ్వకు అటువంటి, అంతకంటే ఎక్కువ ఆనందం కలిగించేవి అమరావతి కథలు మనకు అందుబాటులోనే ఉన్నాయన్న విషయం ఎవరూ అంతగా గమనించినట్టు లేదు. మానసిక వికాసానికి ఏవేవో విదేశాలనుండి దిగుమతి అయిన పుస్తకాలు వాటి తెలుగు అనువాదాల హోరులో, చక్కటి కథల రూపంలో మానవ జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉంటే అందరూ కలసి సుఖంగా బ్రతక గలరు అన్న విషయాన్ని అలవోకగా తెలియచేసే ఈ కథలు మరుగున పడిపోయాయేమో అనిపిస్తుంది. పెద్దల మాట, చద్దన్నం మూటలని అన్న వాడుకలో ఉన్నా పెద్ద అర్ధం ఏమిటో అని అయోమయంలో ఉన్నవారికి ఆ అర్ధాన్ని చెప్పకుండానే చెప్పగలవు ఈ చక్కటి కథలు. సత్యం శంకరమంచి గారు అతి చిన్న వయస్సులోనే తనను అలరించటానికి ఆ పరమేశ్వరుడు తీసుకుని వెళ్ళిపోవటం తెలుగు సాహితీప్రపంచానికి జరిగిన, తెలుసుకోలేని నష్టం. ఆ అద్భుత రచయితను తలుచుకుంటూ మరో ఐదు కథలు.

16.అన్నపూర్ణ కావిడి
*ముఖ్య పాత్ర-శరభయ్య
*బాపుబొమ్మ-అన్నపూర్ణ తల్లి దగ్గరనుండి ఆహారాన్ని ఆర్తితో స్వీకరిస్తున్న శరభయ్య
*కథ-తల్లి తండ్రులు చూసిన సంబంధం కాదని, పైపై అందం చూసి పెళ్ళిచేసుకున్న అమ్మాయి అతన్ని ఛీత్కరింస్తూంటుంది. భార్య అనురాగం చూరగొనలేని అభాగ్యుడైన శరభయ్య, భార్యతో పడలేక అతను వారణాశి పారిపోవట, ఆ తరువాత "అన్నపూర్ణ కావిడి" వేసుకుని అడుక్కుని తినటం, అప్పటికి, భార్య కాంతం మీద మమకారం చావక అమరావతి తిరిగి వచ్చి, ఆమె ఇక లేదని తెలుసుకుని, ఖిన్నుడై, నిజమైన వైరాగ్యం పొందటం కధలో చక్కగా వివరించారు. చివరలో తన తదనంతరం 'అన్నపూర్ణ కావిడి' కోసం వెంపర్లాడుతున్న అవిటి సిద్ధయ్యకు శరభయ్య ఇచ్చిన సందేశపూర్వక సమాధానం కధకు మకుటం. 'అన్నపూర్ణ కావిడి" అంటే ఏమిటి, ఆ కావిడి వేసుకున్న బైరాగి జీవన విధానం ఎలా ఉంటుంది కళ్ళకు కట్టినట్టు, ఈ విషయం మీద ఏవిధమైన సమాచారం తెలియని ప్రస్తుతపు తరానికి, రచయిత తెలియచేసారు.

17.చెట్టుకొమ్మనున్న కథ
*ముఖ్య పాత్ర-ముక్కంటి
*బాపు బొమ్మ-నది రెండుగా విడివడి తరలివస్తున్న జనానికి దారి ఇస్తున్నట్టు, కదాంశ ప్రతిబింబం
*కథ-సరైన అధారలు లేని చారిత్రకాంశం పుక్కిటి పురాణంగా ఉన్న వివరాలను చక్కటి కథగా వ్రాశి ఉంచారు రచయిత. ముక్కంటి చిన్నతంలో అల్లరి చిల్లరగా తిరుగుతూ తెంపరితనానికి అలవాటుపడి, ఆ తెంపరితనంతోనె ఒక రాజ్యాన్ని స్థాపించటం, తనకు తన భార్యకు వచ్చిన ఒక సున్నిత సమస్య పరిష్కరించినవారిని వారి అవసర కాలంలో ఆదుకోవటం కథ. కథలో "ఆరువేల" కుటుంబాలు కాశినుండి తరలి తెలుగు కోస్తా ప్రాంతానికి రావటం,ఇప్పటికి అదే పేరుతో ఉన్న బ్రాహ్మణ శాఖ మూలాలకు చెందిన కథ కావచ్చుననిపిస్తుంది. అటు ఆకాశం కాక, ఇటు భూమి మీద కాక, ఎటుపడితే అటు గాలికి ఆడే చెట్టుకొమ్మ మీద కథ ఉన్నదంటూనే, రచయిత గడుసుగా అధారాలులేని చారిత్రిక విషయం, పుక్కిటి పురాణం, కట్టుకథ దశనుండి, వ్రాయబడ్డ కథగా మలిచారు.

18.అఖరి వేంకటాద్రి నాయుడు
*ముఖ్య పాత్ర-వేంకటాద్రి నాయుడు
*బాపు బొమ్మ-తాళంచెవులు ఎత్తుకుని అల్లరికి పారిపోతున్న మనవణ్ణి పట్టుకోవటానికి పంచ ఒక చేత పట్టుకుని వడివడిగా పరుగెత్తుతున్న వేంకటాద్రి నాయుడు, కథాంశపు చిత్రం
*కథ-అమరావతి పూర్వపు పాలకుల వంశజుడు రాజ్యాలు, జమీలు అన్నీ పోయినాక కూడ ప్రజలందరి మన్ననలు పొందుతూ జీవించిన విధం కధాంశం

19.ఎవరు పాడినా ఆ ఏడక్షరాలే
*ముఖ్య పాత్రలు-పానకాలు, పరమేశు, పెద్ద దొరగారు, వీరాస్వామి
*బాపు బొమ్మ-సన్నాయిలే ఆయుధాలుగా కొట్టుకుంటున్న పరమేశు, పానకాలు. కథలోని సంఘటనకు హాస్యపూరక చిత్రీకరణ
*కథ-దేవుడి ఊరేగింపులో,గుడి వాయిద్య గాళ్ళు చేసిన గలాభా, వాళ్ళ సంగీత విద్యారాహిత్యం, ఒకళ్ళమీద ఒకరికి పడక, చివరికి వాళ్ళ సన్నాయిలతోనే కొట్టుకోవటం చక్కగా వర్ణించారు. పెద్దదొరగారు గుడి వాయిద్యగాళ్ళకు ఇచ్చిన మాన్యాలకు తగ్గ ఫలితం దేవుడిగుడికి అవసరానికి రాకపోవటం చూసి, వెరొక వాయిద్యగాణ్ణి తయారు చెయ్యటానికి, వీరాస్వామిని తంజావూరు పంపి పదివేలు ఖర్చుచేసి విద్య చెప్పించినా ఫలితం లేక అతని విద్యను ప్రదర్శించటాని ఏర్పరిచిన కచేరి అభాసుపాలు కావటం చూసి దొరగారు హతాశులవటంతో కథ ముగుస్తుంది. కడుపునిండిన బేరం చందంగా గుడి వాయిద్య గాళ్ళ ప్రవర్తన మానవ ప్రవృత్తికి ఒక ఉదాహరణగా రచయిత చెప్పటం జరిగింది.

20.పచ్చగడ్డి భగ్గుమంది
*ముఖ్య పాత్రలు-లచ్మి,రాములుమామ
*బాపు బొమ్మ లచ్మి నెత్తిమీదకు గడ్డి మోపు ఎత్తుతూ సహాయ పడుతున్న రాములుమామను లచ్మి మురిపంగా చూస్తూండటం కథకు భావయుక్తంగా చిత్రించారు బాపు.
*కథ-ఒక పల్లెటూరి పడచు జాలి గాధ. లచ్మి చక్కటి పిల్ల, నలుగురితో కలసిపొయ్యేది, గడ్డికోసి అమ్ముకుంటూ గౌరవంగా తాను బ్రతకటమేగాక, తాగుబోతు తండ్రిని కూడ పోషిస్తూ ఉంటుంది. గడ్డి ధర అడుగుతూ నర్మగర్భంగా "రూపాయేనంటే నీ ధర! ఐదురూపాయలిస్తా తీస్కో" అన్న ఆకతాయి పోలాయికి, కీలెరిగి వాతపెట్టినట్టు "బాబూ గడ్డి గొడ్లకా? మీకా?" అని బదులిచ్చి నోరుమూయిస్తుంది. వయసుగాడైన రాములుమామ లచ్మి ఒకరిమీద ఒకరు మనసుపడ్డప్పటికీ, కట్నం డబ్బులకు బ్రమిసి సీతాలుని పెళ్ళాడ్తాడు రాములు. తాగుపోతు తండ్రి తంత్రంతో అరవై ఏళ్ళ పైబడ్డ ముసలివాడికి మూడో భార్య అయ్యి, ఆరునెలలు తిరగకుండా బొట్టులేకుండా తిరిగొస్తుంది లచ్మి. పచ్చగడ్డిలాగ చక్కగా ఉండవలసిన ఆమె జీవతం ఆవిధంగా భగ్నం కావటమే, "పచ్చగడ్డి భగ్గుమంది" అని పేరు పెట్టడంలోని ఔచిత్యం. "ఇప్పుడా లచ్మి ముఖంలో నవ్వు లేదయ్యా! ఇపుడా లచ్మి ముఖంలో బొట్టు లేదయ్యా! అని అతి తక్కువ మాటలతో గుండేల్ని పిండేసే కరుణరసాన్ని పండించటమే కాక, కథలో మరొక చోట "రంగు రంగుల చీరలు కట్టుకుని రండి!రండి! అని పిలిచే కొమ్మలు" అని వ్రాసి "కొమ్మ" పదానికి " మగువ లేదా స్త్రీ అనే అర్ధం కూడ ఉన్నదని (సామాన్యంగా పద్యాలలో వాడతారలా) చదువరులకు తెలియచేసారు రచయిత.

3, అక్టోబర్ 2009, శనివారం

అమరావతి కథలు సమీక్ష 3

రచయిత శ్రీ సత్యం శంకరమంచి

రాత్రి బాగా పోద్దుపోయినాక, అలా డాబామీద పచార్లు చేస్తూ చల్లగాలి భోంచేస్తుండగా చక్కగా చంద్రోదయమయ్యి, కొబ్బరి ఆకుల మధ్య నుంచి వెన్నెల అందాలు పరికిస్తూ ఉండగా, ఎక్కడినుంచో వినిపించీ వినిపించ నట్టుగా తలత్ మెహమూద్ పాటో, రావు బాలసరస్వతి గానమో, సాలూరి రాజేశ్వర రావు గందర్వ గానమో వినిపిస్తే కలిగే ఆనందం చెప్పనలవి కానిది. అంతటి ఆనందం కలగచేయగలవు అమరావతి కథలు, పైన చెప్పిన హంగులేమీ లేకుండానే.

ఈవేళ మరొక ఐదు కథల గురించి.

11.ధావళీ చిరిగిపోయింది
ముఖ్య పాత్రలు-అవధాన్లుగారు, ఆయన భార్య సోమిదేవమ్మ, ఆయన కుమారుడు పేరిశాస్త్రి
బాపు బొమ్మ-తల్లి దగ్గర చాలా అనందంగా పాలు తాగుతున్న బాలుడు, పాలు తాగుతూ ఒక కాలు విలాసంగా తల్లి నడుంమీద వేయబోవటం బొమ్మకు తెచ్చిన అందం, కథాంతంలోని కొసమెరుపుకు అద్దం.
కథ-ధావళీ మడి కట్టుకుని పూజ చేసుకోవటానికి వాడే ఒక వస్త్ర ధారణ. ఒక తరం నుంచి వేరొక తరానికి వచ్చిన అంతరం సూచిస్తూ, కథకు "ధావళీ చిరిగి పొయ్యింది" అని పేరు పెట్టడం సముచితంగా ఉన్నది.పండిత పుత్ర:, పరమ శుఠ: అన్న నానుడి నిజంచెయ్యటానికి, వేద పండితుడయిన అవధాన్లు గారి కుమారుడు, పేరిశాస్త్రి శతవిధాలాప్రయత్నించటం, తన కుమారుడి హీనస్థితి భరించలేక కుమిలిపోతూ అవధాన్లు గారు మరణించటం, ఈ విధంగా చూస్తే, కథ చాలా సూక్ష్మం. కాని, కథ చెప్పిన తీరు, కథలో పాత్రలచేత పలికించిన సంభాషణలు, రచయిత చెప్పదలుచుకున్న విషయాన్ని, స్పుటంగా తెలియచేస్తాయి. "అయ్యో! అయ్యో! మాలవాణ్ణి ముట్టుకుంటారుటండీ? అన్న భార్యతో అవధాన్లు గారు "పట్టు నీకూ పెడ్తాను వీబూది......నీకీ రోగం పోవటానికి" అనటం కథలోని ముఖ్య సందేశం. తన తండ్రి మరణ వార్తను తెలుపుతున్న సమయంలో, పేరిశాస్త్రి,తన తల్లి స్పర్శతో మామూలు మనిషయినట్టు, మారినట్టు సూచిస్తూ కథ ముగుస్తుంది.

12.రాగిచెంబులో చేపపిల్ల
ముఖ్య పాత్ర
-సుబ్బమ్మగారు, అమె భర్త సత్యనారాయణగారు
బాపు బొమ్మ- శివుని తలమీదున్న గంగ భూమ్మీద పడుతున్నట్టు, అందులో ఓ చేపపిల్ల కూడ ఉండటం చూసిన సుబ్బమ్మగారు అదెక్కడ తనమీద పడుతుందోనన్న భయంతో తప్పుకు పోతున్న భంగిమను, పరమేశ్వరుడు ఓరకంట చిలిపిగా గమనిస్తూ ఉండటం, కథ మొత్తాన్ని చెప్తుంది.
కథ-సుబ్బమ్మగారు తన మడి అతి చాదస్తంతో తాను బాధపడటమే కాక తన భర్తను కూడా బాధపెడుతుండటమే కధాంశం. భక్తి పేరిట లేదా మడి పేరిట ఆ కాలంలో కొంతమందిలో పెచ్చరిల్లిన పిడివాద చాదస్తాన్ని హాస్యభరితంగా ఎత్తిచూపి ఎద్దేవా చేయటం జరిగింది. "అందుకేనేమో రామయ్యగారి కర్రి ఆవు తనని పొడవటానికి వస్తుంది" అని సుబ్బమ్మగారి చేత అనిపించి, వేర్పాటు కారకమైన చాదస్తపు మడి/భక్తి, దేవుడుకూడ హర్షించడని, స్పురింపచేశారు రచయిత.

13.అద్గద్గో బస్సు
ముఖ్య పాత్రలు-గ్రామీణులు, జట్కా సాయబు
బాపు బొమ్మ-కొత్తగా వచ్చిన బస్సు యాంత్రిక గుర్రాలతో ఒక నదీ ప్రవాహంలా దూసుకుని పొబోతుంటే, ఒక బక్కచిక్కిన జట్కా గుర్రం ముందుకు వంగబడి, బలహీనంగా దిగులుగా ఆ బస్సువంక చూస్తూ,కథావిషయమైన కొత్త నీరు వచ్చి పాత నీరుని కొట్టేయటాన్ని సూచిస్తుంది.
కథ-ఒక సంఘటన వర్ణన. అమరావతి గ్రామంలోకి మొట్టమొదటిసారి బస్సు వచ్చినప్పుడు (20వ శతాబ్దపు మొదటి రోజులలో) ఆ సంఘటన గ్రామీణుల మీద చూపిన ప్రభావం, ఈ యాంత్రిక జీవన విధానపు మొదటి మెట్టు జట్కా సాయబును ఎలా మొట్టిపడేసిందో వివరించబడింది. కథ చివరిలో, జట్కా సాయబు అక్కసు పట్టలేక ఎవరూ చూడకుండా తన చండ్రకోలతో బస్సు మీద ఒక్క మీకు పీకుతాడు ఆ శబ్దానికి ముసలి గుర్రం చెంగున పరెగెత్తటంతో ముగుస్తుంది.

14.పువ్వుల్లేని విగ్రహాలు నవ్వాయి
ముఖ్య పాత్రలు-పెద్దయ్యగారు, ఆయన కొడుకు నారాయణ
బాపు బొమ్మ-పరమేశ్వరుని వొళ్ళో కూచుని నారాయణ అమ్మవారికి అలంకారం చేస్తున్నట్టు, అందుకు పరమేశ్వరుడు తనవంతు సహాయం చేస్తున్నట్టుగా వేశారు. అయ్యవారి వొళ్ళొ భక్తుడు అమ్మవారి అలంకారం చేస్తూండటం చక్కటి భావన.
కథ-రచయిత సంఘటనా వర్ణన మీద ఎక్కువ మక్కువ ఉన్నట్టు ఈ కథా సంపుటిలో అనిపిస్తుంది. సంపుటిలొ ఆ పంథాలో రచన చేయబడిన కథలు ఎక్కువ ఉన్నాయి. శివరాత్రి ఉత్సవాలకు ఊరేగింపుకు విగ్రహాలను తయారు చెయ్యటం, ఆ తరువాత జరిగిన ఊరేగింపు కథలోని ముఖ్య సంఘటన. పెద్దయ్యగారు గుడి అర్చకులలో పెద్ద. ఆయన విగ్రహాలను ఊరేగింపుకు అలంకరిస్తుంటే, ఆయన ఆరేళ్ళ కొడుకు నారాయణ తాను కూడా చేస్తానని, తండ్రి ఒళ్ళో కూచుని అలంకారం చెయ్యటానికి ప్రయత్నించటం, చివరకు అతని వల్ల అసలు పని చెడుతుండటం చూసి, పిల్లవాణ్ణి పక్కన కూచోపెట్టి, పెద్దయ్య అలంకారం పూర్తి చెయ్యటం, నారాయణ ఆ అలంకారమంతా తానే చేసినట్టు భావించి పరమానందభరితుడవటం అకట్టుకునేవిధంగా రచించారు.

15.పందిరిపట్టి మంచం
ముఖ్య పాత్రలు-చినముత్తెం, బుల్లిరామయ్య
బాపు బొమ్మ-ఇది నిజంగా బాపు బొమ్మే. ఎవరైనా అందమయిన స్త్రీని "బాపు బొమ్మ"లా ఉన్నది అని వర్ణించటం ఒక వాడుక. చినముత్తెం చిత్రాన్ని చాలా అందంగా, పట్టెమంచం నేపధ్యంలో కనపడుతున్నట్టుగా, బాపు చిత్రించారు.
కథ-ఒక అందమైన వేశ్య,చినముత్తెం కథ ఇది. చిన ముత్తెం, భార్య పిల్లలున్న బుల్లిరామయ్య మీద మనసుపడి, అతని అధీనురాలవుతుంది. అతని కుటుంబ పోషణ కూడా తానే చేస్తూ ముప్ఫయి ఏళ్ళు గడిపి, చివరి కాలంలో, తమకోసం తన తల్లి చేయించిన, పెద్ద పట్టెమంచం బుల్లిరామయ్య పిల్లల కోసం ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ పట్టెమంచం వాళ్ళింట్లో వంశపారపర్యంగా వాడబడినట్టు సమాచారమిస్తూ, కథ ముగించారు రచయిత. వేశ్య, విటులను పట్టి పీడించి ఆస్తిపాస్తులు హరించటం, సామాన్యమని లోకోక్తి. అందుకు భిన్నంగా, వేశ్యలలో కూడ ధర్మ బద్ధులు ఉండవచ్చు అన్న ఒక కోణాన్ని చూపించారు రచయిత. ఇంకే కథలోనూ కనపడని రచయిత చిలిపితనం, ఈ కథలో చినముత్తెం అందం వర్ణించటంలో కనపడుతుంది.

30, సెప్టెంబర్ 2009, బుధవారం

అమరావతి - కథలు సమీక్ష 2

పాల మీద మీగడలా, మంచి గులాబీ సువాసనలా, గాలిలో తేలివస్తున్న జాజిపూల పరిమళంలాగ ఉంటాయి సత్యం శంకరమంచి వారి కథలు. ఒక్కొక్క కథ ఒక్కొక్క మణిపూసే. మన తెలుగు సాహితీ వేత్తలకు పూనుకుని తోటి రచయితలకు ప్రపంచ ఖ్యాతి తీసుకు రావటం అంతగా తెలియదు లేదా చెయ్యరు. అలా పూనుకుని అమరావతి కథలను నోబెల్ బహుమతి ప్రదాతలకు పంపిస్తే, నోబెల్ బహుమతి రావలిసింది కదండీ. ఇప్పటికైనా ఆలశ్యం కాలేదని నా ఊహ.

ఈ రోజున మరొక ఐదు కథల గురించి.

6.ముక్కోటి కైలాసం
ముఖ్య పాత్రలు-ముసలమ్మ, బిచ్చగాళ్ళు ఎవరికీ పేర్లు పెట్టలేదు
బాపు బొమ్మ-నేలమీద చాలా హీనంగా కూచుని చేతులెత్తి నమస్కరిస్తున్న ముసలిది, ఆకాశంలొనుండి ఒక అద్భుత హస్తం అమె వైపుకు తిరిగి. ఆదిదేవుడే ఆ ముసలమ్మను తన చేత్తో, పూజలే ముఖ్యమయ్యి, తోటి మనిషిని పట్టించుకోని లోకంనుండి, ఒక పర్వదినాన ఆమెను కైలాసానికి తీసుకొని వెళ్ళబోతున్నట్టు స్పురిస్తుంది
కథ-ఇదికూడా సంఘటనా వర్ణనమే ఒక దిక్కులేని ముసలమ్మ వైకుఠ ఏకాదశి నాడు అమరావతిలో శివాలయం లో దేవదర్శనంకోసం ప్రయత్నించటం, అశేష జనవాహినిలో పడి కొట్టుకుపోయి, ఆ జన సంద్రపు తీరాన విసిరివేయబడటం, అమె అక్కడే తనువు చాలించటం. కథలో బిచ్చగాళ్ళ దీన జీవన గాధ, అంతటి బీదరికంలొనూ వాళ్ళలొ వాళ్ళు తన్నుకోవటం, తమకంటే తక్కువ వాళ్ళను చీదరించుకోవటం, దిక్కులేని ముసలమ్మను పట్టించుకోక పొగా, కసిరి ఆవతలకి పొమ్మనటం, చివరికి ముసలమ్మను "చచ్చిందిరోయ్" అని అనందంగా కనిపెట్టి, ఆ శవాన్నే పణంగా పెట్టి అడుక్కోవటానికి కూడ వెనకాడక పోవటం చాలా హృద్యంగా చిత్రీకరించారు. "ముసలమ్మ ముందు రెండు కొబ్బరిముక్కలు పడ్డాయి. వాటిని కొరకబోయింది గాని మింగుడు పడలేదు" అన్న వాక్యం మనస్సును ద్రవింపచేస్తుంది.

7.అరేసిన చీర
ముఖ్య పాత్రలు సాంబడు, లచ్చి
బాపు బొమ్మ-సాంబడు లచ్చి, ఇద్దరికి బట్టలతో లంకె, కథలో వారిద్దరు చివరకు ఒకరి మీద మరొకరు ఎలా ఇష్టపడ్డారో తెలియచెప్తుంది
కథ-చాకలి సాంబడు, చాకలి లచ్చి, పెద్దవాళ్ళ బలవంతంమీద పెళ్ళాడుతారు, కాని, వారిద్దరికీ ఇతరులమీద, లచ్చికి కోటేశు మీద, సాంబడికి సీతాలు మీద, మనసు పోతూ ఉటుంది. క్షణం పడదు వాళ్ళీద్దరికీ. ఉతకటానికి వేసిన బట్టల్లోంచి కోటేశుకు చెందిన అత్తాకోడలంచు పంచ లచ్చి, సీతాలుకి చెందిన నెమిలి కంఠం చీర సాంబడు ఉతుకుతారు. సాయంత్రానికి ఉతికిన బట్టల్లోంచి తమకు నచ్చిన బట్టలు - నెమిలి కఠం చీర లచ్చి, అత్తాకోడలంచు పంచ సాంబడు కట్టుకుంటారు. ఆ బట్టల్లో వాళ్ళకి ఒకళ్ళమీద ఒకరికి ఇష్టం కలిగినట్టు సూచించి కథ ముగించారు రచయిత.

8.శివుడు నవ్వాడు
ముఖ్య పాత్రలు గుడ్డి గంగన్న, అర్చకుడు మహదేవయ్య
బాపు బొమ్మ-గుడ్డి గంగన్నలోని పరమేశ్వరుణ్ణి చూస్తూ అతన్ని లేవతీస్తున్న మహదేవయ్య, కథలోని సంఘటనకు అద్దం పడ్తుంది.
కథ-దేవాలయానికి ఆనుకుని ఉన్న గుడ్డి గంగన్న కాళీ స్థలాన్ని, అక్కడ ప్రసాదాలు అమ్మేషాపు పెట్టాలని చులాగ్గా నిర్ణయింస్తారు గుడి గుమాస్తా, ఆఫీసరు. వాళ్ళు గుడ్డి గంగన్న దగ్గరకు వచ్చి ఆ స్తలాన్ని అమ్మమని ఆడుగుతారు, గంగన్న తిరస్కరిస్తాడు. అతనికి రొజూ పెట్టే ప్రసాదం పెట్టటం మానేస్తారు. నాలుగు రోజులు తరువాత, ఆ ప్రసాదం మీదనే బ్రతికే గంగన్న ఆవేశంతో ఆక్రొసిస్తాడు. ఆ క్రమంలో పడిపోతున్న గంగన్నని, అర్చకుల్లో పెద్దవాడైన మహదేవయ్య మడిలో ఉండి కూడ పట్టుకుని ప్రసాదం తినిపించి, అతని ఆకలి తీరటంతో, నాలుగు రోజులనుండి చిరునవ్వు నవ్వని శివుడు నవ్వినట్టు భావించి ఆనందిస్తాడు. బిచ్చగాళ్ళు తన స్తలంలో వండుకుని పడుకొంటున్నారని గమనించిన గంగన్న"ఆ స్తలం నాదే కాని బాబూ! దాన్ని అమ్మే హక్కు నాకు లేదు బాబూ"అని అనటం, మడిలో గంగన్నని ముట్టుకున్నందుకు వచ్చిన ఆక్షేపణను మహదేవయ్య "అతనూ మడిగట్టుకునే ఉన్నాడండీ" అన్న ఒక్క మాటతో కొట్టి పారెయ్యటంతో, మానవుల మనసుల్లో కొరవడుతున్న మానవత్వపు విలువలను ఎత్తి చూపారు రచయిత.

9.ఒక రోజెళ్ళి పోయింది
ముఖ్య పాత్ర-పిచ్చయ్యగారు
బాపు బొమ్మ-చాలా అర్ధవంతమైన బొమ్మలలో ఒకటి.అస్తమిస్తున్న సూర్యుడు, ఎగిరిపోతున్న పావురం, కథావిషయాన్ని ఇట్టే చెప్పగల శక్తిగలదీ బొమ్మ
కథ-ఇందులో పిచ్చయ్య గారన్న ఒక సామాన్య వ్యక్తి, ఒకళ్ళ అంటు-సొంటు అక్కర్లేని వ్యక్తి యెక్క దినచర్య, అతను వెళ్ళిపోయిన వైనం. అన్ని విధాలా సంతృప్తిపడగల వ్యక్తి జీవితం ఎంత హాయిగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా జరిగిపోతుందో రచయిత చక్కగా వర్ణించారు. పిచ్చయ్యగారికి "కారం దివ్యంగా ఉండాలి. లేకపోతే గొప్ప చిరాకు పడేవాడు" అన్న రెండు వాక్యాలు చదువుతుంటే ఆ సంఘటన కళ్ళకు కట్టి నవ్వు తెప్పిస్తుంది. సమాజంలోని ఎంతో మంది తమకు అక్కర్లేని పనులలో తల దూర్చి లేనిపోని చిక్కులు, సమస్యలు(అవి తీరుస్తున్నామన్న భావనతో)తెచ్చుకుంటారో,తెస్తారో(చాలాభాగం సొంత లాభంకోసం), అటువంటివారికి వారికి పూర్తి విభిన్నంగా "పిచ్చయ్యగారు ఏవీ సాధించలేదు. తగాదాలు తీర్చలేదు. సమస్యలు చర్చించలేదు. కానీ, కాలానికి తెలియకుండా కాలంలో కలసిపోయి బతికాడు. అది చాలదా? అది చాలటంలేదు చాలామందికి " అన్న చురుక్కుమనే కొసమెరుపునిచ్చి కథను రచయిత ముగిస్తారు.
(ఈ తొమ్మిదో కథ ఉన్నదే, ఈ కథను ప్రస్తుతం పదవులకోసం కొట్టుకు చస్తున్న రాజకీయ నాయకులకి బలవంతాన ఒక రోజల్లా వినిపిస్తే ఎమన్నా గుణం కనిపిస్తుందేమో? మానసిక వైద్యులు ఎవరైనా విశ్లేషించి తేల్చి చెప్పాలి)
10.హరహర మహాదేవ
ముఖ్య పాత్ర-మోగులూరి ముసలమ్మ
బాపు బొమ్మ-రధంలో ఊరేగుతున్న పరమేశ్వరుడి రధ చక్రంలో మోగులూరి ముసలమ్మను చిత్రీకరించటం, ఆ చక్రాకృతిలోనే ముసలమ్మ దేవుడికి హారతి పట్టడం బొమ్మయెక్క ప్రత్యేకత
కథ-చాలా కాలం క్రితం, (ఈ కథారచనా సమయంలోనె) ఆకాశవాణి వారు శ్రీరామనవమి నాడు భద్రాచలం నుండి అక్కడ ప్రతి సంవత్సరం జరిగే సీతారామ కళ్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసావాళ్ళు. అందులో వ్యాఖ్యాతగా జమ్మలమడక మాధవరాయ శర్మ తన్మయుడయి ఆ కళ్యాణాన్ని కళ్ళకు కట్టినట్టు భక్తి పారవశ్యంతో చెప్పి సకలాంధ్ర శ్రోతలకు ఆనందం కలిగించేవారు. ఈ కథలో,అమరావతిలో మహా శివరాత్రి నాడు జరిగే అమరేశ్వరుని రధ యాత్రను, రచయిత ఆ పంధాలొనే, అక్షర రూపంలోనె మనముందు ఉంచినా, ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని కలుగ చేశారు. ఎంతో దూరం నుంచి వచ్చిన మోగులూరి ముసలమ్మ పరమేశ్వర దర్శనం చేసుకోవటం, హారతి ఇచ్చి పరవశించటం ఈ కథకు వన్నె తెచ్చిన అంశం.

24, సెప్టెంబర్ 2009, గురువారం

అమరావతి కథలు - సమీక్ష 1

అమరావతి కథలు 1 నుండి 5 వరకు
నా మాట
పైన సమీక్ష అని వ్రాసాను కాని, అమరావతి కథలమీద సమీక్ష వ్రాసెంతటి శక్తి నాకు లేదని తెలుసు. కాని, ఆ కథలమీద ఇష్టంతో ఆ కథలను నేను ఎలా అర్థం చేసుకున్నానో చెప్పటం ఒక ఉబలాటం, సరదా. అందులో భాగంగా, మొత్తం నూరు కథలగురించి వ్రాద్దామని నిర్ణయించుకున్నాను .ఒకేసారి వ్రాయక పోవచ్చును, వీలు కలిగినప్పుడల్లా వ్రాస్తూ ఉంటాను. వ్యాసం మరీ పెద్దద కాకుండా, తడవకు ఐదు కథల గురించి వ్రాస్తాను. మొదటి విడత ఈ రోజునే.

1.వరద
ముఖ్య పాత్రలు-శాస్త్రిగారు, మాల సంగడు
బాపు బొమ్మ-శాస్త్రిగారు చెయ్యి చాచటం, మాల సంగడు నెయ్యి వేస్తూండటం
కథ: అమరావతిలో వరద వచ్చి అందరూ వీధిన పడిన సమయాన సమిష్టి భోజనాలు కులాతీతంగా అందరూ కలసి వండుకుంటారు. వడ్డన సమయంలో, మాల సంగడు శాస్త్రిగారికి నెయ్యి వడ్డించటానికి సందేహిస్తే, శాస్త్రిగారే సంగణ్ణి పిలిచి " ఒరే సంగా! నీకు ఆకలేస్తుంది, నాకూ ఆకలేస్తుంది. ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి, నువ్వు వేస్తే నెయ్యి కాకపొదురా....వెయ్యరా" అని సంగడి చేత నెయ్యి వేయించుకుంటాడు. "వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే నాకు నమ్మకం లేదు! స్నానం చేసిన వొంటికి తెల్లారేప్పటికి మళ్ళీ మట్టి పట్టినట్టు మనసుల్లొ మళ్ళీ మలినం పేరుకుంటోంది. ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతోంది" అన్న రచయిత ముక్తాయింపుతో కథ ముగుస్తుంది.

2.సుడిగుండంలొ ముక్కుపుడక
ముఖ్య పాత్రలు :ఎలికలాళ్ళు బాచిగాడు, సింగి; భూస్వామి భూమయ్య, అతని భార్య సూర్యకాంతం
బాపు బొమ్మ- నీటి వలయాలు, అందులో సింగి చేతులో బిడ్డతో నుంచుని, బాచిగాడు పూర్తిగా వంగి నీళ్ళల్లో జల్లెడపడుతుంటాడు, ఆ జల్లెడ సూర్యకాంతం ముఖాకృతి కలిగి ఉంటుంది(వారి అంతర్యాన్ని జల్లెడపట్టి బాచిగాడు గ్రహించినట్టు)
కథ - బాచిగాడు, సింగి ఎలికలోళ్ళు, నీళ్ళల్లొ జల్లెడపట్టి రంగురాళ్ళు ఏరుకొని బతుకుతుంటారు. ఓకరోజు వీరలా వారి పనిలో ఉండగా భూమయ్య, బార్య సూర్యకాంతం ప్రొద్బలంతో, పిలిచి తన భార్య ముక్కుపుడక ఆ నీళ్ళల్లొనె పొయిందని, వాళ్ళకి దొరికినా ఇవ్వలేదని అభియోగం చేసి వెంటనే ఇవ్వమని హూంకరిస్తాడు. బిత్తరపోయిన ఆ దంపతులు, దిక్కుతోచక చివరికి ఆ ముక్కుపుడక వెతికి ఇద్దామని నిర్ణయించుకుని, బాచిగాడు రొజంతా జల్లెడపట్టి ఆ ముక్కుపుడక పట్టి భూమయ్యకు సమర్పించుకుంటాడు. లోకం తెలియని సింగి భూమయ్య ఏమన్న బహుమతి ఇచ్చాడా, కనీసం పప్పన్నం అని అడుగుతుంది పాపం. బాచిగాడు చక్రవర్తి హుందాలో మంచిరాయి దొరకనీయే! మనవే పెడ్దాం అంటాడు. భూమయ్య తన ధనాధికారంతో అశక్తుడైన బాచిగాడ్ని ఎలా వాడుకుని తన పని డాంబికంగా ప్రతిఫలం ఇవ్వకుండా చేయించుకుంటాడో మనసున్న వారికి చివుక్కుమనే రీతిలో రచయిత వ్రాశారు. ఎర్ర మార్కు కథల్లో ఉండే అవేశ కావేశాలు లేకుండా, మానవ ప్రవృత్తి సహజ దర్పణంలో చూపబడింది ఈ కథలో.

3.పుణుకుల బుట్టలో లచ్చితల్లి
ముఖ్య పాత్ర-సుబ్బాయి లేదా సుబ్బారావుగారు
బాపు బొమ్మ- ఒక మాసికల గుడ్డ చిరుగులోంచి ఒక వ్యక్తి ఆ మాసికల గుడ్డకు నమస్కరిస్తూంటాడు
కథ-స్థూలంగా పుణుకులమ్ముకునే సుబ్బాయి సుబ్బరావుగారుగా మారిన వైనం, అలా పెరిగి ధనవంతుడయినా, తన మూలాలు మరవకుండా, తన ఎదుగుదలకు ముఖ్య ఆధారాన్ని పూజిస్తూ ఉండటం. కథలో అంతర్గతంగా పేకాటరాయుళ్ళు, తాగుబోతులు, ఏవిధంగా తమ కాలాన్ని, ధనాన్ని వ్యర్ధపరుస్తూంటారో, ధన పరంగా కొంత ఎదుగుదల తరువాత పాత పేరు రోతగా మారి కొత్త పేరుగా రూపాంతరం చెందటం (సుబ్బాయి సుబ్బరావుగా, అతని మనుమడు బుచ్చయ్య హేమంతకుమార్ గా) చెప్పబడింది. పేకాట ఆడుతున్న చోటు, "పేకాట యజ్ఞవేదిక"గా వర్ణన చక్కటి హాస్యం. పేకాటరాయుళ్ళకు పావలా వడ్డీతొ, తాగుబోతులకు అర్ధరూపాయి వడ్డితో సుబ్బాయి అప్పివ్వడం, రెంటి వడ్డిల్లో ఉన్న పెద్ద అంతరం-సుబ్బాయి తాగుబోతుల బలహీనతను తనకనుకూలంగ ఎలా ద్రవ్యపరుచుకుంటాడో - వడ్డీ వ్యాపారుల మోసకారితనానికి అద్దంపడుతుంది.

4.రెండు గంగలు
ముఖ్య పాత్రలు
వాన, శాస్త్రిగారు
బాపు బొమ్మ- ఆకాశగంగ, భూలోక గంగ పక్కన వానలో అనందిస్తున్న శాస్త్రిగారి భార్య
కథ-శాస్త్రిగారు పొలంవెళ్ళి వస్తుండగా వాన మొదలయ్యి అందులోపూర్తిగా తడిసి సంపూర్ణానందం పొంది, మళ్ళీ మామూలు లోకంలోకి వచ్చి, కొత్తగా కాపురానికి వచ్చిన తన భార్య ఏమయిందోనని ఇంటికి ఆదుర్దాగవచ్చి చూస్తే, ఆమె కూడా దొడ్లో వానలో నుంచుని వాన కృష్ణలో,కృష్ణ వానలో కలవటం (అదే రెండు గంగలు) చూసి అనందిస్తూ ఉంటుంది. కథంతా శాస్త్రిగారుతన 80వ పడిలో మనవలకి చెప్తుంటే మనకు తెలుస్తుంది. ఈ కథలో వాన, వాన పడుతున్న తీరు యెక్క వర్ణన చాలా చక్కగా ఉంటుంది. కథ వింటున్న శాస్త్రిగారి పెద్ద మనవడు "వర్షం ఆగిపోయిందని చెప్పకు తాతయ్యా" అంటాడు. చదువరులకు కూడా అక్కడకు వచ్చేసరికి, సరిగ్గా అదే అనిపిస్తుంది. పూర్వం, అంటే 20వ శతాబ్దపు మొదటి రోజులలో, భార్యను భర్త "ఓహోయ్" అని పిలిచేవాడని హాస్య పూరకంగా తెలుస్తుంది.అప్పట్లో పట్నవాసం వాళ్ళను పల్లె వాసులు (ఇప్పుడది తిరగబడింది) ఎలా ఆట పట్టించేవారో శాస్త్రిగారు తన భార్య గురించి "అందులో పట్నంలో కచ్చేరీ గుమాస్తాగారి కూతురేమో, వర్షంలో తడిసి జలుబుచేసి ఎక్కడ ముక్కూడగొట్టుకుంటుందో" అనుకోవటం హాస్యోక్తిగా రచయిత మలచారు.


5.బంగారు దొంగ
ముఖ్య పాత్రలు-దొంగ,జానకి రామయ్య, భూషయ్య
బాపు బొమ్మ-వినాయకుడి మీద ఎక్కి కూర్చున్న భూషయ్య,కొంత డబ్బులు పడేస్తుంటే, అనందంతో అవులిస్తూ చేతులు ఎత్తి తీసుకుంటున్న దొంగ. వినాయకుడు విచారంగా తన నెత్తిన ఎక్కిన భూషయ్యను భరిస్తుంటాడు. బొమ్మ అంతర్యం అసలు దొంగ ఎవరో చెప్పటమే.
కథ-ఊళ్ళొ జరిగిన ఒక సంఘటన. గుళ్ళొ దొంగతనం జరుగుతుంటే పసికట్టిన జానకిరామయ్య ఊరివారిని హెచ్చరిస్తాడు. ఊళ్ళోవాళ్ళు, వాడువీడని లేకుండా అందరూ గుడిమీదపడి దోంగను పట్టుకుని, వీరొచితంగా చావగొడతారు భూషయ్యతో సహా. కథ పేరు "బంగారం దొంగ" అని పెట్టకుండా, "బంగారు దొంగ" పెట్టడంలోని చమత్కారం కథలోని కొసమెరుపు. ఆ దొంగ, భూషయ్య చేత నియోగించబడ్డవాడు. వాడికి డబ్బిచ్చి, దొంగతనానికి పురిగొల్పి, బంగారుపూతను సంగ్రహిస్తూ వాడికి నాలుగు రూకలు పడేస్తుంటాడని భూషయ్య-దొంగల సంభాషణలో తెలుస్తుంది. బంగారం దొంగ భూషయ్య, భూషయ్యకు దొంగ (వీడికి పేరులేదు)బంగారు దొంగ. వేసంకాలం మిట్టమధ్యాహ్నం, శివాలయంలో రికామిగా జరుగుతున్న దొంగ పని బయటపెట్టడానికి మొలల వ్యాధిగ్రస్తుడైన జానకిరామయ్య పాత్రను కల్పించి రచయిత హాస్యాన్ని పండించారు.


(ఇంకా ఉంది)
మిగిలిన కథలు వీలు చిక్కినప్పుడల్లా

23, సెప్టెంబర్ 2009, బుధవారం

అమరావతి కథలు

అమరావతి కధలు సత్యం శంకరమంచి రచించిన తెలుగు కధాసంపుటి . అమరావతి గ్రామం, అక్కడి ప్రజలు ఇతివృత్తంగా రచించిన ఈ 100 కధలు మొదట ఆంధ్రజ్యోతి వారపత్రికలో సుమారు రెండు సంవత్సరాలు 1975-77 మధ్య ప్రచురించబడ్డాయి.ఏ కథా కూడ ఒక పేజి కంటే ఎక్కువ ఉండేది కాదు. అప్పట్లో కాయితం (News Print) కరువు ఉండేది. ఆ కారణాన,ఆంధ్రజ్యోతి పత్రిక ప్రస్తుతపు వారపత్రిక సైజులో కాకుండా అందులో సగం సైజులో అంటే చందమామ మాసపత్రిక సైజులో కొన్నాళ్ళు వచ్చింది. కారణమేమయినా, కథలన్నీ కూడ రచయిత చక్కగా కుదించి వ్రాశారు. అంత చిన్నకథలో కూడ ఎంతో కథా శిల్పాన్ని ప్రదర్శించిన రచయిత సత్యం శంకరమంచి అభినందనీయులు. చక్కని తేట తెలుగులో, సరళమైన భాషలో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించుతూ, ప్రజల వేషభాషలు, ఆచారవ్యవహారాలు, కష్టసుఖాలు, జీవన విధానం గురించి విపులం వ్రాసారు శంకరమంచి సత్యం .

ఈ కథా సంపుటికి 1979వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగళ్ ఈ కథలను హిందీలో ధారావాహికగా చిత్రీకరించారు. ఈ ధారావాహిక దూరదర్శన్ లో ప్రసారం అయ్యి ఈ కథా సంపుటి ప్రాచుర్యం మరింత పెంచింది. ఈ ధారావాహిక అమరావతిలోనే చిత్రీకరించబడటం విశేషం.

రచయిత శ్రీ సత్యం శంకరమంచి ఈ కథలు తను ఎలా వ్రాసారో, తన కథా సంపుటి మొదటిలో కృతజ్ఞతలులో ఈవిధంగా తెలియ చేసారు- "ఓ సాయంవేళ పురాణం సుబ్రహ్మణ్య శర్మ (అప్పటి ఆంధ్రజ్యోతి వారపత్రిక సంచాలకులు) ఉన్నట్టుండి మీరు అమరావతి కథలు అని ఎందుకు
రాయకూడదు? అన్నారు ఓ క్షణం అవాక్కయి పోయాను. ఎప్పటిమాట! పన్నెండేళ్ళ క్రితం జైపూర్ లో పని చేసేటప్పుడు అమరావతి కథల పేరిట కొన్ని కథలు రాద్దామని నోట్సు రాసుకోటమేమి, ఇప్పుడు ఎవరో చెప్పినట్టు ఈయన అడగటమేమి! తేరుకుని వరసగా నాలుగు కథలు ఆశువుగా చెప్పాను." ఆ తరువాత జరిగినది తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ముఖ్య సంఘటన అనగా 100 వారాలపాటు అమరావతి కథలు ఆంధ్ర జ్యోతి వార పత్రికలో ప్రచురించబడి ఎంతగానో ప్రజాదరణ, సాహిత్యవేత్తల గౌరవం పొందటం.

అమరావతి కథలు అన్న పేరు ఎందుకు?
రచయిత సత్యం శంకరమంచి పుట్టి పెరిగింది అమరావతి గ్రామంలో. ఆయన చిన్నతనంలో ఉన్న సామాజిక పరిస్థితులు, జీవన విధానాలు తో పాటు, ఆ ప్రాంత చరిత్రలో పరిశొధన చేసి వ్రాసిన కథలు అమరావతి కథలు. అన్ని కథలు అమరావతిలో జరిగినవే. ఊహాజనిత గ్రామమో లేక పట్టణమో తన కథలకు వేదికగా రచయిత సత్యం తీసుకోలేదు. తనకు తెలిసిన అమరావతి గ్రామం తరువాత పట్టణమయినా, తన కథలన్ని అక్కడజరిగిన సంఘటనలుగానే తీర్చి దిద్దారు. అందుకనే, ఈ కథలకు మరే పేరు నప్పదు, అమరావతి కథలే సరయిన పేరు. ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ అన్నట్టు, "అమరావతి కథలు అపురూప శిల్పాలు".
కధా వస్తువు
ఈ కథలలోని పాత్రలు రాజులున్నారు, స్వాములవార్లు ఉన్నారు, దొంగలు, భక్తులు, నాస్తికులు, దాతలు, లోభులు ఒకరేమిటి మనకు సామాన్యంగా ప్రతిరోజు తారసపడే వారందరూ ఈ కథలలో పాత్రలే. కథలన్నీ కూడ చాలా చిన్న చిన్నవి. మరింత ఉంటే బాగుండునేమో అనిపించేవే. ఎంతటి సామాన్య ప్రజలను పాత్రలు చేసి కథలు వ్రాసినా, కథాంశం మనిషిలోని ఔన్నత్యాన్ని మాత్రం వదిలి పెట్టదు.


కథలకు బాపు బొమ్మలు"బంగారానికి చక్కటి సువాసన అబ్బితే" అని సామెత చెప్పుకుని ఆశ పడే వారు, ఈ కథా సంపుటిలోని కథలను, వాటికి ప్రముఖ సినీ దర్శకుడు మరియు చిత్రకారుడయిన బాపు వేసిన బొమ్మలు చూసిన తరువాత ఈ సామెత నిజమవ్వచ్చు అనుకోవటంలో తప్పు లేదు. ప్రతి కథకు మొదట బాపు వేసిని బొమ్మ, కథను దాదాపు చెప్పకనే చెప్తుంది. కథ చదివిన తరువాత చూస్తే ఆ బొమ్మ తప్ప మరే బొమ్మయిన వెయ్యగలమా అని చూస్తే ఎమీ తట్టదు. కథలకు బొమ్మలు అంత బాగా సరిపొయ్యాయు. ముళ్ళపూడి వెంకటరమణ వ్రాసిన బుడుగు కు చక్కటి బొమ్మలు వేసి చిన్నలనే కాక పెద్దలనే ఎక్కువ అలరించిన చిత్రకారులు బాపు, ఈ కథలకు తన ప్రతిభకు పూర్తి తార్కాణంగా, బొమ్మలను వేసి చదువరులను అలరించాడు.

కథాసంపుటి ముఖ చిత్రం చూస్తేనె తెలుస్తుంది బాపు చిలిపితనం, నిండుతనం. రచయిత, పార్వతీ పరమేశ్వరుల సరసన కూర్చుని, చాలా సావకాశంగా, వారికి తన కథలను వినిపిస్తున్నట్టు, తన ఆజ్ఞకానిదే చీమనుకూడ కుట్టనివ్వని పరమేశ్వరుడు, పార్వతీ సమేతుడయి చిద్విలాసంగాను,నందీశ్వరుడు మరియు గోపన్నలు పారవశ్యంగానూ, వింటున్నట్టు చిత్రీకరించారు. అమరావతిలోని అదిదేవుడయిన అమరేశ్వరుడే దిగివచ్చి ఈ కథలు వింటున్నాడని స్పురింప చేశారు.

అమరావతి కథల జాబితా
1.వరద
2.సుడిగుండంలొ ముక్కుపుడక
3.పుణుకుల బుట్టలో లచ్చితల్లి
4.రెండుగంగలు
5.బంగారు దొంగ
6.ముక్కోటి కైలాసం
7.అరేసిన చీర
8.శివుడు నవ్వాడు
9.ఒక రోజెళ్ళి పోయింది
10.హరహర మహాదేవ
11.ధావళీ చిరిగిపోయింది
12.రాగిచెంబులో చేపపిల్ల
13.అద్గద్గో బస్సు
14.పువ్వుల్లేని విగ్రహాలు నవ్వాయి
15.పందిరిపట్టి మంచం
16.అన్నపూర్ణ కావిడి
17.చెట్టు కొమ్మనున్న కథ
18.అఖరి వేంకటాద్రినాయుడు
19.ఎవరు పాడినా ఆ ఏడక్షరాలే
20.పచ్చగడ్డి భగ్గుమంది
21.లేగదూడ చదువు
22.ఆవతలొడ్డు పొంగింది
23.మే!మే! మేకపిల్ల
24.కాకితో కబురు
25.తులసి తాంబూలం
26.భోజన చక్రవర్తి
27.నావెళ్ళిపోయింది
28.నీరు నిలవదు
29.ఎంగిలా?
30.బాకీ సంతతి
31.మాయ
32.నివేదన
33.ధర్మపాలుడు
34.నాన్న-నది
35.కీలుగుర్రం
36.అచ్చోసిన ఆంబోతులు
37.వయసొచ్చింది
38.లంకల్లపుట్టింది లచ్చితల్లి
39.ఇద్దరు మిత్రులు
40.పున్నాగ వాన
41.ఖాళీ కుర్చీ
42.రాజహంస రెక్కలు విప్పింది
43.ఎవరా పోయేది?
44.ముద్దులల్లుడు
45.ముద్దేలనయ్య - మనసు నీదైయుండ
46.వంశాంకురం
47.బలి
48.అటునుంచి కొట్టుకురండి
49.మనసు నిండుకుంది
50.అబద్ధం - చెడిన ఆడది
51.దొంగలో? దొరలో?
52.కానుక
53.తల్లి కడుపు చల్లగా
54.విరిగిన పల్లకి
55.నావెనుక ఎవరో....
56.సిరి - శాంతి
57.గుండె శివుడి కిచ్చుకో
58.సంగమం
59.అంతా సామిదే? నేనెవర్ని ఇవ్వడానికి
60.మళ్ళీ మళ్ళీ చెప్పుకునే కథ
61.అంపకం
62.నిండుకుండ బొమ్మ
63.గాయత్రి
64.మౌన శంఖం
65.అదుగో - అల్లదుగో...
66.అప్పడాల అసెంబ్లీ
67.మాట్టి..ఒఠిమట్టి..
68.వేలం సరుకు
69.నిలబడగలవా?
70.సాక్షాత్కారం
71.ఎవరికీ చెప్పమాక!
72.జ్ఞానక్షేత్రం
73.ఏక కథాపితామహ
74.తృప్తి
75.ఆగని ఉయ్యాల
76.తెల్లవారింది
77.తంపులమరి సోమలింగం
78.ఏడాదికో రోజు పులి
79.దూరంగా సారంగధర
80.అమావాస్య వెలిగింది
81.త, థి, తో, న
82.స్తంభన
83.పట్టుత్తరీయం
84.మృత్యోర్మా...
85.అంతా బాగానే ఉంది
86.దీపం - జ్యోతి
87.కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి
88.పూల సుల్తాన్
89.పక్క వీది జన్మంత దూరం
90.టపా రాలేదు బొట్టు చెరగలేదు
91.భొజనాంతే...
92.ఓ నరుడా! వానరుడా!
93.బిందురేఖ
94.నేనూ మేల్కొనే వున్నాను
95.ఏడుపెరగనివాడు
96.అరుగరుగో సుబ్బయ్య మేష్టారు
97.ప్రణవమూర్తి
98.సీతారామాభ్యాం నమ:
99.శిఖరం
100.మహా రుద్రాభిషేకం



అభిప్రాయాలు
ముళ్ళపూడి వెంకటరమణ
-"అమరావతి కథలు అపురూప శిల్పాలు....ఊత్తమశ్రేణి ఆధునిక కధావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే.....వేయిపుటల వేయిపడగల కథలో సత్యనారాయణగారు చిత్రించిన తెలుగుజీవన విశ్వరూపానికి మూడు వాక్యాలో-మూడు మాటలలో ఈ కథలు అద్దం పట్టి చూపాయి......త్యాగరాజస్వామి - కీర్తనలతో, స్వరాలతో, అక్షరాలతో, స్వరాక్షరాలతో, రాగభావాలతో కీర్తనలు అల్లి రామచంద్రుడిని అలంకరించుకున్నట్టే ఈయన అంత జాగ్రత్తగా, ప్రేమతో అమరేశ్వరుడిని, ఆయనను సేవించుకునే తెలుగువాడిని అర్చించారు.....పట్టరాని అనందం కొద్దీ మనసులో వెయ్యి పేజీలు రాసుకున్నాను. చదివిన ప్రతివాళ్ళూ పదివేల పేజీలు రాసుకోగలరు కూడా......తెలుగు సాహిత్య పీఠంలో కలకాలం నిలబడి గౌరవం, ఆదరణ పొందే ఒక మహోజ్వల సృష్టి. ఎన్నటికీ ఆరని అఖండజ్యోతి పాఠకులకూ, కళాకారులకూ ఎన్నిసార్లు ఆస్వాదించినా తనివి తీరని అమృత కలశం, అక్షయమైన అక్షరపాత్ర. శిల్ప సౌదర్యానికి పరమావధి, పపంచ సాహితీ వీధిలో తెలుగువారు సగర్వంగా ఎగరేయగల పతాకం.


వావిలాల సుబ్బారావు".....అమరావతి కథలలో చదివిన కథను మరొక్కరికి తిరిగి చెప్పగలిగినవి చాలా కొద్దిగానే దొరుకుతాయి. తిరిగి మరొక్కరికి చెప్పగలిగేదే కథ. .. అనుభవంలోకో ఆలోచనలోకో జార్చేది కవిత.. అమరావతి కథలలో చాలా భాగం ఈ హద్దుకు అటొక్క కాలు, ఇటొక్క కాలు వేసి నుంచుంటాయి. అందుకనే వీటిని భావకవిత్వం లాంటి "లిరికల్ కథలు" అనుకుంటాను. వీటిలో సౌకుమార్యం ఉన్నంతగా కథా సంఘర్షణ ఉండదు... అమరావతి కథలు వస్తువుకన్నా కథా శిల్పానికే ఎక్కువ దోహదం చేశాయి. వ్రాసే నేర్పుంటే ఏదయినా కథా వస్తువేనని, మనోలాలిత్యం, శిల్పనైపుణ్యం, కవితాకోణంతో కూడా అందమయిన కథలు వ్రాయొచ్చని సత్యంగారు నిరూపించారు"
**************************************************************

ఈ వ్యాసం ఇంతకు ముందు, తెలుగు వికీపీడియాలో నేను వ్రాసినది, ఇక్కడ పున:ప్రచురణ. చక్కటి ఈ అమరావతి కథలను అన్నిటిని సమీక్షాపూర్వకంగా సంగ్రహంగా వ్రాయటానికి ప్రయత్నిస్తాను. కొన్ని ఇప్పటికే తెలుగు వికీలో వ్రాసాను, వాటిని నా బ్లాగులో పున:ప్రచురించి, మిగిలిన కథలగురించి కూడా ఇక్కడే వ్రాస్తాను.
**************************************************************

**************************************************************