లింకులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
లింకులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, నవంబర్ 2014, బుధవారం

బీహార్ పబ్లిక్ సర్వీసు కమీషనూ :: పెర్రీ మాసన్ పుస్తకాలూ



మనకు తెలుగులో ఒక సామెత ఉన్నది, బోడి గుండుకీ  మోకాలికి ముడి వెయ్యటం అని, రెండు  అతకని విషయాలను చెప్పేప్పుడు వాడుతూ ఉంటారు.  ఈ మధ్యన  "పెర్రీ మాసన్" పుస్తకాలు (కాలేజీ రోజుల్లో నా  ఫేవరేట్ పుస్తకాలు)  దొరుకుతాయేమో అని వెతుకుతుంటే చాలా  చిత్రంగా అసలు మనం ఎంత వైల్డ్ గా ఆలోచించినా ఊహించలేని  వెబ్ సైటులో దొరికినాయి. ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ వ్రాసిన 80+ పెర్రీ మాసన్ డిటెక్టివ్ పుస్తకాలు అన్నీ కూడా  ఈ వెబ్సైటులో ఉన్నాయి.  ఎక్కడ దొరికినాయి! బీహారు పబ్లిక్ సర్వీస్ కమీషన్ వారి వెబ్ సైటులో!!

పెర్రీ మాసన్ పుస్తకాలు   దొరికాయి అన్న ఆనందం కన్నా కూడా (అది కూడా పి డి ఎఫ్ ఫార్మాట్లో), ఆ పుస్తకాలు దొరికిన చోటు,  నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. పబ్లిక్ సర్వీసు కమీషన్ అంటే,   ఆ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలాకు తగిన అబ్యర్ధులను ఎంపిక చేయ్యటమే ముఖ్యమైన విధిగా కల సంస్థ. ఆ సంస్థ వెబ్ సైటులో,  ఉంటే గింటే వారి పరీక్షల సిలబసు లేదా మోడల్  పేపర్లు ఉండాలి. కాని చిత్రంగా, డిటెక్టివ్ పుస్తకాలు ఐన పెర్రీ మాసన్ నవలలు ఉండటం ఏమిటి అని సందేహం. లేదంటే బీహారు పబ్లిక్ సర్వీసు కమీషను వారు, వారి రాష్ట్రానికి కావలిసిన లీగల్ ఆఫీసర్లు, పోలీసు డిటెక్టివ్ లను ఎంపిక చేసుకోవటానికి ఈ పెర్రీ మాసన్ పుస్తకాలను ముఖమైన పాఠ్యాంశాలుగా తీసుకోలేదు కదా! ఏమో చెప్పలేము! దేశంలో  ఎక్కువ సంఖ్యలో ఐ ఎ ఎస్ అధికారులను అందిస్తున్నది బీహారు రాష్ట్రం. వారి  అబ్యర్ధులు అంత చురుకుగా ఉండటానికి కారణం,   బీహార్ రాష్ట్ర పబ్లీక్ సర్వీసు కమీషను ఇలా పెర్రీ మాసన్ పుస్తకాలను సిలబస్సు గా పెట్టి కృషి చేస్తున్నారా!!  భలే సరదాగా ఉన్నది ఈ విషయం. ఆంగ్లంలో "Pleasantly Surprised" అని ఒక వాడుక ఉన్నది. కలిగినది ఆశ్చర్యమే కాని, అది ఆనందాన్ని కలిగించే ఆశ్చర్యం. 

పరీక్షల్లో ఫలానా ఫలానా కేసులో పెర్రీ మేసన్ ఏమి చేసి గెలిచాడు, పాల్ డ్రేక్ ఎలా అసాధ్యమైన విషయాలను తన పత్తేదారు తెలివితేటలతో కేసు మంచి పట్టులో ఉండగా పెర్రీ మేసన్ కు  అందచేశాడు, పెర్రీ మేసన్ సామాన్యంగా అన్ని కూడా ఎక్కువగా మహిళలకు సంబంధించిన కేసులే ఎందుకు తీసుకుంటాడు,  సెక్రటరీ డెల్లా  స్ట్రీట్, పెర్రీ మాసన్ విజయాల్లో ఎలా తన పాత్ర నిర్వహిస్తూ ఉంటుంది  వంటి ముఖ్యమైన ప్రశ్నలు వేస్తూ తమ అబ్యర్ధులను ఎంపిక చేస్తారో ఏమిటో చెప్పలేము. ఏమైనా బీహారు కదా, ఏమైనా జరుగవచ్చు, మిగతా దేశంలో సామాన్యంగా జరిగేవి బీహారులో జరగకా పోవచ్చు. 

పెర్రీ మాసన్ గా నటించిన రేమాండ్ బర్
డెల్లా  స్ట్రీట్ గా బార్బరా హేల్
  అసలు ఈ పెర్రీ మాసన్ ఎవరు?   ఎవరు ఏమిటీ! అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఆయనొక పెద్ద లాయరు, ఆయనకొక అందమైన సెక్రటరీ డెల్లా స్ట్రీట్, వీళ్ళిద్దరి మధ్యా ఏమన్నా రొమాన్సు ఉన్నదా! ఆధారాలు ఎక్కడా నవలల్లో కనపడదు, ఏమో మరి లేదని మాత్రం చెప్పలేము. గేర్ట్రూడ్ అనే రిసెప్షనిస్టు, అప్పుడప్పుడూ కనపడుతూ ఉంటుంది. వీళ్ళతో పాటుగా లాయరుగారి  టీములో ముఖ్యుడు, పాల్ డ్రేక్  అనే డిటెక్టివ్ సంస్థ యజమాని, చీఫ్ డిటెక్టివ్. ఇతనే దాదాపు అన్ని
పాల్ డ్రేక్  గా విలియం హాపర్
కేసుల్లోనూ మన లాయరుగారికి చేదోడు వాదోడుగా ఉంటాడు. అన్ని కథల్లోనూ విలన్ ఎవరు? ఇంకెవరు పోలీసు అధికారి రిచర్డ్ ట్రాగ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ హామిల్టన్ బర్గర్. ప్రతి కథలోనూ క్రైమ్ ఎలిమెంట్ ఉంటుంది, లేకపోతే  డిటెక్టివ్ నవల ఎలా అవుతుందీ! మన లాయరు గారి క్లైంట్ ఏదో  గొడవలో ఇరుక్కుంటాడు, సామాన్యంగా ఒక హత్య జరిగి ఆ హత్యా నేరం ఈ క్లైంట్ మీద మోపబడుతుంది. కథ రకరకాలుగా పాల్ డ్రేక్ సహాయ సహకారాలతో అనేక మలుపులు తిరిగి, చివరకు క్లైమాక్స్ కోర్ట్ రూములో
పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీసు డిటెక్టివ్ లు  విలియం టాల్మన్, రే కాలిన్స్
అనేకమైన వీరోచిత, కొండకచో వితండ వాదనలతో, లాయరు గారు పోలీసులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను బఫూన్లను చేసి తన క్లైంట్ నిర్దోషి అని నిరూపిస్తాడు. కథ సుఖాంతం. ఈ పుస్తకాలు చదవటం మొదలుపెడితే ఆపటం కష్టం, సరదాగా ప్రయాణాల్లోనూ, వేచి ఉండక తప్పని పరిస్థితుల్లోనూ ఈ పుస్తకాలు మనకు కాల వ్యవధి తెలియకుండా చేస్తాయి.  

ఈ పెర్రీ మాసన్ ఎంతటి ప్రసిద్ది చెందాడు అంటే, ఆ పుస్తకాలను రచయిత పేరుమీద కాకుండా పెర్రీ మాసన్ పుస్తకాలు అనేంతటి పాపులర్ అయిపోయాడు ఈ "కథా" నాయకుడు. ఈ పుస్తకాలు వాడుకుని అనేక సంవత్సరాలపాటు టి  వీ సీరియళ్ళు  వచ్చినాయి. అవ్వి ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. పైన ఇవ్వబడిన పాత్రల ఫొటోలు ఆ టి వి సీరయళ్ళ ల్లో ఎక్కువ కాలం ఆయా పాత్రలు నిర్వహించినవారివే.

ఇంతకీ ఈ పుస్తకాల రచయిత ఎలా ఉంటారు!? రచయిత పేరు ఎర్ల్ స్టాన్లీ

గార్డెనర్.  ఈయన మాసేచూసేట్స్  లో ఉండేవారట, 81 సంవత్సరాలు జీవించిన ఈయన కూడా లాయరేనుట. మరి! ఇహనేం!! నోబెల్ బహుమతి పొందిన రచయిత కాకపోయినా,  ఆయన పుస్తకాలు వేలల్లో  అమ్ముడు పోయినాయి, అనేకమందికి ఏంతో కాలక్షేపం, వినోదం, కోర్టు పని తీరులను తెలుసుకునే వీలు కలిగించినాయి. ఆయన వ్రాసిన ఫార్మాటులో అంటే ఒక లాయరు, సెక్రటరీ, ఒక డిటెక్టివ్ మన తెలుగులో కాపీ కొట్టి ప్రయత్నీంచారు కాని, మన పాఠకులు, మేము ఆ ఒరిజినల్ ఆంగ్లమే చదువుతాము అని కాపీ రచయితల రచనలను చదువము అని నిర్ద్వంద్వంగా తిప్పి కొట్టారు. ఏమైనా పెర్రీ మాసన్ పుస్తకాలను యధాతధంగా తెలుగులోకి అనువదించి ప్రాచుర్యంలోకి తీసుకువస్తే బాగుంటుంది. కాలేక్షాపానికి, సరదాగా  చదువుకోవటానికి బాగుంటాయి. పెర్రీ మాసన్ నవలల సృష్టి కర్త, గార్డెనర్ గురించిన కొన్ని వివరాలు ఈ కింది వెబ్సైటులో ఉన్నాయి. 

ఇవన్నీ మనకెందుకు, "నువ్వోకందుకు ఇస్తే నేనొకందుకు తీసుకున్నాను" అన్న చందాన, బీహారు పబ్లిక్ సర్వీసు కమీషను వాళ్ళు ఏ కారణాన పెర్రీ మాసన్ పుస్తకాలు వాళ్ళ  వెబ్సైటులో పెడితే మనకెందుకు. మంచి డిటెక్టివ్ పుస్తకాలు దొరుకుతున్నాయి, పైగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం!

ఇంతా చేసి అసలు రహస్యం చెప్పనే లేదు కదూ! ఇదిగో బీహారు పబ్లిక్  సర్వీసు కమీషను వారి వెబ్సైటు. ఎంత అమాయకంగా కనపడుతున్నదో చూడండి, ఇక్కడ మీరు ఎంత వెతికినా మచ్చుకి కూడా వాళ్ళ వెబ్ సైటులో పైన చెప్పిన డిటెక్టివ్ పుస్తకాలు ఉంటాయన్న ఒక్క చిన్న క్లూ కూడా  దొరకదు.
బీహారు పబ్లిక్ సర్వీసు కమీషను హోమ్  పేజీ (క్లిక్)
సరే ఇప్పుడు ఈ వెబ్ పేజీ చూడండి, ఆ కిందనే ఆ పేజీకి వెళ్ళటానికి లింక్ ఇవ్వబడింది. ఇక మీ ఇష్టం,  పెర్రీ మాసన్ అభిమానులు ఆ పుస్తకాలు కావలిసినవి డౌన్లోడ్  చేసుకోవచ్చు. 
బీహారు పబ్లిక్ సర్వీసు కమీషను వెబ్ సైటులో పెర్రీ మాసన్ పుస్తకాలు (క్లిక్)
ఇప్పటికే దాదాపుగా 40వేల మంది పైచిలుకు ఈ పేజీని దర్శించారని అక్కడ ఉన్న సమాచారం చెబుతున్నది. చిత్రం ఏమంటే ప్రభుత్వ చిహ్నం మూడు  సింహాలు కనపడుతూ, నిక్ నెట్ (ప్రభుత్వ వెబ్ సైటు సర్వీసు) లో ఇలా విదేశీ  డిటెక్టివ్ పుస్తకాలు ఉంచటం ఎంతవరకూ సబబు? అనే ప్రశ్నకు జవాబు మాత్రం  దొరకటం లేదు. ఎవరు చేశారు!  బీహారు పబ్లిక్ సర్వీసు కమీషను అధికారులకు ఈ విషయం తెలుసో లేదో మరి!!  మన టివి  మీడియా వారి కంట ఇది పడినట్టు లేదు. 
 *************************************************
ఆలసించిన ఆశాభంగం  తప్పదు  మరి!

ఈరోజు అంటే నవంబరు 30 2014 చూస్తె ఆ పుస్తకాలు ఉన్న లింకు తొలగించారు
 *************************************************


25, సెప్టెంబర్ 2014, గురువారం

పుస్తక సేవ

 
అది సెప్టెంబరు 8, 1974.  సైకిలేసుకుని  విజయవాడ ఏలూరు రోడ్ మీద జాయ్ గా జోరుగా వెడుతున్నాను. అప్పటివరకూ చందమామలు, తెలుగులో టామ్  సాయర్, హకల్బెరి ఫిన్, కాంచన ద్వీపం, రాజు పేద  మాత్రమే తెలిసిన నాకు ఇంకా అలాంటి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు. ఒక్కొక్క సారి అనుకున్నది అనుకున్నట్టుగా దొరుకుతుంది. అలాగే ఆ రోజున మెడికల్ అసోసియేషన్ హాలులో జరుగుతున్న రష్యన్ పుస్తక ప్రదర్శన నా కంట పడింది. లోపలికి వెళ్ళటానికి టిక్కెట్టు ఏమన్నా ఉన్నదా అని పరకాయించి చూసి, హమ్మయ్య లేదని కుదుటపడి, సైకిలు తాళం వేసి, సగం ప్రాణం అక్కడే వదిలి, లోపలకి వెళ్ళి  చూస్తే  ఏమున్నది! ఒక అద్భుత ప్రపంచం! విశాలాంధ్ర పబ్లికేషన్ వాళ్ళు ఏర్పరిచిన రష్యన్ పుస్తక ప్రదర్శన. పేరుకి రష్యన్ పుస్తకాలు కాని అన్నీ తెలుగులోనే ఉన్నాయి అంతే  అదొక అద్భుతమైన మొదలు. 

ఈ పుస్తకాల రేట్లు ఎంతెంత ఉంటాయో అని జేబులో ఉన్న కొద్దిగా ఉన్న డబ్బులు తడివి చూసుకుంటూ పుస్తకాలన్నీ చూస్తున్నాను. చూసి చూసి  చివరకు  దిటవు గుండెలు, కొమ్ముల గొర్రె పిల్ల పుస్తకాలు రెండూ నా దగ్గర ఉన్న కాసిని డబ్బులతోనే కొనగాలిగాను. దిటవు గుండెలు పుస్తకం రెండు  రూపాయలు, కొమ్ముల గొర్రెపిల్ల రూపాయి లోపలే,  ఆపైన 10% డిస్కౌంట్. 

వెనువెంటనే గాలిలో తేలిపోతూ ఇంట్లో పడి దిటవు గుండెలు చదవటం మొదలు పెట్టాను, రెండ్రోజుల్లో చదివేశాను. నేను ఆ పుస్తకాన్ని ఇంతవరకూ పది సార్ల  పైనే  చదివాను. ఏముంది ఆ పుస్తకంలో! రెండో ప్రపంచ యుద్ధ
సమయంలో ఆక్రమణకు గురైన రష్యా, జర్మన్ సైన్యాన్ని ఓడించటంలో  ప్రధాన పాత్ర పోషించిన ఒకానొక గెరిల్లా దళం కథ.  అది కథ కాదు నిజమే అని చెప్పటానికి ఫొటోలు కొన్ని ఆ పుస్తకంలో ఉన్నాయి. ద్మిత్రీయ్ మెద్వదేవ్ రచించిన ఆ పుస్తకాన్ని ఉప్పల లక్ష్మణ రావుగారు తెలుగులోకి చక్కగా అనువదించారు, ఎంత చక్కగా అంటే, ఒక్కసారి మొదలుపెడితే చివరివరకూ చదివించగలిగేంత చక్కగా ఉంటుంది ఆ అనువాదం. 

ఇక ఆ తరువాత విశాలాంధ్రకు రెగ్యులర్ ఖాతాదారుని అయిపోయ్యాను. ఎన్నెన్నో పుస్తకాలు,  మాక్జిం గోర్కీ ఆత్మకథ మూడు భాగాలు, అతరిక్ష యానం గురించిన అయిలీత, ఛుక్ గెక్ అన్నదమ్ముల కథ, తిమూర్ అతని దళం, వర్షంలో నక్షత్రాలు, ఇంకా రష్యన్ కామిక్స్ అనేకం.

అలా కొనుక్కుని చదువుకున్న అనేకానేక పుస్తకాలు ప్రస్తుతం జ్ఞాపకాల్లోనే ఉండిపోయినాయి. పుస్తకాలు విజయవాడలో మా ఇంట్లో ఒక పెద్ద పెట్టెలో సురక్షితంగా ఉన్నాయనే అనుకుంటున్నాను. 

సినిమాల్లో అన్నట్టుగా, "కట్ చేస్తే", 2014 సవత్సరం అంటే  నాలుగు దశాబ్దాల తరువాత, నా దగ్గర ఉన్న కొన్ని  పుస్తకాలు స్కానింగ్ చెయ్యటానికి ఇవ్వటానికి వెళ్ళి మన శ్యామ్ నారాయణ గారి అడ్డాలో కూచుని  ఉండగా, అక్కడ కుప్పలు కుప్పలుగా రష్యన్ పుస్తకాలు కనపడ్డాయి, వాటిల్లో పార్టీ ప్రచార పుస్తకాలన్నీ పక్కకి తోసేసి (సుత్తులూ కొడవళ్ళ పుస్తకాలని  అనేవాళ్ళం), కథలు, కామిక్కులు, నవలలు ఏరి చూడటం మొదలు పెట్టాను. పాత జ్ఞాపకాలన్నీ పైకి వస్తున్నాయి. శ్యామ్ చెప్పిన  ప్రకారం ఆ పుస్తకాలన్నీ అనిల్ బత్తుల అనే ఆయన తెచ్చి ఇచ్చారని స్కాన్ చెయ్యాల్సి ఉందని చెప్పారు. 

కాసేపట్లో అనిల్ బత్తుల అక్కడి రానేవచ్చారు. పరిచయాలు అయినాక చాలా సేపు ఆ పుస్తకాల గురించి సంతోషంగా మాట్లాడుకున్నాము. అప్పుడు తెలిసింది ఆయనకు ఉన్న పుస్తక ప్రేమ. పుస్తకాలు చదవటమే కాదు, వాటిని జాగ్రత్త పరచటం, లేనివి సేకరించటం మనం అందరం చేస్తూనే ఉంటాము. కాని అనిల్ ఒక అడుగు ముందుకు వేసి తనకు నచ్చిన ఆ రష్యన్ పుస్తకాలన్నీ కూడా సేకరించి, వాటి గురించి వ్రాయటానికి ఒక ప్రత్యేక బ్లాగు ఏర్పాటు చేశారు. అందులో క్రమం తప్పకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రష్యన్ పుస్తకం గురించి వ్రాస్తూ, పుస్తక ప్రియులను ఊరిస్తున్నారు. అక్కడ ఆయన వ్రాసిన పుస్తకాలు అన్నిటినీ శ్యామ్ నార్యాయణ  గారి ఆధ్వర్యంలో మనసు ఫౌండేషన్ వారు చేస్తున్న పుస్తక యజ్ఞంలో స్కాన్ చేయించి అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చే చాలా పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. వారి బ్లాగును ఈ కింది లింకు నొక్కి చదువ వచ్చు:


ఆయన ప్రయత్నం పూర్తిగా విజయవంతం కావాలని నా ఒక్కడి  ఆకాంక్షె  కాదు అలనాడు రష్యన్ పుస్తకాలు చదువుకుని ఆనందించిన వారందరి కోరిక. ఆ అద్భుత ప్రయత్నంలో మనం కూడా మన వంతు సహాయం  చెయ్యవచ్చు. చాలా చిన్న విషయం, ఎవరి దగ్గర ఉన్న రష్యన్ పుస్తకాలు వారు ఒక సారి చూసుకుని, వాటిల్లో ఇప్పటికే అనిల్ తన బ్లాగులో పరిచయం చెయ్యని వాటి గురించి సమాచారం అనిల్ కు ఇస్తే చాలు, ఆయన ఆ పుస్తకాలను మీ నుండి  తీసుకుని, చక్కగా స్కాన్ చేయించి మీ పుస్తకాన్ని మీకు సురక్షితంగా తిరిగి పంపే ఏర్పాటు చేస్తారు. అనిల్ ఈ మెయిల్ చిరునామా fualoflife@gmail.com 

అప్పటి సోవియట్ ప్రభుత్వం తమ ఇజాన్ని మన దేశంలోకి దిగుమతి చేసే ఊదేశ్యం తో ఎంతో ఖర్చుతో, ప్రయాసపడి చక్కటి పేపర్ల మీద చక్కటి రష్యన్ కథలు, నవలలు, కామిక్స్ మనకు ఎంతో తక్కువ ధరకు, దాదాపు ఉచితంగా (జమీల్య కొత్త పుస్తకం 25 పైసలకు కొన్న గుర్తు) ఇచ్చి అద్భుతమైన "పుస్తక సేవ" చేశారు. ఈ విషయంలో విశాలాంధ్ర పబ్లిషర్స్ ను కూడా  అభినందించాలి. 

నువ్వోకందుకు ఇస్తే, నేనొకందుకు తీసుకున్నాను అన్న చందాన, తెలుగులో రష్యన్ పుస్తకాలకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు పాపం ఆ పుస్తకాలు అలా ప్రచురించి ఒక ఇజానికి తీసుకొద్దామనుకున్న పేరుమటుకు అంతగా  వచ్చినట్టు లేదు మరి. కారణం ఏమయినా రష్యా వారు వారి సాహిత్యాన్ని తెలుగులో మనకు అందించే ప్రయత్నాన్ని  అభినందించాలి. 

పుస్తక సేవా స్పూర్తిని అంది పుచ్చుకుని, అనిల్ బత్తుల గారు అలనాటి రష్యన్ తెలుగు పుస్తకాలన్నీ కూడా స్కాన్ చేసి రాబొయ్యే తరాలకు అందించటానికి చేస్తున్న ప్రయత్నం ఎంతో అద్భుతమైనది. ఇలాగే అనేక అనేక మంది "అనిల్" రావాలని, మన తెలుగు పుస్తకాలు మరుగున పడిపోకుండా కాపాడుకునే ప్రయత్నం మరింత ముమ్మరం కావాలని ఆశిస్తున్నాను. 

 

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

అరుదైన ఇంటర్వ్యూ - కిశోర్ కుమార్ సచిన్ దేవ్ బర్మన్ గురించి

 జననం 1 అక్టోబర్ 1906 :: మరణం 31 అక్టోబర్ 1975 
 జననం 4 ఆగష్టు 1929 :: మరణం 13 అక్టోబర్ 1987 
కిషోర్ కుమార్ మన హిందీ సినిమాలకు దొరికిన ఒక అద్భుత గాయకుడు. ఆయనకు సంగీతం వచ్చా, ఏ ఘరానా కు చెందిన వాడు, ఆయన సంగీత గురువు ఎవరు అన్న ప్రశ్నలకు తావు లేదు. ఆయన పాడిన పాటలకు ఉన్న జనాదరణే  పెద్ద కొలమానం. 

సామాన్యంగా కిషోర్ కుమార్ ఇంటర్వ్యూలు ఇవ్వటం వంటి పనులు చెయ్యటం చాలా తక్కువ, ఆయనకు మీడియా అంతగా ఇష్టం ఉన్నట్టుగా లేదు! ఆయనకు ఉన్న ఏకైక వీడియో ఇంటర్వ్యూ గురించి మునుపు వ్రాసిన గుర్తు. ఈ కింది లింకు నొక్కి ఆ వ్యాసం చదువుకోవచ్చు.


పైన చెప్పిన వ్యాసం చివర నా దగ్గర ఉన్న ఒక అపురూప ఆడియో ఇంటర్వ్యూ గురించి చెప్పటం జరిగింది. ఇప్పటికి ఈ ఆడియో ఫైలు నాకు దొరికింది. ఆ ఇంటర్వ్యూ వివిధభారతి వారు ప్రసారం చేశారు . ఇంటర్వ్యూ చేసినది ప్రముఖ రేడియో వ్యాఖ్యాత శ్రీ అమీన్ సయానీ (బినాకా గీత మాలా ఫేం). ఆ ఇంటర్వ్యూ అంటే నిజానికి కిషోర్ కుమార్  కుమార్ తన గురించి చెప్పుకున్నది కాదు. ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ సచిన్ దేవ్ బర్మన్ మరణించినప్పుడు, ఆయనకు నివాళి అర్పిస్తూ కిషోర్ తన జ్ఞాపకాలకు నెమరు వేసుకోవటమే ఇందులో మనకు వినిపిస్తుంది.


సినిమా సంగీతం లో తనకు గురువు, హిందీ సినిమాల్లో తనకు మొట్ట మొదటి  "బ్రేక్" ఇచ్చిన సచిన్ దేవ్ బర్మన్ గురించి, కిషోర్ ఏంతో హృద్యంగా, నిష్కపటం గా తన జ్ఞాపకాలను శ్రోతలతో పంచుకున్నారు. అలా పంచుకుంటూ, అక్కడక్కడా సచిన్ దేవ్ గొంతును, బెంగాలీ యాసతో  ఉన్న  ఆయన మాటలను అనుకరిస్తూ చెప్పటం జరిగింది. 

ఈ ఇంటర్వ్యూలో మధ్య మధ్యలో ఇంటర్వ్యూ చేసిన అమీన్ సయాని ప్రశ్నలు, అక్కడక్కడా నవ్వులు (సంతాప కార్యక్రమంలో నవ్వులు రావటం ఏమిటీ!), పాటల ముక్కలు తీసేసి, మొత్తం కిశోర్ కుమార్ మనతో మాట్లాడుతున్నట్టుగా తయారు చేశాను. నాకు చేతనైనంత వరకూ ఆడాసిటీ సాఫ్ట్వేర్ వాడి ఎక్కడా సౌండ్ ఎక్కువ తక్కువలు కాకుండా చేశాననే అనుకుంటున్నాను ఇంకా ఆలస్యం దేనికి ఈ కింది ప్లేయర్ లో కిషోర్ జ్ఞాపకాల ను వినండి:

 

సచిన్ దేవ్ బర్మన్, కిషోర్ కుమార్ ఒకే నెలలో, అంటే అక్టోబరులో సచిన్ దేవ్ బర్మన్ 1975 లో,  కిశోర్ కుమార్ పుష్కరం తరువాత 1987 లో, మరణించటం యాదృశ్చికం. 

31, ఆగస్టు 2014, ఆదివారం

న్యూస్ లాండ్రీ లేదా చానెళ్ళ చాకి రేవు



చాలా కాలం నుంచి నాకొక ఆలోచన ఉన్నది.ఇన్నన్ని న్యూస్ చానెళ్ళు, న్యూస్ పేపర్లు ఉన్నాయి కదా వీటిలో వచ్చేది అంతా న్యూసేనా లేదా వ్యాపార ప్రకటనల మధ్య  వీలు చూసుకుని చోటు నింపే వ్రాతలా/కూతలా, అని. ప్రింటులో కనిపిస్తే చాలు నిజం అని నమ్మేసే అంతటి  నమ్మకం ఒకప్పటి ప్రింటు మీడియా ప్రజల్లో తీసుకు రాగలిగింది. కాని, ఎలెక్ట్రానిక్ మీడియా అంతటి అదృష్టానికి కూడా  నోచుకోలేదు పుడుతూనే పుంజీల కొద్దీ చానెళ్ళు కుక్క గొడుగుల్లా పుట్టేసి, తలా ఒక గొడుగు కిందికి చేరిపోయి, పబ్బం గడుపుకుంటున్నాయి.   

 ఈనాటి మీడియా గా పిలవబడుతున్న కార్పొరేట్ హౌస్ ల "వార్తా దుకాణాలు" ప్రింట్ కానివ్వండి, ఎలెక్ట్రానిక్ కానివ్వండి అంతటి నమ్మకాన్ని కలిగిస్తున్నదా!   నా అనుమానాలు నాకు ఉన్నాయి. ఈ విషయంలో మిగిలిన ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయం మీద "సర్వే"   ఏ మీడియా వారన్నా చేస్తారా అని నా ప్రశ్న. ఇంతవరకూ అలాంటి సర్వే ఏదీ తలబెట్టిన మీడియా వారు లేరు కదా! 

ప్రతిరోజూ ఎస్ ఎం ఎస్ ప్రశ్నలే! వాటికి జవాబులేన్ని వచ్చాయో తెలియదు! కాసేపు  స్క్రోలింగ్ చెయ్యటం  ఆపైన కొద్ది సేపటికి ఇంతమంది అనుకూలం, మరింతమంది ప్రతికూలం అని ఒక  "పై గ్రాఫ్" చూపించెయ్యటం ఆనవాయితీ. పొరబాటున కూడా  ఒక ప్రశ్నకు మొత్తం ఎన్ని ఎస్ ఎం ఎస్ లు వచ్చాయో ఏ చానెల్ కూడా చెప్పదు, స్టేట్ సీక్రెట్ అయినా లీక్ అవుతుందేమో కాని, ఈ విషయం మటుకు బయటకు రాదు. 

ఉదాహరణకు ఒకానొక ముఖ్యమైన రాజకీయ ప్రశ్న మీద 3 ఎస్ ఎం ఎస్ లు వచ్చాయనుకుందాము. అందులో ఇద్దరు అనుకూలంగా, ఒకళ్ళు వ్యతిరేకంగా ఓటు వేస్తె, మనకు మీడియాలో చూపించేది ఏమిటి! ఆ మూడు ఎస్ ఎం ఎస్ ల లోని వచ్చిన ఓట్లను శాతం కిందకు మార్చి చూపించటం. అప్పుడు జవాబు, "67%" అనుకూలం, 33 శాతం ప్రతికూలం అని చెప్పేసి ఊరుకుంటారు. నిజానికి మొత్తం ఓట్లెన్ని అని చెప్పకుండా ఈ శాతాలు మాత్రమే చూపించటం వల్ల, ఆ చూపించిన శాతాలకు ఏమన్నా గణింపు ఉంటుందా, ఉట్టి గణాంకాల గారడీయే కాని, ప్రజాభిప్రాయం తెలుస్తుందా! 

అందుకే స్టాటిస్టిక్స్ కు ఒక అపప్రధ ఉన్నది  "అబద్ధాలు, మరీ అబ్ధదాలు, స్టాటిస్టిక్స్" అని. ఆ అపప్రధను ప్రతి రోజూ  నిజం చేసే మీడియాను సమీక్షించే వాళ్ళే లేరా అని అనుకుంటే అరణ్య రోదనమే కదా. కనీసం ఒకరి కార్యక్రమాలు మరోకరన్నా  సమీక్షించుకుంటారంటే, వీళ్ళ మధ్య ఎంతటి "ప్రొఫెషనల్ కర్టెసీనో", ఒక పత్రికలో మరొక పత్రిక గురించి వ్రాయటం కాని, ఒక చానెల్ లో మరొక చానెల్ (తమ సిస్టర్ చానెల్ కానిది) గురించి చెప్పటం కాని జరగనే జరగదు. ఏదన్నా తప్పుడు వార్త  వ్రాసినా ప్రసారం చేసినా అలాంటి పొరబాటు గురించి వ్రాసినప్పుడైనా సరే బ్రాకెట్టులో "మా పేపరు కాదు" అని వ్రాస్తారే తప్ప, ఫలానా పేపరు బాధ్యత లేకుండా ఇలా తప్పు వార్తా వ్రాసింది అని పొరబాటున కూడా వ్రాయరు. ఎందుకని! ప్రొఫెషనల్ కర్టెసీ, ఇవ్వాళ వాళ్ళకి అయ్యింది రేపు మనకి అవ్వచ్చు కదా అన్న భవిష్య  దర్శనం అనబడే ఒకరి వీపు మరొకరు చమ్మగా  గోకుకొనుట అను ఆనవాయితీ లేదా గౌరవ సాంప్రదాయం. పైగా దురాచారాలు పోవాలని పెద్ద స్లోగన్లు. ఇలా ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పకుండా ఎస్ ఎం ఎస్ పోల్ నిర్వహించటం దురాచారం కిందకి రాదా?

ఇంతటి ఉపోద్ఘాతం ఎందుకు అంటే, నేషనల్ మీడియాగా పిలవబడే ఢిల్లీ లోకల్ మీడియా చానెళ్ళను సమీక్షించటానికి క్లాత్ లైన్ అనే చక్కటి కార్యక్రమం, మధు ట్రేహాన్  అనే ఆవిడ నిర్వహిస్తున్నది, అని చెప్పటానికి.  ఆవిడ కూడా ఒకప్పటి (ఆరోగ్యకరమైన) మీడియానే. ఇవ్వాల్టి మీడియా ఆవిడ కార్యక్రమాన్ని చూపిస్తుందా, పొరబాటున చూపించదు. అందుకని ఆవిడ, ఆవిడ టీమ్, తమ కార్యక్రమాలను యు ట్యూబ్ లోకి అప్లోడ్ చేస్తారు. వారి యు ట్యూబ్ చానెల్ ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు:


క్లాత్ లైన్ పేరిట ఉన్న ఈ యు ట్యూబ్ చానెల్ లో ప్రతి వారం, ఆంగ్ల/హిందీ చానెళ్ళల్లో జరిగిన అవకతవకల గురించిన విమర్శ, మంచి కార్యక్రమాల మీద పొగడ్త ఉంటాయి. అంతే కాదు, అరివీర బహయంకర న్యూస్ యాంఖర్ల ఇంటర్వ్యూలు ఉంటాయి. పోలీసు ఇంటరాగేషన్ లాగ, కాంగ్రెస్ వకాల్తా పుచ్చుకున్నట్టుగా బాహాటంగా కనపడటానికి సిగ్గు పడకుండా తన ఇంటర్వ్యూలను నడిపే కరణ్ థాపర్,  మధు ట్రెహాన్  ఇంటర్వ్యూ చేస్తుంటే చూడండి ఎన్ని మెలికలు తిరిగిపొయ్యేడో! 



అలాగే మరొకావిడ తన అద్భుత జర్నలిస్టిక్ టాలెంట్ తో పద్మశ్రీ కూడా  సంపాయించుకుని, చివరకు రాడియా టేపుల్లో అపకీర్తి మూటకట్టున్నావిడ ను కూడా అలాగే ఈ చానెల్ లో ఇంటర్వ్యూ చెయ్యబడింది. ఆ ఇంటర్వ్యూ కూడా చూడండి:





 మరొకటి, మనందరికీ తెలిసిన పెద్ద స్టింగ్ ఆపరేషన్, పాపం మన బంగారు లక్ష్మణ్ మీద జరిగింది. మీడియా లెక్క ప్రకారం బంగారు లక్ష్మణ్ ఒక్కడే అవినీతి రాజకీయ నాయకుడు, మరెవ్వరూ లేరు అనుకునేట్టుగా ఆ స్టింగ్ ఆపరేషన్ కు ప్రచారం కలిగించారు. అలా ప్రచారం చెయ్యటం లో ఉద్దేశ్యం, మీడియా స్వాతంత్ర్యం మాత్రమే ఒక్కటేనా అంటే, జవాబు చెప్పటం కష్టం. సరే ఆ స్టింగ్ ఆపరేషన్ నిజానికి చేసిన మనిషి ఏమయి పొయ్యాడు? అతని దీన గాధ  ఏమిటి,  ఏ ఒక్క చానేలన్నా చూపించిందా? నాకు తెలిసి ఇంతవరకూ లేదు. తెహల్కా గురించి చిలవలు పలవలుగా ( ఈ మధ్య ఆ చానెల్ పరువు పోయ్యేవరకూ) పొగడ్తలే కాని, ఆ  మొట్టమొదటి స్టింగ్ ఆపరేషన్ చివరకు ఏమయ్యింది చేసిన మనిషి ఎలా బతుకుతున్నాడు, తోటి చానెల్ వాళ్ళు పట్టించుకోక పోవటం మన మీడియా స్వాతంత్ర్యానికి గీటు రాయి.  ఈ విషయంలో న్యూస్ లాండ్రీ ఆ స్టింగ్ ఆపరేషన్ చేసిన మాథ్యూ శామ్యూల్ తో ఇంటర్వ్యూ ప్రసారం చేసి మనకు తెలియని విషయాలు ఎన్నో తెలియచేశారు. చూడండి ఆ ఇంటర్వ్యూ :



 



ఇంతవరకూ న్యూస్ లాండ్రీ గురించిన మంచి మాటలు చెప్పాను కాని, ఈ చానెల్ కొంత వామ పక్షపు వాసనలు  వేస్తూ ఉంటుంది.  కానీ,  ఈ వామ పక్షపు వాసనలు అందులో కొన్ని కార్యక్రమాల్లోనే మరీ విపరీతంగా వస్తూ ఉంటాయి. అటువంటి కార్యక్రమాల వల్ల, ఈ మీడియా చాకి రేవు పని, ఏదన్న ఇజపు ప్రచారం కోసమా అన్న అనుమానం కూడా వస్తూ ఉంటుంది.మీడియా సమీక్ష చేస్తున్న ఈ న్యూస్ లాండ్రీ ఇలా ఇజపు వాసనలు కూడా  కొట్టకుండా ఉండి, నిజమైన నిష్పాక్షపాత చాకి రేవు మరి ఇంకా ఎంతయినా బాగుంటుంది.



మనకు తెలుగులో కూడా, మీడియా చాకి రేవు ఉంటే బాగుండును అనే ఆలోచన రావటానికి అనుగుణంగానే మన తెలుగు పేపర్లు  చానెళ్ళు ప్రవర్తిస్తున్నాయి. ఈ విషయంలో ఒకప్పుడు ఎ పి  మీడియా కబుర్లు గా ఉన్న బ్లాగ్, ప్రస్తుతం మారిన పరిస్థితులవల్ల "తెలుగు మీడియా కబుర్లు" బ్లాగ్ ఉన్న మన రామూ  గారి బ్లాగ్ లో,ఆయన 2013లోనే వ్రాశారు. తెలుగులో V6 అనే చానెల్ లో తీన్ మార్ అనే కార్యక్రమంలో మీడియా కార్యక్రమాల మీద విసుర్లు ఉన్నాయని. సరే ఒక మీడియాలో ఒక కార్యక్రమం ఒక మంచి "మొదలు".  



ఈ విషయంలో రామూ గారు ఆయన బ్లాగులో వ్రాసిన వ్యాసం ఈ కింది లింకు నొక్కి చదువుకోవచ్చు 




నియంత్రణ లేనిది ఏదైయినా సరే దారి తప్పుతుంది,  అందుకని మన తెలుగులో కూడా  న్యూస్ లాండ్రీ లాగ ఒక యూ ట్యూబ్ చానెల్ మొదలవ్వాలని నా కోరిక, దారి తప్పిపోయిన మన మీడియాకు కొద్దిలో కొద్దిగా చెక్ పాయింట్ గా ఉండాలని నా ఆకాంక్ష. 

మన తెలుగులోనూ "మాజీలు" ఎందరో ఉన్నారు, ఊరికే పొద్దు గడవని  పానెల్ చర్చల్లో పాల్గొనే బదులు, ఇలాంటి మీడియా చాకి రేవు తెలుగులో మొదలు పెడితే బాగుండును. మన లాంటి వాళ్ళు ఆ చానెల్ కు మనకు కనపడిన మీడియా అవక తవకలను "రిపోర్ట్" చేస్తూ మీడియా స్వాతంత్ర్యాన్ని కాపాడే కర్తవ్యాన్ని కొంతలో కొంత నెరవేర్చచ్చు.