23, సెప్టెంబర్ 2009, బుధవారం

పరోపకారి పాపన్న-సమీక్ష లాంటి ఇంటర్వ్యూ


పరోపకారి పాపన్న కథలు* చందమామలో ప్రచురించబడిన ధారావాహికల లో ముఖ్యమైనది. ఈ కథలు ఎంత ప్రాచుర్యం పొందాయంటే, ఎవరైనా కొంచెం మంచికి పోయి సహాయపడితే, అటువంటివారిని పరోపకారి పాపన్నరా వాడు అని పిలవటం వాడుక అయ్యింది. అటువంటి పరోపకారి పాపన్నతో ఈ రోజున సంభాషిద్దాం అని అలా వెతుక్కుంటూ,ఊరంతా తిరిగినాక, ఒక సందులో తెరపగా ఉన్న చిన్న ఇల్లే ఆయనది అని తెలిసింది. గేటు తెరుచుకుని లోపలకి వెళ్ళితే ఒక వయసు మళ్ళినాయన పడక కుర్చీలో పడుకుని చదువుకుంటున్నారు. చందమామలో మనకి పరిచయమేగా, పెద్దవాడయిపోయినా పాపన్నగారిని ఇట్టే గుర్తుపట్టాను.

నేను: ఏమండోయ్ పాపన్నగారూ! నమస్కారం

పాపన్న: ఎవరు నాయనా, వయసు మళ్ళిపోయింది చూపు సరిగ్గా ఆనటంలేదు మీకు నేనేమైనా సహాయం చెయ్యగలనా? చెప్పండి


నేను: లేదండి,సహాయం కాదండీ, నేను మీ అభిమానిని మీతో కాసేపు ముచ్చటిద్దామని మిమ్మల్ని పలకరించాను, మీకు ఇబ్బందేమి లేదుకదా.

పాపన్న: అబ్బే, ఇందులో ఇబ్బందేమున్నది నాయనా, అలా కూర్చో చెప్పు ఏం మాట్లాడుదామనుకుంటున్నావు.

నేను:(కొంచెం బిడియంగా)మీ గురించి నా బ్లాగులో వ్రాద్దామనుకుంటున్నాను, మీ గురించి వివరాలు చెప్పగలరా.

పాపన్న: అడుగు బాబూ, నాకు గుర్తు ఉన్నంతవరకు, తెలిసినంతవరకు చెప్తాను.

నేను: మీరు ఎక్కడి వారండి, మీరు ఎప్పుడు పుట్టారు?
పాపన్న: ఎక్కడివారంటే?? నేను పదహారు ఆణాల తెలుగు వాణ్ణి,ఇప్పుడు మీరు ఏదో జిల్లాలు, ప్రాంతాలు అని కొంచెం బేధించి మాట్లాడుకుంటున్నారనిపిస్తున్నది. అప్పట్లో తెలుగువారందరూ ఒకటే.నేను తెలుగు చందమామలో పుట్టాను. అక్కడే అనేకమందికి సహాయం చేసాను.

నేను: చందమామలో పుట్టారు, ఇంత పేరు తెచ్చుకున్నారు, మిమ్మల్ని సృష్టించిన వారెవ్వరండి, చందమామలో ఎప్పుడు పుట్టారు?

పాపన్న: పేరుదేమున్నది నాయనా! ఆపదలో ఉన్నవారిని, నిస్సహాయులకు సహాయం చెయ్యటమే నాకు తృప్తిని,హాయిని ఇచ్చింది. నన్ను సృష్టించినది, ఎం రంగారావుగారని, చందమామలోనే పనిచేసేవారు. ఆయన చాలా ఊహించి, నన్ను ప్రజలకు ముఖ్యంగా బాలలకు పరిచయించేసారు. సరిగ్గా గుర్తులేదు, 1962 జ్యేష్ట మాసంలో అనుకుంటాను మొదటిసారి నాకు ఈ ప్రపంచాన్ని రంగారావుగారు చూపించారు. అప్పటికే నాకు 14-15 ఏళ్ళు ఉంటాయి.
నేను: మీరు ఎంతవరకు చదువుకున్నరండి. ఎవరిదగ్గర.......

పాపన్న: చదువుదేమున్నది ఏదో చదువుకున్నాను, మా గురువుగారు చెప్పిన పరోపకారం మిదం శరీరం మాత్రం బాగా వంటబట్టింది.

నేను: మీరు భీమన్నను, తాతయ్యగారిని ఎరుగుదురా?

పాపన్న: (నవ్వుతూ) ఆ! ఆ! భీమన్న గురించి చాలా విన్నాను. నాకు ముందటివాడు. తొందరపాటు, అమాయకత్వమేకాని, చాలా మంచివాడని అందరూ చెప్పుకుంటారు. ఇక తాతయ్యగారు నేను కలసి మెలిసి తిరిగాం. నాకంటే చాలా పెద్దవాడు. చాలా నీతిమంతుడు ఎన్ని చక్కటి కథలు చెప్పేవాడు, వాళ్ళమనవలకి, మనవరాళ్ళకే కాకుండా నాకు కూడ. ముఖ్యంగా ఆయన చెప్పిన కథలలో సత్యవాది, అసత్యవాది కథలు ఇప్పటికి గుర్తున్నాయి.
నేను: మీకు పరోపకారి పాపన్న అన్న పేరు ఎందుకు వచ్చిందండి?

పాపన్న: ఇప్పుడంటే పెద్దవాణ్ణయిపోయాను, ఎవరూ నన్ను ఆడగటంలా. ఈ మధ్యవరకూ, అడిగిన వారికి లేదనకుండా నాకు చేతనయినంత ఉపకారం చేశాను. నిస్సహాయులను చేరదీసి ఆదరించాను. అసలు నా సృష్టికర్త రంగారావుగారే, నా కణకణాల్లోనూ పరోపకారం రంగరించి పోశారు. అందుకనే కాబోలు నలుగురూ, ఆయనే పరోపకారి పాపన్న అనుకోవటం విన్నాను. అలా పిలిచినప్పుడల్లా నాకు కొంత ఇబ్బందిగా ఉంటుంది, మనమేదో చేతయినంత చేస్తాం ఆ మాత్రానికే అలా మెచ్చుకోవాలా. నేను చెయ్యలేనిది ఎట్టగో చెయ్యలేనుకదా.

నేను: (లేచి ఆయన చేతులు రెండు కళ్ళకు అద్దుకుని) పాపన్నగారూ, ఎంతమందికి సహాయం చేసినా, మీకు మీరేదో గొప్పపని చేసానని అనుకోవటమే లేదు. అదేనండి మీ గొప్పతనం, మా అందరికీ మీరంటే అభిమానం భక్తి అందువల్లనే కదండీ

పాపన్న: చిరునవ్వు నవ్వి అలా కూచూండి పొయ్యారు.


నేను: పాపన్న గారూ మీకు జీవితంలో కష్టాలు ఏమైనా ఎదురయ్యాయా?
పాపన్న: కష్టాలా, లేదండి, నాకెప్పుడూ అలా అనిపించలేదు. ఏదో నాపని నాది, ఓకళ్ళ జోలికి పోను. నాకు చేతయ్యినపని చేసుకోవటం అంతే.
నేను: మీరు మీ పని మానుకుని ఇతరులకి సహాయం చెయ్యలని ఎందుకు అనుకునేవారండి.
పాపన్న: చూడు నాయనా, పాత కాలం వాణ్ణి, ఇది నా పని, ఈ పని వేరొకరిది అని నాకు తెలియదు. అన్నీ నా పనులే. నా పని ఎప్పుడూ ఆగలేదు, చెడలేదు.

నేను: పరోపకారం వల్ల మీకు ఉపకారం జరిగిందా పాపన్నగారూ.

పాపన్న: ఎంతమాట నాయనా మనకు ఉపకారం జరగాలని ఇతరులకి ఉపకారం చేస్తామా ఎంత తప్పు. సహాయం చెస్తున్నానని ఏనాడు అనుకోలేదు. అది కూడ నాపనే. అందులో ఎంతో ఆనందం ఉన్నది. భగవంతుణ్ణి సేవించటం కంటే ఎంతో తృప్తి నిస్తుంది.

నేను: మీకు చిత్రాగారు గుర్తున్నారండి

పాపన్న: అయ్యెయ్యో
చిత్రాగారు, ఆయన అసలు పేరు రాఘవులు గారు బాబూ. చాలా మంచివాడు. నా రూపు రేఖలన్నీ ఆయన గీసినవే, ఆయన లేకపోతే నేనెక్కడున్నాను. 1979లో కాబోలు స్వర్గస్తులయ్యారు. చాలా బాధపడ్డాను ఆరోజున.

నేను: చివరగా, పాపన్నగారూ, ఇప్పటి తరానికి మీ సందేశం...
పాపన్న: సందేశమా!! నేనేపాటివాణ్ణి సందేశమివ్వటానికి. ఒక రెండు ముక్కలు చెప్తాను భగవంతుదు మన్ని సృష్టించినది ఒకరికొకరు ఉపయోగపడటానికి. ఇందాక చదువు గురించి ఆడిగావుకదా, నేను చదువుకున్నది ఒక్కటే, మన బ్రతుకు మనం బ్రతకటం, ఇతరులకి అడ్డుపడకూడదు. ఎవరి బ్రతుకులు వారివి, ఇంకొకళ్ళకు బాధకలిగించకుండా బ్రతకటమే నిజమైన చదువు. ఉట్టి అక్షరాలు నేర్చుకుని చదువగలిగినంతమాత్రాన అక్షరాస్యుడుకాదనుకుంటున్నాను.

నేను: చాలా చక్కటి విశేషాలు చెప్పరండి, చాలా ధన్యవాదాలు. మరి నాకు శలవు ఇప్పించండి. నమస్కారం.

పాపన్న: అలాగేనాయనా. ఉండు ఉండు నా బండి తీస్తాను, మీ ఇంటిదాకా దిగబెట్టి వస్తాను (అని లేచారు)

పాపన్న గారిని నేను వెళ్ళగలనని ఆయనను సముదాయించి మళ్ళీ కూచోబెట్టి, నేను ఇలా చక్కా వచ్చాను.

****************************************
నాకు తెలుసు మీరు అడుగుతారని, పాపన్న కథలు సినిమాగా తీస్తే ఎవరు వెయ్యగలరు ఈ వేషం అనేకదూ? నా ఉద్దేశ్యంలో బాలయ్య అయితే (మీరు అనుకునే బాలయ్య కాదండి బాబు! అసలు బాలయ్య నేరము శిక్ష లాంటి మంచి సినిమాలు తీసి కొన్ని చక్కటి వేషాలు కూడా వేసాడే ఆయన)

****************************************
*ఈ లింకు నుండి మునుపు డౌన్లోడ్ చేసుకోవటానికి ఆవకాశం ఉండేది. కాని కాపీ రైటు సమస్యలవల్ల ఆ సౌకర్యం తొలగించటం జరిగింది. ఇప్పుడు ఈ ధారావాహిక చదవాలంటే, చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ వారు ఉంచిన పాత చందమామలను తెరిచి చదువుకోవచ్చు.

8 కామెంట్‌లు:

  1. శివ గారూ! 'పరోపకారి పాపన్న'తో మీ సమీక్ష లాంటి ఇంటర్వ్యూ చాలా చాలా బావుంది. రచయిత గురించీ, చిత్రా గారి గురించీ భలేగా చెప్పించారు.

    ఇంతకుముందు 'శిథిలాలయం' ధారావాహిక గురించి కూడా మీరు వైవిధ్యంగా రాశారు.

    అభినందనలు!

    రిప్లయితొలగించండి
  2. పాపన్న కు నేనో పెద్ద పంఖాని. మా పాపన్న తో ముఖాముఖి హృద్యంగా ఉంది. మీరన్నట్టు బాలయ్య (అన్నమయ్య సినిమాలో నాగార్జున తండ్రిగా వేశారు) ఖచ్చితంగా సరిపోతారు.

    రిప్లయితొలగించండి
  3. బాగుందండి ! పాత చందమామ చదువుతున్న ఫీలింగ్ వచ్చింది !

    రిప్లయితొలగించండి
  4. ఆహా. పాపన్న పాత్రలో పరకాయ ప్రవేశం చేశారుగా. ఇలాంటి పరిచయానికి ఏ కాపీ రైట్ సమస్యలూ రావు కదూ. చాలా బాగుంది. అభినందనలు..

    రిప్లయితొలగించండి
  5. పరొపకారి పాపన్నతొ మీ వూహజనిత ముఖాముఖి చాలా బాగుంది shiva garu.
    అంతర్జాలంలొ బహుశా ఒక చందమామ పాత్రతొ, ఈటువంటి ప్రయోగం ఈదే మొదటి సారి అనుకుంటాను .
    ఆభినందనలతొ,
    Srinivas k.

    రిప్లయితొలగించండి
  6. namaste sir,

    the serial pdfs you kept in rapid share are no more working. can you kindly do the needful.
    I bought a new laptop and i want to read chandamama serials as the first document. Hope you understand!

    -Karthik

    రిప్లయితొలగించండి
  7. DEAR KARTHIK,

    Please try the following link.

    http://rapidshare.com/files/287403678/ABCDEF.PDF

    After you download, write a comment and I shall remove it. For some reasons, I removed all the links.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.