12, నవంబర్ 2009, గురువారం

చందమామ అభిమానులకు శుభవార్త

చందమామ అభిమానులకు, చందమామ చందమామ పిచ్చాళ్ళకు స్వాగతం
తెలుగు చందమామ చదువుతూ పెరిగిన తరానికి చెందిన వాళ్ళం. చందమామ అంటే ప్రాణం మాకు. చందమామలో బొమ్మలు, కథలు, అట్ట మీద బొమ్మ , అందులో వేసే మరిన్ని శీర్షికలు బేతాళ కథలు, పురాణ కథలు , జానపద కథలు, ఐద్రజాలిక కథలు, అబ్బో!!!! ఒకటేమిటి అనేకం. ఎన్నెన్ని కథలు. ఎన్నెన్ని చక్కటి పాత్రలు, పరోపకారి పాపన్న, గుండు భీమన్న, తాతయ్య, శిఖిముఖి, ఖడ్గవర్మ, ధూమకుడు, మాంత్రికులు, రాక్షసులు, రాజకురారులు, రాజకుమార్తెలు, విదూషకులు, రాజులు, చక్రవర్తులు ఇలా ఎంతమంది మరెంతమంది, మనకు భాష, సంస్కృతీ , మర్యాద, తర్కం, లోకజ్ఞానం ఎన్నెన్ని నేర్పారు, కొడవటిగంటి, దాసరి గార్ల ఆధ్వర్యాన.

మహానుభావుడు చక్రపాణిగారు ఏ అద్భుత క్షణాన ఈ చక్కటి ఆలోచన వచ్చి ఇంత చక్కటి పత్రిక మనకు అందించారో కదా! అందులో చిత్రాగారు, శంకర్ గారు, వడ్డాది పాపయ్య గారు వేసిన బొమ్మలు చూసి ఎంత మురిసిపోయి, ఎన్నెన్ని సార్లు చూసేవాళ్ళం. ఇప్పటికి ఆ పాత చందమామ చూస్తె కలిగే ఆనందం ఎంత మాత్రం తగ్గలేదు కదా.

చందమామ మీద ఉన్నా అభిమానంతో అనేకమంది తమ తమ బ్లాగుల్లో వెబ్ సైట్లల్లో వ్రాస్తున్నారు. చందమామ అభిమానులకు ఆయా వ్యాసాలన్నిటినీ ఒక చోటే అందిస్తే అన్నఆలోచన శివరామ ప్రసాదు, రాజశేఖర రాజులకు వాళ్లు చాటింగు చేస్తుండగా చర్చకు వచ్చింది. ఇదిగో ఈరోజున ఈ బ్లాగు రూపొందింది.

ఈ బ్లాగు ముఖ్య ఉద్దేశ్యం, చందమామ గురించిన వ్యాసాలన్నిటినీ ఒక చోట ఏర్పరిచి అందరికి అందుబాటులోకి తేవటం. ఇందులో భాగస్వాములుగా ఉండటానికి ప్రస్తుతానికి

శివరామ ప్రసాదు కప్పగంతు
రాజశేఖర రాజు
ఫణి (బ్లాగాగ్ని)
శ్రీమతి సుజాత
లు సుముఖత చూపారు . ఇంకా ఆహ్వానాలు శ్రీ వేణు, త్రివిక్రం గార్లకు పంపటమైనది . వారుకూడా ఇందులో తప్పకుండా పాలు పంచుకుంటారు. ఇందులో భాగస్వాములుగా చేరిన వారు అందరూ, తమ తమ బ్లాగుల్లో మునుపు వ్రాసిన వ్యాసాలన్నీ ఈ భాగులో ప్రచురిస్తారు. మున్ముందు వ్రాయబోయే వ్యాసాలను తమ బ్లాగులో ప్రచురించటంతో పాటుగా ఇక్కడకూడా ప్రచురిస్తారు. ఆసక్తికలిగి, తెలుగు చందమామ గురించి వ్యాసాలూ, తమతమ జ్ఞాపకాలను అందరితో పంచుకోవాలి అనుకునేవారు ఈ బ్లాగులో భాగస్వాములు కావచ్చు.

3 కామెంట్‌లు:

  1. శివరామ ప్రసాద్ గారూ,
    ప్రశాంత మైన నది ఒడ్డున కూచుని అందమైన ప్రకృతి నేపధ్యంలో కొండల మాటున ఉదయించే చందమామను సొంతం చేసుకోడం ఎంత బావుందో, ఈ ఫొటో ఎక్కడ సంపాదించారో గానీ మీరు!

    అసంఖ్యాక చందమామ అభిమానులు తమ జ్ఞాపకాలను ఇక్కడ పంచుకుంటారని భావిస్తున్నాను.

    ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  2. నిజంగా చందమామ చరిత్ర పరిరక్షణ విషయంలో ఇది మరో శుభోదయం లాంటిది. కాపీ రైట్‌ తదితర ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి చందమామ అభిమాని, పాఠకులు, చందమామ శ్రేయోభిలాషులూ ఇక్కడ చందమామకు సంబంధించిన తమ సొంత రచనలు, జ్ఞాపకాలు ఇలా సమస్త సమాచారాన్ని ఇక్కడ స్వేచ్చగా పంచుకోగలరని ఆశిస్తున్నాము.

    రిప్లయితొలగించండి
  3. ‘చందమామ’ గురించి అభిమానులు రాసిన వ్యాసాలన్నీ ఒకచోట...అనే ఆలోచనే అద్భుతం! అది బ్లాగు రూపంలో ఇలా సాక్షాత్కరించటం చాలా సంతోషంగా ఉంది.

    చందమామ అభిమానుల జ్ఞాపకాలూ, కథనాలూ, అభిప్రాయాలూ ... వీటన్నిటికీ ఇది చక్కటి వేదికగా నిలుస్తుందని ఆశిస్తున్నాను!

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.