1, డిసెంబర్ 2009, మంగళవారం

పౌరాణిక చిత్ర కల్పనా శిల్పి ... శంకర్ !

శ్రీ కృష్ణుడు కల్లోకి వస్తే... అది నిశ్చయంగా ఎన్టీఆర్ రూపమే అవుతుంది! అలాగే... ‘మహాభారతం’ అయినా, ‘రామాయణం’ అయినా- వాటిలోని సంఘటనలు, చాలామంది తెలుగు పాఠకులకు ‘శంకర్’ చిత్రాలుగానే స్ఫురణకు వస్తాయి.



పౌరాణిక ఘట్టాలకు సాధికారికంగా, నేత్రపర్వంగా చిత్రకల్పన చేయగలిగిన ‘చందమామ’ శంకర్... (కె.సి. శివశంకర్).... ఆ పత్రికలో మిగిలిన నాటి తరం చివరి చిత్రకారుడు!

దశాబ్దాలుగా వేన వేల అజరామరమైన, అపురూప చిత్రాలను దీక్షగా సృజించి కూడా ప్రాచుర్యానికి దూరంగా ఉండిపోయిన అద్భుత కళాకారుడు!

పౌరాణిక గాథలూ, ఇతిహాసాలూ చందమామలో ప్రచురితమై అశేష పాఠకుల మనసులకు హత్తుకుపోయాయంటే... ముఖ్యంగా శంకర్ ప్రతిభా విశేషాలే కారణమనిపిస్తాయి.



చందమామలో 1969 మార్చిలో ‘మహా భారతం’ ధారావాహికగా మొదలైంది. మొదటి భాగానికి వడ్డాది పాపయ్య గారు బొమ్మలు వేశారు. టైటిల్ లోగో వ.పా. శైలిలో నే ఉండటం గమనించవచ్చు. రెండో భాగం నుంచీ బొమ్మల బాధ్యతను శంకర్ గారు తీసుకున్నారు. ఈ ధారావాహిక 1974 సెప్టెంబరు వరకూ.... ఐదు సంవత్సరాలకు పైగా కొనసాగింది.


1974 అక్టోబరు నుంచీ ‘వీర హనుమాన్’ ధారావాహిక ప్రారంభమైంది. దీని లోగో కూడా మహాభారతం మాదిరే ఉంటుంది!


మహాభారతం సీరియల్ గా వచ్చినపుడు కొన్ని సంచికలే అందుబాటులో ఉండి, వాటిని మాత్రమే చదవగలిగాను. వీరహనుమాన్ మాత్రం దాదాపు అన్ని సంచికలూ చదివాను. సరళమైన చందమామ భాషతో పాటు అద్భుతమైన శంకర్ బొమ్మలు పేజీలను అలంకరించివుండటం వల్ల ఈ ధారావాహిక రసవత్తరంగా, ఉత్కంఠభరితంగా అనిపించింది.


కురుక్షేత్ర సమర ఘట్టాలు, భీష్ముడి అవక్ర పరాక్రమం, పాండవుల మహాప్రస్థానం; రాముడి అరణ్యవాసం, వాలి సుగ్రీవుల గాధ, వాలి వధ, హనుమంతుడి లంకా నగర సాహసాలు, వారధి నిర్మాణం, రామ రావణ యుద్ధం .. ఇవన్నీ శంకర్ కుంచె విన్యాసాల మూలంగా నా మనో ఫలకంపై నిలిచిపోయాయి.

ఇలాంటి అనుభూతులే అసంఖ్యాకమైన పాఠకులకు ఉండివుంటాయి!



‘చందమామ’ ఆరంభమైన 8 సంవత్సరాల తర్వాత, 1955 సెప్టెంబరు సంచికలోకి నడిచొచ్చాడు విక్రమార్కుడు! శవంలోని బేతాళుణ్ణి భుజాన వేసుకుని, మౌనంగా శ్మశానంకేసి నడిచే విక్రమార్కుడి బొమ్మను మొదట ‘చిత్రా’ వేశారు. దానిలో విక్రమార్కుడు మన వైపు తిరిగి ఉంటే, బేతాళుడి కాళ్ళు కనిపిస్తుంటాయి. ఆ కాళ్ళకు బదులు తల కనపడేలా దీన్ని మార్చి, మరింత మెరుగుపరిచింది శంకర్. ఓర చూపు, స్థిర సంకల్పంతో ఠీవిగా కదులుతూ వీపు కనిపించేలా నడిచే విక్రమార్కుడి భంగిమ చిత్రించి, దానికి శాశ్వతత్వం సమకూర్చారు ఆయన.

బేతాళ కథ చివరిపేజీలో శవంలోంచి మాయమై, చెట్టుమీదకు దూసుకుపోయే బేతాళుడి బొమ్మలు శంకర్ ఎన్ని వందలు వేశారో! ప్రతి బొమ్మలోనూ సారాంశం ఒక్కటే అయినా, ఎంతో వైవిధ్యం చూపించారు. తోకతో తెల్లగా దయ్యంలా (దయ్యం ఇలాగే ఉంటుందని.... నాలాంటి ఎందరికో చిన్నపుడు అనిపించేది) చెట్టు మీదికి దూసుకుపోయే బేతాళుడూ; కత్తి దూసి, వెంటాడే విక్రమార్కుడూ... ఈ చిత్రం ఎందరో పాఠకుల స్మృతుల్లో సజీవం!


చిత్రా, శంకర్ ల బొమ్మలతో మాత్రమే చందమామ సంచికలు వచ్చిన దశకాల్లో చందమామది ఉజ్వల శకం. ఈ ఇద్దరు చిత్రకారులదీ సూక్ష్మాంశాలను కూడా వదలకుండా వివరంగా చిత్రించే శైలి. వీరి బొమ్మల్లో ఆకట్టుకునే నగిషీల్లో కూడా సారూప్యం కనిపిస్తుంది. అయినా, ఇద్దరి బొమ్మల్లో స్ఫష్టమైన తేడా! చిత్రా బొమ్మల్లో పాత్రలు కాస్త ‘లావు’ ; శంకర్ పాత్రలు మాత్రం ‘స్లిమ్’! (రాక్షసుడూ, రాక్షసి లాంటి పాత్రలు మినహాయింపు అనుకోండీ.)

చిత్రా విశిష్టత జానపదమైతే... శంకర్ ప్రత్యేకత పౌరాణికం!


శంకర్ లాంటి గొప్ప చిత్రకారుడు గీసిన బొమ్మల్లోంచి ‘కొన్నిటిని’ ఎంచుకుని, టపాలో చూపించటం చాలా కష్టమైన పని. ఆయన ‘వైవిధ్య ప్రతిభను చూపించే బొమ్మల’ వరకే పరిమితమైనా సరే, ... అదీ ఐదారు బొమ్మల్లో సాధ్యం కాదు.

మరేం చేయటం?

‘కొండను అద్దంలో చూపించటం’ కష్టమే. అలా చేసినా ఒక పక్కే కనపడుతుంది. మరి కనిపించని పార్శ్వం సంగతో?


అందుకే... శంకర్ గీసిన కొన్ని బొమ్మలను ‘మచ్చుకు’ ఇస్తూ సంతృప్తి పడాల్సివస్తోంది. (చందమామ పత్రిక సౌజన్యంతో).



హాభారతం లోని చిన్ననాటి శకుంతల బొమ్మ చూడండి. వృక్షాలూ, లతలూ, పూలూ స్వాగతించే అద్భుతమైన ఆ అరణ్యంలోకి వెళ్ళాలనిపించటం లేదూ? కణ్వముని తో పాటు మనకూ ఆ బాల శకుంతలపై ప్రేమ పుట్టుకొచ్చేలా శంకర్ వేశారు.



శ్వేతుడి గదాఘాతానికి భీష్ముడి రథం నుగ్గునుగ్గయ్యే సన్నివేశం ఎంత గగుర్పాటు కలిగిస్తుందో గమనించండి.









క్షి ఆకారంలోని ‘క్రౌంచ వ్యూహం’ చూడముచ్చటగా అనిపిస్తుంది. దీనిలో రథ, గజ, తురగ, పదాతి సైన్యం చూడండి! ‘విహంగ వీక్షణం’ చేయించారు కదూ, శంకర్!









ర్వతమ్మీది నుంచి హనుమంతుడు లంకా నగరాన్ని చూడటం...దూరంగా సముద్రం... అద్భుతంగా లేదూ?



క్కడ కనిపించే ... ‘రాతి తల’ను వేసింది శంకరే. ‘ప్రపంచపు వింతలు’ అనే సింగిల్ పేజీ ధారావాహిక చందమామలో 1960లలో వచ్చేది. 1969 మార్చి సంచికలోది ఈ బొమ్మ.



శంకర్ గారి జీవిత విశేషాలు చాలా వివరంగా ఇక్కడ లభిస్తాయి. చదవండి...!

2 కామెంట్‌లు:

  1. అబ్బా వేణు గారు, ఎంత బాగున్నాయో బొమ్మలు. నాకు మటుకు చందమామకు సంబంధించి ఒక తీరని కోరిక. చందమామ కధలకు సంబంధించిన అన్ని బొమ్మలు, అవి ఏ కధ అయినా సీరియల్ అయినా సరె, అన్నీ ఒక స్లయ్డ్ షొ లాగా చూడాలని. అలాంటి అవకాశం ఎవరైనా కల్పిస్తే దయచేసి తెలియచెయండి.

    రిప్లయితొలగించండి
  2. nijangaaa..anni bommmalu manasu lagesthunnaye...chandamam ki ardham ,ardhavanthamaina bommale kadaa...

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.