29, మార్చి 2010, సోమవారం

శంకర్ గారితో సంభాషణ

బొమ్మ వేసుకుంటున్న శ్రీ శంకర్ (ఫోటో సౌజన్యం శ్రీ రాజు)పిల్లలుగా ఉన్నప్పుడు ఇంట్లో తాతయ్యో , బామ్మో, ఇతర పెద్దలో మన పురాణాలలోని కథలు వాళ్ళకు తెలిసినంతవరకు చెప్తూ ఉంటారు. కాని వాళ్ళు చెప్పే కథలో వచ్చే కృష్ణుడు, రాముడు, సీత, రావణాసురుడు, శకుని ఇలాంటి వాళ్ళి ఎలా ఉంటారో ఎలా తెలుస్తుంది? వాళ్ళు చెప్పిన కథలో ఉన్న వర్ణనకు మన ఊహ జోడించి, కొంతలో కొంత ఆయా పురాణ పురుషుల రూపాలను మన మనసులో గీసుకోవటానికి ప్రయత్నిస్తాం.

కాని చందమామ చదువుతూ పెరిగిన బాలలకు ఈ కష్టాలు ఏమీ లేవు. కథ చదివిన తక్షణం మనకు ఆయా పాత్రల వివరాలు చక్కగా తెలిసిపోతాయి. చక్కటి తేట తెలుగులో, రామాయణ, భాగవత, భారతాలే కాక, దేవీ భాగవతం, వీర హనుమాన్ వంటి ఇతర పురాణాలను కూడ బాలలకు పంచి ఇచ్చిన ఘనత చందమామ వారిది. కాని, ఆ పురాణాలలో ఉన్న రాముడు, కృష్ణుడు ఇత్యాది మహా పురుషులను, మనకు కళ్ళకు కట్టిన ఘనత ఒకే వ్యక్తిది. ఆ వ్యక్తే మనకందరకూ సుపరిచితమైన శంకర్.


శంకర్ గారి చేతిలో రూపు దిద్దుకున్నఅగస్త్యుడు
పురాణాలలో ఆయన వేయని బొమ్మలేదు. ప్రతి పురాణ పాత్ర ఆయన ద్వారానే అనేక తరాల పిల్లలకు పరిచయం చెయ్య బడ్డాయి. అటువంటి మహత్తర కళాకారుని కలసి ఆయన ఆశీర్వచనాలు తీసుకోవాలని ఎప్పటి నుండొ కోరిక. నేను 1966 జూన్ నెలలో మొదటిసారిగా చందమామను చదివాను. అందులో ఉన్న అగస్త్యుని బొమ్మ నన్ను ఎంతగానో ఆకర్షించింది. అంతటి శక్తిమంతుడైన ఆ మహాముని చూడటానికి ఎలా ఉంటాడో శంకర్ గారి ద్వారా చూడటం జరిగింది. ఆ అద్భుత చిత్రకారుని కలుసుకోవాలని, ఆయనతో మాట్లాడాలని ఇన్ని సంవత్సరాలనుండి మనసులో ఉన్న కోరిక ఇప్పటికి తీరింది. మార్చి నెల 21, 2010 న నేను చందమామ రాజశేఖర రాజుగారు కలసి శంకర్ గారింటికి వెళ్లి ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను కలుసుకున్నాము. మేము అనుకున్న సమయానికి ఆయన ఇంటికి చేరలేకపోయాము. శంకర్ గారు ఎంతో ఆదుర్దాగా వెంటనే మాకు ఫోను చేసి, మాకు దారి తెలియక ఎమన్నా ఇబ్బంది పడుతున్నామా అని కనుక్కున్నారు,మేము ఆయనకు కారణం చెప్పి కొద్దిసేపటిలో మీ దగ్గరకు వస్తున్నాం అని చెప్పినాక ఆయన కుదుటబడ్డారు . తన అభిమానులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా జరుగ వలసిన పని గురించి ఆయనకున్న తపన చూసి మేము ఎంతో నేర్చుకున్నాము.
శ్రీ శంకర్ తో నేను
శంకర్ గారు, వారి కుటుంబ సభ్యులు మా పట్ల చూపిన ఆదరాభిమానాలు మరువలేనివి. ఈ 85 సంవత్సరాల "బాలుడు" శంకర్ గారు తోటి బాలలను ఇప్పటికీ అలరిస్తూ, చక్కటి బొమ్మలు వేస్తూనే ఉన్నారు. ఆయన బొమ్మలను చూస్తూ కథలను చదువుతూ పెరిగిన నేను, ఇంతకాలానికి ఒక బేతాళ కథ వ్రాసి పంపితే, చందమామ వారు ప్రచురణకు స్వీకరించిన తరువాత , కథకు ఆయన వేసిన బొమ్మలను, నేను తనను కలుసుకోవటానికి వస్తున్నానని తెలిసి, నాకు చూపించటానికి ఉంచారు. నా కథకు ఆయన వేసిన బొమ్మలను నాకు చూపిస్తూ "ఎలా ఉన్నాయి మీకు ఆమోదమేనా" అని అడుగుతుంటే కలిగిన అనుభూతి మాటలలో చెప్పలేనిది, ఆనంద భాష్పాలు రాల్చిన క్షణాలు. ఏనాడైనా అనుకున్నానా నేను ఆయనను కలుసుకుంటానని , నేను వ్రాసినఒక సామాన్యమైన కథకు ఆయన బొమ్మలు వేస్తారని! ఒక్కోసారి మను అనుకోని అదృష్టం పడుతూ ఉంటుంది.


శంకర్ గారు పురాణ పాత్రలను బొమ్మలుగా గీయటానికి ఎటువంటి పరిశోధన చేశారు
శ్రీ శంకర్ తో చందమామ రాజుగారు
శంకర్ గారు చాలా అమాయకంగా తమిళ యాసలో తెలుగులోనే మాట్లాడుతూ, "పరిశోధన ఏమి ఉన్నది? నా చిన్న తనం నుండి అనేక ప్రవచనాలు వింటూ ఉన్నాను. ఆ విన్న పురాణ కథలలో ఎందరో మహానుబావులు చక్కగా వర్ణించిన విషయాలన్నీ కూడా అర్ధం చేసుకుని బొమ్మలు వేయటానికి కూచుంటాను. ఆ సమయానికి భగవంతుని కృప వలన రావలిసిన చక్కటి ఆలోచన వస్తుంది. ఆ కృష్ణుడే నా చేత బొమ్మలు వేయిస్తాడు, నాదేమీ లేదు. ఇంకా మనం చూస్తుంటే ఎన్నిలేవు, మన సాంస్కృతిక సంపద. మన ఆలయాలలో ఉన్న బొమ్మలు, శిల్పాలు ఇవన్నికూడా నాకు ప్రేరణే. ఇప్పటికి మహాబలిపురానికి ఏడెనిమిది సార్లు వెళ్లాను. వెళ్ళినప్పుడల్లా కొత్తగానే కనపడుతుంది. చూసినప్పుడల్లా ఒక కొత్త విషయం గమనించవచ్చు. ఈ మాటలను ఆయన గొంతులోనే వినండి:

ఏ మాత్రమైనా, నాలుగు గీతలు గిలికేసి, అందులో ఒకట్రెండు అచ్చులో చూసుకున్న నేలబారు ఆర్టిస్టు కూడా ఈ రోజున పొరబాటున ఎవరన్నా అడిగితె ఏదేదో మనకు అర్ధం కాని జార్గాన్ (jargon) మాటలు మాట్లాడే రోజులలో, తనకున్న అద్భుత కళా శక్తిని, భగవదానుగ్రహంగా భావిస్తూ ఎంతో ఒద్దికగా మాట్లాడే ఈ మహా కళాకారునికి శిరస్సు వంచి నమస్కరించాము.దశాబ్దాల తరువాత తాను వేసిన బొమ్మ చందమామ అట్టమీద చూసుకుని మురిసిపోతున్న శ్రీ శంకర్
ఈలోగా మన చందమామ రాజుగారు, తన వెంట తెచ్చుకున్న చందమామ పత్రికలను చూపిస్తూ, "శంకర్ గారూ మీరు వేసిన బొమ్మ ఫిబ్రవరి 2010 సంచికకు ముఖ చిత్రంగా వచ్చింది" అన్నారు. ఏది చూపండి, నేను చూడలేదే అని చాలా ఆత్రంగా, ఉత్సాహంగా తీసుకుని చూశారు. ఆయన ఎన్ని బొమ్మలు వేసి ఉంటారు, ఎన్ని సార్లు తన బొమ్మలు తానె చూసుకుని ఉంటారు. అయినా సరే అదే ఆనందం. ఇదొక చారిత్రాత్మక సంఘటన. శంకర్ గారి బొమ్మలు చందమామ అట్టమీద 1950 లలో వచ్చినాయి. ఆ తరువాత దాదాపు ఆరు దశాబ్దాల తరువాత ఆయనవేసిన బొమ్మను చందమామ అట్టమీద ప్రచురించటం ముదావహం. అదే బొమ్మ మీద శంకర్ గారి ఆటోగ్రాఫ్ తీసుకుని నా దగ్గర పదిలంగా దాచుకున్నాను.

శంకర్ గారు చందమామకు కాక మరే పత్రికకు అన్నా బొమ్మలు వేయటం జరిగిందా.
రామకృష్ణ ఆశ్రమం వారిచే సన్మానం
రామకృష్ణ ప్రభలో శ్రీ శంకర్ గారు వేసిన బొమ్మలు
తాను చందమామకు 1952 లో చిత్రకారునిగా నియమించబడినప్పటి నుండి ఇకేక్కడా బొమ్మలు వేయలేదని గర్వంగా చెప్పారు. చాలా అవకాశాలు వచ్చాయి కాని, చందమామలో పనిచేస్తున్నపుడు ఉన్నంత సంతృప్తి కోల్పోతానేమోనని, తనకు వచ్చిన అవకాశాలు వదులుకున్నారు. కాని, నాగిరెడ్డిగారి, రెండవ కుమారుని మామగారి కోరిక ప్రకారం మదరాసులోని రామకృష్ణాశ్రమం వారు ప్రకటించే రామకృష్ణ ప్రభ పత్రికకు 1982 నుండి కొన్ని బొమ్మలు వేయటం జరిగిందని చెప్పారు. ఈ పని చేయటానికి, నాగిరెడ్డిగారి దగ్గర నుండి పాస్ పోర్టు తీసుకున్నానని (ఒక ప్రభుత్వం నుండి మరొక ప్రభుత్వానికి అనుమతి ట ) నవ్వుతూ చెప్పారు. శ్రీ శంకర్ రామకృష్ణ ప్రభలో వేసిన చిత్రాలో కొన్ని పైన చూడవచ్చు. ఈ బొమ్మను శ్రమకోర్చి కోరిన వెంటనే పంపిన "సురేఖ" అప్పారావుగారికి కృతజ్ఞతలు.

రామకృష్ణాశ్రమం వారు ఈ మధ్యనే పిల్లలకు చిత్ర లేఖన పోటీలు ఏర్పరిచి అందులో మంచి బొమ్మలు వేసిన పిల్లలకు బహుమతులు ఇచ్చిన సందర్భంగా శంకర్ గారిని ఆహ్వానించి ఐదువేల రూపాయలు, వివేకానందుని కాంస్య విగ్రహం బహూకరించి సన్మానించారుట. ఈ సన్మానానికి వేదిక మీదకు, "ఇప్పుడు మీరు 85 సంవత్సరాల బాలుని చూడబోతున్నారు" అని శంకర్ గారిని ఆహ్వానించారుట, శంకర్ గారే తనను బాలుడు అని సంభోదించినందుకు, లోలోపల మురిసిపోతూ చెప్పారు.


శంకర్ గారూ, మీరు వేసిన పురాణ పాత్రలు, ఆ పాత్రలకు మీరు వేసిన ఆభరణాలు, ఆ భవనాలు మొదలైనవి ఎన్నో సినిమాలకు ఆలంబనగానూ, ప్రేరణగానూ నిలిచాయి కదా, మీరు ఆర్ట్ డైరెక్టరుగా సినిమాలలో ప్రయత్నం చేయలేదా, పైగా విజయా పిక్చర్స్ వారి సంస్థలోనే కదా పని చేస్తున్నది
లేదండి, నాకు అటువంటి ఆసక్తులు ఏమీ లేవు. నేను నా పని, నాకు ఇచ్చిన బొమ్మలు గీసుకోవటం. చందమామలో చేరినతరువాత నన్ను ఎంతో పదిలంగా చూసుకున్నారు. చిత్రకారులైన మాకు (నేను, చిత్రాగారు, కేశవ్ గారు, వడ్డాది పాపయ్య గారు తరువాత వచ్చారు) ప్రత్యెక ఏర్పాట్లు ఉండేవి. మా గదిలోకి ఎవరూ అనుమతి లేనిదే ఎవరూ రాకూడదు, మాకోసం ప్రత్యేకంగా ఒక అబ్బాయి, మేము పిలవంగానే మా పని చేయాలి. ఇంకెవరూ అతనికి పని చెప్పకూడదు. మధ్యాహ్న భోజనం తరువాత కొద్దిగా కునుకు తీయటానికి ఏర్పాట్లు. మంచి జీతం. ఇంకేమి కావాలి.


శ్రీ శంకర్, శ్రీమతి శంకర్ వారి పెళ్లి రోజున
ఆ తరువాత శంకర్ గారి పెళ్లినాటి ఫోటో (ఈ మధ్యనే వారి అబ్బాయి రంగుల్లోకి మార్పించారుట) మీద మా దృష్టి పడింది. వారి అనుమతితో ఆ ఫోటోను ఫోటో తీశాము.
ఏమండి శంకర్ గారూ, మీ పెళ్లి రోజున మీరు ఎందుకని అలా సీరియస్ గా కనిపిస్తున్నారు అని మేము ఒక కొంటే ప్రశ్న వేస్తె, ఆయన....
ఏముందండి, అప్పుడే పెళ్లి అయింది కదా సీరియస్ కాక ఏమిటి అని పెద్దగా నవ్వారు. అవునండి పెళ్లి అయినాక, బాధ్యతలు మొదలవ్వుతాయి కదా అని వివరించారు. అక్కడే ఉన్న వారి శ్రీమతిని చూపిస్తూ, పురుషుని ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ తప్పని సరిగా ఉంటుంది. నా విజయాల వెనుక నా భార్య పాత్ర ఎంతో ఉన్నది. ఆమె నా అవసరాలను, నా ఆరోగ్యాన్ని సదా గమనిస్తూ కాపాడుతుంది. నేను మూడ్లో ఉండి బొమ్మ వేస్తూ ఉంటే, ఏమాత్రం నన్ను డిస్టర్బ్ చేయదు. ఆమె నా వెనుక ఉండి నన్ను జాగ్రత్తగా చూసుకోవటం వల్లే నా పని నేను చక్కగా చేసుకొగలుగుతున్నాను.


మిగిలిన విశేషాలు మరొక్క రోజుశంకర్ గారి బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న
ఒకప్పటి బాలాభిమానులకు గుర్తుగా
ఆయన బొమ్మలతోనే ప్రపంచ పటం
అలా ఒక్కసారి ప్రపంచ పటాన్ని క్లిక్ చేసి చూడండి

6 వ్యాఖ్యలు:

 1. శివరాంప్రసాద్ గారూ ... ఎన్ని విశేషాలు చెప్పారండీ!
  శంకర్ గారితో మీ భేటీ విశేషాలు అద్భుతంగా ఉన్నాయి. మిగతా వివరాల కోసం ఎదురుచూసేలా, కొంచెమే రాసి ఊరించేశారు.
  ఇన్నాళ్ళకు ఆయన గొంతు వినగలిగాము. శంకర్ గారి బొమ్మల ప్రపంచాన్ని మీరు బాగా రూపొందించారు.
  మీ బేతాళకథకు శంకర్ గారి బొమ్మలు వేయటం, ‘మీకు ఆమోదమేనా?’ అని ఆయన అడగటం.. ఈ ఘట్టం ఎంత అపురూపమో కదా! మీకు హృదయపూర్వక అభినందనలూ... బోలెడు ధన్యవాదాలూ!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శివ గారూ !
  చాలా చాలా ధన్యవాదాలు, ఒక మహానుభావుడిని మాకు పరిచయంచేసినందుకు. మీరు రాసిన కథ ప్రచురణకు స్వీకరించడం, దానిని శంకర్ గారు బొమ్మతో అలంకరించడం చాలా ఆనందంగా వుంది. హార్థికాభినందనలు. ఇక మీ ప్రపంచ పటం చూసి కాలరెత్తేశాను. మిగతా భాగం కోసం ఎదురుచూస్తూ.....

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శివరాం ప్రసాద్ గారు
  మీ కథనం చూస్తుంటే పోయిన ఆదివారం మనం శంకర్ గారిని కలిసిన క్షణాలు మళ్లీ గుర్తుకొచ్చాయి. ఇంకా మనం ఆయనతో మాట్లాడుతూ ఉన్నట్లుంది. శంకర్ గారి స్వరాన్ని సాయంత్రం డౌన్ లోడ్ చేసుకుని మళ్లీ వింటాను. నేరుగా ఆయనన చూడలేని వారు ఆయన స్వరం నెట్‌లో విని సంతోషించేలా మంచి ఏర్పాట్లు చేశారు.

  విజయవర్ధన్ గారు పంపిన శంకర్ గారిపై వీడియో మీకిచ్చాను కదా. చందమామ ప్రియులకోసం వాటి కాపీలు తీసి సిద్ధపరుస్తున్నాను. వేణుగారు, ఇలా ఆసక్తి ఉన్న వారికి పంపితే శంకర్ గారి దృశ్యరూప వీక్షణ భాగ్యం ప్రపంచానికి దక్కినట్లవుతుంది. దాసరి సుబ్రహ్మణ్యం గారి విషయంలో అలా చేయలేకపోయాము. మేలుకునే సరికి ఆలస్యమైపోయింది.

  శంకర్ గారిని రామకృష్ణాశ్రమం వారు పిలిచి సన్మానించిన సందర్భంగా "now 85 years old young boy is coming to the dias" అని నిర్వాహకులు వేదికమీదికి ఆహ్వానించినప్పుడు సభికులు కరతాళధ్వనులు చేశారట. ఈ విషయం శంకర్ గారే మనకు తెలిపారు. 85 ఏళ్ల బాలుడట. ఈ గుర్తింపు ప్రపంచంలో ఎవరికయినా వస్తుందా చెప్పండి. అందుకే శంకర్ గారు ధన్యజీవి.

  "ఏ మాత్రమైనా, నాలుగు గీతలు గిలికేసి, అందులో ఒకట్రెండు అచ్చులో చూసుకున్న నేలబారు ఆర్టిస్టు కూడా..." ఈ వాక్యం చిత్రలేఖనాన్ని వృత్తిగా స్వీకరించి జీవనం గడుపుతున్న వారిని బాధిస్తుందేమో మరి. ఆలోచించగలరు. ఇది తప్పితే మీ కథనం నాకు సంపూర్ణామోదమే..

  మంచి విషయాలను పొందుపర్చి రాసినందుకు అభినందనలు. మిగతా విషయాలకోసం ఎదురు చూస్తుంటాము.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నేను వ్రాసినది చేతిలో ఉన్న విద్య తక్కువ మాటలు ఎక్కువైన వారి గురించి కదా అలాంటి వాళ్ళకు బాధ కూడా ఉంటుందా ఊరికే గొప్పలు పోవటం తప్ప!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. వేణూగారూ. ధన్యవాదాలు మీ ప్రోత్సాహకర వ్యాఖ్యకు. బొమ్మలు, మూవీ, ఆడియో ఫైళ్ళు ఇలా ఒక వ్యాసంలోనే ఉంచితే, బ్లాగు ఓపెన్ కావటం కష్టమవుతుందని, కొన్ని భాగాలుగా వ్రాద్దామని అనుకున్నాను. పైగా గంటన్నరపైగా ఉన్న టేపులోని సంభాషణలన్ని కవనంగా తేవాలంటే చాలా ఎడిట్ చెయ్యాలి. అందుకనే టైం పడుతున్నది. మళ్ళి ఒకటి రెండురోజులలో మరో భాగం ప్రచురిస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. రావుగారూ ధన్యవాదాలు. శంకర్ గారి బొమ్మను ప్రపచ పటంగా చెయ్యటానికి ఒక సాఫ్ట్వేర్ వాడాను. అందుకనే బాగా వచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.