31, అక్టోబర్ 2010, ఆదివారం

పాపయ్య గారి అద్భుత చిత్రాలు

చందమామ పత్రిక చేసుకున్న అదృష్టాలలో ఒకటి వారికి వడ్డాది పాపయ్య గారు చిత్రకారునిగా దొరకటం, నెలసరి జీతానికి ఆయన పని చేయటానికి ఒప్పుకోవటం. పాపయ్య గారికి ఆ నెల జీతమే దక్కింది కాని, రావలిసిన పేరు ప్రఖ్యాతులు అంతగా రాలేదు. చాలామంది పాపయ్యగారు పురాణ చిత్రాలు మాత్రమె వేశారని అనుకుంటూ ఉంటారు. కానీ, నిజానికి, పాపయ్య గారు సాంఘిక కథలకు, జానపద కథలకు కూడ బొమ్మలు వేశారు. చక్రపాణి గారు బెంగాలీ నుండిఆంధ్రీకరించిన శరత్ నవలలు అన్ని 'యువ' పత్రికలో ప్రచుచేవారు. వాటన్నిటికి బొమ్మలు వేసినది పాపయ్య గారే. చందమామలో వేసిన చిత్రాలలో, అరణ్య పురాణం ధారావాహిక కు వేసిన చిత్రాలు అమోఘం. బొమ్మలు చూస్తె చాలు కథ చదవాలిసిన అవసరం లేదు. పూర్తిగా అర్ధం అయిపోతుంది. పైగా, బొమ్మలు రంగుల్లో, ఆయన కుంచే నుండి అద్భుతంగా జాలువారాయి. బొమ్మలలో కొన్ని చూడండి.



చిత్రాలు చందమామ వారి సౌజన్యంతో
అరణ్య పురాణం చిత్రాలతో చేసిన ఒక స్లైడ్ షో చూడండి.










6 కామెంట్‌లు:

  1. శివరాం గారూ,
    చాలా చాలా కృతజ్ఞతలు.
    మీరు వపాగారిపై వరుసగా ప్రచురించిన మూడు పోస్టులను వర్డ్ ఫైల్లో కాపీ చేసి ఉంచుకున్నాను. చందమామ చిత్రకార దిగ్గజాలపై లభ్యమయ్యే సమాచారాన్నంతటినీ సేకరిస్తున్నాం కదా. ఇప్పటికే చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్, వపా గారిపై దాదాపు 150 పుటల పైచిలుకు సమాచారం లభ్యమైంది. దానిలో కొంత గతంలోనే మీకూ, వేణు గారికీ, తదితర మిత్రులకూ పంపినట్లుంది. అరణ్యపురాణం బొమ్మలయితే అద్భుతలోకాన్ని తలపిస్తున్నాయి. చందమామ ఇటీవల ప్రచురించిన ఆర్ట్‌బుక్‌లో దాదాపు 80 వరకు వపాగారి ఒరిజనల్ చిత్రాలను పెద్ద సైజులో ప్రచురించారు. పై నలుగురివీ కలిపి 200 చిత్రాల వరకు ఈ పుస్తకంలో ఉన్నాయి. వీలయితే తీసుకుని చూడండి. స్కానింగ్ లోపాలు కొన్ని ఉన్నా, వీటిలో జగత్‌సౌందర్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది మనకు.

    రిప్లయితొలగించండి
  2. ఎనభయ్యో దశకంలో జయ, రాజి చిత్రాలు కూడా ఆకర్షణీయంగా ఉండేవి. లభిస్తే వారి వివరాలు కూడా ప్రచురించండి.

    రిప్లయితొలగించండి
  3. ఆ యువలో పడిన శరత్ నవలల్లో(చక్రపాణి అనువాదాలు) ఐదేసి చొప్పున రెండు పుస్తకాలు గా వచ్చాయి. చాలా రోజులుగా వెతుకుతుంటే రెండురోజుల క్రితంకనిపించాయి. నాకు పల్లీయులు ఒకటే దొరికింది.. దేవదాసు లేదు. పుస్తకం తెరవగానే వపా గారి బొమ్మలు చూసి ఆశ్చర్యానికి లోనయ్యాను. ! నాకు వారే బొమ్మలు గీసిన విషయం తెలియక. ఆహా..ఇది బోనస్ అన్నమాట అనుకున్నాను. వపా గారు చందమామలో అసంప్రేక్ష్యకారిత్వం సీరియల్ కి వేసిన బొమ్మలు కూడా చాలా బాగుంటాయి.
    మంచి స్లైడ్ షో అందించి నందుకు ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  4. రాధేశ్యాం, మీ దగ్గర ఉన్న శరత్ నవలలో ఉన్న వపా గారి బొమ్మల్ని ఒక వ్యాసం వ్రాసి ప్రచురించండి. నా దగ్గర ఆ పుస్తకాలు లేవు. జ్ఞాపాలలోనుండి వ్రాశాను.

    అలాగే, పాపయ్యగారు, పంచతంత్రం ధారావాహిక మొత్తానికి బొమ్మలు వేశారు. ఆ బొమ్మలు, చందమామ వెనుక అట్ట మీద వేసేవారు. కొంతకాలానికి, చందమామ వెనుక అట్టను వ్యాపార ప్రకటనలకు అమ్ముకోవటం మొదలుపెట్టినాక, పాపయ్యగారి రంగుల చిత్రాలు ముఖ చిత్రానికే పరిమితం అయ్యాయి. ధారావాహికలో నీలి తెలుపు లేదా ఆకుపచ్చ తెలుపు రంగుల్లో ఉండేవి. ఇప్పుడు పున:ప్రచురణ అవుతున్న పంచతంత్ర కథల ధారావాహికలో రంగులు అద్ది అవే బొమ్మలు వేసుకుంటున్నారు ప్రస్తుతపు తెలుగు చందమామ వారు.

    రిప్లయితొలగించండి
  5. సూర్య గారూ, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. నాకు కాని, 1960లనుండి చందమామ చదువుతున్న వారికి కాని, చందమామ 1980 తరువాత దాదాపుగా లేదు. ఆ అద్భుత పత్రిక ప్రాభవం చక్రపాణి గారి మరణంతో తగ్గటం మొదలయ్యి, చిత్రాగారు, వడ్డాది పాపయ్య గారు, కొడవటిగంటి కుటుంబరావుగారు ఒకరి తరువాత ఒకరు వెళ్ళిపోవటంతో పూర్తిగా అలనాటి ప్రాభవం సన్నగిల్లి, కేవలం గుర్తుల్లోనే మిగిలింది. అందుకనే చూడండి ఈ బ్లాగులో కుడి పక్కన వ్రాశాను చందమామ అంటే చిత్ర+శంకర్+వపా, నా వరకు అంతే.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.