19, జూన్ 2011, ఆదివారం

నాన్న లేని లోటు




అవును నాన్న లేని లోటు ప్రతిరోజూ గుర్తుకు వస్తుంది. నాకు తెలిసిన పెద్దలైన సహోద్యుగుల్లో, కొడుకు రిటైర్ అయ్యేప్పటికి ఆయన తండ్రిగారు కూడ హాయిగా ఆరోగ్యంగా ఉండి ఇద్దరూ కలిసి పెన్షన్ కు వెళ్ళటం చూశాను. కొడుకు వ్యాపారంలో అతని తండ్రి, తాత కూడ పాలు పంచుకోవటం చూస్తుంటాము. అలా చూసినప్పుడల్లా అసంకల్పితంగా అసూయ కలుగుతుంది. నాకు అటువంటి అదృష్టం లేనందుకు. నా నలభయ్యో పడిలో మా నాన్నను కోల్పోయాను. చివరి వరకూ పరిపూర్ణ ఆరోగ్యంతో తన 91 ఏట 2001 లో స్వర్గస్తులయ్యారు.

మా నాయనగారు ఎంతో పట్టుదల మనిషి. తన స్వగ్రామంలో డిప్రెషన్ కాలంలో (1930 లలో) మా తాతగారి హయం లో పోయిన పొలాన్ని కష్టపడి మళ్ళి కొన్నారు. విజయవాడకు కట్టుబట్టలతో వచ్చి, నిజాయితీగా కష్టపడి వ్యాపారం చేస్తూ బంధువులకు సహాయం చేస్తూ (కొంతమందిని దగ్గరే పెట్టుకుని వాళ్ళ బాగోగులు చూస్తూ), ఎంతో పొదుపుగా ఉంటూ, స్వంత ఊరులో (వెన్నూతల) తాతల నాటి పొలం మళ్ళి కొనగలగటం నాకు ఎంతో స్పూర్తినిచ్చిన విషయం. అదే ఊళ్ళో 1970 లలో రోడ్డు వచ్చినప్పుడు, ఒక భూస్వామి తన పొలం రోడ్డుకు ప్రభుత్వ ధరకు ఇవ్వటానికి నిరాకరిస్తే,మా నాయన గారు ఆ భూస్వామి చెప్పిన ధరకు కొని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోడ్డుకోసం ఇచ్చేశారు.

ఆయన దగ్గర నుంచి మాట సూటితనం, నమ్మిన విషయం నిర్భయంగా చెప్పగలగటం, పొదుపుగా ఉండటం, డబ్బుల విషయంలో నిర్మొహమాటం, నిజంగా అవసరమైన వారికి సహ్యాయం చెయ్యటం అందిపుచ్చుకోగలగటం నా అదృష్టం .

తన పెద్దన్న గారితో బాటుగా, ఎం ఎన్ రాయ్ గారితో సన్నిహితంగా ఉండే వారు. మా కుటుంబ వైద్యుడు కీర్తి శేషులు తాడేపల్లి సత్యనారాయణగారు(విజయవాడ రామ మందిరం వీధిలో ఉండేవారు) మా నాయన గారు మంచి స్నేహితులు. వాళ్ళిద్దరి రాజకీయ చర్చ ఎంతో సరదాగా ఉండేది. నా చిన్నతనంలో వాళ్ళ మాటలు వినటం ఎంతో ఉపకరించింది. ఎన్నెన్నో విషయాలు గంటల కొద్దీ విసుగు లేకుండా హాయిగా మాట్లాడుకునే వారు.

అప్పుడప్పుడే టి వి లో క్రికెట్ వస్తున్న రోజులు(1985-88). ఆస్ట్రేలియా నుంచి చానెల్ నైన్ వాళ్ళు క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం చేసేవారు. అప్పటివరకూ క్రికెట్ అంటే పరిచయం లేని మా నాన్న ఆసక్తిగా మొత్తం చూసి నేర్చుకుని మాతోబాటు, మా పిల్లలతో బాటు అద్భుతమైన వ్యాఖ్యలు చేస్తూ చూసే వారు. ఆయన ఆసక్తి ఆ వయస్సులో టి వి ప్రత్యక్ష ప్రసారం లేనప్పుడు, రేడియోలో వినే వరకూ వెళ్ళింది. ఆయన కొద్ది గంటల్లో మరణిస్తారనగా కూడ, హాస్పిటల్ బెడ్ మీద నుంచి మర్నాడు కెన్యాతో భారత్ ఆడబోతున్న మాచ్ లో ఎవరున్నారు అని అడిగి తెలుసుకున్నారుట. అయన జీవితం మొత్తం లో హాస్పిటల్లో గడిపినది ఒకే ఒక్క రోజు అదే చివరి రోజు కూడ.

మా నాయనగారికి భమిడిపాటి కామేశ్వర రావుగారు అంటే అభిమానం. ఆయన పుస్తకాలు చాలా ఉండేవి ఆయన దగ్గర. నాకు సాహిత్య పరిచయం ఆ పుస్తకాలతోనే. ఆ పుస్తకాలు చదివిన సరదాలో, "ఆకర్ణాతి గుడ్లది" వంటి చిత్రమైన మాటలు సరదాగా ప్రయోగిస్తూ ఉండేవారు. మాటల్లో ప్రముఖ దర్శకుడు పుల్లయ్య గారికి సమ ఉజ్జీ. నాకు తెలుగు చందమామను నా తొమ్మిదో పుట్టిన రోజున బహుమతిగా ఇచ్చి, అక్కడనుంచి ప్రతి నేలా ఇస్తూ , నా వ్యక్తిత్వ వికాసానికి తోలి మెట్టు వెశారు.

ఇవ్వాల్టికీ మా నాయనగారి చివరి క్షణాల్లో నేను ఆయన పక్కన లేకపోవటం ఎంతో బాధిస్తూ ఉంటుంది.


ఎన్నెన్ని ఫాదర్స్ డే లు జరుపుకున్నా, ఎన్నెన్ని జ్ఞాపాకాలు చెప్పుకున్నా, నాన్న లేని లోటు, లోటే. ఎంత వయస్సు వచ్చినా జ్ఞాపకానికి వచ్చే లోటు, ఎప్పటికీ పూడని లోటు. అలనాడు తండ్రి చూపిన మంచి మార్గాన్ని మర్చిపోకుండా నా జీవిత కాలం నేను ఉండగలగటమే మా నాన్నకు నేను ఇవ్వగలిగిన నివాళి.













9 కామెంట్‌లు:

  1. బాగున్నాయి...మీ టపా, మీ నాన్నగారి ఉన్నత వ్యక్తిత్వం రెండూ.

    శుభాభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. శివ గారూ !
    నాన్నగారి జ్ఞాపకాలు, నివాళి బాగుంది. నిజమే ! నాన్న లెని లోటు పూడ్చలేనిదే ! అప్పుడప్పుడు ఇలా పదిమందితో వారి అనుభూతులు పంచుకోవడమే నిజమైన నివాళి.

    రిప్లయితొలగించండి
  3. ఏ బిడ్డలైనా తండ్రి మార్గ దర్శకత్వంలో..నడవడం కన్నా మించిన నివాళి ఏముంటుంది. ఉన్నత విలువలని చెప్పడం కన్నా ఆచరించి చూపిన వ్యక్తిగా.మీ నాన్నగారి ముద్ర. మీకు..సదా స్మరణీయం.మీ నాన్నతో మీ అనుబంధం చాలా బాగుంది. పితృ దినోత్శవ శుభాకాంక్షలు.. అందిస్తూ..

    రిప్లయితొలగించండి
  4. ధన్యవాదాలు తేజస్వి గారు, రావు గారు, వనజావనమాలి గారు.

    రిప్లయితొలగించండి
  5. మనకన్నా పెద్దవాళ్ళు వున్నప్పుడే మనం చిన్నవాళ్ళం అనే భావంతో బాటు అన్నీ చూడటానికి మనకన్న పెద్ద వాళ్ళు వున్నారనే ధైర్యం కూడా వుంటుంది. నాన్న తన 88వ ఏట కూడా తన వ్యాపారం పని మీద ఒంటరిగా కలకత్తా వెళ్ళటం అనేది ఇప్పటి "గొల్డెన్ షేక్ హండ్" పుచ్చుకొన్నవారికి [40 వెళ్ళి 50 రాగానే ఎక్కడి లేని ముసలితనానిని మనసుకు వేసి చేసే ఉద్యోగం చివరి దాకా చెయ్యని వాళ్ళకి] అర్ధం కాదు. ఫాదర్స్ డే రోజున నాన్న గురుంచి చక్కగా విశ్లేషణ చేసి వ్రాసినందుకు చాలా ఆనందంగా వున్నది.

    రిప్లయితొలగించండి
  6. పిల్లలకి తండ్రి కొండంత అండ.వారి మంచికి ఆయనే మార్గదర్శి. శివ గారు, తండ్రి గురించి నాలుగు మాటలు చెప్పుకోడానికి భావాలు పంచుకోడానికి ఫాదర్స్ డే అందరికీ మంచి అవకాశాన్ని కలిగిస్తోంది. సంతోషం!

    రిప్లయితొలగించండి
  7. ఫాదర్స్ డే న మీ నాన్నగారిని చాలా చక్కగా గుర్తు చేసుకున్నారండి.
    మంచి పోస్ట్ అండి.

    రిప్లయితొలగించండి
  8. ఫాదర్స్ డె సందర్భం గా చక్కని ఆర్టికల్ ను అందించారు. ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  9. రాధాకృష్ణ, బాబు, ప్రబాన్ చౌదరి, రాజేశ్వరి గార్లకు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.