7, ఆగస్టు 2011, ఆదివారం

లోక్ పాల్ బిల్లు - అవినీతి అంతం!





పోయిన శుక్రవారం అనుకోని శలవ వచ్చింది. సరే శలవ వస్తే చేసేది ఏమున్నది, అలా బ్రిటిష్ లైబ్రరీకి వెళ్లి కావాల్సిన పుస్తకాలు, డి వి డి లు తెచ్చుకుని ఇంటికి తిరిగి వస్తున్నాను. కస్తూర్బా రోడ్ నుంచి మాల్య హాస్పిటల్ వైపుకు వాహన గమనం మార్చాను. విచిత్రం! ఒక విన్నూత్నమైన ప్రదర్శన, నిరసన చూశాను అక్కడ.

రోడ్డుకు రెండు వైపులా ఉన్న ఫుట్ పాత్ లు విద్యార్ధులతో నిండిపొయ్యాయి. అందరూ పదిహేను పదహారేళ్ళ లోపు బాల బాలికలే. చేతిలో ప్లాకార్డులు పట్టుకుని, సరదాగా, కొంచెం ఆవేశంగా అరుస్తున్నారు, నినదిస్తున్నారు. వాళ్ళను ఫుట్ పాత్ దాటి రాకుండా అన్నా హజారే టోపీలు ధరించిన (గాంధీ టోపీ అనేమాటను మన రాజకీయ నాయకులు భ్రష్టుపట్టిం చారు) వాళ్ళ టీచర్లు కాబోలు, పిల్లల్ని కట్టడి చేస్తున్నారు. ఇటువంటి ప్రదర్శన చూసేప్పటికి ముచ్చట వేసింది. పిల్లలు తమ భావావేశాన్ని ప్రకటిస్తూనే, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించ కుండా అందరి దృష్టి ఆకర్షించటం చాలా బాగున్నది. అయిన దానికి కాని దానికి రాజకీయ నాయకులు, సామాజిపరిరక్షకులం అని చెప్పుకునే వాళ్ళు రోడ్ల మీద చేసే రగడ తో పోలిస్తే ఎంత భిన్నంగా ఉన్నది.


ఇంతకీ చిన్నారులు ఇలా ఎండలో (ఎంత బెంగుళూరు అయినా మధ్యాహ్నం ఎండ వేడే కదా) ఎందుకు ఇలా నినదిస్తున్నారు అని చూస్తె, వాళ్ళు అడుగుతున్నది లోక్ పాల్ బిల్ ప్రవేశ పెట్టాలని, అది కూడా అన్నా హజారే చెప్పిన ప్రకారం. ఉద్దేశ్యం బాగానే ఉన్నది. కాని ఆచరణలో ఎంతవరకూ ఈ చిన్నారుల ఆశలు నిజమవుతాయి అని ఆలోచిస్తూ, ఇంటికి చేరాను. ఇవ్వాళ పొద్దున్నే "హరిసేవ" బ్లాగ్ లో వ్రాసిన వ్యాసం చూసినాక, నా ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వటానికి ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో భాగమే ఈ నాలుగు మాటలు.
  • వరకట్న దురాచారం గురించిన చట్టం చేసి కొన్ని దశాబ్దాలు అయినాయి. కట్నం తీసుకోవటం మానారా! ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఏమున్నది, ప్రధాన మంత్రి అవినీతి ఏమున్నది. అంతా "మనం-మనం" సాంప్రదాయం పేరిట చేసే పనే కదా. చట్టం తేవటం వల్ల ఈ దురాచారం ఎంతవరకు తగ్గింది?
  • అవినీతి నిరోధక చట్టాలు అనేకం. ప్రతిరోజూ, పిల్ల చేపల్ని పట్టుకుని విజయోత్సాహంతో ఏసిబి వారి వార్తలు. నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే, ఎన్నడు చూసినా ఒక స్కూల్ హెడ్మాస్టర్ నో, ఎలెక్ట్రిసిటీ లైన్ మాన్ నో "వల పన్ని" చాలా సాహసం చూపి పట్టుకుంటారు. పై అధికారుల్ని ఎందుకు పట్టుకోరు? పై అధికారులలో అవినీతే లేదా!
  • అవినీతి నిర్మూలనలో భాగంగా, ఒక లంచగొండిని పట్టుకున్నప్పుడు, సదరు మనిషి సంపాయించిన ఆస్తులు కొనటానికి, ఎవరెవరు లంచాలు ఇచ్చారు, అలా లంచం ఇచ్చి పనులు చేయించుకుని వాళ్ళు ఎంత లాభపడ్డారు అన్న విషయం కూడా వెలికి లాగి, అలా లంచాలు ఇచ్చిన వాళ్లకు కూడా కఠిన శిక్షలు వేసి, లంచాలు ఇచ్చి, తద్వారా సంపాయించుకున్న ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చెయ్యాలి. ఇదంతా చెయ్యగలిగినది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకనంత వరకూ, అవినీతిని అంతం చెయ్యటం అసాధ్యం.
  • సరే, అన్నా హజారే బృందం చెప్పినట్టుగా లోక్ పాల్ బిల్లు వచ్చేసింది, అందులో ప్రధాని పదవిలో ఉండే వారిని కూడా లోక్ పాల్ పరిధిలోకి తెచ్చారు. అంటే ఒక్క విషయంతోఅవినీతి అంతా అణగారిపోతుందా!
  • ముళ్ళపూడి వెంకట రమణ గారు ఒక కథలో వ్రాస్తారు, ఒక ఊళ్ళో అందరి కంటే వినయం కలవాడికి సన్మానం చేద్దామని నిర్ణయిస్తారు. ఎవరికి చెయ్యాలి, అని దుర్భిణి వేసి వెతికి ఒకాయన్ని పట్టుకు వస్తారు. సన్మాన కార్యక్రమం మొదలు కాకముందే ఆయనికి కొమ్ములు మొలవటం ప్రారంభిస్తాయి. మరోకాయాన్ని పట్టుకు వస్తారు, సభకు వస్తూ ఉండగానే ఆయనకు తలలో ముందు బొడిపెలు, సభలో ప్రవేశించెప్పట్టికి, దుప్పికి ఉన్నట్టు కొమ్ములు మొలుచుకు వస్తాయి. నాకు చెప్పటం చేతకావటం లేదు కాని, ముళ్ళపూడివారు, కథలో మన సమాజంలో వినయం ఎంతగా మృగ్యం అయిపోయిందో అన్న బాధాకరమైన విషయం తన హాస్య బాణాలతో అద్భుతంగా వివరించారు. ఆయన వ్రాసిన విషయం కేవలం నవ్వుకోవటానికే అని, చాలా మంది ఉద్దేశ్యం. అందుకనే ఆయన్ను హాస్య రచయితగా మాత్రమె పరిగణిస్తున్నారు. కాని, ముళ్ళపూడి వారి అసలు ఉద్దేశ్యాన్ని గ్రహించ గలిగినది ఎంతమంది! వామపక్ష సిద్ధాంతాలు "వల్లే" వేస్తేనే కాని సామాజిక స్పృహ ఉన్నట్టు కాదట మరి, ఖర్మ! విదేశీ ఇజాల పిచ్చి.
  • ఇప్పుడు లోక్ పాల్ విషయంలో కూడా అదే జరుగుతుందా అని నా అనుమానం. లోక్ పాల్ నియామకం జరిగాక, సదరు వ్యక్తీ న్యాయ వర్తనుడిగాఉంటాడా , ఉండగలడా, ఉండనిస్తారా!?
  • మన దేశంలోని సర్వోత్తమ న్యాయ స్థానంలోని చీఫ్ జస్టిస్ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటూ ఉంటే, ఎవరిని తెచ్చి లోక్ పాల్ చెయ్యాలి.
  • హిమాలయాల్లోతపస్సు చేసుకుంటున్న, స్వాముల వారినా. అటువంటి స్వామీజీ ఉన్నా, రెండురోజుల్లో అవినీతి మప్పేస్తారు చుట్టూఉన్న వాళ్ళు. నెల తిరక్క ముందే, గడ్డం-గిడ్డం తీసేసి, మంచి సూటులో రేబాన్ కళ్ళద్దాలతో కనిపిస్తాడు.
  • వృద్ధ నారీ పతివ్రతః అని ఒక నానుడి ఉన్నది. అదే విధంగా సమాజంలో అవినీతికి పాలుబడటానికి ఆవకాశం లేని వాళ్ళందరూ అవినీతి అంతం కావాలని ఆవేశపడుతున్నారు. ఆవకాశం వచ్చిన రోజున అవినీతికి పాలుబడని వాళ్ళు ఎవరు, ముళ్ళపూడి గారి కథలో ఆయన బాధపడింది ఈ విషయమే.
  • అవినీతి సమాజంలోని అందరిలోనూ ఉన్నది. అతి చిన్న విషయాల్లో కూడా క్రమశిక్షణ పాటించ లేమే! మనమా అవినీతిని అంతం చెయ్యగలిగేది.
  • ఎవరో లక్షలో ఒక్కరు రెండు చేతులా సంపాయించుకోవటానికి ఆవకాశం ఉండి జీతంమీద మాత్రమె ఆధార పడి జీవించే వారు ఉండి లాభం ఏమిటి.
  • అవినీతి ఒక్క ఉద్యోగులదేనా? వ్యాపారం చేసే వారు, దొంగ లెక్కలు వ్రాసిపెట్టేవాళ్ళు, ఆ దొంగ లెక్కలకు సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళు చేసేది అంతా నీతే. వీళ్ళను పట్టుకునే వాళ్ళు ఏరి.
  • కోడి గుడ్డుకు ఈకలు పీకుతూ, కేసుల్ని ఏళ్లకు ఏళ్ళు నడిపి బతికే లాయర్లు చేసేది ఏమిటి, నీతే!
  • చెత్తా చెదారం పోగేసి వార్తల పేరిట, సంపాదకీయాల పేరిట వ్రాయటం, డబ్బులు పుచ్చుకుని ఏదో ఒక పార్టీకో, వ్యక్తికో అమ్ముడుపోయి పేపర్లు, చానెళ్ళు నడిపే వాళ్ళను ఏమనాలి. వాళ్ళు చేసేదీ నీతిమంతమైన పనే? విదేశీ ఇజాలుఇక్కడ మప్పటానికి పేపరు పేరుతొ నడిపే కరపత్రాల మాట ఏమిటి? మనం పుట్టి పెరిగిన దేశాన్ని వదిలి విదేశ ఇజాల పిచ్చిలో పడి వాళ్ళు చేసే పనులు కూడా నీతి కిందకే వస్తాయా?
  • స్తంభాన్ని అయినా కింద నుంచి పైకి కట్టగలం కానీ, పైనుంచి కిందకు కట్టలేము. అలాగే అవినీతి మీద యుద్ధం సమాజంలో కింది నుండి రావాలి.
  • పూర్వం శంకర్స్ వీక్లీ అని పూర్తి రాజకీయ వ్యంగ్య చిత్రాల పత్రిక ఉండేది. అందులో అప్పటి ప్రధాని పంచవర్ష ప్రణాళికల గురించి పూనకం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే, ఒక చక్కటి కార్టూన్ వెశారు శంకర్ గారు. మన దేశ సార్వభౌమత్వానికి చెందిన చిహ్నం మూడు సింహాల విగ్రహాన్ని పైకి ఎత్తి పరంజాలతో (scaffoldings) కట్టి ఉంచి ఆ విగ్రహాన్ని ఉంచటానికి పీఠాన్ని కిందకు కట్టే ప్రయత్నిస్తున్న నెహ్రూ కనిపిస్తారు. అంటించే ఇటుక అంటిస్తూ ఉండగా, కింద పడిపోయ్యే ఇటుక పడిపోతూ ఉంటుంది.
  • మనకు, మన పనులు వెంట-వెంటనే అయిపోవాలి, మనం నియమాలు పాటించం, ఎవడినో ఒకడిని పట్టుకుని, ఎంత ఖర్చైనా సరే పనులు చేయించుకోవటం మానము. కాని అవినీతి పోవాలి. ఎలాపోతుంది!
  • అవినీతి పోవాలంటే సమాజంలో క్రమశిక్షణ ఉండాలి క్రమశిక్షణ లేని సమాజం అవినీతి నిర్మూలన చెయ్యలేదు.
  • అవినీతి నిర్మూలనకు ఒక తరం మొత్తం త్యాగాలు చెయ్యటానికి సిద్ధం కావాలి. ఎవరికీకావాలిసిన పనులు వాళ్ళు లంచం ఇవ్వకుండా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎదుర్కొని తమకు కావలసినవి సంపాయించుకునే మానసిక స్థైర్యం, ఓపిక కావాలి. అలా చేసినప్పుడు జరిగే నష్టాలను భరించి ఉండగల శక్తి ఉండాలి అది లేని నాడు, లోక్ పాల్ బిల్లు కాదుకదా దేముడే దిగి వచ్చినా అవినీతి పోదు.
  • చెత్త సినిమాలు ఎందుకు వస్తున్నాయిరా అంటే,చూసేవాళ్ళు చూస్తున్నారు కాబట్టి. చెత్త సినిమాలు వందరోజులు ఎందుకు ఆదిస్తున్నారురా అంటే, అంతకంటే సినిమాలు రావట్లేదు కాబట్టి. అలాగే లంచాలు ఎందుకు తింటున్నారు అంటే, ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి. లంచాలు ఎందుకు ఇస్తున్నారు అంటే, ఇస్తే కాని పని కావటం లేదు కాబట్టి. పిచ్చి కుదిరితే కాని పెళ్లి కుదరదు. పెళ్లి ఐతే కాని పిచ్చి కుదరదు. పూర్తిగా కాచ్ 22 పరిస్థితి(క్లిక్ చెయ్యండి) . ఇదే మన్ని పట్టి పీడిస్తున్న విషయం.
పాపం చిన్న పిల్లలు అలా ఎండనపడి నినదిస్తూ ఉంటే చూసి, వీళ్ళ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు కదా అనిపించి వ్రాసిన నాలుగు మాటలు ఇవి. కనీసం ఈ పిల్లలన్నా తాము చిన్నప్పుడు నినదించిన విషయాలు గుర్తుంచుకుని, ఏ విధమైన అవినీతికి పాల్పడకుండా, తమ తరంలోనైనా అవినీతి రహిత సమాజం నిర్మించ గలుగుతారని, తమ తరువాత తరానికి ఒక మంచి సమాజాన్ని ఇవ్వగాలుగుతారని ఆశిద్దాం.

ఇదే విషయం గురించి,
ఇంతకు ముందు ఒక వ్యాసం వ్రాశాను అది కింది లింకు నొక్కి చూడండి.


అవినీతి ఎక్కడ లేదు (క్లిక్ చెయ్యండి)

దాదాపు నేను వ్యక్తపరిచిన భావాలనే "హరిసేవ" బ్లాగులో కూడా వ్రాశారు. "మంద" ఆలోచనా సరళిని ఎండగట్టారు . వ్యాసం కూడచదువగలరు.

'మంద'మతుల మాటలివి!

లోక్పాల్ బిల్లు - అవినీతి అంశం మీద ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ శ్రీధర్ ఈనాడు ఆదివారం అనుబంధం లో అద్భుతమైన కార్టూన్లు వెశారు ఈ కింది లింకు నొక్కి చూడండి

శ్రీధర్ కార్టూన్లు


















5 కామెంట్‌లు:

  1. ఒక తరం మొత్తం త్యాగాలు చెయ్యటానికి సిద్ధం కావాలి.

    Perfect.

    రిప్లయితొలగించండి
  2. ఇండియన్ మినర్వా, శ్రవ్య వట్టికూటి,

    ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  3. >>వామపక్ష సిద్ధాంతాలు "వల్లే" వేస్తేనే కాని సామాజిక స్పృహ ఉన్నట్టు కాదట మరి, ఖర్మ! విదేశీ ఇజాల పిచ్చి.

    మన సమాజానికి పట్టిన జాడ్యాన్ని ఒకేమాట లో చెప్పారు సార్.. హాట్స్ ఆఫ్..

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.