19, డిసెంబర్ 2011, సోమవారం

చలం గారి సమాధి - వివాదంచలం గారి సమాధిన"ట" రోడ్డు వెడల్పు చెయ్యటం లో కొట్టేస్తున్నారని ఆంధ్ర జ్యోతి పత్రిక వారు మొదలు పెట్టిన ఒక వార్త పట్టుకుని ఇటు బ్లాగుల్లోనూ, అటు టి వి లలోనూ  చర్చలు, అభిప్రాయాలు మొదలయ్యాయి. ఆంధ్ర  జ్యోతిలో వచ్చిన వార్త ఈ కింది లింకు నొక్కి చదువవచ్చు :


చలం గారు అరుణాచలం 1950 లో తెలుగు నేలను వదిలి వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు కల్పించిన మన తెలుగు ప్రజలు, ఇప్పుడు ఆయన సమాధి మీద అపార మైన ప్రేమ ఒలకబోస్తారా?! పాపం , అలా ఆయన సమాజం నుండి వెలి అయిపోయి, బాధతో కుంగిపోయి ఎక్కడో తమిళనాట ఉన్న అరుణాచలానికి వెళ్ళిపోతే జాలిపడకపోగా,  అంతే కావాలి అనుకున్న వాళ్ళే ఎక్కువ, ఈయన దేముణ్ణి  నమ్మడుటా  చివరకు  రమణాశ్రమం పోయి చేరాడు అని ఎద్దేవా చేసిన వాళ్ళే ఎక్కువ. ఇప్పటికీ అలా అనే వాళ్ళు కనపడుతూనే ఉంటారు. 

అక్కడకు వెళ్లి ఆయనను చూసి ఆయనతో సంబంధ బాంధవ్యాలు కొనసాగించిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారి  వంటి వారిని తప్పించి, మిగిలినవాళ్ళను  చేతి వెళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.  ఆయనతో ఉత్తరప్రత్యుత్తరాలు చేసిన ఆయన అభిమానులు పదుల సంఖ్యలోనే ఉన్నారు కాని అంతకంటే  ఎక్కువగా ఏమీ లేరు. 


ఆయన 1950 లో  బెజవాడ వదిలి వెళ్ళిపొయ్యారు. ఆయన 1979 లో మరణించారు. మధ్య కాలంలో బాలాంత్రపు రజనీ కాంతరావుగారు పూనుకుని ఒక ఇంటర్వ్యూ ఆకాశవాణి కోసం రికార్డు చెయ్యటం వల్లకదా మనకు చలం గారి గొంతు వినే అవకాశం వచ్చింది. మరింకేవరన్నా పూనుకుని ఫిలిం డివిజన్ వారి చేత ఒక డాక్యుమెంటరీ చలం గారి గురించి ఆయన జీవిత విశేషాలతో రాబొయ్యే తరాల కోసం తీయించాగలిగారా. 

ఎవరూ చెప్పకుండా, ఫిలం డివిజన్ వారు డాక్యుమెంటరీ తీయటానికి ఆయనేమన్నా  బెంగాలీవాడా! అరవ్వాడా! కాదు కదా  ఆఫ్టరాల్  ఒక సామాన్య  తెలుగు వాడే కదా!

ఆ ఇరవై తొమ్మిది సంవత్సరాలూ చలం గారు దేశం కాని దేశంలో దాదాపు ఒంటరి జీవితం గడిపారు. ఒంటరి జీవితం అంటే మరెవ్వరూ దగ్గర లేక అని కాదు. ఆయన కుటుంబ సభ్యులు ఆయన వెంటే చివరివరకూ ఉన్నారు. కాని, ఆ ఇరవై రెండు సంవత్సరాలూ మానసికంగా చలంగారు ఒంటరే. 

కారణం,  మన తెలుగు వాళ్ళు ఆయనపై చూపిన నిరాదరణ, లెక్కలేనితనం.ఆయన రచనల మీద (చాలా మంది చదవను కూడా చదవకుండా) చేసిన విపరీత విమర్శలు, ఆయనను వ్యక్తిగతంగా పీడించటం. ఆయన మాష్టారిగా పని చేసి, చివరకు డి యి ఓ గా  పదవీ విరమణ చేశారు. ఆయనకు వచ్చే పెన్షన్ కూడా రాకుండా చెయ్యాలని, కొందరు నానా యాగీ చేశారు.

సరే,  ఆయన తెలుగువాళ్ళ మీద విసుగుపుట్టి, కోపం వచ్చి, అలిగి తెలుగు నేల వదిలి వెళ్ళిపొయ్యారు. ఆయన బెజవాడలో నివసించిన ఇల్లు ఏలూరు రోడ్ మీద లక్ష్మీ టాకీస్ కు ఆనుకునే ఉండేది. ఆ సినిమా హాలును పడగొట్టి ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టారు. ఆ కాంప్లెక్స్ కట్టే రోజుల్లో, పక్కనే ఉన్న పూర్వపు చలం గారి ఇల్లు కూడా కొనేసి అది కూడా పడగోట్టేసారు. అప్పట్లో ఏదో మొక్కుబడిగా,  నలుగురైదుగురు చలం అభిమానులు ఆ ఇల్లు మ్యూజియం చెయ్యాలని ఒక పత్రికా ప్రకటన పారేసి ఊరుకున్నారు. చలం గారి మీద అంత ప్రేమ మన పత్రికలకు ఉంటే, ఆనాడు ఆయన ఇల్లు పడగోడుతున్నప్పుడు ఎంత మాత్రం పట్టించుకోలేదు. ఆ ఇల్లు కాలగర్భంలో కలిసిపోయింది. 

అరుణాచలం లో  చలం గారు నివసించిన ఇంటికి ఆయన "రమణస్థాన్" అని పేరు పెట్టుకున్నారు. ఆ ఇంటి ఫోటో తెలుగు వెలుగు చలం పుస్తకం ప్రకారం, ఆ పక్కనే ఆంధ్ర జ్యోతి కథనం ప్రకారం ఈ కింది ఇవ్వబడినాయి:
ఇక్కడ ఆంధ్ర జ్యోతి వారు వేసిన ఫొటోకు తెలుగు వెలుగు పుస్తకంలో ఉన్న ఫొటోకు పోలిక ఉన్న మాట వాస్తవం
పురాణం సుభ్రమణ్య శర్మగారు తెలుగు వెలుగు చలం అన్న పుస్తకం వ్రాసారు. ఆ పుస్తకంలో చలం గారి మరణం  తరువాత జరిగిన తంతు గురించి ఈ కింద ఇవ్వబడ్డ విధంగా ఉన్నది. ఇవ్వి ఇమేజి ఫైళ్ళు, క్లిక్ చేసి, చదువుకోవచ్చు. లేదా డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. 
చలం గారి సమాధి తెలుగు వెలుగు పుస్తక ప్రకారం కుడి పక్కన, ఆంధ్ర జ్యోతి కథనం ప్రకారం ఎడమ పక్కన

 ఇప్పుడు,  ఆయన సమాధి,  రోడ్డు వెడల్పు చేస్తుండటంతో పోతుండట ఒక్కటే గోల మొదలు పెట్టారు. అసలు చలం గారికి సమాధి ఉన్నదా? ఉంటే ఎక్కడ ఉన్నది? ఈ మాటలో నిజా నిజాలు ఎంతవరకూ ఉన్నాయి.

వార్తా పత్రికలో వచ్చిన ఫోటో చూస్తె చలం గారి సమాధిగా చెప్పబడుతున్న కట్టడానికీ పైన ఉన్న చారిత్రాత్మక మైన ఫోటోలలో ఉన్న స్మృతి   చిహ్నానికీ ఎంతో తేడా ఉన్నది.  ఆపైన, చలం గారి అస్థికలు అప్పటికే మరణించిన ఆయన భార్య అస్థికలు పాతిపెట్టి స్మృతి  చిహ్నం నిర్మించిన స్థలం పక్కనే  రమణస్థాన్ (చలంగారి ఇంటికి ఆయన పెట్టుకున్న పేరు) ప్రవేశంలో పాతిపెట్టి ఆయనకు  కూడా రంగనాయకమ్మ గారికి కట్టినట్టుగానే అదే పద్ధతిలో స్మృతి  చిహ్నం కట్టినట్టుగా  స్పష్టంగా తెలుస్తున్నది. 

మరి ఇప్పుడు ఆంధ్ర జ్యోతి వారు ప్రచురించిన కట్టడం ఎప్పటిది, ఎవరు కట్టించారు, రెండు దీపాలు పెట్టటానికి వీలుగా ఉన్నది. అంటే ఇద్దరి సమాధులు కలిపేసి మళ్ళీ ఎవరన్నా కట్టించారా?  అసలు అది చలం గారి సమాధేనా అన్న ప్రశ్నకు జవాబు దొరకాలి.

చలం గారు మరణించిన తరువాత వారి కుటుంబ సభ్యులు కొంత కాలం అక్కడే ఉన్నారు. తరువాత అందరూ తలో దారి అయిపోయ్యారు. చలం గారి పెద్దమ్మాయి సౌరీస్ భీమిలిలో స్థిరపడ్డారు, గత రెండు మూడు సంవత్సరాల్లో ఆవిడ ఎనభయ్యో పడిలో మరణించారు. కుటుంబ సభ్యులందరూ అరుణాచలం, వదిలి వెళ్ళిపొయ్యాక , చలం గారు ఇరవై తొమ్మిది సంవత్సరాలు నివసించిన ఇల్లు ఏమయ్యింది? ఆ ఇంటిని ఎవరన్నా కొన్నారా? కొని అలాగే ఉంచారా!! అన్న విషయాలు వాకబు చేసి, ఇప్పటికీ ఆ ఇల్లు అలాగే 1979 లో ఎలా ఉన్నదో అలాగే ఉండి ఉంటే, ఆ ఇంటిని చలం గారి స్మృతి చిహ్నంగా ఆయనకు సంబంధించిన వస్తువులు, పుస్తకాలు వగైరా సేకరించి మ్యూజియం చెయ్యటానికి ప్రయత్నం చెయ్యగలిగితే బాగుంటుంది. అటువంటి బృహత్తర కార్యక్రమం చలం గారు ఏ తమిళుడో , బెంగాలీనో  అయ్యి ఉంటే , యుద్ధ ప్రాతిపదికన 1979  లోనే జరిగి ఉండేది! 

ఒకవేళ అటువంటి ప్రయత్నం చలం అభిమానులు, సంబంధిత ప్రభుత్వ  శాఖ (అటువంటి శాఖ అంటూ మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నదా అసలు?!) ఇప్పుడు చెయ్యాలని అనుకున్నా, అటువంటి ప్రయత్నానికి ముందుగా కావాల్సిన సత్యాన్వేషణ (fact finding) ఘనత వహించిన మన మీడియా చేస్తుందని ఆశిద్దాం. 

9 వ్యాఖ్యలు:

 1. శివరాంగారూ,
  గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఓ పున్నమి రోజున గిరివనం -తిరువణ్ణామలై-కి సహోద్యోగులతో కలిసి వెళ్లాను. రాత్రి పది గంటలకు మేం నడక మొదలెడితే అరుణాశ్రమం గేట్ కనిపించింది తప్పితే చీకటిలో ఏమీ కనిపించలేదు. చలంగారు 30 సంవత్సరాలు నివసించిన స్థలాన్ని సందర్శించాను అనే సంతృప్తి మాత్రమే దక్కింది. అంతకుమించి వెదకడానికి ఆ రాత్రి అవకాశం లేదు. తెలుగువాళ్ల దౌర్భాగ్యం కొద్దీ ఈ నేలమీద పుట్టి పారిపోయిన మాన్యుడి సమాధి కూడా మనకు మిగలదనే నా భయం. మనకు ఏది మిగిలిందని ఇక్కడ?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నెలవంక గారూ. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఇదేదో లేనిపోని వివాదం అనిపిస్తున్నది. ఇప్పుడు వార్తాపత్రికల్లో చూపించే ఫొటో అసలు చలంగారి సమాధేనా అని నా అనుమానం. ఆ కట్టడం చూస్తుంటే గత పది పదిహెనేళ్ళ క్రితం కట్టబడినట్టుగా కనిపిస్తున్నది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఓ కవిగారన్నట్టు మనుషులు పోతేగానీ మంచోళ్ళవ్వరు. అలా మంచోళ్ళయినాక మరి వాళ్ళసమాధులను జాగ్రత్తగా కాపాడుకోవాలికదండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. శివ గారు,

  ఇరవై ఏళ్ళ క్రితం స్వామి రామనంద గారు, నన్నూ నా మిత్రులు వర ప్రసాద్ గారిని, అణ్ణామలై తీసుకువెళ్ళారు. మా బస చలంగారు వుండిన పాత ఇంటిలొనే. అప్పటికే సౌరిస్ భీంలి తరలిపొయేరు. నర్తకి గారు మాత్రం వున్నారు. చలంగారిని చివరవరకు అంటిపెట్టుకుని సేవ చేసారు. పూర్వాశ్రమంలో స్వామి రామానంద గారు చలం గారితోనే వున్నారు.సౌరిస్ ఆదేశంతో హిమాచల్ వెళ్ళి అక్కడ స్వామి రామానంద అయ్యారు. ఇప్పుడు సౌరిస్, నర్తకి, స్వామి రామానంద లేరు. చలం గారి సమాధి గుర్తు లేదు. నర్తకి గారు హైదరాబాద్ వచ్చినపుడు ఒరొజు మా అతిధిగా వున్నారు.స్వామి రామానంద గారు కూడా. అప్పుడు ఆమేతోపాటు చలంగారి అభిమానుల ఇళ్ళకు తీసుకువెళ్ళారు. ఫిల్మ్ నగర్ లో రచయిత్రి రంగనాయకమ్మ గారింటింకి కూడా వెళ్ళాము. రంగనాయకమ్మగారికి చలంగారి ఆశ్రమం గురించి బాగా తెలుసు. అక్కడి సందేహాలు ఆమే తీర్చగలరు అని నా నమ్మకం.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @కొత్తపాళీ,

  Thank you for your comment. To state a fact, Chalam was cremated but not buried. Yes, had he been buried, he would have been turning in his grave.

  @Indian Minerva

  My point is that the structure which the media is showing is not the so called Samadhi of Shri Chalam. Without verifying the facts, Media is trying to a sensation to fill the time in the channel and space in the paper.

  Yes if the Samadhi of Shri Chalam could be found or discovered, it should be made a Memorial. On this there is no second opinion.But not just some structure which is pointed out by the news hungry media.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. శివప్రసాద్ గారికి నమస్కారం, సర్ మహాకవి శ్రీ
  గుడిపాటి వెంకటచలం గారి గురుంచిన మీ బ్లాగ్ చదవగానే నా కు ఎదురయిన అనుభవం గుర్తుకొచ్చి మీ తో పంచుకోదామని
  మొన్నమార్చ్ లో తమిళనాడు టూర్ వెళ్లి అక్కడనుంచి అరుణాచలం వెళ్లినప్పుడు రమణమహర్షి ఆశ్రమం వెళ్లి చలం గారి గురుంచి అడిగినప్పుడు నిజంగా చాల భాధ అనిపించింది.ప్రస్తుతం ఉన్నవాళ్ళకి చలం గారి గురుంచి ఏమి తెలియదు,అంతా అరవం వాళ్ళు అసలు మన గోడు పట్టించుకోరు అప్పుడునేను గట్టిగ వాదం పెట్టుకుంటే ఒక పెద్దాయన(అక్కడ ఉద్యోగి) వచ్చి అమ్మనేను తెలుగువాడినివిజయనగరం మాది ఇప్పుడుఇక్కడ ఎవరకి ఏమి తెలియదు అని రహస్యంగ ఇక్కడ అయనగురుతులు ఏమి లేవమ్మ ఆఖరికి ఆయనఇల్లు అవి కూడా లేవమ్మ ఇంతకంటే నేను చెప్పలేను అనిఅన్నారు.

  "అప్పుడునేను అనుకున్నాను ఒకమహామనిషి,ఒక సంస్కర్త, రచయత
  ఒక రుషి ,గుర్తులు కూడామిగులుచుకోలేని దౌర్భాగ్యస్తితిలో వున్నాము కదాఅని"
  చేసిదిఏమిలేకబరువెక్కిన మనస్సుతోఆయన తిరిగిన ప్రదేశం కదా అని మొత్తం ఆనేల అంతా తిరిగి వచ్చి మనసులోనే ఆయనికిఅంజలి ఘటించాను".

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @విరిసిన అరవిందం

  Thanks for sharing your experience. What you explained just strengthens my contention that AJ is just hyped up a non issue into an issue.

  Then one more thing. When Shri Chalam passed away, I still remember there was not much news coverage at all. Just a news item that he died that too after two days of his death. He was living among Tamilians, deep inside Tamilnadu. How his house could be made memorial. At that time also there were not many people who liked Shri Chalam to undertake such a project. Now...I hope there are some but.....I have no clear idea whether anything can happen because of his hangama created by AJ.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. కప్పు గంతు గారికి — మీరు వ్రాసిన చలం విషయం నిజమే నని అనుకొంటున్నాను .నేను చలం గారిని అరుణాచలంలో చూశాను ,.అప్పటికే ఆరోగ్యం క్షీణించింది .మధ్యాహ్నం పన్నెండు తర్వాత చూసిన జ్ఞాపకం .భోజనం చేసి మంచం మీద పడు కోని వున్నారు .భార్య కూడా చెంతనే వున్నారు .ఇస్మాయిల్ ,చలం గారి ఇంకో అమ్మాయి పక పక వున్నట్లు గుర్తు .సౌరీస్ గారు మాత్రం శ్వేత వస్త్రాలతో ప్రక్క గదిలో ధ్యానం లో వున్నారు .చలం గారు కళ్ళు తెరిచే దాకా ఉండి గళ్ళ లుంగీ ,నేత అర చేతుల బనీను తో వున్నారు చలం .గడ్డం పెరిగి ఉంది.చూపుల్లో వెలుగు కన్పించిం ది అన్నేళ్ల సాధన ఫలితా మేమో ? . ,పాదాలకు నమస్కారం చేశాను . బెజవాడ దగ్గర ఉయ్యూరు నుంచి వచ్చానని చెప్పాను .రమణ మహర్షి ఆశ్రమం సందర్శించి వచ్చాను అని చెప్పాను .మాట్లాడే స్థితి లో కూడా లేనట్లు కన్పించింది .కాళ్ళు ,పాదాలు బాగా ఉబ్బి వున్నాయి .నీరు పట్టిందను కొంటాను .ఖచ్చితం గా ఏ సంవత్సరం లో చూశానో జ్ఞాపకం లేదు .శ్రీ శ్రీ ఆయన్నురేడియో కోసం ఇంటర్వ్యూ చేసిన సుమారు రెండేళ్లకు అని జ్ఞాపకం. అదొక అనుభూతి గా ఫీల్ అయాను .ఒక మహా రచయిత ను దర్శించాననే మహదానందం పొందాను .దాని తో పాటు కాలేజీ రోజుల్లో ,సౌరిస్ గారి పుస్తకాలు చదివి ,ప్రభావితం అయానని చెప్ప లేను కాని ,చదివి ఆనందించాను అని చెప్ప గలను .ఆమె ను గురించి విన్న ,చదివిన కధలు ,గాధలు కూడా జనాపాకమే .ఆమెను కూడా చూసినందుకు సంబర పడ్డాను .ఒక తరాన్ని ప్రభావితం చేసిన మహా రచయితలు చలం ,సౌరీస్ లు .చలం మ్యూజింగ్స్ అంటే ఎప్పుడూ నాకు విపరీత మైన క్రేజ్ .అరుణా చలం చాలా సార్లు వెళ్ళినా ,చలం అక్కడే వున్నారని తెలిసినా చూడటం అప్పుడే .అదే మొదటి సారి చివరి సారి .ఇదే చలం సందర్శన కధ .మళ్ళీ ఇన్నేళ్ళకు మీరు పంపిన లేఖ ద్వారా జ్ఞాపకం వచ్చాయి .ఆ జ్ఞాపకాలు ఒలక బోశాను అంతే —మీ దుర్గా ప్రసాద్

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.