పై ఫోటో మాయాబజార్ సినిమా షూటింగ్ జరుగుతుండగా తీయబడిన వర్కింగ్ స్టిల్. ఈ రోజున మా అబ్బాయికి ఎక్కడ దొరికిందో తెలియదు కాని,మెయిలులో పైన ఉన్న ఫోటో పంపాడు. ఈ ఫోటోలో ప్రియదర్శిని ముందు సావిత్రి, ఆమెకు ఎదురుకుండా దర్శకుడు రెడ్డిగారు, సినిమాను షూట్ చేస్తున్న మార్కస్ బార్ట్లే గారు ఇంకా నాకు తెలియని ఎందరో కనపడుతున్నారు.
ఈ ఫోటో చూసి ఎంతో ఆనందించాను. మాయా బజార్ సినిమా వర్కింగ్ స్టిల్ చూడటం ఇదే మొదటి సారి. దర్శకుడు శ్రీ కె వి రెడ్డి (కదిరి వెంకట రెడ్డి) గారు నటిస్తున్న సావిత్రి ఎదురుగా కూచుని చూస్తూ, నిశితంగా పరిశీలిస్తూ ఆవిడ చేత అద్బుతమైన నటన రాబట్టుకున్నారు. ఆ విషయం పైన ఉన్న ఫోటో చూస్తె చక్కగా తెలుస్తున్నది. రెడ్డిగారు కూర్చుని నటివంక చూస్తున్న పద్ధతి నాకు ఎంతో నచ్చింది.(with his fingers crossed). దర్శకుడు అంత శ్రద్ధ తీసుకుని తమ నటనను ప్రతి క్షణం చూస్తూ, చెయ్యవలసిన విధం, తనకు కావలిసిన పద్ధతి చెబుతూ చక్కగా తీయబట్టే ఇన్నాళ్ళైనా కూడా ఆ సినిమా గురించి ఉత్సాహంగా చెప్పుకుంటున్నాము.
పైనున్న వర్కింగ్ స్టిల్ మాయా బజారులో ఎంతగానో ప్రేక్షకాదరణ పొందిన పాట నీవేనా నను తలచినది, తీస్తున్నప్పటిది. ఈ పాట యు ట్యూబ్ నుంచి:
ఈ ఫోటో చూసిన ఆనందంలో , మాయా బజారు సినిమాలో దర్శక ప్రతిభ నాకు అనిపించిన నలుగు మాటలు అందరితో పంచుకోవాలని వ్రాశాను.
oooOooo
మాయా బజార్ సినిమాలో, భారతంలో ఉండే పాత్రలను తీసుకుని ఒక పారడి సృష్టించారు . ఈ విధంగా పురాణ కథలను అపసవ్యం చేసి సినిమా తీసినప్పుడు, అదికూడ 1950లలో, ఎవరూ కూడ, నాకు తెలిసి, అభ్యంతర పెట్టిన దాఖలాలు లేవు.
శశిరేఖ పాత్ర ఎక్కడిది, బలరాముడికి ఈ కూతురు ఎక్కడ నుంచి వచ్చింది. అభిమన్యుడు పెళ్ళి చేసుకున్నది ఉత్తరను కదా, ఆమె విరాట రాజు కుమార్తె కదా అన్న అసలు విషయాలు ఎవరూ కూడ ప్రశ్నించలేదు.
అలాగే భారతంలో విరటుడి కొడుకు ఉత్తరుడు , వాడిని పట్టుకు వచ్చి దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడిగా మార్చి చూపించారు. ఇది కూడ ఎవ్వరూ ప్రశ్నించలేదు. కారణం?? ఆ సినిమాను తీస్తూ ఎవరి మనోభావాలు చెదరకుండా దర్శక రచయితలు తీసుకున్న జాగ్రత్తలు. మొదటినుంచి కూడ ఇదొక హాస్య సినిమా మేమేమీ భారతం లో కథను సినిమాగా తియ్యటంలేదు అన్న సూచనను అంతర్లీనంగా హాస్య ఘట్టాలతో ఇస్తూనే సినిమా కొనసాగింది.
అన్నిటికి మించి ఈ సినిమాలో, పాండవుల గురించిన ప్రస్తావన అనేక సార్లు వస్తుంది కాని, వాళ్ళు ఎక్కడా కనపడరు. కథకు అవసరం లేనప్పుడు ఎందుకు చూపాలి అని దర్శకుడు అయిన రెడ్డిగారు అనుకుని ఉంటారు. ఈ విషయం ఈ నాడు, ఒక క్విజ్ ప్రశ్న అయిపోయింది. రెడ్డిగారుచూపించిన దర్శక ప్రతిభలో ఇదీ ఒకటే.
ఆ తరువాత, దర్శకుడు తీసుకోవాల్సిన జాగ్రత్త, తాను అనుకున్న పాత్రలకు తగిన నటీ నటులను తీసుకోవటం. ఈ విషయంలో వందకు కు వెయ్యి మార్కులు రెడ్డిగారికి. ఎందుకంటే, అప్పటి నటీనటులలో ఇంకెవరినన్న తలుచుకుని, ఈ పాత్రను, ఇతను/ఈమె కాకుండా మరొకరు వేస్తే అని మనం అనుకుంటే ఎవ్వరూ తట్టరు. ఇది కూడ అంతర్లీనంగా ఉండే మరొక దర్శక నైపుణ్యం.
పైన చెప్పిన రెండూ కూడ ఆయనతో పాటుగా, నిర్మాతలలో ఒకరైన చక్రపాణిగారి పాత్ర కూడ ఉండి ఉంటుంది అనటంలో సందేహం లేదు.
ఇక సినిమా తీయటంలో దర్శక ప్రతిభ చెప్పాలంటే చాలా ఉన్నాయి.
- అనేకానేక విచిత్ర విషయాలను చొప్పించటం, ప్రియ దర్శిని, దానిమీద నుంచుంటే నిజమే చెప్పే ఒక పరికరం వంటివి ఎంత హాయిగా నవ్వుకునే అవకాశాం ఇచ్చాయంటే, వాటికోసమే సినిమాను అనేక సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు.
- రథంలో అభిమన్యుడు, తల్లి సుభద్ర వెడుతున్నప్పుడు ఘటోత్కచుడు అడ్డుపడే సందర్భం చక్కగా తీశారు. పాత్రలను ధరించిన నటీ నటులకు, సన్నివేశం చక్కగా విపులీకరించి వాళ్ళు వాళ్ళ డైలాగులు చెప్పేటప్పుడు ఎటు చూడాలో చెప్పి ఆ సీన్ చక్కగా పండేట్టుగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఎందుకంటే, ఘటోత్కచుడు చాలా సేపు కనపడడు, ఎటు చూసి చెప్పాలి మాటలను!
- ఘటోత్కచుడు శశిరేఖగా మారి ఉత్తర కుమారుడిని పెళ్ళి చేసుకోవటం సందర్భ సృష్టే ఒక అద్భుతం. ఇది రచయిత చేసి ఉండవచ్చు. కాని ఆ మార్పిడి, అలా మారిన తరువాత, సావిత్రి చేత చేయించిన అభినయం, దర్శకుడు ఎంత కష్టపడి ఆ విధంగా చేయించి ఉంటాడు. శశిరేఖగా మారిన ఘటొత్కచుడి పాత్రలో సావిత్రి చేసిన నటన అజరామరం, ఇది కూడ రెడ్డిగారి దర్శక నైపుణ్యమే అని చెప్పక తప్పదు.
- లాహిరి లాహిరి పాట ఒక క్లాసిక్. ఇంతవరకూ కూడ ఒకే పాటను మూడు జంటలు పాడటం మళ్ళి తీసినది లేదు. అసలు ఆ ఆలోచన ఎవరిది. మనకు తెలియదు, సినిమా చరిత్ర కారులు పరిశోధించి చెప్పలి. కాని అలోచన ఎవరిదైనా, ఆ పాటను ముగ్గురు జంటలు ఒకరికి ఒకరు కనపడకుండా అదే పడవలో కూచుని పాటను కొనసాగించటం తీయటం మనం చూసినంత సులభం కాదు. రెడ్డిగారు ఈ పాటను అవలీలగా తీసి, తెలుగు సినిమా పాట చిత్రీకరణను అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్ళారు.
- ఉత్తర కుమారుడు, శకుని. వీళ్ళిద్దరి కాంబినేషనులో వచ్చిన చక్కటి మేలురకమైన హాస్యం ఆ సినిమాలో తలమానికం. ఇద్దరూ నిష్ణాతులైన నటులే. కాని వాళ్ళిద్దరి మధ్య చక్కటి నటనలో పొంకాన్ని తీసుకు వచ్చినది తప్పకుండా దర్శకత్వ ప్రతిభ మాత్రమే. ఉత్తర కుమారుడు (లక్ష్మణ కుమారుడని సినిమాలో పేరు) అసలు కథ ప్రకారం వీడు విరాటుడి కొడుకు కాని సినిమాలో దుర్యోధనుడి కొడుకుగా పేరు మార్చి లక్ష్మణ కుమారిడిగా చూపారు. శకుని దుర్యోధనిడి బంటు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అని అలోచించి దానికి సరిపొయ్యే సంభాషణలు వ్రాయించుకోవటం అనేది కూడా దర్శక ప్రతిభలో బాగమే.
- ఇక కృష్ణ పాత్రధారి రామారావు, అప్పటికే ఆ వేషం మరొక సినిమాలో వేశాడు. అది వీర ప్లాప్ అయ్యింది. అయినప్పటికి అతనిలో పురాణ పాత్రను వేయగల స్పార్క్ ను కనిపెట్టి , అతని చేత కృష్ణ పాత్రను చక్కటి పరిణితితో ఏమాత్రం అతి లేకుండా చేయించారు.రామా రావు తరువాత తరువాత ఊహూ చించుకోవటం మొదలెట్టి ఓవర్ ఏక్షనుకు బలై పొయ్యాడు. అలా ఒక నటుడిని తీసుకుని అతని చేత ఇంతకు ముందు ప్లాప్ అయిన పాత్రనే వేయించి, అందరిచేత భేష్ అనిపించుకోవటంలో రామారావు నటనా శక్తి లేదని కాదు కాని, రెడ్డిగారి దర్శక నైపుణ్యం కనపడని అసలు విషయం.
ఈ వీడియో లో వాడిన స్టిల్స్ CINEJOSH.COM నుండి తీసుకొనబడినవి
నమస్కారములు
రిప్లయితొలగించండిఎన్నో తెలియని విషయాలను చక్కగా వివరించారు. శివ రామ ప్రసాద్ గారూ ! మీ అభి రుచికి ధన్య వాదములు
అరుదైన ఈ ఫొటో అమూల్యమైన సంపద కన్నా గొప్పది, అందరితోనూ పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండీ!
రిప్లయితొలగించండిrare and neverseen photo
రిప్లయితొలగించండిఆల్బం లొ దాచుకోవాల్సిన ఫోటో అందరికీ పంచినందుకు అభిననందనలు. పురాణాల వివరాలు కొత్త విషయాలు తెలిపారు. puraaNaalu చరిత్ర కాదు కనుక ప్రేక్షకుల కోసం కొంత మార్చి చూపినా తప్పేమీ లేదని అలా చేసి వుంటారు. ఎన్ .టీ. ఆర్ దాన వీర శూర కర్ణలొ సుయోధనుని కారెకటర్ ను పాజిటివ్ గా మార్చి విజయం సాధించారు కదా! అయితే కొత్త సినిమా " లాహిరి .. లాహిరి ... లాహిరి" లో ( హరికృష్ణ-సుమం-ఆదిత్య మూడు జంటలపై ఇదె పల్లవితో పాట పాడించారు )
రిప్లయితొలగించండిAs far as i know lakshmana kumara is the son of duryodhana.According to vyasa's Mahabharatha he is a great warrior.Lakshmana kumara dies at the hands of Abhimanyu in the Mahabharatha war.
రిప్లయితొలగించండిశివ రామ ప్రసాద్ గారు ! మాయాబజార్ నవల గా రిలీజ్ చేసారు.ప్రస్తుతం మార్కెట్ లో దొరుకుతోంది.దానిలో ఇంకా బోలెడు విశేషాలు ఉన్నాయి.
రిప్లయితొలగించండికుదిరితే చదవండి.
మీ పోస్ట్ బావుంది.
@ హరి మీరు చెప్పినది నిజం.
రిప్లయితొలగించండి@శశి బాల గారూ మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు.
@నేదునూరి రాజేశ్వరి గారూ ధన్యవాదాలు.
@కొండలరావు గారూ,
రిప్లయితొలగించండి"..పురాణాలు చరిత్ర కాదు.." ఎందుకనో!! ఇవ్వాల్టి మనకు తెలిసిన చరిత్ర కొన్నాళ్ళకి పురాణం అవ్వకూడదా! గాంధీ అనే మనిషి ఉండేవాడని ఒక వెయ్యి సంవత్సరాలకి నమ్ముతారా. ఆ పురాణం అని కొట్టిపారేస్తారా?
మాయా బజారు తీసిన వాళ్ళు ప్రజలకి వినోదం అందిద్దామనే కాని పురాణాలను ఎద్దేవా చేద్దామని తియ్యలేదు ఆ సినిమాని. కాని, మీరు చెప్పారు చూడండి "విజయం" సాధించింది అని, అది మటుకు తప్పనిసరిగా పురాణాలను ఖూనీ చేసిన సినిమా. ఒక సినిమా విజయవంతం కావటం, మంచి సినిమా కావటం రెండు వేరు వేరు విషయాలు, సినిమా విజయవంతమే గీటురాయి అయితే అనేకానేక చెత్త, బేవార్సు సినిమాలు వందరోజులెం ఖర్మ పాతిక వారాలు కూడా ఆడినాయి అవన్నీ మంచి సినిమాలు అనటానికి ఎక్కడా ఏ కోశానా అన్నా అవకాశం ఉన్నదా.
Chaalaa baagundi.
రిప్లయితొలగించండి