27, డిసెంబర్ 2011, మంగళవారం

చలం గారి సమాధి వివాదం మరో కోణం


 
కొన్ని రోజుల క్రితం ఆంధ్ర  జ్యోతి వార్తా పత్రికలో వచ్చిన కథనం ప్రకారం మొదలయ్యిన చలం గారి సమాధి గురించిన వివాదం మరొక మలుపు తిరిగింది. వామపక్ష రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు తాను చూసిన విషయాలు ఆంధ్రజ్యోతిలో వ్రాసారు. ఈ కింది లింకు నొక్కి చదువ వచ్చు:


  • అసలు చలం మరణించిన తర్వాత ఏం జరిగిందంటే- ఆ దేహానికి దహనం అయితే, దూరంగా స్మశానంలోనే జరిగింది. తర్వాత, నర్తకి ఆ స్మశానం నించి కాస్త బూడిదని గిన్నెలో పెట్టి ఎత్తుకొచ్చింది.  
  • చలంగారు వుండే ఇంటి ప్రహరీ గోడబైట, ఆ గోడకీ రోడ్డుకీ మధ్య దాదాపు 15 అడుగుల వెడల్పు స్థలం వుంటుంది..........స్మశానం నించి తెచ్చిన బూడిదలో కొంత భాగాన్ని, ఆ ఇంటి ముందు గోడ బైట వున్న మొక్కల్లో ఒకచోట పూడ్చి, మిగతా బూడిదని ఒక గిన్నెలో పోసి, ఇంట్లో ఒక చోట పెట్టింది. గోడబైట బూడిదని పూడ్చిన చోటే చలం సమాధి అని చిన్న అరుగు లాంటిది ఏదో తర్వాత కట్టారు. ఇప్పుడు, దాన్ని ఇంకా పెద్దది చేస్తే, అది చలం పట్ల భక్తి గౌరవాలు అవుతాయా? 
  • 'సాహితీ ప్రియులై'నా, 'అభిమానులై'నా, రచయితల గురించి పట్టించుకోవలసింది వారి బూడిదల్నీ, సమాధుల్నీ కాదు; వారి రచనల్ని. రచనల మీద శ్రద్ధ చూపితే అది చాలు. ఒక రచయితని గుర్తించడం అంటే, ఆ రచనల్లోని భావాల్ని గ్రహించి, వాటిలో పొరపాట్లు వుంటే వాటిని తిరస్కరించి; సరైన వాటిని స్వీకరించి, వాటిని ఆచరించడమే.
  • రచయితని గౌరవించడం అంటే, ఆయన భావాలకు వ్యతిరేకంగా నడవడమా? ఆ మనిషి లేచి రావడమే సాధ్యమైతే, ఆ సమాధిని కూలగొట్టడూ?  
"...ఆ మనిషి లేచి రావడమే సాధ్యమైతే, ఆ సమాధిని కూలగొట్టడూ? ..." మొట్టమొదటి సారి, నేను రంగనాయకమ్మ గారు వ్యక్తపరిచిన   ఈ   అభిప్రాయంతో  ఏకీభవిస్తున్నాను. 

ఆయన బతికి ఉన్నప్పుడు ఇవ్వని గౌరవం, ఆయన రచనల మీద చూపని గౌరవం ఆయన సమాధి మీదనా!  పోనీ ఆయన సమాధి మీద మనకు ఎంతో గౌరవం ఉంది అనుకుంటే, ఆ పత్రికలో చూపించినది అసలైన సమాధేనా అన్న ఒక ముఖ్య    ప్రశ్న       వేసుకు తీరాల్సిందే కదా! చలం అభిమానులు  చలం స్మ్రుతి చిహ్నం ఒకటి ఉండాలి అనుకోవటంలో తప్పేమీ లేదు అని నా అభిప్రాయం.

అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా వార్తల ఆకలిలో ఉన్న మీడియా ఒకరి నుంచి మరొకరు అందుకుని ప్రచారం. దున్నపోతు ఈనింది అంటే, దూడను కట్టేయండి  అని మరొకరి సూచన. ఒక వార్త వస్తే  అందులో నిజా నిజాలు చూసుకోకుండా, ఏమాత్రం ఆలోచించకుండా, ప్రస్తుతానికి Politically correct (ఇదే అర్ధంతో తెలుగులో ఏమన్నా మాటలు ఉన్నాయా!) సందేశాలు ఇచ్చిపారేసారు. ఇవన్నీ చూసి విని, తన వద్దకు వచ్చిన విన్నపాలు చూసి, తమిళనాడు గవర్నర్ రోశయ్య గారు తక్షణమే స్పందించి ఆ కట్టడం పరిరక్షణకు ఉత్తర్వులు ఇవ్వటం కూడా జరిగిపోయింది ట .

పూర్వం పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వ్రాసిన తెలుగు వెలుగు-చలం అన్న పుస్తకం ప్రకారం వివరాలు అన్ని సవ్యంగా ఉన్నాయి. ఆ పుస్తకాలో వివరాలూ ఇప్పుడు మీడియా చేసిన హడావిడీ బేరీజు వేసి చూస్తె, రోశయ్య గారు చొరవ తీసుకుని పరిరక్షణకు ఉత్తర్వులు ఇచ్చిన కట్టడం నిజంగా చలగారి స్మ్రుతి చిహ్నమా అన్న అనుమానం తప్పకుండా పొడచూపుతుంది.

తెలుగు వెలుగు చలం పుస్తకం ఇంటర్ నెట్లో చదవటానికి దొరుకుతున్నది. ఈ కింది లింకు నొక్కి చదువ వచ్చు:


 పై పుస్తకాన్ని చూసి వచ్చిన అనుమానాల్ని తమిళనాడు గవర్నర్  గా  ఉన్న మన తెలుగు వారు గౌరవనీయులు శ్రీ రోశయ్య గారికి ఒక జాబు వ్రాసి, పై పుస్తకంలో ఉన్న పుటల  నకళ్ళు తీసి పంపాను.
*****************************************************

బెంగుళూరు,
ది. డిసెంబరు 24, 2011
గౌరవనీయులు రోశయ్య గారికి నమస్కారము.
విషయము: చలంగారి స్మృతి చిహ్న పరిరక్షణ
నేను ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్న ఒక తెలుగువాడిని. తెలుగు సాహిత్యం అంటె అభిమానం.   ఈ మధ్య కాలంలో శ్రీ గుడిపాటి వెంకట చలం గారి సమాధి గురించి కొంత హడావిడి జరగటం ప్రింట్/ఎలెక్ట్రానిక్ మీడియాలోనూ ఈ విషయలు రావటం చూశాను. మీడియా వారి ప్రకారం అక్కడ ఒక సమాధి బొమ్మ చూపించి అదే  చలంగారి  సమాధి, ఆ కట్టడం,  రోడ్డు వెడల్పు పనుల్లో కొట్టెయ్యబోతున్నారు అని ఉన్నది.ఈ విషయంలో మీరు తెలుగు ప్రాంతంలో ఉన్న సాహిత్య అభిమానుల విన్నపానికి స్పందించి, అరుణాచలం ప్రాతానికి చెందిన జిల్లా కలెక్టర్  గారికి తగిన ఉత్తర్వులు ఇచ్చారని, ఆ ఉత్తర్వుల ప్రకారం వారు ఆ కట్టడం చుట్టూ ముళ్ళ కంచె వేయించి పరిరక్షణ చర్యలు చేపడతారని తెలిసి,మీ తక్షణ స్పందనకు మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తున్నాను.

కాని ఆ సమాధి బొమ్మ చూసినాక, నేను ఈ విషయం మీద చదివిన పుస్తకం గుర్తుకు వచ్చింది. శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు (అనేక సంవత్సరాలు ఆంధ్ర జ్యోతి వారపత్రికకు సంపాదకులుగా ఉన్నారు, మీకు తెలిసే ఉంటారు) వ్రాసిన తెలుగు వెలుగు-చలం అనే పుస్తకములో చలం గారు మరణించిన తరువాత జరిగిన తంతు విపులంగా వ్రాశారు. చలం గారిని ఆయన మరణానంతరం హిందూ ధర్మ ప్రకారం బ్రాహ్మణులకు ఏ విధంగా చేస్తారో అలాగే దహనం చేయటం జరిగింది కాని, ఖననం చేసి సమాధి కట్టలేదు. ఆ పుస్తకంలో వ్రాసిన ప్రకారం, చలం గారి అస్థికలను సేకరించి అప్పటికే మరణించిన చలం గారి భార్య సమాధి పక్కనే పాతిపెట్టి, ఆవిడకు కట్టినట్టుగానే వర్తులాకారంలో చలంగారి అస్థికలకు కూడా సమాధి కట్టారు. ఆ రెండు సమాధుల  ఫొటోలూ ఆ పుస్తకంలో ఉన్నాయి. ఇవి రెండు కూడ రమణస్థాన్  (చలం గారు 29 సంవత్సరాలు జీవించిన ఇంటికి ఆయన పెట్టుకున్న పేరు) ప్రవేశంలోనే ఉన్నట్టుగా పై పుస్తకంలో వ్రాశారు.నేను కూడ ఈ విషయాలను ఉట్టంగిస్తూ నా బ్లాగు "సాహిత్య అభిమాని" లో నాకు తెలిసిన విషయాలను, మీడియాలో వచ్చిన విషయాలను బేరీజు వేసి సమచారం అందరికీ తెలిసేట్టుగా ప్రచురించాను ( ఆ కాపీ కూడ ఈ జాబు  తో బాటుగా పంపుతున్నాను). 

ఈ విషయంలో తెలుగు వెలుగు చలం అన్న పుస్తకం లోని సంబంధిత పుటలు మీకు పంపుతున్నాను. దయచేసి ఈ వివరాలు అరుణాచలం లో ఉన్న  అధికారులకు పంపి, ఇప్పుడు  ఆంధ్ర జ్యోతి వారు ప్రచురించిన ఫొటోలు నిజంగా చలం గారి సమాధికి చెందినవేనా అన్న విషయం  తప్పకుండా దర్యాప్తు జరిపించి అప్పుడు  రక్షణ చర్యలు చేబడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఒక్కటే  కొండ గుర్తు, చలం గారి సమాధిఆయన 29 సంవత్సరాలు ఆయన ఉన్న ఇంటి ముందు ప్రదేశంలోనే ఉండి ఉండాలి.ఆ ఇల్లు ఇప్పుడు పత్రికల వారు చెప్పిన వెడల్పు చెయ్యబోతున్న రోడ్డు పక్కన ఉంటే అక్కడ వెతకాలి. కాదు ఈ సమాధి మరెక్కడో ఉంటే ఇది చలంగారి సమాధి కాదు.   

నా ఉద్దేశ్య ప్రకారం,పేపర్లలో వచ్చిన వార్తల్లో ఎంతవరకూ నిజమో మనకు తెలియదు. కాబట్టి  ఒక తెలుగు రచయిత సంబంధినిన గుర్తులు, స్మృతి చిహ్నం కాపాడదాము అని అనుకున్నప్పుడు, అసలు నిజమైన వాటిని గుర్తించి ఆపైన మాత్రమే అటువంటి స్మృతి చిహ్నాలను పరిరక్షిస్తే మీరు తీసుకున్న ఆసక్తికి తగిన ప్రతిఫలం వచ్చి తెలుగునాట చలంగారి అభిమానులు అందరూ సంతోషిస్తారు.   ఒక్క పత్రికల వార్తలను అనుసరించి, ఈ విషయంలో చలంగారి గురించి ఏమీ తెలియని అరుణాచలంలోని అధికారులు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం వారు చర్యలు చేబడితే, ఎవరిదో తెలియని ఒక సమాధి, చలంగారి సమాధి పేరిట జాగ్రత్తగా కాపాడబడి, అసలు చలంగారి సమాధి కాలగర్భంలో కలిసిపొయ్యే ప్రమాదం ఉన్నది (ఇప్పటికే అలా జరుగలేదని నా ఆశ).

అందుకని,  మీ ముందు నాకు తెలిసిన ఈ నాలుగు విషయాలు ఉంచటానికి సాహసించాను, అన్యధా భావించరని తలుస్తాను.
నమస్కారములతో, ఉంటాను.
ఇట్లు

శివరామప్రసాదు కప్పగంతు 
*****************************************************
 ఆంధ్ర జ్యోతి సంపాదక వర్గానికి ఈ రోజున ఇచ్చిన ఒక మెయిల్ 

From: SIVARAMAPRASAD KAPPAGANTU
Date: 2011/12/27
Subject: చలం గారి సమాధి :: చర్చ
To: internet@andhrajyothy.com, editor@andhrajyothy.com, jagan@andhrajyothy.com


ఆంధ్ర జ్యోతి గౌరవ సంపాదక వర్గానికి నమస్కారం.

మీరు మీ పత్రికలో చలంగారి సమాధి గురించి వ్రాసిన వ్యాసం ఆపైన మీ టి వి చానెల్ లో వచ్చిన ఒక చర్చా కార్యక్రమం చూశాను. నేను చదివిన ప్రకారం చలం గారి సమాధి ఆయన ఇంటి దగ్గరే, ఇంటి ప్రవేశం లోనే  ఉన్నది. మీరు ఆ ఇంటి ఫోటో కూడ వేసారు కాని, ఆ ఇల్లు ఇప్పుడు వెడల్పు చేయబడుతున్న రోడ్డు దగ్గరే ఉన్నదా అన్న విషయం స్పష్టంగా లేదు. చలంగారు నివసించిన ఇల్లు ఇప్పుడు మీరు వెడల్పు చెయ్యబోతున్నారు అనే రోడ్ కు పక్కన లేదా దగ్గరో లేకపోతె, మీరు చలంగారి సమాధి కింద చూపించిన ఫోటో, చలం గారి సమాధి ది  కాదు.

ఈ విషయం శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు (మీ ఆంధ్ర జ్యోతి వార పత్రికలోనే దశాబ్దాలు పనిచేసారు, మీకు తెలిసి ఉండాలి) వ్రాసిన తెలుగు వెలుగు చలం అనే పుస్తకం లో  ఉన్న విషయాలు ఆధారంగా తీసుకుని, మీరు ఇప్పుడు ప్రచురించిన విషయాలు చూస్తె, మీరు వ్రాస్తున్నది చలంగారి సమాధి గురించేనా అన్న అనుమానం వచ్చింది. ఈ విషయంలో చలం గారి సమాధి గురించి మీరు వ్రాసినది, తెలుగు వెలుగు చలం పుస్తకంలోని విశేషాలు, ఫోటోలు బేరీజు వేస్తూ, నా బ్లాగులో ఒక వ్యాసం వ్రాశాను. ఈ కింది లింకు నొక్కి చూడగలరు.

http://saahitya-abhimaani.blogspot.com/2011/12/blog-post_19.html

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వ్రాసిన తెలుగు వెలుగు-చలం పుస్తకం ఇంటర్నెట్ లో దొరుకుతున్నది. ఈ కింది లింకు నొక్కి చూడగలరు:

http://ia600400.us.archive.org//load_djvu_applet.php?file=10/items/TeluguveluguChalamVol1/TeluguveluguChalamVol1.djvu

ఈ విషయంలో వెంటనే స్పందించిన గవర్నర్ రోశయ్య గారిని తప్పకుండా అభినందించాలి. కాని ఇప్పుడు మీరు ప్రచురించిన కథనంలో ఉన్న కట్టడం నిజంగా చలంగారి సమాధి అవునా కాదా అన్న విషయం ప్రభుత్వం తప్పకుండా శోధించి అది చలంగారి సమాధి అయినప్పుడు మాత్రమె పరిరక్షణ చర్యలు చేపట్టాలి అన్నది నా అభిప్రాయం. లేకపోతే ఎవరో అనామకుడి సమాధికి ప్రభుత్వ ఖర్చులతో, రోడ్డు వెడల్పు చెయ్యకుండా ఆపి సంరక్షణ జరుగుతుంది , చలం గారి స్మ్రుతి చిహ్నం అనామకంగా ఎవరికీ తెలియకుండా ఎక్కడ ఉన్నదో కూడా తెలియకుండా కాల గర్భంలో కలిసిపోతుంది(ఇప్పటికే అలా అయిపోయి ఉంటుంది అని  నా భయం).

ఈ మైలుతో బాటుగా నేను గవర్నర్ రోశయ్య గారికి వ్రాసిన జాబు ప్రతిని జత పరుస్తున్నాను చూడగలరు.

అరుణా చలంలో ని అధికారులకు చలం గారి గురించి ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం మరణించినప్పుడు కట్టబడింది అని చెప్తున్న సమాధి వంటి కట్టడం గురించి ఏమి తెలుస్తుంది. గవర్నర్ గారు చెప్పారని, తూ తూ మంత్రంగా ఏదో ఒక గుమాస్తా పద్ధతిలో "ఆఫీసు పనిగా" మాత్రమె చేసేసి, ఆ ఫైలు ఎంత త్వరగా మూసేద్దామా అన్న అత్రుతలోనే ఉంటారని  నా భావన. మీరు ఒక విషయం మొదలుపెట్టి చివర వరకూ సత్య శోధన  చెయ్యగలరు. అందుకని, మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల చేత  అసలు విషయాన్ని పరిశోధింపచేసి  చేసి  నిజాలను బయటకు తీసి ప్రచురించి నలుగురికీ తెలియచేయ గలరని ఆశిస్తున్నాను.

మీ దగ్గర నుంచి ఒక జవాబు వస్తే ఎంతైనా సంతోషం.

ఉంటాను.
శివరామప్రసాదు కప్పగంతు
****************************************************************
ఈ హడావిడి అంతా సద్దుమణిగి, అరుణాచలంలో చలంగారి ఒక స్మ్రుతి చిహ్నం ఒకటి, అందులో చలగారి రచనలు, ఆయన ఫోటోలు, ఆయన జీవితానికి సంబంధించిన విశేషాలు, పుస్తకాలు, వగైరాలతో ఏర్పడితే ఎంతైనా బాగుంటుంది అని చలం అభిమానులు  అనికోవటంలో విపరీతం ఏమీ లేదని నా అభిప్రాయం.  
****************************************************************

2 కామెంట్‌లు:

  1. బాగా వ్రాసారు. ఆయన బతికున్నప్పుడు ఆయనకి, ఆయన రచనలకీ గౌర్వమివ్వనివారు సమాధులకు, బూడిదలకూనా గౌరవం? అసలు వీళ్లలో ఎవరైనా చలం కథలు చదివి ఉంటారా?

    రిప్లయితొలగించండి
  2. అసలు చలం సమాధి తమిళనాడులో ఉంది అంటేనే తెలుస్తున్నాది కదా మన ఆంధ్రులం ఆయనకి ఎంత గౌరవమిచ్చామో! అప్పుడే పట్టించుకోనివారు ఇప్పుడు ఎందుకు ఈ గొడవంతా? ఈ గొడవ ఆపి ఆయన పుస్తకాలు నాలుగు కొని చదివితే చలం ఎక్కువ సంతోషిస్తారు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.