ఇన్నాళ్ళూ మనదేశంలోనే జాతీయ గీతాన్ని గౌరవించటం అంటే ఏమిటో తెలియదని మధన పడుతూ ఉండే వాణ్ని. నా చిన్నప్పుడు మా మేనమామ తో కలిసి ఆంగ్ల సినిమాలకు ఎక్కువగా వెళుతూ ఉండేవాణ్ని. సినిమా ఆఖరు అయినాక, వెంటనే జాతీయ గీతం, జాతీయ జెండా ఎగురుతూ కనిపిస్తున్న దృశ్యానికి నేపధ్యంగా పాడుతూ చూపించే వాళ్ళు. మా మామయ్యఎటేన్షన్ లో నిలబడి సాల్యూట్ చేస్తూ జాతీయ గీతం అయ్యేవరకూ ఉండే వాడు, నేనూ అదే నేర్చుకున్నాను. మిగిలిన ప్రేక్షకుల్లో చాలా భాగం (1960 ల చివరి సంవత్సరాల్లో 1970 ల మొదట్లో) ఆయన అడ్డంగా ఉన్నందుకు విసుక్కుంటూ ఆ పక్క నుంచి ఈ పక్కనుంచీ వెళ్ళిపొయ్యేవాళ్ళు . జాతీయ గీతం పూర్తయ్యేప్పటికి, హాలు మొత్తం నలుగురైదుగురు మాత్రమె ఉండేవాళ్ళు. మా మామయ్య గొర్రెల్లా ఎలా వెళ్లిపోతున్నారో చూడు అని ఈసడించుకునే వాడు.
ఇలా ప్రజలు ఆదరణ చూపకపోగా, ఆదరణ చూపిస్తున్న వాళ్ళను విసుక్కోవటం చూసి, ప్రభుత్వం వేరే దారి లేక, సినిమా హాళ్ళల్లో జాతీయ గీతం చూపటం తప్పనిసరి కాదని ప్రకటించవలసి వచ్చింది. ఇది చూసి సినిమా హాలు వాళ్ళు "హమ్మయ్య, కరెంటు ఖర్చు తప్పింది" అని వెనువెంటనే మానేశారు. ప్రభుత్వం సినిమా హాళ్ళల్లో ప్రమాద నివారణ గురించి ఆదేశాలు ఇస్తే ఇలా వెంటనే అమలుపరుస్తారా వీళ్ళు!!
అదే విధంగా ప్రతిరోజూ ఆకాశవాణి ప్రసారాలు రాత్రి పది-పదిన్నర తరువాత ముగించటానికి ముందు జాతీయ గీతాన్ని ప్రసారం చేసేవాళ్ళు. పైన చెప్పిన సమయానికే, ప్రభుత్వం ఇలా జాతీయ గీతాన్ని రోజూ రాత్రి ప్రసార ముగింపు సమయాల్లో చూపటం మానుకున్నారు. అలా మానుకోవటానికి కారణం ఒక శ్రోత ఉత్తరం ద్వారా అడిగితె ఆకాశవాణి విజయవాడ వారు అప్పట్లో ఇచ్చిన సమాధానం, "ఈ జాతీయ గీతం రేడియోలో వస్తుండగా ప్రజలు ఎటువంటి స్థితిలో ఉండి వింటున్నారో, వాళ్ళు జాతీయ గీతాన్ని గౌరవిస్తున్నారో లేదో తెలియని స్థితి. అందుకని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మానుకున్నాం" అని.
ఇదంతా ఇలా జరగటం మన దేశం లోనే అనుకున్నా. కాని డాడ్స్ ఆర్మీ అనే బ్రిటిష్ టి వి ధారావాహిక ఈ మధ్యనే చూడటం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుండగా, బ్రిటన్ లో యుద్ధంలో పాల్గొనలేని (వయసు మళ్ళిన వారు, శారీరిక లోపం కారణంగా) వారు హోమ్ ఆర్మీ గా ఏర్పడి అంతర్గత బధ్రత విషయంలో ఎంతో సాయం చెశారు. ఈ సంఘటనల మీద పారడీ గా తీసిన టి వి సీరియల్ అది. 1968 నుండి 1970 ల వరకూ అనుకుంటాను ప్రసారం అయ్యింది. ఆ సీరియల్ లో ఒక చోట ఒక దృశ్యం ఉన్నది.
ఈ హోమ్ ఆర్మీ వాళ్ళందరూ ఒక సినిమా చూడటానికి మిగిలిన ప్రేక్షకులతో కలిసి వెళతారు. సినిమా చివరివరకూ ఆసక్తిగా, పూర్తి ఏకాగ్రతతో చూసిన వీళ్ళు, సినిమా అయిపోయి వాళ్ళ జాతీయ గీతం మొదలవ్వంగానే వెంటనే ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ తొక్కుకుంటూ, జాతీయ గీతానికి గౌరవంగా సెల్యూట్ చేద్దామని ప్రయత్నిస్తున్న అధికారిని కూడా తోసేసి ఆయన మీదుగా నడిచి వెళ్ళిపోతారు. చివరికి ఆ అధికారి ఒక్కడే (హాలు మొత్తంలో)నిలబడి జాతీయ గీతానికి ఎటెన్షన్ లో నిలబడి కనపడతాడు.
ఈ వీడియోని చూడండి:
1970 లలో బి బి సి వారు ఇటువంటి దృశ్యాన్ని తమ ధారావాహికలో చూపించాల్సిన అవసరం పడింది అంటే, అక్కడ కూడా ప్రమాణాలు ఎంతగా దిగాజారిపోయినాయో అర్ధం అవుతున్నది.
మన దేశంలో ఇప్పుడిప్పుడే మళ్ళి జాతీయ గీతాన్ని కొన్ని సినిమా హాళ్లల్లో ప్రదర్శిస్తున్నారు కాని, సినిమా అయిపోయినాక చూపే ధైర్యం చెయ్యటం లేదు. పైగా సినిమా మొదలవ్వటానికి ముందు, "జాతీయ గీతం చూపబోతున్నాం, దయచేసి లేచి నిలబడండి" అని స్లైడ్ వేసి అభ్యర్ధించి అప్పుడు చూపిస్తున్నారు. ఇలా వేసినా సరే ఒక పక్క జాతీయ గీత ఆలాపన జరుగుతున్నా కూడా సెల్ ఫోన్లో వీళ్ళు చేసే బఠాణీ వ్యాపారం గురించో, లేకపోతె వాళ్ళ గుమాస్తా ఉద్యాగంలో వ్యవహారమో "ఘాట్టిగా" సెల్ లో మాట్లాడే మూర్ఖులు కనపబడుతూనే ఉన్నారు.
ఎప్పటికి నేర్చుకుంటాం మన జాతీయ గీతాన్ని గౌరవించుకోవటం!!
మునుపు ఇదే విషయం మీద వ్రాసిన వ్యాసాలు
గతేడాది బొంబాయిలో సినిమాకెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతం వేస్తున్నాం, నుంచోమని ఒక స్లైడు. తర్వాత జాతీయగీతం. అందరూ నిలబడ్డారు. నేను షాకయ్యాను. తర్వాత మరికొన్నిసార్లు సినిమాకెళ్ళినా, ప్రతిసారీ సినిమా ముందు జాతీయగీతం అంటే షాకింగ్ గానే ఉంటోంది నాకు. హైదరాబాదులో ఈ గోల మొదలైనట్టు లేదు.
రిప్లయితొలగించండినాకు దేశభక్తి లేదనడం సరికాదు. నేనొచ్చింది సినిమాకి, ఏదో గవర్నమెంటు ఫంక్షన్ కి కాదు. పానకంలో పుడకలాగ సినిమా ముందు జాతీయగీతం ఎందుకు? వెర్రి కాకపోతే? ఏం జనాలకి దేశభక్తి తగ్గిపోయిందా? వాళ్ళు చూసే ప్రతి చెత్త సినిమా ముందూ జాతీయగీతాన్ని చెవిలో పొయ్యాలా బలవంతంగా? పోస్తే జనాల్లో దేశభక్తి ఇనుమడిస్తుందా? దేశభక్తితో కన్నీళ్ళు కార్చి కానీ సినిమా చూడకూడదా? ఎంత బూతు సినిమా అయినా సరే??
జాతీయగీతాన్ని గౌరవించాల్సిందే. కానీ దాన్ని చూడాల్సిందీ, వినాల్సిందీ సినిమా హాల్లో కాదు. ప్రతి దానికీ ఓ సమయమూ, సందర్భమూ ఉంటుందని గ్రహించలేనివాళ్ళు మొదలుపెట్టిన సాంప్రదాయం ఇది.
చూడండి, ఒక సినిమాకి వెళ్ళినప్పుడు వాడు వేసే వెర్రిమొర్రి యాడ్ లన్ని కిక్కురుమనకుండా చూసి, గొర్రెల్లాగ వెళ్ళి ఆ వస్తువులు కొనే వాళ్ళు, జాతీయ గీతం ఒక మూడు నిమిషాలు వేస్తే లేచి నుంచుని గౌరవించటానికి నెప్పిగా ఉన్నదా. అలా గౌరవించమని ఎవరన్నా చెప్పాలా? స్లైద్ వేసి అభ్యర్ధించాలా?? చిత్రమైన ఆలోచనలు
తొలగించండిఇంకొన్నాళ్ళుపోతే అసలు మనకు జాతీయ గీతం, జాతీయ జెండా ఎందుకు అని తీసెయ్యాలని గోల చేసేవాళ్ళూ వస్తారని నా భయం.
సమయం! సందర్భం!! అవన్ని ఉండే సినిమా హాలు వాడు వేసే రకరకాల యాడ్లు (స్లైడ్లు, చెత్త షార్ట్ ఫిలంస్) సినిమాకి వెళ్ళినవాళ్ళందరూ చూసి తరిస్తున్నారా. జాతీయ గీతానికి సమయం సందర్భం కావాలా! అమ్మా నాన్నా ఎప్పుడు కనపడ్డా లేచి నుంచుంటాం కాని, వేళ కాని వేళ వచ్చారు అని విసుక్కుని, చూడనట్టు నటిస్తామా? లేకపోతే ఎవరన్నా చెబితే కాని వాళ్ళను గౌరవించమా!
తొలగించండిబాగుందండి . మంచి విషయాలపై రాస్తున్నారు. నా చిన్నప్పుడు సినిమా చివరలో జాతీయ గీతం చూపించినట్టు గుర్తు . బ్లాగ్స్ లో సీరియస్ విషయాలపై రాసే వారు తక్కువ
రిప్లయితొలగించండిధన్యవాదాలు
తొలగించండిజాతీయగీతం ను గౌరవించడం వెర్రి ఎలా అవుతుంది. అదో మంచి అలవాటు అవుతుంది తప్ప. మంచి అలవాట్లు అలవరచుకోలేని నిర్లక్ష్యం సమాజానికి చాలా ప్రమాదం. అలవాట్లే మన ప్రవర్తనను మెరుగుపరచినా , దిగజార్చినా . వీటి ద్వారా మన సంస్కృతిని భావి తరాల వారికి అందించవచ్చు.
రిప్లయితొలగించండిబాగా చెప్పారు కొండలరావుగారూ. ధన్యవాదాలు
తొలగించండి