22, జనవరి 2012, ఆదివారం

సంపాదకులే కరువా మనకు?

నేటి మీడియా గురించి చెప్పుకోవటం గొంగళీలో తింటూ వెంట్రుకలు ఏరుకోవటం వంటిది అని ఎంత తెలిసినా ఆగలేక వ్రాయటమే. స్పందన ఉంటుంది అని అనుకోవటం దురాశ మాత్రమె కదా!  పేపరు నిండా ప్రకటనలు నింపేసి, మధ్యలో మిగిలిన చోటు నింపటానికి ఏదో వార్తల్లాంటివి వ్రాసే విధంగా మారిపోయ్యాయి ఈ నాటి వార్తా(?) పత్రికలు. ఆపైన వార్తలు అంటూ ఏదో ఒక పార్టీ కొమ్ము కాయటం పత్రికా స్వాతంత్ర్యం లో ఒక భాగం అయిపోయింది. బాకా/చెంచా పత్రికల్లో పనిచేసేవాళ్ళు కూడా జర్నలిస్టులుగా చలామణీ అయిపోతున్నారు!! 

ఒక మూడు-నాలుగు  దశాబ్దాల క్రితం,  పత్రికలో అచ్చు అయ్యింది అంటే ఎంతో గౌరవం, అది తప్పకుండా నిజం అని నమ్మేవాళ్ళు(ప్రింట్ లో వచ్చింది కాబట్టి). ఇప్పుడు? దానికి వ్యతిరేకం. పత్రికల్లో పడినా సరే,  ఆ వార్త ఎంతవరకూ నిజం అని చదువరులు పెద్దగా లెక్క చెయ్యటం లేదు. కారణం, మీడియా గా పిలవబడుతున్న ఈ నాటి కరపత్రాలు, శాటిలైట్ టైం కొనుక్కున్న వ్యక్తులు/సంస్థలు వేస్తున్న వెర్రి మొర్రి వేషాలు. మీడియా అంటే విశ్వసనీయత పోయింది. అలాంటి విశ్వసనీయత ఉంటుంది అన్న విషయం కూడా మీడియాలో మెజారిటీకి తెలియదు, తెలిసినా పట్టించుకోకపోవటం సౌకర్యంగా ఉంటుంది కాబట్టి తెలియనట్టుగా నటిస్తూ ఉంటారు.

ఒకప్పుడు పత్రికల్లో ఒక సంపాదకుడు ఉండి మొత్తం సరిచూసుకునేవాడు. ఆ వ్యక్తికి సహకరిస్తూ అనేకమంది ఉప-సంపాదకులు ఉండి పత్రికలో తప్పులు పడకుండా చూసుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ వ్యవస్థ పత్రికల్లో ఉన్నట్టుగా లేదు. ఏదో పేరుకి ఒక సంపాదకుడు (సామాన్యంగా ఆ పత్రిక యజమాని) ఉప సంపాదకులుగా గుమాస్తాల్లాగా పనిచేసే కొంతమంది తప్ప సంపాదక వర్గం అంటూ పెద్దగా ఉన్నట్టు లేదు. ఉన్నా కూడా, వాళ్ళు వ్యాపార ప్రకటనలు జాగ్రత్తగా పేపరు మొత్తం లేదా చానెల్ నిండా సద్దటమే తప్ప వేరే పని  ఉంటుంది  అని తెలిసిన వాళ్ళుగా కనపడటం లేదు.

దీనికి ఉదాహరణగా నాలాంటి సామాన్యుడి కంట పడిన అనేకానేక తప్పులు. వాటిల్లో కొన్ని ఈ కింది విధంగా ఇదే బ్లాగులో వ్రాయటం జరిగింది.
  1. ఆంధ్ర  ప్రభ లో జమునా రాణి తప్పు ఫోటో 
  2. ఆంధ్ర జ్యోతిలో చలం సమాధి మీద తెలిసీ తెలియని కథనాలు
  3. ఈనాడులో తేదీల గందరగోళం    
పై తప్పులన్నీ కూడా ఆయా పత్రికల దృష్టికి వారు ఇచ్చిన మెయిలు చిరునామా ద్వారా పంపటం జరిగింది. చిత్రం ఏమంటే, ఆంధ్ర ప్రభ వారికి పంపిన మెయిలు తిరిగొచ్చింది. వారు ఇచ్చిన మెయిలు చిరునామా పనిచేస్తున్నదో లేదో చూసుకునే యోగ్యత కూడా వారికి లేనట్టుంది.  వారి ఆన్-లైన్ ఎడిషన్లో వ్యాఖ్య వ్రాసినా సరే అక్కడ ఉన్న తప్పు సరిచేయ్యలేదు! ఇక ఆంధ్ర జ్యోతి వారికి మెయిలు ఇస్తూ తమిళనాడు గవర్నరుకు కూడా అదే విషయం మీద లేఖ వ్రాశాను(మెయిల్ ద్వారా). గవర్నర్ నుంచైనా నాకు జవాబు వచ్చింది కాని, ఆంధ్ర జ్యోతి వారు చివరకు మీ మెయిలు అందినది అని చెప్పే మర్యాద ఇంతవరకూ పాటించలేదు. అది మీడియా విశ్వసనీయత!

ఈరోజు "ఈనాడు" పేపరు చూస్తుంటే ఈ రెండు బొమ్మలు-ఒకటి మెయిన్ ఎడిషన్ లో మరొకటి ప్రాంతీయ వార్తలు వేసే ప్రత్యెక విభాగంలో, రెండు వేరు వేరు వార్తలకు (ఒకటి జార్ఖండ్ లో జరిగిన మందు పాతర పేలుడుకు  సంబంధించి ,   మానవ హక్కుల వాళ్ళు ఎప్పటికీ ఖండించని సంఘటన గురించిన వార్త అయితే,  మరొకటి మంగుళూరులో నూనె శుద్ధి కర్మాగారంలో జరిగిన ప్రమాదానికి సంబంధించినది). చూడండి రెండు ఫోటోలు:

మొదటి బొమ్మలో "మాటు వేసి వేటు" వార్తకు కుడిపక్కన ఉన్న బొమ్మ, రెండో బొమ్మలో "విషాదం" అన్న హెడ్డింగ్ తో వేసిన వార్తలో ఉన్న పై బొమ్మ ఒక్కటే. కాకపొతే మొదటి బొమ్మ కొద్దిగా క్రాప్ చెయ్యబడింది. నిజానికి ఆ బొమ్మలో ఉన్న వ్యక్తి ఎవరు? వార్తలో పేర్కొన్న సంఘటన/లకు ఆయనకు ఏమన్నా సంబంధం ఉన్నదా?, ఆయనకు ఏమయ్యింది, ఎక్కడ జరిగింది ఆ సంఘటన వంటి వివరాలు మనలాంటి చదువరులకు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నా కూడా మీడియా తనంతట తాను (తమకు తెలియకుండా అనుకుందామా!) అమలు పరుస్తున్న సెన్సార్షిప్ వల్ల మనకు తెలియనివ్వటం లేదు. చదువరులకు విషయం చెప్పే దిక్కే లేదు.  

పత్రిక ప్రచురణ జరగటానికి ముందు ఎంత కంప్యూటర్ లో అయినా సరే "కూర్పు" అనేది జరిగాలి కదా. అలా జరిగి ఆ వార్తను "ప్రింట్" కి ఇచ్చే ముందు ఎవరన్న ఒకరు చూసి అన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా అన్న కోణం నుండి చూసి గాని అనుమతి ఇవ్వకూడదు కదా? ఏమయ్యింది ఈ రోజున ఈ పేపర్లకు. 

ఆన్ లైన్ లో పేపర్ల ప్రచురణ కారణమా ఈ తప్పులకి? తెలిసీ తెలియని కుర్రాళ్ళని (వాళ్లకు ఉందనుకుంటున్న  సాంకేతిక పరిజ్ఞానం మాత్రమె కొలతలోకి తీసుకుని) కూచోబెట్టి, వాళ్లకు జమునకు,  జమునా రాణికి తేడా తెలియక పోయినా, ప్రమాదానికి సంబంధించిన  వార్తకు  ఏవో  దెబ్బలు తలిగిన వాళ్ళవి రెండు బొమ్మలు (ఆ సంఘటనవి కాకపోయినా సరే) ఎక్కడనుంచో లాగి వేసేసి ఆ రోజుకి, అమ్మయ్య, "ప్రకటనల మధ్య ఖాళీలు పూరించాం" అనుకోవటమే పత్రికా ప్రచురణ సామర్ధ్యంగా తయారయ్యినట్టున్నది. మీడియాకు ఎంతటి దుర్గతి!

మీడియా మొత్తానికి ఒక అంబుడ్స్ మాన్ వ్యవస్థ ఉండి నిన్నటి పొరబాట్లను, వార్తల్లో ఉండే అబద్ధాలను,  ఆ వ్యవస్థ సరిచూస్తూ సంబంధిత పత్రిక/చానెల్ కు తెలియచేస్తూ ఉంటే  మీడియా వేసే ఇలాంటి వెర్రి మొర్రి  వేషాలు తగ్గే  అవకాశం  ఉన్నది. కానీ ఎవరు చేస్తారు ఈ పని? అన్నా హజారే అని ఎలుగెత్తి అరిచే ఈ మీడియా తమలో ఉన్న అవినీతిని, అసమర్ధతను (కొన్ని సార్లు అసమర్ధత,  అవినీతికన్నా ఎంతో ప్రమాదకరమైనది) పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుందా?  కనీసం చేసే ప్రయత్నమన్నా చేస్తుందా? పోనీ అలాంటి ప్రయత్నం చెయ్యాలన్న విషయమన్నా తెలుసా! అదీ అనుమానమే.  









33 కామెంట్‌లు:

  1. పత్రికాపఠనం గురించి ఒకప్పుడు "అదో మంచి అలవాటు" అనిచెప్పేవారు. ప్రస్తుతానికి సరిగ్గా దానికి వ్యతిరేకమంగా ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉంది. నిజంగా వార్తలు తెలుసుకోవాలనుకునేవాళ్ళు రెండుమూడు పత్రికలు కొని వార్తలు పోల్చిచూసుకోవడం ద్వారా ఆపని చేస్తున్నారు. మిగతావాళ్ళు సినిమాలకోసమో, క్రికెట్టుకోసమో లేదంటే తమ అభిమాన రాజకీయపక్షాన్ని (అంటే కులాన్ని అని అర్ధంచేసుకోవాలి) సమర్ధిస్తూరాసే వార్తలకోసమో చదువుతున్నారని నా అభిప్రాయం.

    అన్నట్టూ ఇవ్వాళ నేను ఒక వార్తాపత్రిక కొన్నాను. ఇంగిలీషుది. ఇంకా బ్యాగులోనుంచి బయటకి తీయలేదు. కొన్నది చదవడానిక్కాదండోయ్. వంటగదిలోనూ, అలమారాల్లోనూ పరుచుకోడానికి. తెలుగువైతే అందుక్కూడా పనికిరావని నా అభిప్రాయం (పేజీలు తక్కువకదా).

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా స్కూళ్ళల్లో వికీపీడియా చదవకూడదన్న నిబంధన . కారణం అక్కడి సమాచారం మీద అంతగా భరోసా లేదని. కొన్నాళ్ళకి పిల్లల్ని వార్తా పత్రికలు చదువకూడదన్ని నిబంధన పెట్టాలేమో.

      తొలగించండి
  2. "విశాలాంధ్ర" పత్రిక వీటన్నింటికంటే ఘోరం అండీ. తాజా వార్తలు అనేసి పోయిన సంవత్సరం వార్తలు కూడా పెట్టేస్తూ ఉంటారు వాళ్ళ ఆన్లైన్ వెబ్సైటులో. దానికి తోడు టైపోలు, తప్పులు గట్రా సరేసరి. ఎన్నిసార్లు వ్యాఖ్యలు రాసిన పట్టించుకోరు. దానితో నేను చూడ్డం మానేశా ఇక ఆ సైటుని.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విశాలాంధ్ర? అలాంటి పత్రిక ఇంకా ఉన్నదా. ఆశ్చర్యం ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ కాలంలో, అనేక సార్లు తగలబెట్టబడిన పత్రిక అది. అప్పుడే ఆరిపోయి మూసేశారని అనుకుంటున్నా.

      తొలగించండి
  3. ఇలాంటివి వందల కొద్దీ క్లిప్పింగ్స్ ఇలా ఇంటర్నెట్ లేని రోజుల్లో కూడా పత్రికలకు పంపించి, ఎలక్ట్రానిక్ ఛానెళ్ళలో దొర్లే అపభ్రంశాలను ఎత్తి చూపుతూ మెయిల్స్ పంపీ..విసిగిపోయి ఉన్నాను. ఇదివరలో నాకు ఒక అభిప్రాయం ఉండేది. తప్పుల్ని ఎత్తి చూపిస్తే వాళ్ళు దిద్దుకున్నా దిద్దుకోకపోయినా మన ఉత్తరాల వల్ల "ఇదీ" అంటూ ఒక అభిప్రాయం ఉందని వాళ్ళకు తెలుస్తుందనీ, వెంటనే కాకపోయినా నెమ్మదిగా ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటారనీ! అర్థం అవుతున్న విషయం ఏమిటంటే మన అభిప్రాయాలకు వాళ్ళు పూచిక పుల్ల కూడా విలువ ఇవ్వరనీ, పట్టించుకోరనీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ వందల కొద్దీ క్లిప్పింగులు ఒక్క సారి మీ బ్లాగులో ప్రజల సౌకర్యార్ధం ఒక్కచోటే పచురించి పడెయ్యండి.

      పైన చెప్పినట్టుగా మిడి మిడి జ్ఞానంతో ఉన్న మిడి మిడి మీడియా మరి ఏమి చేస్తాం. వాళ్ళకున్న బుధ్ధి తప్ప మరేమీ లేదనుకునే సజ్జు

      తొలగించండి
  4. ఈ తప్పుల సంగతి సరేనండీ; ఈ తప్పుల పత్రికలు ప్రజల మనోభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయా!!!..... ఎంతవరకూ రాజకీయ నాయకుల రాజకీయ బిజినెస్ లేదా సినిమా వాళ్ళ అక్కరలేని వ్యక్తిగత విషయాలూ, ఆటలంటే క్రికెట్టూ........వీటితోనే సరిపోతున్నది. ఇలా డబ్బులొచ్చే వ్యవహారాలేతప్ప దేశంలో సామాన్యుడు ఎదుర్కొనే అనేక సమస్యల పట్ల ఏ మాత్రం గౌరవం చూపించటం లేదు. ఒక రకంగా ఇవి రాజరిక మీడియాయే గానీ ప్రజా వాణి కానేకాదు.

    ఉదాహరణకి కేజీ 5/- నుండీ 12/- రూపాయలుండే కూరగాయలు[విజయవాడలో] ఉన్నట్లుంది 15/- నుండి 35/- రూపాయలకి పెరిగితే టీవీలలో గానీ, పత్రికలలో గానీ దీని గురించి ఉసే లేదు. కానీ మొన్నటికి మొన్న కనీసం 10 సంవత్సరాల తరవాత పెరగబోతున్న కరెంటు చార్జీల గురించి మాత్రం ఈనాడులాంటి పత్రికలు హేడ్‌లైన్స్ పెట్టి మరీ గొడవ చేశాయి....ఇది ప్రజల కోసమని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఏ వార్తైనా రాజకీయ కోణంతో మాత్రమే చూడటం అలవాటు చేసుకొన్నాయి మన మీడియాలు. వారి స్వంత అవసరాలుంటే ఎంతటి చిన్న విషయమైనా పెద్దది చేసి నానా యాగి చేస్తున్నాయి. ఇవ్వాళ మీడియా నడపటం అంటే ఒక పొల్యూషనొచ్చే ఇండస్ట్రీ లాంటిదే తప్ప ప్రజల బాధల కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజల కోరికల కోసం పని చేసేది కాదు.

    రిప్లయితొలగించండి
  5. "....ఇవ్వాళ మీడియా .... అంటే ఒక పొల్యూషనొచ్చే ఇండస్ట్రీ లాంటిదే తప్ప ప్రజల బాధల కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజల కోరికల కోసం పని చేసేది కాదు.
    Well Said Radhakrishna. Media is nothing but a business today and not the 4th Estate which they call themselves. They have no business to talk about press freedom when they are not "press". Because of this adulterated media, Governments across the world are thinking darkly about press censorship, which will throttle the real Media if any left anywhere.

    రిప్లయితొలగించండి
  6. ప్రసాదుగారూ... to err is human. సబెడిటర్లూ మానవమాత్రులే. ఆబ్లిగేషన్లూ, యాడ్ ప్రిఫరెన్సులూ మేనేజ్మెంట్ పాలసీలు.. సవాలక్ష ఏడుపుల మధ్య హడావుడిగా చేసే ఉద్యోగం జర్నలిస్టులది. కనీసం ఉపసంపాదకులది. ఫీడింగ్ ఇన్ చార్జులు వార్త మీద వార్త ఇస్తుంటే కొద్దిగా పరిజ్ఞానం ఉన్న సబెడిటర్లు నూటికి 99 తప్పులు పరిహరించి బయటకు వదుల్తారు. ఆ ఒక్క తప్పూ పట్టుకుని ఇంక మీడియా అంటేనే వేస్టు అన్నట్టు మాట్లాడటం ఎంతవరకూ సమంజసమో మీరే తేల్చుకోవాలి. మీ జీవితంలో అసలు పొరబాట్లే చేయలేదేమో ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని ఉంటాయి. దిద్దుకుంటారు. అలాగే పత్రికలు కూడా సవరణలు వేస్తుంటాయి. మీరు చెప్పిన సోకాల్డ్ పాత పత్రికల్లో కూడా సవరణలు అత్యంత సహజమైన విషయమే. కాకపోతే అప్పుడు ఇప్పుడున్నంత స్పీడు, పోటీ ఇవేవీ లేవు కాబట్టి కొద్దిగా తక్కువ తప్పులు దొర్లేవేమో. అంతే. ఇక యాజమాన్యాల పాలసీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. జమునకు= జమునారాణికి తేడా విషయం. పాపులారిటీ మన దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. జమునారాణి ఈతరం కుర్రాళ్లలో ఎంతమందికి తెలుసు? ఏ మద్రాసు నుంచో జమునారాణి ఫొటో అనే పేరుతో రిపోర్టర్ ఒక ఫొటో వేశాడనుకుందాం. ఆ వార్త, ఫొటో ఇక్కడున్న ఒక పాతికేళ్ల చాకులాంటి కుర్రాడు, బాగా రాయగల సబెడిటర్ చేతికి వస్తుంది. తెలిసి ఉండటం మంచి విషయమేగానీ.. తెలియకపోవడం ఘోరనేరం కాదు కదా. సాధ్యమైనంతవరకూ ఇలాంటి విషయాల్లో తప్పులు జరగవు.జరిగితే సవరణ వేస్తారు. దీనికే ఇదేదో అంతర్జాతీయ సమస్య అన్నట్టు ఈ నిందలెందుకు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "జమునకు= జమునారాణికి తేడా విషయం. పాపులారిటీ మన దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. జమునారాణి ఈతరం కుర్రాళ్లలో ఎంతమందికి తెలుసు?"

      మరే మాస్టారూ. గాంధీ కూడా ఈ తరం కుర్రవాళ్ళలో ఎందరికి తెలుసు? మహాత్మా గాంధీ ప్లేస్ లో రాహుల్ గాంధీ ఫోటో పెట్టినా అందులో తప్పుపట్టడానికి ఏముంది? అనకండి. అంతగా బాగోదు.

      తొలగించండి
  7. చూడండి అప్పలనాయుడుగారూ. ఈ వ్యాఖ్య వ్రాయటం కోసం ఒక ప్రొఫైల్ లాంటిది తయారుచేసుకున్నట్టున్నారు. దయచేసి ఆ ప్రొఫైల్ పూర్తి చెయ్యండి. సామాన్యంగా ఇలాంటి వివరాలు లేని ప్రొఫైల్ ఉన్న వాళ్ళు వ్రాసే వ్యాఖ్యలు నేను ప్రచురించను. "అజ్ఞాత" కు ఈ వివరాలు లేని ప్రొఫైల్ కు తేడానే లేదు.

    నిజమే పొరబాటుటు చెయ్యటం మానవ సహజం. కాని ఆ పొరబాటు ఎత్తి చూపించినప్పుడు కనీసం అవును పొరబాటు జరిగింది అని ఒప్పుకుని , ఇప్పుడు సరిచేస్తున్నాం అని సరిచేసుకునే కనీస మర్యాద ఉండాలి కదా. జమునకు జమునారాణికి తేడానే తెలియకుండా వ్యాసం వ్రాయంటం ఏమిటి, అక్కడ వ్యాసానికి తలమానికమైన ఫొటో విషయంలోనే తప్పుచేస్తే మీ సమర్ధింపు ఏమిటి. ప్రింట్ పత్రికలో లేని సౌలభ్యం, ఆన్‌లైన్‌లో లో ఉన్నది కదా. పాఠకుడు వ్యాఖ్య వ్రాసినప్పుడు చూసి సరిచేసుకోవాలన్నా ఇంగితం లేదా ఆంధ్ర ప్రభకు. ఎంతో పాత పేపరు కదా!అంత్య ప్రాసలతో కొట్టుకు చచ్చే పేపరు కాదుకదా!! జమునారాణి మీద వ్రాసిన వ్యాసం చదివారా మీరు?? చాకులాంటి కుర్రాడు వ్రాసినట్టున్నదా అది? ఎవరో విసుగ్గా ఈ కాస్తా వ్రాసి ఇంటికి పోదాం అని తూ తూ మంత్రంగా వ్రాసినట్టున్నదది. జమునారాణి గురించి తెలియని వాళ్ళు ఈ వ్యాసం చదివి తెలుసుకోగలిగేది ఏమన్నా ఉన్నదా? మీరే అంటున్నారు కదా ఇప్పటి కుర్రాళ్ళకు జమునారాణి గురించి తెలిసే అవకాశం లేదని. వ్యాసం వ్రాసినప్పుడు అలా తెలియనివాడి చేత వ్రాయిస్తే ఉపయోగం ఏమిటి. ఇదా మీడియాలో వ్యాసం వ్రాసే పధ్ధతి? అలాంటి విషయాల్లోనే కదా మనకు సంపాదకుల కరువు స్పష్టంగా కనపడుతున్నది. పైగా మీ సమర్ధింపు అటువంటి నాణ్యత అనే విషయం ఉంటుంది అని తెలియకుండా వ్రాసిన వ్యాసాలకు!

    మీ అంత కాజువల్ గా ఆలోచించబట్టే ఈ రోజున మీడియా పరిస్థితి ఇలా ఉన్నది. వార్తకు వార్తా వ్యాఖ్యకు తేడా తెలియకుండా ప్రకటనల మధ్య ఖాళీలు పూరించి అదే వార్తాపత్రిక అంటున్నారు. మీడియా అంటే విశ్వసనీయత ఈ రోజున కొరవడింది. అది మళ్ళీ తీసుకుని రాగలిగే శక్తి ఉంటే తీసుకురండి. మేము ఇంతే మేమూ మానవమాత్రులం పొరబాట్లు చేస్తూనే ఉంటాము, ఫొటోలు మా ఇష్టం వచ్చినట్టు వేస్తాం, మాకు తెలిసింది మేము వ్రాస్తాం ఇక ఆపైన మీ ఖర్మ అన్న లెవెల్లో సమర్ధింపుల వల్ల మీడియాకు ఎంతమాత్రం మేలు జరగకపోగా, ఇప్పటికే దిగజారిన పరువు ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే, అసలు లేకుండా పోతుంది. అది తెలుసుకోవాలి.

    వ్యక్తిగతంగా పొరబాటు చేయటం వేరు, ఒక వ్యవస్థగా అనేకమంది కలిసి ప్రజలు ఆసక్తిగా సమాచారం కోసం చూసే ఒక పత్రికలో పొరబాట్లు చెయ్యటం వేరు. రెండోది జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ జరిగితే వెంటనే ఆ మర్నాడో, లేక ఎవరన్నా చెప్పినప్పుడో సరిచేసుకోగల శక్తి ఉండాలి కాని, సమర్ధింపుల వల్ల, మీరెప్పుడూ పొరబాటు చెయ్యలేదా అంటూ వ్యక్తిగతంగా ఎదురుదాడి వల్ల మీడియాకే నష్టం.

    చివరలో నేను ఇచ్చిన ముగింపు చూడలేదనుకుంటా. మీడియా ఈరోజున, ఆంబుడ్స్‌మాన్ వ్యవస్థ ఏర్పాటు చేసుకునే పరిస్థితిలో ఉన్నదా?? అటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకుని, నిజాయితీగా ఆ వ్యవస్థ పరిధిలో మీడియా పని చేసుకుంటూ ఉంటే మీడియాకే మంచిది కదా. మీరు చెప్పేది ఏమిటి మాకు మా అంత జ్ఞానులం మరెక్కడున్నారు అనుకుంటే తప్ప, ఈ ఆలోచనలో తప్పేమున్నది.

    నా దృష్టిలో అవినీతి కన్నా అసమర్ధత ఎంతో ప్రమాదకరం, ఏ వ్యవస్థకైనా, సమాజానికైనా. ముందు మనలో ఉన్న అసమర్ధతలు పోగొట్టుకోగలిగితే, అవినీతి మీద పోరాడే అవకాశం ఉన్నది. లేకపోతే నీతి అవినీతి మధ్య తేడానే తెలియకుండా, మనకు తెలిసినదే నీతి లేదా అవినీతి అనుకునే ప్రమాదం ఉన్నది. మనలో ఉన్న అసమర్ధత వల్లనే (సమస్యకు మూలాలు, ఆ సమస్యకు కారణాలు చూడలేని పరిస్థితి)misplaced sympathies ఏర్పడతాయి.

    రిప్లయితొలగించండి
  8. అప్పల నాయుడు గారూ, శివ గారు చెప్పినట్టు అసమర్థత చాలా ప్రమాదకరం! గర్హనీయం! అసమర్థులమని తెలిసిన వాళ్ళు ఇలాంటి సృజనాత్మక రంగాలలోకి స్వచ్ఛందంగా రాకుండా ఉంటే వాళ్ళకూ,పత్రికలకూ కూడా మంచిది.

    ఫీడింగ్ ఇన్ ఛాజులు వందల కొద్దీ క్లిప్పింగులు ఇవ్వడం అంతర్గత సమస్య! వాటిని వంద శాతం తప్పు లేకుండా బయటికి పంపాల్సిన బాధ్యత సబెడిటర్లది.అలాగే, స్పీడు, పోటీ వంటి వాటిని సాకుగా చూపి వార్తల్లో తప్పుల్ని చూసీ చూడనట్లు వదిలేయమంటే ఎలాగ?

    ఇవాళ వార్తలు కూడా కొనుక్కునేగా చదువుతున్నాం? మూడ్రూపాయలు పడేస్తే కానీ పేపరు రాదు. నెలవారీ కేబులు చార్జీలు కట్టే టివీ వార్తలు చూస్తున్నాం. అందువల్ల వీటికి "వ్యాపార విలువ" తో పాటు "వినియోగ విలువ"కూడా ఉన్నట్లే! కొన్న వస్తువు లోపభూయిష్టంగా ఉంటే వినియోగదారుల కోర్టు దృష్టికి తీసుకెళ్ళినట్లే వార్తల్లో తప్పులుంటే కూడా అడిగే హక్కు చదువరులకు ఉండాలి ఈ లెక్కన!

    ఇదంతా పక్కన పెడితే....కమర్షియల్ వస్తువులు,సేవలు అమ్మేవారికి సామాజిక బాధ్యత ఉండదు.కానీ ప్రెస్ కి సామాజిక బాధ్యత ఉందని మీరు అంగీకరిస్తారుగా! భాషతో ముడిపడి ఉన్న వార్తా ప్రచురణలు,ప్రసారాలు భాషకు,సంస్కృతికి కూడా జవాబు దారీయే!



    సబెడిటర్ ఎవరికైనా ఏదైనా వార్త విషయంలోనైనా,ఫొటో విషయం లోనైనా సందేహం వస్తే నివృత్తి చేసుకుని మరీ వార్తను ప్రచురణార్హం చేయాలన్న స్పృహ ఉండాలా వద్దా?

    పోటీ, స్పీడు,పని ఒత్తిడి,పై వారి నిరంకుశత్వం..ఇలాంటి కారణాలన్నీ అన్వయం లేని,అచ్చు తప్పుల వార్తలకు సాకుగా చూపడం ఫోర్త్ ఎస్టేట్ కి ఏం న్యాయం చెప్పండి!

    మీ వ్యాఖ్య చూస్తే మీరు మీడియాలోనే ఉన్నారని తెలుస్తోంది. మీ విశ్లేషణ చూస్తుంటే మీరు తప్పులు చేయరని కూడా తెలుస్తోంది.. మరి తప్పుల్ని ఎందుకు సమర్థిస్తున్నారో మాత్రమే తెలియకుండా ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Well reacted Sujata garoo. Thank you.

      Point is Individually, we may commit mistakes but committing mistakes as an institution is not good. But justifying such institutional mistakes is more dangerous than the mistakes per se.

      "..ఏదైనా వార్త విషయంలోనైనా,ఫొటో విషయం లోనైనా సందేహం వస్తే..."

      Doubt should come! Now the problem is mistakes are committed with all arrogance.

      తొలగించండి
  9. Individually, we may commit mistakes but committing mistakes as an institution is not good.

    చాలా బాగుంది సర్

    రిప్లయితొలగించండి
  10. మనకు సమర్థులైన బ్యాంకు ఉద్యోగులే కరవు. అందుకే దేశంలో ఇన్ని బ్యాంకింగ్ కుంభకోణాలు జరుగుతున్నాయి. అంబుడ్స్మాన్ వ్యవస్థ ఉన్నా వేస్టే.
    ...నాది స్వీపింగ్ స్టేట్మెంట్లాగా కనిపస్తోంది కదూ. ప్రసాద్ గారూ మీదీ అంతే. స్వీపింగ్ స్టేట్మెంటే.

    mistakes are committed with all arrogance.
    ఇదీ స్వీపింగ్ స్టేట్మెంటే

    దురుసుతనం, ఎదురుదాడి, అజ్ఞానం, అసమర్థత.. అయ్యా మీరు వాడుతున్న పదాలు ఒకసారి సరిచూసుకోండి.
    వీటన్నిటి బట్టీ మీకు అసహనం ఎక్కువ.. అని నేననుకుంటే అది నా పొరబాటు. అది నేనిచ్చే స్వీపింగ్ స్టేట్మెంట్ అవుతుంది. మీరు మీ బాధను, ఆవేదనను వ్యక్తం చేసే పద్ధతి అది నాకర్థమైంది.

    పొగరున్నవాళ్లు మీడియాలో చాలా తక్కువమంది ఉంటారు.వాళ్లే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి అంతా అలానే అని మీరనుకుంటారంతే. అసమర్థులు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. మీరు పట్టుకుంటున్న తప్పులవే.

    నేను తప్పులు అంటున్నా గమనించండి. సబెడిటర్ తెలియక చేసే పొరబాటు... డెస్కు సభ్యులందరూ చదివి బయటికి పంపిన పేపర్లో ప్రచురితమైతే అది డెస్కు తప్పు అవుతుంది.

    జమున=జమునారాణి విషయం..(ఈ సమాధానం శంకర్గారిక్కూడా)ఈ విషయంలో నేను పొరపాటున కూడా ఆంధ్రప్రభను, ఆ ఆర్టికల్ రాసిన వ్యక్తిని సమర్థించట్లేదు. అది పూర్తిగా గర్హనీయం. ఈవిషయంలో నా భావాన్ని సరిగా వ్యక్తపరచలేకపోవడం నాదే తప్పు. నేనది ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పాను. జమునారాణి గురించి కాకపోయినా.. జమున గురించి అయినా తెలిసి ఉండాలి ఆ వ్యక్తికి. ఈ సందర్భంలో నా ఉద్దేశం... సాధారణంగా రాష్ట్ర స్థాయిలో ప్రముఖులు కానివారి విషయంలో ఫొటోలు మారే పొరబాటు(తప్పు కాదు.. పొరబాటు) జరిగే ప్రమాదం(అవకాశం కాదు) ఉంటుందని. ఎందుకంటే ఆ గ్రామంలో లేదా ఊళ్లో పనిచేసే కంట్రిబ్యూటర్ మాటకు విలువిచ్చి ఫొటో వేస్తాం. అది ఒక్కోసారి వేరేవారి ఫొటో కావచ్చు.అది అతను కూడా కావాలనిచేసే తప్పు కాకపోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఫొటోలకు నెంబర్, ఊరి పేరుతో గుర్తింపునిస్తారు. ఒక్కోసారి పొరబాటు జరగడానికి ఆస్కారముంది.
    ఇక తప్పుల విషయంలో సవరణలకు యాజమాన్యం పాలసీలు వర్తిస్తాయి. ఆ వ్యక్తి తమకు అంత ముఖ్యుడు, ప్రముఖుడు, ప్రమాదికారి కానప్పుడు యాజమాన్యాలు సవరణ ప్రచురించవు. ఇది నేను చాలాసార్లు గమనించాను. అది తప్పా కాదా అన్నది వేరే చర్చ. చెప్పాగా యాజమాన్యం పాలసీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

    రిప్లయితొలగించండి
  11. ఇకపోతే మీ అభ్యంతరానికి ఆంధ్రప్రభ వారి నుంచి సరైన స్పందన లేకపోవడానికి కారణం సాంకేతిక సమస్యేమో అని నా అభిప్రాయం.వాళ్లు పెట్టే వందల పేజీల్లో దాన్ని సరిచూసుకోవడానికి వీలు పడదేమో. ఇది నా ఊహాగానం మాత్రమే. ఏదేమైనా మీరు లిఖిత పూర్వక ఉత్తరం వారి చిరునామాకు పంపి చూడవచ్చు. వెంటనే నేనూ అదే పని చేస్తాను. వీలైతే ఈ బ్లాగు చదివేవారందరూ అదేపని చేయండి. అప్పటికైనా ఆంధ్రప్రభ కదులుతుందేమో చూద్దాం.

    ఇక చలం విషయం.. నేనైతే ఆ వార్త చూసి బాధపడ్డాను. మీ బ్లాగులో చలం సమాధి వేరేగా ఉన్న ఫొటో చూసి అవునా అనుకున్నాను. మరి ఆంధ్రజ్యోతివారు ఎందుకు స్పందించలేదో నాకైతే తెలీదు.మీరు రాశాకైనా వారు ఆరా తీసి ఉండాల్సింది.

    ఈనాడులో తేదీ తప్పు... పేపర్లో అవాళ్టి తేదీ తప్పురావడం నిజంగా ఘోరమైన విషయమే. కానీ.. ‘క్షమించరాని నేరం’ కాదు సార్. అందుకే అక్కడ అలా స్పందించా. తెలియక చేసేది పొరపాటు, తెలిసి చేసేది తప్పు, తెలిసి చేసినా తెలియక చేసినా ఇతరులకు హాని కలిగించేది నేరం. స్థాయీభేదాలున్నాయి. చిలకలూరిపేట బస్సుదహనం కేసులో 14 మందిని సజీవదహనం చేసినవారిని కూడా క్షమిస్తున్నాం సార్ మనం, రాజీవ్ గాంధీ హంతకులను కూడా క్షమిస్తున్నాం. ఆఫ్ట్రాల్ జర్నలిస్టులూ మనుషులే కదా. తేదీ తప్పు ఏ ఒక్క వ్యక్తికిగానీ, సమాజానికిగానీ నష్టం కలిగించలేదు కదా. అప్పుడది నేరమెలా అవుతుంది? దానికి మీరు It only shows the arrogance of media అంటూ మరొక స్వీపింగ్ స్టేట్మెంట్ దయచేశారు. నేనొక్కడినీ అడిగితే అది మీడియా యారొగెన్స్ ఎలా అవుతుంది మాస్టారూ? సంపాదకులందరినీ ఒకేగాటన కడుతున్నారన్న నా ఆవేదన అనుకోవచ్చుకదా?


    మొత్తంగా నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే.. పేపర్లో పనిచేసేవారికి సామాజిక బాధ్యత ఉంటుందన్నది కరెక్టే. తప్పులు రాకూడదన్నదీ నిజమే. కానీ.. పొరపాటు జరిగేది వ్యక్తి స్థాయిలోనే కదా. వ్యవస్థస్థాయి కొచ్చేసరికి అది తప్పు అవుతోంది. దానికి సవరణ వేయాలా వద్దా అన్నది యాజమాన్యం పాలసీ అవుతుంది. యాజమాన్యం పాలసీల్ని సంపాదకులు మార్చలేరు. కనీసం ఇప్పుడున్న పరిస్థితి అది. అయినా.. ఇటీవలి కాలంలో ఆంధ్రజ్యోతిలోనూ, ఈనాడులోనూ నేను రెండు మూడు సవరణలు చూశాను.

    రిప్లయితొలగించండి
  12. ఇక సుజాతగారు అడిగిన ప్రశ్నకు సమాధానం... తప్పుల్ని నేను సమర్థించట్లేదండీ. ప్రసాద్ గారి స్వీపింగ్ స్టేట్మెంట్లు చూస్తే బాధనిపించి రాశానంతే. ఇకపోతే.. నేను పొరబాట్లు చేయననేది ఉత్తమాట. ఇన్నేళ్ల కెరీర్లో తప్పులే రాయకుండా ఉంటామా. ఇంత పెద్ద మీడియా సంస్థ అధిపతి రామోజీరావు ఏమంటుంటారో తెలుసా... తప్పులు చేయొచ్చు, కానీ ఎప్పటికప్పుడు కొత్త తప్పులు చేయండి అని. తప్పులు తప్పవని అంత పెద్ద మీడియా బారనే అంగీకరించడం గమనార్హం.

    ఇక అంబుడ్స్ మాన్ వ్యవస్థ...
    ఈనాడులో ఉందండీ. దాని పేరు గుణ. ఆంధ్రజ్యోతిలోనూ ఉందండి.. దాని పేరు దర్పణం. ఒకరోజు పేపర్లో వచ్చే తప్పుల్ని ఉతికారేస్తారు. అలాగే మిగతా పేపర్లకు కూడా వాటివాటి స్థాయిలో ఉన్నాయండి. ఇలా తప్పులు రాసి ఏడాది కాలంలో ఇద్దరు ఉద్యోగులు (ఈనాడు, ఆంధ్రజ్యోతి)ఉద్యోగాలు పోగొట్టుకున్నారండీ. విషాదమేంటంటే.. ఇద్దరూ కావాలని చేసిన తప్పులు కాదు. ఇక్కడ సమస్యేంటంటే.. వాళ్లకిది తప్ప వేరే ఏంచేతకాదు. ఉద్యోగాలు పోతాయని తెలిసీ ఎవరూ తప్పు చేయరు కదండీ.

    సరే, ఇక నా వ్యాఖ్యలకు ఇంతటితో స్వస్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "...అందుకే దేశంలో ఇన్ని బ్యాంకింగ్ కుంభకోణాలు జరుగుతున్నాయి...". మీరు ఏదో ఎద్దేవా చెయ్యటానికి అన్నా కూడా , మీ దృష్టిలో అది స్వీపింగ్ స్టేట్మెంట్ అనుకున్నా కూడా ఎప్పుడైతే ఒక వ్యక్తి అసమర్ధత వల్ల కాని , మోసపూరిత ప్రవర్తన వల్ల కాని ఈ ఫ్రాడ్ లు అనేవి జరుగుతుంటాయి . కాని మీకు తెలియని విషయం ఏమంటే ,ఒక్కొక్క ఫ్రాడ్ కి , తప్పుకు , ప్రత్యక్షంగా ఉన్నవాడికి శిక్షపడి తీరుతుంది . అంతే కాకుండా అప్రత్యక్షంగా తెలియక ఇరుక్కున్నవాళ్ళు కూడా డిస్మిస్ అయ్యి ఇళ్ళకు వెళ్ళిపోయిన వాళ్ళు , ప్రమోషన్లు పోగొట్టున్నవాళ్ళు , పరువు పోగుట్టుకుని బతుకుతున్న వాళ్ళు ప్రతి ఫ్రాడ్ వెనుక అనేకమంది ఉన్నారు . ఆ పైన ఈ ఫ్రాడ్ ల వాళ్ళ కస్టమర్లు నష్టపోయేది లేదు. ప్రతిచోట కస్టమర్లకు ఒక్క పైసా కూడా నష్టం జరగకుండా బాంకులు జాగ్రత్త తీసుకుంటాయి. మీడియా వల్ల జరిగే నష్టాలకు బాధ్యతా వహించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా. మీడియా వల్ల నష్టం ఏమి జరుగుతోంది అని అడిగితే, ఒక పెద్ద వ్యాసం వ్రాయలి మళ్ళి దాని గురించి, ఆపైన మీరు ఒక్కొక్క పాయింటు సమర్ధించుకుంటూ వస్తారు.

      మీరు వెనకేసుకొస్తున్న మీడియాలో జరుగుతున్నా తప్పులకు పక్షపాత ధోరణులకు శిక్షలు పడ్డ ఉదంతాలు ఉన్నాయా అసలు . ఉంటే అవి ఎందుకు వార్తగా ప్రచురించరు ?

      "...దురుసుతనం, ఎదురుదాడి, అజ్ఞానం, అసమర్థత.. అయ్యా మీరు వాడుతున్న పదాలు ఒకసారి సరిచూసుకోండి...." ఈ పదాలన్నీ మాటలకు అర్ధాలు తెలిసే సరైన చోట వాడవలసిన అవసరం ఉన్నప్పుడు మాత్రమే, సరిగ్గానే వాడాను నేను. ఏదో పదం బాగున్నది కదా అని లేదా చోటు నింపటానికి వ్రాయలేదు.

      "...మీ బాధను, ఆవేదనను వ్యక్తం చేసే పద్ధతి అది నాకర్థమైంది...." అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు . మీడియా దురుసుతనం , తమను తాము వెనకేసుకు రావటం (చేతిలో పనికదా ) తప్పనిసరిగా ఉన్నది. కొన్ని కొన్ని చానెళ్ళు చూస్తుంటే ముఖ్యంగా ఆంగ్లంలో భార్యా భర్తలు నిర్వహించే ఒక చానెల్లో వాళ్ళిద్దరూ చూపించే పోగారుమోత్తనానికీ, పక్షపాత ధోరణికి అంతేలేదు . ఆ వ్యక్తీ ఒక ప్రముఖ కీర్తిశేషుడైన క్రికెటర్ కొడుకు.

      తొలగించండి
    2. "...పొగరున్నవాళ్లు మీడియాలో చాలా తక్కువమంది ఉంటారు. వాళ్లే ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుతారు...." కొంతవరకు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. అటువంటి పొగరుమోతు వాళ్ళు మైనారిటీ అయినప్పుడు, మీలాంటి మంచి వాళ్ళు ఎక్కువైనప్పుడు, అలా ఉన్న కొద్ది మంది వల్ల మీ అందరికీ చెడు పేరు వస్తున్నది అని తెలిసినప్పుడు, మీరందరూ ఏమి చేస్తున్నారు? ఆ పొగరుమోతువాళ్ళను బయటకు పంపద్దూ. మీడియాలో ఉండే మీరే వాళ్ళను అలా భరిస్తూ ఉంటే సమాజంలో ప్రజలు ధైర్యం చూపి అవినీతి అంతం చెయ్యాలి అంటే అయ్యే మాటలేనా. ఊరికే అన్నా హజారే జిందాబాద్ అని ఊరుకున్నట్టు. మీడియాలో ఉండే పోగారుబోతుగాళ్ళను బయటకు నెట్టండి. వాళ్ళ పోగారుమోత్తనమే వాళ్లకు ఆ స్థితి తెచ్చిపెట్టింది అని తెలిసేట్టుగా చెయ్యండి. అలా చెయ్యలేనప్పుడు, ఆ కొద్ది మంది వల్ల మీరందరూ ప్రజల ఈసడింపులు భరించక తప్పదు మరి.

      మొత్తం మీద మీరు ఒక్క పాయింట్ మిస్ అవుతున్నారు. నేను వ్రాసినది ఒక వ్యవస్థగా ఉన్న మీడియా మీద కాని, ఏదో జీతానికి నాలుగు మాటలు వ్రాసి వచ్చేవారి గురించి కాదు. ఒకవేళ నెను వాడిన సంపాదకులు అన్న పదం మీరు అలా అనుకునేట్టుగా చేసిందేమో. ఆ పదం కూడ ఒక వ్యవస్థలో భాగమే కాని, ఆ పనిచేస్తున్నవ్యక్తిని కాదు అనేది. ఒక మనిషిని సంపాదకుడిగా లేదా ఉపసంపాదకుడిగా పేరుపెట్టి, ఆ మనిషిని అతను చెయ్యవలిసిన పని చెయ్యనివ్వకుండా వత్తిడి లేదా మితిమీరిన పని ఇస్తుంటే తప్పు "మీడియా" అనే వ్య్వస్థది అని మీకు నేను చెప్పవలసిరావటం.......

      మీడియా గా నిర్వహించబడుతున్న పేపర్లు, చానెళ్ళు ఒక పద్ధతి ప్రకారం నడపబడాలి, అందులోనూ తప్పులే మేము మాత్రం మానవమాత్రుల కాదా అంటే అందులోనూ అతి చిన్న విషయాల్లో!! ఇక ఎవరిని నమ్మాలి. నా చిన్నతనంలో ఒక విషయం ప్రింట్ లో కనపడితే అది తప్పనిసరిగా నిజం అని నమ్మేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలా లేక పోవటానికి కారణాలు అన్వేషించాలి, నివారణ చర్యలు తీసుకోవాలి. చేసిన తప్పులు సమర్ధించుకుంటూ పొతే ఉపయోగం ఏమీ లేదు. తరువాత ఇంటర్నల్ గా ఉన్న అంబుడ్స్ మాన్ వ్యవస్థలు ఉన్నా సరే ఇలాంటి తప్పులు జరగటం, ఆ తప్పులను ఎత్తి చూపినా సరిచేసుకోక పోవటం(కనీసం వీలైన చోట) శోచనీయం కాదంటారా!

      ఇక చలంగారి విషయం నేను తమిళనాడు గవర్నర్ గారివరకూ విషయం తీసుకెళ్ళాను. ఆయన దగ్గరనుండి జవాబైతే వచ్చింది కాని ఫలితం శూన్యం. ఒక వార్తను ప్రచురించటమే కాని ఆ వార్తను చివరంటా ఏమి జరుగుతూఉన్నదో చూస్తూ విశ్లేషించి వ్రాయటం మీడియాకి లేని అలవాటుకదా. మళ్ళీ అది ఏమన్నా సెన్సేషన్ కి అవకాశం ఉన్నదా, అంత్య ప్రాస శీర్షిక పెట్టచ్చా అన్నవే కదా మీడియాకి ముఖ్యం. ప్రజలకు వార్తలు అందించటం ప్రాధాన్యత లేని విషయం కదా. ఏ వార్త వ్రాస్తే మనకు ప్రకటనలు వస్తాయి, అన్న ధ్యాసే ఎక్కువగా ఉన్నది ఈనాడు.

      మీరన్నట్టుగా ఈ చర్చ అంతం లేనిది. ఇలా చర్చించుకుంతూ పోతే ఎన్నాళ్ళకూ తెగదు. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇంకెవరన్నా మోసం చేస్తున్నా, సవ్యంగా ప్రవర్తించకపోయినా, మీడియా వాళ్ళకు మొరబెట్టుకుని, ఆ అన్యాయాలు బయటపెట్టవచ్చు. మీడియా వాళ్ళే పక్షపాత ధోరణి చూపిస్తూ, అక్కడ పనిచేసే వాళ్ళ వాళ్ళ "ఇజాలకు" సరిపొయ్యేట్టుగా వార్తలను వంచి వంకర చేసి వ్రాస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి. ఇప్పుడంటే బ్లాగులు వచ్చినాయి కాబట్టి, వ్రాయగలిగిన వాళ్ళు వ్రాసుకుంటున్నారు. లేకపోతే ఈ విషయాలు, సంపాదకునికి లేఖ వ్రాస్తే ప్రచురిస్తారా, బుట్టాసురిడి ఆకలితీరుస్తారా? అనుమానం లేకుండా రెండోదే.

      తొలగించండి
  13. ఫ్రాడ్ ల వాళ్ళ కస్టమర్లు నష్టపోయేది లేదు. ప్రతిచోట కస్టమర్లకు ఒక్క పైసా కూడా నష్టం జరగకుండా బాంకులు జాగ్రత్త తీసుకుంటాయి
    ...చార్మినార్, కృషి బ్యాంకు బాధితుల్లో ఎంతమందికి పూర్తిగా డబ్బు ముట్టిందో చెప్పండి?

    రిప్లయితొలగించండి
  14. ఫ్రాడ్ ల వాళ్ళ కస్టమర్లు నష్టపోయేది లేదు. ప్రతిచోట కస్టమర్లకు ఒక్క పైసా కూడా నష్టం జరగకుండా బాంకులు జాగ్రత్త తీసుకుంటాయి.

    ...చార్మినార్, కృషి బ్యాంకు బాధితుల్లో ఎంతమందికి పూర్తి డబ్బు ముట్టిందో చెప్పండి.

    ఫ్రాడ్లు అనేవి జరుగుతుంటాయి
    ...నేను చెప్పేదీ అదే, మీడియాలో తప్పులైనా జరుగుతాయి. జరిగాకే యాక్షన్లు ఉంటాయి.
    అసలు జరక్కుండా చూడాలంటే బ్రహ్మదేవుడు దిగిరావాల్సిందే.

    మీడియాలో తప్పు వస్తే సరిచూసుకోవడానికి వంద మార్గాలున్నాయి. అది అవునో కాదో తెలుసుకోవడానికి వ్యవస్థలున్నాయి. క్షణాల్లో తేలేపని ఇది.
    మరి బ్యాంకింగ్ వ్యవస్థలో ఫ్రాడ్ల వల్ల నష్టపోయినవారి మానసిక క్లేశం మాటేమిటి? ఎప్పుడో ఏళ్లూపూళ్లూ గడిచాక వచ్చే డబ్బు కోసం ఎన్నాళ్లు చూడాలి? ఈలోగా ఎంతమంది ఆడపిల్లల పెళ్లిళ్లు ఆగిపోతాయి? ఇంకెన్ని శుభకార్యాలో ముఖ్యమైన పనులో ఆగిపోతాయి?

    పొగరున్నవాళ్లందరినీ తీసేయాలా?
    బ్యాంకుల్లో పొగరుగా సమాధానమిచ్చేవాళ్లందరినీ ముందుగా తీసేయాలంటాను కుదురుతుందా? పొగరుందని కూడా ఉద్యోగాలు తీసేస్తారా?
    మీడియాలో కూడా.. తప్పు చేస్తే,ఆ తప్పు మీ బ్యాంకింగ్ కుంభకోణాలంత పెద్దవైతే తప్పకుండా తీసేస్తారు. ఆ జీవికి ఏ అండా లేకపోతే చిన్నచిన్న తప్పులకే ఉద్యోగాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి.

    నిజానికిప్పుడు నేను స్పందించాలనుకోలేదు. కానీ, సుజాతగారన్నట్టు మన అభిప్రాయం అంటూ ఒకటుందని చెప్పడానికే మళ్లీ వ్యాఖ్య రాస్తున్నాను.

    మీడియా వల్ల నష్టం ఏమి జరుగుతోంది అని అడిగితే, ఒక పెద్ద వ్యాసం వ్రాయలి మళ్ళి దాని గురించి, ఆపైన మీరు ఒక్కొక్క పాయింటు సమర్ధించుకుంటూ వస్తారు.

    మీరు సమర్థించుకుంటూ వస్తున్నారుగనకే రాయాల్సి వస్తోంది సార్.

    ఈసారి మాత్రం నిజంగానే నా వ్యాఖ్యలకు ఇంతటితో స్వస్తి. ఒక్క విషయం మాత్రం నిజం సార్.. your cup is full.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అప్పల నాయుడు గారూ,

      ఇది ఎలా ఉందంటె, రాజకీయ నాయకులు వాళ్ళ మీద ఆరోపణలు జరగ్గానే, ప్రతి దాడికి దిగుతారు. చివరకి నిరూపిస్తే రాజకీయ సన్యాసం అంటూ బెదిరిస్తారు. మీడియాకు రాజకీయనాయకులతో సావాసం, అంతకంటే భాగస్వామ్యం ఎక్కువయ్యి వాళ్ళ అలవాట్లు వచ్చి ఎదురు దాడే పెద్ద డిఫెన్స్ అనుకుంటున్నరని మీ వ్యాఖ్యలతో అర్ధం అవుతున్నది.

      ఏ వ్యవస్థలోనైనా సరే పొగరుమోతు వాళ్ళుండి, వాళ్ళ అపరిపక్వ నడవడితో ఇతరులు చీదరించుకునేట్టుగా ప్రవర్తింస్తుంటే వాళ్ళను కట్టడి చెయ్యలేకపోతే ఆ వ్యవస్థలో అందరూ మాట పడవలసినదే-మీడియా ఐనా మరేవిధమైన పబ్లిక్ సంస్థ ఐనా సరే.

      మీరు చెప్పిన బాంకుల్లో ఫ్రాడ్ ల వల్ల నష్టపోయిన వాళ్ళ గురించి ఆ బాంకులు పట్టించుకోలేకపొయ్యాయి. ఇతర బాంకులు ఫ్రాడ్ల వల్ల కష్టమర్లకు నష్టం కలగకుండా చూసుకోగలిగినయి. ఈ బాంకులు అలా ఎందుకు చెయ్యలేకపోయినాయి? కారణాలు వెతకండి, ఘనత వహించిన మీడియా కదా! పరిశోధన చేసి వ్రాయండి. అలా పరిశోధన చెయ్యగలిగి వ్రాస్తే తెలుస్తాయి ఈ రెండు బాంకులు, వాళ్ళ కష్టమర్లకు ఎందుకు నష్టం కలగకుండా చెయ్యలేకపొయ్యాయో. అప్పుడెప్పుడో వార్తగా వాల్యూ ఉన్నప్పుడు రెండ్రోజులు ఆ వార్త వాడుకుని వదిలేసి ఇక ఊరుకుంటే ఎలా? ఆ సమస్య అంతం అయ్యేవరకూ మీడియా తన బాధ్యతగా ఎందుకు తమ తమ వ్యాసాలను రిపోర్టులను ఎందుకు కొనసాగించలేదు!!?? కారణం ఏమిటో మరి!

      మీ మీడియా గురించి విమర్శ చేసేది నా లాంటి పాఠకులే కాదు, సాక్షాత్తూ మీ ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కట్జూ గారు చేసే వ్యాఖ్యలకు ఆలోచించి స్పందించండి. మీడియా పధ్ధతులకు విసిగి ఆయన మీడియాను కట్టడిచెయ్యాలంటే స్వీయ నియంత్రణ చాలదు, బయటనుండి నియంత్రణ వ్యవస్థ ఉండాలి అని అంటున్నట్టుగా కులదిప్ నయర్ నిన్నటి ఈనాడులో వ్రాశారు. ప్రెస్స్ కౌన్సిల్ చైర్మన్ చేసిన వ్యాఖ్యలకే సెల్ఫ్ డిఫెన్సు పధ్ధతిలో మీడియా స్పందింస్తూ ఉంటె, నాలాంటి సామాన్య పాఠకులు చిన్న చిన్న విమర్శలకు మీలా స్పందిస్తున్నారు అంటె ఆశ్చర్యం లేదు.

      Finally final, whose cup is full or whose cup is empty and dry or spilling with murky and tepid liquid time only will tell. So stop worrying about my cup but take care of your own cup.

      తొలగించండి
  15. మీడియా!మిడి మిడి మీడియా ఎందుకు మారింది?ఎవరికి మీడియేటర్ గా మారుతోంది?
    వారిని విమర్సిస్తే తట్టుకోలేరా ?వారు మానవ మాత్రులు కారా ? తప్పులు జరిగితే సరిచేసుకోరా ? తప్పొప్పులను సరిచేయడమేగా అసలు మీడియా పని .
    దీనంతటికీ కారణం పెట్టుబడిదారీ సమాజమే . ప్రతిదీ సరుకుగా మారడమే ఈ సమాజ అత్యంత సహజ లక్షణం. నేడు మీడియా మంచి లాభం తెచ్చి పెట్టే సరుకు .
    సాక్షి వచ్చి సవాల్ చేసేదాకా ఈనాడు మాత్రమే దినపత్రిక.ఈనాడు లో వార్త వస్తే అది విశ్వసనీయం. దీంతో తాను ఏమి చేసినా చెల్లుతుందని రాజగురువు రామోజీ ఈనాడు లో పనిచెసే స్టాఫ్ (ఎక్కువమంది)మిడిసిపడేవారు. తాము మాత్రమే ఉత్తమ (?) జర్నలిస్టులమని ఫోజు పెట్టేవారు.భ్రమపడేవారు. రామోజీ నా పత్రిక వల్లనే మీరు గెలిచారని ఎన్‌.టీ.ఆర్ ముందు తోక ఆడించబోతే ఆ 'ఒక్క మగాడు' కాదు బ్రదర్ మా వల్లే మీ పత్రిక కు పేరొచ్చిందని నిజాన్ని తెలిపితే రామోజీ ఎన్‌.టీ.ఆర్ ను ఏం పీకాల్నొ తెలియక , ఆ తరువాత పరిణామాలలో చంద్రబాబు తో కలసి ఏమి చేసాడో లోకానికి తెలిసిందే.తరువాత తనకు తిరుగులేదని విర్రవీగుతూ రామోజీ వై.ఎస్.ఆర్ పై అదేపనిగా ఉన్నవీ లేనివీ రాసుకుంటూ పోయాడు.కొంతమేరకు వై.ఎస్ ప్రభను మసక బార్చాడు కూడా. వై.ఎస్ పై ఈనాడు లో వ్రాసినవనీ అబద్ధాలని నేను అనడం లేదు.దీనిని తట్టుకోలేక వై.ఎస్ అప్పట్లో రామోజీకి బహిరంగ లేఖ రాశారు. అయినా వాదనా పటిమ ఉన్న రామోజీ వెనక్కు తగ్గలేదు. వై.ఎస్ ఒక్క పాదయాత్రతో వీటన్నింటినీ ఎదుర్కోగలిగాడంటే అది ప్రజాబలమే.ప్రజాబలం ముందు పత్రికాబలం కూడా తక్కువే అని.
    సంపాదకుల దాకా ఎందుకు ? తెలుగు భాషలో వుండే 56 అక్షరాలు సరిగా తెలియని, మండలస్థాయిలో కంట్రిబ్యూటర్లుకు చాలామందికి పోలీసోడికంటే పొగరెక్కువ వుంటుంది. సకల మర్యాదలు చేయక పోతే సరిగా వార్తలు రాయడు. అందరి బ్రతుకులను ఏకరువు పెట్టే వీల్లు పెట్టుబడిదారుల పత్రికల్లో సెంటీమీటర్ల సైజ్ లో కాంట్రాక్ట్ లేబర్ ఊడిగం చేస్తూ వుంటారు.వారి బ్రతుకులపై ఒక్క ఐటం రాసినా తెల్లారి ఉన్న ఉద్యోగం (?) ఊడుతుందని భయం.ఇట్లాంటి వారు తప్పులు ఎత్తి చూపితే పట్టించుకుంటారా ? అహంభావపు లక్షణాలతో మీడియా అంటే శాసించేవాల్లం అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సమాచారం అందించే,మేలుకొలిపే పవిత్ర కర్తవ్యం వున్నవాల్లుగా వుండాలనే విషయాన్ని స్ట్రింగర్ స్థాయి నుండి సంపాదకుల (?) వరకూ మరచిపోయారు.
    పత్రికలలో , ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తలను జనం నమ్మడం మరచిపోయారు.
    ఈనాడు ను సాక్షి సవాల్ చేశాక రాజగురువు ఆటలకు బ్రేక్ పడింది. సాక్షి ఈనాడు కు ప్రత్యామ్నయంగా వచ్చింది తమ వార్తలను ప్రసారం చేసుకొవడానికే తప్ప ప్రజలను మేలుకొలపడానికో మేలు చేయడానికో కాదు. జగన్‌ కు సర్వేలు అందించడానికీ , మీడియా పేరుతో ప్రైవేట్ సైన్యం తయారుచేయడానికీ సాక్షి ఉపయోగపడుతుంది.
    ఇక ఆంధ్రజ్యోతి అంటే ఒక రకంగా ఈనాడుకు తోక పత్రిక . తనకు నచ్చని వారిపై మాత్రమే అదేపనిగా వార్తలు ప్రసారం చేసే పనినే రాధాకృష్ణ పనిగా పెట్టుకున్నడు. నిజాలు చెప్పినా అదేపనిగా ఒక్కడి మీదనే పోరాటం చేయడం దమ్మున్న వాడు చేసే పని కాదు.అది అసలుకే మోసం తెస్తుంది. నిజాలు రాసినా చివరికి నమ్మే పరిస్తితిని కోల్పొతుంది. ఇక కులం పేరుతో మరింత కుల ఘర్షనలకు ప్రేరేపించి పబ్బంగడుపుకోవాలని చూసే సూర్య పత్రిక, ఉద్యమ్మన్ని కేష్ చెసుకునెందుకు చూస్తున్న నమస్తే తెలంగాణా ఇలా దాదాపు పత్రికలన్నీ ఏదో ఒక లాభాన్ని ఆశించి నడిపేవే. పెట్టుబడిదారుల చేతిలో కీలు బొమ్మలుగా ఉన్న ఈ పత్రికలలో సంపాదనా ఆలోచనే తప్ప , సంపాదక ఆలోచన వుంటుందా ? ఇక వారు విమర్శలను , ఆత్మ విమర్శలను ఆహ్వానిస్తారనుకోవడం గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు రాకూడదనుకోవడం లాంటిది అవుతుంది.
    వీటి మధ్యలో వ్యక్తుల యాజమాన్యం లో గాక సంస్థల యాజమాన్యం లో పనిచేసే కమ్యూనిస్టు పత్రికలు వారి భావజాలం ప్రసారం చేసేందుకు ప్రయత్నించేందుకు నడుపుతున్నా వీరు కూడా తమకే అన్నీ తెలుసు అన్నట్లు ప్రవర్తిస్తున్న సందర్భాలే ఎక్కువగా వుంటున్నాయి. ప్రజల కోసం పని చేస్తున్నమనే వీరు ప్రజల భాషలో రాయరు. వీరు సాహిత్యం ఆకాశమార్గం లో ప్రయాణం చేస్తుంటుంది. అందుకే ప్రజాశక్తి , విశాలాంధ్ర లను ముద్దుగా ఇంగ్లీష్ పత్రికలంటారు.విశాలంధ్ర పేరు పెట్టుకుని తెలంగాణా ఉద్యమానికి పూనుకోవడం తప్పని విమర్శించ వచ్చేమోగాని అసలు అలాంటి పత్రిక వుందా? అంటూ శివారమప్రసాద్ గారు ఆశ్చర్యపోవడం తెలిసీ ఎద్దేవా చేయడమే. ఇది అప్పల నాయుడు గారు మీ మీద బాంకు ఉదాహరణలతో విమర్శించినట్లున్నది. శివరామ ప్రసాదు గారూ ! విశాలాంధ్ర పత్రిక వుంది. అది భారత కమ్యూనిస్టు పార్టీ (సీ.పీ.ఐ) తరుపున నడుపుతున్నారు. చాలా పత్రికలలో చంఢాలం కంటే ఆ పత్రికలో మెరుగైన ఆర్టికల్స్ వస్తాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "...ఎవరికి మీడియేటర్ గా మారుతోంది?..." This is the hundred crore question Kondala Rao garu. Well said.

      You are right about Visalandhra and Prajasakti. But they drew a party line between them and the common people. Can we take them as part of media as they belong to certain party ideology. Of course, other papers and channels are also dancing to the tunes of one or the other party. So in totality, do we have media at all or just bunch of advertisement guys writing about parties and personalities with vested interests??!! Just because somebody starts publishing on news print, something looking like news (but in fact propaganda) among numerous advertisements or a guy purchases satellite time and starts beaming news like programmes (which too in fact part of propaganda of one party or the other), can we call such organizations media!!? This is my worry and question to those who think they are media and more importantly who take upon themselves to represent and justify media inaction or over action.

      తొలగించండి
    2. కొండలరావుగారూ, మీరు విశాలాంధ్ర ఇంకా ఉన్నది అది సి పి ఐ వారి పత్రిక అని తెలియచేశారు. ఒ కె. కాని 1972-73 ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ కాలంలో ఇదే సి పి ఐ పార్టీ సమైక్య ఆంధ్ర అంటూ తమ పత్రికలో విశాలాంధ్ర లో తెగ వ్రాసి ప్రజల కోపానికి గురై అనేకసార్లు ఆ పత్రిక వాన్లు పేపర్లతో సహా తగులబెట్టబడినాయి. వాళ్ళు అప్పుడు దొంగతనంగా పేపర్లు తెచ్చుకుని కొట్లకు ఇచ్చేవాళ్ళు. ఆ కొట్లవాళ్ళు కూడ ఎక్కడ ప్రజలు తంతారేమో అని ఆ పత్రికను అమ్మేందుకు భయపడేవాళ్ళు. అందుకని అది కనుమరుగైపోయిందని భ్రమపడ్డాను. లేదన్న మాట. కానీ పార్టీ ఫండ్లు, విదేశీ ఫండ్లు ఉండి ఉంటాయి కదా నిలిచే ఉండి ఉంటుందిలెండి.

      ఇప్పుడేమో ఆంధ్ర ప్రాంత ప్రజలు సమైక్యం అంటే, ఈ పార్టీ పత్రిక ప్రత్యేకం అంటూ ఉన్నట్టున్నది. ఎప్పుడూ ప్రజలకు వీళ్ళకు సరిపోదనుకుంటాను.

      తొలగించండి
    3. శివరామప్రసాద్ గారూ !
      మీ ఆందోళన అర్ధవంతమైనది.పెట్టుబడిదారుల కబంధ హస్తాలలో వున్నంత వరకూ లేదా ప్రజలలో ఈ విషయం పై తగిన చైతన్యం వచ్చేంత వరకూ మీడియా వ్యాపారం సాగుతుంది. దాసరి నారాయణ రావు తో దర్శకుడు ఎవరో తెలిసినట్లు , ఎన్‌.టీ.ఆర్ వచ్చాక రాజకీయ చైతన్యం పెరిగినట్లు ,మీడియా గురించి కూడా తప్పకుండా ప్రజలు తెలుసుకుంటారు.
      దొపెడీ సంపదను పంచుకునేందుకు, రాజ్యాంగ యంత్రాన్ని , రాజకీయాన్ని తమ చేతులలలో వుంచుకునేందుకు మీడియా ముసుగు వేసుకునే వీరి మధ్య లాభాల పంపకం లో పొటీ వచ్చి ఇలా వీధిన పదుతుంటారు. అది చూసి ప్రజలు వీళ్ళ నిజ స్వరూపం తెలుసుకుంటారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఏ చానల్ లో ఎవరికి అనుకూలంగా వార్తలు వస్తాయో చిన్న పిల్లలను అడిగినా చెపుతారు. జనం ఇక ఏమి చెప్పినా నమ్మరు అని తేలాక వీళ్ళు చానల్ మూసుకుంటారు. ఒకరిద్దరి చేతిలొ వున్నదానికంటే ఇలా పోటీతో వీడ్ని వాడు , వాడ్ని వీడు తిట్టుకుంటూ వాల్ల అసలు బతుకులు బయట పెట్టుకోనివ్వండి. అసలైన జర్నలిజం గురించి ఆవేదన పడేవాళ్ళు ప్రస్తుత మీడియాను తూర్ప్పారబోసుకుని మంచిని ఏరుకోవడమే ప్రస్తుతానికి చేయగల పని అని నా అభిప్రాయం. ఈ లోగా మీలాంటి వాళ్ళు బ్లాగులలోనో ఇతర అవకాశాలతోనో ప్రజలను చైతన్యవంతులను చేయాలి .

      తొలగించండి
    4. ఈ పెట్టుబడిదారులూ, బూర్జువాలు, పీడిత జనం అంటూ పడికట్టు మాటలతో ఊదరకొట్టటమూ, మీడియాను దుర్వినియోగపరచటమే. తమ ఇజాన్ని, అందులోనూ విదేశీ ఇజాన్ని స్లో పాయిజన్ లాగ ఇక్కడి ప్రజలకు ఎక్కించటమే పనిగా పెట్టుకుని, పార్టీ కరపత్రాలు, పత్రికల ముసుగులో పత్రికా స్వాతంత్ర్యాన్ని వాడేసుకుంటూ (ఆ ఇజంలో ఈ స్వాతంత్ర్యం మాటే ఉండదు మరి) తమ పార్టీ పబ్బం గడుకోవటం, మీరనే "పెట్టుబడిదారులు" చేసే ఘోరాలకన్నా తక్కువేమీ కాదు. నా దృష్టిలో మానసిక కాలుష్యం మరేవిధమైన కాలుష్యం కన్నా కూడా చాలా ప్రమాదకారి. ప్రస్తుతం మన దేశానికి ఈ మానసిక కాలుష్యం ఎక్కువయ్యింది. ఒకటి మితిమీరిన వ్యాపార ప్రకటనలు, రెండు వ్యాపార ప్రకటనలద్వార డబ్బు సపాయించటమే పరమావధిగా, ఆ యాడ్ ఏజెన్సీల మెప్పుకోసం ఒక రకమైన లేదా ఒక పార్టీ అనుకూల/ప్రతికూల వార్తలను ఎక్కువ రిపోర్ట్ చెయ్యటం, లేదా అసలు రిపోర్ట్ చెయ్యకపోవటమూ, ఒక మనిషిని రెచ్చగొట్టి సామాన్యంగా ఆ మనిషి చెయ్యలేని వ్యాఖ్యలు చేయించి, ఆ మనిషి ప్రత్యర్ధి దగ్గరకు వెళ్ళి, అతను ఇలా అన్నాడు, మీరు ఏమంటారు అంటూ ఆ వ్యక్తి చేత కామెంట్ చేయించి, లేని తగాదాను సృష్టించటం ఏమిటి పత్రికా స్వాతంత్ర్యమే!!! ఇదే నేను మానసిక కాలుష్యం కలగ చేయటం అంటాను. సంపాదకీయాల్లోనూ, వ్యాసాల్లోనూ ఉండాలిసిన విశ్లేషణ, వ్యాఖ్యలు వార్తల్లోనే భాగం అయిపోతే ఎట్లా? ఈ మధ్య టి వి చానెళ్ళల్లో వచ్చే చర్చా కార్యక్రమాలు చూసి, గ్రామ సింహాలు నిశ్శబ్దంగా ఉంటున్నాయట, వేరే భాషకోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయట. వాటికి కూడ తెలిసిపోయింది తమకు తీవ్రమైన పోటీ ఎదురయ్యిందని, ఆ పోటీ తట్టుకోవటం కష్టమని, దుస్సాధ్యమని.

      మూడు నాలుగు దశాబ్దాల క్రితం ఫలానా పత్రిక అంటె భక్తి, ఫలానా ఆయన వ్రాసిన వ్యాసం అంటే నిస్పక్షపాతానికి గుర్తు ఇలా ఉండేవి. ఇప్పుడు ఏమయ్యింది మీడియాకి? ఇప్పుడున్నదే పత్రికా స్వాతంత్ర్యం అయితే అలాంటి స్వాతంత్ర్యం ప్రజలకు అవసరం లేదు. పత్రికా స్వాతంత్ర్యం అనటమె కాని పాఠకుడికి స్వాతంత్ర్యం ఏదీ, ఎవరు చూపించినదే అయినా సరే చచ్చినట్టు చూడాలి, వ్రాసినది చదవాలి. ఆ వ్రాయటం వార్తను వార్తగా వ్రాస్తే పరవాలేదు. అది కాకుండా, ఎవరికి తోచిన వ్యాఖ్యలు, అభిప్రాయాలు (with vested interest)అందులో మిళాయించేసి, ప్రజలను ప్రభావితం చేశే దురుద్దేశ్యంతో వ్రాయటం నా దృష్టిలో మానసిక కాలుష్యం కలగచేయటం. అలాంటి మానసిక కాలుష్యాన్ని కట్టడి చెయ్యగలవారెవరు? ఏదో ఒక ఫ్యాక్టరీ కాలుష్యాన్ని కలుగచేస్తున్నది అంటే, మీడియా రిపోర్ట్ చేస్తూ కొంత కట్టడి చెయ్యచ్చు. కానీ మీడియానే కనిపించని కాలుష్యాన్ని వెదజల్లుతూ ఉంటే......ఏమిటి దారి!!!??

      తొలగించండి
  16. ఇప్పుడు ఏమయ్యింది మీడియాకి?
    అలాగే అవుతుంది.మీడియా కైనా మరోదానికైనా విలువ(డబ్బు)కు విలువ పెరుగుతున్న కొద్దీ మానవతా విలువలు పతనమవుతాయి. పెట్టుబడిదారులూ, బూర్జువాలు, పీడిత జనం పడికట్టు పదాలు కావు. అవి వాస్తవం లో వున్న భవిష్యత్తులో రూపుమాపవలసిన సత్యాలు.
    " విదేశీ ఇజాన్ని స్లో పాయిజన్ లాగ ఇక్కడి ప్రజలకు ఎక్కించటమే పనిగా పెట్టుకుని " ఎందుకింత సంకుచితత్వం. వసుధైక కుటుంబం వినలేదా మీరు. మంచి ఎక్కడిదైనా ... మనిషి ఎక్కడవున్నా ఒకే శరీర నిర్మాణం , ఆలోచనా విధానం వుంటుంది. మనిషికి అంటే మానవజాతికి రెండే సంబంధాలు వుంటాయి.ఒకటి ప్రకృతితోటి-రెండు మనిషి తోటి . ఈ రెండింటినీ ఉపయోగించి తోటి మనిషి సహకారం తో , ప్రకృతిని వినియోగించుకుంటూ అందరూ కలసి బ్రతకాలి. బ్రతికించాలి. అదే కమ్యూనిజం. ఇది నిజం. దానిని గురించి తెలియకుండానే కమ్యూనిస్టులమని చెప్పుకునే వారిలో , కమ్యూనిజం గురించి సరిగా చెప్పలేనివారిలో , కమ్యూనిజం గురించి అర్ధం చేసుకోకుండానే ఒక ఫాషన్‌ గానో లేదా అనవసరపు అసమర్ధ ఉక్రోషం తోనో విమర్శలు చేసే వారినో నేను అర్ధం చెసుకోగలను. కమ్యూనిస్టు అంటే కలుపుకుపోయేవాడూ - కలసివుండేవాడూ అని.అలా వుండడం వుండాలనుకోవడం అది పదిమందికీ చెప్పడం మానసిక కాలుష్యం ఎంతమాత్రమూ కాదు. కమ్యూనిస్టులు చేసినా కంత్రీ వాల్లు చేసినా స్వేచ్చను దుర్వినియోగం చేస్తే ఖండించాల్సిందే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొండలరావుగారూ,

      మన వాదనలు ఎప్పతికీ తెగవు కానీ. నెను చెప్పవలసినది నేను చెప్తాను అంటే నా వాదనను బలపర్చుకోవటానికి కాదు, ప్రతివాదన అంతకంటే కాదు. చర్చలో బాగంగానే. మీరు అంటున్నారు "...ఎందుకింత సంకుచితత్వం..." అని. ఏమిటి సంకుచిత్వం, మీరనుకున్న వసుధైక కుటుబం అనుకోబట్టే మన దేశం రెండువేల సంవత్సరాల పాటు పరాయి పాలనలో మగ్గ వలసి వచ్చింది. మన మొదటి ప్రధాని అలా వెర్రితనంగా అనుకోబట్టే, మీరనే గొప్ప ఇజం వారు మన మీదకు దురాక్రమణ చేశారు. అప్పుడు మనల్ను రక్షించటానికి మరో సుత్తో కొడవలో దేశమైన సోవియట్ రష్యా వేలు కూడ కదపలేదు. ఎందుకని. వాళ్ళ ముక్క ఒకటి మరికొంత "సామ్రాజ్యాన్ని" ఏర్పరుచుకుంటుంది, తరువాత మనం మనం చూసుకోవచ్చు అనే కదా.

      వసుధైక కుటుంబం అంటే ప్రపంచంలో ఉన్న ఎక్కడెక్కడి చెత్త తెచ్చి మన నెత్తిన రుద్దుకోమని కాదు. అందరినీ మన కుటుంబంలోవారిలాగానే చూసుకోవాలని. కాని అలా చూసుకుంటూ ఉంటే, తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టి పక్కనున్న వాళ్ళ పితృదేశానికి సహాయం చేసే విదేశీ ఏజెంట్లతో జాగ్రత్తగా ఉండక పోతే మన స్వతంత్రమే పోతుంది. మన స్వాతంత్ర్యం మనం కాపాడుకోవటం సంకుచిత్వం, పక్కనున్న శతృ దేశాల వైపు చూడటం వసుధైక కుటుంబం అని మీరు అనుకుంటే ఇంకెమి చెప్పగలం. మళ్ళీ ఒక రెండువేల సంవత్సరాలు బానిసత్వం. ఇలా ఎన్ని సార్లు. మనకంటూ మన దేశానికి అద్భుతమైన జీవన విధానం ఉన్నది. ఎవడో జర్మనీవాడు చెప్పినది, రష్యావాడు ప్రయోగం చేసి విఫలమైనది, ఇటు చైనావాడు దానికే ఒత్తులు తీసేసి పొల్లులు పెట్టుకు తిప్పలు పడే జీవన విధానం మన దేశానికి అవసరం లేదు. వేరే దేశాల్లో విఫలమైనది, మనదేశంలో కూడా ప్రవేశపెట్టి, ఇక్కడకూడ విఫలం అవుతుంది అని చెప్పటానికి కొన్ని దశాబ్దాలపాటు ఒకటి రెండు తరాల ప్రజలను బాధపెట్టి మరీ నిరూపించాలా!! మనకు ఏ విదేశీ ఇజాలు అక్కర్లేదు. మనకు కావలిసినది అన్యాయాన్ని ఎదిరించగల మానసిక స్థైర్యం, సామాన్య ప్రజల్లో ఐక్యత, సవ్యంగా ఆలోచించగల శక్తి, గొర్రెల్లాగె ఎవరేది చెప్తే అటు పోకుండా ఉండగలగటం. బీదరికంలో కమ్యూనిస్టు అరుపులు కాసిని డబ్బులు రాంగానే అహంకారపు ధోరణులు వంటి ద్వంద విధానాలు లేకుండా ఉండాలి. అన్నిటికన్నా ఎవరికి వారు కష్టపది ఇతరులకి అడ్డురాకుండా బతకగల శక్థి ధోరణి, మనకన్నా బాగుండని వాళ్ళను ఆదుకోగల దాతృత్వం కావాలి. ఇజాల పేరుతో గద్దెలెక్కగలరేమో కాని, ప్రజల జీవితాలు బాగుచెయ్యలేరని, అనేక యూరోప్, ఆశియా, అమెరికా ఖండపు దేశాల్లో ఇప్పతికే నిరూపితం అయ్యింది. మళ్ళి మనం కూడా కష్టపడి కనెపిట్టాలా కొండలరావుగారూ.

      తొలగించండి
  17. శివరామప్రసాద్ గారూ !
    మీరన్నది నిజమే.మన వాదనలు అంత తేలికగా తెగవు. అయినా అభిప్రాయాలు చెప్పకుండా వుండలేము. మీతో నేను చాలా విషయాలలో ఏకీభవిస్తున్నందున మీ బ్లాగు ను సవ్య అలోచనలతోనే ఫాలో అవుతున్నాను. నేను కూడా ఎదురువాదన కోసం చూడడం లేదు. మీరు వ్రాసినదానిలో క్రింది విషయంతో ఏకీభవిస్తున్నాను.మిగతా విషయాలను ఎలాగూ ఇప్పట్లో తేలేవి కావు గనుక వదిలేస్తున్నాను.
    "మనకంటూ మన దేశానికి అద్భుతమైన జీవన విధానం ఉన్నది"
    "మనకు కావలిసినది అన్యాయాన్ని ఎదిరించగల మానసిక స్థైర్యం, సామాన్య ప్రజల్లో ఐక్యత, సవ్యంగా ఆలోచించగల శక్తి, గొర్రెల్లాగె ఎవరేది చెప్తే అటు పోకుండా ఉండగలగటం. బీదరికంలో కమ్యూనిస్టు అరుపులు కాసిని డబ్బులు రాంగానే అహంకారపు ధోరణులు వంటి ద్వంద విధానాలు లేకుండా ఉండాలి."

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.