7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

ఉమ్మేసే జంతువు మనిషి మాత్రమె

ఈ  బొమ్మలు చూస్తే ఈ ఉమ్మేయటం అనే అలవాటు ఎంతటి ఛండాలాన్ని కలిగిస్తున్నదో అతి చిన్న ఉదాహరణలు కనపడతాయి. పోనీ కింద తరగతి వాళ్ళేవరో   అనుకోవటానికి లేదు కార్లో వేళ్ళేవాడికి  కూడా అదే మానసిక రోగం  
గాడిద ఉమ్మేయటం ఎప్పుడన్నా చూశారా! పోనీ కుక్క ఉమ్మేస్తుందా? చివరికి కోతి కూడా ఉమ్మెయ్యదు. కాని మనిషి?! మనిషి ముఖ్యంగా భారతదేశపు మనిషి ఉమ్మేయకపోతే  మరణం సంభవిస్తుందేమో  అన్నట్టుగా ప్రవర్తించటం మన చూస్తూనే ఉంటాము. అవును చూస్తూనే ఉంటాము, అసహ్యించుకుంటాము, కాని అలా  ఉమ్మేసే మనిషి జంతువులను ఆపే ప్రయత్నం చేస్తున్నామా! 


మునిసిపాలిటీలు, ప్రభుత్వాలు "ఇక్కడ ఉమ్మి వేయరాదు" అన్న బోర్డులు అక్కడక్కడా పెట్టేసి చేతులు దులుపేసుకున్నాయి. అసలు నలుగురి మధ్యా ఉంటూ అసహ్యంగా అలా చటుక్కున ఉమ్మేయటానికి వీళ్ళకు ఏమిటి ఏమన్నా రోగమా!? రోగమే అనుమానం లేదు,  కాని అది మానసిక రోగమా లేక శారీరిక రోగమా అని ఆశ్చర్యం వేయకపోదు. అనుమానం లేకుండా ఇదొక పెద్ద మానసిక జాడ్యం. నా చిన్నతనపు రోజుల్లో చెన్నై గురించి చాల అసహ్యంగా చెప్పుకునే వాళ్ళు. తమిళులు ఎప్పుడూ తమలపాకులు నములుతూ ఎక్కడపడితే అక్కడా ఉమ్మేస్తూ తిరుగుతుంటారు అని.

కాని, 1980లు వచ్చేప్పటికి గుట్కా అనే చండాలపు అలవాటు దయ్యంలా పట్టి పీడించటం మొదలు పెట్టినాక, చాలా మంది గుట్కా అనే ఆశుధ్ధాన్ని  నోట్లో పెట్టుకుని, ఆ తయారయిన గరళాన్ని భరించలేక  ఉమ్మేయటం అనే అలవాటుకు బానిసలయ్యిపోయి, ఉచ్చనీచాలు తెలియకుండా ఎక్కడపడితే అక్కడ ఉమ్మేయటం మొదలుపెట్టారు.  ఏక్కడ చూడండి-నలుగురూ తిరిగే చోట్లల్లోనూ, కార్యాలయాలు, సినిమా హాళ్ళు, రోడ్లమీద, కాలేజీల్లో, మెట్ల మీద కారిడార్లల్లో-ఎక్కడ చూసినా ఈ చండాలపు మరకలే. నా దృష్టిలో ఇలా ఉమ్మేయటం ఒక సాంఘిక వ్యతిరేక చర్య(Anti Social Activity). ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసి అసహ్యం చేసేవాళ్ళు అసాంఘిక శక్తులు(Anti social elements).
  ఛీ ఛీ చివరకు మంత్రి కూడా! yet tu brut....లాగ yet tu Laloo! పోనీ లెండి కనీసం ఉమ్మి తొట్టి   తెచ్చుకున్నాడు! పక్కవాడి కుర్చీ కాలు మీద ఉమ్మేయకుండా. అప్పటికీ ఆ పక్కాయన కాళ్ళు రెండూ ఎత్తి కూచున్నట్టు లేదూ!  
ఇలా ఆక్రోశించటం మినహా మనమేమన్నా చెయ్యగలమా? చేశామా! అంటే జవాబు శూన్యం. కాని,  గత కొద్దిరోజులబట్టి, ముంబాయి చత్రపతి శివాజీ టెర్మినస్ (ముంబాయి ప్రధాన రైల్వే స్టేషన్) దగ్గర ఒక యువకుడు రోజూ తారసపడుతున్నాడు. అతని చేతిలో ఒక పెద్ద అట్ట పట్టుకుని లోకల్ రైళ్ళల్లోంచి దిగి బయటకు వచ్చే జన సమూహం తన చేతిలో ఉన్న బోర్డు చూసేట్టుగా పట్టుకుని నిశ్శబ్దంగా నిలబడి ఉంటాడు. ఆ బోర్డు మీద వ్రాసి ఉన్నది దేవనాగరి లిపిలో ఉన్నా కూడా, మరాఠీ కాబట్టి నాకు అర్ధం కాదు. ఇలా చూసి చూసి, అసలు ఈ యువకుడు ఏమి చేస్తున్నాడు అడిగి చూద్దాం అని, నిన్న (06 02 2014) నా ఐ పాడ్ పట్టుకుని వెళ్ళాను. అతనితో జరిగిన సంభాషణ ఈ కింది వీడియోలో వినండి/చూడండి: 
 


యు ట్యూబ్లో మరింత పెద్ద ఇంటర్వ్యూ ఈ కింది వీడియోలో చూడండి, తన ఒంటరి పోరాటం లో ఎదుర్కొన్న అనుభవాలు ఈ వీడియో వివరించారు:
ఒక వ్యక్తి నేనొక్కణ్ణీ ఏమి చెయ్యగలను అనే సామాన్య బలహీనతనుంచి బయటపడి, తానొక్కడే చెయ్యగలిగినది చేసి చూపించాచాడు.  యువకుని పేరు కృష్ణ  చవాన్, ముంబాయిలో సయాన్ నివాసి, కంప్యూటర్ ఇంజనీర్.  వేరే ఎవరొ చెయ్యాలి అని ఎదురు చూసే సగటు మనిషి కన్నా ఒక్క అడుగు ముందేసి ఆ పని నేనే  ఎందుకు చెయ్యకూడదు అని తను చెయ్యగలిగినది, ప్రజల్లో చైతన్యం రావటానికి ఒక బోర్డు పట్టుకుని రోజుకు మూడు గంటలు అవును మూడు  గంటలు ముంబాయి స్టేషన్ చుట్టుపక్కల నిలబడి తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటాడు. అతనిలా మనం చెయ్యలేకపోయినా, కనీసం ఎవరన్నా ఎక్కడాన్నా ఉమ్మేసే  వాళ్ళను అక్షేపించటం మొదలుపెడితే  వాళ్ళకు మెల్లిగా "సిగ్గు" అనేది ఉంటుందన్న విషయం జ్ఞప్తికి వచ్చే అవకాశం ఉన్నది అని నా భావన.

గత కొద్ది సంవత్సరాలుగా నలుగురిలో నిలబడి సిగిరెట్టు తాగే  అనాగరికులను (అలా తాగటం గొప్ప అన్న ఫోజు కొడుతూ) మనం చూస్తూ ముక్కులు మూసుకుని బాధపడేవాళ్ళం. ఇప్పుడు అలాంటి అనాగరికులు ఎక్కువగా కనపడటం లేదు. ఇలాంటి అనాగరికులు మొత్తం సమాజంలో చాలా తక్కువమంది. ఎప్పుడైతే మెజారిటీలో ఉన్న మిగిలిన ప్రజలు తమను అక్షేపించటం  మొదలుపెట్టారో ఈ అనాగరికులు సిగరట్లను నలుగురిలో కాకుండా ఎక్కడికో పోయి గుట్టుచప్పుడు  కాకుండా "వాళ్ళ చావు వాళ్ళు చస్తున్నారు" అదే మంచిది, నలుగురిలోనూ కాల్చి ఇతరులని కూడా, తమతో పాటు చంపకుండా, వాళ్ళ చావు విడిగా ఒక్కళ్ళే  కొని తెచ్చుకుంటున్నారు. ఇదే విధంగా ఈ ఉమ్మేసే అనాగరిక జంతువులు, సారీ జంతువులు బాధపడతాయి, అందుకని  ఇలాంటి అనాగరిక "మనుష్యులను"  కూడా సంస్కరించవలసిన బాధ్యత సమాజంలో అందరిమీదా ఉన్నది. కృష్ణ చవాన్ లాగా కనీసం వందలో పది మంది, ఈ ఉమ్మేసే అసాంఘిక శక్తులను అధిక్షేపించటం మొదలుపెడితే, ఈ అనాగరికపు అలవాటు తగ్గిపొయ్యే అవకాశం ఉన్నది అని నా అభిప్రాయం. 

మున్నా  భాయ్ లగే రహో సినిమాలో  లో ఈ ఉమ్మేసే జంతువు సారీ మనిషిని ఎలా సంస్కరించారో చూపించారు.  అది సినిమా కాబట్టి దర్శకుడి ఆదేశాలను అనుసరించి ఆ ఉమ్మేసే "మనిషి" చివరకు సారీ చెప్తాడు. చూడండి ఆ ఉమ్మేసే "మనిషి" ని బాగుచేసిన విధానం కాని నిజ జీవితంలో ఇలాంటి గాంధీగిరి పనిచేస్తుందా! అనుమానమే అందుకే కాబోలు "దండం దశగుణ భవేత్" అన్న నానుడి వాడుకలోకి వచ్చింది

5 వ్యాఖ్యలు:

 1. శివగారూ!
  నమస్కారం. చాలా రోజుల తరువాత ఇటుపక్క (బ్లాగుల వైపు) వచ్చాను.
  ఇదివరకు ఎప్పుడో పూనే లో చూసాను.. అపార్ట్ మెంట్ మెట్లమీద మూలల్లో, లిఫ్ట్ పక్క గోడలమీద ఈ ఎర్రటి జాడ్జం కనిపిస్తూ ఉండేది. దాని నివారణ కోసం మా మామయ్య అపార్ట్మెంట్ వాళ్ళు అన్ని మతాల దేముళ్ళ బొమ్మలున్న టైల్స్ అతికించే వారట ఆ మూలల్లో..!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నిజమే రాధేశ్యాం. కొన్ని చోట్ల ఉమ్మేయటం నిరోధించటానికి దేవుళ్ళ బొమ్మలు పెట్టాల్సి వస్తున్నది. మరి కొన్నాళ్ళు పోయినాక అప్పటికీ ఉమ్మేసే మూకలు తయారవుతాయేమో. కలికాలపు మహిమ.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నిజమే కానీ ప్రభుత్వం దీని గురించి ప్రచారం చెయ్యాలి లెక పోతే ఇది తప్పు అని మనం ఎవెరికైన చెపితే మనల్ని తిట్టి పోసే వాళ్ళు ఉన్నారు

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మీ వ్యఖ్యలకు అభినందనలు మరియు ధన్యవాదములు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @Ramakrishna
  పాపం ఆ మరాఠీ యువకుని బాధ మీరు అర్ధం చేసుకున్నట్టు లేదు! భగత్ సింగ్ మనింట్లో పుట్ట కూడదు, పక్కింట్లోనే పుట్టాలి.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.