15, జూన్ 2014, ఆదివారం

అందరి పిల్లలూ ఇలా ఉంటే !

కపిల్ దేవ్ కుమార్తె అమయ దేవ్, కపిల్ దేవ్ కామెడీ విత్ కపిల్ కార్యక్రమంలో
 చివరిదాకా చదివిన వారికి ఒక బోనస్ ఉన్నది 
 ఈ నాటి పిల్లలే రేపటి పౌరులు అని పొడి పొడి మాటలు మాట్లాడుకోవటమే కాని, మన పిల్లలను రేపటి పౌరులుగా తీర్చి దిద్దటానికి మనం అంటే  తల్లితండ్రులం ఎంత ప్రయత్నిస్తున్నాము అని ఒక సారి ఆలోచిస్తే, తక్కువేనేమో అనిపిస్తుంది . ఒక ఎవరేజి తల్లి తండ్రులు చేసేది  ఏమిటి! ట్యూషన్ కార్ఖానాల్లో తమ పిల్లలను చేర్చేయ్యటం, వాళ్ళను కూచో నివ్వకుండా నుంచో కుండా ఊరికే తరమటం తోమటం,రాంక్, రాంక్  అని పాపం పిల్లలకు పిచ్చులు ఎక్కించటం,  ఆపైన అమెరికా తాయిలం చూపించటం, చివరకు వృద్ధాశ్రమంలో పడినాక ఆలోచన!

ఇవ్వాల్టి పిల్లలకు  దేవుడు ఇచ్చిన వరం కావచ్చు, కొంతమంది తల్లి తండ్రులు  వాళ్ళను పెంచిన విధానం కావచ్చును, అద్భుతమైన "ఏటిట్యూడ్"  తో వాళ్ళ జీవనాన్ని కొనసాగించి ఇతరులకు మార్గ దర్శకులు అవుతున్నారు. 

ఇలా వ్రాయటానికి స్పూర్తి కపిల్  దేవ్ కుమార్తె! అప్పటికే రికార్డ్ చెయ్యబడి తీరిక దొరికినప్పుడు చూడటానికి దాచిన (కర్టెసీ టాటా స్కై) కామెడీ విత్ కపిల్ కార్యక్రమాలు నిన్న శనివారం  కావటంతో సావకాశంగా నాకు నచ్చినవి చూశాను. అందులో నాకు బాగా అద్భుతం అనిపించినవి సునీల్ గవాస్కర్ తో ఆపైన అంతకంటే కపిల్ దేవ్ తో  కార్యక్రమం. ఆ ప్రోగ్రామ్ యాంఖర్ పేరు కూడా కపిలే! 

కార్యక్రమం మొత్తం మొత్తం హాస్య ప్రధానం, పేరే కామెడీ విత్ కపిల్ కదా మరి! మాటల్లో యాంఖర్ కపిల్, క్రికెటర్ కపిల్ దేవ్ ను ఒక విషయం గురించి అడిగారు. అదేమిటో ఈ కింది వీడియోలో చూడండి. 
(పైన ఉన్న వీడియో ముక్క కామెడీ విత్ కపిల్ కార్యక్రమం కలర్స్ టి వి వారి కర్టెసీ)
చూశారు కదా వీడియో. నిజంగా కపిల్ దేవ్ కూతురు అమియా ను చూస్తె చాలా ముచ్చట వేసింది. తన తండ్రి చేసిన తప్పు,  అతి చిన్నది,  అది కూడా ట్రాఫిక్ లైటును,  అదీ గ్రీన్ కు రెడ్ కు మధ్యన  ఉన్న ఎల్లో   లైటును దాటి వెళ్ళటం. అయినా సరే తప్పు  తప్పే,తన తండ్రి  అయినా సరే,  చలానా వ్రాయమని పోలీసును అడగటం గొప్ప విషయం. ఆ తరువాత ఆ పోలీసు నిజంగా చలానా వ్రాశాడా లేదా అన్న విషయం కార్యక్రమం లో దాటవేశారు (వ్రాసి ఉండరు) కాని, ఆ పిల్ల అలా అడగటం ఎంతయినా బాగున్నది. 

ఊరికే ఎవరో వెర్రి వాళ్ళు నలుగురు కలిసి పవర్లోకి రావటానికి అవినీతి నశించాలి అని అరవంగానే  వాళ్ళ చుట్టూ చేరి గెంతటం కాదు. ఈ అవినీతి మనవాళ్ళు, మన దగ్గిర వాళ్ళు చేసినా సరే సహించకుండా ఉండటమే నిజమైన పోరాటం. 

తండ్రి తెచ్చే అవినీతి సంపాదనను హాయిగా అనుభవిస్తూ  ఫేస్ బుక్ లో అవినీతి పోవాలని ఎంత వ్రాసి ఏమి  లాభం, బ్లాగుల్లో ఎంత గింజుకుని ఉపయోగం ఏమిటి. ఆప్ పార్టీ చుట్టూ ఎగరటం కాదు, ఒక సేల్స్ టాక్స్ ఆఫీసరు కొడుకు తండ్రిని  నిలదియ్యాలి, లంచాలు తీసుకుని తనను  చదివించ వద్దని, ఒక ట్రాన్స్ పోర్ట్ అధికారి కూతురు తండ్రి తెచ్చిన గిఫ్ట్ లంచం లోంచి కొన్నది  అయితే  విసిరి కొట్టి ఆవతల పారెయ్యాలి,  చెక్ పోస్ట్ అధికారి కొడుకు తండ్రి తెచ్చిన లంచాల డబ్బుతో చడువుకోనని చెప్పి, మూటలు  మోసి  ఆ డబ్బుతో నైట్ కాలేజీలో చదివి చిన్న ఉద్యోగం సంపాయించినా సంతోషంగా ఉంటాడు. అలా పిల్లలు తమ ప్రవర్తనతో, ఋజువర్తనతో తల్లి తండ్రులను మారుస్తారేమో అన్న ఆశ  అప్పుడప్పుడ, ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు పొడచూపటo తప్పేమీ కాదేమో!

ఏదో యువ రక్తం వస్తే రాజకీయాలు బాగుపడతాయని  ఆశ పడ్డాం. కాని జరిగినది ఏమిటి మన రాష్ట్రంలో ఒకానొక యువ నాయకుడు తండ్రిని మించిన వాడయ్యిపొయ్యాడని (అవినీతిలో) రాష్ట్రం రాష్ట్రం నివ్వెరపోయి చూస్తుండగా, దాదాపుగా అంధ్రప్రదేశ్ కు ముఖ్య మంత్రి అయినంత పని అయ్యి ఆ ప్రమాదం కొద్దిలో తప్పింది కదా! విచిత్రం ఆ ప్రమాదం తప్పటానికి కూడా ఒక యువ సినీ నటుడే కారం అంటారు మరి! ఆ సినీ నటుడు ఇకా యువకుడేనా అంటే, వేటగాడు సినిమా, లేదా ప్రేమాభిషేకం సినిమా చూసి తేల్చుకోవాల్సిన విషయమే!

 అలాగే ఉత్తర ప్రదేశ్ లో ఒక యువకుడే ముఖ్య మంత్రి, కాని ఏమిటి లాభం? అక్కడ జరిగే వెధవ పనులన్నిటికీ తన తెలివితేటలన్నీ ఉపయోగించి (అదే తెలివి అని ఆ మనిషి ఉద్దేశ్యం!) సమర్ధించుకుంటున్నాడు. యువకుడైన వాడు తండ్రి పాలించిన చెత్త పధ్ధతిలో కాకుండా పరిపాలనలో మార్పు చూపించి అందరి మన్నన పొందాల్సిoది పోయి, ఆ తండ్రే నయం అనిపించే పరిస్థితి కలిపిస్తున్నాడు ఆ యువ కొడుకు. 

పిల్లలందరూ న్యాయాన్యాయాలు తెలుసుకుని తల్లి తండ్రులను ప్రశ్నించటం  మొదలు పెడితే కాని, తల్లి తండ్రుల అవినీతి ఆలోచనలు,  చర్యలు అరికట్టడం కష్టం. 

ఇంతటి విషయాన్నీ తన కామెడీ షో  లో మెత్తగా హాస్యంతో చక్కగా చొప్పించి చూపిన కపిల్ శర్మ కార్యక్రమం అధ్బుతం, అందరూ చూడతగ్గ కార్యక్రమం. 

  • కపిల్ దేవానంద్ లాగ మిమిక్రీ 
  • కపిల్ వాజ్పేయ్ నడక 
  • కపిల్ దేవానంద్  సినిమా లో పాట పాడటం 
  • కపిల్ భార్య వంటల విన్యాసాల కబుర్లు 
  • ఇంకా ఇలా ఎన్నో సరదాలు ఈ కార్యక్రమంలో ఉన్నాయి. ఇప్పటికే చూసి ఉండకపోతే,ఈ కింది వీడియోలో పూర్తీ నిడివి కార్యక్రమం చూడండి:
*
***
*

గవాస్కర్ డాన్స్
కామెడీ విత్ కపిల్ కార్యక్రమంలోనే మరొక ఎపిసోడ్ లో గవాస్కర్ ను సెహ్వాగ్ ను పిలిచారు. అందులో, ప్రేక్షకుల్లో ఒకతను, తనకు సెహ్వాగ్ తో విజయోత్సాహంతో నృత్యం చెయ్యాలని ఉన్నదని అడిగాడు. సరే ఆతను వచ్చి సెహ్వాగ్ తో డాన్స్ చెయ్యాలని చూసాడు కాని, సిక్సర్లు బాదే సెహ్వాగ్ డాన్స్ దగ్గర డక్  అయిపోయ్యాడు, ఆ ప్రేక్షక కుర్రాడు సెహ్వాగ్ ను వదిలి గవాస్కర్ ని పట్టుకున్నాడు. ఆశ్చర్యం గవాస్కర్ చక్కగా డాన్స్ చేసి అందరినీ ఆనంద పరిచాడు. ఇంకెందుకు ఆలస్యం చూడండి గవాస్కర్ నృత్యం:

పూర్తి  కార్యక్రమం యు ట్యూబ్లో చూసి ఆనందించండి 
 














కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.