29, జులై 2014, మంగళవారం

ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి

  ఇది మనకున్న సివిక్ సెన్స్!  


గేటులేని లెవెల్ క్రాసింగ్ వద్ద ఈ మధ్యనే జరిగిన ప్రమాదం గురించి ప్రముఖ జర్నలిస్టు ఆపైన బ్లాగర్ అయిన భండారు శ్రీనివాసరావు- వార్తా వ్యాఖ్యలో
( బండారు శ్రీనివాసరావుగారి బ్లాగ్ (క్లిక్) ) ఆయన సమస్యకు ఒక పార్శ్వం సమీక్షించారు. కాని  నా ఉద్దేశ్యంలో ప్రస్తుతపు రోజుల్లో యధా ప్రజా తథా నాయకా గా ఉన్నది. చాలావరకూ మనబట్టే నాయకులూనూ, మనకు తగ్గ నాయకులే వస్తారు కాని, మనకు భిన్నంగా ఉండే నాయకులు ఎప్పటికీ రారని నేను నమ్ముతున్నాను. ప్రజల్లో అంటే వేరెవరో మనకు తెలియని వాళ్ళు కాదు "మనమే" సవ్యంగా బ్రతకటం నేర్చుకోకుండా క్రమశిక్షణా రాహిత్యంతో బాధపడుతూ పైగా ఆ క్రమశిక్షణా రాహిత్యమే గొప్ప లక్షణంగా పిడివాదాలు చేసేస్తూ, మన్ని తప్ప ఇతరులందరినీ విమర్శిస్తూ బతికేస్తే ప్రమాదాలు, స్కాములు జరగకుండా ఆగవు. జరుగుతూనే ఉంటాయి మరి!



సివిక్ సెన్స్ అనేది వినటానికి కూడా ఇష్టపడని జాతి అయ్యిపోయింది మనది.
గేటు ఉన్న చోట స్కూటరు మొత్తం ఆ గేటు కిందనుంచి దూర్చి, వెనకాల పెళ్ళాం పిల్లలు, (చిన్న చిన్న పిల్లలు కూడా) నడిచి వస్తుంటే రైలు వస్తున్నా చూసి కూడా పట్టాలు దాటే మగ ధీరులు ఎంతమంది మనకు! అలాంటి తండ్రుల నుంచి ఆ పిల్లలు నేర్చుకునేది ఏమిటి? విజయవాడలో 1989లో అనుకుంటాను ఒక ప్రముఖ జర్నలిస్టు కుమార్తె, వేసి ఉన్న రైల్వే గేటులోంచి తన మోపెడ్ తో దూరి వెళ్ళాలని పోయి రైలు కిందపడి మరణించింది. గేటు ఉండి ఉపయోగం ఏమిటి? సివిక్ సెన్స్ అనేది లేకపోవటం ఎంతో ప్రమాదం. ఇవ్వాళ లైన్లో నుంచోరా అంటే వెటకారం, వాహనాన్ని సరిగ్గా పార్క్ చెయ్యరా అంటే పొగరుమోతు సమాధానాలు, రెడ్ లైటు ఏరియాకు వెళ్ళటం మగతనమట (దాని వాల్ల ఎన్ని ప్రమాదాలున్నా సరే!),  కాని రెడ్ లైటు దగ్గర ఆగటం (అలా ఆగటం ఎంత సేఫ్టీ ఐనా సరే!) మగతనం కాదట, ఇలాంటి వాళ్ళకు ప్రమాదాలు కాక మరేమి వస్తాయి?



రైల్వే వాళ్ళను విమర్శించే ముందు, మనం అంటే సామాన్య ప్రజలం ఏమి చేస్తున్నాము ముందు చూడాలి. ఆ ప్రమాదం జరిగిన ఊళ్ళో గేటు ఉన్న లెవెల్ క్రాసింగ్ వదిలి దగ్గిర దారి అన్న మిషతో, ఆ డ్రైవరు గేటు లేని లెవెల్ క్రాసింగ్ మీదుగా తీసుకు వెళ్ళటం వలన మాత్రమే ఈ ప్రమాదం జరిగింది. స్కూలు వాళ్ళకు, తల్లి
తండ్రులకూ ఈ విషయం మునుపు తెలియదా? ఘోరం జరిగిపోయినాక నెత్తి కొట్టుకుంటూ ఏడిచి ఏమి లాభం! మన పిల్లలను పంపింస్తూ ఉంటె అక్కడ జరిగేది ఏమిటి అని అప్పుడప్పుడన్నా చూసుకోవాల్సిన బాధ్యత, కనీసం "భయం" తల్లి తండ్రుల్లో ఉండాలి. వాళ్ళైనా తమ పిల్లలలను తీసుకు వెళ్ళే వాహనాలను ఆకస్మికంగ తణిఖీ చెయ్యాలి ఎవన్నా అటూ ఇటూగా ఉంటే స్కూలు వాళ్ళను, బస్సు వాణ్ణి నిలదియ్యాలి. వీటికి మనకు టైము లేదు, చెయ్యాలన్న ఇష్టమూ ఆసక్తీ రెండూ లేవు. అంతా గుడీ గుడీ ఇచ్చకాల మాటలు అంతే.



ఇక స్కూలు వాళ్ళు తమ వాహనాలను ఏ రూటులో తీసుకు వెళ్ళాలి అన్న విషయం మీద కఠినంగా ఉండి ఉంటే ఈ ప్రమాద జరిగేదే కాదు. ప్రతి లెవెల్‌క్రాసింగ్ వద్దా గేటు ఉండాలి, కాని రైల్వే టిక్కెట్ రేట్లు మటుకు
పెంచకూడదు (పదకొండేళ్ళ తరువాత ఈ మధ్య పెంచితే ఎంత గోల చేశారు!) ఎలా కుదురుతాయి. ఆకాశంలోంచి డబ్బులు వచ్చి ఈ పనులన్నీ జరుగుతాయా లేకపోతే ఏదన్నా మాయాజాలంతో జరిగిపోతాయా! దేశంలో గేట్లు లేని లెవెల్ క్రాసింగులన్నిటి మీదుగా ఫ్లై ఓవర్లు లేదా గేట్లు నిర్మించటనికి కావాలిసిన నిధులను సమకూర్చుకోవటానికి, ప్రభుత్వం బాండ్లు 5% వడ్డీతో విడుదల చేస్తే, టాక్స్ బెనిఫిట్ తో సహా,  ఎంతమందిమి కొంటాము? పక్కనున్న 12% వడ్డీ ఇచ్చే "మన" కులం వాడు నడిపే చిట్ ఫండులో పెట్టి మోసపోవటానికి రెడీ కాని, ఇలాంటి బాండ్లు ఒక మంచి పనికి ప్రభుత్వం తీసుకు వస్తే ఎవ్వరన్నా పెట్టుబడిపెడతారా!


ముఖ్యంగా మన "జాతి" కి కావలిసినది క్రమశిక్షణతో "ఆలోచించటం", సివిక్ సెన్స్ అలవరచుకోవటం. ఈ రెండూ లేకుండా బేకారు మాటలు మాట్లాడుకుంటూ, పొద్దు గడవని వాళ్ళ టివి పానెల్ డిస్కషన్సు వల్ల  ఉపయోగం ఏమన్నా ఉన్నదా! అతి విలువైన విద్యుత్ వృధా,  పైగా ఆ విద్యుత్ ను మనకు తిండి పెట్టె రైతుకు ఇవ్వకుండా (మనకు తిండి పండించే పోలాలకు నీళ్ళు పెట్టుకోవటానికి), మనకు టి వి  చూట్టానికి ఇవ్వటమేమిటి నాగరిక(!) ప్రపంచంలో జరిగే అనాగరిక చర్య కాకపోతే.  సామాజిక బాధ్యత అని ఊహూ  ఊదరగొట్టే చానెళ్ళు,   విద్యుత్ సమస్య  తీరేవరకూ వాళ్ళ ప్రసారాలను రోజుకు 3-4 గంటలకు పరిమితం చెయ్యలేరా! చెయ్యరు కారణం సామాజిక బాధ్యత ఇతరులది మాత్రమేట. 

 (ఫొటోలన్నీ గూగులమ్మ ప్రసాదం, ఎవరన్నా  నేను తీశాను  ఇక్కడ ఈ బ్లాగులో ప్రచురించటానికి  వీల్లేదు అని చెప్పగలిగితే, తక్షణం తొలగిస్తాను)  

3 కామెంట్‌లు:

  1. కరెక్ట్ గా చెప్పారు సార్!

    Indiscipline is heroic; negligence is romantic;personal safety pathetic!

    - కార్తీక్

    రిప్లయితొలగించండి
  2. చాలా కరెక్ట్ గా చెప్పారు sir, క్రమశిక్షణ అన్నది ఇంటినుండే మొదలవ్వాలి.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.