20, ఆగస్టు 2014, బుధవారం

భగ్నబహుమతులూ-అశృకణాలూ


ఏమిటీ విచిత్ర కాప్షన్ అని చూస్తున్నారా! ముళ్ళపూడివారి నవ్విస్తూ ఏడిపించే హాస్యం నుంచి పుట్టిన ఒక కథ   "భగ్న వీణలు అశృకణాలు".  అలాంటి కాప్షన్ పెట్టి ఒక వ్యాసం వ్రాయాలని తపన. ఇప్పటికి ఆ శీర్షిక కు సరిపడే ఒక అద్భుత ఆడియో  గొల్లపూడి మారుతీ రావుగారు అందించారు. అటు విలనీ చేస్తూనే హాస్యం అందించగల దిట్ట మన గద్ద ముక్కు పంతులుగారు. 

ఈ మధ్యనే వేరే విషయాలు లేక అనుకుంటాను, భారతరత్న ఇప్పుడు సుబాష్ చంద్ర బోసుగారికి, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ  గారికి ఇస్తే, పోనీ మన హాకీ వీరుడు ధ్యాన్ చంద్ కు ఇస్తే! అని ఒక "చమచ్" ఎంబ్లెమ్ కనిపించకుండా  వాటర్ మార్కుగా గల ఒక ఆంగ్ల చానెల్, ఒక చర్చా కార్యక్రమాన్ని నాలుగైదు రాజుల క్రితం ప్రసారం చేసింది. ఏంఖర్ గా ఉన్నా ఆ మహిళా రత్నం అలవాటు ప్రకారం 90 నిమిషాల్లో 88 నిమిషాలు తానే మాట్లేడేసి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసానని  అనిపించుకున్నది. 

 ప్రస్తుతం కేంద్రం లో ఉన్న ప్రభుత్వానికి ముందు ఒక ప్రభుత్వం ఉండేది "ట", వాళ్ళు తమకు ప్రచారం చెయ్యకపోతాడా అని కాబోలు, లేదా క్రికెట్ వెర్రితో కొట్టుకుంటున్న దేశం మొత్తం-మొత్తం తమకే మళ్ళీ పట్టంకడతారనో పాపం,  సచిన్ టెండుల్కర్ కు భారతరత్న ఇచ్చి పారేశారు.  పైగా అతన్ని రాజ్యసభకూ  నామినేట్ చేసేసారు. అలవాటు లేని పని కదా,   టెండుల్కర్ పార్లమెంటుకు డుంకా కొడుతూనే ఉన్నాడని మరొక చానెల్ ఢంకా బజాయించి దుమ్ము లేగిపొయ్యే ఒక చర్చ పెట్టింది  ఒక పది-పదిహేను రోజుల క్రితం.

పనిలేని మీడియా వాళ్ళు తమ 24 గంటల సమయాన్ని గడుపుకోవటానికి ఎలాంటి చర్చలైనా చెయ్యవచ్చు. కాని వాళ్ళ చర్చలే నిజం చేస్తూ ప్రభుత్వం
మూడున్నర దశాబ్దాల క్రితం అంటే 1979వ సంవత్సరంలో,  తన 79వ ఏట మరణించిన, ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ గారికి,  బారతరత్న ఇవ్వచ్చు అని 2014లో  ప్రతిపాదించారుట.  హాకీ మన జాతీయ క్రీడ, ఆ ఆటలో అత్యంత ప్రతిభాశాలికి భారతరత్న ఇవ్వకుండా, క్రికెట్ క్రీడాకారుడికి పూర్వపు ప్రభుత్వం భారతరత్న ఇవ్వటానికి,  రాజకీయ విరుగుడుగా ప్రస్తుతపు ప్రభుత్వం 35 ఏళ్ళ క్రితం మరణించిన ధ్యాన్ చంద్ గారికి ఇప్పుడు భారతరత్న ఇచ్చి గౌరవించే ప్రయత్నం చేస్తున్నది కాబోలు. సంతోషం. 
 
  భీమ్  సేన్ జోషీ గారికి ఫాస్ట్ కార్లు అంటే భలే సరదాట  
   ఫోటో కర్టెసీ TEAM-BHP.COM  

ఇలాగే కొంతకాలం క్రితం, ప్రముఖ హిందూస్తానీ గాయకుడు భీమ్ సేన్ జోషీ గారికి 2009 లో ఆయన పాడటం మానేసిన దశాబ్దం తరువాత, ఆయన 87వ ఏటలో  భారతరత్న ఇచ్చాం అనిపించుకున్నది, పూర్వపు ప్రభుత్వం. పాపం అప్పటికే ఆయన నడవలేని పరిస్థతిలో ఉన్నారుట, ఇల్లు కూడా  వదిలి రాలేని పరిస్థితి. అందుకని,  ప్రభుత్వం వారు "దయతో" తమ ఉన్నతోద్యోగిని ఒకరిని వారింటికి "తోలి", ఆ బహుమతి వారికి ఇచ్చేశారుట. శభాష్! రాష్ట్రపతిగారు అలా సరదాగా కారేసుకుని వారింటికి వెళ్లి ఆ బహుమతేదో ప్రదానం చేస్తే, జోషీ గారు వద్దని ఉంటారా!? ఒక్కటే తృప్తి వారు జీవించి ఉండగా భారతరత్న అందుకున్నారు, అందుకున్న రెండేళ్ళకు పరమపదించారు.

ఈ విషయం విన్న మన గొల్లపూడి మారుతీ రావుగారికి వెంటనే మెరుపల్లే
  శ్రీ గొల్లపూడి మారుతీ రావు ఫోటో కర్టెసీ భారత్ స్టూడెంట్.కాం  
ఒక ఆలోచన వచ్చి ఒక చక్కటి ఆడియో గాల్లోకి వదిలారు. ఏమైనా ఆకాశవాణి వారి ప్రొడక్ట్ ఆ పైన స్వతాహాగా రచయితా మరి. అలా వారు గాల్లోకి వదిలిన ఆ ఆడియో ను మన బ్లాగు గంధర్వ శ్రీ శ్యాం నారాయణ గారు (ఫిరంగిపురం ఇలాకా వారు) వడిసి పట్టుకుని నా అదృష్టం వల్ల  నాకు పంపారు. ఇప్పుడే ఒక గంట క్రితం ఆ ఫైలు మెయిలులో చూసి, శ్యాం పంపితే అందులో తప్పకుండా ప్రత్యేకత ఉండి  తీరుతుంది అని డౌన్లోడ్ చేసి వింటూ ఉంటే నవ్వి నవ్వి కళ్ళంబడి నీళ్ళు వచ్చేసినాయి.  ఆ నీళ్ళు కేవలం అతిగా నవ్వటం వల్ల  మాత్రమే కాదు, మన దేశంలో ఇవ్వబడుతున్న భ్రష్ట బహుమతుల తీరు చూసి కూడా!

ఇప్పుడు మీరు కూడా  వినండి మన గొల్లపూడి మారుతీ రావుగారి అద్భుత హాస్య ప్రసంగం:



ఇంతా చేసి,  ఈ బుల్లి వ్యాసం చదివినాక భీమ్ సేన్ జోషీ గారి గానం వినకపోతే ఎలా! చూస్తూ వినండి


















1 కామెంట్‌:

  1. ఆ హిందూస్థానం వారి పక్కన మన కర్ణాటకం వారు కూడా వున్నారుగా!ఇద్దరూ ఆలాపనలతో చెడుగుడు ఆడేశారు సుమా.జోషీ గారి ఆంగిక విన్యాసాలు కూడా బావున్నాయి.ఆయన స్పెషాళ్తీయే అది కదా?

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.