14, ఫిబ్రవరి 2015, శనివారం

WE MISS YOU కేశవరెడ్డి గారూ


కొత్తగా పట్టుకున్న వ్యసనం ఫేస్ బుక్ లో నిన్న రాత్రి అటూ ఇటూ తిరుగులాడుతూ ఉంటే, మిత్రుడు అనిల్ బత్తుల తన టైం లైన్ లో "We Miss You" అని మాత్రం వ్రాసి,  రెడ్డిగారి పుస్తకాలు పక్కనే ఆయన ఫొటో పోస్ట్ చేశారు. చూడంగానే మనసు కీడునే శంకించింది. హడావిడిగా గూగులమ్మను అడిగితే తెలుగు సాహితీ లోకానికి 13 ఫిబ్రవరి 2015 న ఎంతటి లోటు జరిగిందో చాలా బాధపడుతూ తెలుసుకున్నాను.  ప్రముఖ రచయిత డాక్టర్ కేశవరెడ్డిగారు తన 69వ ఏట 13 ఫిబ్రవరి 2015న నిజామాబాదులో అనారోగ్యంతో  మరణించారు. 

నాకు ఈయన రచనలతో మొదటి పరిచయం ఆంధ్ర పత్రికలో ధారావాహికగా ప్రచురించబడిన "అతడు అడవిని జయించాడు" నవల. మొదటి భాగం చదవంగానే, ఈ భాషను ఎలారా బాబూ చదివేది అనిపించింది. కారణం,  అప్పటివరకూ కథలు, నవలలు అన్నీ కూడా కృష్ణా జిల్లా భాషే సాహిత్య భాష అనుకుంటూ చదువుతూ పెరిగాను. ఈయన తన రచనలో పరిచయం చేసిన చిత్తూరు జిల్లా మాండలికంతో తెలుగులో రచనలకు ఒక  "సిక్కా వేసిన" శైలి ఉండవలసిన అవసరం లేదని, తెలుగు ప్రజలు మాట్లాడుకునే అనేక  మాండలికాల్లో రచనలు ఉన్నాయని తెలిసింది. ఆ తెలియటం కూడా, మొదట కేశవరెడ్డిగారి "అతడు అడవిని జయించాడు" నవలతో తెలియటం నా అదృష్టం. 

 కేశవరెడ్డిగారి మరణంతో తెలుగు సాహితీ లోకం ఒక అద్భుత రచయితను కోల్పోయింది. ఆయన వ్రాసినది మొత్తం 7 నవలలు, కాసిని కథలు. కాని అన్నిట్లోనూ కట్టిపడేసేది ఆయన శైలి, తన చిత్తూరు జిల్లా మాండలికం. మనకు తెలియని ఎన్నెన్నో మాటలు, ఆ జిల్లాలో వాడుకలో ఉన్నవి వారి రచనలలో మనం చూసి తెలుసుకోవచ్చు. ఆయన పుస్తకాల్లో  ఆయన వాడిన మాటల అర్ధాలు నవల చివరలో ఇచ్చిన  సందర్భం ఉన్నది. 

ఆయన రచనలు సాహస కథ (అతడు అడవిని జయించాడు) దగ్గర నుంచి డిటెక్టివ్ నవల తీరులో జరిగే మునెమ్మ వరకూ వైవిధ్యభరితమైన రచనలు. దాదాపుగా ఆయన స్వీయ అనుభవం అనిపించే నవల "సిటీ బ్యూటిఫుల్". ఈ ఒక్క నవలలో మాత్రం ఆయన హాస్యరసాన్ని కూడా  పండించారు. ఈ "సిటీ బ్యూటిఫుల్" నవల మొదటిసారి ఆంధ్ర జ్యోతి వారపత్రికలో ధారావాహికగా వచ్చేది. ఈ నవల నన్ను ఎంతగా ఆకర్షించింది అంటే, (అప్పట్లో వరంగల్లు లో పనిచేశేవాణ్ణి) పత్రిక కొనటం ఆలశ్యం ఆ షాపు దగ్గరే నిలబడి చదివేసే వాణ్ణి. ఈ కథలో హీరో తన కథ తానే చెప్పుకునే పధ్ధతిలో రెడ్డిగారు వ్రాశారు. ఈ హీరోకు ఒక పడికట్టు మాట ఉంటుంది, తన దృష్టిలో సవ్యంగా ఆలోచించలేని వాళ్ళను "ఇంబిసైల్ (IMBECILE)  ముండాకొడుకులు" అని కొట్టి పారేస్తూ ఉంటాడు. ఈ అలవాటును కాపీ కొడుతూ  నేను కూడా  ఈ మాటను వాడే బలహీనత  ఆపుడప్పుడూ  చూపిస్తూ ఉంటాను. 

మరొక ముఖ్య విశేషం ఏమంటే, రెడ్డిగారి కథలు అన్నీ కూడా, కథ మొత్తం కూడా ఒకరోజు నుంచి అతి కొద్దిరోజులు మాత్రమే జరుగుతాయి. ఎక్కువ కథలు ఒక్కరోజున సంఘటనల సమాహారమే!

ఆయన నవలల్లో కథల్లో పెద్ద ఘోప్ప హీరోలు ఎవ్వరూ ఉండరు. అందరూ అతి సామాన్యమైన రైతులు, రైతు కూలీలు. ఆయన భయానక రసాన్ని ఎక్కువగా తన నవలల్లో గుప్పించి సమాజాన్ని ఉలిక్కిపడేట్టు చేసి  మన  మధ్యనే తోటి మనుష్యులకు సమాజంలో గోప్పవాళ్ళుగా చెలామణీ అవుతున్న వాళ్ళు చేస్తున్న ఘోరమైన అన్యాయాలను ఎత్తి చూపిస్తారు. చదువుతుంటే మనకంటే తక్కువ స్థితిలో ఉన్న, అతి సామాన్యంగా బతికే బడుగు జీవుల పట్ల మన దృక్పథం మారిపోయి వాళ్ళను కూడా మన పాత అలవాట్లను తప్పించుకుని మనుష్యులుగా చూడటం నేర్చుకునే ప్రయత్నం చేస్తాము. 

వృత్తి రీత్యా ఆయన డాక్టరుగా రోగులకు చికిత్స చేస్తారు  (స్కిన్ స్పెషలిస్టుగా కుష్టు రోగులకు వైద్య సేవలు అందించారు) కాని, ఆయన రోగులకు చేసిన చికిత్స కంటే, తన నవలల ద్వారా, కథల ద్వారా,  సమాజానికి ఎంతో అవసరమైన  చికిత్సచేశారు. ఆ చికిత్సకూడా ఏవో పనికిరాని విదేశీ ఇజాలకు  బందీ అయిపోయి వ్రాసిన రచయిత కాదు రెడ్డి గారు. 

మనకు లేని భావాన్ని, లోకం కోసం ఉన్నట్టుగా నటించటం, అటువంటి దొంగ బుద్దినే లౌక్యం అని కప్పి పుచ్చుకుంటూ ఉంటారు. అటువంటి నటన, లౌక్యం అంటే అస్సలు పడదు రెడ్డిగారికి. ఆయన తాను రచయిత ఎందుకు అయ్యానో వివరించిన పద్ధతి విని తీరాలిసిందే. ఏమాత్రం భేషజం లేకుండా తన రచనా వ్యాసంగం గురించి, తాను చేసిన రచనల గురించి నిర్మొహమాటంగా  తన జవాబులతో, స్పందనతో ఎవరినో మెప్పించాలి అన్న బలహీనతకు లోను కాకుండా సూటిగా జవాబులు చెప్పారు   

రెడ్డిగారి గురించి నేను వ్రాయటం కంటే కూడా, ఆయన గొంతులోనే తన విషయాలు, తన రచనల గురించి వారు చెబుతూ వింటే చాలా అద్భుతంగా  ఉంటుంది. 

తాడేపల్లి పతంజలిగారు(క్లిక్) ఆకాశవాణి నిజామాబాదు కేద్రం వారికోసం      కేశవరెడ్డిగారితో చక్కటి ఇంటర్వ్యూ చేశారు. దాదాపుగా మూడుగంటల ఇంటర్వ్యూ అది. పతంజలిగారు తన వెబ్సైటులో ఆరు భాగాలుగా ఉంచారు. మొత్తం ఒకటే ఫైలుగా చేసి, వీడియోగా మార్చి ఫేస్ బుక్ స్నేహితులకోసం తయారు చేశాను. ఈ ఇంటర్వ్యూ ఆరు భాగాలుగా  ఆకాశవాణి  నిజామాబాదు ఎఫ్ ఎం కేంద్రం నుండి ప్రసారం అయ్యిందట. తాడేపల్లి పతంజలి గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఆయన అందించిన అపురూప ఇంటర్వ్యూను ఈ కింద ఇస్తున్నాను.

మరొక్క ముఖ్యమైన మాట వ్రాసి ముగిస్తాను. ఈ మా మాటలు నావి కాదు. అంబటి సురేద్ర రాజుగారు కేశవరెడ్డి రచనల గురించి అన్న మాటలు:

"తెలుగు భాష మాట్లాడే ప్రాంతంలో పుట్టి, తెలుగు భాష చదవడం వచ్చి, ఆ భాషలో నవలలు చదివిన వాడికి మునుపెప్పుడూ కలగని అనుభవం కేశవరెడ్డి నవలలు చదివితే కలుగుతుంది"

"నవలల్లో రచయిత ప్రతి సన్నివేశాన్ని దృశ్యమానం చేస్తారు "Writing as showing" కి కేశవరెడ్డి నవలలను మించిన దృష్టాంతం తెలుగులో మరొకటి లేదు. అన్నీ పాఠకుల కళ్ళముందే జరుగుతాయి. పాఠకుడు ప్రతి కథనానికి ప్రత్యక్ష సాక్షి అవుతాడు. ప్రేక్షక పాత్రను దాటి దృశ్యంలో పాత్రగా, కథలో భాగస్వామిగా లీనమైపోయే పరిస్థితిని రచయిత కల్పిస్తారు...."

"...కేశవరెడ్డి నవలలతో విషయపరంగానే కాకుండా రూపపరంగా కూడా గొప్ప సినిమాలు తీయవచ్చు. స్క్రీన్ ప్లే మళ్ళీ వ్రాసుకోనవసరం లేనంత గొప్పగా ఉంటాయి ఆయన నవలలు. హెమింగ్‌వే వంటి రచయితలతో పోల్చదగిన నవలా రచయిత కేశవరెడ్డి".

 చిట్ట చివరగా ఒకవిషయం తప్పకుండా చెప్పాలి. 

తాడేపల్లి పతంజలిగారి పుణ్యమా అని కేశవరెడ్డి గారి గొంతు విని, ఆయన గంభీరమైన గొంతుకు అభిమాని అయిపోయాను. ముంబాయిలో లోకల్ రైళ్ళల్లో  ప్రయాణిస్తూ ఈ ఇంటర్వ్యూను అనేక సార్లు విన్నాను. నాకు తీరకుండా మిగిలిపోయిన కోరిక ఆయన నవలలు, కథలు ఆయన గొంతులోనే ఆడియో పుస్తకాలుగా వినగలగటం. ఆయన నవలలు అన్నీ కూడా ఆడియో పుస్తకాలుగా ఆయనే చదివి ఉంటే ఎంత అద్భుతంగా ఉండేదో కదా అని నేను,  అనిల్ బత్తుల ఈ మధ్యనే ఐదారు నెలల క్రితం కలలు కన్నాము. అనిల్,  తనకు కేశవరెడ్డి గారు వ్యక్తిగతంగా తెలుసునని, ఆయన పుస్తకాలు ఆడియో పుస్తకాలుగా తీసుకు రావటానికి ప్రయత్నం చేస్తానని అన్నారు. కాని రెడ్డిగారి అనారోగ్యం గురించి తెలియక అన్న మాటలు అని ఇప్పుడు అనిపిస్తున్నది. మృత్యువు తెలుగు సాహితీ రంగానికి చెందిన  ఒక విలువైన రచయతను తనదైన పధ్ధతిలో హఠాత్తుగా తీసుకుని వెళ్ళిపోయింది. 

సాహితీ అభిమానులకు ఆయన పుస్తకాలే జ్ఞాపకాలుగా వదిలి పెట్టి రెడ్డిగారు వెళ్ళిపోయారు. శారీరకంగా మన మధ్య కేశవరెడ్డి గారు లేకపోయినా ఆయన రచనల ద్వారా ఆయన ఎప్పటికీ చిరంజీవే.   ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను. 
oooOooo


ఫేస్ బుక్ లో  చూశాను. ఆ వ్యాసం ఈ కింది  చదువుకోవచ్చు

కేశవ రెడ్డి గారి మీద ఫేస్ బుక్ లో వ్యాసం



కొసమెరుపు 

సాక్షి పత్రిక ఎటువంటి పక్షపాత పత్రిక అయినప్పటికీ ఈ పత్రికలో సాహిత్య విషయాలు వ్రాసే మంచి టీమ్ ఉన్నదన్న విషయం తెలుస్తున్నది. కేశవరెడ్డిగారి గురించిన వార్త అర్ధవంతంగా ఆయన పాఠకుల చేత అభిప్రాయాలు చెప్పించి నివాళి అర్పించారు. ఈ కింది లింకు నొక్కి సాక్షి పత్రికలో వచ్చిన వార్త, అంతకంటే ముఖ్యం అక్కడే ఉన్న వీడియో చూడగలరు. లింకు ఐతే ఇచ్చాను కాని, అదే లింకులో ఆ వార్తపత్రిక వాళ్ళు ఎన్నాళ్ళు  ఉంచుతారో తెలియని విషయం. కొన్ని రోజులు పోయిన తరువాత వచ్చి ఈ లింకు నొక్కి సంబంధిత వీడియో కనపడకపోతే  మనం చెయ్యగలిగినది ఏమీ లేదు కదా!

4 కామెంట్‌లు:

  1. పత్రికల పక్షపాతాల గురించి చెప్పాలంటే వేరే సందర్భాన్ని ఎంచుకుని ఉంటే బాగుండేదేమో !

    రిప్లయితొలగించండి

  2. సాక్షి పత్రిక వారు వారి సాహిత్య విభాగంలో బ్లాగులొ నా వ్యాసంలో ముఖ్య భాగాన్ని 21 ఫిబ్రవరి 2015 ప్రచురించారు. ఈ కింది లింకు నొక్కి ఆ వ్యాసం చదువవచ్చు

    http://epaper.sakshi.com/apnews/Andhrapradesh-Main/21022015/8

    రిప్లయితొలగించండి
  3. ఈ వ్యాసం, వీడియో వెనుక మీ శ్రద్ధ, శ్రమ డా||కేశవరెడ్డి గారి రచనలపై మీ ప్రేమ తెలియచేస్తున్నాయి. ఆయన తెలుగులో నిస్సందేహంగా ఒక విశిష్ట రచయిత.

    రిప్లయితొలగించండి
  4. `అతడు అడివిని జయించాడు` చదివానండి. క్రైసిస్ మేనేజ్‌మెంట్‌ని ప్రాతిపదికగా తీసుకొని రచన చేసినట్టు అనిపిస్తుంది. కేశవరెడ్డి గారి గురించి మీ వ్యాసం చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.