8, సెప్టెంబర్ 2013, ఆదివారం

భక్తులు వచ్చేస్తున్నారే అమ్మా ఎలాగే...అయ్యో

                                  ఇది ఈ బ్లాగులో 400వ వ్యాసం  
ఫోటో కర్టెసీ ప్లాంట్స్ బ్లాగ్

 అమ్మా వచ్చేస్తున్నారే, అమ్మా నా పీక కోసేస్తారే అమ్మా ఎలాగే అమ్మా. నీ అంత అవుదామనుకున్నానే....అమ్మో భయం వేస్తున్నది.... ఎంతమంది వస్తున్నారో .

తల్లి భయపడకు భయపడకు . ఏమి చేస్తాం భగవంతుడు మనల్ని అలా పుట్టించాడు. మనం కదిలి మరొకచోటుకు వెళ్ళలేం. పారిపోలేము. అమ్మా ఒక్క సారి నా వంకకు నీ ఆకులు వంచు తల్లి ఒక్కసారి నిన్ను నిమురుతాను. భయపడకమ్మా భయపడకు దేవుణ్ణి ప్రార్ధించు వచ్చే జన్మలోనన్నా చెట్టు గా కాకుండా మరొక జన్మనిస్తాడు.

డజన్లకొద్దీ జనం చేతుల్లో కత్తులు పట్టుకుని కసకసా కోసేస్తున్నారు. అమ్మా.. ఆమ్మా తొక్కేస్తునా....ఖస్....అమ్మా ఉంటానే శల...  ....ఖసా....అయ్యయ్యో చెల్లెల్ని కోశే.....ఖస్.....

వచ్చినంత తీవ్రంగానూ వెళ్ళిపోయింది గుంపు. తెగ్గొసిన అరటి పిలకల

శవాలను చేతుల్లో పట్టుకుని. పెద్ద చెట్లన్నీ స్థబ్దుగా ఐపోయినాయి దు:ఖం పట్టలేకుండా ఉన్నాయి. అయ్యయో చుట్టూ జరిగిన మారణ హోమం చూస్తూ ఏమి చెయ్యలేని వాళ్ళను చేశావా ఓ భగవాన్ అంటూ మూగగా రోదిస్తున్నాయి.

ఈ అరటి పిలకల "శవాలన్నీ" రోడ్ల మీద పోగేశారు. "భక్తులు" గుమికూడారు. ఇవ్వాళే భగవంతుడు గుర్తుకొచ్చాడు.  ఎవరు చెప్పారో తెలియదు పూజ అంటె మొక్కల్ని నాశనం చెయ్యటం గా ఉన్నది. ఒక్కొక్కళ్ళే బేరమాడి మరీ అరటి పిలకల "శవాలను" ఆనందంగా కొని తీసుకెళ్ళిపోతున్నారు.
చెన్నై లో క్రితం దసరాకు రోడ్ల మీద అరటి పిలకలు పారేసి పోయిన వైనం 
ఫోటో కర్టెసీ ది  హిందూ వార్తా పత్రిక
 
మర్నాటికి అమ్ముడుపోని అరటి పిలకలన్నీ అలా రోడ్ల మీద పారేసి పోవటం. బెంగుళూరులో 2010 లో అనుకుంటాను, ఇలా పారేసి పోయిన అరటి పిలకలను రోడ్లమీద నుంచి తొలగించటానికి బుల్  డోజర్ తీసుకు రావలిసి వచ్చింది.
-----

మరొక చోట. ఏమర్రా అందరూ ఎలా ఉన్నారు. అయిపోయింది మన జీవితాలు కొద్ది గంటలే. నిన్న ఎవడో వచ్చి మనల్ని చూసి పొయ్యాడు. మన ఆకులు తెగ్గోసుకు పోతాడు. మనం ఎండి కృశించి పైకి వెళ్ళిపోతాం. మొన్నొక పెద్దాయన అంటున్నాడు  కూడా మన ఆకుల్ని పూజ చెయ్యాలని ఏ పుస్తకంలోనూ వ్రాయలేదట. ఆ అకులు వేరట, పెద్ద పెద్ద చెట్ల  ఆకుల్ని మాత్రమే వాడాలని వ్రాశారుట. ఏమి లాభం, వెర్రి భక్తులకి తేడా తెలియద్దూ. వినాయక చవితి వస్తే చాలు ఎక్కడెక్కడి చెట్టూ చేమా ధ్వంసం చెయ్యటం, పాపం ఆ గణపయ్య నెత్తిన వేసి తీసీ తియ్యనట్టుగా రెండు  గుంజీలు తియ్యటం. సరేనర్రా అదిగో వచ్చేస్తున్నారు వ్యాపార భక్తులు. ఇక శలవు మనం ఉన్నన్నాళ్ళూ ఇక్కడ బాగానే ఉన్నాము. మరు జన్మన్మంటూ ఉంటే, చెట్టుగా పుట్టనే కూడదు.

-----

అబ్బబ్బ ఏమిటమ్మా నా ఆకులు అన్నీ పీకేస్తున్నారు. రేపట్నించీ నేను  తిండెలా తయారు చెయ్యాలే. అయ్యయ్యో కింది కొమ్మలన్నీ కొట్టేస్తున్నారు. అబ్బా ఎంత నెప్పి....అయ్యయ్యో.. ఇదంతా భక్తే! అయ్యో ఏమి వెర్రివాళ్ళయిపోయార్రా మనుష్యులు  ఈ రోజున. పాపం ఆ పూర్వపు వెర్రి నాయనలు, అందరూ తమ తమ ఇళ్ళల్లొ చెట్లు వేసి పెంచుకోవాలని, భక్తి
ఈ బొమ్మ ఫేస్ బుక్ లో మాజ్టి పేజీలో ఉన్నది
రూపకంగా, ఎవరింట్లో వాళ్ళు పెంచుకున్న ఆ చెట్టు పెద్దవైనక
కాసినిఆకులు కోసి  పూజ చెయ్యలంటె, వీళ్ళు చూడు ఇప్పుడు ఇళ్ళల్లో ఒక్క చెట్టు లేకుండా చేసుకుని, పండగ  అనంగానే చెట్టు గుర్తుకు వచ్చి, ఉన్న కాసిని మందిమి ఇక్కడేదో కాలక్షేపం చేస్తుంటే మన జీవితాలు ధ్వంసం చేస్తున్నారు. వీళ్ళు పీకేసిన  నరికేసిన ఆకులూ కొమ్మలూ పెరగటానికి మరొక సంవత్సరం కంటే ఎక్కువే పడుతుంది.  ఈలోగా మళ్ళీ పండుగ మళ్ళీ వీళ్ళ దాడి....వచ్చే జన్మలోనన్నా చెట్టుగా పుట్ట కూడదు.

పైన దేవుళ్ళు, దేవతలు అంతా గుమికూడి చూస్తున్నారు. భూలోకం నుంచి ఎమిటీ ప్రకంపనలు.ఏమిటి ఇంతటి ఘోష వినపడుతున్నది. చెట్లూ మొక్కలూ తమను  మరు జన్మలో వేరే విధంగా పుట్టించమని కొరుతున్నాయి. ఏమయ్యింది మళ్ళీ ఈ మనుష్యులు  మారణహోమం సృష్టిస్తున్నారా. అయ్యా బ్రహ్మ గారూ ఈ మనుషుల్ని ఇలా ఎందుకు చేశారండీ అని కోపంగా ఒక పిల్ల దేవత కళ్ళెర్ర చెయ్యబోతే ఒక పెద్ద దేవత వాణ్ణి సముదాయిస్తున్నాడు.

రావలిసిన పెద్ద తలకాయలన్నీ వచ్చేసినాయి. చెట్లు, మొక్కలు, పిల్ల చెట్లు, పెద్ద చెట్లు అన్నిటి బాధా కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు. వెంటనే వరుణ, వాయు, సముద్రాదులను  పిలిపించారు. యముణ్ణి కూడా రమ్మని కబురు వెళ్ళింది.  వారందరికీ  త్రిమూర్తులు, చాలా  కోపంగా ఏదో చెప్పారు-

ఫోటో కర్టెసీ వేపర్ లైఫ్ బ్లాగ్
వరుణా ఇక నుంచి నువ్వు...........

సూర్యా, ఏమిటిది,  అలా కాదు, ఇక నుంచి నీ ఉష్ణ ప్రసారం ఇలా.......... ఇలా ..... ఉండాలి

వాయుదేవా నువ్వు వరుణునితో కలిసి ఉండు.......నువ్వు ఇలా......... చెయ్యాలి

సముద్రా.........ఆ గంభీరం చాలించి ఇది విను.మాకు తెలుసు నువ్వు ఎంత మండిపడుతూ బడబాగ్నిని కదుపులో దాచుకున్నావో. ఇక దాచుకోకు......ఇకనుంచి ఇలా........ఇలా చెయ్యాలి

మనం చూస్తున్న కొద్దీ ఈ మనుష్యులు పేట్రేగి పోతున్నారు! భూమికి పురుగు పట్టినట్టుగా పట్టి సర్వం ధ్వంసం చేస్తూనే ఉన్నారు. అప్పటికీ గత ఒకటి-ఒకటిన్నర రోజులనుంచీ (మన శతాబ్దం వాళ్ళకు ఒక్కరోజుట) మెల్ల మెల్లగా చెబుతూనే ఉన్నాము.

ఏమయ్యా యమా! అలా డాక్టర్లను చూసి వణుకుతున్నావేమయ్యా!?.....మేము వ్రాసిన ప్రకారమే ఇక అందరినీ పట్టుకొచ్చెయ్యి...ముఖ్యంగా మనుష్యుల్ని, అందులోనూ ధ్వంస పూజ చేసే వాళ్ళను ముందుగా.....మేము వ్రాసిన దానికంటే ముందుగానే  తెలిసిందా? తెలిసిందన్నట్టుగా యముడు  తల ఊపాడే కాని వాళ్ళ వంక చూసి అవునని  చెప్పే ధైర్యం చెయ్యలేకపొయ్యాడు. యముడికే ఇంత భయం వేసిందంటే, త్రిమూర్తులకు ఎంతటి కోపం  ఉండాలి!

ఇలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ, పెద్ద దేవుళ్ళందరూ, ఒక పక్కగా తల వంచుకు నిలబడిన  వినాయకుడి వంక చూసి, చూడు  నాయనా వినాయకా అప్పుడెప్పుడో నువ్వు నీ విగ్రహాలతో పాలు తాగినట్టు ఒక చమక్కు చేశావు. ఈ వెర్రి మనుష్యులు విరగపడ్డారు. చివరకు పిల్లలకు కూడా పాలు పొయ్యకుండా నీ బొమ్మ తొండానికి అందించారు. నువ్వు పీల్చి  పారేశావుట...... అలా అని వాళ్ళ  టివి  విలు పేపర్లు ఊదరగొడుతూ, తెగ ఘోషించినాయి. ఆ రోజు రాత్రంతా అదే గోల.

అలా ఒకసారి ఇంట్లో పెంచకుండాం, చెట్లు నాశనం చేసి తెచ్చిన ఆకులు, పూవులు తెచ్చి పూజ చేస్తే, నీ విగ్రహం  బీట్లిచ్చినట్టుగా ఒకసారి చూపించు. లేదంటే, నీ విగ్రహాల నుంచి కన్నీళ్ళు కురిపించు. కనీసం భయపడైనా ఈ మనుష్యులు ఈ ధ్వంస పూజ మానుతారేమో.

బ్రహ్మయ్యా....అసలు దీనికంతటికీ నువ్వే కారణమయ్య....ఒక్కొక్కడికి ఆలోచనలు మనం చెప్పినట్టు పెట్టమంటే బధ్ధకించి, ఎవడికి వాడు ఆలోచించేట్టుగా ఇచ్చేశావు. రాబొయ్యే వాళ్ళకన్నా ఆ బుధ్ధి తగ్గించు అసలే అతి తెలివి అదికూడా మరీ ఎక్కువయ్యిపోయింది, ఈ మనుష్య జాతికి. 

నారదుడు పక్కనుంచి అంతా గమనిస్తూ, మనం కొంతమంది మనుష్యులను కొంతలో కొంత బుధ్ధి జ్ఞానాలు ప్రచారం చెయ్యమని  మన ప్రతినిధులుగా స్వామీజీల రూపంలో పంపిస్తే వీళ్లేమిటి, హాయిగా ఆశ్రమాల్లో కూచుని......కూచునేమిటి....... ఛ...
...ఛీ....  బ్రహ్మచారినైన నాలాంటివాడు చూడకూడని, అసలు మనిషైన వాడు ఉచ్చరించటం కోడా చెయ్యకూడని  పనులు చేస్తున్నారు........ఇలాంటి వాళ్ళు మిగిలిన మనుష్యులకు బుధ్ధేమి చెప్తారు!

నారదా ఈ సమయంలో కూడానా నీ కలహ ప్రియత్వం! నువ్వు  పుల్లలు పెడితే కాని తెలుసుకోలేమనుకున్నావా నారదా? మాకు తెలుసు ఈ స్వామీజీల గురించి.  అందరూ అలాంటి వాళ్ళు కాదనుకో, కాని దుష్ట స్వామీజీలకు  ఎలాంటి శిక్షలు వెయ్యాలో మాకు తెలుసు. వేస్తూనే ఉన్నాము. ఒక్కొక్కళ్ళ అంత:స్వరూపాలు బయటపడేట్టుగా చేస్తున్నాం. అది చాలు వాళ్ళ ప్రాణానికి. 


ఇలా పెద్ద దేవుళ్ళందరూ తీవ్రమైన నిర్ణయాలు తీసేసుకుని వడివడిగా వెళ్ళిపోతున్నారు............వెళ్ళిపోతున్నారు.........వెళుతూ......తూ......తూ  ఉన్నారు, అరే ఇదేమిటి ఈ సెల్ మోగుతోంది. ఇక్కడా సెల్ ఫోన్లు వచ్చేశాయా....అదీ సంగతి తెల్లారి ఐదయ్యింది, అలారం మోగుతున్నది. ఎమిటిదంతా కలేనా?  అయ్యో!!  నిజమనిపించిందే!....ఏమయినా దేవుళ్ళే , కల్పాల బట్టీ వాళ్ళకు పట్టిన పూజా/యజ్ఞ బధ్ధకాలను వదిలించుకుని ప్రపంచ  పరిపాలన తమ చేతుల్లో తీసుకోవాలి లేదంటె ఈ మానవజాతి ఈ భూలోకాన్ని ఆ పైన వీళ్ళకు కనపడుతున్న ఇతర ప్రపంచాన్ని   కూడా ధ్వంసం చేసి పారేస్తుంది. 

ఫోటో కర్టెసీ రాధే శ్యాం బ్లాగ్ "సొంత ఘోష"

 ప్రకృతిని ధ్వంసo చెయ్యకుండా వినాయక  చవితి జరుపు కుంటున్న  అసలు సిసలైన భక్తులందరికీ శుభాకాంక్షలు

 
**********************************
పైన ఉన్న వ్యాసాలు కాక, నా ఫొటో బ్లాగులో, క్రితం  సంవత్సరం ముంబాయిలో వినాయక చవితి పేరుతో అర్ధం పర్ధం లేని  అపచార విగ్రహ ప్రతిష్టల గురించిన ఫొటో వ్యాసం. ముంబాయి వంటి మహానగరంలో అన్ని వినాయక పందిళ్ళకు వెళ్ళి ఫొటోలు తీయలేము కదా. అందుకని నిమజ్జనానికి సముద్రం (గిర్గావ్ చౌపాటీ) దగ్గర కాపు వేసి, తీసిన ఫొటోలు  ఈ కింది లింకు నొక్కి చదువవచ్చు. 

**********************************
      ===================================== 
నవీకరించబడిన తేదీ 20 05 2015 
(మాజ్టి ఫేస్ బుక్ ఫోటో)

9 వ్యాఖ్యలు:

 1. మీ కల నిజమవ్వాలి. ఇప్పటికే మట్టి విగ్రహాల వైపు వస్తున్న చైతన్యం , పర్యావరణ పరిరక్షణలో ప్రధాన భాగమైన చెట్లను కాపాడడానికి ప్రజల్లో చైతన్యం పెరగాలని ఆశిద్దాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ధన్యవాదాలు కొండలరావుగారూ.

  మీ ప్ర జ వెబ్ సైటులో, ఈ విషయం గురించి ప్రశ్న ఒకటి సంధించండి. చర్చలు వస్తాయో వాగ్యుధ్ధాలు జరుగుతాయో లేక వాదనలతోనే సరిపెట్టుకుంటారో చూద్దాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మొక్కలను విచక్షణారహితంగా ఉపయోగించటం విచారకరం. మట్టి వినాయకులను పూజించి, ప్రకృతిని కాలుష్యం నుంచి కాపాడుదాం.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ధన్యవాదాలు రావు గారూ.

   మీకు మీ కుటుంబానికి వినాయకచవితి శుభాకాంక్షలు

   తొలగించు
 4. మొక్కలను విచక్షణారహితంగా ఉపయోగించటం విచారకరం. మట్టి వినాయకులను పూజించి, ప్రకృతిని కాలుష్యం నుంచి కాపాడుదాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.

  శివ గారు, బాగున్నది మీ "మొక్కల విలాపం".....నిజమే పూజ చెయ్యమన్నది చెట్లని పెంచండి అనే ఒక మంచి ఉద్దేశం కోసం అయితే.....డబ్బు యావలో పడి.... ఇళ్ళలో చెట్లని కొట్టివేయ్యటమే కాకుండా........ పండగ రోజున బయలుదేరి చుట్టూ ప్రక్కల ఉన్న మిగిలిన చెట్లని కూడా ధ్వసం చేసి పారేస్తున్నారు.

  హిందూ పూజలన్నిటిలో పరమార్ధం..... నీకున్న దానిలో పది మందికి పెట్టు.....ప్రకృతిని పెంచి పోషించి ప్రేమించు అన్నదే.......అది పోయి కేవలం చెట్ల చివర ఉన్న పూల కోసం, కాయల కోసమే కానీ, చెట్టు మొదలుని పట్టించుకొన్న వాడు లేకపోవటంతో... పండగలన్నీ దండగాలుగా మారిపోతున్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ధన్యవాదాలు రాధాకృష్ణా.

  "చెట్ల చివర ఉన్న పూల కోసం, కాయల కోసమే కానీ, చెట్టు మొదలుని పట్టించుకొన్న వాడు లేకపోవటం" మంచి టాగ్ లైన్. బాగున్నది.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. వ్యాపార భక్తులు, ధ్వంసపూజ పద ప్రయోగాలు బావున్నాయి శివరామకృష్ణగారూ!

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.