21, మార్చి 2018, బుధవారం

వరంగల్లు లో "అమ్మగారు"


 రాజ్యలక్ష్మి గారు వారి భర్త కోటయ్య గారు 


సంవత్సరం 1983. అప్పుడే బాంకులో ఉద్యోగం వచ్చింది. వేరే ఉద్యోగం కొన్నాళ్ళు చేసి, అది మానేసి బాంకులో చేరిన రోజులు. పూర్వపు ఉద్యోగంలో
స్నేహితుడు పూర్ణచంద్ర రావు (ఎడమ పక్కన) మరొక స్నేహితుడు గణపతి (కుడిపక్కన) 

నాకు క్వార్టర్స్ ఇచ్చి ముద్దుగా చూసుకున్నా కూడా, బ్యాంకు  ఉద్యోగం మీది మోజుతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, బాంకులో చేరిన కొత్త రోజులు. వరంగల్లు నగరం నాకు కొత్త కాకపోయినా, ఇల్లు వెతుక్కోవటం కొత్త. ఆ కొరత తీరుస్తూ అప్పటికి కోలీగ్ మాత్రమె, ఇప్పుడు గొప్ప స్నేహితుడు పూర్ణచంద్రరావు తన రూములో ఆశ్రయం ఇచ్చాడు. మరి తిండి!? ఇదొక సమస్య. 


అప్పటికి వరంగల్లులో ఒక "పూటకూళ్ళ" ఇల్లుగా సినిమాల్లో మాత్రమె చూసిన అద్భుత ఏర్పాటు  ఒకటి ఉండేది. 1983 లో కూడా! వరంగల్లు తెలిసిన వాళ్ళుకు పరిచయం ఉండచ్చు, అక్కడ "ఆకారపు వారి గుడి" ఉండేది. అంటే "ఆకారపు" వారు కట్టించిన చక్కటి గుడి. ఎంతో అద్భుతంగా కట్టించారు. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నది.  ఆ భోజన సమస్య తీర్చిన ఆవిడ పేరు రాజ్యలక్ష్మి గారు.  ఆవిడ భర్త కోటయ్య గారు ఆ గుడిలో పూజారిగా ఉండేవారు.

చాలా లిమిటెడ్ గా పొద్దున్న పూట మాత్రమె బాంకు/ఎల్ ఐ సి ఉద్యోగులకు మాత్రమె ఆవిడ భోజనం పెట్టేవారు. ఆవిడ దగ్గర భోజనం చేయాలి అంటే, ఆ వ్యక్తిని ఆవిడ చూసి ఇంటర్వ్యూ చేసి నచ్చితేనే ఒప్పుకునేవారు లేదంటే నాకు కుదరదు బాబూ, ఇప్పటికే ఎక్కుమంది  అయిపోయ్యారు అనేసేవారు. అదృష్టం బాగుండి, నేను ఆ ఇంటర్వ్యూలో నెగ్గాను. కాబట్టి శ్రీమతిని తీసుకుని వచ్చి (అప్పటికే నాకు పెళ్ళి అయ్యింది) కాపురం పెట్టేదాకా రెండు మూడు నెలలు ఆవిడ చేతి భోజనం తిన్నాను. ఆవిడ దగ్గర తిన్న భోజనాలు తక్కువే అయినా కూడా, మూడు దశాబ్దాల తరువాత కూడా ఇంకా గుర్తున్నది. కారణం ఆవిడ భోజనం పెట్టె పద్ధతి. మాకు దగ్గిర చుట్టం లాగా, స్వతం తల్లి లాగ కొసరి కొసరి వడ్డించి భోజనం పెట్టేది.

సరిగ్గా తినకపోతే కేకలేసేది. ఆవిడ చేతి వంట అద్భుతం ఐతే, ఆవిడ భోజన పెట్టె పద్ధతి పరమాద్భుతం. ఎంతో బాగుండేది. పండుగలు వస్తే స్పెషల్ భోజనాలు, వేరే ఎక్సట్రా చార్జీలు లేకుండానె! బాగా గుర్తుండే పండుగ రక్షా బంధన్ పండుగ. అద్భుతంగా చేసేవాళ్ళు. ఆరోజున ఆవిడ చేసిన భోజనం తిని ఆఫీసుకు వెళ్ళటం ఎంతో కష్టంగా ఉండి, ఆఫీసులో భుక్తాయాసంతో బాధపడ్డ గుర్తు.


1987 వచ్చేప్పటికి ఆవిడ చాకిరీ చెయ్యలేక భోజనాలు పెట్టటం మానేశారు. అప్పుడప్పుడూ,  ఆ గుడికి వెళ్ళినప్పుడల్లా, వెనకాలే ఉన్న వాళ్ళింటికి వెళ్ళి ఆవిడను చూసి రావటం అలవాటుగా ఉండేది. 1988 లో వరంగల్ వదిలేసి విజయవాడ  వెళ్ళిపోయ్యాము. 1989 లో    ఎల్ ఎఫ్ సి లో వెళ్ళినప్పుడు  కూడా వెళ్ళి ఆవిడను పరామర్శించి వచ్చాము 

ముందుగా ఆవిడ భర్త కోటయ్య గారు వెళ్ళిపొయ్యారు, తరువాత 1991 లో అందరూ "అమ్మగారు" అని పిలుచుకునే రాజ్యలక్ష్మి గారు  పరమపదించారని తెలిసింది. మాకు వార్త తెలియటమే ఎప్పటికో తెలిసింది. 

ఎప్పుడన్నా ముంబాయి (అక్కడ 12సంవత్సరాలు పనిచేసాను) నుంచి విజయవాడ వెళ్ళేప్పుడు వరంగల్ మీదుగా రైలు వెడుతుంటే ఆవిడ బాగా గుర్తుకు వచ్చేవారు. 

అలా సర్వీసు అంతా వరంగల్, విజయవాడ, హైదరాబాదు, బెంగుళూరు ఆపైన ముంబాయిలో 34 సంవత్సరాలు ముగించుకుని ఈ మధ్యనే జూన్ 30 2017 రిటైర్ అయ్యిన తరువాత, ఇప్పటికి ఇన్ని సంవత్సరాల తరువాత, నేను నా స్నేహితుడు  పూర్ణచంద్రరావు చాలాసార్లు అనుకుని చివరకు పది రోజుల క్రితం వరంగల్ వెళ్ళాము. వెళ్ళంగానే చేసిన పని, ఆవిడ ఉండిన ఇల్లు చూడటాని వెళ్ళటమే. ఆ గుళ్ళో వారి మనుమడు శివకుమార్ తాతగారి చోటులో పూజారిగా పనిచేస్తున్నట్టుగా తెలుసు. 
వాళ్ళింటికి వెళ్ళటానికి దారి 

వాళ్ళింటికి వెళ్ళటానికి దారి 
చాలా ఆనందకర విషయం ఏమంటే, ఆగుడి, ఆ పరిసరాలు , రాజ్యలక్షమ్మ గారు ఉండి మాకు భోజనాలు పెట్టిన ఇల్లు అన్నీ కూడా మూడున్నర దశాబ్దాల క్రితం ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఏ మాత్రం మారలేదు. అక్కడే కాసేపు తిరుగాడి, పాత జ్ఞాపకాల బరువును బాగా మోసి, ఆయా చోట్లల్లో కాసేపు కూచుని ఆనందించి, వారి మనవడిని కలుసుకుని మిగిలిన ఊరు చూడటానికి వెళ్ళాము. 

 మేము భోజనాలు చేసిన హాలు. అప్పట్లో ఫ్రిజ్ టివి వంటివి లేవు ఖాళీగా ఉండేది 
విచిత్రం ఏమంటే, మేము అప్పుడు పనిచేసిన ఆఫీసు ఉన్న భవనం అప్పుడు ఎలా ఉన్నదో ఇప్పటికీ అలాగే ఉన్నది. కాకపొతే పైన మరొక అంతస్తు వేసారు. మాకు తెలిసిన "అమ్మగారి" ఇల్లు, మా ఆఫీసు అలాగే ఉండటం కొంత స్వాంతన కలిగించినా, పాత వైభవం లేక పోవటం (ఎలా ఉంటుందీ, ఉండదు అని తెలుసు,  అయినా ఎదో ఒక నోస్టాల్జియా) కొంత బాధ కలిగించిన మాట వాస్తవం. మిగిలిన ఊరు అస్సలు గుర్తు పట్టటానికి వీలులేకుండా మారిపోయింది, పెరిగిపోయింది. మేము అక్కడే పోచమ్మ మైదాన్ ఎదురుగా పోతన టెలిఫోన్ భవన్ ప్రాంతంలో ఒక ఇంట్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ ఇల్లు పెద్ద హోటల్ గా మారిపోయింది, మేమున్న గదులు ఆ హోటల్ వాళ్ళు వంటకు వాడుతున్నారు.

అప్పటికి ఇప్పటికీ మారని కొన్ని ప్రాంతాల ఫోటోలు. గుర్తుకోసం తీసుకున్నాము. ఆ ఫోటోలు ఆ గుర్తుల వెనుక ఎన్నో తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవటానికి పనికి వస్తాయి. ఆవిడ దగ్గర భోజనం చేసిన వాళ్ళు అప్పట్లో బాంకుల్లో ఎల్ ఐ సి లో పనిచేసిన వాళ్ళు కొన్ని డజన్ల మంది ఉంటారు. ఈ వ్యాసానికి వాళ్ళల్లో ఎవరన్నా చూసే అదృష్టం పడితే, అంతకంటే సంతోషం మరొకటి లేదు. వారు వారి జ్ఞాపకాలను, వీలయితే ఫోటోలు పంచుకుంటే పరమాద్భుతం. 


1 వ్యాఖ్య:

  1. నేను ఆకారపు వారి గుడి ప్రాంగణంలోనే ఉన్న శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో 1967 నుండి 1972 వరకు అంటే ఐదేళ్ళు చదువుకున్నాను. కాని నాకు మీరు చెప్పిన రాజ్యలక్ష్మి, కోటయ్యల గురించి తెలియదు. వారి ఇల్లు బహుశా అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాల ప్రక్కన ఉందనుకుంటా... మా వరంగల్లుతో మీకున్న అనుబంధాన్ని చదివి ఆనందించాను.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.