జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, జనవరి 2011, ఆదివారం

మా చందమామయ్య


"అవ్వొక రోజులూ" అని మా చిన్న తనంలో పెద్ద వాళ్ళు అంటూ ఉంటే పెద్దగా అర్ధం అయ్యేది కాదు. ఐదుపదులు దాటిన ఇప్పుడు పాత రోజులు తలచుకుంటే, అసంకల్పితంగా అవే మాటలు వస్తున్నాయి.

మా చిన్న తనంలో అంటే 1960, 1970 లలో చందమామ కొనాలంటే మేముండే చోట రెండే షాపులు ఒకటి చెవిటి దుర్గయ్య కొట్టు (పెద్ద డిపార్టుమెంటు స్టోర్ లాంటి కిళ్ళీ కొట్టు) లేదంటే పక్కనే ఉన్న రెడ్డిగారి కొట్టు. తరువాత్తరువాత జగ్గారావు షాపు.

చందమామ రావటం ఆలస్యం వారి వారి షాపుల ముందు చందమామలన్ని చక్కగా ఆలంరించేవాళ్ళు , వడ్డాది పాపయ్య గారి బొమ్మలతో ధగధగా మెరిసిపోతూ చందమామల్తో వాళ్ళ షాపులు వెలిగిపోయేవి. ఒక్క రోజు కంటే ఎక్కువసేపు కాపీలు మిగిలేవి కాదు. అందుకని, మేము వెంటనే ముప్పావలా కోసం ఇంటికి పరుగులు పెట్టి వెంటనే కొత్త కాపీ తీసుకుని బొమ్మలు చూసుకుంటూ ఇంటికి వెళ్ళేవాళ్ళం. కొంత కాలానికి రెడ్డిగారి షాపులో మాకు గుర్తింపు వచ్చింది. మాకోసం ఒక కాపీ ప్రత్యేకంగా ఉంచేవారు. కాబట్టి సాయంత్రం లోపల ఏదో ఒక టైములో చందమామను సంపాయించే అవకాశం చిక్కేది.

అలా పరిచయం అయిన రెడ్డిగారు మా కంటే చాలా పెద్ద వాడైనా మాకు మంచి స్నేహితుడు అయ్యాడు. మధ్య విజయవాడ వెళ్ళినప్పుడు ఆయన షాపు కనపడలేదు. ఏమయ్యిందో అని ఆరా తీస్తే వయోభారంతో షాపు తీసేసినట్టు తెలిసింది. ఈయన్ని కలుసుకోవటం ఎలా అని ఒకటి రెండు రోజులు అనుకుంటూ ఉండగా ఒకరోజున "మా చందామామయ్య" రెడ్డిగారు రోడ్డుమీదే మాకు తారస పడ్డారు. వెంటనే ఇద్దరం కలిసి ఒక ఫోటో దిగాం.

నా చందమామ జ్ఞాపకాల్లో ఉన్న రెడ్డిగారి తో ఫోటో తీయించుకోవటం ఒక తీపి జ్ఞాపకంగా ఉండిపోతుంది.

5, నవంబర్ 2010, శుక్రవారం

చందమామ సంపాదకుని రేడియో జ్ఞాపకాలు

మా రేడియో, మా ప్రపంచమూ...

పల్లె జీవితంలో రేడియో తెల్లవారకముందు అమ్మ పూజ చేస్తూ స్నానం చేసిన తర్వాత పూజ చేస్తూ భక్తి సంగీతం, భక్తి పాటలు వినడంకోసం రేడియో ఆన్ చేయడంతో మా ఇల్లు, పల్లె కూడా తెల్లారేది. సేద్యం పనులు, పొలంపనులు ఉన్నప్పడు వేకువ జామున నాలుగు గంటలకే పల్లె మేల్కొంటుంది. ఎద్దులకు కుడితి తాపి, మడక బండిలో వేసుకుని పొలం కేసి బయలుదేరేముందు చద్ది తాగి ఏడుగంటల వరకు మళ్లో పనిచేయడం..

ఊరి పక్కన పొలాల్లో పనిచేస్తున్నప్పుడయితే సరిగ్గా ఏడున్నరకు కడప రేడియోలో పాటల కోసమో మడి వద్దనుంచి ఏదో ఒక వంక పెట్టుకుని ఇంటికి వచ్చి 15 నిమిషాలు పాత పాటలు వినేసి మళ్లీ పరుగెత్తడం.. ఆ లోపలే నాన్నగాని, తాత గాని చూసారంటే పనిమాని పాటలు వింటున్నందుకు తిట్లు తప్పేవి కాదు మరి.


ఘంటసాల భగవద్గీత
ఎమ్సెస్ రామారావు సుందరకాండ.
పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవం (ఆడెనమ్మా శివుడు ఆడెనమ్మా భవుడు అంటూ పుట్టవర్తి వారి స్వరం రేడియోలో తాండవిస్తుంటే శివుడు తాండవమాడుతున్నట్లే అనిపించేది మాకు ఆ వయసులో.. )

ఘంటసాల లలితగీతాలు తలనిండ పూదండ దాల్చిన రాణీ, మొలకా నవ్వుల లోన వినిపించరావే.., బహుదూరపు పా

ఘంటసాల పద్యాలు.. పల్లెటూర్లలో బాల్యాన్ని ఉద్దీపింపజేసిన దివ్యగాన ఝరి


భానుమతి, సుశీల, లీల,జిక్కి, వసంతకుమారి, కోమల, మోహన్‌రాజ్, పిబి శ్రీనివాస్, మాధవపెద్ది, పిఠాపురం,
పాటలతో దివ్యత్వాన్ని అనుభవించిన మధుర భావనలు మాకు రేడియో ద్వారానే అందాయి.

కేవలం రేడియోలో పాటలు వింటూ వాటిని స్పీడుగా రాసుకుంటూ 75 నుంచి 82 వరకు నాలుగు 200 పుటల పుస్తకాలలో 1200 మరపురాని పాటలను ఎక్కించుకున్న బాల్యం నాది.

ఒక సారి విన్నప్పుడు పాటను పూర్తి చేయలేక పోతే మరోసారి ఆ పాట రేడియోలో వచ్చే దాకా కాచుకుని ఉండి రెండో సారి, మూడోసారి పాట వింటూ పూర్తి పాట రాసుకుని ఎగిరి గంతేసేవాడిని..

ఇవ్వాళ ఆ పుస్తకాలు లేవు. ఆ పాటలు లేవు. అమృత సమానమైన జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. పై చదువులకు, తర్వాత సామాజిక ఉద్యమాలకు జీవితం మలుపులు తిరిగిన క్రమంలో పాటల పుస్తకాలు పోగొట్టుకున్నాం. 1980 నుంచి 83 దాకా నాలుగేళ్లపాటు డజను నోటు పుస్తకాలలో నిత్యం రాస్తూ వచ్చిన డైరీలూ పోయాయి. రాయచోటిలో శంకరాభరణం సినిమా వస్తే వెర్రి ఉన్మాదంతో రోజు మార్చి రోజు అర్థ రూపాయి టిక్కెట్టుతో నేలమీద కూర్చుని 13 సార్లు చూసి సినిమా హాల్ లోనే పుస్తకంలోని డైలాగులను మొత్తంగా రాసుకుని పదిలంగా కాపాడుకున్న సినిమా డైలాగుల సంపూర్ణ పుస్తకం కూడా పదేళ్ల తర్వాత పోగొట్టుకున్నాను. జీవితంలో ఒక సినిమాను ఇన్ని సార్లు చూడటం అదే మొదటిసారి, చివరి సారి కూడా...

రాయచోటి లైబ్రరీలో ఆరుద్రగారి సమగ్రాంధ్రసాహిత్యం 1,2 3 భాగాలు చూసి నివ్వెరపోయిన క్షణంలో సభ్యత్వం తీసుకుని మరీ ఇంటికి తెచ్చుకుని తెల్లవారేంతవరకు రాస్తూ -మూడు రోజులలోపు పుస్తకం ఇచ్చేయాలి మరి- నాకు నచ్చిన తెలుగు పద్యాలు, ఆ పుస్తకాల్లోని ముఖ్య ఘటనలను 3 నోటు పుస్తకాలలో నింపి పెన్నిదిలాగా దాచుకున్న రోజులవి.

ఇలా ఎన్నని గుర్తుకు తెచ్చుకోవాలి.. నిజంగా అవి నిరుడు కురిసిన హిమసమూహములే.


తెల్లవారకముందే తెలియగ నాస్వామి
మళ్లీ పరుండేవు లేరా... మళ్లీ పరుండేవు లేరా..
ప్రపంచంలో ఏ భాషలో అయినా ఏ ఇంట్లో అయినా ఒక అమ్మ తన కొడుకును ఈ విధంగా నిద్రలేపడం జరుగుతుందంటే నాకయితే నమ్మబుద్ధి కాదు. మన మానసిక ప్రపంచావరణలను మైమరపించి, పరవశింపచేసే ఇంతటి కమనీయ కరుణామయ పాటను ఈనాటికీ వినే భాగ్యం మనకు కలుగుతుందంటే తెలుగు వారిగా మనం చేసుకున్న భాగ్యం అనుకుంటాను. సూర్యుడింకా మొలవని ఉదయ కాలంలో, ఈ పాట వినే భాగ్యానికి నోచుకున్న పిల్లల జన్మ ధన్యం. కాదంటారా?

మా బాల్యాన్ని వెన్నెల చల్లదనం సాక్షిగా చందమామ కథలు వెలిగించడం ఎంత నిజమో కడప రేడియో వారు 70, 80ల మధ్య కాలంలో పాటలతో, పద్యాలతో చక్కటి సంగీతంతో వెలిగించడం కూడా అంతే నిజం. 1963లో తన పెళ్లి సందర్భంగా నాన్న కొన్న ఆ పిలిప్శ్ రేడియో ఓ పది పదిహేనేళ్లు మా పల్లె జీవితాన్ని పండివెన్నెలంత చల్లగా, ఆరుబయట తడిసిన ఇసుక ముద్దలంత చల్లగా పండించింది. ఎలా మర్చిపోగలం.

బిస్మిల్లాఖాన్ విషాద సన్నాయి సంగీతాన్ని మేం మొట్టమొదటగా మా కడప రేడియో ద్వారానే విన్నాం. ఆ సన్నాయి పలికింది ఎవరో తెలియదు.. అమ్మ తర్వాత చెప్పింది. తను ఫలానా అని. మానవ విషాదాన్ని సంగీత ప్రకంపనల ద్వారా నోటితో ఆలపించిన ఆ అమరగానం ఎప్పుడు విన్నా సరే కళ్లు చమరుస్తాయి.

తుషార శీతల సరోవరానా అనంత నీరవ నిశీధిలోనా అంటూ లీల పాడే.. వెన్నులో చలి పుట్టించే ఆ కోమల విషాద స్వరం.. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా అంటూ సుశీల దివ్య స్వరంతో పాడుతుంటే రేడియో ముందు తల వాల్చి నిశ్సబ్ద అనిశ్శబ్ద మహా వలయంలోకి ఎటో వెళ్లిపోవడం. గత అరవైఏళ్లుగా మనసున మల్లెల మాలలూగిస్తున్న భానుమతి సహజ సంగీత స్వరం పలికించిన సావిరహే తవదీనా, శ్రీకర కరుణాల వాల వేణుగోపాలా, మనసున మల్లెల మాలలూగనే పాటలలోని దివ్యత్వం...

పగలే వెన్నెలా అంటూ ఒకే ఒక్క పాటతో ప్రపంచంలోని వెన్నెలనంతటినీ పాటల ముద్దగా మార్చి మన చేతికందించిన జానకి నాద స్వరం.. రాజశేఖరా నీపై మోజు తీరలేదురా...అంటూ ఘంటసాలతో గొంతు కలిపి గత 60 ఏళ్లుగా తెలుగు వాకిళ్లలో దివ్యగానంతో వెన్నెలను ప్రవహింపజేస్తున్న జిక్కి గళంలోని జాణత్వం...

చివరిగా ఎవరి పేరు ఇక్కడ చేర్చకపోతే ఈ మొత్తం వర్ణనకు విలువ లేకుండా పోతుందో ఆ గాన గంధర్వుడు మన ఘంటసాల దివ్య స్వరంలోంచి జాలువారిన అమృతమయమైన పాటలు, పద్యాలు, శ్లోకాలు..ఓహ్. రేడియో తప్ప మరే వినోద వస్తువూ, చివరకూ టేప్ రికార్డర్ కూడా కొనలేని ఆనాటి మాపల్లె బతుకులకు, మా బాల్యానికి వేగు చుక్కలాగా దారి చూపింది రేడియో మాత్రమే.

కృష్ణా ముకుందా మురారీ అంటూ ఘంటసాల వారు పాడిన ఆ విశ్వ గానం ఒక ఎత్తైతే ఆ పాట చివరలో అయిదు నిమిషాల పాటు వచ్చే ఆ విశ్వచలన సంగీతం జీవితంలో మర్చిపోగలమా? ఈ పాటలోని చివరి సంగీతం రేడియోలో వచ్చినా, ఇప్పుడు సిస్టమ్‌లో పెట్టుకుని విన్నా, లేక శ్రీరామ జయంతి వంటి ఉత్సవాల సందర్భంగా పల్లెల్లో గ్రామ్‌ఫోన్ రికార్డు రూపంలో విన్నా నాకు ఆ దివ్య సంగీతం తప్ప ప్రపంచంలో ఇంకేమీ కనిపించదు, వినిపించదు.

తెలుగు పద్యం ఎంత కమనీయంగా ఉంటుందో బాల్యంలో మా పాఠశాలలో తెలుగు టీచర్ సహదేవరెడ్డి గారి పద్య గానం ద్వారా విన్నాను. పాఠశాల వదిలిపెట్టాక ఇంటికి వస్తే రాత్రి, ఉదయం కడప రేడియోలో అదే పద్యాలను ఘంటసాల గొంతు పాడుతుంటే వినడం.. పద్యాన్ని చదవడం కాకుండా పాడి వినిపిస్తే ఎంత గొప్పగా ఉంటుందో మా తెలుగు టీచర్, మా ఘంటసాల బాల్యం సాక్షిగా మాకు రుచి చూపించారు. అందుకే జీవితంలో ఇన్ని దశలు మారి అయిదో దశకం సమీపిస్తున్నా, భావజాలం పరంగా నా ఆలోచనలు ఎన్ని మార్పులకు గురయినా
తెలుగు పద్యాన్ని మర్చిపోవడం నాకు సాధ్యం కావటం లేదు. మా బాల్యాన్ని ఉద్దీపింపజేసిన కమనీయ సంస్కృతి పాట, పద్యం. వీటిని మర్చిపోవడం ఎలా సాధ్యం..

ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవమూ..

అంటరానివాడెవడంటే మా వెంటరాని వారే..
హరిజనులెవరంటే మా అనుంగుసోదరులే

ఇవి మా చిన్నప్పుడు ఆనాటికి మాకు అంతగా అర్థం కాని సామాజిక అసమానతలను, సమస్యలను రేడియో పలికించి వినిపించిన చైతన్య గీతాలు. ఈ దేశం ఇంకా మనుషులతో కూడిన దేశంగా లేదని బానిసలు, బానిస యజమానులు మాత్రమే ఉన్న దేశమని లీలగా, అస్పష్టంగా మాకు తలపించిన పాటలివి.

రేడియోలో పాట వింటూ బాణీపై పట్టు సాధించడం రెండు మూడు సార్లు వినగానే పాటను జ్ఞాపకంలా మార్చుకుని దాన్ని సాధన చేయడం. ఊరిదగ్గర పొలాల్లో సేద్యం పనులు చేసేటప్పుడు, ఊరికి దూరంగా చేలలోకి వేళ్లేటప్పడు. ముఖ్యంగా గుండ్రంగా ఉండే మా ఊరి చెరువు గట్టును దాటుకుంటూ గుట్టల్లో చేలవద్దకు వెళ్లేటప్పుడు నోటికొచ్చిన ప్రతి పాటను, పద్యాన్ని, శ్లోకాన్ని గట్టిగా గొంతెత్తి ఆలపిస్తూ పోవడం. -ఎవరేమనుకున్నా గొంతెత్తి పాటడం ఆపేది లేదు-

కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్..అంటూ శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో రుక్మిణి తన కోసం రథంపై వచ్చిన శ్రీకృష్ణుడిని కనులారా చూసుకుని నిరుత్తరురాలైన సందర్భంగా ఘంటసాల పాడిన పోతన భాగవతంలోని పద్యం. కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్..

నారద తుంబురాది గంధర్వ గాయకులు కమనీయ స్వరాలన్నీ ఒక చోట చేరి అవతరించిన మానవ కరుణామయ స్వరం ఘంటసాలవారిది. ఆయన తన సినీ జీవితంలో పాడిన వందలాది పద్యాలలో అగ్రపీఠం కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్ పద్యానికే దక్కుతుంది. ఈ పద్యం ఆడియో వింటూంటేనే ప్రాణం చమరుస్తుంది. ఇక సినిమా లేదా ఆ సినిమాలోని రుక్మిణీ కల్యాణ ఘట్టాన్ని మాత్రమే కట్ చేసుకుని చూస్తూ పద్యం వింటే మనకిక ప్రపంచం ఏదీ గుర్తు ఉండదు. ఘంటసాలవారు పాడిన అన్ని పద్యాల్లో ఈ పద్య గానంతో ఆయన గంధర్వ కంఠం తారాస్థాయికి చేరుకుందనిపిస్తుంది.


కస్తూరీ తిలకం లలాటఫలకే
వందేశంభు ముమాపతిం..
శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రమేయం.. సీతాపతిం..
ఏనుగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా..
ఎవ్వాని వాకిట నిభమద పంకంబు ..
దుర్వారోద్యమ బాహుమూల..
అటజని గాంచి భూమిసురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహర్ముహుర్లుఠదభంగ తరంగ
పాటునకింతులోర్తురే... కృపారహితాత్మక...
జయత్వదభ్రమద్భుంజగ

నేనొక పూలతోట కడ.. కరుణశ్రీ పుష్ప విలాపం నుండి

శ్రీశ్రీ గేయాలను బట్టీ పట్టి పాడుకునే వరకూ వచ్చింది.


ఆ చిన్న వయసులో ప్రతి పదానికి అర్థం తెలిసినా తెలియకపోయినా ముఖ్యంగా ఘంటసాల, సుశీల పద్యగానామృతాన్ని, జీవితం పొడవునా వెంటాడుతున్న ఆ ఆపాత మధుర సంగీత ఝరిని జుర్రుకుంటూ రేడియో ముందు తలవాల్చి తాదాత్మ్యత చెందిన అద్భుత క్షణాలను ఎలా మరవగలం..

ముఖ్యంగా కనీసం టేప్ రికార్డు కొనడానికి కూడా స్తోమత లేని 70ల కాలంలో పలెల్లో రేడియో ఒక వినోద సాధనంగా పేదవారికి, మధ్యతరగతికి, సకల వర్గాల వారికి పెన్నిధిగా ఉండేదంటే అతిశయోక్తి కాదు. ఆరోజుల్లో పేదవారు పెళ్లి చేసుకుంటే కట్నం చదివింపులలో ఇతరత్రా ఏమి వచ్చేవో కాని పెళ్లి కొడుకు చేతుల్లో కొత్త రేడియో మిలమిల మెరిసేది.

మా ఊరికి పక్కనున్న కురవ పల్లిలో కురవ యువకులు పెళ్లి చేసుకున్నాక ఇలా కట్నం రూపంలో సంపాదించుకున్న కొత్త రేడియో పట్టుకుని గొర్రెలు, మేకలు మేపుకుంటూ ఎర్రటి ఎండలో చేలు చెలకల్లో పాటలు పెట్టుకుని వింటూంటే "అబ్బా వీళ్లదిరా జన్మంటే" అని ఎన్ని సార్లు అనుకున్నామో.

దశాబ్దాలుగా విశ్వచలన సంగీతం

విశ్వాంతరాళాల్లోంచి వస్తున్న మౌన విషాద సంగీత ఝరిని వినాలంటే అప్పుడూ,ఇప్పుడూ కూడా ఉదయాన్నే రేడియో కార్యక్రమాలు మొదలు కాకముందే రేడియో పెట్టుకుని వినాల్సిందే.. వందేమాతరం పాటను వేయడానికి ముందే రేడియోలో గత కొన్ని దశాబ్దాలుగా స్వరం లేని మౌన విషాద సంగీతం ఒకటి సంగీత ప్రియుల గుండెలను పిండేస్తూ కొనసాగుతోంది. ఒక్కసారి వింటే దాన్ని ఇక మర్చిపోలేము.

విశ్వరహస్యాలను మనముందు నిశ్శబ్దంగా ఆవిష్కరిస్తున్నట్లు.. సుదూర గ్రహాంతరాళాలనుంచి ఏదో తెలియని ప్రాణి మానవజాతికి సందేశమిస్తున్నట్లుగా గంభీరంగా, విషాదంగా, అమృతోపమానంగా ఉదయాన్నే వినిపించే ఆ మౌన సంగీతం విశ్వ చలన సంగీతంలా మనసును తాకేది. 24 గంటల పాటు ప్రసారాలు నడిచే కాలం కాదు కాబట్టి మధ్యాహ్నం సాయంత్రం కూడా ప్రాంతీయ రేడియోలు అప్పట్లో పునఃప్రారంభ సమయంలో ఈ ప్రారంభ సంగీతాన్ని వినిపించేవి.

ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే వెంటాడే సంగీతమది. రేడియోకు దూరమైపోవడంతో ఈ మధ్య కాలంలో దాన్ని వినే భాగ్యం కోల్పోయాం. దాన్ని ఎవరయినా ఎంపీ3 పాటగా మార్చి ఆన్‌లైన్‌లో పెట్టి ఉంటే లింకు చెబితే మరోసారి జన్మ ధన్యమవుతుంది.

గత సంవత్సరం సాక్షి పత్రిక ఫ్యామిలీ ఎడిషన్ తొలి పేజీలో కుడివైపున కాలంలో ఈ రేడియో, ప్రభుత్వ టెలివిజన్ ప్రారంభ సంగీతంపై ఎవరో ఒక పాఠకుడు ఒళ్లు పులకరించే కథనం రాశారు. దాన్ని భద్రంగా తీసి ఉంచాను కాని ఇంట్లో పేపర్ల మోత గుట్టలుగా పేరుకుపోవడంతో నేను లేనప్పుడు, ఆమె యధాప్రకారం దాన్ని కూడా అంగడికి వేసేసింది. - ప్రపంచంలో పుస్తకాలు, అమూల్యమైన సమాచారం పోవడం, పోగొట్టుకోవడం, అంగడిపాలైపోవడం ముందుగా ఇంటినుంచే మొదలవుతుందనుకుంటాను-. పీత బాధలు పీతవి లెండి..

పేపర్లను భద్రంగా కాపాడుకోవడం అందులో పరాయి రాష్ట్రంలో వాటిని భద్రపర్చుకోవడం ఎంత ముఖ్యమో మనం లక్షరకాలుగా వాదిస్తే, వాటిని వదిలించుకోవడం ఎంత ముఖ్యమో, అద్దె ఇళ్లలో స్పేస్ సమస్య పరిష్కారానికి అది ఎంత అవసరమో లక్షన్నర రకాలుగా వారూ వాదిస్తారు కదా... మనం అవేమీ పట్టించుకోం కదా. ఇక్కడే మనం నోరు తెరిచి అడిగే అర్హత కోల్పోతుంటాం..


రేడియో సినిమాలు, నాటికలు

70వ దశాబ్దంలో రేడియో ద్వారా సినిమాలు, నాటికలు వినడం మరో అద్భుతం. పాత సినిమాలు చూడాలంటే ఊర్లలో టెంట్లకు పోతే చాలు. కాని దానికోసం రాత్రి 8 గంటలకు మైలు దూరం నడిచి టెంటు కెళ్లి రాత్రిపూట సినిమా చూసి నడిరేయిలో ఏరు దాటి ఊరు రావాలి. చీకటంటే భయం కాబట్టి అప్పట్లో సినిమా చూడాలంటే పెద్దవాళ్లు రావాలి, వారు అనుమతించాలి. లేకుంటే ఎంత మంచి సినిమా అయినా సరే చూడలేం.

కాని నెలలో మూడో వారమో నాలుగో వారమో మరి గుర్తులేదు నెలకు ఒక్కసారి రేడియోలో పగటి పూటే సినిమా వస్తుంది. దృశ్యం లేకుండా కేవలం ఆడియో రూపంలోనే సినిమాను వినాలంటే రేడియోనే కదా మార్గం. 72 నుంచి 80 వరకు ఒక ఎనిమిదేళ్ల కాలం ఎన్ని చక్కటి పాత సినిమాలు, నాటికలు రేడియో ద్వారా విన్నామో..

నాకు బాగా గుర్తున్న రేడియో సినిమా పూజాఫలం. సినిమా పూర్తయ్యాక చాలా కాలం నన్ను వెంటాడిన సినిమా.. ఇప్పటికీ ఎప్పుడైనా ఈ సినిమా చూశానంటే మతి పోతూంటుంది. సినిమా మొత్తం భావుకత్వం.. ఎంత చక్కటి సాప్ట్ పాత్రలు. హీరో హీరోయిన్‌లకు బదులు కథ కనిపించే సినిమా, అరుపులు, పెడబొబ్బలు లేని చల్లటి, మెత్తటి సినిమా చూడాలంటే పూజాఫలం ఒక్కసారైనా చూడాల్సిందే..

ముఖ్యంగా ఈ సినిమాలోని పగలే వెన్నెలా జగమే ఊయలా పాటను మరవగలమా..! సినీ సంగీతం బతికి ఉన్నంతవరకు తెలుగు వాళ్లకు పగటి వెన్నెలను రుచి చూపిస్తూ ఊగించే పాట. పదేళ్లుగా నా సినీ పాటల కలెక్షన్‌లో మొట్టమొదటి స్థానం దీనికే. దీని తర్వాతే ఏ పాటయినా..

1986లో అనుకుంటాను ప్రాంతీయ టీవీ ఛానెళ్ల మోత లేని కాలంలో ఓ ఆదివారం సాయంత్రం తెలుగు సాహిత్యంపై నా ఎంఫిల్ రీసెర్చ్ పనిమీద రంగనాయకమ్మ గారిని కలవడానికి హైదరాబాద్ వెళితే వనస్థలిపురం ప్రాంతంలో కర్ప్యూ వాతావరణం.. ఎందుకంటే దూరదర్శన్‌లో ఆరోజు పూజాఫలం వస్తోంది. ఇళ్ల బయట జనం కనిపిస్తే ఒట్టు.. అదీ పూజాఫలం సినిమా పవర్...

ఇలా జాతి జాతి సామూహికంగా ఒక వినోదం కోసం చెవులు రిక్కించుకుని వింటూ వచ్చిన ఆ బంగారు రోజులు మళ్లీ వస్తాయా. మన ఇంట్లో మన టీవీ, మన ఆడియో, మన కంప్యూటరూ, మనం కొని తీసుకువచ్చిన స్వంత సీడీ, డీవీడీలలోని సినిమాను ఒకరమో ఇద్దరమో పెట్టుకుని యాంత్రికంగా చూసే కాలంలో పెరుగుతున్నామిప్పుడు.

మనకు నిజంగా సామూహికానందం ఏమిటో ఇప్పుడు తెలియదేమో అనిపిస్తోంటోంది. పల్లెల్లోనూ, పట్నాల్లోనూ జీవితం చప్పిడిగా మారిపోయింది. డబ్బు సంపాదన, అమెరికాకు, కాకపోతే మరో దేశానికో పరుగులు తీయవలసిన వాతావరణంలో ఊరంతా ఒక చోట చేరి ఒక పండుగను, ఒక ఉత్సవాన్ని, ఒక హరికథను, ఒక వినోదపు ఆనంద క్షణాలను మనకు మనంగా, గుంపులో ఒకరుగా విని తరించే అవకాశం మనకు ఏనాటికైనా వస్తుందా?

కొత్త బంగారు లోకాల మాటేమిటో గాని మనదైన పాత బంగారాన్ని మన కళ్లముందే జారవిడుచుకుంటున్నాం.. నిజంగా తల్చుకుంటే బాధేస్తుంది.. 20 ఏళ్ల కాలంలో ఏం కోల్పోయామో, ఏం కోల్పోతున్నామో తల్చుకుని గుండె అవిసేలా ఏడవాలనిపిస్తుంది అప్పుడప్పుడూ.

పనిదినాల్లో అన్ని ఒత్తిళ్లనూ భరించి ఏ శనివారం సాయంత్రమో ఆదివారమో అన్ని పనులూ మానుకుని ఒక గంట సేపు నా పాత పాటల కలెక్షన్ నుంచి నరాలను కాకుండా హృదయాన్ని పిండే మా కాలం పాటలను కళ్లు మూసుకుని వారానికి ఒకసారయినా వినగలిగితే, మనసులోనే పాడుకుంటూ కన్నీళ్లు కార్చగలగితే ఎంత బావుంటుందో.


(శివరాం గారూ, ఇదీ శ్రోతగా నాకు తెలిసిన రేడియో కథ.దీంట్లో చాలా చోట్ల అతుకులను పూరించాలి. రేడియో గురించి చెప్పమంటే దాంతో నా అనుబంధం గోలే ఎక్కువయిందనుకుంటాను. ఫర్వాలేదు..ప్రచురించవచ్చు అనుకుంటే ప్రచురించండి)




















17, అక్టోబర్ 2010, ఆదివారం

గంధర్వ చక్రవర్తి కూతురు.జ్ఞాపకాల సమీక్ష







ది నేను చందమామలు చదవడం మొదలెట్టాక తోకచుక్క, మకర దేవత సీరియల్స్ తరువాత అంతగా నచ్చిన, బాగా గుర్తుండిపోయిన మినీ సీరియల్... అరేబియా కథలు సీరీస్ లో భాగంగా -1981 అక్టోబర్ లో వచ్చిన సీరియల్ ఇది. కథ బస్రా అనే నగరంలో మొదలవుతుంది..అదే అరేబియన్ నేపధ్యం లో నడుస్తుంది.
కధ స్థూలంగా...హసన్ అనే అందమైన ఒక కుర్రవాడు ఆ ఊళ్ళో ఒక చిన్న నగల దుకాణం నడుపుతుంటాడు. ఒక పర్షియన్ మాంత్రికుడు ఆత్మీయత నటించి బంగారం చేసే విద్య నేర్పిస్తాననే నెపంతో దగ్గర చేరుతాడు. కుర్రవాడు తన తల్లి అత్యాశకు పోవద్దని ఇతను నమ్మదగ్గవాడిలా లేడని ఎంతచెప్పినా వినడు. నమ్మిన హసన్ ను ఆ మాంత్రికుడు మోసగించి క్షుద్రోపాసనలో బలివ్వడానికి తనతో ఒక విచిత్రమైన ద్వీపానికి తీసుకుపోతాడు. తెలివి వచ్చిన హసన్ చాకచక్యంతో ఆ మాంత్రికుడినే మట్టుబెట్టి ఆ దీవిలో ఒంటరిగా తిరుగుతూ ఒక గంధర్వ సామంత రాజు కుమార్తెల వద్ద చేరుతాడు. వారు హసన్ ని తమ్ముని వలె ఆదరిస్తారు.

ఇంతలో అనుకోకుండా మన కథానాయిక ఐన గంధర్వ చక్రవర్తి కూతురిని చూసిన హసన్ మనసు పారేసుకొని ఆమెని కలవలేక చిక్కి శల్యమవుతాడు. పక్షి తొడుగులు ధరించి ఎగురుతూ వచ్చిన ఆ చిన్నదానిని తన అక్క సలహా మీదట ఆ తొడుగు తస్కరించి తన వశం చేసుకుంటాడు. తరువాత ప్రేమతో ఆమె దగ్గర చేరి ఆమె మనసు గెలుచుకొని, ఆమెని పెళ్లి చేసుకొని మళ్ళీ తన ఊరికి చేరుకుంటాడు. అయితే కొంతకాలం గడిచాక తన అక్కలకిచ్చిన మాట మీద వారిని మళ్ళీ చూడడానికి బయలుదేరతాడు. వెళుతూ తన భార్య, పిల్లలను తల్లికి అప్పజెప్పి భార్య యొక్క పక్షి తొడుగుల గురించి చెప్పి అది కంటపడితే తన భార్యకు మళ్ళీ గంధర్వ లోకం వైపు మనసు మళ్ళి తనకు దక్కకుండా పోతుందని...జాగ్రత్త చెప్పి వెళ్తాడు. కానీ అనుకున్నంతా జరిగి ఆమె పిల్లలతో సహా ఎగిరిపోతుంది. అయితే హసన్ ఎంతో సాహసంతో మళ్ళీ ఆ గంధర్వచక్రవర్తి రాజ్యమైన వాక్ - వాక్ దీవులకి చేరుకొని తన భార్యా పిల్లలను ఎలా దక్కించుకోగలిగాడనేది మిగతా కథ.

కథ చాలా మలుపులతో సాగుతుంది. కానీ మన NTR గారి 'జగదేక వీరుని కథ', పాతాళభైరవి టచ్ ఉన్నట్టుంటుంది.. కొంత సారూప్యత వున్నా కథనం, ట్రీట్మెంట్ మాత్రం డిఫరెంట్ గా వుంటుంది. మాంత్రికుడూ, రెక్కల గుర్రాలూ, మంత్రించిన చూర్ణం, పక్షి తొడుగులూ...ఇలా చాలా చిత్రంగా వుంటుంది. ఆసాంతం ఆసక్తిగా చదివిస్తుంది. దీనికి తోడు శంకర్ గారి బొమ్మలు మనకు ఆ సన్నివేశాలని కళ్ళముందు సాక్షాత్కరింప జేస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు... అరేబియన్, పర్షియన్ నేపధ్యం.. ఆ పాత్రల ఆహార్యం, రూపకల్పన, సన్నివేశాలకి తగ్గ బాగ్రౌండ్ ని చూపించడంలో 'సరిలేరు నీకెవ్వరూ' అని మరోసారి నిరూపించుకున్నారు.

నేను మూడో క్లాసు చదివేటప్పుడు ఇది సీరియల్ గా వచ్చింది. మొత్తం పది భాగాలు. ఈ కథకి మూలం ఏమిటో ఎవరు రాసారో తెలీదు. కాని టైటిల్ పేజీ కిందమాత్రం ' అరేబియా కథలు' అని వుండేది. మేము ఆ పేజీలను వేరు చేసి పుస్తకం గా కుట్టుకొని వుంచుకున్నాం. చాలా సీరియల్స్ ని ( తోకచుక్క, మకరదేవత, విఘ్నేశ్వరుడు, ఇంకా చాలా..) అలా దాచుకున్నా...ఆ మా తొలినాటి చందమామ జ్ఞాపకంగా చివరకు మిగిలింది ఇది ఒక్కటే (ఈ పుస్తకం లోనే 'ఇద్దరు మోసగత్తెలు' అని ఇంకో సీరియల్ కూడా వుండేది...దానిగురించి ఇంకో టపాలో ముచ్చటిస్తాను). అందుకే ఈ సీరియల్ నాకు ఎంతో ప్రత్యేకం.

ఈ సీరియల్ లింక్ చందమామ ఆర్కైవ్స్ లో మీకోసం...
గంధర్వ చక్రవర్తి కూతురు 1 పేజీ నెం. 61
గంధర్వ చక్రవర్తి కూతురు 2 పేజీ నెం. 60
గంధర్వ చక్రవర్తి కూతురు 3 పేజీ నెం. 61
గంధర్వ చక్రవర్తి కూతురు 4 పేజీ నెం. 59
గంధర్వ చక్రవర్తి కూతురు 5 పేజీ నెం. 59
గంధర్వ చక్రవర్తి కూతురు 6 పేజీ నెం. 59
గంధర్వ చక్రవర్తి కూతురు 7 పేజీ నెం. 59
గంధర్వ చక్రవర్తి కూతురు 8 పేజీ నెం. 59
గంధర్వ చక్రవర్తి కూతురు 9 పేజీ నెం. 59
గంధర్వ చక్రవర్తి కూతురు 10 పేజీ నెం. ౬౧

జ్ఞాపకాల ద్వారా సమీక్ష ఒక చక్కటి ప్రయోగం. బ్లాగు నుండి చదువుకోవటానికి వీలుగా లింకులు ఇవ్వటం మరొక మంచి విధానం. ఈ వ్యాసాన్ని పంపినవారు శ్రీ రుద్రావజ్ఝుల రాదే మాధవి గారు, విశాఖపట్టణం నుంచి. ఆయన మరిన్ని ఇటువంటి మంచి వ్యాసాలూ పంపాలని ఆకాంక్షిస్తున్నాము.

ఆహ్లదకర వాణి - ఆకాశవాణి

మనసు మీద ఏటువంటి దుష్ప్రభావం చూపని, కళ్ళకు, చెవులకు హాని కలిగించని, ఒక సౌకర్యవంతమైన సాధనం రేడియో.ఈ కేబుల్ టీవి మహమ్మరి మన మీద దాడి చెయ్యని, ఆ రొజుల్లొ, ఆకాశవాణి అందించిన ఆ ఆహ్లదకరమైన కార్యక్రమాల విషేషాలు, నా అనుభవాలను ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నా.

వారంతపు వినోదం అనగానే, మన అందరకు గుర్తుకు వచ్చేది, ఆది వారం మద్యాహాన్నం 3 గంటలకు ప్రసారం అయ్యె నాటకం. మంచి కదాంశంతొ , ఒక గంట పాటు మన అందిరిని అలరించేది. ముఖ్యంగా , జాతీయ నాటక వారోత్సవాలు జరిగినప్పుదు, దేశ వ్యాప్తంగా వున్న, వివిధ ఆకాశవాణి కేంద్రాల నుంచి, వైవిద్యమైన నాటకాల ప్రసారం అయ్యేవి.ఇంక రేడియో వార్తలు అనగానే, ఉదయం 7 గంటలకు ప్రసారం అయ్యే వార్తలు మరుపురానివి. ఇప్పటి 24 గంటల వార్త చానెల్స్ వలే , ప్రతీ పనికిమాలిన విషయాన్ని సంచలన వార్తగా ప్రసారం చెయకుండా, జాతీయ, అంతర్జాతీయ వార్తలను, కేవలం 10 నిముషాలలో మన అందరికీ అందించేవారు.ఇంక మద్యాహాన్నం 1.30 ప్రసారం అయ్యే ప్రాంతీయ వార్తలు కూడ, రాష్ట్రీయ వార్తలను, ఏటువంటి పక్షపాతం లెకుండా, మనకు అందించేది.

తూఫానులు, వరదలు ఎప్పుడు వచ్చిన ఆ రొజుల్లో అందరికీ రెడియోనే ఆధారం. వర్షా కాలంలొ కరెంటు పొయిన రాత్రి, రెడియో ముందే కుర్చుని, పెద్దలందురు, ఈ తూఫాన్ ఏప్పుడు తగ్గుతుందో అని, రెడియో లొ వాతావరణ విషేషాలను శ్రద్దగా వినే వారు.

రేడియో మన దిన చర్య లొ ఒక భాగం. ఉదయం 7 గంటలకు జాతీయ వార్తల వింటూ, ఉపహారం చెయడం, రేడియో సినీమ పాటలు వింటూ, ఉదయం 9 గంటలౌకు పాఠశాలకు కు వెళ్ళడం, మళ్ళీ మద్యాహాన్నం పాఠశాల నుంచి వచ్చి , 1.30 కి భొజనం చేస్తూ, ప్రాంతీయ వార్తలను వినడం,
మళ్ళీ రాత్రి నిద్ర పొయో ముందు , వివిధ భారతి కేంద్రం లొ అలనాటి సినీమాలలో మధుర గీతాలని వినడం, ఏల మర్చిపోగలము.

ఉదయం 8.30 గంటలుకు ప్రసారం అయ్యే, కర్ణాటక సంగీత కార్య క్రమంలొ, వివిధ రకాల వాద్య సంగీతం, కర్ణాటక సంగీత నెర్చుకోవాలీ అనుకునెవారికి, సంగీత పాఠాల కార్యక్రమాలు, ఏంత ఆహ్లద కరంగా వుండెవొ. మధ్యహాన్నం 2 గంటలకు, సిలోన్ రెడియో కేంద్రం లొ, ప్రసారం అయ్యే తెలుగు కార్యక్రమాలు కూడ మనసుని దొచుకొనేవి.


ఇంక ఆది వారం ఉదయం 8 గంటలకు, 80 వ దశకం చివరలొ, ఆకాశవాణి, పిల్లల కోసం, ప్రసారం చేసిన, 30 నిముషాల సైన్స్ కార్యక్రమం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ధారావాహికలొ, భూమి పుట్టుక నుంచి, గ్రహాల స్తితిగతులు, ప్రపంచ వ్యాప్తం గా వివిధ నాగరికతల ఆవిర్భావం ఏలా జరిగిందోలాంటి ఎన్నొ వైజ్ఞానిక ఆంశాలను సామన్యులు కూడ అర్దం అయ్యెవిధంగా ప్రసారం చేసిన ఆకాశవాణి కృషి నిజంగా అభినందనీయం .

దయ చెసి ,ఈ సైన్స్ ధారావాహిక రేడియో కార్యక్రమాల రీకార్డింగ్ ఎవరి వద్ద నైనా వుంటే , ఈ బ్లాగు ద్వారా పంచుకోగలరని ఆశిస్తున్నాను.


ఈ రేడియో అనుభవాలు శ్రీ కొమ్మారెడ్డి శ్రీనివాస్ గారివి. ఈయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. చందమామకు అభిమాని. ఆయన రేడియో అభిమాని కూడ అని తెలిసినతరువాత ఆయన రేడియో జ్ఞపకాలను అందరితో పంచుకోమని అడగ్గానే వ్రాసి పంపారు, కృతజ్ఞతలు,



5, అక్టోబర్ 2010, మంగళవారం

నండూరి సుబ్బారావుగారు :: మనుమరాలి జ్ఞాపకాలు

ఫోటో కర్టెసీ శ్రీ గొల్లపూడి మారుతీ రావుగారు
నండూరి సుబ్బారావుగారి మనమరాలు శ్రీమతి తుర్లపాటి స్వాతి గారు పంపిన తమ తాతగారి జ్ఞాపకాలు యధాతధంగా

చిన్నతనం లొ తాతగారి తొ పాటు రేడియో స్టేషన్ కు అక్క నేను వెళ్ళే వాళ్ళం . కళాకారులు రికార్డింగు చేసేప్పుడు ఒక్కొసారి అక్కడే ఉండే వాళ్ళం, ఎంతో సరదాగ ఉండేది. అప్పుడప్పుడు పాటలు అవి తాతగారు మా చేత పాడించేవారు ఇప్పుడు ఆకాశవాణిలో లొ అప్పటి ఆణిముత్యాలవంటి నాటికలు, ఇతర కార్యక్రమాలు మళ్ళి ప్రసారం చేస్తే ఎంతో బాగుంటుంది!

నాకు తాతగారి ఉద్యోగ జీవితపు వివరాలు అంతగా తెలియవు. నా దగ్గర ఫొటోలు కూడ లేవు. తాతగారు ఇంట్లో చాలా సరదాగ ఉండేవారు. పేరుకి మా తాతగారే కాని, మాతో సమానంగా సరదాగ ఉండేవారు. నాకు బాగా జ్ఞాపకం ఉన్నవి;

స్కూల్ నుండి రాగానే, నేను మా అక్క తాతగారి దగ్గర ఒక గంట కూర్చునే వాళ్ళం. కథలు, కబుర్లు మా కుటుంబంలోని పూర్వీకుల వివరాలు ,తన అనుభవాలు అన్ని చెప్పేవారు. ముగ్గురం కలిసి బామ్మని ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళము. ఒక్కోసారి సాయంత్రం, నాటికలు, నవలలు వ్రాస్తూ ఉండేవారు. ఒకసారి వ్రాయటం మొదలు పెడితే అయ్యేదాక వ్రాస్తూనే ఉండేవారు. రాత్రి భోజనం తరువాత, బయట వెన్నెల్లో కూర్చుని అక్కకి నాకు . పురాణ గాధలు వివరంగా చెప్పేవారు. చిన్నప్పుడు అక్కకి నాకు తెలుగు నేర్పించారు. పాఠాలు చెప్పే సమయంలో , చెప్పవలసిన విషయం చాలా బాగా చెప్పేవారు. మన తెలుగు భాష అంటే వారికి చాల గౌరవం. వత్తులు సరిగ్గా పలుకకపోయినా, వ్రాయకపోయినా, తాతగారు చాలా కోపం చూపించేవారు. ఒక రొజు రాత్రి 11 గంటల దాక నా చేత అక్షరాలు వ్రాయించారు. సరిగా వ్రాస్తే కాని, అమ్మని అన్నం పెట్టద్దు అని చెప్పారు. మళ్ళి గంట, గంటకు తనని లేపి వ్రాసింది చూపించమని చెప్పి పడుకున్నారు. అలా నేర్పారు కాబట్టే ఈ రోజు వేరే దేశంలో ఉన్నా, తెలుగు మీద మమకారం పోకుండా ఉండటమే కాకుండా మరింత ఎక్కువయ్యింది. ఇన్ని సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నా, తెలుగులో ఏదైనా వ్రాస్తుంటే అదో ఆనందం. ఒక్క క్షణం ఆ అక్షరాలు ఎంత అందంగా ఉన్నాయి అని ఆగి మెచ్చుకోకుండా ఉండలేము. ఇలా, తాతగారి మధురమైన జ్ఞాపకాలు ఎన్నో.

తాతగారు చూడటానికి, వినటానికి కూడ ఎంతో ఆకర్షణీయంగా ఉండేవారు . చాలా పెద్దవారు ఐనాక కూడ మంచి తేజస్సు ఉండేది ఆయన ముఖంలో. గంభీరంగా ఉండేవారు. నడిచేవారు. మాట్లాడేవారు. మాట్లాడే పధ్ధతి ఎంతో కరెక్టుగా ఉండేది. అదే మాకు కూడ నేర్పించారు. పెద్దవాళ్ళను గౌరవించటం. నమస్కారం చెప్పటం, ఇలా అన్నీ మన పధ్ధతులను నేర్పించారు. వారితో అంతకాలం గడపగలగటం, మంచి పధ్ధతులను నేర్చుకోవటం, మా అదృష్టంగా భావిస్తాము.

మా చిన్నప్పుడు తాతగారిగానే తప్ప, ఆకాశవాణిలో రచయితగా కాని , నటుడిగా కాని మాకు తెలియదు. వంశి గారి వెబ్ సైటులో తాతగారి నాటికలు విని ఎంతో సంతోషం కలిగింది. ఎఫ్ ఎం రేడియోనే గొప్పగా ఉండే ఈ రోజుల్లో ఆకాశవాణికి మీ వంటి అభిమానులు ఇంకా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉన్నది.

మా నాన్నగారైన నండూరి శశి మోహన్ గారిని మా తాతగారి గురించిన ఫొటోలు ఇతర వివరాలు, పంపమని మైలు ఇస్తున్నాను.

24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చందమామ అభిమానం


పసితనంలో చందమామను చూస్తూ ఆమ్మ చేతి గోరుముద్దలు తిన్న రోజులు, చిన్నతనంలొ చందమామ కథలు చదువుతూ హాయిగా గడిచిన అందమైన బాల్యాన్ని ఎవరైనా ఎప్పటికైనా మరువగలరా? నా చందమామ జ్ఞాపకాలను, అక్షర రూపంలొ రాయాలని అనిపించగానే, మనసంతా మధురమైన బాల్యస్మృతులతొ నిండిపోయింది.

నాలుగో తరగతి వేసవి శెలవులకు, మా మావయ్యవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మొట్టమొదటి సారిగా నేను చందమామలో ప్రచురితమైన తోకచుక్క ధారావాహిక బైండింగ్‌ను, మా మావయ్య చేతిలొ చూడడం జరిగింది. వాహ్..ఏమని చెప్పను…! మా మావయ్యని అడిగితే, నిర్మొహమాటంగా ఇవ్వను అని చెప్పి, వాళ్ళపిల్లల కంట కూడ పడకుండా భద్రంగా తన బీరువాలొ జాగ్రత్తగా పెట్టి, ఆఫీసుకి వెళ్లిపొయాడు.అందమైన బైండింగ్‌ల రూపంలో మావయ్య సేకరణలొ వున్న, తోకచుక్క, కంచుకోట, ముగ్గురు మాంత్రికులు, జ్వాలాద్వీపం, మకరదేవత, పాతాళ దుర్గం, రామాయణం, మహాభారతం, దేవిభాగవతం ధారావాహికలన్నీ, నన్ను ఎంతగా ఆకర్షించాయో, మాటలలొ చెప్పలేను.
నేను మా అత్తయ్యను బ్రతిమాలి, మా మావయ్య ఆఫీసుకి వెళ్ళిన వెంటనే,ఒక్కొక్క సీరియల్ని తీసుకొని చదవడం, మా మావయ్య ఆఫీసు నుంచి వచ్చే లోపు, మళ్లీ మా అత్తయ్యకి ఇచ్చేయడం, అలా వేసవి సెలవులు మొత్తం, మా మావయ్య సేకరించిన సీరియల్స్ అన్నీ చదివేయడం జరిగింది.

అసలు వేసవి సెలవులు రెండు నెలలు, ఎలా గడిచిపొయాయో, నాకు అర్ధం కాలేదు. దాసరి సుబ్రమణ్యం గారి అద్భుతమైన కధనంతొ కూడిన, ఆ జానపద సీరియల్స్‌ను చదువుతున్నంతసేపు, చిత్ర, శంకర్ గారి, బొమ్మలను మంత్రముగ్దుడినై చూస్తూ, జానపద లోకంలొ విహరించడం, చందమామతొ నాకున్న ఒక అందమైన జ్ఞాపకం.ఇంక మా వూరికి వచ్చిన తరువాత, చందమామ ఎలా చదవాలి అనుకుంటే, అప్పుడు తెలిసింది, మా వూరి గ్రామీణ గ్రంధాలయంలో వుంటుంది అని. తీరా గ్రంధాలయం వెళ్ళి చూస్తే, చందమామ ఎప్పుడూ ఎవరో ఒకరి చెతిలొ వుండేది. ఇంక లాభం లేదు అనుకొని, గ్రంధాలయం తలుపులు తెరవక ముందే వెళ్ళి, గ్రంధాలయం తలుపులు తెరిచిన వెంటనే లోపలకు వెళ్లి చందమామ పుస్తకాన్ని, విజయ గర్వంతో దక్కించుకున్న రోజులు ఇప్పటికీ ఇంకా నాకు గుర్తు.

సరిగ్గా నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు, చందమామలోని, స్వాతంత్ర సమరానికి సంబంధించిన విషయాలన్ని క్రోడీకరించి, మా పాఠశాలలో వకృత్వ పొటీలలొ పాల్గొని, మొదటి బహుమతి గెలుచుకున్న రోజు, మరో అందమైన జ్ఞాపకం.కొన్ని సంవత్సరాల తరువాత, మా మవయ్యను “మావయ్యా! ఇంత పెద్ద వాడివి అయ్యాక కూడ, ఇంకా చందమామని ఎందుకు చదువుతున్నావు ? ఇంకా చందమామని ఎందుకు అంత అపురూపంగా చూసుకుంటున్నావ్?” అని అడిగాను.

చందమామ కథలన్నింటినీ జాగ్ర్తత్తగా, పరిశీలిస్తే,అన్ని కథల నేపధ్యం కూడా, ఆధునిక కాలం కాకుండా పౌరాణిక, జానపద కాలమే. కల్మషం లేని మనుషులు, కథలోనైన ధర్మానిదే గెలుపు, న్యాయానిదే విజయం.రమణీయమైన ప్రకృతి, ముచ్చట గొలుపే జలపాతాలు,సెలయేర్లు, సుందరమైన అడవులు, ఆధునిక పోకడలు లేని, అలనాటి అందమైన కాలపు వర్ణ చిత్రాలను చూస్తూ వుంటే, మనసంతా ఆహ్లాదకరంగా వుంటుంది. చందమామని చదువుతున్నంతసేపు, మళ్ళీ మన కళ్ళ ముందు, మన బాల్యం కదలాడదా,” అని మా మావయ్య సమాధానం ఇచ్చాడు. నిజమే కదా ! అక్షర సత్యమనిపించింది.

తెలుగు బాషపై మంచి పట్టు సాధించడానికి, పురాణ ఇతిహాసాలపై, వివిధ దేశాల జాపపద కథలు, ముఖ్యంగా అరేబియా జానపద గాధలు సుపరిచయం కావడానికి, బేతాళ కథల ద్వారా తార్కిక జ్ఞానాన్ని పెంపొందించడానికి, చక్కని జీవితాన్ని గడపడానికి చందమామ ఎంతగానో, నాకు తోడ్పడింది.అలనాటి చందమామలో, సంపూర్ణ భారత దేశ చరిత్ర, ప్రపంచ వింతలు, వివిధ దేశాల జానపద గాథలు, స్వాతంత్ర సమర ఘట్టాలు, స్వాతంత్ర సమర యెధుల జీవిత విశేషాలు, రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణ పురుషులు, పంచతంత్ర కథలు, అద్భుతమైన జానపద సీరియల్స్, వడ్డాది పాపయ్య, చిత్ర, శంకర్ గార్ల వర్ణచిత్రాలు, ఒకటేమిటి… ఆ రోజుల్లొని చందమామ, పిల్లలకే కాదు, పెద్దలకు కూడ ఒక విజ్ఞాన సర్వస్వం.

తెలుగు వారి వారసత్వ సంపద అయిన మహోజ్వల చందమామను, ఈనాడు చూస్తే, అలనాటి పాఠకులకు, మనస్తాపం కలగక మానదు. అర్ధం పర్ధం లేని అనునిర్వ ధారావాహిక, హాస్యాన్ని అపహాస్యం చేయడానికి వేస్తున్న హాస్య కథ. అస్సలు ఆసక్తి కలిగించని 2 కామిక్స్ ధారావాహికలు,4 పేజీల క్రీడా విశేషాలు, పంచతంత్రం, శిథిలాలయం వంటి ధారావాహికలను పునః ప్రచురిస్తున్నా, అలనాటి చిత్రాలవలే కాక, అస్సలు ఆకర్షణీయంగా వుండడం లేదు. అయినా చందమామపై, అభిమానాన్ని చంపుకోలేక,ఇప్పటికీ ప్రతీ నెలా కొంటునేవున్నా.

భారతీయ పత్రికల చరిత్రలోనే, ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ప్రారంభ సంచిక నుండి, 2000 సంవత్సరం వరకూ, అన్ని సంచికలను ఆన్‌లైన్‌లో వుంచడం ద్వారా, చందమామ మరోమారు తన ప్రత్యేకతను చాటుకుంది. అన్ని వర్గాల, అన్ని తరాల పాఠకులు మరోసారి తమ బాల్య స్మృతులను, గుర్తు చెసుకునే అవకాశం కలగడం నిజంగా మన అందరి అదృష్టం.ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన నేటి చందమామ యాజమాన్యపు నిర్ణయం నిజంగా అభినందనీయం.
చందమామ విషయంలో బాధాకరమైన విషయం ఏమిటి అంటే, చందమామ స్వరయుగపు రోజుల్లో, చందమామను కొని, భద్రపరుచుకొనే స్థితిలొ లేను. చందమామ కొనగలిగే స్థితిలొ వున్న ఈరొజుల్లో, చందమామ ఆ స్థితిలొ లేదు. ఏది ఏమైనా, చిన్నపిల్లల కథలు అనగానే చందమామ కథలు అనే పర్యాయపదం, భారతీయ జనమాధ్యమంలో స్థిరపడేటట్లు చేసిన చందమామ పత్రిక, త్వరలొనే పూర్వ వైభవంతో, దిన దిన ప్రవర్దమానమౌతూ మరింతగా బాలలకు చేరువ కావాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

శ్రీనివాస్ కొమ్మిరెడ్డిబెంగళూరుhai.nivas@gmail.కం
= = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = =

చందమామ అసోసీయేటెడ్ సంపాదకులు శ్రీ రాజశేఖర రాజుగారి స్పందన

కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు బెంగళూరులో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తూ ఉన్నారు. వయస్సు 34 ఏళ్లు. ఎన్నో రోజులుగా చందమామ జ్ఞాపకాలను రాసి పంపాలి అనుకుంటున్నా, పనుల ఒత్తిడి వల్ల వీలు కాలేదని ఇన్నాళ్లకి వీలు కుదిరిందని మెయిల్ చేశారు. అప్పటికీ, ఇప్పటికీ తనకు తీరని కోరిక ఒక్కటే, చందమామ పత్రిక అచ్చులో తన పేరు చూసుకోవాలని. ఆ కోరిక తీరే విధంగా త్వరలొనే మంచి కథలు రాసి పంపగలనని చెప్పారు. శ్రీనివాస్ గారూ, మీకు కూడా చందమామ తరపున స్వాగతం..!

మీరు పంపిన చందమామ జ్ఞాపకాలు “జానపద లొకంలొ విహరింప చేసే జాబిలమ్మ మా చందమామ” హృద్యంగా ఉంది.. ఆన్‌లైన్ చందమామలో ప్రతి శుక్రవారం మాత్రమే ప్రస్తుతం అప్‌డేషన్ జరుగుతోంది కాబట్టి మీ చందమామ జ్ఞాపకాలను ఈ శుక్రవారం లేదా వచ్చే శుక్రవారం చందమామ వెబ్‌సైట్‌లో, చందమామ బ్లాగులో ప్రచురణకు తీసుకుంటున్నాము.

“చందమామ కథలన్నింటినీ జాగ్ర్తత్తగా, పరిశీలిస్తే, అన్ని కథల నేపధ్యం కూడా, ఆధునిక కాలం కాకుండా పౌరాణిక, జానపద కాలమే. కల్మషం లేని మనుషులు,ఏ కథలోనైనా ధర్మానిదే గెలుపు, న్యాయానిదే విజయం. రమణీయమైన ప్రకృతి, ముచ్చట గొలుపే జలపాతాలు,సెలయేర్లు, సుందరమైన అడవులు, ఆధునిక పోకడలు లేని, అలనాటి అందమైన కాలపు వర్ణ చిత్రాలను చూస్తూ వుంటే, మనసంతా ఆహ్లాదకరంగా వుంటుంది. చందమామని చదువుతున్నంతసేపు, మళ్ళీ మన కళ్ళ ముందు, మన బాల్యం కదలాడదా,” అని మా మావయ్య సమాధానం ఇచ్చాడు.
మీ మామయ్యగారికి శత సహస్ర వందనాలు…

“తెలుగు వారి వారసత్వ సంపద అయిన మహోజ్వల చందమామను, ఈనాడు చూస్తే, అలనాటి పాఠకులకు, మనస్తాపం కలగక మానదు… చందమామ విషయంలో బాధాకరమైన విషయం ఏమిటి అంటే, చందమామ స్వరయుగపు రోజుల్లో, చందమామను కొని, భద్రపరుచుకొనే స్థితిలొ లేను. చందమామ కొనగలిగే స్థితిలొ వున్న ఈరొజుల్లో, చందమామ ఆ స్థితిలొ లేదు…..”

మీ బాధ చందమామ అభిమానులందరి బాధ. పాత చందమామకు, కొత్త చందమామకు ఉన్న హస్తిమశకాంతర వ్యత్యాసంపై మీ అభిప్రాయం ఆలోచించదగినదిగా ఉంది మరోసారి ఈ విషయంపై వివరంగా మీకు మెయిల్ చేస్తాము.
ప్రపంచమంతటా ఉన్న చందమామ అభిమానుల జ్ఞాపకాలను సేకరించి భావితరాల వారికి చందమామ వైభవోజ్యల గతాన్ని, జాతీయ సాంస్కృతిక రాయబారిగా అది చేసిన విశిష్ట సేవను శాశ్వతంగా అందించాలనే ఉద్దేశ్యంతో చందమామ జ్ఞాపకాలు శీర్షికను ప్రారంభించడమైంది.

అలాగే చందమామతో గతంలో, ప్రస్తుతం సంబంధంలో ఉన్న మీ మిత్రులకు, బంధువులకు కూడా చందమామ జ్ఞాపకాల గురించి తెలియజేసి వారి జ్ఞాపకాలను కూడా పంపవలసిందిగా కోరగలరు. ఇది పూర్తిగా చందమామ అభిమానులు, పాఠకులకు ఉద్దేశించిన శీర్షిక కాబట్టి, పరస్పర సమాచార పంపిణీతోనే వారి వారి జ్ఞాపకాలను సేకరించడం సాధ్యమవుతోంది

శ్రీనివాస్ గారూ, చందమామ ఉజ్వల గత, వర్తమానాల పట్ల మీ అభిమానం, ఆవేదనలకు సహానుభూతి ప్రకటిస్తూ.. కోరకుండానే అందమైన చందమామ జ్ఞాపకాలు పంపినందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు..చందమామ.
రాజశేఖర్ రాజుగారి చందమామలు బ్లాగు నుండి పున:ప్రచురణ

ఆకాశవాణి ఆనంద కేంద్రం

మా రేడియో
కాలం వేగంగా పరిగెత్తటం వల్లనో, లేక ఆలోచనల భారం పెరగటం వల్లనో మనం అలనాటి అనేక ఆనందాలు కోల్పోతున్నాము. అలా కోల్పోతున్న ఆనందమే రేడియో.నా చిన్నప్పుడు ఆ కాలమే వేరు అని పెద్దవాళ్ళు అంటుంటే ఏమిటోలే అనుకున్నాను. ఇప్పుడు అంత పెద్దవాణ్ణి కానప్పటికి అలా అనుకోవటంలో ఆనందం ఉందని గ్రహించాను. అవును, శివగారి( మా అన్నయ్యే లెండి ) రేడియో అభిమాని బ్లాగ్ గురుంచి తెలియగానే లోపల ఉన్న రేడియో జ్ఞాపకాలు బయటకు వస్తుంటే తెలిసింది ఆ ఆనందం ఏమిటో!!!

పొద్దున్నే నిద్ర లేచేప్పటికే సుప్రభాతంతో మొదలు ఢిల్లి తెలుగు వార్తలు దాకా నాన్నగారు వింటుంటే అవి వింటూ గబగబ ఏదో ఒకటి తిని స్కూలుకి పోవటం. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచేప్పటికి "కార్మికుల కార్యక్రమం" సైన్ మ్యూజిక్, తరవాత "మంచాహే గీత్" హింది పాటలు వింటూ తిరిగి స్కూలుకి పోవటం. సాయంత్రం అయ్యేటప్పటికి దగ్గరలోని పార్క్ యువజనులకార్యక్రమం, పంటసీమల మ్యూజిక్ వినపడుతుండగా ఇంటికి వెళ్ళటం, జనరంజని పాటలో చాయాగీత్ పాటలో వింటూ నిద్రపోవటము. ఇదంతా పెద్దవాళ్ళు రేడియో వాడుతున్నప్పుడు తెలియకుండానే నిత్యజీవితంలో భాగంగా రేడియో వినటం మొదలైంది. ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే పాత కాలపు చక్కటి సువాసనలు గుర్తుకొస్తున్నాయి.

ఆదివారం వచ్చిందంటే 3 గంటలకి వచ్చే నాటకం కోసము జనమంతా ఎదురు చూడటం, వచ్చినతరవాత ప్రతి ఇంట్లో అదే వినపడటం... రొడ్లన్నీ ఖాళీగా ఉండటం... ఇప్పటి టీవీ పిల్లలకు చెప్పినా నమ్మరు.

ఆ రోజుల్లొ రేడియొకి చాలా ప్రాముఖ్యం ఇచ్చేవారు. పార్క్ రేడియొలకి రోడ్ మీద మైకులకు కనెక్షన్ ఉండేవి. ఏదైనా రేడియొనే.. మంచి కార్యక్రమములు, మంచి నాటకములు. మరియు మంచి వార్తలు..... అవును అలా చెప్పక తప్పదు ఇప్పుడు మనం చూసే టీవీల అతి వార్తలు వెకిలి/సందర్భ శుధ్ధిలేని భాష..భాషా ప్రయోగములు..భయంకర మ్యుజికల్ వార్తా చానళ్ళు.... ఎందుకులే సుఖంగా రేడియో స్వర్గంలో విహరిస్తూ టీవీ నరకంలొకి..

ఇక, రేడియో నాటకాలలో బందా కనకలింగేస్వర్రావుగారు,నండూరి సుబ్బారావు గారు, సి.రామ్మోహన రావు గారు, పాండురంగా గారు, నాగరత్నమ్మ గారు, వి బి కనకదుర్గ గారు ఇలా ఒకరేమిటి[చాలా మంది పేర్లు తెలియవు] అందరూ రేడియో నాటకాల్లో వినపడలేదు..."కనపడ్డారు". నిజంగా వారు ఎలావుంటారో తెలియదు కాని రేడియో నాటకాల ద్వారా ప్రతివారి రూపం మనస్సులో ముద్రించుకొని పోయింది. గణపతి, వరవిక్రయం, దొందుదొందే, తాళం చెవులు,మడిబట్ట, పెళ్ళాంతొ పెళ్ళికి ప్రయాణం లాంటి నాటకాలు రేడియోలో వచ్చాయంటే నమ్మ బుద్ది కావటం లేదు. ఇవన్నీ చూసినట్లుగానే జ్ఞాపకం వస్తున్నాయి.[ఇవాళ మీడీయాలో చూసినవి కనీసం విన్నట్లుగా కూడా జ్ఞాపకం రావటం లేదు].

ఒక నాటకమేదో వచ్చింది[పేరు గుర్తు లేదు] దానిలో అందరూ ఒక గుహలో చిక్కుకొని పోతారు... చీకటి. భయం!! భయానక వాతావరణం ఆ గంటా మనమే చీకటి గుహలో ఉన్నామా అనిపిస్తుంది. దీనికి ఏ ఇంగ్లీష్ హర్రర్ సినిమా కూడా సాటి రాదు.

అలాగే గణపతి నాటకంలో గణపతి వర్ణన మనకి చెవుల ద్వారా కనపడేట్లు చేసింది. మధ్యాహ్నం పూట సర్వే చేసీ మండుటెండలో వచ్చినట్లుగా సి. రామ్మొహనరావు గారు తమ గొంతు ద్వారా ఆ వాతావరణంలోకి మనని తీసుకెళ్ళారు.నాటకం చివర్లో ఇల్లు అంటుకోవటంలాంటి వాతావరణాన్ని రేడియోలో సృష్టించటం నిజంగా అద్భుతం.

ఇంకా చెళుకులు,కబుర్లు, ఉషశ్రి ధర్మ సందేహాలు, సంగీత కార్యక్రమాలు మొదలైన కార్యక్రమాలను జనరంజకంగా తయారుచేసిన వారి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. వీరికి తగిన రీతిలో గుర్తింపు రాలేదు. ఇప్పుడు అలాంటి అవకాశం శివ గారి "రేడియొ అభిమాని" బ్లాగు ద్వారా పరిచయాలు కావటం కన్న కావల్సింది ఏముంది..

ఈ సందర్భంగా మనం విజయవాడ, హైదరాబాదు రేడియో స్టేషన్లతో పాటు తప్పనిసరిగా రేడియొ మాస్కొ మరియు సిలోన్ [ఎస్ ఎల్ బి సి] లను గుర్తు తెచ్చుకోవాలి. సిలోన్ లో మధ్యహ్నం వచ్చే అక్కయ్యగారి పరిచయం కూడ జరిగితే బాగుంటుంది.

ఆ అన్నట్లు సిలోన్ అంటే గుర్తు వస్తున్నాయి... షార్ట్ వేవ్ రావటానికి అప్పుడున్న రేడియోలకి చాలా కష్టపడాల్సి వచ్చేది. అవి వాల్వు రేడియొలు. వీటికి సిగ్నల్ క్యాచ్ చేసే శక్తి తక్కువ. మా ఇంట్లో హాలండ్ ఫిలిప్స్ రేడియో ఉన్నది. దానిలో మీడియం వేవ్ 1 బ్యాండు మరియు షార్ట్ వేవ్ లో 3 బ్యాండ్లు ఉన్నాయి. మీడియం వేవ్ లో విజయవాడ, మెడ్రాస్, హైదరాబాదు లాంటివి వినే వాళ్ళము. ఇవి రేడియో లోపల యాంటినాతో పనిచేస్తాయి.

కాని అసలు కష్టం షార్ట్ వేవ్ తోనే. ఇందులో కొన్ని బయట యాంటినా లేకుండా రావు. వాటికోసమని చెప్పి నేను మా అన్నయ్య కలిసి వైర్లతో రకరకాల డిజైనులు చేసి కర్రలకి కట్టి మేడమీద నుంచోబెట్టేవాళ్ళము. అలా మార్చినప్పుడల్లా కొత్త రేడియో స్టేషన్లు వస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. నాకు బాగా గుర్తు 11 లేక 13 మీటరు బ్యాండు మీద రేడియొ స్వీడన్ వచ్చింది మా అనందం చెప్పటానికి వీలులేదు. ఈ వైర్లూ... గోలా చూసి చుట్టుపక్కలవాళ్ళు కొందరు ఝడుసుకునేవాళ్ళు, కొందరు నవ్వుకునేవాళ్ళు. వాళ్ళని చూసి మేము నవ్వుకునే వాళ్ళము. నిజంగా అదొక ఆనందం.

సరే, ఇప్పటికే చాలా చెప్పేసినట్లున్నాను ఇప్పటికి ఇలా శలవు తీసుకుంటున్నాను. మళ్ళి కలుసుకుందాము

జై హింద్



19, సెప్టెంబర్ 2010, ఆదివారం

ఆకాశవాణి - వందేమాతరం


ఆకాశవాణి కేద్రాలన్ని కూడ పొద్దున్నే వారి ట్యూనింగు సిగ్నల్ వేసిన తరువాత, మొట్టమొదటి ప్రసారం చేసేదిమనందరికీ ఎంతో పరిచయం ఉన్న వందేమాతరం. పాటను కింది ప్లేయర్లో వినవచ్చు.



పాట విన్నప్పుడల్లా చిన్నప్పుడు స్కూలుకి వెళ్ళే రోజులే గుర్తుకు వస్తాయి, ముఖ్యంగా శీతాకాలపు ఉదయాన ఏడుగంటల వరకూ లైటు వేసుకోవాల్సి వచ్చిన పొగ మంచు రోజులే గుర్తుకు వస్తాయి. ఎంతో ప్రశాంతంగా హాయిగా పాడిన వందే మాతరం పాటలో భారత మాత మీది గౌరవం ప్రేమ వ్యక్తమవుతాయి. మధ్య ఆయనవేరో అతి తెలివి ట్యూన్ చేసి ఊహూ అరుస్తూ పాడే పాట కన్నా పాట ఎంత బాగున్నది.

భారత ప్రభుత్వ వెబ్ సైటులో కూడా ఈ పాటే ఉన్నది. ఈ కింది లింకు నొక్కి, అక్కడ కూడా వినవచ్చు.

వందేమాతరం

వందేమాతరం పాటను సంస్కృత బెంగాలీ భాషల మిశ్రమంగా ప్రముఖ బెంగాలీ రచయిత బంకించంద్ర చటర్జీ రచించారు.
పాటను రచించిన వెంటనే జాదూనాథ్ భట్టాచార్య సంగీతం సమకూర్చారు. పాటను మొట్టమొదటిసారిగా శ్రీ రవీంద్ర నాథ్ టాగూర్ 1896 లో కలకత్తా లో జరిగిన ఒక కాంగ్రెస్ సభలో పాడటం జరిగింది.

ఈ పాటను మనం పూర్తిగా కాకుండా
కుదించబడి కింద ఇచ్చినంత వరకే అనేక కారణాల వలన పాడుకోవలసి వస్తున్నది.
वन्दे मातरम
सुजलाम सुफलाम

मलयज शीतलाम
सस्य श्यामलां
मातरम
वन्दे मातरम
सुभ्र ज्योत्स्ना

पुलकित यामिनीम
फुल्ला कुसुमित
ध्रुमदला शोभिनाम
सुहासीनीम
सुमधुर भाषिणीम
सुखदाम वरदाम
मातरम

वंदे मातरम

ఆకాశవాణిలో మనం రోజూ వినే ఈపాటను పాడిన గాయనీ గాయకులూ ఎవరో తెలియరావటంలేదు. తెలిసిన వారు చెప్పగలరు.






****************************************************************

18, సెప్టెంబర్ 2010, శనివారం

రేడియో జ్ఞాపకాలు

(పై బొమ్మ బి బి సి వారి సౌజన్యం)
మా చిన్నతనంలో (1950) మా నాన్నగారు కొన్న మొట్టమొదటి రేడియో స్టీవర్ట్ వార్నర్ రేడియో(USA). చాలాకాలం ఆ రేడియో పనిచేసింది. బ్యాంక్ నుంచి రాగానే రాత్రి తొమ్మిది గంటలకు ఇంగ్లీష్ న్యూస్ వినే వారు. పేరు సరిగా గుర్తులేదు కాని మెలివిన్ మెలిడియో (తప్పయితే క్షమించాలి,కరెక్ట్ పేరు శివరామ ప్రసాద్ గారు చెప్పాలి) ఆయన గొంతు, ఉచ్చారణ వినడానికి చాలా బాగుండేది.

సాయంత్రం 4 గంటలకు రేడియో సిలోన్లో తెలుగు పాటలు వచ్చేవి.

ఆది వారం రేడియో అక్కయ్య,అన్నయ్యల పిల్లల ప్రొగ్రాములు మధ్యాహ్నం వచ్చేది. ఈ ప్ర్రొగ్రాముల విశేషాలతో ఆకాశవాణీ వారు "వాణి" అనే పక్ష పత్రికను మద్రాసు నుంచి ప్రచురించేవారు.

తరువాత ఫిలిప్స్ రేడియో కొన్నాము. ఇప్పటికీ మా ఇంట్లో వుంది.

మధ్యాహ్నం పూట కార్మికుల కార్యక్రమం వచ్చేది. అందులో కార్మికుల గురించి విశేషాలు సరదాగా ఇద్దరి పాత్రలచేత కబుర్లు రూపంలో చెప్పించే వారు. మధ్యలో సినిమా పాటలు వేసేవారు.

ఆదివారం సంక్షిప్త శబ్ద చిత్రం వచ్చేది. సినిమా డైలాగులు ప్రసారం చేసేవారు.

శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు రచించిన హాస్య నాటిక సీరియల్గా ప్రసారమయేది. ఇందులో గణపతి పాత్రను శ్రీ నండూరి సుబ్బారావు, అతని తల్లి శ్రీమతి సింగమ్మగా పి.సీతారత్నమ్మ, పుచ్చా పూర్ణానందం మొదలైన ప్రముఖ నటులు నటించేవారు. కడుపుబ్బ నవ్వించే ఈ నాటికను ఆకాశవాణి వారు ఆడియో సిడీగా విడుదలచేశారు. సిడి నంబరు PBTACD-016.ఈ సిడీ ఖరీదు రూ.195/- .విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రానికి వెళ్ళి ఈ సిడీ కొనుక్కున్నాను.


{తన జ్ఞాపకాలను మనతో పంచుకున్న వారు శ్రీ మట్టెగుంట అప్పారావుగారు, ప్రముఖ కార్టూనిస్టు- "సురేఖ"}

బాలవినోదం-బాలానందం విందాం...బాలల్లారా రారండోయ్

(బాలానందం చిన్న పిల్లల కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించి పిల్లలకే కాదు పెద్దలను కూడా వినేట్టుగా తయారు చేసిన ఒకే ఒక రేడియో దంపతులు శ్రీ న్యాపతి రాఘవరావు, శ్రీమతి న్యాపతి కామేశ్వరి)
బాలానందం రేడియో చందమామ
=====================

మీడియా విషయంలో మాది సంధి తరం. నేను శివ గారి వంటి సీనియర్ల మాదిరిగా పూర్తిగా రేడియోనుఆస్వాదించలేకపోయినా...చిన్నప్పుడు బాలవినోదిని" విని చాలా నేర్చుకున్నాను. " బాలవినోదిని" విందాము...బాలల్లారా రారండో....అనే పాట వింటే ఎందుకో భలే అనిపించించేది. గాయకులూ మంచిఊపుతో అది పాడటం ఒక ఎత్తయితే...బాల వినోదిని లో కార్యక్రమాలు మరొక అద్భుతం. ప్యాకేజ్ చాలాబాగుండేది. అది ఇప్పుడు వస్తున్నదో లేదో తెలియదు. టెలివిజన్ రొచ్చులో పడి రేడియో ను పట్టించుకోకుండా...నష్టపోయామని అనిపిస్తుంటుంది.

బాలానందం ల్ వచ్చిన మొద్దబ్బాయి పాటను ఈ కింది లింకు సహాయంతో వినవచ్చు

మొద్దబ్బాయి
(సౌజన్యం శ్రీ బుర్రా రాంచంద్ మరియు శ్రీ మాగంటి వంశీ)

నేను కొత్తగూడెం ఎఫ్.ఎం.లో కాజువల్ ప్రొడక్షన్ అసిస్టంట్ గా కొద్ది కాలం పనిచేసాను. అక్కడి నాసిరకంఉద్యోగులు కూడా రేడియో పై నా ఆశక్తి నశించడానికి కారణం. బుర్ర లేని, తెలుగు సరిగా రాని వాళ్ళు కూడాచక్కని సౌకర్యాలు అనుభవించేవారు.

ఆదివారం నాడు గంట పాటు వచ్చే నాటికను మా ఇంట్లో అందరం నరాలు బిగబట్టి వినడం నాకు ఇంకా గుర్తు. ముఖ్యంగా మా అమ్మ దానిపై చర్చ జరిపి కాస్త బుర్ర పెరగడానికి ఉపకరించేవారు. ఇది కాక....క్రికెట్వ్యాఖ్యానం వినే భాగ్యం కూడా రేడియో వల్లనే దక్కింది.

'రేడియో అభిమాని' ని ఆరంభించిన శివ గారికి అభినందనలు. రేడియో రంగంలో వారు చేస్తున్న అద్భుత కృషికి హ్యాట్సాఫ్. Good Luck Shiva gaaru.
S.Ramu
A P మీడియా కబుర్లు