వపా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వపా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, అక్టోబర్ 2012, బుధవారం

త్రిశంకు స్వర్గం

    పై బొమ్మ చందమామ పత్రిక వారి సౌజన్యం    
త్రిశంకు స్వర్గం ఏర్పాటు గురించిన కథ అందరికీ తెలిసినదే. కాని ఆ స్వర్గం కాని స్వర్గం ఏర్పాటు దృశ్యం ఇంతవరకూ ఏ చిత్రకారుడూ చిత్రించినట్టు  నాకు తెలియదు. మనందరికీ తెలిసిన అద్భుత చిత్రకారుడు శ్రీ వడ్డాది పాపయ్య గారు చిత్రించిన బొమ్మ ఇది. దేవీ భాగవతం ధారావాహికగా వస్తున్నా రోజుల్లో మాట. మూడు దశాబ్దాల  పైగా కాలం నడిచిపోయింది! ఎన్నాళ్ళయినా ఆ పురాణ ఘట్టాన్ని  బాగా చిత్రించ గలవారు వడ్డాది పాపయ్య గారొక్కరే.




మునుపు ఈ బ్లాగులో ప్రచురించిన వ్యాసం సెప్టెంబరు 2011లో. మళ్ళీ సంవత్సరం పైన  నెల తరువాత మరొక వ్రాత ఈ బ్లాగులో ఇప్పుడే. ఇన్నాళ్ళు ఏ విధమైన కొత్త వ్యాసాలూ వ్రాయకపోయినా బ్లాగును తీసేయ్యకుండా ఉంచిన బ్లాగర్ డాట్ కాం వారికి కృతజ్ఞతలు ఈ బ్లాగు బృందంగా ఏర్పడి నడపబడుతున్నది. కొత్తల్లో బృంద సభ్యులు సహజంగా ఉత్సాహంగా ఆధ్రులం కాబట్టి ఆరంభ శూరత్వం చూపాము కాని రాను రాను ఉత్సాహం నశించినట్టుగా ఉన్నది.  ఈ ఉత్సాహం తగ్గటం గురించి బృంద సభ్యులందరూ ఆలోచించగలరు.

అలనాటి చందమామ  అభిమానం ఉన్నవారు ఎవరైనా సరే ఉత్సాహంగా వ్యాసాలూ, సమీక్షలు తరచూ వ్రాయగాలవారిని బృందం లోకి ఇదే ఆహ్వానం. అలనాటి చందమామ అభిమానులు తప్పక స్పందించగలరు.






31, అక్టోబర్ 2010, ఆదివారం

పాపయ్య గారి అద్భుత చిత్రాలు

చందమామ పత్రిక చేసుకున్న అదృష్టాలలో ఒకటి వారికి వడ్డాది పాపయ్య గారు చిత్రకారునిగా దొరకటం, నెలసరి జీతానికి ఆయన పని చేయటానికి ఒప్పుకోవటం. పాపయ్య గారికి ఆ నెల జీతమే దక్కింది కాని, రావలిసిన పేరు ప్రఖ్యాతులు అంతగా రాలేదు. చాలామంది పాపయ్యగారు పురాణ చిత్రాలు మాత్రమె వేశారని అనుకుంటూ ఉంటారు. కానీ, నిజానికి, పాపయ్య గారు సాంఘిక కథలకు, జానపద కథలకు కూడ బొమ్మలు వేశారు. చక్రపాణి గారు బెంగాలీ నుండిఆంధ్రీకరించిన శరత్ నవలలు అన్ని 'యువ' పత్రికలో ప్రచుచేవారు. వాటన్నిటికి బొమ్మలు వేసినది పాపయ్య గారే. చందమామలో వేసిన చిత్రాలలో, అరణ్య పురాణం ధారావాహిక కు వేసిన చిత్రాలు అమోఘం. బొమ్మలు చూస్తె చాలు కథ చదవాలిసిన అవసరం లేదు. పూర్తిగా అర్ధం అయిపోతుంది. పైగా, ఆ బొమ్మలు రంగుల్లో, ఆయన కుంచే నుండి అద్భుతంగా జాలువారాయి. ఆ బొమ్మలలో కొన్ని చూడండి.



చిత్రాలు చందమామ వారి సౌజన్యంతో
అరణ్య పురాణం చిత్రాలతో చేసిన ఒక స్లైడ్ షో చూడండి.










19, అక్టోబర్ 2010, మంగళవారం

మనకు కనబడే వడ్డాది పాపయ్య...



వడ్డాది పాపయ్య గారు ఎప్పుడూ ప్రచారానికి దూరంగా వుండే వ్యక్తి కావడం తో ఆ మహోన్నత కళాకారుణ్ణి మనం ఆయన బొమ్మలలోనే చూసుకోగలుగుతున్నాం...తన కంటే తన కవితకూ, లేదా శిల్పానికీ లేదా చిత్రాలకూ శాశ్వతత్వం లభించాలని కోరుకొనే కవులూ, శిల్పకారులూ, చిత్రకారులూ వారి కళ కోసం జీవితాన్ని ధారబోసి వారు అజ్ఞాతంగా ఉండిపోయే దాఖలాలు ఎన్నో... అట్టివారు నిజంగా కారణ జన్ములూ త్యాగధనులూనూ ..
కానీ అజరామరమైన ఆ కళతో పాటూ వారికి కూడా సముచిత స్థానాన్ని ఇచ్చి వారి 'పేరు' కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలబడేలా చెయ్యడం కళారాధకులుగా మనందరికీ సమానమైన బాధ్యత వుంది.. వారి సేవలందుకున్న చందమామ యాజమాన్యానికి ఈ బాధ్యత కొంచం ఎక్కువ సమానం అని నా ఉద్దేశం .

వపాగారి బొమ్మలు ఒక్కొక్కటీ ఒక్కో ఆణిముత్యం.మన భారతీయ సంస్కృతినీ, పురాణేతిహాసాలనీ ఆయన ఔపోసన పట్టారా, లేక వాటిలోని పాత్రలన్నిటినీ దర్శించ గలిగిన అపర వ్యాస భగవానుడా అన్నంతగా ఆ సన్నివేశాలను కథకు తగ్గట్లుగా చిత్రించారు. చూసిన కొద్దీ చూడాలనిపించే ఆ బొమ్మల్లో ఎంతో లోతైన భావ చిత్రణ...బొమ్మ ప్రతి గీతలో........ప్రాధాన్యత బట్టీ ఆ పాత్రల పరిమాణం .. ఆహార్యం..నేపథ్యం..వాతావరణం.. ఇలా చాలా అంశాలు పరిగణనలోకి తీసుకున్నట్టుంటాయి. అలాగే మొదటి సారి చూచినప్పుడు మన కళ్ళబడని అంశాలు రెండోసారీ, మూడోసారీ చూస్తున్నప్పుడు కనబడితే..ఒక రకమైన సంభ్రమం కలిగే సందర్భాలు అనేకం. భూ నభొంతరాలని, గడ్డిపూవునీ, అలాగే విశ్వరూప వినాయకుడినీ ప్రక్కనే చిట్టెలుకని గీసేటప్పుడు కూడా కూడా అదే శ్రద్ధ, అదే నిశిత దృష్టి...!అన్నిటినీ సమన్వయపరుస్తూ ఆయన గీసే గీతాలేమో అనిపించే గీతల వంపు సొంపులూ, వాటి లయ విన్యాసం..దానిలోనే ప్రణవ స్వరూపమైన ఓంకారం.. అదో నవలోకం!!. నభూతో .. అనిపించే రీతిలో ఇన్ని అంశాలను తనలో ఇముడ్చుకున్న ఆ సంపన్నత వారి కళదే కానీ అది వేసేందుకు వాడిన ఉపకరణాలది కాదు. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం..వారు చిత్తుకాగితం లాంటిదానిమీద కూడా కేవలం వాటర్ కలర్స్ / చార్కోల్ పెన్సిల్ వాడి అద్భుతాలు సృష్టించేవారని వారిని దగ్గరగా చూసిన ఇంకొక ఆర్టిస్ట్ శ్రీ చలపతిరావుగారు చెపుతారు.

రాజా రవివర్మ గారిది ఒక ప్రత్యేకమైన శైలి. అవి ఎక్కువగా ఆయిల్ పెయింటింగ్స్. చాలా సహజంగావుంటాయి. దేవతా మూర్తుల బొమ్మల నిష్పత్తి ..మనుషుల లాగే చాలా స్వాభావికం గా వుంటాయి. "అతి" వుండదు.. కానీ వపా గారిది శైలి, ఆ ఒరవడి అనితరసాధ్యం అనిపిస్తుంది. విషయంతో పాటుగా ఆయనసృష్టించే మాయాలోకం ముందు ఎంతటివారికైనా సంభ్రమాశ్చర్యాలు కలుగక మానవు. మనవాళ్ళు ఇప్పుడుకోట్లకు కోట్లు ఖర్చుపెట్టి చేసే గ్రాఫిక్ వర్క్ అంతా ఆయన కసింకోట లో కొన్న మామూలు కామెల్ వాటర్కలర్స్ తోటే సృష్టించేసే అపర బ్రహ్మ. తేడా అల్లా ఏంటంటే రవివర్మ గారి పెయింటింగ్స్ వేలం పాటల్లోతిరుగుతూ.. ఖరీదైన భవంతుల్లో అలంకరణగా వినియోగమైతే మన వపా గారివి..సామాన్యుల గుండెల్లోపదిలంగా వున్నాయి. ఆ అట్ట మీద బొమ్మలోనే దేవుడిని చూడగలిగి ఫ్రేము కట్టించి పెట్టుకున్నవారెందరోవున్నారు. (మా ఇంట్లో వపా గారి పెయింటింగ్ రాములవారిది బ్లాకు అండ్ వైట్ లో వుండేది. అది మానాన్నగారు వారి చిన్నప్పుడు 'యువ' లో పడితే కట్ చేసి ఫ్రేం కట్టించి పెట్టుకున్నారు. ఒకపక్క కలర్ , ఇంకోపక్క బ్లాకు అండ్ వైట్.. ఇంచుమించు మేము పదో క్లాసు చదివేతంట వరకు కూడా బయటకెళ్ళేటప్పుడు ఆ రాముడి ఫోటో కి దండం పెట్టవలసిందే..పరీక్షల టైం లో మరీను.. ఇల్లు కడుతున్నప్పుడుఅనుకుంటా నానిపోయి చెదపట్టేసి పాడైపోయింది.)

ఎంత చూసినా ఎన్నిసార్లు చూసినా తనివి తీరని అలాంటి అపురూప చిత్ర రాజాలను (ఒరిజినల్స్ అని నాభావన) 'కలిగి' ఉండడమనే అదృష్టానికి తోడూ సరైన రీతి లో భద్రపరచడం అనే బాధ్యత కూడా చందమామయాజమాన్యం మీద వుంది. అలా చేసి వుంటారనే నమ్ముతున్నాను. అయితే వాటిని చందమామముఖచిత్రంగా మాత్రమే కాక మరింత విస్తృతంగా ప్రచారం కల్పించి మనలాంటి అభిమానులకి వారిగురించీవారి చిత్రాలను గురించీ మరింత తెలుసుకొనే అవకాశాలను కల్పించగలిగితే బాగుంటుంది.

1 . వారి చిత్రాలన్నిటినీ అన్నిటినీ గుది గ్రుచ్చి ఒక జాబితా ప్రచురించాలి..
2 . వారు మొత్తం మీద వేసిన చిత్రాలెన్ని.. ?! వీలైతే తేదీల వారిగా జతపరచ గలిగితే మరీమంచిది. క్లుప్తంగానైనా వారి జీవితం గురించి ఓ నాలుగు ముక్కలు..!!
3 . కళ పోషకులకు వాటిలోంచి బొమ్మ సంఖ్య చెప్పి ఆర్డర్ మీద తెప్పించుకోగలిగే సదుపాయం వుండాలి.
4 . అన్నిటినీ మించి వారి ఒరిజినల్ పెయింటింగ్స్ ని అపుడప్పుడైనా అభిమానుల సందర్శనార్ధం ప్రదర్శించాలి.శాశ్వత ప్రాతిపదికన ఒక మ్యుజియం పెడితే మంచిది. (బొంబాయికి తరలిపోయి. ఉన్న మంచి శీర్షికలే తీసేస్తున్న చందమామ యాజమాన్యం మన తెలుగు వాడైన వపా గారి మీద అంత శ్రద్ధ కనబరుస్తుందా... ? వారినుంచి ఇన్ని ఆశించడం అత్యాశ అవుతుందా... ??)
******
మన అభిమానుల అభిలాష ఇలా వుంటే వపా గారి మనస్తత్వం ఇంకోలా వుండేది...!!
ఆయన తన సన్నిహితులకి వ్రాసిన ఉత్తరాలు.. ఆయన మనస్తత్వానికి అద్దం పడతాయి...!! ఆ విషయాలు ఇంకో టపాలో...
(పైన వ్రాసిన విషయాలు నేను చిన్నప్పటినుంచి చూస్తున్న వపా గారి బొమ్మల గురించి నాకు తోచిన విషయాలు మాత్రమే...ఏమైనా తప్పులుంటే విజ్ఞులెవరైనా సరి చేస్తే సంతోషం)
(వపా గారి ఫోటో చిత్రకళా పరిషత్ సౌజన్యంతో )
- రాధేశ్యాం
సొంతఘోష