26, జనవరి 2012, గురువారం

జాతీయ చిహ్నాలు-ఎన్నికల గుర్తులు :: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యెక వ్యాసం




 జాతీయ పతాకానికి, కాంగ్రెసు జండాకి వున్న తేడా తెలీదు. ఇలాంటి ప్రజలుంటారనే మన నెహ్రూ గారు కాంగ్రెసు జండాలో రాట్నం పీకి పారేసి చక్రం పెట్టారు. ఆ జండా ఈ జండా ఒకటే అనే భావం కలిగేలా జాతీయ పతాకాన్ని రూపొందించకుండా వుండవలసింది. 
-పురాణం సుబ్రహ్మణ్య శర్మ
"ఎన్నికలలా"  వ్యాసం నుండి (ఇల్లాలి ముచ్చట్లు వ్యాస పరంపరలో) 



ప్రజాస్వామ్యం అంటే ముఖ్యంగా  ఎన్నికలు. ఎన్నికల్లో ఎన్నికైన మనిషి మన ప్రతినిధిగా తనలాగా ఇతర ప్రాంతాల నుండి ఎన్నికైన  ప్రతినిధులతో కలిసి మన పరిపాలనా వ్యవహారాలూ చూడాలి. ఆ మనిషిని ఎన్నుకోవటం ఎలా? ఓటు వెయ్యాలి. ఓటు అంటే ఎలా వెయ్యాలి? అలా మన ప్రతినిధి అవ్వాలని ఉవ్విళ్ళూరుతున్న "మానవ మాత్రులు" (ఈ మధ్య  వాళ్ళు దైవాంశ సంభూతలమని అనుకుంటూ మనకు నమ్మబలకటానికి  ప్రయత్నిస్తున్నారు మరి!) వారి పేర్లు అన్ని ఒక జాబితాగా మన ముందు పెడితే మనకు నచ్చిన వ్యక్తికి మన ఆమోదం తెలపటమే ఓటు వెయ్యటం. అలా ఆమోదం తెలిపే పత్రమే బాలట్ పేపరుట. చాలా మంది చదువుకున్నాం, మా కాలరు ఎప్పుడూ తెలుపే అనుకునే సజ్జు ఆ బాలట్ పేపరు మొహం చూడటం సిగ్గు చేటు అనుకుంటూ ఉంటారు "ట", పైగా అవినీతి నశించాలి అని టి వి కెమెరాల ముందు తెగ అరుస్తూ కనిపిస్తుంటారు కూడా.

అసలు విషయంలోకి వస్తే, ఎన్నికల్లో మనకు కావలిసిన   అబ్యర్ధిని ఎన్నుకోవటానికి ఎన్నికల  గుర్తు అంటూ ఉండాలా? ఉంటే ఎలాంటివి ఉండాలి. అసలు ఎన్నికల  గుర్తు లేకపోతె వచ్చే నష్టం ఏమిటి?

ఉత్తర ప్రదేశ్ లో జరగబోతున్న ఎన్నికలకు ముందు ఒక పథకం ప్రకారం జరిగిన నాటకం చూస్తుంటే,  ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ గురించి మన దేశంలో పెద్దగా అర్ధం చేసుకున్నట్టుగా కనపడదు. లేదా ప్రముఖ రష్యన్  రచయిత అలెగ్జాండర్ సోలెజెట్సియాన్  అన్నట్టుగా మనం పొరబాటు తెలియక చెయ్యం, ఆ పొరబాటు చెయ్యటం మనకు సౌకర్యం,  అందుకనే పొరబాట్లు చేస్తూనే ఉంటాము.

ఈ విషయంలో ప్రముఖ నటుడు, రచయిత శ్రీ గొల్లపూడి మారుతీ రావుగారు "తుంటి పళ్ళు" అనే శీర్షిక తో ఒక వ్యాసం వ్రాశారు. ఈ కింది లింకు నొక్కి ఆ వ్యాసం చదువుకోవచ్చు.

ఈ వ్యాసం చదివినాక, ఈ రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా నా ఆలోచనలకు అక్షర రూపం ఇద్దామని అనిపించింది.



ఈ వ్యాసం మొదట్లో ఉదాహరించిన పురాణం సుబ్రహ్మణ్య శర్మగారి కొటేషన్ చూస్తె, మన జాతీయ జెండా  దగ్గర నుండి కూడా ఒక పథకం ప్రకారం ఒకే పార్టీకి అనుకూలంగా ఉండేట్టుగా తయారు చేసుకున్నట్టు కనపడుతుంది. ఒక పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య పోరాటం చివరి ఘట్టం జరిగిందని ఒప్పుకుందాం. ఆ పోరాట సమయంలో 1921 నుంచి 1947 దాకా అనేక అంశాలు ఆ పార్టీ  చేతులోనే ఉన్నాయి. పింగళి వెంకయ్య గారు తయారు చేసిన జెండా నమూనాను అది పార్టీ పతాకమా లేక జాతీయ జెండానా అనే విషయం ఇతమిద్ధంగా తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు. జాతీయ జెండా తయారి తరుణం వచ్చినప్పుడు, అంతకు ముందు వెంకయ్య గారు జెండా మధ్యలో ఉంచిన  రాట్నాన్ని  తీసేసి, అశోక చక్రం ఉంచి ఇదే మన జాతీయ జెండా అనేసారు. రాట్నం తో ఉన్న జెండాను తమ పార్టీ జెండాగా స్వంతం చేసుకున్నారు. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం జరిగిందని  దేశ ప్రజలు బాధా పూర్వకంగా అనుకోవటం తప్ప చెయ్యగలిగింది ఏమున్నది!

ఎందుకు అంటే, అంతవరకూ స్వాతంత్ర్య సమరంలో మన జెండా గా అందరికీ తెలిసిన ఒక జెండా లో అతి చిన్న మార్పు చేసి దాన్ని జాతీయ జెండా అనేసి, అంతకు ముందు ఉన్నది తమ పార్టీ జెండా చేసుకున్నారు (మొత్తం తమ చేతులోనే ఉన్నది కాబట్టి) అప్పటి తెలివైన రాజకీయ నాయకులు. ఆ రోజుల్లో  ఇలాంటి విషయాలను కూలంకషంగా పరిశీలించి, ఆ పార్టీ దూరదృష్టితో (దురద్రుష్టి!) చేసిన పనిలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి, విమర్శ చేసి ఆపగలిగే  పరిస్థితి లేదు. ప్రతిపక్షం అనే మాటే తెలియదు అప్పట్లో. ఎంతో కాలం వరకూ, ఎందుకు ఇప్పటికి కూడా కాంగ్రెస్ జెండాకు జాతీయ జెండా కు చాలా మందికి తేడానే తెలియదు.

1977  లో కాంగ్రెస్ తాను  చేసిన పాపాలకు,  అప్పటి ఎన్నికల్లో ఓడిపోయి, జనతా పార్టీ ప్రభుత్వం లోకి వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన  మూడు దశాబ్దాల తరువాత , కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ కాకుండా మరొక పార్టీ ప్రభుత్వం లోకి వచ్చింది. అప్పటికే అర కోరగా అక్కడక్కడా ఇతర పార్టీలు రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లోకి వచ్చినా, మీడియా వాళ్ళు (తెలిసో మరి తెలియకో మరి) ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలు అనే వాళ్ళు! అంటే  ఒక్క కాంగ్రెస్సే పాలక పార్టీ,  మిగిలిన ఏ పార్టీ గెలిచి ప్రభుత్వంలోకి వచ్చినా, అది ప్రతిపక్ష ప్రభుత్వం అనుకునేంతగా బ్రెయిన్ వాష్  అయిపోయ్యారు పాపం.

జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తల్లో, నేను (అప్పుడు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాను) విజయవాడలో సిటీ బస్సులో వెడుతున్నాను. అది ఆగస్ట్ నెల. నేను పేపరు చూస్తుండగా, పక్కన కూచున్న ఒక పెద్దాయన (అరవై ఏళ్ళు పైబడి చదువుకున్న వాడిలాగానే కనపడ్డాడు) "ఇప్పుడు పదిహేనో తారీకున జనతా పార్టీ జెండా ఎర్ర కోట మీద ఎగరేస్తారా?" అని అడిగాడు. నేను ఆయన మాట విని నివ్వెరపోయాను. ఆయన దృష్టిలో ఇన్నాళ్ళూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి, వాళ్ళ జెండా ఆగస్ట్ పదిహేనుకు, జనవరి ఇరవై ఆరుకు ఎగరేస్తున్నారని అనుకుంటున్నాడు. జాతీయ పర్వ దినాలకు ఎగరేసేది కాంగ్రెస్ జెండా కాదు అది జాతీయ జెండా అని ఆయనకు తేడా తెలియలేదు. తప్పు ఆయనది కాదు. రెండూ దాదాపు ఒక్కలాగే ఉండేట్టుగా  చేసినవారి పథకానిది. నేను నా ఆశ్చర్యం నుంచి చప్పున బయటపడి, నాకు తెలిసినంత వరకూ, జాతీయ జెండా కు ఒక పార్టీకి చెందిన జెండాకు తేడా తెలియచేసే ప్రయత్నం చేసాను. కాని ఎంత మందికి తెలుసు ఈ తేడా.

ఇప్పుడు, ఉత్తర ప్రదేశ్ లో అక్కడ ప్రభుత్వంలో ఉన్న పార్టీ అధినేత్రి తన విగ్రహాలను, తమ పార్టీ గుర్తు ఐన ఏనుగు విగ్రహాలను, ఎక్కడ పడితే అక్కడ నిలబెట్టేసిందావిడ. బతికున్న వాళ్లకి విగ్రహాలు నాకు తెలిసి సంజీవ రెడ్డికి, వాళ్ళ ఊరు నంద్యాలలో కాకుండా 1965 - 66 ప్రాంతాల్లో   విజయవాడ నడిబొడ్డున పెట్టారు. ఆ తరువాత అతి కొద్దికాలంలో వచ్చిన విశాఖ ఉక్కు ఉద్యమం లో ఆ విగ్రహాన్ని పీకి కింద పడేసి, పక్కన ఉన్న ఏలూరు కాలవలో పారేశారు. ఇది ప్రస్తుతానికి పిడకల వేట అనుకొండి.

మళ్ళీ విషయంలోకి వస్తే, ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల "కార్తె " వచ్చిందని పసిగట్టి పార్టీలన్నీ ఒకటే గోల మొదలు పెట్టినాయి. ఈ సల్మాన్ రష్డీ  విషయం కూడా ఈ గోలలో భాగమే. ప్రధానంగా ఇతర పార్టీ వాళ్ళు, "ఏమిటిది ఫలానా పార్టీ గుర్తు, ఆ పార్టీ అధినేత్రి విగ్రహాలు రాష్ట్రం నిండా ఉన్నాయి, ఠాట్ వీల్లేదు అంటే వీల్లేదు. ఇలా ఉంచితే ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసినట్టే" అని రగడ మొదలు పెట్టారు. అప్పటివరకూ ఈ విషయం "తెలియనట్టున్న" (??!!) ఘనత వహించిన ఎన్నికల సంఘం వారు  ఒక ఉత్తర్వు వదిలారు. ఆ ఉత్తర్వు ప్రకారం, ఏనుగు విగ్రహాలను అన్నిటినీ (ప్రభుత్వం ఖర్చుతో) పెద్ద పెద్ద కాన్వాసు గుడ్డలతో కేప్పేట్టమని. వాళ్ళ (అమాయకపు అందామా!) ఉద్దేశ్యం ఎన్నికలు అయ్యేవరకూ ఇలా గుడ్డలతో కప్పెట్టేస్తే, ఆ కింద ఉన్నది ప్రజల దృష్టిలో పడదు, ఆ విధంగా ఆ "ముసుగు" కింద ఉన్న ఏనుగు విగ్రహాలు ప్రజలను ఎన్నికల్లో ప్రభావితం చెయ్యవు అని. కానీ ప్రజలకి తెలియదా ఇన్నాళ్ళూ అక్కడ చూసినదే కదా, ఇప్పుడు ముసుగేసారు. పైగా ఆ ముసుగు ఎలా వేసారు? పైన గుడ్డ వేసి ఘాట్టిగా కట్టేప్పటికి లోపల ఉన్నదాని నమూనా చక్కగా తెలుస్తున్నది. ఇదే గుమాస్తా బుద్ది అంటే. ఇక్కడ గుమాస్తా అంటే  బ్యూరోక్రాట్ అని నా ఉద్దేశ్యం. ఎన్ని ప్రమోషన్లు వచ్చి ఇప్పుడు ఏదో గంభీరమైన పేరుగల పదవిలో ఉన్నా బుర్ర మటుకు గుమాస్తాదే!  అంతకంటే ఆలోచనా పరిధి   పెరగలేదు అని  తాత్పర్యం.


ఫోటో కర్టెసీ ఫోటో బ్లాగ్ (క్లిక్)

ఈ కప్పెట్టిన విగ్రహాలు చూసి, అంతకు ముందు పెద్దగా గమనించని వాళ్ళు కూడా ఇప్పుడు ముసుగులేసిన తరువాత చూసి "ఓహో ఇది ఫలానా పార్టీ గుర్తు, మనకు తెలియకుండా కప్పారు, పేపర్లోనూ, టి విల్లోనూ తెగ చూపిస్తున్నారు" అని అనుకుని తీరతారు. దీనివల్ల ఇంతకు ముందు ఓటర్లు ప్రభావితం అయ్యే దానికన్నా వెయ్యి రెట్లు ప్రభావితం అయ్యి తీరతారు. ఇది మన గుమాస్తాల (అతి) తెలివి.

ఇలా ఆ పార్టీ గుర్తు ఏనుగు  కాబట్టి  ఆ ఏనుగు విగ్రహాలకు ముసుగులు వేయించారు , బాగానే ఉన్నది. మరొక పార్టీ గుర్తు "హస్తం" కదా! మనిషన్న తరువాత  ఆడా ,మగ తేడా లేకుండా ఒకటి కాదు రెండేసి చేతులు ఉంటాయి కదా. మరి వాటిని ఏమి చెయ్యాలి ఈ ఎన్నికలు అయ్యేవరకూ?! గ్లోవ్స్ వేసుకుని తిరగమని, తమ చెయ్యి వంక చూడకూడదని ప్రజలకు ఆదేశాలు జారీ చెయ్యాలా. ఓటు వెయ్యాలన్న కూడా ప్రజలు ఆ హస్తంతోనే వెయ్యాలి కదా అప్పుడు గుర్తుకు రాదా "హస్తం" ఫలానా పార్టీ గుర్తు అని?!! ఓరి గు..మా..స్తా..ల్లారా ఆ హస్తం గుర్తు ఆ పార్టీకి ఇచ్చేప్పుడు ఏమయ్యింది మీకు ఉందని భ్రమపడుతున్న బుధ్ధి/తెలివి! 

ఇదే కాదు. అదే పార్టీ తీసుకున్న మొట్టమొదటి గుర్తు "రాట్నం". స్వాతంత్ర్య సమరం లో  ప్రముఖ పాత్ర వహించిన చేనేత ఉద్యమానికి గుర్తు రాట్నమే కదా. రాట్నం చూడగానే ఓటు వెయ్యటానికి వచ్చిన వాళ్లకు ఏమనిపిస్తుంది. ఈ పార్టీనే కదా స్వాతంత్ర్య తెచ్చిపెట్టింది  వీళ్ళకే మన ఓటు వెయ్యాలి అనిపిస్తుంది.   ఓ కే స్వాతంత్ర్యం తెచ్చి పెట్టింది సరే ఆ  పాట ఎన్నాళ్ళు పాడి ఓట్లు సంపాయిస్తారు! ఇలా అనిపించేట్టుగా చెయ్యటం ప్రజలను తమ ఎన్నికల గుర్తుతో ప్రలోభ పెట్టటం కాదా! అందుకనే పాపం గాంధీ గారు స్వాతంత్ర్యం సిద్ధించగానే, తమ పార్టీని రద్దు చేద్దాం అని ప్రతిపాదించారు. రోజూ ఆయన నామ జపంతో పబ్బం గడుపునే రాజకీయ నాయకులు ఆయన చేసిన సూచన ఒప్పుకున్నారా? అమలు చేసారా? లేనే లేదు. తమకు అనుకూలంగా గాంధీ గారి పడికట్టు మాటలను మనమీద ప్రయోగిస్తూ ఓట్లు దండుకుంటున్నారు.  ఈ విషయంలో  ప్రముఖ రచయిత చలం గారు  అన్న మాటలు జ్ఞాపకం  వస్తున్నాయి:

"గాంధీగారి అహింసా సిద్ధాంతం ఒక ఉపకరణ, ఒక పాలసీ,  ఆయన అనుచరులకి.  ఒక ధర్మం  కింద, ఒక సత్యంకింద, ఎవరికీ విశ్వాసం లేదు".(మ్యూజింగ్స్ 290వ పుట-5వ  ముద్రణ)



ఆ తరువాత కొన్నాళ్ళు కాడి జోడేద్దులు గుర్తు. మనది వ్యావసాయిక దేశం. కాడి జోడేద్దులు ఏ పల్లెటూరులో అయినా సరే కనపడేవి. ఇలా వ్యవసాయానికి గుర్తుగా  ఉండి ప్రజలు అనుక్షణం  తమ రోజువారి జీవితంలో వాడుకునే లేదా చూసే  వాటిని  ఒక పార్టీకి గుర్తుగా ఇవ్వటం, ఓటింగ్ సమయంలో ప్రజలను ప్రభావితం చెయ్యటం కాదా !!? ఆపుడూ ఎవ్వరూ అభ్యంతర పెట్ట లేదు.

 తరువాత  1969  లో  అదే పార్టీ, తమ పార్టీలో చీలిక సాకు చూపించి, "ఆవు దూడ" తమ ఎన్నిక చిహ్నాన్ని చేసేసుకున్నది. ఈ గుర్తు గురించి ఎమర్జెన్సీ కాలంలో చాలా జోకులు పేలాయి. ఆవు హిందువులకు పవిత్రం. ఆవులు దూడలు రోజూ అందరికీ ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో కనపడుతూనే ఉంటాయి, ఎప్పుడు చూసినా ఆ పార్టీ ఎన్నికల చిహ్నమే  గుర్తుకు వస్తుంది. అప్పుడేవ్వరూ అభ్యంతరం పెట్టిన దాఖలాలు, లేదా అభ్యంతరం పెట్టినా  ఖాతరు చేసిన ఉదాహరణలు మచ్చుకి కూడా లేవు. కారణం  ఏమిటో ఆ "పైవాడికే" తెలియాలి.

మన దేశంలో ఇలా ఎన్నికల గుర్తులు, జాతీయ చిహ్నాలను దుర్వినియోగ పరచటం ఇప్పుడిప్పుడే మొదలవ్వలేదు. మనం  రిపబ్లిక్ (అంటే జనవరి ఇరవై ఆరు 1950 ) అవ్వటానికి ముందే ఈ దుర్వినియోగానికి మూలాలు ఉన్నాయి.
ఈ వ్రాసినది అంతా ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం ఏనుగు విగ్రహాల గురించి జరిగిన విషయం సమర్ధించటానికి ఎంత మాత్రం  కాదు. ఇలాంటి "ట్రిక్" చెయ్యటం ఆ పార్టీకి సరిగ్గా చేతవలేదు, మరొక పార్టీ దశాబ్దాలబట్టి  ఇదే పని చేస్తున్నది and they are getting away with it అని చెప్పటానికి మాత్రమె.

నా దృష్టిలో ప్రస్తుతం ఈ రిపబ్లిక్ డే సందర్భంగా తీసుకోవాలిసిన నిర్ణయాలు:

  • జాతీయ జెండా లో  ఉన్న  రంగులను ఒక్కటి గా కాని రెండు మూడు కలిపి గాని ఏ రాజకీయ పార్టీ కూడా తమ పార్టీ జెండా లో  వాడకూడదు. అన్ని ప్రధాన పార్టీలు కాషాయం, ఆకుపచ్చ కాబినేషన్లో నిలువుగానో, అడ్డంగానో తమ జెండాలు చేసుకుని ప్రజలను తికమక పెట్టి, జాతీయ జెండా అంటే ఎలా ఉంటుందో తెలియకుండా చేసిపారేసారు. 
  • మనం  రోజూ చూసే, వాడే వస్తువులు, జంతువులు,  శరీర భాగాలు ఎన్నికల్లో చిహ్నాలుగా ఉంచటం నిషేధించాలి. హస్తం, గడియారం, పెన్ను, సైకిలు, కొడవలి, సుత్తి, కంకి, ఆవు, ఏనుగు వగైరా వగైరా . అమెరికాలో చూడండి అక్కడ ఉన్న రెండు పార్టీల ప్రజాస్వామ్యం (మనకు ముక్క పార్టీల ప్రజాస్వామ్యం) కాబట్టి రెండే గుర్తులు, అవి కూడా వాళ్ళ దేశంలో పెద్దగా కనపడని గాడిద, ఏనుగు. అలాగే మనదేశంలో కూడా చిహ్నాలు ఇక్కడ పెద్దగా కనపడని తెలియని జంతుజాలం, పశుపక్ష్యాదులు  వంటివి    మాత్రమె అనుమతిం చాలి.
  • మనం ఎన్నుకోవాల్సిన అబ్యర్ధి మొహం అన్నా ఆ నియోజక వర్గం ప్రజలకు తెలిసి ఉండాలి కదా! వేరే ఎన్నికల గుర్తు దేనికి? ఆ అభ్యర్ధి క్లోజప్ ఫోటో (మొహం మాత్రమె) గుర్తుగా ఉంచేస్తే సరిపోతుంది కదా. ప్రజలకి ఏ మొహం ఎక్కువ పరిచయమో, అంటే ఎవరు  తమకు ఎక్కువసార్లు కనపడుతున్నాడో ఆ "మొహానికే" ఓటి వేస్తారు. ఈ గుర్తులు వగైరాల గొడవ ఉండదు


  •  ఓటు హక్కును, "ఓటు బాధ్యతగా" మార్చి, ఓటు వెయ్యటం తప్పనిసరి చెయ్యాలి. ఓటు వేసిన వ్యక్తికి ఒక రసీదు రావాలి. ఇప్పుడున్న ఎలెక్ట్రానిక్ యంత్రాలలో ఓటింగ్ ముగిసినాక, రసీదులను అన్ని పార్టీ ప్రతినిధుల సమక్షంలో ప్రింట్ తీసి వెంటనే ఓటింగ్ లిస్టు లో ఉన్న చిరునామా  ప్రకారం పోస్టాఫీసులో  పోస్టు చెయ్యాలి (కొరియర్లో కాదు). అలా పంపిన రసీదులు తిరిగి వచ్చినా, లేదా సదరు వ్యక్తి ఓటు వెయ్యలేదని చెప్పినా అటువంటి ఓట్లను చెల్లని ఓట్లుగా పరిగణించాలి.   దీనికయ్యే ఖర్చు మొత్తం వాళ్ళ వాళ్లకు వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం, అబ్యర్ధులు  కట్టే డిపాజిట్ల  నుంచి  మినహాయించాలి. లేదా  ఈ రశీదులను ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా ఉచితంగా హుటాహుటిన బట్వాడా చేయించాలి.  ఓట్ల లెక్కింపు వెనువెంటనే జరిగి అబ్యర్ధి  గెలిచినట్టు ప్రకటించినా,  ఆ ప్రకటన ప్రొవిజనల్ గానే ఉండాలి. పైన చెప్పిన ప్రక్రియలో ఓటింగ్ జరిగిన నెల రోజుల లోపు ఆ గేలిచిన అబ్యర్ధి   వచ్చిన మెజారిటీ పొయ్యేంతటి అభ్యంతరాలు  ఈ రసీదుల వల్ల  వస్తే, అవన్నీ పరిశీలన చేసి, నిజమని తేలిన పక్షాన,  ఆ అబ్యర్ధి   ఎన్నిక రద్దు చేసి, మళ్ళి ఎన్నికలు జరిపించాలి. ఈ మొత్తం పని ఎలెక్షన్ కమీషన్ ఆధ్వర్యంలోనే జరగాలి. 
  • రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్, ప్రవైటు సంస్థల ఉద్యోగులు తప్పనిసరిగా ఓటు వేసేట్టుగా వారి ఉద్యోగ నిబంధనలను మార్చాలి. ఎన్నికలు అంటే ఒక శలవు దినంగా పరిగణించకుండా తప్పనిసరిగా ఓటు వేసేట్టుగా కట్టడి చెయ్యాలి. ఈ ప్రక్రియలో ఫలానా పార్టీకే ఓటు వెయ్యండి అని  చెప్పే అధికారులను తీవ్రంగా శిక్షించి, ఉద్యోగాల నుండి బర్తరఫ్ చెయ్యాలి. ఓటు వెయ్యని ఉద్యోగికి శలవు రద్దు చేసి ఆరోజుకు "లాస్ ఆఫ్ పే" చెయ్యటమే కాకుండా ఆ ఉద్యోగి సర్వీస్ రికార్డులో "రెడ్' రిమార్క్ వ్రాయాలి. పదవోన్నతి, ట్రాన్స్ఫర్లు వంటివి విషయాలు చూసేప్పుడు, ఈ రిమార్కును పరిగణలోకి తీసుకుని, ఓటు  వేసిన ఉద్యోగులకే ప్రాధాన్యత ఇవ్వాలి.
  • ట్రాన్స్ఫర్లు  అయ్యే ఉద్యోగుల ఓట్లు, వాళ్ళు ఎక్కడకు ట్రాన్స్ఫర్  అయ్యారో ఆ ప్రాంతానికి వారి ఓటు మార్చే పని  ఆ ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ/ఆఫీసు యజమాని/అత్యున్నత అధికారి బాద్యతగా  చెయ్యాలి. ఉద్యోగిని ట్రాన్స్ఫర్ చెయ్యగానే ఆ సంస్థ/ఆఫీసు ఆ ఉద్యోగికి సంబంధించిన ఓటు కూడా ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ తప్పకుండా చేయించాలి. ఏ ఉద్యోగి అయినా తన ఓటు ఆ ప్రాంతంలో లేని కారణాన ఓటు వెయ్యలేక పొతే, దానికి కారణమైన వారి మీద చట్టపరమైన చర్యలు తప్పని సరి చెయ్యాలి. ప్రస్తుతం ఆదాయపు పన్ను లేదా సర్వీస్ టాక్స్ లు అన్ని అమ్మకాలు చేసే షాపుల నుండి, బాంకుల నుండి వసూలు చెయ్యగలిగినప్పుడు (టి డి ఎస్ రూపంలో) ఇదేమీ పెద్ద పని కాదు. 
  • ఆపైన ఏ వ్యక్తీ కైనా సరే ఒక విగ్రహం పెట్టాలి అంటే ఆ మనిషి మరణించిన తరువాత పదిహేను లేదా ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన తరువాత మాత్రమె అనుమతించాలి. ఒక వ్యక్తి నిజంగా గొప్పవాడు అయ్యి ఉంటే అటువంటి వ్యక్తిని ఒకటి రెండు దశాబ్దాల తరువాత కూడా (మన ఘంటసాల లాగ, పాపం ఆయనికి ఒకటో రెండో విగ్రహాలు మాత్రమె!)   ఆ మనిషి గొప్పతనం, ఆ వ్యక్తి  చేసిన మంచి పనులు, త్యాగాలు ప్రజలకి గుర్తు ఉండి ఆ వ్యక్తి మీద గౌరవంతో విగ్రహాలు పెట్టాలి కాని సొంత ఖర్చులతో బతికి ఉండగానో   లేకపోతె హత్య గావిచబడిన వెను    వెంటనో , ప్రమాదంలో మరణించిన మరుక్షణాన్నో   విగ్రహాలు పెట్టటం పూర్తిగా ఎమోషనల్ తప్ప గౌరవం కాదు. పైగా ఆ వ్యక్తి అనుచరులు జబర్దస్తీగా రౌడీతనంగా చేసే పనులే తప్ప ప్రజల గౌరవాభిమానాలను ఆ విగ్రహాలు సూచించవు! ఈ నిబంధన లేకపోవటం వల్ల  ఎక్కడ చూసినా ఫ్యాక్షనిస్టులు, రౌడీలు, గూండాలు, దగుల్భాజీల విగ్రహాలు గుర్రపు డేక్కలా వ్యాపిస్తూ చీదర కలిగిస్తున్నాయి.
నాయకులు, విగ్రహాలు అన్న విషయం మీద  ప్రముఖ కార్టూనిస్ట్ బాబు గారు ఒక చక్కటి కార్టూన్ వేసారు ఆయన బ్లాగులో(క్లిక్) :



 ఎతా వాతా చెప్పొచ్చేది ఏమంటే, రోడ్డ కొట్టుడు గా రిపబ్లిక్ డే రోజున పెరేడ్లు చెయ్యటం, జెండా ఎగరేయ్యటం  లేదా శలవ వచ్చింది అని , హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకోవటంతో పాటు మనం అందరం కొంత ఆలోచన చెయ్యాలి, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి . ప్రస్తుతం మన రాజ్యాంగంలో మనకు నచ్చని అంశాలు, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణం గా మార్చవలసిన విషయాలను, అవి ఎందుకు మార్చాలో, మరెందుకు తొలగించాలో చక్కగా తెలియచెప్తూ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియచెయ్యటం ఒక ఉద్యమంగా పెట్టుకోవాలి. మనందరికీ వాక్ స్వాతంత్ర్యం  ఉన్నది. ఈ ప్రాధమిక హక్కును వాడుకుని, మన ఉద్దేశ్యాలను ప్రభుత్వానికి ప్రజలందరూ చెప్పగలిగితే, ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను కాలక్రమేణా నిర్మూలించ వచ్చు.  జస్ట్ ఆలోచించండి, ఇలా రోజూ ప్రభుత్వానికి ఒక పదివేల (మన జనాభా నూట పదికోట్లు) ఈ మైళ్ళు లేదా పదివేల పోస్టు కార్డులు ప్రజలు తమ తమ అభిప్రాయాలు తెలియచేస్తూ ఉంటే, ఏ ప్రభుత్వమైనా తప్పక స్పందించి తీరాలి.


రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు  


మునుపు రిపబ్లిక్ డే సందర్భంగా వ్రాసిన వ్యాసాలూ ఈ కింది లింకులు నొక్కి చదువుకోవచ్చు:


2010  రిపబ్లిక్ డే "రిటైర్ అవ్వద్దూ" 

2011 రిపబ్లిక్ డే "రిపబ్లిక్ దినోత్సవాలు  జరుపు కోవటమేనా...." 
























 


3 కామెంట్‌లు:

  1. మీరు బాగా వ్రాసారు. కానీ పిల్లి తన మెడలో తానే గంట కట్టుకుంటుందా....? మీరన్నట్లు గుమాస్తా బుద్ధి కాకపోతే ఏనుగు విగ్రహాలకి ముసుగు వేసే బదులు, అవి పెట్టినందుకు పనిష్మెంటుగా ఈ సారికి ఆ పార్టీ గుర్తునే మార్చేస్తే పోలా......అందరికీ హెచ్చరిక క్రింద వుంటుంది.

    రిప్లయితొలగించండి
  2. నేను ఎనిమిదిలో ఉన్నప్పుడు పంద్రాగస్టురోజున ఎగరేసిన ఝండాచూసి ఒకావిడ అడిగిందండీ "కాంగ్రెస్ ఝండా ఎందుకు ఎగరేశారు?" అని.

    ఎన్నికలగుర్తుల విషయంలో మీరు సూచించిన మార్గదర్శకాలు కఠినంగా ఉన్నాయని చెప్పకతప్పదు. ఇలా ఐతే డైనోసార్లబొమ్మలుతప్ప (నిత్యజీవితంలో కనబడనివి) ఇంకేవీ ఎన్నికల గుర్తులవ్వవేమో :D

    రాధాకృష్ణగారన్నట్లుగా సాంతం ఏనుగువారి గుర్తును, రంగునూ మార్చేసుంటే పీడావదిలిపోయుండేది. జనాల సొమ్ముతో వీళ్ళు సోకులుచేసుకోవడమేమిటో అర్ధంకావడంలేదు.

    రిప్లయితొలగించండి
  3. దేశంలో ప్రతిపౌరుడికి ఒక సంఖ్యను కేటాయించాల్సిన అవసరం ఎంతైనావుంది. తప్పని పరిస్థితుల్లో వారు ఎక్కడైనా ఓటు వేసే వీలు కల్పించాలి.దీనివల్ల కొన్ని సమస్యలు తీరుతాయి. ('ఆధార్ ' ఏమయిందో ఎక్కడవుందో తెలియదు.) ప్రతి పౌరుడు ఓటు వేసేట్టుగా నిబంధన విధించాలి--అని చెప్పాలనిపిస్తుంది. అయ్యో రామ! ఓటరుగా నమోదు చేయించుకొవడమే కష్టంగా వుంది. ఇవన్నీ ఎవరు చేపడతారూ అనిపించవచ్చు. కానీ శివ గారి వ్యాసం స్ఫూర్తిగా తీసుకుని, ఎన్నికల సంస్కరణల దిశగా అందరూ అలోచించాల్సిన అవసరం వుంది.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.