12, ఫిబ్రవరి 2010, శుక్రవారం

మనస్సు కోతా.....లేక......

***************************************************
మొట్టమొదటిసారిగా బ్లాగులోని వ్యాసానికి వినటానికి వీలుగా ఆడియో ఇస్తున్నాను. మీ స్పందనచూసి రాబొయ్యే వ్యాసాలు కూడ ఇలా ఇద్దామని ఆలోచన. సారి విని చెప్పండి.
***************************************************
మనసా కోతి!! మనిషి కోతినుంచి పుట్టాడని ఒక వాదన. అందుకనే కాబోలు, మనసు ఇంకా కోతిలాగానే ఉన్నదని ఒక ప్రచారం. ఈరోజున పొద్దున్నే శివరాత్రి శలవను సద్వినియోగ పరచటానికి, శ్రీమతి నేను కలసి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాం. కాని మనస్సు భగవంతుడిమీద నిలవదే. అలోచనలు ఎటెటో, నిన్న రాత్రి బ్లాగులో వ్రాసిన వ్యాసంలో ఎన్ని అప్పు తచ్చులు, ఇవ్వాళ ఏమన్నా వ్రాద్దామా. చందమామ కథ వ్రాద్దామా (ఈ మధ్య ఇదొకటి మొదలు పెట్టాను) ఏమిటి ఇవ్వాళ కాలక్షేపం, అరెరే ఈ పిల్లవాడు వాళ్ళమ్మ దగ్గరనుంచి విడిపడి కరెంటు తీగ దగ్గిరకి పోతున్నాడే,వెళ్లి ఈవతలకు లాగేదా..... ఈలోగా వాళ్ళమ్మ వచ్చి వాడిని లాక్కెళ్ళింది అమ్మయ్య. అయ్యో!!! ఏమిటి? ఈ ముసలావిడ ఏదో గొణుగుతున్నది చెవికింద, ఓహో శివ ప్రార్ధనా.................జేబిలో తగిన చిల్లర ఉన్నదో లేదో హారతి పళ్ళెంలో వెయ్యటానికి అని పాంటు వెనుక జేబులో చిన్న దువ్వేన్నను తప్పించి తడుములాట, ఇది ఒక రూపయా లేక రెండు రూపాయలా, అర్ధ రూపాయనుకొని ఐదు రూపాయలు వేస్తానేమిటి కొంపతీసి.....ఆస్సలూ ఈ ఆర్ బి ఐ వాళ్లున్నారే........ఇవ్వాళ బ్రిటిష్ లైబ్రరీ శలవా లేదా...............సరే రేపు వెడదాములే ఎలాగో శనివారం కదా................. ఇలా మనసు పరి పరివిధాల పోతున్నది. పూజారులు బిజీగా గుక్కపట్టి మంత్రాలు చదివేస్తున్నారు, వచ్చిన జనం వంక చూస్తూ. సరే ఇవన్ని చూడటం వల్ల కదా ఇన్ని ఆలోచనలు అని కళ్ళు మూసుకుని మనస్సు లగ్నం చెయ్యటానికి ప్రయత్నం. ఈలోగా కీచుగా "హర హర మహాదేవా, శంభో శంకర" ఒక ఆడ గొంతుక. అదసలే చిన్న గుడి, పడమరన రోడ్డు, దేవుడు తూర్పు ముఖంగా ఉంటాడు. కళ్ళు తెరిచీ తెరవకుండా చూశాను, ఒక కూరలమ్ముకునే అమ్మాయి నెత్తిమీద గంపతో, ఆ గంప పడకుండా నిలుపుకుంటూ, చేతులు జోడించి రోడ్డు మీద నుంచే మరొకసారి దేవుడిని గట్టిగా స్మరించి, "కూరలు! కూరలూ!" అని కేకలు వేస్తూ చక్కా పోయింది. భక్తులు అందరూ ముఖాలు చిట్లిస్తున్నారు ఆ పిల్ల (ప్రార్ధనా) కేకలకి.

నేను మళ్ళి కళ్ళు మూసుకున్నాను. అద్భుతం, పరమాద్భుతం అంతవరకూ లగ్నంకాని మనస్సు దేవుడికి ట్యూన్ అయినట్టుంది, కాని రిసెప్షన్ అంత క్లియర్ గా లేదు. చూచాయగా తెలుస్తున్నది. మహాశివుడు, మేము ఇంతమంది భక్తులం నిలబడి ఉంటే, మా వైపు వీపు పెట్టి, ఆ కూరలమ్మి వైపు చూస్తూ ఆశీర్వదిస్తున్నాడు. మా వంక ఆయన మెడలోని సర్ప భూషణాలు మాత్రం చూస్తున్నారు కోపంగా, బుసకొడదామా లేదా అని నాలుకలతో గాలి రుచి చూస్తూ. గుండెల్లో ఆనందం, ఎలాగయితేనేమి ఆ కూరలమ్మి పుణ్యమా అని, శివుణ్ణి వెనుకనించి అయితేనేంగాక చూడటం చూసాను. అంతే చాలు ఈ శివరాత్రికి.

నిన్న రాత్రే విన్నాను చాగంటి వారు వెంకటేశ్వరా చానెల్ లో శంకరులవారి శ్లోకానికి అర్ధం చెప్తూ, మనం పూజను ఎలా తంతుగా ముగిస్తున్నామో, పూజ చెయ్యటానికి మనస్సుకు కావలిసనిది దేవుడి మీద ప్రేమ, భక్తి కాని. దేవుడంటే ఆదరణలేని పూజకాదు. పూజ చేసే తంతు, తంతుగానే చేస్తే ఉపయోగమేమిటి. మనస్సును ఇతర విషయాల మీదకు పోకుండా చేసే మార్గాలే పూజలోని తంతు అంతా అని కేకలేసి మరీ చెపుతున్నారు. ఆయన ఎంత చెప్పినా, ఘాట్టిగా కేకలేసినా సరే మనం వింటామా. లేదు పైగా మనసుట కోతిట. మరి మనం........

పొట్టకూటికోసం గుళ్ళొకి వచ్చి ఒక్క క్షణం కూడ నుంచుంటే సమయం మించిపోయి కూరలు మిగిలిపోతాయని, ఆ కూరలమ్మి గుడి బయటనుంచే ఆర్తిగా పిలిస్తె, శివుడు విన్నాడు, ఆశీర్వదించాడు. అన్ని పూజా ద్రవ్యాలు పట్టుకుని, గుక్కపట్టి మంత్రాలు చదువుతూ పూజ చేస్తుంటే మాకందరికి వీపు చూపెట్టి, పాము చేత కేకలేయించాడు శివుడు. ఇది కలా, ఇలా లేచి ఉండే కల కంటున్నాను ఏమిటి, వయస్సు ప్రభావమా!! నిన్న రాత్రి ఒకటిన్నరకి పడుకున్నాను కదూ!

సరే! మనస్సు కాదు కోతి అన్న నిర్ణయానికి వచ్చేసి, అదరా బాదరా ఒక్క దూకులో ఇంట్లో పడి(గుడి పక్క సందులోనే), వ్రాస్తున్నాను. అదుగదిగో శివుడికి నచ్చినట్టులేదు, ముఖం చిట్లిస్తున్నాడు, ఇందులో ఆయన ప్రస్తావన తెచ్చినందుకు.

హర హర మహాదేవ శంభో శంకరా నాకు మంచి ఆలోచనలను ఇవ్వు భగవంతుడా.

అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు***************************************************

2 వ్యాఖ్యలు:

  1. మహాద్భుతం! మహాశివరాత్రి పర్వదినాన శివ దర్శనం దొరికినందుకు అభినందనలు. చాలా మందికి చాలా సార్లు అయ్యే అనుభవమే ఇది, మీరు చెప్పిన మనసు కోతి చిందులు వేయడం. ఎంతో శ్రమకోర్చి ఆ క్యూలలోంచి ఈదుకుంటూ భగవంతుని దగ్గరకు చేరుకునేసరికి సరిగ్గా నా మనసు వేరే విషయాల మీదకు పోయి ఇక ఆ దర్శనం అన్నది ఏదో చిన్న తంతులా ముగిసిపోయేది. ఒక్కోసారి ఇంట్లో పూజ చేసుకుంటుంటే ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళిన అనుభవం కలిగేది. ఎప్పటిలాగా మంచి అర్ధవంతమైన టపా రాసారు. భగవంతునికి పై పై పటాటోపాలేమీ అక్ఖరలేదని నిరూపించింది మీ అనుభవం.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. శివ గారూ !
    మంచి అనుభూతిని, అనుభవాన్ని పొందారు.ధన్యులు.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.