11, సెప్టెంబర్ 2010, శనివారం

పూజా? తంతా??!


(పైనున్న మట్టి వినాయకుడి బొమ్మ సౌజన్యం http://kowthas.wordpress.com/2008/09/03/ganapati-2008/)
పూర్వపు వాళ్ళంతా మూఢాచార పరాయుణులని, మనకు తెలిసిన నాగరికత ఇంతకు ముందు ఎవరికీ తెలియదని, మనకున్న శాస్త్ర విజ్ఞానం ఎంతో గొప్పదని మనని మనమే నమ్మించుకుంటూ మనం చేసే పనులు ఏమిటి? ఏదన్నా పండుగ రావటం ఆలశ్యం, ఆ పండుగ అసలు ఉద్దేశ్యం ఏమిటో తెలియకుండా కనపడిన చెట్లను దూసి పారేసి. పూలన్ని తెంపేసి, దేముడి నెత్తిన పొయ్యటం అదే భక్తి అని నమ్మబలుక్కోవటం, పూజలో ఉండాల్సిన ఏకాగ్రత మృగ్యం. గడిచిపోయిన శ్రావణ శుక్రవారపు పూజకి కాని, ఈరోజు జరుపుకునే వినాయక చవితి పండుగకి కాని, ఎన్నెన్ని చెట్లు ధ్వంసం చేస్తున్నాము!! బెంగుళూరులో కొన్ని వేల అరటి పిలకలు తెచ్చి రోడ్లమీద పడేసి అమ్మాలని చూసి, అమ్ముడుకాక మిగిలిపోయినవి , మర్నాడు మునిసిపాలిటీ వారు అవి శుభ్రం చెయ్యటానికి బుల్డోజర్లు తేవలిసి వచ్చిందంటే చూడండి, మనకు పూజ కన్న తంతు మీద ఉన్న "మూఢ ఆచార" భ్రమలు.

మనకున్న పండుగలన్ని, మానవుడిని ప్రకృతిలో మరొక్క మారు తన పాత్ర తాను తెలుసుకుని ప్రకృతిలో ఎంత ఒదిగి ఉండాలో తెలియచెప్పేవే కాని, ప్రకృతిని ధ్వంసం చెయ్యటానికి ఏర్పరిచినవి కాదు.

అరటి, నేరేడు, ఉసిరి, మామిడి, తులసి వంటి మొక్కల ఆకులతో పూజచేస్తే దేవుడు సంతోషిస్తాడని, జనానికి ఒక నమ్మకం కలిగిస్తే, చెట్ల పెంపకం ఎక్కువౌతుందని, ప్రతివాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో చెట్ల పెంపకం పెరుగుతుందని, ఆ పురాతన పెద్దల ఉద్దేశ్యం పాపం! కాని ఈరోజున జరుగుతున్నది ఏమిటి, చెట్లు పెంచకపోతే పోనివ్వండి, పూజలపేరిట, ఉన్న చెట్లను ధ్వంసం చేయటం ఎంతగానూ భక్తి కానేకాదు. అటువంటి తంతుమీద శ్రధ్ధ చూపి చేసే పనులు పూజ కిందకి రావుకదా దేవుడు కూడ సంతోషించడు.

వినాయకచవితి వస్తే చాలు పూనకాలు వచ్చినట్టుగా ఒక్కో కూడలిలోనూ ఒకరిని మించి మరొకరు పెద్దవి, మరింత పెద్దవి, ఆకాశం ఎత్తున్నవి వినాయకుడి విగ్రహాలు ఏర్పరచటమే భక్తి కింద చలామణి చేస్తున్నారు అయా ప్రాంత "పెద్ద మనుషులు"(చాలా చోట్ల రౌడీలు). ఎవరెంత మొత్తుకున్నా సరే ఈ బజారు పూజలు, వెర్రి తలలు వేస్తూనే ఉన్నాయి.

పూజకు కావలిసినది ఏకాగ్రత, భక్తి, అంతేకాని తంతు కాదు. ఈ విషయాన్ని మనకున్న పీఠాధిపతులు, స్వామీజీలు, ఏదో మొక్కు తీర్చుకున్నట్టుగా చెప్పటమేకాని, ప్రజల మనస్సులోకి వెళ్ళేట్టు చెయ్యటంలో విఫలమయ్యారు.

పండుగలను అర్ధం చేసుకుని, ఆయా సాంప్రదాయాల మూల ఉద్దేశ్యాలను అమలు పరుస్తూ అందరం కలిసి చేసుకునేదే పండుగ.

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు
****************************************

క్రితం సంవత్సరం వినాయక చవితికి వ్రాసిన వ్యాసం కింది లింకు నొక్కిచదువ వచ్చు

వినాయక చవితి మొక్కల ఊచకోత

10 వ్యాఖ్యలు:

 1. చందమామ ఆర్కైవులలో 1982 నవంబరు, డిసెంబరు సంచికలలో వినాయక ప్రతిమల కథ ప్రతి సారీ గుర్తు చేసుకుంటాను.
  మేము మట్టి వినాయకుడిని తెచ్చుకుని రంగులు వేసి అలంకరించే వాళ్ళం. అలా చెప్పుకుని మురిసిపోతానా, ఇక్కడ మామిడాకులు లెక్కపెట్టి అమ్ముతుంటే ఎక్కువ ఆలోచించకుండా ముచ్చట పడి కొనేశాను. ఇప్పుడు మీ టపా చదివి భుజాలు తడుముకుంటున్నాను.
  క్రిస్మస్ చెట్ల తతంగం చూసి బాధ వేస్తుంది మళ్ళీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. సరిగ్గా చెప్పారు. ఇలానే, పెళ్ళిళ్ళు, వేడుకల్లో పారవేసే ప్లాస్టిక్ చెత్త చూసినా, నాకు ఇలాంటి అభప్రాయం కలుగుతుందండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. బాగా చెప్పారు.మీకు వినాయకచవితి శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. లలిత గారూ, జెబి గారూ విజయమోహన్, అందరికీ ధన్యవాదాలు, వినాయక చవితి ప్రత్యేక శుభాకాంక్షలు

  జెబి గారూ పెళ్ళిళ్ళు పార్టీల పేరిట జరిగే వృధా ఖర్చులు అనేకం. అవికాక గత దశాబ్దంలో పెచ్చుపెరిగిపోయిన ప్లాస్టిక్ వాడకం, ఆ వాడిన గ్లాసులు, ఇతరాలు బాధ్యత లేకుండా రోడ్ల మీద పారెయ్యటం మనకు ఏమాత్రం లేని సివిక్ సెన్సు ను తరచి తరచి గుర్తు చేసి బాధిస్తూ ఉంటాయి

  ప్రత్యుత్తరంతొలగించు
 5. శివ గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి పర్వదిన శుభాభినందనలు

  హారం

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నిజమేనండి చాలా బాగా చెప్పేరు. డాబు బడాయి తప్ప భక్తి మృగ్యం ఐపోతోంది. నా చిన్నప్పుడు కూడా ఇంత ప్లాస్టిక్ వాడకం లేదు. ఇప్పుడు ఇక్కడ గ్రోసరీలలో ఎవరి బేగ్ లు వాళ్ళు తెచ్చుకోండి, ఇవి నార బేగ్ లు అంటే నాకు అదే నవ్వు వస్తుంది. మనం చిన్నప్పుడు చేసింది అదే కదా అని. ఎనీ వే వినాయకచతుర్ధి శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. "మనకున్న పండుగలన్ని, మానవుడిని ప్రకృతిలో మరొక్క మారు తన పాత్ర తాను తెలుసుకుని ప్రకృతిలో ఎంత ఒదిగి ఉండాలో తెలియచెప్పేవే కాని, ప్రకృతిని ధ్వంసం చెయ్యటానికి ఏర్పరిచినవి కాదు.

  అరటి, నేరేడు, ఉసిరి, మామిడి, తులసి వంటి మొక్కల ఆకులతో పూజచేస్తే దేవుడు సంతోషిస్తాడని, జనానికి ఒక నమ్మకం కలిగిస్తే, చెట్ల పెంపకం ఎక్కువౌతుందని, ప్రతివాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో చెట్ల పెంపకం పెరుగుతుందని, ఆ పురాతన పెద్దల ఉద్దేశ్యం పాపం! కాని ఈరోజున జరుగుతున్నది ఏమిటి, చెట్లు పెంచకపోతే పోనివ్వండి, పూజలపేరిట, ఉన్న చెట్లను ధ్వంసం చేయటం ఎంతగానూ భక్తి కానేకాదు."

  శివరాం గారూ, భక్తిపరుడిగా, సాంప్రదాయం పట్ల గౌరవం కలిగిన మీరే పండుగల వెనుక జరుగుతున్న ప్రకృతి విధ్వంసం గురించి ఇంత ఆవేదన వెలిబుచ్చారు. పండుగలను వ్యక్తిగత వ్యవహారంగా చూడటం, జరుపుకోవడం మాని అటు మార్కెట్, ఇటు రాజకీయం రెండూ వాటిపై దాడి చేయడం మొదలెట్టాక మీరన్నట్లుగా పండుగల వెనుక ఉన్న జీవన సంస్కృతి, చెట్ల పట్ల మమకారం అనేవి గాల్లో కలిసిపోయాయి.

  మా చిన్నప్పుడు పల్లెల్లో కూడా చెట్ల ఆకులను తెంపుకుని వచ్చి తోరణాలు మాత్రమే కట్టి సంబరపడే వారం తప్ప ఎన్నడూ పచ్చగా కలకల్లాడుతున్న చెట్లను నిలువునా పెళ్లగించి, నరికి తీసుకువచ్చి గుళ్లలో, ఇళ్లల్లో ప్రతిష్టించలేదు. మీరన్నట్లుగా కొన్ని వేల చెట్లు అరటి మొలకలు వినాయక చవితి పేరు మీద సాగుతున్న మార్కెట్ మర్కట చేష్ట్యలకు కూలిపోతున్నాయంటే వృక్షోరక్షతి రక్షిత: మంత్ర సూక్తం నిజంగానే మన దేశంలో పుట్టిందా అని సందేహం వస్తోంది.
  మీ మెయిల్ ఆలస్యంగా చూసి స్పందిస్తున్నాను క్షమించండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. రాజుగారూ మంచి వ్యాఖ్యను ఉంచారు ధన్యవాదాలు. సాంప్రదాయాన్ని నమ్మినంత మాత్రాన మనకున్న వివేచనను కోల్పోవలిసిన అవసరం లేదని నమ్మే వాళ్ళల్లొ మొదట ఉంటాను నేను. సాంప్రదాయవాదులు, ఇలా తంతు మీద శ్రధ్ధ చూపించి భక్తి ఎలా గాలికి వదిలేస్తున్నారో చూసి బాధపడి వ్రాశాను ఆ వ్యాసం.

  అలాగే కమ్యూనిస్టులమని చెప్పుకునే వాళ్ళు కూడ ఆ పార్టీ తంతే ముఖ్యంగా ఉన్నది. ఒకళ్ళనొకళ్ళు "కామ్రేడ్" అని సంబోధించుకోవటం, బిగించిన పిడికిలి చూపించి ఒకరినొకరు పలకరించుకోవటం, వారిలో మరణించినవారిని పాతిపెట్టిన చోట "ఎర్ర" సమాధి కట్టి కంకి కొడవలో, సుత్తీ కొడవలో అక్కడ పెట్టటం, పడికట్టు మాటలతో అర్ధం పర్ధం లేని చెత్తంతా ఒకళ్ళతో ఒకళ్ళు వాక్కోవటం, కాయితాలు వృధాచేస్తూ (ఇక్కడ కూడ వృక్ష జాతిని నాశనం చేస్తూ) కాలం గడుపుతున్నారే కాని, జనానికి ఏమాత్రం దగ్గిర కాలేకపోయారు. సాంప్రదాయవాదులు ఎన్నెన్ని మూఢాచారాలు పాటిస్తున్నారో(కొన్ని వేల సంవత్సరాల పరిణామక్రమం తరువాత) నిన్న కాక మొన్న పుట్టిన "మేము సాంప్రదాయ వాదులం కాదు" అనుకుంటూ నాస్తికులమని, పురోగమ వాదులమని చెప్పుకునే ఈ కమ్యూనిస్టులకు కూడ మతాచారాలు(అదే పార్టీ ఆచారాలు) చాలానే ఉన్నాయి. ఎక్కడైనా సరే అసలు ఉద్దేశ్యం అర్ధం చేసుకోవాలి, తంతు ఎంత మాత్రం ముఖ్యం కాదు. విషయాలను మనకు నమ్మబలుతున్నవారు ఎందుకు చెపుతున్నారో తెలుసుకోవాలి. విదేశాలనుండి వచ్చే ఈ చెత్త ఇజాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాటిని గుడ్డిగా నమ్ముతూ, మాతృ దేశానికే ద్రోహం చేస్తూ, నాశనం చెయ్యటం కన్నా ఘోరమైన సాంప్రదాయవాదం ఇంకేమన్నా ఉన్నదా??

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.