1, సెప్టెంబర్ 2011, గురువారం

అమ్మో వినాయక చవితి!



నారాయణ! నారాయణ!
అయ్యో అయ్యో వినాయకా ఏమిటిది ఇలా వణుకుతున్నావు. ఏమయ్యింది నాయనా. అప్పుడే "నీ" చవితి దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇలా వణుకుతూ అనారోగ్యాన పడితే ఎలా...

నమో నమ: నారద మునీంద్రా. నమస్కారం. నా సంగాతికేమి గాని ముల్లోకాలు బాగున్నవి కదా. క్రితం సంవత్సరం నన్ను అనేకానేక కాలువల్లో, సరస్సుల్లో, కాస్త నీరు అనేది ఉన్న చోటల్లా చూసి అందులో సగం అయినాసరే పారేసి పొయ్యారు కదా ఈ "భ..క్తు..లు". ఆ ఫలితమే ఈ వణుకు నారదా. చస్తున్నాను నా పేరుతొ చేసిన విగ్రహాల వల్ల జలాశయాలకు కలిగిన అపచారం అంతా నాకు చుట్టుకున్నది.

అయ్యో అయ్యో! అలాగా వినాయకా. ఏమి చెప్పేది? ముల్లోకాలలో భూలోకంలో పరిస్థితే బాగాలేదు. అక్కడా చాలా మంది ఈ పండుగ వస్తోంది అంటేనే భయపడుతున్నారు. ఇక నీ పండుగ వస్తొందంటెనే ఎక్కడెక్కడి జలాశయాల్లో ఉన్న గంగమ్మ తల్లి వణికిపోతున్నది నాయనా వినాయకా! నీకెమో విఘ్నాధిపతివన్న పేరు, కానీ నీ మూలనే అనేక యత్నాలకు విఘ్నాలే ఏర్పడిపోతున్నాయయ్యా. అక్కడి ప్రజలకు గత మూడు నాలుగు దశాబ్దాలనుండి పుట్టిన వెర్రి ముదిరి, ఉన్మాద రూపం ధరించింది వినాయకా! నువ్వు ఎలా భరిస్తున్నావో కాని ఈ పిచ్చ పూజలు, చూస్తున్న నాకే కంపరంగా ఉన్నది వినాయకా.

అవును నారదా! నాకూ అదే దిగులుగా ఉన్నది. భాద్రపద చవితి వస్తోందంటేనే దిగులు ఆవహిస్తున్నది. ఈ భక్తులు, వాళ్ళు భక్తులా, కాదు కాదు నాపేరు చెప్పుకు బతికే అవినీతి నాయకులు అని పళ్ళు పట పట కొరకటం మొదలుపెట్టాడు.

ఈలోగా వినాయక వాహనం మూషిక రాజం వచ్చి, తన వెనుక కాళ్ళ మీద నిలబడి, రెండు చేతులూ జోడించి, విఘ్నేశ్వరా! నన్ను నీకు వాహనంగా ఉంచటమే హాస్యాస్పదం. ఐనా ఎలాగోలా నువ్విచ్చిన శక్తి అంతా పుంజుకుని నిన్ను మోస్తూనే ఉన్నాను వినాయకా. ఇక నా వల్లకాదు.

ఏమిటి! నన్ను కొత్త వాహనం చూకొనమనా నీ ఉద్దేశ్యం. ఏమిటిది నారదా, ఇదెమీ మీరు ఆడిస్తున్న నాటకం కాదుకదా?

అయ్యయ్యో! ఇదెక్కడి అపనింద గణపతీ, ఇకా చవితి చంద్రుడు రాలేదు నేను చూడలేదు, నాకేల ఇటువంటి అపనిందలు. కట కటా నారదుడంటె అందరికీ నవ్వులాటె కదా. చివరకి భూలోకంలో ఉండే సినిమా వాళ్ళకి కూడా. ఐనా నాకు ఇదేమన్నా కొత్తా ఏమన్నానా, అందరూ కలిసి కలహభోజుడన్న పేరు పెట్టనే పెట్టారు. కానీ ఏమి చేస్తాం . నా ప్రమేయం ఏమీ లేదు అన్నా నువు నమ్ముతావా ఏమన్నానా నాయనా! చూడు మూషికా, నువ్వు చెప్పదలుచుకున్నదేదో వివరంగా వినాయకుడికి చెప్పుకో, ఇందాకేదో నా చెవిలో ఊదావు....

అదీ సంగతి ముందు సంగతి తమరి దగ్గరకు వచ్చింది. తెలియదంటారేమి స్వామీ. ఏమి మూషికా, నువ్వు రిటైర్ అవ్వదలుచుకున్నావా ఏమిటి.

కాదు వినాయకా, నిన్ను తీసుకుని, ఏ లోకానికి వెళ్ళమంటే ఆ లోకానికి వెళతాను. కాని ఆ చవితి పూజలప్పుడు మాత్రం నన్ను భూలొకానికి తీసికెళ్ళకండి. నాకు ఊపిరి ఆడటం లేదు. ఆ మధ్య రౌ్‌రవాది నరకాలను సందర్శిచినప్పుడు కూడ నాకు ఇంతటి కంపరం కలగలేదంటే నమ్మండి స్వామీ. ఏమీ గోల, ఆ తయారి ఏమిటి, ఎక్కడెక్కడి కంపు పదార్ధాలతో మన్ని తయారు చెయ్యటమే కాకుండా, ఆ పదిరోజులూ మనమీదెక్కి పూజలు. ఆపైన తాగి తందనాలాడుతూ, తీసికెళ్ళి ఎక్కడ నీళ్ళు కనపడితే అందులో పారెయ్యటం. ఈ పిచ్చ జనం తామున్న కొమ్మ తామే నరుక్కుంటున్నారు భగవాన్.

అదా సంగతి, ఈ విషయమే నారదుల వారు ఇప్పుడే అంటున్నారు, నేను నా బాధ ఆయనకి చెప్పుకునే లోపలే నువ్వు పానకం లో పుడకలాగ వచ్చి నీ గోల మొదలెట్టావ్. సరే ఇదంతా కలిపి మన అందరి సమస్య అయ్యింది.

ఏమండీ నారదుల వారూ, అక్కడ భూలోకంలో కూడా మీరు తిరుగుతూ ఉంటారు ఆపైన మీరేదో ఆ టి వి చానెళ్ళను ఆవహించి ఇక్కడి మాటలు అక్కడా, అక్కడి మాటలు ఇక్కడా చేరవేస్తూ రాజకీయ అల్లర్లు ప్రేరేపిస్తున్నారుట! మహాశయా

టి వి చానెళ్లకు నేను ఆవహించాలా స్వామీ! వాళ్ళు ఏనాడో నన్ను మించి పొయ్యారు. నా మీద హాస్యం మాని అసలు విషయం శెలవియ్యి వినాయకా!


సరే! నారదా!! ...మనలో సంగతి, వినాయక చవితికి అంతంత విగ్రహాలు అల్లరి ఎందుకు అన్న విషయం మీద ఎవరన్న ఎమన్నా అనుకుంటున్నారా చెప్పండి.

ఒకళ్ళు అని ఏమిటి విఘ్నేశ్వరా, బుధ్ధి ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారు, ఈ పూజల వెర్రి ఏమిటి అని, బజారు పూజలు ఏమిటి అని చీదరించుకుంటున్నారు. అప్పుడెప్పుడో తిలక్ అని ఒకాయన, బ్రిటిష్ వాళ్ళ కన్ను కప్పి జన సమీకరణ చెయ్యటానికి మహరాష్ట్రలో ఇలా సార్వజనీన పూజలు మొదలుపెడితే, ఇప్పుడు అవి వేలంవెర్రి అయిపోయ్యాయి. దానికి తోడు, ఈ విగ్రహాల పోటీ. ఒకడిని మించి మరొకడు మరింత ఎత్తు విగ్రహం చేశెయ్యటం. ఏమిటో నీ ఓపికకి పరీక్షగా ఉన్నది వినాయకా.

అవును నారదా, ఈ పూజలు, ఈవిగ్రహాలు, వాటి పరిమాణాలు, అంతంత పెద్దవా నాకే కళ్ళు తిరుగుతున్నాయి! ఆపైన, చివరికి ఆ విగ్రహాలను ఎత్తుకెళ్ళి, నీళ్ళల్లో పడేసి అక్కడ అంతా కలుషితం చెయ్యటం అంతా చూస్తుంటే, నాకే "అమ్మో! వినాయక చవితి!!" అనిపిస్తున్నది.

ఈ లోగా పార్వతీ దేవి వచ్చింది. ఏమిటి వినాయకా చవితి రాబోతున్నది, ఎందుకు అంత దిగులుగా ఉన్నావు?

తల్లీ, ఏమి చెప్పేది నా బాధ. భక్తులమని చెప్పుకుంటూ ప్రతి చవితికీ నా విగ్రహాలు చెయ్యకూడని పదార్ధాలతో చేసి, నానా రభసా చేసి, ఏ వేదాల్లోనూ చెప్పని పూజలు చేస్తూ గత కొన్ని దశాబ్దాలుగా నాకు క్షోభ కలిగిస్తున్న ఈ "మూకలను" ఎలా దారిలో పెట్టాలో ఆలోచిస్తున్నాను మాతా!

మంచి పని చేస్తున్నావు వినాయకా. ఈ మధ్య దసరాలలో కూడ ఇదే "పిచ్చ" మొదలయ్యింది. చెల్లెలు గంగ కూడ వినాయక చవితి, దసరాల వల్ల తన జలాశయాలన్నీ కూడా ఎలా భ్రష్టు పట్టిపోతున్నాయో చెప్పుకు వాపోతున్నది.

సరే పదండి ఆ మహా దేవుని సందర్శించి ఆయనకు ఈ కష్టాలు నివేదిద్దాం.

అందరూ కలిసి, పరమేశ్వరుని ముందు భక్తిగా నమస్కరిస్తూ, భూలోకలో పూజల పేరిట జరుగుతున్న దారుణాలు విన్నవించుకున్నారు.

ఆ మహా శివుడు వినాయకునికి కలిగిన బాధను తెలిసి ఉన్న వాడై, ఈ విధంగా ప్రవచించారు

  • ఎవరైతే మట్టి విగ్రహాలు కాకుండా మరే విధమైన విగ్రహం తో పూజలు చేస్తారో వాళ్లకి సకల పాపాలు చుట్టుకుంటాయి.
  • బజారు పూజలు చేయించే వాళ్ళు, చేసే వాళ్ళు, చేస్తుండగా చూస్తూ ఊరుకునే వాళ్లకు, వాళ్ళ జీవితాల్లో అన్నీ విఘ్నాలే కలుగుతాయి.
  • ఆధ్యాత్మిక నాయకత్వం ఇవ్వలేని, ఇటువంటి దురాచార పూజలను చేసే ప్రజలను మంచి మార్గం లోకి మళ్లించలేని మఠాధిపతులు, ఆశ్రమాధిపతులు, ఈ జన్మలో కాదుకదా, రాబొయ్యే వెయ్యి జన్మలకు కూడా మోక్షం అంటే ఏమిటో కూడా తెలియకుండా వెర్రివాళ్లయ్యి తిరుగుతూ ఉంటారు.
వీరభద్రా! వెంటనే వెళ్లి నా ఆజ్ఞలను తక్షణం అమలుపరచమని యమధర్మరాజుకు తెలియచెయ్యి

నారదా! నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా భూప్రపంచంలో అందరికీ తెలియచెప్పే బాధ్యత నీది. ఇటువంటి అనాచార పూజలు మానకుంటే, నా మూడో కన్ను తెరువ వలిసి ఉంటుంది అని కూడ హెచ్చరించు.

==============================================
మట్టి వినాయకులతో వినాయాక చవితి జరుపుకుంటున్న మీ అందరికీ ఈ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు
          ==============================================


మునుపు ఇదే విషయం మీద వ్రాసిన వ్యాసాలు
పూజా! తంతా!!


వినాయక చవితి మొక్కల ఊచకోత

బజారు పూజలు

6 కామెంట్‌లు:

  1. బ్లాగ్-మిత్రులకు, వినాయక చవితి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  2. శివరాంగారూ, ఆధ్యాత్మికతను పాటిస్తున్నప్పటికీ పండుగల పేరుతో సాగుతున్న వేలంవెర్రిని దుయ్యబడుతూ చక్కటి కథనం ప్రచురించినందుకు ధన్యవాదాలు. మీరన్నట్లు ఎవరో ఒకరు మూడో కన్ను తెరవనంతవరకు పండుగ పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వంసానికి అడ్డుకట్ట పడదనుకుంటాను.

    మరోసారి అభినందనలు.
    మీ బ్లాగులో వినాయకచవితి సందర్బంగా ప్రచురించిన ఈ కొత్త కథనాన్ని చందమామలు బ్లాగులో గణపతి చరిత్ర అనే కొత్త కథనానికి లింకు చేశాను చూడగలరు.
    http://blaagu.com/chandamamalu/2011/09/01/%E0%B0%97%E0%B0%A3%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0/

    రిప్లయితొలగించండి
  3. బావుంది శివగారూ !
    మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు
    శిరాకదంబం వెబ్ పత్రిక

    రిప్లయితొలగించండి
  4. వ్యాఖ్య వ్రాసిన అందరికీ ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.