12, మే 2021, బుధవారం

మీడియా తెంపరితనం ఆపలేమా!?



గత దశాబ్దం దశాబ్దంన్నరలో ఇబ్బడి ముబ్బడిగా టివి వార్తా చానెళ్ళు వచ్చేసి, వారి వారి పనితీరుతో జర్నలిజంకు ఇంకా మిగిలి ఉందనుకునే పరువును పూర్తిగా పోగొట్టి ఇంకా కిందకు కిందకు తీసుకు వెడుతున్నాయి. టివి న్యూస్ చానేళ్ళు చేసే దౌర్భాగ్యపు పనుల్లో అతికొద్దివి-అసలు వార్తే కాని దాన్ని రుద్ది రుద్ది చూపటం, వార్తలను చూపటంలో కూడ విపరీతమైన పక్షవాతం, సారీ పక్షపాతం, టివి చర్చల పేరిట కేకలు, అరుపులు, పానలిష్టులు చెప్పులు విసురుకోవటం కూడా కొరియోగ్రఫి చెయ్యటం వంటివి.

దురదృష్టవశాన ఎక్కడన్నా ఒక విషాద సంఘటన జరిగితే చాలు, రాబందుల్లా వాలిపోయి ఇది చూపొచ్చు ఇది చూపకూడదు అనే ఇంగితం లేకుండా చితికిపోయిన మృతదేహాలను, పారుతున్న నెత్తురును కూడా చూపిస్తూ, బాధితులు పాపం వాళ్ళ దీన గాధ చెప్పుకుంటూ మొత్తుకుంటూ ఉంటే కెమెరాను వాళ్ళ కళ్ళ దగ్గరకు జూం చేసి కన్నీళ్ళను ఎలాగోలాగా కెమెరాలో బాగా చూపాలన్న పిచ్చ వంటివి మన సమాజంలో సవ్యంగా ఆలోచించగల వాళ్ళు అందరూ ఈసడించుకుంటున్నారు. కొందరు వారి కోపాన్ని అసహ్యాన్ని న్యూస్ చూడటం మానేసి చూపుకుంటున్నారు.

కానీ ఈ మొత్తానికి ఒక కీలకం ఉన్నది. ప్రజలకు ఏవగింపు కలిగించే వార్తలను, అభ్యంతరకర దృశ్యాలను చూపినప్పుడు, ఆ సెగ్‌మెంట్ ఏ కంపెనీ స్పాన్సర్ చేసిదో గమనించి, మనం అందరం కూడ జష్ట్ ఒక్క కార్డ్ వ్రాసి లేదంటె ఒక ఈ మైల్ ఇచ్చి, ఆ కంపెనీ చైర్మన్ కు మన కోపాన్ని తెలియచెయ్యటమే కాదు, ఆ కోపం ఎందుకు వచ్చిందో వ్రాయాలి. మీరు ఇటువంటి చెత్త చానెల్ కు మీ వస్తువుల యాడ్లు ఇచ్చారు కాబట్టి, మాకు బాధ కలిగించే విషయాలు చూపటంలో మీది కూడా బాధ్యత ఉన్నదని భావిస్తూ, ఒక నెలపాటు మీ ప్రొడక్ట్లు కొనము అని నిజంగా కొనకుండా ఉండాలి. ఇలా రోజుకు ఒక వంద కార్డ్‌లు/ఈ మైళ్ళు ఆయా కంపెనీలకు వెడుతుంటె, వాళ్ళు చూస్తూ ఊరుకోలేరు కదా. అప్పుడు వాళ్ళు మేల్కొని ఈ చానెల్ వల్ల మనకు లాభం లేదు నెగెటివ్ ప్రచారం జరుగ్తున్నది మన అమ్మకాలు పడిపోతున్నాయి అని ఆ చానెల్ కు యాడ్లు ఆపుతారు. తద్వారా ఆ చానెల్ కు ఆదాయంలో గండిపడి కనీసం అప్పుడు జరిగినది తెలుసుకుని తమ నడవడి మార్చుకుంటే, బాగుపడుతుంది లేదంటే కూలిపోతుంది. దురదృష్టవశాత్తూ అటువంటి చైతన్యం ప్రేక్షకులలో లేదు. అందుకనే చానెళ్ళకు ఆడింది ఆటగా ఉన్నది.

మనం, అంటే ప్రేక్షకులమైన మనం కొంత శ్రమ తీసుకుని, అది కూడా పెద్ద శ్రమేమీ కాదు ఒక్క నిమిషం దృష్టిపెట్టి పైన చెప్పిన విధంగా మన అభిప్రాయాన్ని ఆ చానెల్ కు యాడ్లు ఇచ్చిన కంపెనీ/ల కు వ్రాయటం మొదలుపెడితే ఏమవుతుంది? చానెల్ ఆదాయానికి గండి పడుతుంది అప్పుడు వాళ్ళు విషయం తెలుసుకునే అవకాశం ఉన్నది, బాగుపడేవాడు పడతాడు లేనివాడు కాలగర్భంలో కలిసిపోతాడు, ఏతావాతా వార్తా చానెళ్ళ నాణ్యం పెరిగే అవకాశం ఉన్నది.

ఏ వస్తువు కానీ/సేవ కానీ నాణ్యంతో పనిలేకుండా ఎగబడి వాడుకునేవాళ్ళు ఉంటే అది తయారుచేసే వాళ్ళకు (ఇక్కడ వార్తా చానెళ్ళూ) తమ వస్తువు/సేవ బాగుచేయ్యాలన్న ఇంగితం కాని అవసరం కాని ఎందుకు కనపడుతుంది? కలగదు. కాబట్టి మనమే, అవును మనమే ఆ "రిపైర్" కు పూనుకోవాలి.

ఇక్కడదాకా చదివిన వారికి నా ధన్యవాదాలు. మీరు వెయ్యిలో ఒకళ్ళు అయ్యి ఉంటారు. చాలెంజ్ గా చెబుతాను, నేను వ్రాసిన ఈ నాలుగు మాటలూ ఏ చానెల్ అన్నా వారి చర్చా కార్యక్రమంలో చర్చా విషయంగా పొరబాటున కూడా తీసుకోదు, ఏ వార్తా పత్రికా ప్రచురించదు. కారణం అందరినీ విమర్శించే మీడియా తమ మీద విమర్శను సీరియస్ గా తీసుకోదు/పట్టించుకోదు. అసలు అది విమర్శే కాదన్నట్టుగా అలాంటిది ఏమీ లేదన్నట్టుగా ఉష్ట్ర పక్షి తంతుగా వ్యవహరిస్తుంది. ఈ కారణమే కాలక్రమేణా మీడియాకు విషంగా మారి దహించివేస్తుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.