1, అక్టోబర్ 2024, మంగళవారం

అద్భుత నటుడు CSR గారితో కలిసి‌ ఫొటో తీయించుకునే అదృష్టం దక్కలేదు

 


అద్భుత నటుడు CSR గారితో కలిసి‌ ఫొటో తీయించుకునే అదృష్టం దక్కలేదు కానీ, వారబ్బాయి నటరాజ ప్రభు, మనవడు కిరణ్ గార్లతో ఈ మధ్య వాళ్ళింటికి వెళ్ళినప్పుటి ఫొటో తీయించుకోగలిగాను. మొదట Kiran Csr Chilakalapudi గారితో ఫేస్ బుక్ ద్వారా పరిచయం. వారు మా ఇంటి పక్క వీధిలో ఇల్లు కొనుక్కున్న తరువాత, మార్ణింగ్ వాక్ సహాధ్యాయి. కిరణ్ గారి ద్వారా వారి తండ్రిగారు పరిచయం. అలా పరిచయం పెరిగి ఈ సమాచారం మితృలు Subrahmanyam Kvs వారి సతీమణి Jayanthi Puranapanda గార్లకు తెలియచేయటంతో వారి YouTube చానల్ Vyus.in ద్వారా వారి అద్భుత ఇంటర్వ్యూల పరంపరలో సిఎస్సార్ గారబ్బాయి నటరాజ ప్రభు గారితో ఇంటర్వ్యూ చెయ్యటంతో మహానటుడు, అద్భుత గాయకుడు అయిన చిలకలపూడి సీతారామాంజనేయులు (CSR)గారి గురించిన విషయాలు ఎన్నో తెలుసుకునే అవకాశం అలనాటి అభిమానులకు ప్లస్ ఇప్పటి తరానికి కలిగింది.
ఆ ఇంటర్వ్యూకు లింకు

https://www.youtube.com/watch?v=7wN0KKmwAVI

పక్క తొక్కుడోపాఖ్యానం - అప్పట్లో అదొక గొప్ప ప్రజ్ఞ



అప్పట్లో, దాదాపుగా 1980ల వరకూ కూడా పిల్లలు సైకిలు నేర్చుకోవటం అంటే ఈ " పక్క తొక్కుడు" పధ్ధతే. ఎందుకని అలా? ఇప్పుడు ఎందుకు లేదు! అప్పట్లో సైకిళ్ళు 22" లేదా 24" అంగుళాలుగా చెబుతూ అమ్మేవారు. ఏమిటీ 22/24 అంగుళాల కథ! అది సైకిలు చక్రపు కొలత, అంటే వ్యాసం (Diameter) 22 లేదా 24 అంగుళాలుగా ఉండేది. ఈ కొలతలతో సైకిలు ఎత్తు పెరగటం/తగ్గటంగా ఉండేది. ఇంతకంటే తక్కువ ఎత్తున్న సైకిళ్ళు దొరికేవి కావు, దొరికినా చాలా అరుదు. ఇప్పటి పిల్లలకు పక్కతొక్కుడు అంటే ఏమిటో తెలియదు, అవసరమూ లేదు! ఎందుకనీ!? అదే ఇవ్వాళ్టి విషయం.

పాతకాలంలోకి వెళ్ళి, అప్పట్లో పక్కతొక్కుడు ఎందుకు అవసరం అయిందో చూచెదము. సైకిలు, పైన చెప్పినట్టు, అంత ఎత్తు ఉంటే, 10-12 ఏళ్ళ కుర్రాళ్ళకు సీటు ఎక్కి తొక్కాలంటే పెడల్స్ అందేవి కావు. ఒకవేళ అందినా, ఒక పెడల్ అందితే రెండోది అందదు. అందుకని సైకిల్ నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉన్న 10-12 ఏళ్ళ ఔత్సాహికులు, మధ్యమార్గంగా ఈ "పక్కతొక్కుడు" కనిపెట్టి చాలా ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. ఇప్పుడు 60 లు దాటిన తరం అంతా కూడా ముందుగా అలా సైకిలు పక్క తొక్కుడుతో నేర్చుకున్నవాళ్ళే. అప్పట్లో ఈ సైకిలు పక్కతొక్కుడు ఒక పెద్ద ప్రజ్ఞ.
ఇప్పుడు, 5-6 ఏళ్ళ వయస్సుల వాళ్ళు కూడా, సీటు మీద కూచుని తొక్కగలిగే తక్కువ ఎత్తు ఉన్న సైకిళ్ళు బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. ఇప్పటి పిల్లలు, వయస్సునుబట్టి వారివారి ఎత్తుకు సరిపడే సైకిళ్ళు కొనిపించుకుని చిన్నప్పటినుంచే సీటు మీద కూచుని తొక్కటం నేర్చేసుకుని, 4-5 తరగతులనుంచే జామ్మని సైకిల్ మీద స్కూళ్ళకు వెళ్ళటం కనపడుతుంటుంది. ఎత్తు తక్కువ సైకిళ్ళు మార్కెట్ లోకి 1980 ల చివరి రోజుల్లో రావటం మొదలుపెట్టగానే ఈ "పక్క తొక్కుడు" తో అవసరం లేక కనుమరుగు అయిపోయి, ఒకప్పటి ప్రజ్ఞగా మిగిలిపోయింది.
అలనాటి పక్కతొక్కుడు అద్భుతంగా చిత్రించిన అజ్ఞాత చిత్రకారుడికి ధన్యవాదాలు.

18, ఆగస్టు 2024, ఆదివారం

 

ఒకే దేశం, ఒకే ఎన్నిక


ఒకే దేశం, ఒకే ఎన్నిక చర్చ మళ్ళీ తెర మీదకు తీసుకు వచ్చారు. ఈ విషయం మీద నా అభిప్రాయంలో ఏ మార్పూ లేదు. ఒకే దేశం, ఒకే ఎన్నిక ఏ విధంగా సాధ్యమో "అర్ధమయిన వారు" చెబితే సంతోషిస్తాను.


ఒకే దేశం, ఒకే ఎన్నిక
(Click this link)

20, ఫిబ్రవరి 2023, సోమవారం

విజయవాడలో లెనిన్ సెంటర్

విజయవాడలో ప్రధాన కూడళ్ళల్లో "లెనిన్ సెంటర్" ఒకటి . ఈ కూడలి గవర్నర్‌పేటలో అలంకార్ వంతెనకు అతి సమీపంలో, రైవస్ కాలవ పక్కనే ఉన్నది. ఆ ఏరియాకు "లెనిన్ సెంటర్" అనే పేరు రావటానికి కారణం అక్కడ ఉన్న ఈ విగ్రహమే.

అక్కడ లెనిన్ విగ్రహాన్ని 22 ఆగష్టు 1987న అప్పటి సోవియట్ యూనియన్ ఉపాద్యక్షురాలు వి ఎస్ షివ్‌చెంకో ఆవిష్కరించారు. అప్పట్లో , ఈ విగ్రహం రష్యా నుంచి వచ్చిందని అనుకునేవారు. ఈ విగ్రహాన్ని చెక్కిన శిల్పి ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డ్ గ్రహీత శ్రీ ఓరఖోవ్అ ని తెలుస్తున్నది. ఈ విగ్రహం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నది. బాగా మైంటైన్ చేసి పదిలపరుస్తున్నారు.
ఆ ప్రాంతలో (రైవస్ కాలువ ఒడ్డుకు ఆనుకుని)సెకండ్ హాండ్ పుస్తకాల దుకాణాలు బాగా ఉన్నాయి. విజయవాడలో పుస్తక ప్రేమికులకు ఈ దుకాణాలు ఒక వరం. ఎక్కడా దొరకని, ప్రస్తుతం ప్రింటులో లేని (Out of Print) అపురూప పుస్తకాలు ఈ షాపుల్లో దొరికే అవకాశం ఉండటంతో పుస్తక ప్రియులు విజయవాడనుంచే కాకుకండా చుట్టుపక్క ఊళ్ళనుంచి కూడా, ముఖ్యంగా ఆదివారం రోజున వచ్చి తమకు కావాల్సిన పుస్తకాలు వెతుక్కోవటం కనిపిస్తూ ఉంటుంది. పుస్తక ప్రియులకు బాగా పరిచయం అయిన 'ప్రాచీన గ్రంధమాల' ఇక్కడే ఉన్నది.
ఇది మా చిన్న తనాల్లో(1960-70) ఒక చిన్న సందు. అక్కడ ఒక నర్సరీ ఉన్నట్టు గుర్తు. అటునుంచి అంటే ఏలూరు రోడ్డు నుంచి ఇటు గాంధీనగరానికి సిటీ బస్సులు ఈ సందుగుండానే వెళ్ళేవి. అప్పట్లో ఇది వన్ వే ట్రాఫిక్ గా ఉండేది. ఇప్పుడు అక్కడ రెండు రోడ్లు ఉన్నాయి ఒకటి రైవస్ కాలవ ఒడ్డునే ఉన్న రోడ్డు మరొకటి పాత రోడ్డు. ఈ రెండిటికి మధ్య ఈ విగ్రహం ఉన్నది.
1991లో సోవియట్ యూనియన్ పతనం అనంతరం రష్యా, ఉక్రైన్(రష్యానుంచి విడివడి ప్రత్యేక దేశం అయ్యింది) వగైరా దేశాల్లో లెనిన్ విగ్రహాలు తొలగించబడినాయి అని ఒక వార్త ప్రచారంలో ఉండేది. లెనిన్ విగ్రహాల సంఖ్య తగ్గిన మాట వాస్తవమే కానీ, ఇంటర్‌నెట్లో వైతికితే దొరికిన సమాచారం ప్రకారం, 2019 నాటికి రష్యాలో 6000 (1991లో 7000), ఉక్రైన్‌లో 350 (1991లో 5500) ఉన్నాయని తెలుస్తున్నది. సోవియట్ యూనియన్, తూర్పు యూరోపు దేశాలు (ఒకప్పటి కమ్యూనిష్ట్ ప్రభావిత దేశాలు) కాకుండా మిగిలిన ప్రపంచంలో 1991 లో 150 లెనిన్ విగ్రహాలు ఉంటే, 2019 నాటికి 25 మాత్రమే ఉన్నాయట. అలా ఇప్పటికీ నిలిచి ఉన్న, ఆ మిగిలిన పాతిక విగ్రహాలలో విజయవాడలో ఉన్న లెనిన్ విగ్రహాం ఒకటి. విగ్రహాల సంఖ్య గురించిన సమాచారం ఇంటర్నెట్లో దొరికిన వెబ్‌సైటు లింకు: https://www.soviettours.com/.../how-many-lenin-statues-left




రేడియో అభిమాని(నా)తో ఇంటర్వ్యూ


నాకు రేడియో కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమైన ఆకాశవాణి కార్యక్రమాలు రికార్డ్ చేసుకోవటం నా కాలేజి రోజులనుంచి హాబీ. ఈ విషయం తెలుసుకున్న వ్యూస్ యుట్యూబ్ చానల్ వారు (ఉషశ్రీ గారి కుమార్తె, అల్లుడు నిర్వహిస్తున్నారు), కొన్ని రోజుల క్రితం వారి స్టుడియోలో ఇంటర్వ్యూ చేశారు. ఆ కార్యక్రమం నిన్న (4 ఫిబ్రవరి, 2023) యుట్యూబులోకి అప్లోడ్ చేశారు. Subrahmanyam Kvs గారికి Jayanthi Puranapanda గారికి నా ధన్యవాదాలు.
(Click this link)