1, అక్టోబర్ 2024, మంగళవారం

పక్క తొక్కుడోపాఖ్యానం - అప్పట్లో అదొక గొప్ప ప్రజ్ఞ



అప్పట్లో, దాదాపుగా 1980ల వరకూ కూడా పిల్లలు సైకిలు నేర్చుకోవటం అంటే ఈ " పక్క తొక్కుడు" పధ్ధతే. ఎందుకని అలా? ఇప్పుడు ఎందుకు లేదు! అప్పట్లో సైకిళ్ళు 22" లేదా 24" అంగుళాలుగా చెబుతూ అమ్మేవారు. ఏమిటీ 22/24 అంగుళాల కథ! అది సైకిలు చక్రపు కొలత, అంటే వ్యాసం (Diameter) 22 లేదా 24 అంగుళాలుగా ఉండేది. ఈ కొలతలతో సైకిలు ఎత్తు పెరగటం/తగ్గటంగా ఉండేది. ఇంతకంటే తక్కువ ఎత్తున్న సైకిళ్ళు దొరికేవి కావు, దొరికినా చాలా అరుదు. ఇప్పటి పిల్లలకు పక్కతొక్కుడు అంటే ఏమిటో తెలియదు, అవసరమూ లేదు! ఎందుకనీ!? అదే ఇవ్వాళ్టి విషయం.

పాతకాలంలోకి వెళ్ళి, అప్పట్లో పక్కతొక్కుడు ఎందుకు అవసరం అయిందో చూచెదము. సైకిలు, పైన చెప్పినట్టు, అంత ఎత్తు ఉంటే, 10-12 ఏళ్ళ కుర్రాళ్ళకు సీటు ఎక్కి తొక్కాలంటే పెడల్స్ అందేవి కావు. ఒకవేళ అందినా, ఒక పెడల్ అందితే రెండోది అందదు. అందుకని సైకిల్ నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉన్న 10-12 ఏళ్ళ ఔత్సాహికులు, మధ్యమార్గంగా ఈ "పక్కతొక్కుడు" కనిపెట్టి చాలా ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. ఇప్పుడు 60 లు దాటిన తరం అంతా కూడా ముందుగా అలా సైకిలు పక్క తొక్కుడుతో నేర్చుకున్నవాళ్ళే. అప్పట్లో ఈ సైకిలు పక్కతొక్కుడు ఒక పెద్ద ప్రజ్ఞ.
ఇప్పుడు, 5-6 ఏళ్ళ వయస్సుల వాళ్ళు కూడా, సీటు మీద కూచుని తొక్కగలిగే తక్కువ ఎత్తు ఉన్న సైకిళ్ళు బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. ఇప్పటి పిల్లలు, వయస్సునుబట్టి వారివారి ఎత్తుకు సరిపడే సైకిళ్ళు కొనిపించుకుని చిన్నప్పటినుంచే సీటు మీద కూచుని తొక్కటం నేర్చేసుకుని, 4-5 తరగతులనుంచే జామ్మని సైకిల్ మీద స్కూళ్ళకు వెళ్ళటం కనపడుతుంటుంది. ఎత్తు తక్కువ సైకిళ్ళు మార్కెట్ లోకి 1980 ల చివరి రోజుల్లో రావటం మొదలుపెట్టగానే ఈ "పక్క తొక్కుడు" తో అవసరం లేక కనుమరుగు అయిపోయి, ఒకప్పటి ప్రజ్ఞగా మిగిలిపోయింది.
అలనాటి పక్కతొక్కుడు అద్భుతంగా చిత్రించిన అజ్ఞాత చిత్రకారుడికి ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.