చందమామ శీర్షికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చందమామ శీర్షికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జూన్ 2010, సోమవారం

అమరవాణి శీర్షిక




మనకు తెలిసిన చందమామలో, 1970 జనవరిలో ఒక చక్కటి కొత్త శీర్షిక మొదలు పెట్టారు. అదేమిటి? పిల్లలకు మన శాస్త్రాలలోనూ, గ్రంధాలలోనూ, సంస్కృతంలో నిక్షిప్తమై ఉన్న చక్కటి ఉపదేశాలు "అమరవాణి" అన్న పేరుతొ ప్రతి నెల ఒక విషయం మీద కొన్ని శ్లోకాలు, శ్లోకాల కిందే తేట తెలుగులో వాటి అర్ధాలు పిల్లలకు సులభంగా అర్ధమయ్యే భాషలో ప్రచురించేవారు (తెలుగులోకి తర్జుమా పేరుతొ ఇనప గుగ్గిళ్ళ లాంటి మాటలు వాడటం అప్పటి చందమామ శైలి కానేకాదు) .

శీర్షికను మొదలుపెడుతూ సంపాదకీయ పుటలో విధంగా వ్రాసారు

వ్యాఖ్యలో ఒక చక్కటి మాట వ్రాసారు.

" నెల నుంచి "అమరవాణి" అనే శీర్షిక కింద ప్రసిద్ధమైన సంస్కృత శ్లోకాలు , తాత్పర్య సహితంగా అందిస్తున్నాము. వీటిలో గొప్ప సత్యం ఉంటుంది. అందుచేత పాఠకులు కంఠస్తం చేసుకోవచ్చు."

ఎంత చక్కటి మాట! పిల్లలకు ఒక చక్కటి సలహా. చిన్నారి మనసులమీద ఒక మంచిమాట ప్రభావం ఎంతగా ఉంటుందో తెలిసిన వారు వ్రాసిన బంగారు మాటలు. చందమామలో మాటలు చదివి, మేము మా చిన్నప్పుడు (తొమ్మిదో తరగతిలో ఉన్నాము) , ఎన్నెన్ని శ్లోకాలు అర్ధాలతో సహా కంఠస్తం చేసామొ గుర్తులేదు. స్నేహితుల మధ్య పోటీ. నెల చందమామలో వచ్చిన శ్లోకాలు ఎవరు ముందుగా పాడగలరు. ఎవరు సరిగ్గా అర్ధాన్ని గుర్తుంచుకుని చెప్పగలరు.

చందమామ పుణ్యమా అని ఎన్నెన్నో మంచిమాటలు, ఆలోచనలు తెలిసినాయి.


అమరవాణి శీర్షిక నుండి కొన్ని ఆణిముత్యాలు

  1. నిండు కుండ చప్పుడు చెయ్యదు సగం ఖాళీగా ఉన్న కుండ చప్పుడు చేస్తుంది. కులీనుడైన విద్వాంసుడు గర్వించడు. గుణహీనులేఎక్కువవదరుతారు.
  2. స్నేహానికి దూరం లేదు. కొండలమీది నెమళ్ళకూ, ఆకాశాన మేఘానికి స్నేహం."లక్ష" దూరాన ఉన్న సూర్యునికీ, నీటిలో ఉన్న పద్మాలకూ స్నేహం. దూరాన ఉన్న చంద్రుడు కవలలకు ఆప్తుడు
  3. అమృతం వంటి సంతోషాన్ని పొందుతూ శాంతమైన మనస్సుకల వారు సుఖవంతులు . ఇలాంటి సుఖం దురాశాపరులై నానా శ్రమలు పడేవారికి ఉండదు.
  4. దుర్జనులతో స్నేహమూ వైరమూ కూడా తగనివే. బొగ్గు కణికెలు పట్టుకుంటే చెయ్యి కాలుతుంది. చల్లబడినవైనా చెయ్యి నల్లగా అవుతుంది.
  5. ఎవడు పని ప్రారంభిస్తూ దాని ఎక్కువ తక్కువలనూ, మంచి చేద్దలనూ తెలుసుకోడో వాణ్ని మూఢుడు అంటారు.
  6. గర్వమూ, దురుసుగా మాట్లాడటమూ, మొండితనం, ఇతరులను చులకనగా చూడటం, ఎదుటివారిని హేళన చేయటం, ఐదూ మూర్ఖుల లక్షణాలు.

చాలా కాలం శీర్షికను ఒక ప్రత్యెక పుటలో మూడు శ్లోకాలతో నడిపారు. కాని కొంత కాలానికి శ్లోకాలు దొరకకో లేకమరే కారాణానో సెప్టెంబరు 1978 నుండి నెలకొక్క శ్లోకమే వేసేవారు, అదీ సంపాదకీయ పుటలో సంపాదకీయాన్నితగ్గించి వేసేవారు. ఏప్రిల్ 1989 నుండి శీర్షిక కనుమరుగయ్యింది.
ప్రస్తుతం పిల్లలకు ఇటువంటి బంగారు మాటలు చెప్పే శీర్షిక లేదు.

ఇప్పుడు చందమామ పత్రికలో శీర్షికను మళ్ళి మొదలుపడతారు అనుకోవటం పూర్తి దురాశే. ఎందుకుఅంటే, దశాబ్దాల నుండి కొనసాగుతున్న ఫోటో వ్యాఖ్యల పోటీనే జూన్ 2010 తొలగించారు. ఇంకా, "అమరవాణి" మళ్ళి ప్రవేశపెడతారా. కల్ల! కలలోకూడా జరగనిది.

6, జూన్ 2010, ఆదివారం

చందమామ శీర్షిక-ఫోటో వ్యాఖ్య

చందమామలో మొట్టమొదటి సారి ఫోటో వ్యాఖ్య కు పాఠకుల నుండి వ్యాఖ్యలు కోరుతూ ఆగష్టు 1952 లో వేయబడిన ప్రకటన
తెలుగు చందమామ మొదలు పెట్టిన దగ్గర నుండి ఎన్ని మార్పులు చేర్పులు జరిగినా స్థాన చలనం తప్ప మరే విధమైన మార్పులు జరగని శీర్షిక "ఫోటో వ్యాఖ్య" . అప్పట్లో వచ్చిన పత్రికలలో ఫోటో వ్యాఖ్య అని మొదలు పెట్టినది చందమామలోనే, మరే పత్రికా ఇలాంటి విన్నూత్న ప్రయోగం చెయ్యలేదు.

చందమామలో వచ్చిన ఫోటో వ్యాఖ్య శీర్షిక ప్రత్యేకత ఏమంటే, చక్కటి ఫోటోగ్రఫీ ప్రావీణ్యం చూపిస్తూ తీసిన రెండుఫోటోలు ప్రచురించేవారు. రెండు ఫోటోలూ కూడ వేరు వేరు ఫోటో గ్రాఫర్లు తీసినవి అయ్యి ఉండేవి. అయినప్పటికీ, ఫోటోల మధ్య కొంతలో కొంత సామ్యం ఉన్న ఫోటోలనే ఎన్నుకుని, ఫోటోలకు చక్కగా అంత్య ప్రాస కుదరటమే కాక, ఒక చక్కటి అర్ధం వచ్చెట్టుగా వ్యాఖ్యలు పంపమని పాఠకులకు కోరేవారు. వచ్చిన వ్యాఖ్యలలో అన్నిటికన్నా బాగున్నవ్యాఖ్యలకు పారితోషికం ఇచ్చి పంపిన వారి పేరు వేసేవారు.

మరొక చమక్కు ఏమంటే, నెల వ్యాఖ్యలు వేయమని కోరుతూ ఉన్న ఫోటోలు చాలా చిన్నవిగా ప్రచురించేవారు. కాని అవే ఫోటోలను వ్యాఖ్యలతో , తరువాతి నెల పెద్దవిగా ప్రచురించి, చక్కగా నప్పే వ్యాఖ్యలు పంపినవారి పేరుతొ పాటుగా ప్రచురించేవారు.

శీర్షిక మొదలు పెట్టిన రోజులలో ఫొటోకు ఫొటోకు పెద్దగా పొంతన ఉన్నట్టుగా కనపడదు. మొట్టమొదటి చందమామ, జులై 1947 సంచికలో వేసిన ఫోటో వ్యాఖ్యకు సంబంధించిన కింద ఇవ్వబడినది.

ఇష్టమైన బరువు ఎంత మోసినా కష్టమనిపించదు కొంచెం ఆగండి మీకు జవాబు చెబుతాను

మొట్టమొదటి ఫోటో వ్యాఖ్యల శీర్షికకు ప్రచురించబడ్డ, ఫోటోల మధ్య కాని, వ్యాఖ్యల మధ్యకాని ఏమాత్రం పొంతనలేదు. కాని ఫోటోలు మాత్రం చక్కగా తీయబడినాయి. రెండు ఫోటోలు కూడ ఎన్ రామకృష్ణ గారు తీసినవి.

అదే సంవత్సరం అంటే 1947 డిసెంబరు సంచికలో మార్కస్ బార్ట్లే తీసిన కింది ప్రచురించబడింది.

ఫోటో తీసిన మార్కస్ బార్ట్లే మరియు ప్రముఖ సినీ ఛాయాగ్రాహకులు బార్ట్లే ఒకరేనా? తెలియదు. ఒక్కరే అయిఉండవచ్చు. ఎందుకు అంటే, చక్రపాణిగారికి సినిమాలలో కూడ ప్రవేశం ఉన్నది కాబట్టి బార్ట్లే కూడ కెమెరామాన్అందుకని పరిచయం దృష్ట్యా ఆయన తీసిన ఫోటో వేసి ఉండవచ్చు.

మొదట్లో శీర్షికకు తగిన వ్యాఖ్యలను చందమామ వారే పెట్టేవారు. 1950 లు వచ్చేప్పటికి ఫోటోల మధ్య కొంతపోలిక, వ్యాఖ్యలకు పొంతన వచ్చింది. మచ్చుకి 1952 లో జనవరిలో వేయబడ్డ ఫోటో వ్యాఖ్య శీర్షిక కింద చూడండి.

పాపలు పాపాయిలు

కొంతకాలానికి, బహుశా కొడవటిగంటి కుటుంబరావుగారు సంపాదక బాధ్యతలు చేబట్టిన తరువాత అయి ఉండవచ్చు, ఫోటో వ్యాఖ్యలు చందమామ వారు పెట్టటం మాని, అదొక పోటీ కింద పాఠకులకు వదిలిపెట్టి మంచి వ్యాఖ్యలకు బహుమతి ఇచ్చేవారు. ఫోటో వ్యాఖ్యల పోటీ 1952 జులై నెల నుండి మొదలయ్యింది. శీర్షికను మొదలు పెడుతున్నట్టుగా ప్రకటిస్తూ చందమామ సంపాదకీయంలో ఈకింది విధంగా వ్రాసారు.


పత్రికా ప్రపంచంలో అతి ఎక్కువ సంవత్సరాలనుండి (1947 నుండి పోటీ కాకుండాను, 1952 పోటీగానూ) నడుస్తున్నఒక అరుదైన శీర్షిక మన తెలుగు చందమామలో ఉండటం ఎంతైనా ఆనందించతగ్గ విషయం.

చందమామ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండి, పిల్లలకు, పిల్లలాంటి పెద్దలకు చక్కటి వినోదాన్ని విజ్ఞాన్నిఅందించటమే ధ్యేయంగా ఉండేది. అటువంటి చందమామ కూడ ఫోటో శీర్షిక బహుమతుల విషయంలో 1963 సంవత్సరంలో వివాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫోటో వ్యాఖ్యలకు బహుమతి నిర్ణయించే విషయంలో ప్రాంతీయ అభిమానాన్నిచూపిస్తూ, తెలంగాణా వారికి బహుమతి ఇవ్వటంలేదని "బహుమతికి నోచుకోని ఒక పాఠకుడు" అన్న పేరుతొ చేయబడిన ఆరోపణకు వివరణను, చందమామ తన డిసెంబరు నెల, 1963 సంపాదకీయంలో ప్రచురించాల్సి వచ్చింది. చందమామ సంపాదక వర్గం ఘాటుగానే స్పందించింది. స్పందన కింద చూడవచ్చు.
ఇటువంటి వివాదం, తాము వివక్షకు లోనవుతున్నామన్న భావన, 1963 లోనే బాలల పత్రికలో జరిగే ఒక చిన్న పోటీవిషయంలో కూడా, ప్రతిఫలించింది అంటే నాటి ఉద్యమానికి నాంది, వేళ్ళు ఏనాడో పడినాయి అనిపిస్తున్నది.

ఫోటో శీర్షికలో వచ్చిన కొన్నిఫొటోలతో కూడిన ఒక స్లైడ్ షో చూడండి



ఫోటో శీర్షిక చందమామ పత్రికలో ఇంకా కొనసాగుతూ ఉండటం ఒక రికార్డు. శీర్షిక ఇలాగే కొనసాగాలని నాఆకాంక్షే కాదు, చందమామ అభిమానులందరి కోరిక కూడా.













***

19, నవంబర్ 2009, గురువారం

బేతాళ కథలు కథా కమామిషు-2

బేతాళ కథలను పైవిధంగా 1955 సంవత్సరంలో ప్రచురించారు


మరుగున పడిన చందమామ చరిత్రను వెలికి తీసి అక్షరబద్దం చేద్దామనే లక్ష్యంతో నేను సంస్థ లోపలినుంచి చేస్తున్న ప్రయత్నాలు మరింత నిర్దిష్టంగా, ఖచ్చితంగా, సత్యసమ్మతంగా ఉండాలనే భావంతో ఈ బ్లాగులో నేను పొందుపరుస్తున్న కథనాలు, వాటిలోని సమాచారాన్ని మళ్లీ మళ్లీ నాకు నేనుగా నిర్ధారించుకుంటూ, వెనక్కి తిరిగి చూసుకుంటూ పెద్దల సలహాలను తీసుకుంటూ వస్తున్నాను.

ఈ బ్లాగులో సందర్భానుసారం పొందుపరుస్తున్న విషయాలు నూటికి నూరుపాళ్లు వాస్తవమేనని నాకు నేనే సర్టిఫికెట్ ఇచ్చుకునే సాహసం చేయలేను. ఎందుకంటే ఇది 63 సంవత్సరాల చరిత్రకు, చందమామ నేపథ్యానికి సంబంధించిన విషయాలతో కూడిన బ్లాగు.

దశాబ్దాలుగా మరుగున పడి ఉన్న అపరూప చరిత్రను సేకరించే ప్రయత్నంలో పలుసార్లు మనకు అందుబాటులోకి వస్తున్న, పలు కోణాలు, మార్గాలనుంచి అందుతున్న విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకుని వీలయితే మార్చవలసిన, సవరించ వలసిన, ఇంకా నిర్దిష్ట రూపమివ్వ వలసిన అవసరం ఎంతైనా ఉంది.

అందుకే ఈ బ్లాగులో వస్తున్న వ్యాసాలు, కథనాలు వేటికవిగా శాశ్వతాలు అనే అభిప్రాయం అప్పుడూ, ఇప్పుడూ కూడా నాకు లేదు. ఇకపై ఉండదు కూడా. ఓ అరుదైన చరిత్రకు సమగ్ర రూపం ఇవ్వడానికి ప్రయత్నించడంలో ఎన్ని పురిటినొప్పులు పడవలసి ఉంటుందో నాకు తెలీంది కాదు కూడా.

అందుకే బేతాళ కథలుపై నేను కూర్చిన, సమీక్షించిన విషయాలు, అందులో చందమామతో ముడిపడిన అంశాలకు సంబంధించి లోపాలు, ఇంకా సవరించవలసిన విషయాలపై తగు సూచనలు అందించమని ప్రింట్ చందమామ అసోసియేట్ ఎడిటర్ బాలసుబ్రహ్మణ్యం గారిని కోరి ఆ రెండు కథనాల కాపీలను నిన్న అందించాను. ఈ రోజు సాయంత్రం ఆఫీసులోనూ, క్యాబ్‌లోనూ తనతో జరిపిన సంభాషణకు అనుగుణంగా చందమామ బేతాళ కథల నేపథ్యాన్ని మరికొంత వివరంగా పొందుపర్చే ప్రయత్నం చేస్తున్నా.

బాలు గారు ప్రధానంగా రెండు విషయాలను ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అవి. 1.బేతాళ కథలను ఎప్పుడు కూడా మార్చి రాయలేదు. మొదట్లో మూలంలోని కథలను కొన్నింటిని యధాతథంగా ప్రచురించారు.

తర్వాతనుంచి చందమామ రచయితలు పంపుతూ వచ్చిన మామూలు కథలనే బేతాళ కథలుగా పజిల్ రూపంలో, ప్రశ్నలు – సమాధానాల రూపంలో ట్విస్ట్ చేసి పిల్లలకు అనుగుణంగా కథను మార్చారు. తర్వాత పెద్దలకు కూడా అవి ఇష్టమైన కథలుగా మారిపోయాయి.

2. చందమామలోని బేతాళ కథలకు ఘనత ప్రాథమికంగా కథల రచయితలదే. బేతాళ కథలకు సంబంధించి చక్రపాణి, కొకు, శంకర్ గారు వంటి వ్యక్తుల ప్రాముఖ్యత, ఒరవడిల గురించి ప్రస్తావించే క్రమంలో కథల రచయితలను మర్చిపోకూడదు. వారి విలువను విస్మరించవద్దు.

బాలుగారు చెప్పిన ఈ రెండు విషయాలను వివరంగా ప్రస్తావించుకుందాము. ఆయన ఎరుక ప్రకారం…

బేతాళ కథలను చందమామ పత్రిక ఎన్నడూ మార్చి రాయలేదు. 1955 సెప్టెంబర్ సంచికలో తొలి బేతాళ కథను “మహామంత్రి మనోవ్యాధి” అనే పేరుతో ప్రచురించారు. గుణాఢ్యుని మూల కథల్లో ఒకటో కథ, రెండవ కథ, మూడవ కథ అనే ఉంటాయి. తర్వాత అక్టోబర్‌లో “మారిన తలలు” నవంబర్‌లో ఏడ్పు – నవ్వు, డిసెంబర్‌లో ఆత్మబలిదానం అని బేతాళ కథలను మూలంలోనివే వేశారు.

మృతసంజీవనీ మంత్రం వరకు మొత్తం 9 కథలను ప్రచురించిన చందమామ ఆ కథల ముగింపు పుటలో కల్పితం అని వేయలేదు. 1956 జూన్ సంచికలో మాత్రమే బేతాళ కథకు చివర కల్పితం అని ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇక్కడినుంచే బేతాళ కథలను ఒరిజనల్ కథలనుంచి కాక రచయితలు పంపిన కథలనుంచే ఏరుకుని ట్విస్ట్ చేసినట్లుంది.

ఇంకా చెప్పాలంటే బాలుగారి ప్రకారం 1955 సెప్టెంబర్ నుంచి మొదటి మూడు కథలు మాత్రం నిఖార్సుగా మూల కథలే అయి ఉంటాయి. తర్వాత నుంచి మామూలు కథలనే బేతాళ కథలుగా మార్చి రాశారు. ఎందుకంటే దీనికి నేపథ్యం ఉంది. గుణాడ్యుని బేతాళ మూల కథలు వాస్తవానికి పెద్దల కథలు అంటే అడల్ట్ కథలు. అంటే కేవలం శృంగారానికి మాత్రమే సంబంధించినవి అని కాదు. అవి భార్యాభర్తలు, స్త్రీపురుషుల సంబంధాలు, సంసార నీతి, కుటుంబ విలువలు వంటి పెద్దలకు సంబంధించినవి. కుటుంబ నీతిని ధిక్కరించిన కథలు కూడా మూలంలో ఉన్నాయి.

కాబట్టి తొలి రెండు మూడు కథలను ప్రచురిస్తున్న క్రమంలో చందమామ సంపాదకులకు, సంపాదక వర్గ సభ్యులకు ఈ పెద్దల విషయాన్ని పిల్లలకు ఎలా చెప్పడం అనే ధర్మసందేహం ఎదురై మూల కథల్లోని ట్విస్ట్‌ను తీసుకుని చందమామ రచయితల కథలనే బేతాళ కథలుగా మార్చి రాస్తే బాగుంటుంది కదా.. ఇలా ఎందుకు చేయకూడదు అనే థాట్ వచ్చిందట.

ఇది చక్రపాణి, కుటుంబరావు గార్లలో ఎవరికయినా వచ్చి ఉండవచ్చు. లేదా కొకు గారే సలహా ఇస్తే దాన్ని చక్రపాణిగారు ఆమోదించి ఉండవచ్చు. ఏదేమైనా మూలకథలను కాకుండా ఆధునిక కథలనే మధ్యలోనో లేదా చివర్లోనూ లేదా కథ మొత్తంగానో మార్పు చేసి పజిల్ లేదా ప్రశ్న-సమాధానం రూపంలో మార్చి ప్రచురించాలనే ఆ ఆలోచనకు గుణాడ్యుని మూలకథలే ఆస్కారం ఇచ్చాయి.

కాబట్టి బేతాళ కథలను చందమామ ఎన్నడూ మార్చి రాయలేదు. చందమామలో తొలి మూడు, లేదా తొమ్మిది కథల తర్వాతే కొత్త కథలను చందమామీకరణ చేసి ఉంటారన్నది బాలూగారి అభిప్రాయం. తొలి 3 కథలూ నిఖార్సయిన మూల కథలే అని తానంటారు.

ఇకపోతే రెండోది. చందమామ బేతాళ కథలకు ఘనత ప్రాథమికంగా రచయితలదే. ఏ కారణాలతో అయినా సరే చందమామకు కథలు రాస్తూవచ్చిన రచయితలను విస్మరించకూడదు. ఎందుకంటే వీరు రాసి పంపుతూ వచ్చిన సాధారణ కథలనే బేతాళ కథలుగా సంపాదకులు మార్చి రాస్తూ వచ్చారు. బేతాల కథలకు అని ఉద్దేశించకుండా రచయితలు పంపిన సాధారణ కథలను కూడా బాగుంటే, బేతాళీకరణకు అనువుగా ఉంటే వాటిని సెపరేట్ చేసి సవరించేవారట.

దీనికి తొలి పాతికేళ్లూ అంటే 1955 నుంచి 1980 వరకు చక్రపాణి, కుటుంబరావు గార్లు మార్గదర్శకత్వం వహించగా, తర్వాతి దశలో విశ్వంగారు, దాసరి సుబ్రహ్మణ్యం గారు 2006 వరకు బాధ్యత వహించారట. కొకు గారి తర్వాత బేతాళకథలను సాపుచేసే బాధ్యత దాదాపుగా దాసరి గారిదే అని బాలు గారి అభిప్రాయం. 2006 తర్వాత బాలుగారే ఈ బాధ్యతను చేపట్టారనుకోండి. పైగా ఇతర సంపాదకవర్గ సభ్యుల వలే కాక ఈయన స్వతహాగానే చందమామ అవసరాలకు గాను బేతాళ కథలను అడపాదడపా రాస్తున్నారని తెలిసింది. దీన్ని కూడా పైకి అంగీకరించని మోడెస్టీ ఈయనది.

అయితే చక్రపాణి, కుటుంబరావు, విశ్వం, దాసరి సుబ్రహ్మణ్యం గార్లలో ఏ ఒక్కరూ స్వంతంగా బేతాళ కథలను రాయలేదని కథకులు పంపిన కథలలోంచి ఏరిన వాటినే కొకు, దాసరి గార్లు బేతాళ కథలుగా మార్పు చేసేవారని అంటారీయన. కథ మధ్యలో మార్చినా, చివర్లో మార్చినా, లేదా కథ మొత్తంగా మార్పులకు గురిచేసినా చందమామ బేతాళ కథలకు మూలం చందమామ కథకులే. వీరిలోనూ రాజగోపాలరావు -వసుంధర- గారిదే అగ్రతాంబూలం అని బాలుగారి ప్రకటన.

చందమామ సంపాదక బృంద సభ్యులు సాపు చేసి తుది రూపమిచ్చిన బేతాళ కథలకు కూడా సవరణలు సూచించినవారు చందమామ చరిత్రలో ఇద్దరే ఇద్దరు. వారు చక్రపాణి గారు, విశ్వనాథ రెడ్డి గారు. బేతాళ కథకు మార్పులను సూచించడంలో చక్రపాణి గారి కంటే విశ్వంగారే రెండాకులు ఎక్కువగా చదివారన్నిది బాలూగారి అభిప్రాయం.

సంపాదక సిబ్బంది బాగా లేదు అని కొట్టిపారేసిన కథను కూడా మధ్యలోనో, చివర్లోనూ మార్పులు చేసి బేతాళకథగా మార్చవచ్చు కదా అని విశ్వంగారు సూచించేవారట. చక్రపాణిగారికి ఎంత సంపాదక అనుభవం ఉందో అంత అనుభవం విశ్వంగారికి ఉందని, ఇందుకు 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం తోడయిందని బాలు గారు చెప్పారు.

ఇలా పిల్లలకోసం తయారైన బేతాళకథలు తర్వాత ఆంధ్రదేశంలో అన్నివయస్సుల వారిని దశాబ్దాలుగా ఆకట్టుకున్నాయి. చనుబాల కథలుగా మాత్రమే పేరొందిన చందమామ కథల పట్ల తర్వాత పెద్దలు కూడా బాగా ఆసక్తి చూపేలా చేయడంలో మొదటి మలుపు బేతాళ కథలనుంచే ప్రారంభమయ్యిందిని చెప్పవచ్చు.

పెద్దల విషయంగా పేరొందిన బేతాళ మూల కథలను మినహాయించి పిల్లల కంటెంట్‌గా మార్పుకు గురయిన బేతాళ కథలు అచిర కాలంలోనే కుటుంబంలోని స్త్రీ, బాల, వృద్ద బాంధవ్యులందరికీ నచ్చిన అద్భుత విజయ గాధలుగా చరిత్రలో నిల్చిపోయాయి.

బాలు గారికి కృతజ్ఞతలతో…

చివరగా చందమామ బేతాళ కథల ప్రాశస్త్యం గురించి శివరాం గారు తన బ్లాగులో రాసిన కథనంలోని చివరి పేరాతో దీన్ని ముగిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.

“కథా సంపుటి లేదా ధారావాహికగా మొదలు పెట్టబడినా, చివరకు ఒక కథా శీర్షికగా స్థిరపడినాయి ఈ బేతాళ కథలు.చిన్న చిన్న ధారావాహికలు మొదలు పెట్టినప్పుడల్లా తమ సంపాదకీయంలో ఆ ధారావాహిక గురించి కొద్దో గొప్పో చందమామలో వ్రాసే వారు. కాని చారిత్రాత్మకమైన బేతాళ కథల ధారావాహిక (శీర్షిక) చడి చప్పుడూ లేకుండా మొదలు పెట్టేశారు. మరి అప్పట్లో ఈ కథలను ఎలా వేయ్యలో ఇంకా నిర్ణయించుకోలేదేమో.

చివరికి , ఇలా ఎటువంటి ప్రకటన లేకుండా మొదలు పెట్టబడినా, చందమామలోని అన్ని ధారావాహికలలోనూ ఎక్కువరోజులు ప్రచురించబడింది, ఇంకా ప్రచురిస్తూనే ఉన్నారు. భారత పత్రికా చరిత్రలో ఇది ఒక మైలురాయి (రికార్డు)అని నా అభిప్రాయం. తెలుగు పత్రికా చరిత్రలో అన్ని శీర్షికలకన్న ఎక్కువకాలం ప్రచురించబడిన, ఇంకా ప్రచురించబడుతున్న శీర్షిక ఇది ఒక్కటే అయి ఉండవచ్చును.ఈ చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక ప్రసిద్ధ రచయిత, చందమామకు ఎక్కువకాలం సంపాదకుడిగా పనిచేసిన, శ్రీ కొడవటిగంటి కుటుంబరావు కృషి ఎంతగానో ఉన్నది.

బేతాళకథలు ధారావాహిక అనండి లేదా శీర్షిక అనండి, ఏది ఏమైనా కథలను ఏకధాటిగా ఇంత ఆసక్తికరంగా, పిల్లలకు(అనేకసార్లు పెద్దలకే) తెలివితేటలు పెంపొందించే విధంగా ప్రచురించటం నభూతో నభవిష్యతి.”
*************

కొన్ని లింకులు
గుణాఢ్యుడి బేతాళ కథలు

బేతాళ కథలు – కుటుంబరావు గారి ఒరవడి


(పై కథనం చందమామ చరిత్ర బ్లాగులోనిది, రచయిత శ్రీ రాజశేఖర రాజు)

16, నవంబర్ 2009, సోమవారం

తాతయ్య కథలు

ప్రస్తుతం ఉన్న కుటుంబ వ్యవస్థలో, తాతయ్యలు, బామ్మలు, అమ్మమ్మలు ఎక్కువగా కనపడరు. వాళ్ళెక్కడో పల్లెలోనో,పట్నంలోనో లేదా ఏ వృధ్యాప్య గృహంలోనో ఒంటరిగా కాలగడుపుతుంటే, పిల్లలు, మనవలు మనవరాళ్ళు ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో మనవలకు మనవరాళ్ళకు తాతయ్య ఎవరో తెలియదు, తాతయ్యకు వీళ్ళను చూసే అవకాశం వచ్చి ఉండదు. మరికొన్ని దురదృష్ట సందర్భాలలో మనవలకు మనవరాళ్ళకు తమ తాతయ్య మాట్లాడే భాష అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు విదేశాలలో పెరిగి ఉంటారు. నేటి ఈ కాలంలో, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దాదాపుగా కనుమరుగయ్యింది.

ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే, పూర్వపు రోజులలో 50-60 దశకాలలో కూడ, మనకున్న చక్కటి కుటుంబ వ్యవస్థను ప్రతిబింబిస్తూ, చందమామ వారు "తాతయ్య కథలు" అన్న శీర్షిక పేరుతో అనేక కథలు ధారావాహికగా ప్రచురించారు. ఈ చక్కటి శీర్షిక 1960 ఆగస్టు నెలలో మొదలయ్యి 1961 మే నెలవరకు వేశారు. ఆ తరువాత మే 1962 నుండి జులై 1963 వరకు ధారావాహికగా ప్రచురించారు. ఆ తరువాత నవంబరు 1968, ఫిబ్రవరి మరియు ఏప్రిల్ 1969 నెలలో కూడ ఈ కథలను పాఠకులకు అందించారు.

ఈ కథలలో మొట్టమొదటి కథ పేరు అదృష్టం, చిట్టచివరి కథ పేరు మట్టి కాళ్ళు.

తాతయ్య కథల రచయితలు

సర్వశ్రీ
సి శేషాద్రి
చల్లా లక్ష్మి గారు
ఆర్ బయవ రెడ్డి
ఎ వ్ శేషాద్రి
మాధవరెడ్డి చంద్రశేఖర్

వీరిలో ఎక్కువ తాతయ్య కథలను వ్రాసినవారు సి శేషాద్రి గారు. ఈ శీర్షికకు బొమ్మలు వేసినది ప్రముఖ చిత్రకారులు చిత్రాగారు. అప్పుడప్పుడు శంకర్ గారు కూడ బొమ్మలు వేశారు.

ముఖ చిత్రం చూడండి తాతయ్య మెల్లిమెల్లిగా ముసలివాడయినట్టుగా వేశారు. చివరి భాగంలో తాతయ్య చాలా ముసలివాడయిపోయాడు. తాతయ్య నోటిద్వారా చక్కటి కథలను అందించిన చందమామవారు పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో పాటుబడ్డారు.
చందమామ లో తాతయ్య కథలు చదవాలని ఉన్నదా! చందమామ వారు వారి సైటులో చాలా పాత చందమామలను ఉంచారు. చక్కగా అక్కడకు వెళ్లి చదువుకోవచ్చు.

బేతాళ కథలు - కధా కమామిషు

చందమామలో మనమందరమూ బేతాళ కథలు చదివేఉంటాము. ఆ కథ మొదలు పెట్టటమే విచిత్రంగా ఉంటుంది. ఆ కథ ఆవిధంగా ఎందుకు మొదలవుతుంది తెలియాలంటే మొట్టమొదటి బేతాళకథ చదవాలి. బేతాళకథల మీద మునుపు నేను తెలుగు వికీలో వ్రాసిన వ్యాసం,కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులతో, ఇక్కడ పున: ప్రచురిస్తున్నాను.
================================================
గుణాఢ్యుడు రచించిన "బృహత్ కథ" బేతాళకథలకు మూలం. ఈ కథలను కొంతకాలము తరువాత "కథాసరిత్సాగరం" సంపుటి లోనికి చేర్చారు. మూలంలో 25 కథలు మాత్రమే ఉన్నాయి. చివరి కథలో బేతాళుడి ప్రశ్నలకు విక్రమార్కుడు జవాబులు చెప్పలేకపోతాడట. అంతటితో ఆ కథలు సమాప్తమవుతాయి. కాని, బేతాళ కథలలోని చివరి కథ అందుబాటులో ఉన్నప్పటికీ, చందమామలో ఇంతవరకు వెయ్యలేదు. అది కాస్తా వేసేస్తే శీర్షిక ఇన్నాళ్ళు ఉండేది కాదు, ఇంత పేరు ప్రఖ్యాతులు గడించేదికాదు
.
మూలకథ
గోదావరీ తీరాన, ప్రతిష్ఠానపురానికి విక్రమార్కుడు రాజు. ఒక భిక్షువు ఆయనకు రోజూ ఒక పండు లోపల రత్నము పెట్టి ఇస్తూ, ఆయన ప్రాపకం సంపాదించటానికి ప్రయత్నించేవాడు. అలా పండులో రత్నం పెట్టి ఇస్తున్నట్లు, కొన్ని రోజుల వరకు రాజుకు తెలియదు. ఆ విషయం తెలిసిన రోజున, విక్రమార్కుడు భిక్షువు యొక్క విశ్వాసానికి మెచ్చి, కారణం చెప్తేగాని మర్నాడు పండు తీసుకోనని చెప్తాడు. దానికి బిక్షువు, తను ఒక మంత్రాన్ని సాధించదలచాననీ అందుకు ఒక వీరుడి సహాయం కావాలనీ, విక్రమార్కుని నుండి తానా సహాయం ఆశిస్తున్నాననీ అడుగుతాడు. విక్రమార్కుడు తగిన సహాయం చెయ్యటానికి ఒప్పుకుంటాడు. బిక్షువు, రాబోయే కృష్ణ చతుర్దశి రాత్రి చీకటి పడగానే రాజును మహా శ్మశానానికి రమ్మంటాడు.

అలాగే విక్రమార్కుడు వెళ్తాడు. అక్కడే ఉన్న భిక్షువు, రాజును శింశుపా వృక్షం మీద వేళ్ళాడుతున్న పురుషుడి శవం తెచ్చి, తన సమీపంలో ఉంచమంటాడు. రాజు ఆ చెట్టు ఎక్కి వేళ్ళాడుతున్న శవాన్ని తాడు కోసి కింద పడవేస్తాడు. కిందపడగానే, శవం ఏడవటం మొదలుపెడుతుంది. బేతాళుదు ఆ శవాన్ని ఆవహించి ఉన్న సంగతి తెలుసుకోలేక విక్రమార్కుడు, ఎందుకు నవ్వుతావు, పోదాం పద అంటాడు. రాజుకు ఇలా మౌనభంగం అవగానే నేలమీది శవం మాయమై, మళ్ళీ చెట్టు మీద వేళ్ళాడుతూ కనపడుతుంది. విక్రమార్కుడు బేతాళుడు పూని ఉన్న ఆ శవాన్ని మళ్ళీ కిందపడేసి, భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవటం మొదలు పెడతాడు.

అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీకు వినోదంగా ఉండటానికి ఒక కథ చెబుతాను విను" అంటూ ఒక కథ చెప్తాడు. కథ చివర ప్రశ్న వేసి, "ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పక పొయ్యావో, నీ తల పగిలి పోతుంది" అంటాడు. విక్రమార్కుడు తన మౌనం వీడి ప్రశ్నకు తగిన సమాధానం చెపుతాడు. ఆ విధంగా, విక్రమార్కుడికి మౌనభంగం జరగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తెరిగి చెట్టు ఎక్కుతాడు.
చందమామలో ధారావాహిక
మొట్టమొదటగా బేతాళ కథలను చందమామలో మొదలు పెట్టినది సెప్టెంబరు 1955లో. ఈ కథలు ఎంతో కాలం చందమామ పత్రికలో కథా స్రవంతిగా వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. ఇదొక చిత్రమైన కథల సంపుటి. ప్రతి మాసం ఒక సంఘటన (విక్రమార్కుడు చెట్టుమీదనుంచి శవాన్ని దించి, భుజాన వేసుకొని) తో మొదలయ్యేది, అలాగే, మరొక సంఘటన (విక్రమార్కుడికి ఆ విధంగా మౌన భంగం కాగానే, శవంలోని బేతాళుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు)తో అంతమయ్యేది. ప్రతి కథలోనూ, విక్రమార్కుడు మోస్తున్న శవంలోని భేతాళుడు, విక్రమార్కుడికి "శ్రమ తెలియకుండా విను" అని ఓ చక్కటి కథ చెప్పేవాడు. చివరకు, ఆ కథకు సంబంధించి చిక్కు ప్రశ్న/లు వేసేవాడు. అలా ప్రశ్నలు వేసి, విక్రమార్కుడికి ఒక హెచ్చరిక చేసేవాడు "ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసీ చెప్పకపొయ్యావో, నీ తల వెయ్యి వక్కలవుతుంది" అని. మౌనం వీడితే వ్రత భంగం అయ్యి, వచ్చినపని చెడుతుంది, సమాధానం తెలిసీ చెప్పకపోతే ప్ర్రాణానికి ప్రమాదం. పాపం విక్రమార్కుడు ఏం చేస్తాడు? తప్పని పరిస్థితులలో, తన మౌనం వీడి, ఆ చిక్కు ప్రశ్నకు చాలా వివరంగా జవాబు చెప్పేవాడు. ఈ విధంగా ప్రతినెలా శవంలోకి బేతాళుడు ప్రవేశించి, కథ చెప్పి, ప్రశ్నలడిగి, హెచ్చరించి, విక్రమార్కుడికి మౌన భంగం చేసి, అతడు వచ్చిన పని కాకుండా చేసేవాడు. అలా పై నెలకి కథ మొదటికి వచ్చేది.

బేతాళ కథ మొదటి కథ ఎలా ఉంటుందో అన్న పాఠకుల అసక్తిని గమనించి గాబోలు, చందమామ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, 1972 జూలైలో మొదటి బేతాళకథ రంగులలో పునర్ముద్రించారు. ఈ మొట్టమొదటి కథకు, పున:ముద్రణలో పేరు పెట్టలేదు. కాని మొదటి ముద్రణలో ఈ కథ పేరు "మహామంత్రి మనోవ్యాధి". ఆ తరువాత కథలన్నిటికీ కథ మొదటి పుటలో పైన కథ పేరు, కింద "బేతాళ కథలు" అని వేయసాగారు. బేతాళ కథలకు మొదటి పేజీలో వేసే బొమ్మ చాలా సార్లు మార్చి మార్చి వేసారు .

అలాగే కథ చివరి పుటలో, బేతాళుడు ఎగిరి పోతూ ఉండటం, విక్రమార్కుడు కత్తి దూసి వెంట పడుతుండటం కూడా చాలా రకాలుగా వెయ్యబదినది.

శీర్షికగా బేతాళ కథలు

బేతాళ కథలను చందమామలో సెప్టెంబరు 1955 సంచికలో మొదలు పెట్టారు. అసలు, బేతాళ కథలు పాతిక మాత్రమే! కాని, చందమామలో వందల కొలది మామూలు కథలను (ఇప్పటివరకు 600 పైగా) బేతాళ కథలుగా ఎంతో నేర్పుగా మార్చి ప్రచురించారు. సాధారణమైన పిల్లల కథల్లోంచి, కథ చివర, ప్రతి నెలా, ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం, దానికి చక్కటి సమాధానం చెప్పించడం, సామాన్య విషయం కాదు. అతి కష్టతరమైన ఈ పనిని, దశాబ్దాల పాటు నిరాఘాటంగా కొనసాగించడం, చందమామ నిబద్ధతకు, నైపుణ్యానికి, చక్కటి నిదర్శనం. తెలుగు జానపద సాహిత్యంలోని పేరొందిన ఒక కథా సంపుటిని తీసుకుని, ఆ కథలను ప్రచురించటమే కాక, అదే పంధాలో అనేక ఇతర కథలను ప్రచురించి, చిన్న పిల్లలకు(పెద్దలకు కూడ) చక్కటి ఆలోచనా పద్ధతి, సందేహాలను ప్రశ్నల రూపంగా వ్యక్తపరచటం,తర్కంతో కూడిన చక్కటి సమాధానాలు ఇచ్చే నేర్పరితనం ఈ శీర్షిక ద్వారా చందమామ వారు అందచేశారు.

కథా సంపుటి లేదా ధారావాహికగా మొదలు పెట్టబడినా, చివరకు ఒక కథా శీర్షికగా స్థిరపడినాయి ఈ బేతాళ కథలు.చిన్న చిన్న ధారావాహికలు మొదలు పెట్టినప్పుడల్లా తమ సంపాదకీయంలో ఆ ధారావాహిక గురించి కొద్దో గొప్పో చందమామలో వ్రాసే వారు. కాని చారిత్రాత్మకమైన బేతాళ కథల ధారావాహిక (శీర్షిక) చడి చప్పుడూ లేకుండా మొదలు పెట్టేశారు. మరి అప్పట్లో ఈ కథలను ఎలా వేయ్యలో ఇంకా నిర్ణయించుకోలేదేమో. చివరికి , ఇలా ఎటువంటి ప్రకటన లేకుండా మొదలు పెట్టబడినా, చందమామలోని అన్ని ధారావాహికలలోనూ ఎక్కువరోజులు ప్రచురించబడింది, ఇంకా ప్రచురిస్తూనే ఉన్నారు. భారత పత్రికా చరిత్రలో ఇది ఒక మైలురాయి (రికార్డు)అని నా అభిప్రాయం. తెలుగు పత్రికా చరిత్రలో అన్ని శీర్షికలకన్న ఎక్కువకాలం ప్రచురించబడిన, ఇంకా ప్రచురించబడుతున్న శీర్షిక ఇది ఒక్కటే అయి ఉండవచ్చును.ఈ చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక ప్రసిద్ధ రచయిత, చందమామకు ఎక్కువకాలం సంపాదకుడిగా పనిచేసిన, శ్రీ కొడవటిగంటి కుటుంబరావు కృషి ఎంతగానో ఉన్నది.

బేతాళకథలు ధారావాహిక అనండి లేదా శీర్షిక అనండి, ఏది ఏమైనా కథలను ఏకధాటిగా ఇంత ఆసక్తికరంగా, పిల్లలకు(అనేకసార్లు పెద్దలకే) తెలివితేటలు పెంపొందించే విధంగా ప్రచురించటం నభూతో నభవిష్యతి.

అస్సలు చందమామలో మొట్టమొదటగా ముద్రించబడిన బేతాళ కథ సెప్టెంబరు 1955 లో . ఇదే కథను రంగులువేసి చందమామ స్వర్ణోత్సవ సందర్భంగా 1972 జులై లో పున:ముద్రణ చేసారు.

13, నవంబర్ 2009, శుక్రవారం

పరోపకారి పాపన్నతో ఇంటర్వ్యూ

పరోపకారి పాపన్న కథలు చందమామలో ప్రచురించబడిన ధారావాహికల లో ముఖ్యమైనది. ఈ కథలు ఎంత ప్రాచుర్యం పొందాయంటే, ఎవరైనా కొంచెం మంచికి పోయి సహాయపడితే, అటువంటివారిని పరోపకారి పాపన్నరా వాడు అని పిలవటం వాడుక అయ్యింది. అటువంటి పరోపకారి పాపన్నతో ఈ రోజున సంభాషిద్దాం అని అలా వెతుక్కుంటూ,ఊరంతా తిరిగినాక, ఒక సందులో తెరపగా ఉన్న చిన్న ఇల్లే ఆయనది అని తెలిసింది. గేటు తెరుచుకుని లోపలకి వెళ్ళితే ఒక వయసు మళ్ళినాయన పడక కుర్చీలో పడుకుని చదువుకుంటున్నారు. చందమామలో మనకి పరిచయమేగా, పెద్దవాడయిపోయినా పాపన్నగారిని ఇట్టే గుర్తుపట్టాను.

నేను: ఏమండోయ్ పాపన్నగారూ! నమస్కారం

పాపన్న: ఎవరు నాయనా, వయసు మళ్ళిపోయింది చూపు సరిగ్గా ఆనటంలేదు మీకు నేనేమైనా సహాయం చెయ్యగలనా? చెప్పండి

నేను: లేదండి,సహాయం కాదండీ, నేను మీ అభిమానిని మీతో కాసేపు ముచ్చటిద్దామని మిమ్మల్ని పలకరించాను, మీకు ఇబ్బందేమి లేదుకదా.

పాపన్న: అబ్బే, ఇందులో ఇబ్బందేమున్నది నాయనా, అలా కూర్చో చెప్పు ఏం మాట్లాడుదామనుకుంటున్నావు.

నేను:(కొంచెం బిడియంగా)మీ గురించి నా బ్లాగులో వ్రాద్దామనుకుంటున్నాను, మీ గురించి వివరాలు చెప్పగలరా.

పాపన్న: అడుగు బాబూ, నాకు గుర్తు ఉన్నంతవరకు, తెలిసినంతవరకు చెప్తాను.

నేను: మీరు ఎక్కడి వారండి, మీరు ఎప్పుడు పుట్టారు?
పాపన్న: ఎక్కడివారంటే?? నేను పదహారు ఆణాల తెలుగు వాణ్ణి,ఇప్పుడు మీరు ఏదో జిల్లాలు, ప్రాంతాలు అని కొంచెం బేధించి మాట్లాడుకుంటున్నారనిపిస్తున్నది. అప్పట్లో తెలుగువారందరూ ఒకటే.నేను తెలుగు చందమామలో పుట్టాను. అక్కడే అనేకమందికి సహాయం చేసాను.

నేను: చందమామలో పుట్టారు, ఇంత పేరు తెచ్చుకున్నారు, మిమ్మల్ని సృష్టించిన వారెవ్వరండి, చందమామలో ఎప్పుడు పుట్టారు?

పాపన్న: పేరుదేమున్నది నాయనా! ఆపదలో ఉన్నవారిని, నిస్సహాయులకు సహాయం చెయ్యటమే నాకు తృప్తిని,హాయిని ఇచ్చింది. నన్ను సృష్టించినది, ఎం రంగారావుగారని, చందమామలోనే పనిచేసేవారు. ఆయన చాలా ఊహించి, నన్ను ప్రజలకు ముఖ్యంగా బాలలకు పరిచయించేసారు. సరిగ్గా గుర్తులేదు, 1962 జ్యేష్ట మాసంలో అనుకుంటాను మొదటిసారి నాకు ఈ ప్రపంచాన్ని రంగారావుగారు చూపించారు. అప్పటికే నాకు 14-15 ఏళ్ళు ఉంటాయి.
నేను: మీరు ఎంతవరకు చదువుకున్నరండి. ఎవరిదగ్గర.......

పాపన్న: చదువుదేమున్నది ఏదో చదువుకున్నాను, మా గురువుగారు చెప్పిన పరోపకారం మిదం శరీరం మాత్రం బాగా వంటబట్టింది.

నేను: మీరు భీమన్నను, తాతయ్యగారిని ఎరుగుదురా?

పాపన్న: (నవ్వుతూ) ఆ! ఆ! భీమన్న గురించి చాలా విన్నాను. నాకు ముందటివాడు. తొందరపాటు, అమాయకత్వమేకాని, చాలా మంచివాడని అందరూ చెప్పుకుంటారు. ఇక తాతయ్యగారు నేను కలసి మెలిసి తిరిగాం. నాకంటే చాలా పెద్దవాడు. చాలా నీతిమంతుడు ఎన్ని చక్కటి కథలు చెప్పేవాడు, వాళ్ళమనవలకి, మనవరాళ్ళకే కాకుండా నాకు కూడ. ముఖ్యంగా ఆయన చెప్పిన కథలలో సత్యవాది, అసత్యవాది కథలు ఇప్పటికి గుర్తున్నాయి.

నేను: మీకు పరోపకారి పాపన్న అన్న పేరు ఎందుకు వచ్చిందండి?

పాపన్న: ఇప్పుడంటే పెద్దవాణ్ణయిపోయాను, ఎవరూ నన్ను ఆడగటంలా. ఈ మధ్యవరకూ, అడిగిన వారికి లేదనకుండా నాకు చేతనయినంత ఉపకారం చేశాను. నిస్సహాయులను చేరదీసి ఆదరించాను. అసలు నా సృష్టికర్త రంగారావుగారే, నా కణకణాల్లోనూ పరోపకారం రంగరించి పోశారు. అందుకనే కాబోలు నలుగురూ, ఆయనే పరోపకారి పాపన్న అనుకోవటం విన్నాను. అలా పిలిచినప్పుడల్లా నాకు కొంత ఇబ్బందిగా ఉంటుంది, మనమేదో చేతయినంత చేస్తాం ఆ మాత్రానికే అలా మెచ్చుకోవాలా. నేను చెయ్యలేనిది ఎట్టగో చెయ్యలేనుకదా.

నేను: (లేచి ఆయన చేతులు రెండు కళ్ళకు అద్దుకుని) పాపన్నగారూ, ఎంతమందికి సహాయం చేసినా, మీకు మీరేదో గొప్పపని చేసానని అనుకోవటమే లేదు. అదేనండి మీ గొప్పతనం, మా అందరికీ మీరంటే అభిమానం భక్తి అందువల్లనే కదండీ

పాపన్న: చిరునవ్వు నవ్వి అలా కూచూండి పొయ్యారు.

నేను: పాపన్న గారూ మీకు జీవితంలో కష్టాలు ఏమైనా ఎదురయ్యాయా?
పాపన్న: కష్టాలా, లేదండి, నాకెప్పుడూ అలా అనిపించలేదు. ఏదో నాపని నాది, ఓకళ్ళ జోలికి పోను. నాకు చేతయ్యినపని చేసుకోవటం అంతే.
నేను: మీరు మీ పని మానుకుని ఇతరులకి సహాయం చెయ్యలని ఎందుకు అనుకునేవారండి.
పాపన్న: చూడు నాయనా, పాత కాలం వాణ్ణి, ఇది నా పని, ఈ పని వేరొకరిది అని నాకు తెలియదు. అన్నీ నా పనులే. నా పని ఎప్పుడూ ఆగలేదు, చెడలేదు.

నేను: పరోపకారం వల్ల మీకు ఉపకారం జరిగిందా పాపన్నగారూ.

పాపన్న: ఎంతమాట నాయనా మనకు ఉపకారం జరగాలని ఇతరులకి ఉపకారం చేస్తామా ఎంత తప్పు. సహాయం చెస్తున్నానని ఏనాడు అనుకోలేదు. అది కూడ నాపనే. అందులో ఎంతో ఆనందం ఉన్నది. భగవంతుణ్ణి సేవించటం కంటే ఎంతో తృప్తి నిస్తుంది.

నేను: మీకు చిత్రాగారు గుర్తున్నారండి

పాపన్న: అయ్యెయ్యో
చిత్రాగారు, ఆయన అసలు పేరు రాఘవులు గారు బాబూ. చాలా మంచివాడు. నా రూపు రేఖలన్నీ ఆయన గీసినవే, ఆయన లేకపోతే నేనెక్కడున్నాను. 1979లో కాబోలు స్వర్గస్తులయ్యారు. చాలా బాధపడ్డాను ఆరోజున.

నేను: చివరగా, పాపన్నగారూ, ఇప్పటి తరానికి మీ సందేశం...

పాపన్న: సందేశమా!! నేనేపాటివాణ్ణి సందేశమివ్వటానికి. ఒక రెండు ముక్కలు చెప్తాను భగవంతుదు మన్ని సృష్టించినది ఒకరికొకరు ఉపయోగపడటానికి. ఇందాక చదువు గురించి ఆడిగావుకదా, నేను చదువుకున్నది ఒక్కటే, మన బ్రతుకు మనం బ్రతకటం, ఇతరులకి అడ్డుపడకూడదు. ఎవరి బ్రతుకులు వారివి, ఇంకొకళ్ళకు బాధకలిగించకుండా బ్రతకటమే నిజమైన చదువు. ఉట్టి అక్షరాలు నేర్చుకుని చదువగలిగినంతమాత్రాన అక్షరాస్యుడుకాదనుకుంటున్నాను.

నేను: చాలా చక్కటి విశేషాలు చెప్పరండి, చాలా ధన్యవాదాలు. మరి నాకు శలవు ఇప్పించండి. నమస్కారం.

పాపన్న: అలాగేనాయనా. ఉండు ఉండు నా బండి తీస్తాను, మీ ఇంటిదాకా దిగబెట్టి వస్తాను (అని లేచారు)

పాపన్న గారిని నేను వెళ్ళగలనని ఆయనను సముదాయించి మళ్ళీ కూచోబెట్టి, నేను ఇలా చక్కా వచ్చాను.
నాకు తెలుసు మీరు అడుగుతారని, పాపన్న కథలు సినిమాగా తీస్తే ఎవరు వెయ్యగలరు ఈ వేషం అనేకదూ? నా ఉద్దేశ్యంలో బాలయ్య అయితే (మీరు అనుకునే బాలయ్య కాదండి బాబు! అసలు బాలయ్య నేరము శిక్ష లాంటి మంచి సినిమాలు తీసి కొన్ని చక్కటి వేషాలు కూడా వేసాడే ఆయన)
**************************************************************************
ఈ వ్యాసం, అందించినవారు శ్రీ శివరామ ప్రసాదు కప్పగంతు - సాహిత్య అభిమాని
**************************************************************************