24, నవంబర్ 2009, మంగళవారం

పాత చందమామలు ఏమైపోయ్యాయి

తిరుపతి తిరుమల దేవస్థానం వారి ఆధ్వర్యంలో చందమామ సంచికలన్నీ డిజిటైజు చెయ్యబోతున్నారన్న వార్త చదివిన చందమామ అభిమానులందరూ ఎంతగానో ఆనందించారు.

వారి కలలు నిజం చేస్తూ, కొంతకాలానికి తెలుగు చందమామలు మొదలు పెట్టినప్పటినుంచి (జులై 1947) డిజిటల్ ఫైళ్ళుగా పి డి ఎఫ్ రూపంలో ఉలిబ్.ఆర్గ్ వెబ్‌సైటులో దర్శనమిచ్చాయి. అలాగే చందమామ వారు కూడ తమ వెబ్‌సైటులో ఈ చందమామ ఫైళ్ళను ఉంచి డౌన్లోడ్ సౌకర్యంకూడ కలిగించారు.

రెండుచోట్ల చందమామల పాత సంచికలన్ని లభ్యం కావటం, చందమామవారు ఎటువంటి షరతులు లేకుండా డౌన్లోడ్ వారిసైటులోనే అనుమతించటం చందమామ అభిమానులకు ఆనందం కలిగించింది. ఎంతోమంది ఆ ఫైళ్ళను డౌన్లోడ్ చేసుకుని, తమ వద్ద భద్ర పరుచుకుని చదివి ఆనందిస్తున్నారు. తెలుగు పత్రికా ప్రపంచంలో పాత సంచికలన్ని తమ వెబ్ సైటులో ఉంచిన ఘనత చందమామవారిదే, మరే ఇతర పత్రిక ఇంతవరకు ఇటువంటి మంచి పని చెయ్యలేకపోయింది.

కొంతకాలానికి, చందమామ వారి వెబ్ సైటులో డౌన్లోడ్ సౌకర్యం తొలగించబడి, పి డి ఎఫ్ ఫైళ్ళ స్థానంలో ఫ్లాష్ ఫైళ్ళు దర్శనం ఇచ్చాయి. ఇవి కూడ బాగున్నాయి, చక్కగా పాత చందమామ చదువుతున్న అనుభూతి కలుగుతున్నది. కాకపొతే అవి చదవలంటే ఇంటర్ నెట్‌కు తప్పనిసరిగా అనుసంధానమై ఉండాలి.

ఉలిబ్.ఆర్గ్ లో డౌన్లోడ్ అవకాశం కొనసాగింది. కాని ఇప్పుడిప్పుడే అనేకమంది చందమామ అభిమానులు ఉలిబ్.ఆర్గ్ వెబ్సైటుకు వెళ్ళి పాత
చందమామలను చూద్దామని ప్రయత్నిస్తే అసలు కనపడటంలేదట. నేను కూడ్ ఈరోజు ఎంత ప్రయత్నించినా, ఎన్ని రకాలుగా వెదికినా చందమామలు కనపడలేదు.

ఏమయ్యింది?? చందమామలను నలుగురికీ కనపడే సైటునుంచి తొలగించారా మరిప్పుడు ఎక్కడ దొరుకుతాయి??

పాత చందమామల ప్రతులు ఇప్పుడు ఎలాగూ దొరకవు, ఒకవేళ ఎవరైనా పెద్దవారు అప్పటి ప్రతులను కాపాడి పదిలపరిచినా, అవి కాలవశాన సరైన స్థితిలో ఉంటాయా అని సందేహం. ఇటువంటి పరిస్తితులలో, డిజిటల్ రూపంలో ఉన్న పాత చందమామలు, చందమామ అభిమానులను ఎంతగానో అలరించాయి, ఇప్పుడున్న చందమామ సర్కులేషన్ పెరగటానికి బాగా దోహదపడ్డాయి. ఇప్పటి పిల్లలు, పాత చందమామలగురించి ఏమీ తెలియని 20-30సంవత్సరాల వయస్సువారు, ఈ డిజిటల్ చందమామలను చూసే, ప్రింటు చందమామ పట్ల ఆకర్షితులైనారన్న విషయం ఒక నిజం.

ఉలిబ్ వారు ఎందుకు ఈ డిజిటల్ ఫైళ్ళను తీసేశారో తెలియదు. చందమామ అభిమనులందరూ, కింద ఇచ్చిన లింకు నొక్కి ఉలిబ్ వారికి ఈ విషయంలో తమ తమ అభిప్రాయాలని తెలియచెయ్యటం వల్ల ఏమన్న ఉపయోగం ఉంటుందేమో!

అభిప్రాయం

22, నవంబర్ 2009, ఆదివారం

జయదేవ్ ఆత్మకథ - గ్లాచ్చూ మీచ్యూ

strong>
తెలుగు కార్టూన్ ప్రపంచంలో ఎంతగానో పేరెన్నికగన్న మన అభిమాన వ్యంగ్య చిత్రకారులు శ్రీ జయదేవ్ గారు. వారి కార్టూన్లు చూసి ఆనందించనివారు లేరు. కొన్ని దశాబ్దాలుగా వారు మన తెలుగు పాఠకులను తమ ఉజ్వలభరితమైన కార్టూన్లతో ఎంతగానో నవ్విస్తున్నారు, ఆలోచింప చేస్తున్నారు. ఉంటున్నది తమిళనాట అయినా వారి పరిశీలనా శక్తితో, ఎన్నెన్నో అద్భుతమైన కార్టూన్లు వేసి తెలుగువారికి నవ్వుల పెన్నిధిగా పేరు తెచ్చుకున్నారు.

ఇన్ని కార్టూన్లు వెస్తూ వచ్చిన జయదేవ్ గారి గురించి సామాన్య పాఠకులకు తెలిసినది అతి తక్కువ. వారు ప్రొఫెసర్ గా మదరాసులో ఉంటారు అని తప్ప వారి గురించి పెద్దగా తెలియదు. ఈ లోటు తీర్చటానికి అన్నట్టుగా, వారు తమ ఆత్మ కథను ప్రచురించారు. ఒక నాలుగైదు రోజుల క్రితం నేను వారికి ఒక మైలు ఇస్తూ, వారిని వారి ఆత్మ కథను పూర్తిగా కార్టూన్లలో ప్రచురించమని అబ్యర్ధించాను. అప్పటికే తమ ఆత్మకథకు తుది మెరుగులు దిద్దుతున్నట్టున్నారు, నాకు వివరాలు పంపారు.

జయదేవ్‌గారి ఆత్మకథకు పేరు గ్లాచ్చూ మీచ్యూ, ఆంగ్లంలో గ్లాడ్ టు మీట్ యు కు తెలుగు రూపం. సామాన్యంగా కొత్తవారిని కలుసుకున్నాపుడు మిమ్మల్ని కలవటం సంతోషకరం అని చెప్పటం సాంప్రదాయం. అదే పధ్ధతిని ఆచరిస్తూ, జయదేవ్ గారు మనకు కొత్త కాక పోయినా, మనలను కలుసుకోవటం తనకు ఎంత ఆనందంగా ఉన్నదో తెలియపరుస్తూ ఈ చక్కటి టైటిలు తన ఆత్మ కథకు పెట్టటం ఎంతో ముదావహం.

జయదేవ్ గారి ఆత్మకథ గురించి ప్రముఖ రచయిత విమర్శకురాలు,శ్రీమతి మాలతీ చందూర్ ఈ విధంగా అన్నారు.

"...జయదేవ్‌గారు ఉయ్యాల బల్ల మీద కూచుని ఇటూ అటూ, ముందుకూ వెనక్కీ ఊగుతూ తన జీవిత కథని, అనుభవాలని ఆత్మ స్తుతి-పరనిందా లేకుండా నమ్రతతో గ్లాచ్చూ మీచ్చ్యూ లో చెప్పుకున్నారు"


కార్టూన్ ప్రేమికులూ మరియు జయదేవ్ అభిమానులు తప్పనిసరిగా చదువవలసిన పుస్తకం గ్లాచ్చు మీచ్చ్యూ. ఈ అపుస్తకం దొరికే చోటు:

VNR Book World
Chowdepalle- 517257
Chittoor Dt (AP)
Ph:08581_256234
e-mail: vijayavani_printers@yahoo.com

పుస్తకాన్ని ప్రచురించి మనందరికి అందించిన వారు జయదేవ్ గారి స్నేహితులు సాహిత్య అభిమాని శ్రీ నాయుని కౄష్ణమూర్తిగారు.

ఈ పుస్తకం నుండి మచ్చుకి ఒక పుట




20, నవంబర్ 2009, శుక్రవారం

చందమామ సీరియళ్ళు-3

సీరియళ్ళు డౌన్లోడ్ చేసుకోవటానికి బొమ్మమీద నొక్కండి.



విచిత్ర కవలలు(రంగుల్లో)










చివరిగా, ulib.org లోలేని చందమామలు chandamama.com లో 1980 వరకూ వున్నాయి. వాటిని డౌన్లోడ్ చేసేందుకు Downloader ప్రోగ్రాం ని కాస్త మార్చాను. ఇదివరకట్లాగే ఇక్కడినించి ప్రోగ్రాం ని దింపుకుని jre1.6.0_05\bin\java -jar Downloader.jar -help అని ఇస్తే మీకు విషయం అర్థమయిపోతుంది. క్వాలిటీ మాత్రం ulib వాడిదే బాగుందని నాకనిపించింది. chandamama.com లో బొమ్మలు అంత స్పష్టంగా లేవు.

చందమామ సంపాదకులు శ్రీ కొడవటిగంటి


శ్రీ కొడవటిగంటి కుటుంబరావు
చందమామ అభిమానులుగా మనం ఇన్నాళ్లూ చిత్రా, ఆచార్య, శంకర్, వపా వంటి అలనాటి అపరూప చిత్రకారుల జ్ఞాపకాలను తల్చుకుంటున్నాం, రాస్తున్నాం, సమాచారం పంచుకుంటున్నాం. కాని చందమామ అనధికారిక సంపాదకుడిగా 30 ఏళ్లపాటు అవిశ్రాంతంగా కృషి చేసి చందమామకు రూపురేఖలు దిద్దిన ఓ గొప్ప మనిషి పాత్ర గురించి తెలుసుకున్నది తక్కువేనేమో అనిపిస్తుంది.

కథా సాహిత్య చరిత్రలో ఇంత సుదీర్ఘ కాలం ఓ పత్రిక సంపాదకీయ బాధ్యతలు స్వీకరించి అజ్ఞాతంగా, నిరామయంగా, నిర్విరామంగా కృషి చేసిన ఘటనలు ప్రపంచ చరిత్రలో కూడా అరుదుగా ఉంటాయి. ఆయన కుటుంబరావు గారు. చందమామ అనధికారిక సంపాదకులుగా పనిచేసినవారు. చనిపోయేంతవరకు తాను ఏ బాధ్యతలలో ఉన్నది కూడా బయటి ప్రపంచానికి తెలియనంత అజ్ఞాత వాసంలో ఆయన ఉండిపోయారు.

కథకుడిగా, వ్యాసరచయితగా, సాహిత్యకారుడిగా, నవలాకారుడిగా గల్పికా కర్తగా, సైన్స్ వ్యాసాల రచయితగా ఆయనను ఈ ప్రపంచం చాలా కాలంగా గుర్తు పెట్టుకునే వస్తోంది. కానీ ఇన్ని వ్యాపకాల మధ్య, వ్యాసంగాల మధ్య 30 ఏళ్ల పాటు తాను జీవిక కోసం చేస్తూ వచ్చిన ఓ అద్భుత కృషిని ఈ ప్రపంచం మర్చిపోయిందేమో..

అలా అని ఈ సుదీర్ఘ అజ్ఞాతవాసంలో తాను చేసిన, చేస్తూ వచ్చిన పని చిన్నదేం కాదు. తెలుగు కథా ప్రపంచాన్ని ఉద్దీప్తం చేసిన ఓ గొప్ప చరిత్రలో ఆయన కీలక భాగస్వామి. భారతీయ కథా సాహిత్య వినీలాకాశంలో చందమామను సమున్నతంగా నిలిపిన ఓ అద్భుత మానవ కృషిలో ఆయనది శిఖరస్థానం.

గాంధీగారి శైలిగా చక్రపాణి గారి వంటి చండశాసనులనుంచే పొగడ్తలందుకున్న రచనాశైలి ఆయనకే స్వంతం. చందమామ స్వర్ణయుగంగా చరిత్రకెక్కిన ఆ మూడు దశాబ్దాల కాలంలో చందమామలో ప్రచురించిన ప్రతి కథను ఆయన శ్వాసించారు. చందమామ ప్రతిపేజీలో, ప్రతి కథలో, ప్రతి దిద్దుబాటులో ఆయన మార్కు జగత్ప్రసిద్ధం.

కాని చందమామకు ఆయన అందించిన “గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్” చరిత్ర పుటలలో మరుగునపడింది. 1940-1960ల నాటి కోస్తా మధ్యతరగతి సామాజిక జీవితానికి సాహిత్య రూపమిచ్చిన మేటి రచయితగా, శాస్త్రసాంకేతిక విషయాలపై మేటి రచనలు చేసి మెప్పు పొందిన పాపులర్ సైన్స్ రచయితగా, సంగీతంలో అభినివేశం కలవాడిగా, సినీ విమర్శకుడిగా ఇలా సాహిత్యానికి చెందిన పలు విశేషణాలతో ఆయనను ప్రపంచం గుర్తు పెట్టుకొందే కాని చందమామకు ప్రాణప్రతిష్ట చేసిన ఆయన సంపాదక ప్రతిభను ఈలోకం తగినంతగా గుర్తించలేదనే అనుకోవాలి.

ఇప్పుడు శత జయంతి ఉత్సవ సందర్భంగా కూడా అక్కడక్కడా కొన్ని చోట్ల ఆయన చందమామలో పనిచేశారట వంటి పొడిపొడి మాటలు చెప్పి, రాసి తప్పించుకుంటున్నారు తప్పితే చందమామతో ఆయన అనుబంధం గురించి ఎవరూ పెద్దగా ప్రస్తావన తేలేదు.

చందమామ ప్రియులు, శ్రీ రోహిణీ ప్రసాద్ గారి వంటి వ్యక్తులు మాత్రమే చందమామతో కుటుంబరావు గారి సంబంధం గురించి గత కొన్ని సంవత్సరాలుగా రాస్తూ వచ్చారు తప్పితే ప్రధాన స్రవంతికి చెందిన వారు, పేరు మోసిన విమర్శకులు, సాహిత్య సంస్థలు చందమామతో కుటుంబరావు గారి బంధం గురించి దాదాపుగా విస్మరించారనే చెప్పాలి. చందమామలో తొలినుంచి ఎవరు ఏ పనులు చేసారు అనే కనీసపాటి వివరాలను కూడా బయటి ప్రపంచానికి తెలియనీకుండా చేసిన చందమామ అలనాటి యాజమాన్యం పాలసీ కూడా ఇందుకు తోడయిందేమో చూడాలి.

అందుకే కుటుంబరావు గారి ఈ శతజయంతి ఉత్సవ సందర్భంగా అయినా సరే, మళ్లీ ఓసారి ఆయన దార్శనికతకు నిదర్శనంగా నిలిచిన ఇతర సాహిత్య ప్రక్రియలను అలా పక్కన బెట్టి -వాటిపై చాలా మందే రాస్తున్నారు కదా- చందమామ సంపాదకుడిగా ఆయన మిగిల్చిపోయిన ఓ గొప్ప ట్రెండ్‌ను మరోసారి మననం చేసుకుందాం.

ఈ క్రమంలో దీన్నొక స్వంత రచనగా కాక చందమామ ఉజ్వల చరిత్రలో కుటుంబరావుగారి పాత్ర, ప్రభావాల గురించి ఇప్పటికే చందమామ అభిమానులు, చందమామ ప్రియులు పేర్కొంటూ వచ్చిన పలు అంశాల సమాహారంగా మాత్రమే ఈ కథనాన్ని చూస్తే మంచిదనుకుంటున్నాను.

కొడవటిగంటి శ్రీ రోహిణీ ప్రసాద్(కుటుంబరావుగారి కుమారుడు)జ్ఞాపకాలు


పిల్లల మాసపత్రికగా దాదాపు అరవయ్యేళ్ళుగా అగ్రస్థానంలో ఉన్న “చందమామ”కు మా నాన్న కొడవటిగంటి కుటుంబరావుగారు “పేరు లేని” ఎడిటర్‌గా చాలా ఏళ్ళు పని చేశారు…. “చందమామ” తొలి సంచిక 1947 జూలైలో విడుదలైంది. ఆ పత్రిక పూర్తిగా చక్రపాణిగారి మానసపుత్రిక. తెనాలిలో ఆయనకు మా నాన్నగారితో చిన్నతనం నుంచీ పరిచయం ఉండేది. “చందమామ” ప్రారంభించినప్పుడు మా నాన్న ఆంధ్రపత్రికలో పనిచేస్తూ ఉండేవారు.

అందువల్ల “చందమామ” పెట్టినప్పటినుంచీ చక్రపాణిగారు పిలుస్తూనే ఉన్నప్పటికీ 1951దాకా అందులో చేరలేదు. పైగా ఎక్కువ జీతం కూడా ఆఫర్‌ చేశారు. అప్పట్లో నాలుగు రాళ్ళ కోసం తరుచుగా ఉద్యోగాలు మారడం మర్యాదగా అనిపించేది కాదేమో….. “చందమామ” తొలిసంచికల్లో పిల్లల ముద్దుమాటలుండేవి. “చూశారా పిల్లలూ”, “ఏమోయి నేస్తం” వగైరా. ఇది చక్రపాణిగారికి అంతగా నచ్చినట్టులేదు.

మా నాన్నగారికి బాధ్యత వప్పచెప్పాక కథల తీరు మారిపోయింది. కథలన్నీ సాఫీగా, పెద్దల భాషలోనే రావడం మొదలైంది. క్లుప్తంగా, ఏ విధమైన యాసా చోటు చేసుకోకుండా సూటిగా సాగే మా నాన్న శైలిని చక్రపాణిగారు “గాంధీగారి భాష” అని మెచ్చుకునేవాడట. ఇంకెవరు రాసినా ఆయనకు నచ్చేది కాదు.

దాదాపు మొదటినుంచీ ఉన్నవారిలో దాసరి సుబ్రహ్మణ్యం గారొకరు. మొదటి రంగుల సీరియల్‌ ఆయన స్పెషాలిటీ. తోకచుక్క, మకరదేవత, ముగ్గురు మాంత్రికులు మొదలైన అద్భుతాల నవలలన్నీ ఆయనవే. ఎందుచేతనో చక్రపాణిగారికి ఈ తరహా రచనలు నచ్చేవి కావు. పాఠకులకు మాత్రం అవి చాలా నచ్చేవి. ఒక దశలో వాటిని మాన్పించి బంకించంద్ర నవలను ప్రవేశపెట్టగానే సర్క్యులేషన్‌ తగ్గింది. దాంతో దాసరివారికి మళ్ళీ పనిపడింది. చక్రపాణిగారి టేస్టూ, పాఠకుల టేస్టూ వేరువేరని రుజువయింది.

ఇక తక్కిన కథలూ, శీర్షికలూ అన్నీ మా నాన్నే రాసేవారు. రచయితలుగా పత్రికలో మాత్రం కల్పితమైన పేర్లు పడేవి. పత్రికకు పేరు రావాలి తప్ప రచయితలకు పేరు రాకూడదనేది చక్రపాణిగారి సిద్ధాంతం. అదే జరిగింది కూడా. కొద్దిమంది రచయితలూ, జర్నలిస్టులూ, పరిచయస్థులూ తప్ప తక్కినవారికి ఎవరు రాస్తున్నారో తెలిసేదికాదు. మా నాన్న కూడా తన ఒరిజినల్‌ రచనలేవీ వెయ్యలేదు. మొత్తం మీద “చందమామ”కు త్వరలోనే ఎనలేని ప్రజాదరణ లభించసాగింది.

మొదట్లో పాఠకులు పంపిన కథలవంటివి దాదాపుగా ఏవీ ఉండేవి కావు. ఒకవేళ ఎవరైనా స్వంతంగా కథలు రాసి పంపినా అందులో సెలెక్టయిన వాటిని అవసరమనిపిస్తే “మెరుగుపరిచి” మా నాన్న తిరగరాసేవారు. మరే భాషలోనైనా ఎవరైనా కథ పంపితే అది క్లుప్తంగా ఏ ఇంగ్లీషులోకో అనువాదం అయి వచ్చేది. అది నచ్చితే తెలుగులో తిరగరాయబడి, మళ్ళీ మామూలు ప్రోసెస్‌ ద్వారా అన్ని భాషల్లోకీ తర్జుమా అయేది.

ఈ తతంగమంతా జరుగుతున్నట్టు ఎవరికీ తెలియకపోయినా తాము పంపిన కథ తమ పేరుతోనూ, కొంత పారితోషికంతోనూ, తాము పంపినదానికన్నా మెరుగైన రూపంలోనూ అచ్చయేది కనక ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు.

“చందమామ” ఆఫీసులో అన్ని ప్రపంచదేశాల జానపద కథలూ ఉండేవి. ఏ కథనైనా మన దేశానికీ, తెలుగు భాషకూ సరిపోయేట్టు మలిచి రాయడం మా నాన్నగారి పని. అంతేకాక ఒరిజినల్‌ బేతాళ కథలన్నీ అయిపోయాక మామూలు కథలను ఎంపిక చేసి, అందులోఒక క్విజ్‌ ప్రవేశపెట్టి, దానికి విక్రమార్కుడి చేత సమాధానం చెప్పించడం ఆయనకు ఒక కసరత్తుగా ఉండేది. బేతాళ కథలు మొత్తం ఇరవై అయిదేనని చాలామందికి తెలియకపోవచ్చు కూడా. కథల క్వాలిటీ ఎంత బావుండేదంటే విశ్వనాథ సత్యనారాయణగారు క్రమం తప్పకుండా ప్రతి సంచికనూ తెప్పించుకుని చదివేవారట.

ఇక సర్క్యులేషన్‌ విషయంలో హిందీ ఎడిషన్‌ అన్నిటికన్నా ఎక్కువగా అమ్ముడయేది. 1966లో మా కుటుంబమంతా ఢిల్లీ, బెనారస్‌ మొదలైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మా నాన్నకు తెలుగు రచయితగా కాక హిందీ చందమామ వల్ల ప్రతి చోటా ఘనస్వాగతం లభించింది. 1957 ప్రాంతాల్లో “చందమామ” ఇంగ్లీష్‌ ఎడిషన్‌ కూడా వేశారు. అది అన్ని విధాలా తక్కిన సంచికల్లాగే ఉండేది. అదంతా మా నాన్నగారే రాసేవారు.

1952 ప్రాంతాల్లో నాగిరెడ్డిగారు కినిమా అనే సినీ మాసపత్రికను మొదలుపెట్టారు. అందులో కూడా శీర్షికలూ, వ్యాసాలూ అన్నీ మా నాన్నగారే రాసేవారు. అది రెండు మూడేళ్ళకే ఆగిపోయింది. రంగులు లేకపోయినా కంటెంట్‌ విషయంలో అది ఆ తరవాత వచ్చిన విజయచిత్ర కన్నా ఎన్నో రెట్లు బావుండేది. అప్పుడే పైకొస్తున్న నటీనటులూ, సినీ గాయనీ గాయకులూ అనేకమందితో మా నాన్న జరిపిన ఇంటర్వ్యూలు ఇప్పుడు చదవటానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

తెలుగులో మాట్లాడడం అలవాటైన మా పిల్లలవంటివారికి “చందమామ” చదువుతూ ఉంటే భాషతో మరికొంచెం పరిచయమూ, తెలుగు నుడికారమూ పట్టుబడతాయని నా ఉద్దేశం. పిల్లలను తెలుగు చదవమని ప్రోత్సహించడానికి “చందమామ” మంచి సాధనమని నాకనిపిస్తుంది. ఎందుకంటే అమెరికాలో ఉంటూ ఇంటర్నెట్ మీద తెలుగు టీవీ వార్తలను చూస్తున్న నాకు ఆంధ్రప్రదేశ్‌లోనే తెలుగు మరిచిపోతున్నారన్న వాదనలో కొంత నిజం లేకపోలే దనిపిస్తోంది. పిల్లలకు ఎంటర్‌టైన్‌మెంట్‌తో బాటు తెలుగు చదవడం రావాలంటే “చందమామ” వంటిది చదవడం ఒక్కటే మార్గమేమో.

“చందమామ” మొదలుపెట్టినప్పుడు తెలుగుభాషను గురించిన ఇటువంటి భయాలేవీ ఉండేవి కావుగాని పిల్లలకు ఆరోగ్యకరమైన సాహిత్యం అందించాలనే ఉద్దేశం మాత్రం ఉండేది. భూతప్రేతాల గురించిన భయాలు తగ్గడానికీ, జానపద సాహిత్యంలో తప్పనిసరిగా ఉండే కొన్ని మూఢవిశ్వాసాలు మితిమీరకుండా చూడడానికీ గట్టి ప్రయత్నాలే జరిగాయి. సర్కార్‌ వంటివారి చేత ఇంద్రజాలం గురించిన వివరాలను ప్రచురించడంతో పిల్లలకు కొన్ని కిటుకులు తెలుస్తూ ఉండేవి. పురాణాల్లో కూడా వాల్మీకి రామాయణాన్నే అనుసరిస్తూ, ఇతర రామాయణాల వెర్రిమొర్రి అంశాలేవీ కథలోకి రాకుండా చూసే ప్రయత్నం జరిగింది.

1969లో బాలసాహిత్యం గురించి రాసిన ఒక వ్యాసంలో మా నాన్నగారి దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన లెక్కన “బాలసాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావనలను బలంగా నాటాలి. ధైర్యసాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలుచేస్తాయి…పిల్లలలో దౌర్బల్యాన్ని పెంపొందించేది మంచి బాలసాహిత్యం కాదు…దేవుడి మీద భక్తినీ, మతవిశ్వాసాలనూ ప్రచారం చెయ్యటానికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు…కథలో నెగ్గవలసినది మనుష్య యత్నమూ, మనిషి సద్బుద్ధీనూ”. ఇది “చందమామ” కథల్లో ఎక్కువగా కనబడుతుందని అందరికీ తెలిసినదే….”


శ్రీ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి చందమామ జ్ఞాపకాలు


శ్రీ రావి కొండలరావు (ప్రముఖ నటులు,సినీ చరిత్రకారులు)

చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన -కుటుంబరావుగారు- అగ్రగణ్యుడు. 1952, జనవరి 1 నుండి చనిపోయే వరకూ చందమామలో పనిచేసి ఆ పత్రిక అత్యున్నత స్థితికి రావటాని ఎంతో కృషి సలిపాడు. విజయచిత్ర పత్రిక ఆరంభం కాబోతున్న రోజుల్లో నేను ఆంధ్రజ్యోతి కి సినిమా కాలం రాస్తూ ఉండేవాడిని. మా వాళ్లు సినిమా పత్రిక ఆరంభిస్తున్నారు. మీరేమైనా రాస్తారా? అని అడిగారు ఒకసారి. తప్పకుండా అన్నాను. ఆయనే నన్ను తీసుకువెళ్లి ప్రొప్రయిటర్లకి పరిచయం చేసి చెప్పారు. నేను చందమామ పబ్లికేషన్స్ లోకి రావడానికి ఆ విధంగా ఆయన కారకులైనారు. పదిహేను సంవత్సరాలపాటు పక్కపక్కగా ఉన్న ఆఫీసుల ద్వారా మా పరిచయాలు, స్నేహాలు మరింత పెరిగాయి.

చందమామ ప్రధాన సంపాదకుడిగా ఆయనకున్న స్థాయి, గౌరవం ఎనలేనివి. అందరికీ ఆయనంటే గౌరవం, భక్తీ, తన స్థాయికి ఉండవలసిన కనీసపు అహంకారం లేని మనిషి ఆయన. సినిమా మీద ఏదైనా వ్యాసం తడితే రాసుకొచ్చి నాకిస్తూ ఏమండీ మీ పత్రికలో వేసుకుంటారా, చూడండి అనేవారు నాకు దిమ్మ తిరిగేలా. ఆయన దగ్గరికి కథలు పట్టుకు వెళ్లిన వాడిని, ఆయన ద్వారానే చందమామ పబ్లికేషన్స్‌లోకి వచ్చిన వాడిని, ఎన్నే అడిగి తెలుసుకుంటున్న వాడిని, ఒకసారి కొండలరావును రమ్మను అని కబురు చేసి ఆ వ్యాసం నాకు ఇచ్చి మీ పత్రికలో వెయ్యండి అని చెప్పగల హక్కు అధికారం ఉన్న మనిషి ఆయన. రమ్మంటే వెళ్లమూ! వెయ్యమూ!

(రావి కొండలరావు -కౌముది అక్టోబర్ 2007 సంచికనుంచి)

శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు (ప్రముఖ సంగీత దర్శకులు)జ్ఞాపకాలు


వాహినీ, విజయావారికి అత్యంత సన్నిహితుడుగాను, చందమామ, యువసంపాదక వర్గంలో నాగిరెడ్డి, చక్రపాణిలతో సగౌరవంగా ఉంటూ ఉండి కూడా ఆయన సినిమాలకు రాసినదాని కన్నా ఆ పత్రికలకు ఇంకా భారతి వంటి ఇతర పత్రికలకు కూడా ఎన్నో కథలు రాసాడు. తన పేరుతోను, మారుపేర్లతోను రాసినా, కొడవటిగంటి తర్కబద్దమైన వాక్యరచన, కథాకథన పద్ధతి, కొన్ని రకాల పాత్రల మూసపోతా – ఇది కొడవటిగంటి రచనే అని తెలిసిపోయేటంతటి వ్యక్తిగత శైలి ఆయనది. ఆయన వ్రాసిన మానవ సమాజ పరిణామ చరిత్ర చాలా హేతుబద్దంగాను, కాదనడానికి వీలు లేనట్లుగాను ఉంటుంది.

(బాలాంత్రపు రజనీకాంతరావు – కౌముది.నెట్ అక్టోబర్ 2007)

మాధవపెద్ది గోఖలే గారి జ్ఞాపకాలు


పిల్లల మాసపత్రిక ‘చందమామ’ను కూడా చక్రపాణి అప్పుడే ప్రారంభించారు. అప్పటికి ఇంకా ఏ ఉద్యోగమూ దొరకని కక్కయ్య 1949లో ఈసారి ‘ఆంధ్ర దినపత్రిక’లో చేరి, 1952 నాటికి ‘చందమామ’కు ఎడిటరుగా చేరాడు. ఆయన జీవితంలో ఈ ఒక్క ఉద్యోగమే 1952 నుండి 1980 వరకు స్థిరంగా నిలిచిపోయింది. ఆయన చాలా గట్టి స్వతంత్రభావాలు గలవాడు. తన రచనల విషయంలో, ప్రత్యేకించి జీతండబ్బుల కోసం ఏనాడూ తన అభ్యుదయ పంథానుండి దిగజారలేదు.

ఆయన భావాలు తన ఉద్యోగాలు ఊడేందుకు ఎక్కువచోట్ల పనిచేసినై. ‘నాకు ఉద్యోగాలు అచ్చిరావు’ అని ఆయన అన్నాడంటే రచయితగా తన స్వాతంత్ర్యానికీ, చేసే ఉద్యోగాలకూ వైరుధ్యాలొస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఆయన సత్ఫలితాలకు “ఆంధ్రవారపత్రిక’ తరఫున కక్కయ్యకో చిన్న యోగ్యతాపత్రం లభించింది. ‘మీ హయాంలో వారపత్రిక కవరుపేజీ చాలా ముచ్చటగా ఉంటున్నదండీ’ అన్నదే ఆ పత్రం. అంటే పత్రిక విలువా (పాఠకుల లేఖల్లో ఈ విషయం వ్యక్తమయేది), సర్కులేషనూ పెరగటం పరిగణనలోకి రాక, ఆయన మెరుగుపరచింది కేవలం అట్టమీద బొమ్మ మటుకేనని చెప్పటం. కక్కయ్య వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.


కొడవటిగంటి కుటుంబరావు–జీవితపు పరవళ్లు">

శ్రీ శివరాం ప్రసాద్(సాహిత్య అభిమాని)జ్ఞాపకాలు

చక్రపాణి-నాగిరెడ్డి గార్లచే 1947లో మొదలు పెట్టబడినప్పటికీ, 1952లో కుటుంబరావుగారు సంపాదకుడిగా ఆయన ఆద్వ్యర్యం లోకి చందమామ (ఒకప్పటి ప్రముఖ మాస పత్రిక) వచ్చేవరకు, ఒక అనామక పత్రికగానే ఉన్నది. సంపాదకుడిగా ఆయన పేరును చందమామ వారు ఎప్పటికి ఆ పత్రికలో ప్రచురించకపోయినా, కుటుంబరావుగారు తీసుకున్న శ్రధ్ధ (చక్రపాణి నాగిరెడ్డిగార్ల సహకారంతో) చందమామను తెలుగు పత్రికా లోకంలో తలమానికంగా నిలబెట్టింది. ఆయన చందమామను నడిపిన కాలం 1952 నుండి 1980లో ఆయన మరణించేవరకు, ఆ పత్రికకు స్వర్ణయుగమే.

చిన్న పిల్లల మనస్సులు ఎంతో సున్నితంగా ఉండి, విషయాలను ఎల్లకాలం గుర్తు పెట్టుకునే దశలో ఉంటాయి. ఆ విషయం బాగా తెలిసిన కో.కు గారు, ఆ చిన్నారి పాఠకులకోసం అన్ని కథలను, తన శైలిలో చెక్కి కథా శిల్పాలుగా చేసి వదిలేవారు. ప్రతి కథ (ఎవరు వ్రాసినా సరే) కుటుంబరావుగారి చేతిలో పడి ఆణిముత్యంగా మారిపొయ్యేది. ఇవ్వాల్టికి పాఠక ఆదరణ కోసం వెంపర్లాడుతూ ఆ పత్రిక దశాబ్దాలనాటి కథలనే మళ్ళీ మళ్ళీ పునర్ముద్రణ చేస్తోంది అంటే ఆ కథల గొప్పతనం అర్ధం చేసుకోవచ్చును

అంతర్లీనంగా ప్రతి కథలోను, ఒక నీతి సూత్రం, సంభాషణల్లో తర్కం, మూఢనమ్మకాలను మూలాల్లోకి వెళ్ళి ప్రశ్నించటం వంటివి ఆ రోజులలో చందమామ చదువుతూ పెరిగిన పిల్లలకు (మూదు నాలుగు తరాలవరకు) దొరికిన పెన్నిధి, వారి జీవితాలను ప్రభావితం చేసి నలుగురూ కలసి జీవించే సరైన పధ్ధతిలోకి మళ్ళించినాయి. ప్రభుత్వం వారు పిల్లలకు ఇది మంచి, ఇది కూడదు అని నిర్దేసించిన పాఠ్య పుస్తకాలకంటే, భాషా పరంగాను, అలోచనా పరంగాను, చందమామ కథలు అప్పటి పిల్లలకు (అనేకమార్లు పెద్దలకు కూడ) చక్కటి “చదువు” నేర్పాయి.

చందమామ పత్రికకు ఆయన దిద్దిన మెరుగులలో అన్నిటికన్నాఎక్కువగా తళతళలాడేది బేతాళ కథల శీర్షిక , అసలులో కథలు పాతిక మాత్రమే! కాని, చందమామలో వందల కొలది మామూలు కథలను బేతాళ కథలుగా ఎంతో నేర్పుగా మార్చి ప్రచురించారు. సాధారణమైన పిల్లల కథల్లోంచి, కథ చివర, ప్రతి నెలా, ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం, దానికి చక్కటి సమాధానం చెప్పించడం, సామాన్య విషయం కాదు. అతి కష్టతరమైన ఈ పనిని, దశాబ్దాల పాటు నిరాఘాటంగా కొనసాగించడం,

తెలుగు జానపద సాహిత్యంలోని పేరొందిన ఒక కథా సంపుటిని తీసుకుని, ఆ కథలను ప్రచురించటమే కాక, అదే పంధాలో అనేక ఇతర కథలను ప్రచురించి, చిన్న పిల్లలకు (పెద్దలకు కూడ) చక్కటి ఆలోచనా పద్ధతి, సందేహాలను ప్రశ్నల రూపంగా వ్యక్తపరచటం, తర్కంతో కూడిన చక్కటి సమాధానాలు ఇచ్చే నేర్పరితనం ఈ శీర్షిక ద్వారా కుటుంబరావుగారు నభూతో నభవిష్యతిగా రూపొందించారు ఈ బేతాళ కథలు. తెలుగు పత్రికా చరిత్రలో అన్ని శీర్షికలకన్న ఎక్కువకాలం ప్రచురించబడిన, ఇంకా ప్రచురించబడుతున్న శీర్షిక ఇది ఒక్కటే అయి ఉండవచ్చును.ఈ చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక ఉన్నది మన కుటుంబరావుగారే.

ఈ మొత్తం ప్రక్రియ తానేదో గొప్పపని చేస్తున్నాని అనుకుంటూ చెయ్యలేదు. తన ఉద్యోగ ధర్మంగానే చేశారు.

మీకు తెలుసా! ఒక మహా రచయిత శతజయంతి ఈరోజు

శ్రీ కొడవటిగంటి కుటుంబరావు వ్యాఖ్యలు


సాహిత్యం నుండి ప్రజల్నీ, రాజకీయాల నుండి సాహిత్యాన్నీ, ప్రజల నుండి రాజకీయాలనీ రక్షించే ప్రయత్నాలు చూస్తూంటే నాకు నవ్వొస్తుంది.
నియంతల మీదా, నిరుద్యోగమ్మీదా, లాకౌట్ల మీదా, యుద్ధాల మీదా గొంతెత్తేందుకు కళాకారులకు హక్కు లేదు.., అది రాజకీయులకే ఉందనడం మూర్ఖత్వం. అణగదొక్కాలనుకునేవారే ఇలాంటి తలతిక్కవాదం చేస్తారు.
ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు; జీవితంలోని కష్టాల్ని తీర్చలేనిది ఆవిష్కరణా కాదు; జీవితంలోని ప్రతీ కోణాన్ని చూపించలేనిది సాహిత్యమే కాదు.......మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యమూ మారాలి … పాతకాలపు సాహిత్య పద్ధతులకే కట్టుబడి ఉండడమంటే మోసం చెయ్యడమే.....కులం మిథ్య, మతం మిథ్య, ధనమొకటే నిజం (పేదవాడైన అగ్రకులస్తుని కంటే డబ్బున్న దళితునికే ఎక్కువ పేరు ఉంటుంది.

చివరగా…

చందమామలో కుటుంబరావు గారి గురించి నా బ్లాగులో, చందమామ వెబ్‌సైట్‌లో ఈ 28న -ఆయనకు నూరేళ్లు- పరిచయం లేదా కథనం రాయమని ప్రోత్సహించిన ఘనత పూర్తిగా శివరాం ప్రసాద్ ‌గారికే దక్కుతుంది. నిన్ననే ఆయన “మీకు తెలుసా! ఒక మహా రచయిత శతజయంతి ఈరోజున” అనే పేరిట తన బ్లాగులో కుటుంబరావు గారి గురించి పెద్ద పరిచయం చేయడమే కాక చందమామ ఆన్‌లైన్‌లో, నా బ్లాగులో కూడా రాయమని పలుసార్లు ప్రోత్సహించారు.

గత పది రోజులుగా చందమామ కలెక్టర్స్ ఎడిషన్ తెలుగు అనువాదాల పనిలో ఉండి ఇక ఏపని కూడా పట్టించుకోకుండా ఉన్న సందర్భంలో ఈ మెయిల్స్ ద్వారా నాలుగైదు సార్లు హెచ్చరించి మరీ శివగారు నన్ను ముగ్గులోకి దింపారు. చందమామకు కుటుంబరావుగారు చేసిన దోహదం గురించి ఇంతవరకు లభ్యమవుతున్న సమాచారాన్ని అయినా ఒక చోట చేర్చాలనే ప్రయత్నంలో ఈ పరిచయంతో పాటు పెద్దల మాటలను కూడా ఈ పో‌స్ట్‌లో చేర్చాను. వీరందరి రచనలలోంచి విషయాన్ని తీసుకున్నందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదనే భావిస్తున్నాను.

Rajugaru, please do write in your excellent language about Kodavatiganti in YOUR BLOG.. Kodavatiganti was THE ONLY Editor of Chandamama. If you write an article in your Blog and also in online Chandmama, atleast now, after 29 years after the great writer and Editor’s demise (on the eve of his birth Centinary), the sin committed by Chandamama for not publishing his name as Editor can be exonerated to some extent.

You are free to use any of the articles I had written in my blog. Please do that.

I feel proud if contents in my blog are taken and quoted in online Chandamama when you write about the Centinary year of Shri Kodavatiganti Kutumbarao-the longest serving Editor by far. I am sure nobody can beat his record now!!!

Please do write an article on Shri Kodavatiganti Kutumbarao in Chandamama Online(Ko Ku being the longest serving Editor-unnamed of course).

Regards,
SIVARAMAPRASAD KAPPAGANTU
FROM BANGALORE, INDIA

శివరాం ప్రసాద్ గారూ, కుటుంబరావు గారిపై ఈ పరిచయం కాసింతైనా ఉపయోగకరంగా ఉంటుందనుకుంటే ఆ ఘనత పూర్తిగా మీకే చెందాలి. సమయాభావం పేరుతో రాయలేనేమో… కనీసం అందుబాటులో ఉన్న సమాచారాన్నయినా ఒకచోట చేర్చలేనేమో అని వెనుకాడుతున్న సమయంలో మీ ప్రోత్సాహమే నన్ను ఈ పనికి పురికొల్పింది. మీకు కృతజ్ఞతాభివందనలు.
(ఈ వ్యాస రచయిత శ్రీ కే రాజశేఖరరాజు-చందమామ చరిత్ర బ్లాగులో)

సురేఖ చందమామ అభిమాని

సురేఖ అన్నారు ఇక్కడ చూస్తె ఒక పెద్దాయన ఫోటో ఉన్నది ఏమిటి అని ఆశ్చర్య పోతున్నారా!ఏమిటీ చిత్రం అనుకుంటున్నారా!! ఇందులో పెద్ద మిస్టరీ ఏమీ లేదు. చందమామ ప్రియుడైన ఈయన పేరు మట్టెగుంట అప్పారావు గారు. ఈయన "సురేఖ" పేరుతో కొన్ని వేల కార్టూన్లు వేసి ప్రసిధ్ధికెక్కారు( త్వరలో ఆయన కార్టూన్ల గురించి మరొక వ్యాసంలో విషయాలు చెప్తాను ).

అప్పారావుగారు చందమామకు వీరాభిమాని. ఆయన దగ్గర చందమామల నిధి ఉన్నది. దాదాపు మొదటి నుండి 1979-80 లవరకు ఓపికగా సంచికలన్నీ పోగుచేసి వాటన్నిటిని వరుసగా బైండ్లు కట్టించి భద్రపరచారు. ఇంత చక్కగా చందమామ పత్రిక ఆఫిసులో కూడ ఉండి ఉండవు. బాంకులో పని చేసి పదవీ విరమణ చేసిన అప్పారావుగారు, ఆయన ఎంత జాగ్రత్తతీసుకుంటే చందమామలన్నీ ఇంత చక్కగాఉన్నాయి. ఉద్యోగ నిర్వహణలో వచ్చిన అన్ని బదిలీలలోను పాడుకాకుండా ఒక చోటి నుండి మరొక చోటుకు మార్చటంలో ఆయన ఎంత జాగ్రత్త తీసుకుని ఉంటారు.పుస్తక ప్రియులందరూ పాటించవలసిన ఒక చక్కటి నినాదం అప్పారావుగారు సదా చెపుతుంటారు

నా కొత్త పుస్తకం ఎవరికీ ఇవ్వను. అవి ఇప్పుడు మీకు పుస్తకాల షాపులో దొరుకుతాయి కాబట్టి. నా పాత పుస్తకాలు ఎవరికి ఇవ్వను, అవి నాకు ఎక్కడ దొరకవు కాబట్టి


ఇంతే కాకుండా హాసం అని ఒక క్లబ్ స్థాపించి ప్రతి ఆదివారం సభ్యులందరినీ సమావేశపరచి హాస్యాన్ని అస్వాదింపచేస్తుంటారు. ఒక్కటే నియమం, ఈ సమావేశాలకు, సభ్యులు చక్కటి తెలుగు వేష ధారణలోనే రావాలి. మర్చిపొయ్యాను, తెలుగు వేష ధారణ అంటే ఏమిటో చాలమందికి గుర్తు లేదేమో. చక్కగా పంచె లాల్చి ధరించి పైన కండువా వేసుకుని రావాలి అన్నమాట.

ఈ మధ్య తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో భాగంగా, తన దగ్గర ఉన్న చందమామ బైండ్లన్నిటిని చందమామ ప్రియులకోసం ఒక ప్రదర్శన పెట్టారు. అందులో, ఎవరుపడితే వారు పుస్తకాలను అటు ఇటు తిరగేసి నలిపి పారెయ్యకుండా, గ్లాసు అరల కింద ఉంచి చూపించారు. ఎంతో మంది చందమామ ప్రియులు వచ్చి, ఈ ప్రదర్శనను చూసి పులకితులైపొయ్యారు. ఆయన చందమామ ప్రదర్శనను ఈ కింది ఫొటోల ద్వారా చూసి ఆనందించండి.

***



***



***




****

19, నవంబర్ 2009, గురువారం

సురేఖ జ్ఞాపకాలు

చందమామతో నా అనుభంధం చందమామను పత్రిక ను మా ఇంట్లో 1949 నుంచి తెప్పిస్తూవున్నా,జాగ్రత్తగా దాచుకోవలనే ఆలోచన నాకు 1953 నుంచే వచ్చింది.ఆప్పుడు నా వయసు 12 ఏళ్ళు. మా నాన్న గారు ఏడాది పూర్తవగానే బైండు చేయించేవారు.అలా జాగ్రత్తగా వాటిని పదిల పర్చుకున్నాను .ఉద్యోగ రిత్యా ఎన్ని ఊర్లు ట్రాన్స్ఫర్ ఐనా వాటిని చాలా జగ్రత్తగా చూసుకొనే వాడిని. 1970 లో నే మద్రాసు వెళ్ళినప్పుడు చందమామ ఆఫీస్ కు వెళ్ళి సంపాదకులు కీ"శే"కొడవటిగంటి కుటుంబరావుగారిని,చిత్రా,శంకర్ గార్లను కలసి ప్రెస్ చూసాను.చందమామ ఆఫీస్ మేనేజర్ గా పనిచేస్తున్న రామారావు గారు మా దూరపుభంధువు అయినందువల్ల నాకీ అదృస్టం కలిగింది.ఆయన్ని అందరు చందమామ రామా రావు గారని పిలిచేవారు!చందమామ లో ఛిత్రాగారితో బాటు కేశవ,యంటీవీ. ఆఛార్య,మాధవపెద్ధి గోఖలే బొమ్మలు వేసేవారు.తరువాత శంకర్,వ.పా కూడా చందమామ లో చేరారు.ఎవరు ముఖచిత్రాలు వేసినా చిత్రాగారి బొమ్మ అట్టఛివరి బొమ్మగా తప్పక వుండేది.కొంత కాలం చిత్రా లైన్ డ్రాయింగ్ బొమ్మకు రంగులు వేయమని తరువాత ఆ బొమ్మను రంగుల్లో వేసి మన బొమ్మతో సరి చూసుకోమనే వారు.నాకు డ్రాయింగ్ పై అభిలాష వున్నా చందమామ పుస్తకం పాడవుతుందని వేసేవాడిని కాదు. ********యమ్వీ.అప్పారావు(సురేఖ)

వేరుశనక్కాయల ఉత్సవం


వేరుశనక్కాయల ఉత్సవం అని చెప్పగానే ఇదేమిటి పల్లీలకు ఉత్సవమేమిటి, అదీ బెంగుళూరులో అని ఆశ్చర్యం కలిగింది. కాని, ఆ ఉత్సవం చూసొచ్చిన మీదట ఇలా ఉత్సవం జరపటం సబబే అనిపించింది.

చరిత్ర:
చాలా సంవత్సరాల క్రితం బెంగుళూరు ప్రాంతం అంతా కూడ వేరుశనక్కాయలు పండించేవారుట. పంట పండి దాదాపు చేతికి అందే సమయానికి ఎక్కడినుంచో ఒక పెద్ద ఎద్దు వచ్చి తిన్నంత తిని మిగిలిన పంటను ధ్వంసం చేసిపారేసేదిట. రైతులంతా ఓ రోజున కాపుకాసి జరిగే ఈ నష్టానికి కారణమైన ఎద్దుని తరిమారట. ఆ ఎద్దు పరిగెత్తి పారిపోతూ, ఒక కొందమీదకు వెళ్ళి శిలగా మారిందట. అది చూసిన రైతులు భయపడి, ఆ ఎద్దు శిలా విగ్రహానికి పూజలు చేసి, తమ పంటలో కొంత నైవేద్యం పెట్టటం మొదలుపెట్టారు. మరికొంతకాలానికి, బెంగుళూరు వ్యవస్థాపకుడిగా పేరొందిన కెంపెగౌడ ఈ శిలా విగ్రహానికి ఆచ్చాదన ఏర్పరిచి, గుడిగా మలిచారట. ఆ గుడే, ఈరోజున ప్రసిధ్ధిగాంచిన "బుల్ టెంఫుల్" . ఈ విధంగా వేరుశనగ రైతులు, ఇప్పటికి ఈ గుడికి వచ్చి తమ పంటను బసవన్నకు నైవేద్యం పెడుతూనే ఉన్నారు. అదే ఈ వేరుశనక్కాయల ఉత్సవం.ఈ ఉత్సవాన్ని కడెలికాయే పరిషే అని కన్నడంలో వ్యవహరిస్తారు.

ఎప్పుడు చేస్తారు:
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని చివరి సోమవారం నాడు ప్రారంభం అయ్యి రెండురోజులు జరుగుతుంది ఈ ఉత్సవం.

ఎక్కడ జరుగుతుంది:
బెంగుళూరు నగరం నడిబొడ్డున ఉన్న బసవన్న గుడి (బుల్ టెంపుల్) బయట రోడ్డుమీద ఈ వేరుశనక్కాయల ఉత్సవం జరుగుతుంది.

ఉత్సవ విశేషాలు:
తమ పంటను బసవన్నకు నైవేద్యం పెట్టిన తరువాత అక్కడే రోడ్డుమీద రైతులు అమ్మకానికి పెడతారు. బెంగుళూరు ప్రజలు వేలాదిగా పాల్గొని, రకరకాల వేరుశెనక్కాయలను చూసి తమకు ఇష్టమైన వాటిని సరసమైన ధరలో కొనుక్కుంటారు. ఈ ఉత్సవం సందర్భంగా ఆరోడ్డు మొత్తం ట్రాఫిక్కును ఈ రెండురోజులూ నిషేధిస్తారు. రైతులతో పాటుగా అనేక చిన్న వ్యాపారులు తమ తమ సరుకులను అమ్ముకోవటం మరొక విశేషం. మొత్తం మీద ఒక తిరణాల వాతావరణం బెంగుళూరు నగరంలోని ఈ ప్రాంతాన ఈ రెండురోజులు ఏర్పడుతుంది.

వేరుశనక్కాయల ఉత్సవానికి సంభంధించిన కొన్ని బొమ్మలను ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు
వేరుశనక్కాయల ఉత్సవం ఫోటోలు

బేతాళ కథలు కథా కమామిషు-2

బేతాళ కథలను పైవిధంగా 1955 సంవత్సరంలో ప్రచురించారు


మరుగున పడిన చందమామ చరిత్రను వెలికి తీసి అక్షరబద్దం చేద్దామనే లక్ష్యంతో నేను సంస్థ లోపలినుంచి చేస్తున్న ప్రయత్నాలు మరింత నిర్దిష్టంగా, ఖచ్చితంగా, సత్యసమ్మతంగా ఉండాలనే భావంతో ఈ బ్లాగులో నేను పొందుపరుస్తున్న కథనాలు, వాటిలోని సమాచారాన్ని మళ్లీ మళ్లీ నాకు నేనుగా నిర్ధారించుకుంటూ, వెనక్కి తిరిగి చూసుకుంటూ పెద్దల సలహాలను తీసుకుంటూ వస్తున్నాను.

ఈ బ్లాగులో సందర్భానుసారం పొందుపరుస్తున్న విషయాలు నూటికి నూరుపాళ్లు వాస్తవమేనని నాకు నేనే సర్టిఫికెట్ ఇచ్చుకునే సాహసం చేయలేను. ఎందుకంటే ఇది 63 సంవత్సరాల చరిత్రకు, చందమామ నేపథ్యానికి సంబంధించిన విషయాలతో కూడిన బ్లాగు.

దశాబ్దాలుగా మరుగున పడి ఉన్న అపరూప చరిత్రను సేకరించే ప్రయత్నంలో పలుసార్లు మనకు అందుబాటులోకి వస్తున్న, పలు కోణాలు, మార్గాలనుంచి అందుతున్న విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకుని వీలయితే మార్చవలసిన, సవరించ వలసిన, ఇంకా నిర్దిష్ట రూపమివ్వ వలసిన అవసరం ఎంతైనా ఉంది.

అందుకే ఈ బ్లాగులో వస్తున్న వ్యాసాలు, కథనాలు వేటికవిగా శాశ్వతాలు అనే అభిప్రాయం అప్పుడూ, ఇప్పుడూ కూడా నాకు లేదు. ఇకపై ఉండదు కూడా. ఓ అరుదైన చరిత్రకు సమగ్ర రూపం ఇవ్వడానికి ప్రయత్నించడంలో ఎన్ని పురిటినొప్పులు పడవలసి ఉంటుందో నాకు తెలీంది కాదు కూడా.

అందుకే బేతాళ కథలుపై నేను కూర్చిన, సమీక్షించిన విషయాలు, అందులో చందమామతో ముడిపడిన అంశాలకు సంబంధించి లోపాలు, ఇంకా సవరించవలసిన విషయాలపై తగు సూచనలు అందించమని ప్రింట్ చందమామ అసోసియేట్ ఎడిటర్ బాలసుబ్రహ్మణ్యం గారిని కోరి ఆ రెండు కథనాల కాపీలను నిన్న అందించాను. ఈ రోజు సాయంత్రం ఆఫీసులోనూ, క్యాబ్‌లోనూ తనతో జరిపిన సంభాషణకు అనుగుణంగా చందమామ బేతాళ కథల నేపథ్యాన్ని మరికొంత వివరంగా పొందుపర్చే ప్రయత్నం చేస్తున్నా.

బాలు గారు ప్రధానంగా రెండు విషయాలను ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అవి. 1.బేతాళ కథలను ఎప్పుడు కూడా మార్చి రాయలేదు. మొదట్లో మూలంలోని కథలను కొన్నింటిని యధాతథంగా ప్రచురించారు.

తర్వాతనుంచి చందమామ రచయితలు పంపుతూ వచ్చిన మామూలు కథలనే బేతాళ కథలుగా పజిల్ రూపంలో, ప్రశ్నలు – సమాధానాల రూపంలో ట్విస్ట్ చేసి పిల్లలకు అనుగుణంగా కథను మార్చారు. తర్వాత పెద్దలకు కూడా అవి ఇష్టమైన కథలుగా మారిపోయాయి.

2. చందమామలోని బేతాళ కథలకు ఘనత ప్రాథమికంగా కథల రచయితలదే. బేతాళ కథలకు సంబంధించి చక్రపాణి, కొకు, శంకర్ గారు వంటి వ్యక్తుల ప్రాముఖ్యత, ఒరవడిల గురించి ప్రస్తావించే క్రమంలో కథల రచయితలను మర్చిపోకూడదు. వారి విలువను విస్మరించవద్దు.

బాలుగారు చెప్పిన ఈ రెండు విషయాలను వివరంగా ప్రస్తావించుకుందాము. ఆయన ఎరుక ప్రకారం…

బేతాళ కథలను చందమామ పత్రిక ఎన్నడూ మార్చి రాయలేదు. 1955 సెప్టెంబర్ సంచికలో తొలి బేతాళ కథను “మహామంత్రి మనోవ్యాధి” అనే పేరుతో ప్రచురించారు. గుణాఢ్యుని మూల కథల్లో ఒకటో కథ, రెండవ కథ, మూడవ కథ అనే ఉంటాయి. తర్వాత అక్టోబర్‌లో “మారిన తలలు” నవంబర్‌లో ఏడ్పు – నవ్వు, డిసెంబర్‌లో ఆత్మబలిదానం అని బేతాళ కథలను మూలంలోనివే వేశారు.

మృతసంజీవనీ మంత్రం వరకు మొత్తం 9 కథలను ప్రచురించిన చందమామ ఆ కథల ముగింపు పుటలో కల్పితం అని వేయలేదు. 1956 జూన్ సంచికలో మాత్రమే బేతాళ కథకు చివర కల్పితం అని ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇక్కడినుంచే బేతాళ కథలను ఒరిజనల్ కథలనుంచి కాక రచయితలు పంపిన కథలనుంచే ఏరుకుని ట్విస్ట్ చేసినట్లుంది.

ఇంకా చెప్పాలంటే బాలుగారి ప్రకారం 1955 సెప్టెంబర్ నుంచి మొదటి మూడు కథలు మాత్రం నిఖార్సుగా మూల కథలే అయి ఉంటాయి. తర్వాత నుంచి మామూలు కథలనే బేతాళ కథలుగా మార్చి రాశారు. ఎందుకంటే దీనికి నేపథ్యం ఉంది. గుణాడ్యుని బేతాళ మూల కథలు వాస్తవానికి పెద్దల కథలు అంటే అడల్ట్ కథలు. అంటే కేవలం శృంగారానికి మాత్రమే సంబంధించినవి అని కాదు. అవి భార్యాభర్తలు, స్త్రీపురుషుల సంబంధాలు, సంసార నీతి, కుటుంబ విలువలు వంటి పెద్దలకు సంబంధించినవి. కుటుంబ నీతిని ధిక్కరించిన కథలు కూడా మూలంలో ఉన్నాయి.

కాబట్టి తొలి రెండు మూడు కథలను ప్రచురిస్తున్న క్రమంలో చందమామ సంపాదకులకు, సంపాదక వర్గ సభ్యులకు ఈ పెద్దల విషయాన్ని పిల్లలకు ఎలా చెప్పడం అనే ధర్మసందేహం ఎదురై మూల కథల్లోని ట్విస్ట్‌ను తీసుకుని చందమామ రచయితల కథలనే బేతాళ కథలుగా మార్చి రాస్తే బాగుంటుంది కదా.. ఇలా ఎందుకు చేయకూడదు అనే థాట్ వచ్చిందట.

ఇది చక్రపాణి, కుటుంబరావు గార్లలో ఎవరికయినా వచ్చి ఉండవచ్చు. లేదా కొకు గారే సలహా ఇస్తే దాన్ని చక్రపాణిగారు ఆమోదించి ఉండవచ్చు. ఏదేమైనా మూలకథలను కాకుండా ఆధునిక కథలనే మధ్యలోనో లేదా చివర్లోనూ లేదా కథ మొత్తంగానో మార్పు చేసి పజిల్ లేదా ప్రశ్న-సమాధానం రూపంలో మార్చి ప్రచురించాలనే ఆ ఆలోచనకు గుణాడ్యుని మూలకథలే ఆస్కారం ఇచ్చాయి.

కాబట్టి బేతాళ కథలను చందమామ ఎన్నడూ మార్చి రాయలేదు. చందమామలో తొలి మూడు, లేదా తొమ్మిది కథల తర్వాతే కొత్త కథలను చందమామీకరణ చేసి ఉంటారన్నది బాలూగారి అభిప్రాయం. తొలి 3 కథలూ నిఖార్సయిన మూల కథలే అని తానంటారు.

ఇకపోతే రెండోది. చందమామ బేతాళ కథలకు ఘనత ప్రాథమికంగా రచయితలదే. ఏ కారణాలతో అయినా సరే చందమామకు కథలు రాస్తూవచ్చిన రచయితలను విస్మరించకూడదు. ఎందుకంటే వీరు రాసి పంపుతూ వచ్చిన సాధారణ కథలనే బేతాళ కథలుగా సంపాదకులు మార్చి రాస్తూ వచ్చారు. బేతాల కథలకు అని ఉద్దేశించకుండా రచయితలు పంపిన సాధారణ కథలను కూడా బాగుంటే, బేతాళీకరణకు అనువుగా ఉంటే వాటిని సెపరేట్ చేసి సవరించేవారట.

దీనికి తొలి పాతికేళ్లూ అంటే 1955 నుంచి 1980 వరకు చక్రపాణి, కుటుంబరావు గార్లు మార్గదర్శకత్వం వహించగా, తర్వాతి దశలో విశ్వంగారు, దాసరి సుబ్రహ్మణ్యం గారు 2006 వరకు బాధ్యత వహించారట. కొకు గారి తర్వాత బేతాళకథలను సాపుచేసే బాధ్యత దాదాపుగా దాసరి గారిదే అని బాలు గారి అభిప్రాయం. 2006 తర్వాత బాలుగారే ఈ బాధ్యతను చేపట్టారనుకోండి. పైగా ఇతర సంపాదకవర్గ సభ్యుల వలే కాక ఈయన స్వతహాగానే చందమామ అవసరాలకు గాను బేతాళ కథలను అడపాదడపా రాస్తున్నారని తెలిసింది. దీన్ని కూడా పైకి అంగీకరించని మోడెస్టీ ఈయనది.

అయితే చక్రపాణి, కుటుంబరావు, విశ్వం, దాసరి సుబ్రహ్మణ్యం గార్లలో ఏ ఒక్కరూ స్వంతంగా బేతాళ కథలను రాయలేదని కథకులు పంపిన కథలలోంచి ఏరిన వాటినే కొకు, దాసరి గార్లు బేతాళ కథలుగా మార్పు చేసేవారని అంటారీయన. కథ మధ్యలో మార్చినా, చివర్లో మార్చినా, లేదా కథ మొత్తంగా మార్పులకు గురిచేసినా చందమామ బేతాళ కథలకు మూలం చందమామ కథకులే. వీరిలోనూ రాజగోపాలరావు -వసుంధర- గారిదే అగ్రతాంబూలం అని బాలుగారి ప్రకటన.

చందమామ సంపాదక బృంద సభ్యులు సాపు చేసి తుది రూపమిచ్చిన బేతాళ కథలకు కూడా సవరణలు సూచించినవారు చందమామ చరిత్రలో ఇద్దరే ఇద్దరు. వారు చక్రపాణి గారు, విశ్వనాథ రెడ్డి గారు. బేతాళ కథకు మార్పులను సూచించడంలో చక్రపాణి గారి కంటే విశ్వంగారే రెండాకులు ఎక్కువగా చదివారన్నిది బాలూగారి అభిప్రాయం.

సంపాదక సిబ్బంది బాగా లేదు అని కొట్టిపారేసిన కథను కూడా మధ్యలోనో, చివర్లోనూ మార్పులు చేసి బేతాళకథగా మార్చవచ్చు కదా అని విశ్వంగారు సూచించేవారట. చక్రపాణిగారికి ఎంత సంపాదక అనుభవం ఉందో అంత అనుభవం విశ్వంగారికి ఉందని, ఇందుకు 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం తోడయిందని బాలు గారు చెప్పారు.

ఇలా పిల్లలకోసం తయారైన బేతాళకథలు తర్వాత ఆంధ్రదేశంలో అన్నివయస్సుల వారిని దశాబ్దాలుగా ఆకట్టుకున్నాయి. చనుబాల కథలుగా మాత్రమే పేరొందిన చందమామ కథల పట్ల తర్వాత పెద్దలు కూడా బాగా ఆసక్తి చూపేలా చేయడంలో మొదటి మలుపు బేతాళ కథలనుంచే ప్రారంభమయ్యిందిని చెప్పవచ్చు.

పెద్దల విషయంగా పేరొందిన బేతాళ మూల కథలను మినహాయించి పిల్లల కంటెంట్‌గా మార్పుకు గురయిన బేతాళ కథలు అచిర కాలంలోనే కుటుంబంలోని స్త్రీ, బాల, వృద్ద బాంధవ్యులందరికీ నచ్చిన అద్భుత విజయ గాధలుగా చరిత్రలో నిల్చిపోయాయి.

బాలు గారికి కృతజ్ఞతలతో…

చివరగా చందమామ బేతాళ కథల ప్రాశస్త్యం గురించి శివరాం గారు తన బ్లాగులో రాసిన కథనంలోని చివరి పేరాతో దీన్ని ముగిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.

“కథా సంపుటి లేదా ధారావాహికగా మొదలు పెట్టబడినా, చివరకు ఒక కథా శీర్షికగా స్థిరపడినాయి ఈ బేతాళ కథలు.చిన్న చిన్న ధారావాహికలు మొదలు పెట్టినప్పుడల్లా తమ సంపాదకీయంలో ఆ ధారావాహిక గురించి కొద్దో గొప్పో చందమామలో వ్రాసే వారు. కాని చారిత్రాత్మకమైన బేతాళ కథల ధారావాహిక (శీర్షిక) చడి చప్పుడూ లేకుండా మొదలు పెట్టేశారు. మరి అప్పట్లో ఈ కథలను ఎలా వేయ్యలో ఇంకా నిర్ణయించుకోలేదేమో.

చివరికి , ఇలా ఎటువంటి ప్రకటన లేకుండా మొదలు పెట్టబడినా, చందమామలోని అన్ని ధారావాహికలలోనూ ఎక్కువరోజులు ప్రచురించబడింది, ఇంకా ప్రచురిస్తూనే ఉన్నారు. భారత పత్రికా చరిత్రలో ఇది ఒక మైలురాయి (రికార్డు)అని నా అభిప్రాయం. తెలుగు పత్రికా చరిత్రలో అన్ని శీర్షికలకన్న ఎక్కువకాలం ప్రచురించబడిన, ఇంకా ప్రచురించబడుతున్న శీర్షిక ఇది ఒక్కటే అయి ఉండవచ్చును.ఈ చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక ప్రసిద్ధ రచయిత, చందమామకు ఎక్కువకాలం సంపాదకుడిగా పనిచేసిన, శ్రీ కొడవటిగంటి కుటుంబరావు కృషి ఎంతగానో ఉన్నది.

బేతాళకథలు ధారావాహిక అనండి లేదా శీర్షిక అనండి, ఏది ఏమైనా కథలను ఏకధాటిగా ఇంత ఆసక్తికరంగా, పిల్లలకు(అనేకసార్లు పెద్దలకే) తెలివితేటలు పెంపొందించే విధంగా ప్రచురించటం నభూతో నభవిష్యతి.”
*************

కొన్ని లింకులు
గుణాఢ్యుడి బేతాళ కథలు

బేతాళ కథలు – కుటుంబరావు గారి ఒరవడి


(పై కథనం చందమామ చరిత్ర బ్లాగులోనిది, రచయిత శ్రీ రాజశేఖర రాజు)

18, నవంబర్ 2009, బుధవారం

బెంగుళూరు పుస్తక ప్రదర్శన

నేను మా ఊరు విజయవాడ వదిలి పది సంవత్సరాల పైన అయ్యింది. ఈ పది సంవత్సరాలలో , బెంగుళూరు వచ్చినాక మాత్రమె పుస్తక ప్రదర్శన వెళ్ళటానికి కుదిరింది. ఇంతకు ముందు ఉన్నా ముంబాయి, హైదరాబాదులలో ఈ ముచ్చటకు అవకాసం ఉండేది కాదు. ఇక బెంగుళూరులో, విజయవాడంత గొప్పగా కాకపోయినా ఉన్నంతలో పుస్తక ప్రదర్సన అంటూ జరగటం సంతోషకరం. ఎలాగో అలా దారి వెతుక్కుని వెతుక్కుని పాలెస్ గ్రౌండ్సుకు వెళ్ళగలిగాను. విశాలమైన చోటే కాని నిర్వాహకుల నిర్వాకం వల్ల స్టాలుకు స్టాలుకు మధ్య పెద్ద దూరం ఉంచలేదు. అందువల్ల చాలా ఇరుకుగా తిరగవలసి వచ్చింది. పైగా ఆవరణ అంతా కప్పేసి లోపల ఫాన్లు ఉంచినా జనాభారం వల్ల కాబోలు ఊపిరి తీసుకోవటం సులభంగా కాలేదు.

ఈ కష్టాలన్ని భరిస్తూ, తెలుగు పుస్తకాలు ఎక్కడా ఎక్కడా అనుకుంటూ తిరుగుతుంటే మన విశాలాంధ్ర వారి స్టాల్ ప్రత్యక్షమయ్యింది. ప్రాణం లేచి వచ్చి (విశాలాంధ్రలో సంవత్సరాలపాటుగా రీడర్స్ క్లబ్ మెంబర్ని) వెళ్ళి పుస్తకాలు తిరగేసి నాకు నచ్చిన పుస్తకాలు కొన్నాను.

కొడవటిగంటివారు కథలు నాలుగు సంపుటాలు, మధురాంతకం రాజారాం గారి కథలు, పాలగుమ్మి పద్మరాజుగారి కథలు దొరికినాయి.

నాకు అన్నిటికంటే ఆనందాన్నిచ్చిన పుస్తకం శ్రీ భమిడిపాటి కామేశ్వరరావుగారి పుస్తకం "హాస్య వల్లరి" మొదటి సంపుటం. దాదాపు కనుమరుగౌతున్న రచయిత శ్రీ భమిడిపాటి కామేశ్వరరావుగారి పుస్తకాలు మళ్ళి ప్రచురించినందుకు విశాలాంధ్రవారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ పుస్తకాన్ని కూడ కొనుక్కున్నాను. ఆగలేక తిరిగి వస్తూ బస్సులో కొంత చదివి నవ్వుకుంటుంటే పక్కవాళ్ళు కొంత బెదిరినట్టు కనబడ్డారు కూడా!

మరొక ఆణిముత్యం బాపు గారి "ఇడిగిడిగో బుడుగు" కార్టూన్లు. ఈ పుస్తకం బాపు గారి శిష్యులు శ్రీ గంధం గారు సేకరించి వేశారట.. బుడుగు పుస్తకం విడుదలకు పూర్వమే, ఈ బుడుగు కార్టూన్లు ఆంధ్ర పత్రికలో ధారావాహికగా వచ్చినాయట.

చక్రపాణిగారి గురించిన ఒక చక్కటి పుస్తకం దొరికింది. అందులో ఆ మహానుభావుడి జీవిత విశేషాలు, చందమామ స్థాపన, తీసిన సినిమాలు, నాగిరెడ్డిగారితో దోస్తి, ఆయన సమకాలీనులగురించి చక్కగా ఎన్నెన్నో అమూల్యమైన ఫొటోలతో ఉన్నది. పుస్తకం పేరు "చక్రపాణి విజయ పతాక" చక్రపాణి శతజయంతి సందర్భంగా 2008లో నవరత్న బుక్ హౌసువారు ప్రచురించినది. చందమామ ప్రియులు తప్పనిసరిగా కొని చదవవలసిన పుస్తకం.


కొడవటిగంటి కుటుంబరావుగారి కథలు చదివినతరువాత మరే రచయిత కథలు చదివినా కొంత పేలవంగా ఉండటం సహజం. కాని కొడవటిగంటి కుటుంబరావుగారికి సరితూగగల రచయిత మధురాంతకం రాజారాంగారేనని నా అభిప్రాయం. కథ ఎత్తుగడకాని, చెప్పదలుచుకున్న విషయాలను చెప్పే పధ్ధతిలో కాని, అనవసరపు వర్ణనలు లేకపోవటంకాని మనం పోల్చి చూస్తే కుటుంబరావుగారికి సరైన వారసుడు రాజారాంగారు అనటంలో నాకేమాత్రం సందేహంలేదు.

మొదటిరోజున వెళ్ళినప్పుడు కొడవటిగంటివారి సంపుటాల్లో మొదటిది మినహా మిగిలిన మూడు దొరికాయి. నా అభ్యర్ధన వినిపించుకుని, విశాలాంధ్రవారు, మర్నాడు ఆదివారం (అదే చివరిరోజు) రండి, తెప్పించి ఇస్తాం అనటంతో, మా అబ్బాయికి పురెక్కించి వాడి వాహనం లో ఇద్దరం వెళ్ళాం.

ఈ రెండో సారి వెళ్ళినప్పుడు ఒక విచిత్రం జరిగింది. మేమిద్దరం ఒక్కొక్క స్టాలూ పరకాయిస్తూ వెళ్తుండగా, ఒకాయన నా దగ్గరకు వచ్చి, "మీరు బ్లాగరా?" అని అడగటంతో నేను నివ్వెరపోయ్యాను. అవునండి మీరెవరు అనటంతో తాను కూడ తోటి బ్లాగరు అని తన పేరు నాగమురళి అని తనతో పాటుగా ఉన్న రవి(బ్లాగాడిస్తా)ని కూడ పరిచయం చేశారు. మరిద్దరు బ్లాగర్లు కలిసిన సంతోషంలో అక్కడే పెద్దగా జనం లేని స్టాలులో నిలబడి కాసేపు మాట్లాడుకున్నాం. వాళ్ళిదరి దగ్గర వాళ్ళ ఈ మైలు చిరునామలు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చినాక. "మన తెలుగు చందమామ" బ్లాగుకు భాగస్వాములుగా ఆహ్వానించాను. నా సైడు ఫోజు ఫొటో చూసి నన్ను ఎవరైనా గుర్తుపడతారనుకోలేదు!!

విశాలాంధ్రవారు వారి మాట నిలబెట్టుకుని కొడవటిగంటి సంపుటాలలో మొదటిది అందించారు. మేము ఆనందంగా ఇంటికి తిరిగివచ్చి, ఆ పుస్తకాల అధ్యయనం పడ్డాం. ఇది బెంగుళూరు పుస్తక ప్రదర్శన కథ

పాత చందమామలు

(April 23, 2008 నా బ్లాగులో రాసిన టపా ఇది. అప్పట్లో చాలా యాదృచ్ఛికంగా నాకు చందమామలు ఇంటర్నెట్లో కనపడితే ఆనందాన్ని తట్టుకోలేక నా బ్లాగులో వ్యక్తపరిచాను. దానికి వచ్చిన స్పందన అపూర్వం. దానివల్ల ఎంతో మంది ‘చంపి’ల గురించి తెలిసింది, పరిచయం అయింది. ఈమధ్య కొంచం సమయం చిక్కక బ్లాగులకి దూరంగా ఉన్నా, ఇప్పుడు బ్లాగుల్లో చందమామ అభిమానుల సందడి చూస్తుంటే నాకు మళ్ళీ చిన్నపిల్లాణ్ణి అయిపోయినట్టుగా ఉంది. మొన్న ఆదివారం అనుకోకుండా శివరామప్రసాద్ గారిని కలవడం తటస్థించింది. ఆయన ఈ బ్లాగు గురించి చెప్పారు. నా పాత టపాని మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను.)

పాత చందమామలు
-------------------
జీవులకి ఆత్మ ఉండడం నిజమైతే, చనిపోయాకా అది స్వర్గానికో నరకానికో వెళ్ళడం నిజమైతే, నేను చనిపోయాకా కొద్దికాలమైనా స్వర్గంలో గడపడం తటస్థిస్తే, అక్కడ నాకోసం ఖచ్చితంగా ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో ఒక సెక్షన్ లో పాత చందమామలూ, బాలజ్యోతులూ అన్నీ సంవత్సరాలవారీగా బైండు చేసి ఉంటాయి. నా చిన్నప్పుడు చదివిన పుస్తకాలు మళ్ళీ చూసుకుని నేను ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతాను.

ఇంకా స్వర్గానికి పోకుండానే అటువంటి అనుభవం కలిగింది నిన్న. 1947 నుంచీ 2006 దాకా చందమామలు అన్నీ ఇంటర్నెట్ లైబ్రరీ లో ఉన్నాయి. నేను చిన్నప్పుడు ఎన్నోసార్లు చదివిన పుస్తకాలు బొమ్మలు, అడ్వర్టయిజ్మెంట్లతో సహా ఇప్పటికీ నా కళ్ళముందు ఉన్నాయి. అవే పుస్తకాలు మళ్ళీ ఇప్పుడు చూసుకుంటుంటే ఒక ‘నోస్టాల్జియా’ ఆవహించింది.


బహుశా నేను బొమ్మల కథల పుస్తకాలు చదవడం నా ఆరు, లేక ఏడవ సంవత్సరంలో మొదలుపెట్టి ఉంటాను. ఇంకా చిన్నతనంలో కూడా ఏమైనా చదివానేమోగానీ అవేవీ గుర్తు లేవు. కానీ ఆరేడేళ్ళ వయసునాటి పుస్తకాలు ఇప్పుడు చూస్తే ఇంకా నిన్న మొన్న చదివినట్టే అనిపించింది. బహుశా తరవాత సంవత్సరాల్లో కూడా చాలాసార్లు పారాయణ చేసినందువల్ల కావచ్చు. సుమారు పదిహేనో ఏడు వచ్చేవరకూ కథలపుస్తకాలు చదువుతూనే ఉన్నాను. పాతవి పారాయణ చేస్తూనే ఉన్నాను.


ఇంతకీ ఈ చందమామలు ఎక్కడ ఉన్నాయంటే, http://www.ulib.org/ కి వెళ్ళండి. అందులో Advanced Search లోకి వెళ్ళండి. Title లో Chandamama అని కొట్టి, Language లో Telugu సెలెక్టు చెయ్యండి. సెర్చి కొట్టండి. అంతే, అన్నీ మీ ముందు ప్రత్యక్షమౌతాయి.


నిన్న ఉండబట్టలేక చిన్నప్పుడు చదివిన ‘ముగ్గురు మాంత్రికులు’ సీరియల్ మళ్ళా మొదటినుంచీ చివరిదాకా చదువుతుంటే తెలిసింది. కొన్ని కొన్ని సంవత్సరాల్లో కొన్ని నెలల చందమామలు అందులో లేవు. మిస్సయ్యాయి. చాలా బాధ కలిగింది. ఆ ఎడిషన్లు అసలు చందమామ వాళ్ళదగ్గరే లేవేమో? అలా అయితే మటుకు తెలుగు జాతికి గొప్ప నష్టం జరిగినట్టే.


మరో సంగతి. ఈ సైట్లో చందమామలు పీడీఎఫ్ రీడర్ సహాయంతో పేజీ తరవాత పేజీ చదువుకోవాలి. సదుపాయంగా ఉండదు. అయినా కొంచం ఓపిక ఉంటే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. http://www.chandamama.com/ లో Archives సెక్షన్లో 1947 నుంచీ 1959 దాకా అన్నీ పీడీఎఫ్ ఫైల్సు రూపంలో ఉన్నాయి. ఇవి చదువుకోడానికి చాలా సదుపాయంగా ఉంటాయి. సైటువాళ్ళు మిగతావి ఎప్పుడు ఇస్తారో తెలియదు. అంతవరకూ http://www.ulib.org/ మాత్రమే గతి కాబోలు.
మరి ఇంకా ఆలస్యమెందుకు? చదువుకోవడం మొదలు పెట్టండి.

(Original post link: http://nagamurali.wordpress.com/2008/04/23/)

17, నవంబర్ 2009, మంగళవారం

తరాల ఊహలను ఒడిసి పట్టుకున్న చిత్రకారుడు


అనగా అనగా ఓ ఊరిలో శివశంకరన్ అనే ఓ అబ్బాయి ఉండేవాడు. ఆ ఊరిపేరు కారత్తొళువు. ఇది కోయంబత్తూరు సమీపంలో ఉండే చిన్న ఊరు. పదేళ్ల వయసులో అతడు చదువుకోడానికి మద్రాసు మహానగరానికి వచ్చాడు. పదవ తరగతి పూర్తి చేశాడు. తనకు డ్రాయింగ్ నేర్పిన టీచర్ అతడిని డిగ్రీ చదువుకు పోవద్దని, ఎగ్మూరులో ఉండే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరమని సలహా ఇచ్చారు.

తన టీచర్ సలహాను పాటించిన ఆ అబ్బాయి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చిత్రకళను అభ్యసించాడు. తర్వాత ఓ ప్రముఖ పిల్లల పత్రికలో చిత్రకారుడిగా చేరాడు. తను గీసిన చిత్రాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. దాంతో అతడి జీవితం సాఫీగా, సంతోషంగా గడిచిపోయింది.

ఇది.. శంకర్ గారి కథ. ఓ రకంగా చందమామ కథ కూడా. ఆయనకు ఇప్పుడు 85 ఏళ్లు. మీరు, మీ తల్లిదండ్రులు, చివరకు మీ తాత ముత్తాతలు కూడా దేన్నయితే చదువుతూ, పెరిగి పెద్దవారవుతూ వచ్చారో.. ఆ 'చందమామ' పత్రికను ఉన్నత శిఖరాలమీద నిలిపిన అలనాటి మేటి బృందంలో, మన కళ్లముందు సజీవంగా మిగిలి ఉన్న ఏకైక చిత్రకారుడు శంకర్ గారే.

కత్తి చేత బట్టి వీపుపై శవాన్ని మోసుకుని నడిచే సాహస చక్రవర్తిని వర్ణించే 'బేతాళ కథలు' ధారావాహికకు గత యాభై ఏళ్లుగా చిత్రాలు గీస్తూ వస్తున్న చిత్రకారులు శంకర్. 1950ల మధ్యలో తొలిసారిగా బేతాళ కథలకు బొమ్మలు గీయడం ప్రారంభించారు. తర్వాత చందమామ పత్రికకు వందలాది చిత్రాలు గీసిన చరిత్రను సొంతం చేసుకున్నారు.

శంకర్ గారు అధికారికంగా రెండు దశాబ్దాలకు ముందే పదవీవిరమణ చేశారు. అయితే ఎప్పుడు రిటైర్ అయ్యిందీ ఆయనకు కాని ఆయన సతీమణికి కాని ఇప్పుడు స్పష్టంగా తెలీదు. అయితే రిటైర్ అయన తర్వాత కూడా చందమామకు చిత్రాలు గీయడం మాత్రం కొనసాగించారాయన. ఆయన జ్ఞాపకశక్తి ప్రస్తుతం అంత చురుగ్గా లేకపోవచ్చు కానీ, ఆయన చిత్రరేఖలు మాత్రం ఇప్పటికీ వాడిగానే ఉంటున్నాయి.

ఈ నవంబర్ మొదటి వారం వరకు ఆయన చందమామ ఆఫీసుకు వెళ్లి పనిచేసేవారు. నవంబర్ 2న ఆయన ఉదయం ఆఫీసుకు వస్తుండగా క్యాబ్‌లోనే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాక కోలుకున్నారు. దీంతో ఇకపై ఇంటినుంచే చందమామ పని చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన 1952లో రూ.300ల వేతనంతో చందమామలో చేరారు.

శంకర్ గారి కథ చందమామతో పెనవేసుకుపోయింది. నిజంగానే చందమామ, శంకర్ ఇరువురూ తమ ఆరోగ్యం గురించి ఆలోచించవలసిన సమయమిది. శంకర్ గారికి విశ్రాంతి అవసరం. చందమామకు కాయకల్ప చికిత్స జరగడం అవసరం.
యాజమాన్యం చేతులు మారాక రెండు నెలల ముందు చందమామ ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్ మూలేకర్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇలా అన్నారు.

"చందమామ ఒక మంచి శక్తివంతమైన బ్రాండ్ మాత్రమే కాదు. చాలామంది గుర్తుపెట్టుకుంటున్న బలమైన బ్రాండ్ కూడా. అందుకనే చందమామను దాని వైభవోజ్వల గతానికి తిరిగి తీసుకుని పోవాలని కృతనిశ్చయంతో ఉన్నాం. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న టెలివిజన్, ఇంటర్నెట్‌లతో మేం పోటీ పడలేం కాని వాటిని ప్రశంసించగలం."

గత ఆరు దశాబ్దాలుగా చందమామ చెన్నయ్‌లోని బి.నాగిరెడ్డి కుటుంబ యాజమాన్యంలో ఉండేది. తర్వాత దానిని ముంబై కేంద్రంగా పనిచేసే కలకత్తా సంస్థ జియోదెశిక్ కొనుగోలు చేసింది. చందమామ కార్యాలయం చెన్నయ్‌లోనే ఉంటోంది. అయితే 50 సంవత్సరాలపాటు వడపళనిలో ఉంటూ పిల్లల పత్రికలను శాసించిన చందమామ తర్వాత రెండు మూడు అద్దె భవనాలకు మారి ప్రస్తుతం ఈస్ట్‌కోస్ట్ రోడ్‌లోని చిన్న నీలాంకరై నివాస ప్రాంతంలో ఉంటోంది.

చందమామ సంథాలి భాషతో పాటుగా మొత్తం 13 భాషల్లో వస్తోంది. సంథాలి తూర్పు భారతంలోని గిరిజనుల భాష. అన్ని భాషలు కలిపి 2.5 లక్షల ప్రతులు చలామణిలో ఉంటున్నాయి.

1980లలో చందమామ ప్రాభవం వెలిగిపోతున్నప్పుడు పత్రిక సర్క్యులేషన్ 9 లక్షలను తాకింది. అది చిత్రా, శంకర్ వంటి చిత్రకారుల పేర్లు లక్షలాది పాఠకులు ఇళ్లలో నానుతున్న సమయం. చందమామ కార్యాలయంలోని చిన్న గదుల్లో వారు తమకు తెలియకుండానే లక్షలాది మంది ఊహలను, జీవితాలను మారుస్తున్న సమయం.

కింది మూడు ఉదాహరణల ద్వారా చందమామ ఆనాడు భారతీయుల జీవితాలపై కలిగించిన ప్రభావాన్ని అంచనా వేయవచ్చు. మన రాష్ట్రంలో ఓ చదువురాని గ్రామీణ మహిళ చందమామ వల్లే రాయడం, చదవడం నేర్చుకుంది. చందమామలో వచ్చే బొమ్మలను చూసి విపరీతంగా ఆకర్షితురాలైన ఈమె ఆ కథలను ఇతరులచే చదివి వినిపించుకోవడమే గాక, వయోజన విద్యా తరగతులలో తన పేరు నమోదు చేసుకుంది కూడా.

తర్వాత కర్నాటకకు చెందిన ఓ కృష్ణ భక్తుడి ఉదంతం ఉండనే ఉంది. ఓసారి గుడికి వెళ్లి పూజలు చేయలేని పరిస్ధితుల్లో చందమామలో శంకర్ గారు వేసిన బాల కృష్ణుడి చిత్రానికి పూజలు సల్పి, ఇంట్లో కృష్ణ విగ్రహానికే పూజలు చేసిన అనుభూతిని పొందారాయన. ఇకపోతే ఒరిస్సాలో ఆ పశుల కాపరి అనుభవం... చందమామ ఒరియా కాపీని ఇతడు ఓ వెదురు బొంగులో దాచి పెట్టేవాడు. శంకర్, చిత్రాల మాదిరి బొమ్మలు గీయాలనేది అతడి జీవిత కాల స్వప్నం మరి.

చందమామలో శంకర్ గారు పనిచేసిన తొలిరోజుల్లో చిత్రా గారు ఈయనకు బాస్‌గాను,ప్రత్యర్థి గాను ఉండేవారట. అయితే తర్వాత్తర్వాత వారి మధ్య ప్రగాఢ స్నేహం అంకురించింది. 1976లో చిత్రాగారు ఆకస్మికంగా మరణించేవరకు చందమామలో చిత్రా, శంకర్‌లు ప్రాణమిత్రులుగా గడిపారు. శంకర్ గారి సమకాలికులైన రాజి (భాషా), వపా కూడా ఇప్పుడు లేరు.

చందమామ పత్రిక పెద్ద సైజులో వచ్చినందువల్ల ఆ చిత్రాలను ప్రస్తుత సైజుకు అనుగుణంగా తిరిగి శంకర్ గారు గీయవలసి వస్తోంది. చందమామ కథల భాండాగారం -ఆర్కైవ్- దానికి పెద్ద నిధిలాగా ఉంటోంది. ప్రపంచంలోనే ఏ సంస్థ కూడా ఇంత పెద్ద కథా సంపదను కలిగిఉండలేదంటే అతిశయోక్తి కాదు.

చందమామ ఎడిటర్ మాత్రమే కాక జియోదెశిక్ సీఈఓగా కూడా వ్యవహరిస్తున్న ప్రశాంత్ మూలేకర్ ఇలా చెప్పారు "మేం ఇప్పుడు ముద్రణకు మాత్రమే పరిమితం కాదల్చుకోలేదు. చందమామ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆరు భాషల్లో వస్తోంది." పైగా జియోదెశిక్ కంపెనీ పిల్లలు కథలను మొబైల్ ఫోన్లలో కూడా చదువుకోడానికి ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ రూపొందిస్తోంది. "మొబైల్ ఫోన్లలో కథలు చదవడం అనే ఆలోచన ప్రాధమిక దశలోనే ఉన్నప్పటికీ, దీనికి స్పందన మాత్రం సానుకూలంగానే ఉంటోంద"ని మూలేకర్ చెప్పారు.

చందమామ 1947లో మొట్టమొదటగా తెలుగు, తమిళ భాషల్లో ప్రచురింపబడింది. బి. నాగిరెడ్డి చెన్నయ్‌లోని జార్జ్ టౌన్‌లో ప్రింటింగ్ ప్రెస్‌ నడిపేవారు. ఈ ప్రెస్‌లో ప్రముఖ తెలుగు మాసపత్రిక ఆంధ్రజ్యోతిని ప్రచురించేవారు. ఈ క్రమంలో ఈయనకు చక్రపాణిగారితో పరిచయం ఏర్పడింది.

స్వాతంత్ర్యానికి పూర్వం శరత్ చంద్ర కథలు, నవలలను బెంగాలీనుంచి తెలుగులో అనువాదం చేస్తూ పేరుపొందిన చక్రపాణిగారు దేశభక్తితో కూడిన యువ పత్రికను ప్రారంభించడానికి నాగిరెడ్డి గారితో పొత్తు కలిపారు. ఆ పత్రిక పొందిన విజయం ప్రేరణగా వారు చందమామను ప్రారంభించారు. ఆవిధంగా ఆరు అణాల ధరతో, 6వేల ప్రతులతో చందమామ మొట్టమొదటి ఎడిషన్ ప్రారంభమయ్యింది.

ప్రారంభంలో 6 వేల కాపీలతో మొదలైన చందమామ సర్క్యులేషన్ క్రమంగా 9 లక్షల కాపీల స్థాయికి చేరుకున్న వైనం ఆశ్చర్యం కొల్పుతుంది. 'అనగా అనగా ఒక రాజు'తో మొదలయ్యే చందమామ కథలు భారతదేశంలో ఆబాలగోపాలాన్ని ఆకట్టుకునేవి. కార్మికుల సమస్య, దాంతోపాటు నాగరెడ్డిగారి కుటుంబంలో ఆస్థి వివాదాలవల్ల చందమామ ప్రచురణ 1990లలో తొలిసారిగా మూసివేతకు గురైంది.

శంకర్ గారి మాటల్లో చెప్పాలంటే అది చందమామకు 'అజ్ఞాతవాసం'. 1998లో చందమామ పబ్లికేషన్ మూతపడింది. దాదాపు సంవత్సరం తర్వాత అది బయటినుంచి వచ్చిన నిధులతో తిరిగి ప్రారంభమైంది. అప్పటినుంచి చందమామ సర్క్యులేషన్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతోంది. చందమామ సర్క్యులేషన్‌ను గణనీయ స్థాయికి పెంచడమే ప్రస్తుత సీఈఓ మూలేకర్ ముందున్న అతి పెద్ద సవాలు. అయితే ఆయన ఆశాభావంతోటే ఉన్నారు.

"మాముందు పెద్ద లక్ష్యమే ఉంది, వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా దీన్ని అధిగమించగలం."

మూలం: 'టైమ్స్ ఆఫ్ ఇండియా' దినపత్రికలో విశ్వనాధ్ ఘోష్ 12-11-09న రాసిన వ్యాసం

చందమామ జ్ఞాపకాలు అమృతాలు!

(ఈ రచన చందమామ జ్ఞాపకాలలో 11 సెప్టెంబరు, 2009 న ప్రచురించబడింది. చివర్లో కాస్త మార్పు.)

జ్ఞాపకం అంటే గతించినది. అంటే మృతం. కొన్ని జ్ఞాపకాలు మాత్రం అమృతాలు. చందమామ జ్ఞాపకాలు. అచ్చంగా అలాంటివే. నేను రెండవ తరగతి చదువుతున్నప్పుడు మా అమ్మ మొట్టమొదటి సారి చందమామ కొని తెచ్చింది, నాకూ మా అన్నకూనూ. వీధిబడి కాబట్టి తెలుగు మీడియంలోనే చదువు. అప్పటికి తెలుగు చదవడం, కొన్ని తెలుగు పద్యాలు నోటికి రావడం, ఇంతే తెలిసింది నాకు. ఆ చందమామ చదవగానే చాలా డవుట్లు వచ్చాయి. జ్ఞాపకమున్నవి చెబుతున్నాను.

౧. భల్లూక మాంత్రికుడు సీరియల్ చివర్లో "ఇంకా ఉంది" అని రాసుంది. ఆ "ఇంకా" ఎక్కడుంది?

౨. మాచిరాజు కామేశ్వరరావు గారి కథలో "కట్నం" అంటే ఏమిటి? అది చెడ్డదా?

౩. చింత చెట్టు మీద దయ్యాలుంటాయా?

౪. రాజుకు "మౌనభంగం" ఎందుకు అయింది? అయితే, తిరిగి చెట్టు ఎందుకు ఎక్కాడు?


ఇదుగో..ఇలా. అమ్మనడిగితే, అమ్మ అంది. అలాగే చదువుతుండండి. ఒక్కొక్కటి అర్థమవుతాయి అని. మొదటి ప్రశ్నకు మాత్రం సమాధానం కనుక్కునే వరకు మాకు కాళ్ళాడలేదు. పుస్తకమంతా వెతికేం, నేనూ మా అన్నా. ఎక్కడో దొరకలేదు. చివరికి మా నాన్న మిత్రులొకాయన చెప్పారు, అది ధారావాహిక, నెల నెలా వస్తుందని.


ఆ తర్వాత కొన్ని రోజులకు "తోకచుక్క" మొదలయ్యింది. ఆ ధారావాహిక మొదలయినప్పుడు మా అమ్మ కళ్ళల్లో మెరుపు నాకిప్పుడూ గుర్తే. (తన చిన్నప్పుడు- అమ్మ మా వయసులో ఉన్నప్పుడు చందమామలో తోకచుక్క వచ్చిందట) . మా అమ్మే నాకు, మా అన్నకు, "ఏకాక్షి, చతుర్నేత్రుడు" అన్న పదాలకు అర్థం వివరించి చెప్పింది.


చందమామ అట్ట మీద "వపా" అని ఎందుకు రాసుంటుందో చాలా కాలం తెలియలేదు. ఓ చందమామ చివరి అట్టను ఫ్రేం వేసి పెట్టుకున్న తర్వాత కూడా. ఆయన "వడ్డాది పాపయ్య" గారని ఎలాగో తెలిసింది.


చందమామ నెలకొక సారి వస్తుంది, రాగానే ఓ అరగంటలో ఎగబడి చదివేస్తామా? తర్వాత నెల రోజులు మళ్ళీ ఎదురుచూపులు. ఇలా కాదని, పాత చందమామల వేటలో పడ్డాం, అన్నయ్యా, నేనూ. మా ఇంటి వద్ద పాత పుస్తకాలు, కిలో లెక్కన కొని, 15 పైసలకొకటి చొప్పున అమ్ముకుని జీవించే వృద్ధ దంపతులు ఉండేవారు.


వారి దగ్గర చందమామలు 50, 60 లలోనివి దొరికేవి. అమ్మ తినుబండారాల కోసం ఇచ్చిన దబ్బుతో వాటిని కొనుక్కునే వాణ్ణి. అవన్నీ ఎక్కెడికెళ్ళాయో? వాటిలో కథలకన్నా, మొదట్లో వచ్చే వాణిజ్యప్రకటనలు భలే ఉండేవి. రెమి పవుడరూ, మంఘారాం బిస్కట్లు, లక్స్ సోపు, సినిమా ప్రకటనలూ ఇలా...


పాత చందమామలకు సంబంధించిన ఓ ముచ్చట. "గుడ్డి న్యాయం" అన్న కథ 25 యేళ్ల నాటి చందమామ కథగా వచ్చిందో సారి. ఆ సంచిక చదువుతున్న సమయంలోనే, ఆ సంచికకు పాతికేళ్ళ క్రితం నాటి సంచికా, అందులో అదే కథా దొరికాయి. అదొక గొప్ప సంబరం, అప్పట్లో ఓ గ్రేట్ అచీవ్ మెంట్ నాకు!


చందమామ జ్ఞాపకాలు తవ్వుకునే కొద్దీ వస్తూనే ఉంటాయి. కొన్ని మా పాపాయి కోసం దాచుకుంటున్నాను,

అరుదయిన చందమామల్లాగే....

అన్నట్లు, "కట్నం" అంటే ఏమిటో, మూడేళ్ళ క్రితం అర్థం తెలిసింది. నేను నా భార్య దగ్గర తీసుకున్న కట్నం ఈ కనిపించే చందమామలే.

మా ఆవిడ ద్వారా నాకు దొరికిన నిధి అది. ఇప్పుడు మా పాపాయికి చెందుతుంది.

చందమామ సీరియళ్ళు - 2

అందుకోండి మరికొన్ని చందమామ సీరియళ్ళు. ఈ విడతలో జ్వాలాద్వీపం, మకరదేవత మరియు విచిత్ర కవలలు పోస్టు చేస్తున్నా.

బొమ్మలు చూస్తున్నారుగా, ఆ బొమ్మలు నొక్కి చూడండి ఏమౌతుందో!!




చందమామ సీరియళ్ళు - 1



నాకోసం పి.డి.ఎఫ్ రూపంలో మార్చి దాచుకున్న చందమామ సీరియళ్ళని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. మీరూ నాలాగే చందమామ అభిమానులయితే ఈ సీరియళ్ళు మీకెంతగానో నచ్చుతాయని నా నమ్మకం.

కంచుకోట కోసం క్రింద బొమ్మ మీద నొక్కండి.











ముగ్గురు మాంత్రికులు కోసం క్రింద బొమ్మ మీద నొక్కండి.












తోకచుక్క కోసం క్రింద బొమ్మ మీద నొక్కండి.






అందమైన చందమామ బంధం!


(సెప్టెంబరు 8న ఆన్ లైన్ చందమామలో ప్రచురించిన జ్ఞాపకాలివి.)

'చందమామ’ అంటే అమాయకమైన, అందమైన నా బాల్యం!


చందమామ పేజీల్లోకి చూపులు సారిస్తే... చెప్పలేనంత పరవశం. ఆ అక్షరాలు ఊహలకు రెక్కలు తొడిగేవి. అద్భుత కథల లోకాల్లోకి అలవోకగా తీసుకెళ్ళేవి. అంతులేని కుతూహలాన్ని రేకెత్తించేవి.


ఉత్కంఠ కలిగించే కథలూ, ధారావాహికలూ; కథలో పాత్రలకు ప్రాణం పోసే అద్భుతమైన రంగుల బొమ్మలూ... !


ముఖ్యంగా జానపద, పౌరాణిక ధారావాహికల్లో పేజీ సైజులో మురిపించే అపురూప చిత్రాలు నా చిన్ననాటి స్మృతులను వర్ణ రంజితం చేశాయి.


అవి ఏవో మామూలు బొమ్మలని అనిపించవెప్పుడూ. జీవం తొణికిసలాడుతూ కథల్లో భాగమౌతాయి. చాలాసార్లు కథలకే కొత్త అందాలను సంతరిస్తాయి. ఒక్కోసారైతే ఆ కథలనే మించిపోయేంతగా మురిపిస్తుంటాయి!


‘ఎప్పుడైనా అరణ్యాలను చూశావా?’ అని ఎవరైనా అడిగితే ‘లేదు!’ అని చప్పున చెప్పాలనిపించదు.

ఎందుకంటే కీకారణ్యాలూ, కారడవులూ నాకు సుపరిచితమే అనిపిస్తుంది. అందమైన ఆకులూ, పూలూ, ఫలాలతో పొడుగ్గా, విశాలంగా పెరిగిన వృక్షాలూ; ఆ చెట్లను పెనవేసుకుపోయే ఊడలూ; నేల మీద హొయలు పోయే రెల్లు పొదలూ ... సుదూరంగా కొండలూ ... ఇలా అనంతమైన ప్రకృతిలో ఒదిగిన అరణ్య సౌందర్యం చందమామ బొమ్మల్లో అద్భుతంగా సాక్షాత్కరిస్తుంది.



చందమామ సంపాదకీయం ఉండే ‘హంసల బొమ్మల’ పేజీ చూడటం ఇష్టంగా ఉండేది. అంత చిన్న వయసులో కూడా ఆ పేజీపైన ఉండే ‘చక్రపాణి’, ‘నాగిరెడ్డి’ గార్ల పేర్లు బాగా గుర్తుంచుకున్నాను.


మా స్కూలు అసెంబ్లీలో ‘విద్యార్థి వాణి’ పేరుతో ఆ రోజు దినపత్రికలో వచ్చిన వార్తలను పిల్లలతో చదివించేవారు. నేను ఐదో తరగతి చదువుతున్నపుడు ఓ రోజు (1975 సెప్టెంబరు చివర్లో).. ‘చక్రపాణి’ గారు చనిపోయారనే వార్త విన్నాను. ఎంతో దిగులేసింది. ‘ఇక చందమామ రాదా?’ అని చాలా బాధపడిపోయాను.


‘బేతాళ కథలు’ శంకర్ బొమ్మ ఎందరో అభిమానులకు మల్లే నాకు కూడా ప్రీతిపాత్రం. కథ చివర - (కల్పితం) అని ఉండేది. అది విచిత్రంగా తోచేది. అదొక్కటే కల్పితమా, మిగిలినవి కావా అనే బుల్లి తర్కాలు కొంచెం పెద్దయ్యాక వచ్చాయి. ఆ కథ ముగిసే పేజీలో ఉండే శంకర్ బొమ్మ- ‘బేతాళుడు మెలి తిరిగిన తోకతో చెట్టు మీదకు దూసుకువెళ్ళటం, ఆ వెనకే విక్రమార్కుడి భంగిమ’ గొప్పగా అన్పించేవి.


చందమామలో వచ్చిన ‘రాతి రథం’, ‘శిథిలాలయం’, ‘యక్ష పర్వతం’ ధారావాహికలు నా స్మృతి పథంలో ఉన్నాయి. ఖడ్గ వర్మ, జీవదత్తుడు అప్పటి నా హీరోలు. వాళ్ళిద్దరి ఆహార్యం వైవిధ్యంగా, ఎంత చూడముచ్చటగా ఉండేదో!



‘విచిత్ర కవలలు’ (రెండోసారి ప్రచురణ) చదవటం మాత్రం బాగా గుర్తు. వీటి రంగుల బొమ్మలు సమ్మోహితం చేశాయి. ఆ సీరియల్ మొదటి ప్రచురణకు నలుపు-తెలుపు బొమ్మలు వేసింది చిత్రా. ఆ ధారావాహిక రెండోసారి ప్రచురించినప్పుడు చిత్రా సరికొత్తగా, మరింత మెరుగ్గా రంగుల బొమ్మలు వేశారు. వీటిని ఇన్నేళ్ళయినా మర్చిపోలేదు.


తర్వాత ప్రచురించిన ‘మాయా సరోవరం’ కూడా క్రమం తప్పకుండా చదివాను.



ఎప్పుడో దశాబ్దాల క్రితం ప్రచురించిన మెగా సీరియల్స్ తోకచుక్క, ముగ్గురు మాంత్రికులు, కంచుకోట, జ్వాలా ద్వీపం, మకర దేవత లాంటి ధారావాహికలను ఈ మధ్యనే చదివాను. వీటి సృష్టికర్త దాసరి సుబ్రహ్మణ్యం గారిని విజయవాడలో కలుసుకోవటం మర్చిపోలేని అనుభవం.


క్కని కవర్లో ముస్తాబై పోస్టులో మా స్కూలుకు వచ్చే చందమామ కోసం ప్రతి నెలా ఆత్రంగా ఎదురుచూసేవాణ్ణి. మంత్రముగ్ధం చేసే వ.పా. ముఖచిత్రం, దానిపై సన్నని తెలుపు బోర్డరుతో ఎర్రని త్రికోణాకృతి... దానిలో ఉండే 1 రూపాయి... వీటన్నిటినీ తనివి తీరా చూడటం వల్లనేమో మనసులో ముద్రించుకుపోయాయి.


సింగిల్ పేజీ కథలను ఆలస్యం చెయ్యకుండా చకచకా చదివేసేవాణ్ణి. ‘రామాయణ, మహా భారత’ గాథలను సచిత్రంగా చదవటం వల్ల నాకు ఎప్పటికీ గుర్తుండిపోయాయి. పురాణేతిహాసాలను ‘పనిగట్టుకొని చదివే’ పని లేకుండా వాటి గురించి కొంత అవగాహన పెంచింది చందమామ.



నా బాల్యంతో ముడిపడిన చందమామలనూ; నేను పుట్టకముందు ప్రచురితమై నేను గతంలో ఎన్నడూ చూడని చందమామలనూ చదవగలిగానంటే ఇంటర్నెట్టే కారణం. తొలి చందమామ సంచికను చూడగలగటం (డిజిటల్ రూపం అయితేనేం? ) ఎంత గొప్పగా అనిపించిందో!


మూడు సంవత్సరాల క్రితం కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు ‘ఈమాట’ వెబ్ మ్యాగజీన్ లో రాసిన ‘చందమామ జ్ఞాపకాలు’ వ్యాసం చదివాను. అప్పటివరకూ చందమామ గురించి నాకు తెలియని ఎన్నో విశేషాలు గ్రహించాను. చందమామకు అద్భుత ముఖచిత్రాలను అందించిన, ‘మహా భారతం’ పాత్రలకు రూపురేఖలు దిద్దిన- ఎంటీవీ ఆచార్య అనే గొప్ప చిత్రకారుడి గురించి రోహిణీప్రసాద్ గారి వ్యాసమే పరిచయం చేసింది.


తెలుగు బ్లాగ్లోకం పరిచయంతో- త్రివిక్రమ్, నాగ మురళి, బ్లాగాగ్ని (ఫణి), శివరామ ప్రసాద్... వీరందరి కృషి తెలిసింది.


సజీవమైన, చక్కని తెలుగు వాడుక భాష చందమామ ద్వారానే నాకు అందింది. బాల్యంలోనే నాలో తరగని పఠనాసక్తిని పెంచింది చందమామే!


పది సంవత్సరాల క్రితం చందమామ ప్రచురణ ఆగిపోయినప్పుడు ఆత్మీయ నేస్తం దూరమైన బాధ.. మళ్ళీ ప్రచురణ ఆరంభమైనపుడు ఎంతో సంబరం !


చందమామ అంటే అక్షరాల్లో సంపూర్ణంగా వ్యక్తం కానంత అపురూపమైన అనుబంధం!

16, నవంబర్ 2009, సోమవారం

తాతయ్య కథలు

ప్రస్తుతం ఉన్న కుటుంబ వ్యవస్థలో, తాతయ్యలు, బామ్మలు, అమ్మమ్మలు ఎక్కువగా కనపడరు. వాళ్ళెక్కడో పల్లెలోనో,పట్నంలోనో లేదా ఏ వృధ్యాప్య గృహంలోనో ఒంటరిగా కాలగడుపుతుంటే, పిల్లలు, మనవలు మనవరాళ్ళు ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో మనవలకు మనవరాళ్ళకు తాతయ్య ఎవరో తెలియదు, తాతయ్యకు వీళ్ళను చూసే అవకాశం వచ్చి ఉండదు. మరికొన్ని దురదృష్ట సందర్భాలలో మనవలకు మనవరాళ్ళకు తమ తాతయ్య మాట్లాడే భాష అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు విదేశాలలో పెరిగి ఉంటారు. నేటి ఈ కాలంలో, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దాదాపుగా కనుమరుగయ్యింది.

ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే, పూర్వపు రోజులలో 50-60 దశకాలలో కూడ, మనకున్న చక్కటి కుటుంబ వ్యవస్థను ప్రతిబింబిస్తూ, చందమామ వారు "తాతయ్య కథలు" అన్న శీర్షిక పేరుతో అనేక కథలు ధారావాహికగా ప్రచురించారు. ఈ చక్కటి శీర్షిక 1960 ఆగస్టు నెలలో మొదలయ్యి 1961 మే నెలవరకు వేశారు. ఆ తరువాత మే 1962 నుండి జులై 1963 వరకు ధారావాహికగా ప్రచురించారు. ఆ తరువాత నవంబరు 1968, ఫిబ్రవరి మరియు ఏప్రిల్ 1969 నెలలో కూడ ఈ కథలను పాఠకులకు అందించారు.

ఈ కథలలో మొట్టమొదటి కథ పేరు అదృష్టం, చిట్టచివరి కథ పేరు మట్టి కాళ్ళు.

తాతయ్య కథల రచయితలు

సర్వశ్రీ
సి శేషాద్రి
చల్లా లక్ష్మి గారు
ఆర్ బయవ రెడ్డి
ఎ వ్ శేషాద్రి
మాధవరెడ్డి చంద్రశేఖర్

వీరిలో ఎక్కువ తాతయ్య కథలను వ్రాసినవారు సి శేషాద్రి గారు. ఈ శీర్షికకు బొమ్మలు వేసినది ప్రముఖ చిత్రకారులు చిత్రాగారు. అప్పుడప్పుడు శంకర్ గారు కూడ బొమ్మలు వేశారు.

ముఖ చిత్రం చూడండి తాతయ్య మెల్లిమెల్లిగా ముసలివాడయినట్టుగా వేశారు. చివరి భాగంలో తాతయ్య చాలా ముసలివాడయిపోయాడు. తాతయ్య నోటిద్వారా చక్కటి కథలను అందించిన చందమామవారు పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో పాటుబడ్డారు.
చందమామ లో తాతయ్య కథలు చదవాలని ఉన్నదా! చందమామ వారు వారి సైటులో చాలా పాత చందమామలను ఉంచారు. చక్కగా అక్కడకు వెళ్లి చదువుకోవచ్చు.

చందమామ జ్ఞాపకాలు

అలరించే చందమామల కలెక్షన్లో కొంత
చందమామ జ్ఞాపకాలు! జ్ఞాపకం తెచ్చుకోవాలా చందమామ గురించి. చందమామ ఎప్పుడూ నాతోనే ఉన్నది. అందులో కథలు ముఖ్యంగా బొమ్మలు. బొమ్మలు లేని చందమామను ఊహించుకోండి!! ఏంత దిగులేస్తుందో .

1964-65 ప్రాంతాల్లో మా మామయ్యగారింటికి వెళ్ళినప్పుడు, వాళ్ళింట్లో మొట్టమొదటిసారి చందమామ దర్శనం. ఇప్పటికి గుర్తు అది అట్టలు లేని పాత చందమామ. ఆందులో రాకాసి లోయ ధారావాహిక ఉన్నది. రోజంతా ఆ పుస్తకం పట్టుకుని వదల్లేదు. బొమ్మల్ను తరచి తరచి చూస్తూ, ఇంతకుముందు చూసినప్పుడు కనిపించని కొత్త విషయాలు కనిపెడుతూ, కథలను కొద్ది కొద్దిగా చదివాను. ఆ తరువాత అప్పుడప్పుడు ఒకటి రెండు చందమామలు చదివిన గుర్తు.

1966లో, మా నాన్నగారు, నా పుట్టినరోజు నాడు, చందమామ పట్టుకుని వచ్చి నాకు బహుమతిగా ఇచ్చారు(పైన ఉన్న బొమ్మ ఆ చందమామదే) అది మొదలు, మా ఇంట్లో చందమామ ఎప్పుడూ ఉంటూనే ఉన్నది. అప్పట్లో చందమామ 75 పైసలు ఉండేది. ప్రతి నెల ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం, చందమామ వచ్చే తేదీల ప్రకారం స్కూలు నుంచి వచ్చేప్పుడు చెవిటి దుర్గయ్య షాపు మీదగా రావటం. అనుకున్న సమయానికి రాకపోతే ఎప్పుడు వస్తుందని, దుర్గయ్యను పీడించటం! చందమామ వచ్చినట్టుగా కనపడగానే, ఉరుకులు పరుగుల మీద ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకుని వచ్చి, కొనుక్కుని, బొమ్మలు చూసుకుంటూ తిరిగి వెళ్ళటం, అదొక మరవలేని ఆనందకరమైన అనుభవం.

నిజానికి, అప్పట్లో ఇంకా వ్రాయటం, చదవటం నేర్చుకునే రోజులలో,చక్కటి భాషలో ఉన్న చందమామ కథలను చదవటం, నాకు ఎంతగానో ఉపకరించింది. తెలుగు తప్పులు లేకుండా వ్రాయటం అబ్బింది. అలాగే మంచి, మంచి వాడుక పదాలను కూడగట్టుకుని కొంతలో కొంత భాష మీద పట్టు సంపాయించటానికి చందమామ దోహదపడిందనే చెప్పలి. ఇదంతా కూడ మనమేదో నేర్చుకుంటున్నామన్న భావనతో కాదు, అలా అలవోకగా, చందమామ కథలు చదువుతుండగా నాకు జరిగిన ఉపకారం. స్కూలులో పిల్లలలో చాలా మంది గ్రంథాలయానికి వెళ్ళి అక్కడ పడిగాపులు పడి చదివే పుస్తకం, నేను ఇంట్లోనే హాయిగా అనేక సార్లు చదివెవాణ్ణి.


కొంతకాలానికి, శిధిలాలయం ధారావాహిక జరుగుతున్నాప్పటికి కొంత జ్ఞానోదయం కలిగి ధారావాహికను పుస్తకం నుంచి విడిచేసి ఒక చోట పైలు చెయ్యటం మొదలు పెట్టాను, అది కూడ మధ్యలో ఎక్కడనుంచొ. కాని, అంతకుముందు, చందమామలను సరిగ్గా జాగ్రత్త పరచనందున, చుట్టాల్లోనే తలా ఒక్కళ్ళు పట్టుకు పోయి, చిరిగిపోయి అదృశ్యమైనాయి. ఇక నేను 13-14 ఏళ్ళు వచ్చేప్పటికి చందమామలను జాగ్రత్తగా ఉంచి అల్మరాకు తాళం వెయ్యటం మొదలుపెట్టి కాపాడేవాణ్ణి. చివరకు మా నాన్న అయినా సరే నన్ను ఆడిగి తీసుకుని, మళ్ళీ తిరిగి ఇచ్చేవరకు వదిలే వాణ్ణికాదు. పుస్తకం అట్టగాని, పేజిలుగాని నలగనిచ్చేవాణ్ణికాదు. ఇలా శ్రధ్ధ తీసుకుని కొంత చందమామ నిధిని పోగుచేసుకున్నాను. మా చుట్టాలో ఒక అమ్మాయి(అక్కయ్య అవుతుంది) ఒక రోజున, "వీడు ఒట్ఠి పిసినారి, చందమామలు అడిగితే ఇవ్వడు" అన్నది. నాకు చాలా కోపం వచ్చి, "చందమామ కొని దాచుకునేవాడు పిసినారా, లేక కొనకుండా ఎవరింట్లోనో చదువుదామని వెంపర్లాడేవాళ్ళు పిసినారా" అని కఠినంగా జవాబు చెప్పాను. ఇప్పటికి ఈ మాట చెప్పుకుని మేము కలసినప్పుడు నవ్వుకుంటాము.

1973-74 సంవత్సారాలు వచ్చేప్పటికి పోయిన పాత చందమామలు సంపాయించాలని ఒక దుగ్ధ, తీవ్రమైన అకాంక్ష ప్రారంభమయింది. మా నాన్న అప్పుడు (నేను కాలేజీలో చదువుకునే రోజులు), రోజూ 50 పైసలు ఇచ్చెవాడు (స్కూల్లో ఉన్నప్పుడు 5 నుంచి 10 పైసలు). ఆ రోజులలో అదే గొప్ప !! ఈ డబ్బులు ఖర్చు చెయ్యకుండా జాగ్రత్తపరచి, రోజూ సాయంత్రం టైపు క్లాసు తరువాత విజయవాడలో గాంధీనగర్లో ఉన్న సెకండ్ హాండ్ పుస్తక షాపులన్ని గాలించేవాణ్ణి. నా ఆసక్తి గమనించి, వాళ్ళుకూడ పాత చందమామలు వస్తే నాకోసం ఉంచేవాళ్ళు. ఇలా పుస్తకం 30 పైసలు, 40 పైసలు కొండకచో 50పైసలు పెట్టి అనేక పాత చందమామలు 1968నుంచి పూర్తిగానూ, 1953 నుంచి కొన్ని పోగుచెసాను. శిధిలాలయం ధారావాహిక పూర్తిగా ఒకే బైండుగా తయారు చేసాను. అలాగే, మహాభారతం మొత్తం మొదటినుంచి చివరివరకు ఇప్పటికి ఉన్నాయి. కాకపోతె శిధిలాలయం శిధిల స్థితిలో ఉన్నది.

చందమామలో ఉన్న కథలు చదివి పాడైపొయ్యను అంటారు కొంతమంది. అంటే వాళ్ళ దృష్టిలో న్యాయంగా బ్రతకటం, లంచాలు పట్టకపోవటం,ధైర్యంగా నా అభిప్రాయాలు చెప్పటం, పాడైపోవటం అన్నమాట. ఏమీ పరవాలేదు, చందమామ కథలు నాకిచ్చిన చక్కటి ప్రవర్తనా సరళి,జీవితంలో ఎంతగానో ఉపకరించింది, హాయిగా బ్రతకటానికి అనువైన మార్గాన్ని ఎంచుకునే అలోచనా బలం కలిగింది.

చందమామలో బొమ్మలను ఉదహరించకపోతే, చందమామ జ్ఞాపకాలేమిటి. ఏమి బొమ్మలండి! ఒక్కసారి చూస్తే సరిపోతుందా ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. చిత్రా గారు ధారావాహికలకు, ఇతర కథలకు వేసిన బొమ్మలు, మొదటినుంచి చివరివరకూ ఒకేలాగ ఉండే పాత్రల బొమ్మలు అబ్బురపరచేవి. శంకర్ గారు వేసే పురాణధారావాహికల బొమ్మలటే నాకు ప్రాణం. ఏ పురాణ పాత్ర ఎలా ఉంటుంది అన్న విషయం మరి ఆయన ఏ గ్రంధాలు చదివి, శొధించి వేశేవారోగాని, నాకు మాత్రం అన్ని పురాణ పాత్రలు సుపరిచియం కావటానికి కారణం, వారి బొమ్మలే. ఇక వడ్డాది పాపయ్యగారి బొమ్మల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన వేసిన ముఖ చిత్రాలు చందమామకు ఎంతగానో వన్నె తెచ్చినాయి. కొత్త చందమామను షాపువాళ్ళు వరుసగా పెట్టినప్పుడు, ఆ దుకాణానికే గొప్ప అలంకరణ చేసినట్టుగా ఉండేది. పాపయ్యగారు, ఆయనకి మాత్రమే సాధ్యమైన శైలిలో, అద్భుతమైన రంగుల్లో, వేసిన బొమ్మలు అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది.

నాకెప్పుడన్నా చీకాకు కలిగినప్పుడు చందమామ బొమ్మలు చూస్తూ స్వాంతన పొందుతాను. ఇంతటి అద్భుతమైన బొమ్మలను సేకరించి, ఒక పుస్తకం వెయ్యగలిగితే చందమామ వారు తెలుగు సాహిత్యానికి చిత్రలేఖన కళకు ఎంతగానో సేవ చేసినవారిగా చరిత్రకు ఎక్కుతారు.

ఇలా వ్రాసుకుంటూ పోతే చందమామ జ్ఞాపకాలు అనేకం. ఒక్క మాటలో చెప్పాలంటే చందమామ నా చిన్నప్పటి నేస్తం, గురువు కూడ.
***************************************
పైన వ్రాసిన నా జ్ఞాపకాలు చందమామ వారు తెలుగు ఆన్-లైన్ ఎడిషన్ లో ప్రచురించారు. ఈ క్రింది లింకు ద్వారా చూడవచ్చు.

చందమామలో ప్రచురణ
***************************************


బేతాళ కథలు - కధా కమామిషు

చందమామలో మనమందరమూ బేతాళ కథలు చదివేఉంటాము. ఆ కథ మొదలు పెట్టటమే విచిత్రంగా ఉంటుంది. ఆ కథ ఆవిధంగా ఎందుకు మొదలవుతుంది తెలియాలంటే మొట్టమొదటి బేతాళకథ చదవాలి. బేతాళకథల మీద మునుపు నేను తెలుగు వికీలో వ్రాసిన వ్యాసం,కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులతో, ఇక్కడ పున: ప్రచురిస్తున్నాను.
================================================
గుణాఢ్యుడు రచించిన "బృహత్ కథ" బేతాళకథలకు మూలం. ఈ కథలను కొంతకాలము తరువాత "కథాసరిత్సాగరం" సంపుటి లోనికి చేర్చారు. మూలంలో 25 కథలు మాత్రమే ఉన్నాయి. చివరి కథలో బేతాళుడి ప్రశ్నలకు విక్రమార్కుడు జవాబులు చెప్పలేకపోతాడట. అంతటితో ఆ కథలు సమాప్తమవుతాయి. కాని, బేతాళ కథలలోని చివరి కథ అందుబాటులో ఉన్నప్పటికీ, చందమామలో ఇంతవరకు వెయ్యలేదు. అది కాస్తా వేసేస్తే శీర్షిక ఇన్నాళ్ళు ఉండేది కాదు, ఇంత పేరు ప్రఖ్యాతులు గడించేదికాదు
.
మూలకథ
గోదావరీ తీరాన, ప్రతిష్ఠానపురానికి విక్రమార్కుడు రాజు. ఒక భిక్షువు ఆయనకు రోజూ ఒక పండు లోపల రత్నము పెట్టి ఇస్తూ, ఆయన ప్రాపకం సంపాదించటానికి ప్రయత్నించేవాడు. అలా పండులో రత్నం పెట్టి ఇస్తున్నట్లు, కొన్ని రోజుల వరకు రాజుకు తెలియదు. ఆ విషయం తెలిసిన రోజున, విక్రమార్కుడు భిక్షువు యొక్క విశ్వాసానికి మెచ్చి, కారణం చెప్తేగాని మర్నాడు పండు తీసుకోనని చెప్తాడు. దానికి బిక్షువు, తను ఒక మంత్రాన్ని సాధించదలచాననీ అందుకు ఒక వీరుడి సహాయం కావాలనీ, విక్రమార్కుని నుండి తానా సహాయం ఆశిస్తున్నాననీ అడుగుతాడు. విక్రమార్కుడు తగిన సహాయం చెయ్యటానికి ఒప్పుకుంటాడు. బిక్షువు, రాబోయే కృష్ణ చతుర్దశి రాత్రి చీకటి పడగానే రాజును మహా శ్మశానానికి రమ్మంటాడు.

అలాగే విక్రమార్కుడు వెళ్తాడు. అక్కడే ఉన్న భిక్షువు, రాజును శింశుపా వృక్షం మీద వేళ్ళాడుతున్న పురుషుడి శవం తెచ్చి, తన సమీపంలో ఉంచమంటాడు. రాజు ఆ చెట్టు ఎక్కి వేళ్ళాడుతున్న శవాన్ని తాడు కోసి కింద పడవేస్తాడు. కిందపడగానే, శవం ఏడవటం మొదలుపెడుతుంది. బేతాళుదు ఆ శవాన్ని ఆవహించి ఉన్న సంగతి తెలుసుకోలేక విక్రమార్కుడు, ఎందుకు నవ్వుతావు, పోదాం పద అంటాడు. రాజుకు ఇలా మౌనభంగం అవగానే నేలమీది శవం మాయమై, మళ్ళీ చెట్టు మీద వేళ్ళాడుతూ కనపడుతుంది. విక్రమార్కుడు బేతాళుడు పూని ఉన్న ఆ శవాన్ని మళ్ళీ కిందపడేసి, భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవటం మొదలు పెడతాడు.

అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీకు వినోదంగా ఉండటానికి ఒక కథ చెబుతాను విను" అంటూ ఒక కథ చెప్తాడు. కథ చివర ప్రశ్న వేసి, "ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పక పొయ్యావో, నీ తల పగిలి పోతుంది" అంటాడు. విక్రమార్కుడు తన మౌనం వీడి ప్రశ్నకు తగిన సమాధానం చెపుతాడు. ఆ విధంగా, విక్రమార్కుడికి మౌనభంగం జరగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తెరిగి చెట్టు ఎక్కుతాడు.
చందమామలో ధారావాహిక
మొట్టమొదటగా బేతాళ కథలను చందమామలో మొదలు పెట్టినది సెప్టెంబరు 1955లో. ఈ కథలు ఎంతో కాలం చందమామ పత్రికలో కథా స్రవంతిగా వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. ఇదొక చిత్రమైన కథల సంపుటి. ప్రతి మాసం ఒక సంఘటన (విక్రమార్కుడు చెట్టుమీదనుంచి శవాన్ని దించి, భుజాన వేసుకొని) తో మొదలయ్యేది, అలాగే, మరొక సంఘటన (విక్రమార్కుడికి ఆ విధంగా మౌన భంగం కాగానే, శవంలోని బేతాళుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు)తో అంతమయ్యేది. ప్రతి కథలోనూ, విక్రమార్కుడు మోస్తున్న శవంలోని భేతాళుడు, విక్రమార్కుడికి "శ్రమ తెలియకుండా విను" అని ఓ చక్కటి కథ చెప్పేవాడు. చివరకు, ఆ కథకు సంబంధించి చిక్కు ప్రశ్న/లు వేసేవాడు. అలా ప్రశ్నలు వేసి, విక్రమార్కుడికి ఒక హెచ్చరిక చేసేవాడు "ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసీ చెప్పకపొయ్యావో, నీ తల వెయ్యి వక్కలవుతుంది" అని. మౌనం వీడితే వ్రత భంగం అయ్యి, వచ్చినపని చెడుతుంది, సమాధానం తెలిసీ చెప్పకపోతే ప్ర్రాణానికి ప్రమాదం. పాపం విక్రమార్కుడు ఏం చేస్తాడు? తప్పని పరిస్థితులలో, తన మౌనం వీడి, ఆ చిక్కు ప్రశ్నకు చాలా వివరంగా జవాబు చెప్పేవాడు. ఈ విధంగా ప్రతినెలా శవంలోకి బేతాళుడు ప్రవేశించి, కథ చెప్పి, ప్రశ్నలడిగి, హెచ్చరించి, విక్రమార్కుడికి మౌన భంగం చేసి, అతడు వచ్చిన పని కాకుండా చేసేవాడు. అలా పై నెలకి కథ మొదటికి వచ్చేది.

బేతాళ కథ మొదటి కథ ఎలా ఉంటుందో అన్న పాఠకుల అసక్తిని గమనించి గాబోలు, చందమామ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, 1972 జూలైలో మొదటి బేతాళకథ రంగులలో పునర్ముద్రించారు. ఈ మొట్టమొదటి కథకు, పున:ముద్రణలో పేరు పెట్టలేదు. కాని మొదటి ముద్రణలో ఈ కథ పేరు "మహామంత్రి మనోవ్యాధి". ఆ తరువాత కథలన్నిటికీ కథ మొదటి పుటలో పైన కథ పేరు, కింద "బేతాళ కథలు" అని వేయసాగారు. బేతాళ కథలకు మొదటి పేజీలో వేసే బొమ్మ చాలా సార్లు మార్చి మార్చి వేసారు .

అలాగే కథ చివరి పుటలో, బేతాళుడు ఎగిరి పోతూ ఉండటం, విక్రమార్కుడు కత్తి దూసి వెంట పడుతుండటం కూడా చాలా రకాలుగా వెయ్యబదినది.

శీర్షికగా బేతాళ కథలు

బేతాళ కథలను చందమామలో సెప్టెంబరు 1955 సంచికలో మొదలు పెట్టారు. అసలు, బేతాళ కథలు పాతిక మాత్రమే! కాని, చందమామలో వందల కొలది మామూలు కథలను (ఇప్పటివరకు 600 పైగా) బేతాళ కథలుగా ఎంతో నేర్పుగా మార్చి ప్రచురించారు. సాధారణమైన పిల్లల కథల్లోంచి, కథ చివర, ప్రతి నెలా, ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం, దానికి చక్కటి సమాధానం చెప్పించడం, సామాన్య విషయం కాదు. అతి కష్టతరమైన ఈ పనిని, దశాబ్దాల పాటు నిరాఘాటంగా కొనసాగించడం, చందమామ నిబద్ధతకు, నైపుణ్యానికి, చక్కటి నిదర్శనం. తెలుగు జానపద సాహిత్యంలోని పేరొందిన ఒక కథా సంపుటిని తీసుకుని, ఆ కథలను ప్రచురించటమే కాక, అదే పంధాలో అనేక ఇతర కథలను ప్రచురించి, చిన్న పిల్లలకు(పెద్దలకు కూడ) చక్కటి ఆలోచనా పద్ధతి, సందేహాలను ప్రశ్నల రూపంగా వ్యక్తపరచటం,తర్కంతో కూడిన చక్కటి సమాధానాలు ఇచ్చే నేర్పరితనం ఈ శీర్షిక ద్వారా చందమామ వారు అందచేశారు.

కథా సంపుటి లేదా ధారావాహికగా మొదలు పెట్టబడినా, చివరకు ఒక కథా శీర్షికగా స్థిరపడినాయి ఈ బేతాళ కథలు.చిన్న చిన్న ధారావాహికలు మొదలు పెట్టినప్పుడల్లా తమ సంపాదకీయంలో ఆ ధారావాహిక గురించి కొద్దో గొప్పో చందమామలో వ్రాసే వారు. కాని చారిత్రాత్మకమైన బేతాళ కథల ధారావాహిక (శీర్షిక) చడి చప్పుడూ లేకుండా మొదలు పెట్టేశారు. మరి అప్పట్లో ఈ కథలను ఎలా వేయ్యలో ఇంకా నిర్ణయించుకోలేదేమో. చివరికి , ఇలా ఎటువంటి ప్రకటన లేకుండా మొదలు పెట్టబడినా, చందమామలోని అన్ని ధారావాహికలలోనూ ఎక్కువరోజులు ప్రచురించబడింది, ఇంకా ప్రచురిస్తూనే ఉన్నారు. భారత పత్రికా చరిత్రలో ఇది ఒక మైలురాయి (రికార్డు)అని నా అభిప్రాయం. తెలుగు పత్రికా చరిత్రలో అన్ని శీర్షికలకన్న ఎక్కువకాలం ప్రచురించబడిన, ఇంకా ప్రచురించబడుతున్న శీర్షిక ఇది ఒక్కటే అయి ఉండవచ్చును.ఈ చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక ప్రసిద్ధ రచయిత, చందమామకు ఎక్కువకాలం సంపాదకుడిగా పనిచేసిన, శ్రీ కొడవటిగంటి కుటుంబరావు కృషి ఎంతగానో ఉన్నది.

బేతాళకథలు ధారావాహిక అనండి లేదా శీర్షిక అనండి, ఏది ఏమైనా కథలను ఏకధాటిగా ఇంత ఆసక్తికరంగా, పిల్లలకు(అనేకసార్లు పెద్దలకే) తెలివితేటలు పెంపొందించే విధంగా ప్రచురించటం నభూతో నభవిష్యతి.

అస్సలు చందమామలో మొట్టమొదటగా ముద్రించబడిన బేతాళ కథ సెప్టెంబరు 1955 లో . ఇదే కథను రంగులువేసి చందమామ స్వర్ణోత్సవ సందర్భంగా 1972 జులై లో పున:ముద్రణ చేసారు.

శిధిలాలయం ధారావాహిక-ఒక సమీక్ష

నా చిన్నతనంలో(నేను సెకండ్ ఫారం అంటే 7వ తరగతి చదుతున్నప్పుడు)జనవరి 1968లో ఈ ధారావాహిక మొదలై, సెప్టెంబరు, 1970 వరకు కొనసాగింది. ఈ ధారావాహికలో ముఖ్య పాత్రలు

1. శిఖిముఖి
2. విక్రమకేసరి
3. శిధిలాలయ పూజారి
4. నాగుమల్లి
5. జాంగ్లా

శిఖిముఖి
నేనొక శబర కుర్రాణ్ణి. మా నాన్న శివాలుడు, మంచివాడు నెమ్మదస్తుడు. కుంభారమిట్ట మా పల్లె, హాయిగా కష్టపడి పనిచేసుకుంటూ అడవి తల్లి ఒడిలో సుఖంగా బ్రతుకుతున్న మాకు ఒక దుష్ట గ్రహం దాపురించింది. వాడే శిధిలాలయ పూజారి. ఓ రోజున నేను నా మంచి అనుచరుడు ఎర్రగండు తో కలసి వేట సాగిస్తున్నాను . ఎవరో రాజకుమారుడల్లే ఉంది, కవచం, శిరస్త్రాణం ధరించి, ఆయుధాలతో గుర్రం మీద వస్తున్నాడు. ఆయన మీదకి ఒక దొంగల గుంపు దాడి చేయ్యటం చూసేప్పటికి నా రక్తం మరిగింది. నేను అతనికి సహాయం వెళ్లాను. ఇద్దరం కలిసి ఆ దొంగలను తరిమి కొట్టిన తరువాత అతన్ని , మా పల్లె తీసుకెళ్ళాను. అప్పటినుంచి మొదలయ్యిన మా స్నేహితం ఎల్ల కాలం కొనసాగింది. పల్లె చేరినాక, అతను మా నాన్న స్నేహితుని మనవడని తెలిసింది. ఈ మధ్యే మా మధ్య తిరుగుతూ, లేనిపోనివన్ని బోధించి ఇతర తెగల కుర్రాళ్ళని చెడగొడుతున్న దుష్ట గ్రహం వ్యక్తే అతనిమీద దాడి చేయించాడట. అతనిదగ్గర మరింకెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న ఆడవిలో శిధిలాలయం గురించిన ఆనవాళ్ళు వెళ్ళే మార్గపు రేఖలు ఉన్నాయట వాటికోసరం. సరే, మా అయ్యా తన స్నేహితుడి మనవడికి సాయం చెయ్యమని చెప్పాడు. ఈలోగా ఈ పూజారిగాడు, మా గ్రామంలో అగ్ని ప్రమాదం సృష్టించి నాకు పూర్తి కోపం తెప్పించాడు. వాడికి ఆశ్రయం ఇస్తున్న గండుపోతు పని పట్టి (ఆయనే నాకు పిల్లనిచ్చిన మామ అయ్యాడు తరువాత), ఆయన కూతురు, నాగుమల్లిని పూజారి బారినుంచి కాపాడి, విక్రమకేసరితో ప్రయాణం కట్టి, మధ్యలో పూజారి కుక్క పెట్టిన అన్ని అడ్డంకులు తొలగించుకుని, శిధిలాలయం కనుగొన్నాము. వారి తాతగారి కోరికను తీర్చాం. నాకు నాగుమల్లికి జరిగిన వివాహానికి రాజుగారుకూడ వచ్చి ఆశీర్వదించారు. నాగుమల్లి ఇంప్పటికి అలుగుతుంటుంది, మా అయ్యను తన్నావుగా, నేను నీతో మాట్లాడను ఫో అని. అన్ని ఉట్టుట్టి కోపాలు! మరంతేగా.

విక్రమకేసరి:
కుంభారమిట్ట, శివాలుడు గారు, శిఖిముఖి ఎంత హాయిగా ఉన్నారు ప్రక్రుతి వడిలో. నేను వచ్చి వాళ్లకు కష్టాలు తెచ్చిపెట్టను. శిఖిముఖి వంటి సాహసవంతున్ని ఇంతవరకూ చూడలేదు. అతనిలాంటి వాళ్ళు ఒక్క పదిమంది మా సైన్యంలో ఉంటేనా !! మా తాతగారిని వెతుక్కుంటూ నేను శిఖిముఖి, శిధిలాలయం ఉన్న ప్రాంతానికి బయలుదేరాం. దారిలో ఎన్ని అడ్డంకులు , అన్ని పూజరి ఏర్పాటు చేసినవే! శిఖిముఖి సాహసం, కొంత నా యుక్తి వాడుకుని అన్నిట్లోంచి బయటపడి చివరకు అనుకున్నది సాధించాం. అమాయకపు పిల్ల నాగుమల్లి, శిఖిముఖిని పూజారి శిఖ కోసి తెమ్మన్నది. ఆమే కోపం చూస్తే నాకు కూడా భయమేసిన మాట నిజం. శిఖిముఖి, ఆ చిన్నదానికిచ్చిన మాటకోసం ప్రాణాలమీదకొచ్చినా సరే, తెగించి ఆమే కోరిన కోరిక తీర్చాడు.

నాగుమల్లి:
మా అయ్యను తన్ని వడ్ల పాత్రలో పడేసిన వాడెవడు అని కోపంగా వెళ్ళాను. మా నాన్న గండుపోతేమో ఆ కుర్రాడితో, వాళ్ల తండ్రితో సరదాగా కబుర్లాడుతున్నాడు. మనాన్నెప్పుడో ఇంతే వస్తే పిచ్చి కోపం, పొగరు లేకపోతే బోళాతనం . అందుకనే శిధిలాలయ పూజారి మాటలు విని, లేనిపోని గొడవలకు కారణమయ్యాడు. శిఖిముఖి మీద ఇప్పటికీ కోపమే, మా నాన్నను అలా అవమానించి, కొట్టి పడేసినందుకు. కాని పాపం నామీద ఎలుగుబంటి దాడి చేసినప్పుడు, వెనుక ముందు చూడకుండా దానిమీద కలియబడి, తన దగ్గర చిన్న చురకత్తి తప్ప ఇంకేమీ లేదు తన దగ్గర, నన్ను రక్షించాడు, ఒళ్లంతా గాయాలు చేసుకున్నాడు. నన్ను పూజారి ముఠావాళ్ళు ఎత్తుకేళ్ళినప్పుడు, ఆ రాజయ్య కొడుకుకు విక్రమకేసరితో కలసి, యుక్తిగా విడిపించాడు శిఖిముఖి. అందుకే అతనంటే ఇష్టం. నాకోసం శిధిలాలయ పూజారి శిఖ కూడ కోసి తెచ్చాడు. ఇప్పుడంతా స్నేహమే, మా రెండు పల్లెలు కలసిపోయి సవర శబరలు ఒక్కటైపోయారు.

శిధిలాలయ పూజారి:
హా హ్వాహా! నేనే శిధిలాలయ పూజారిని, కాళీమాత ఉపాసకుణ్ణి. ఆ కాళీ మాత ప్రసన్నం కోసరం మళ్ళీ ఆవిడకు పూజారినవ్వాలన్న(కిందటి జన్మలో నేనే శిధిలాలయంలో పూజారిని) తపనతో నేను కొన్ని పనులు చెయ్యాల్సి వచ్చింది. ఆ శబర కుర్రాడు, ఏమో అనుకున్నాగాని, మంచి సాహసి. అతనికి తోడు విక్రమకేసరి. ఇద్దరూ కలసి నా పని పట్టారు. నేను వేసిన పన్నాగాలన్నీ విఫలమైపొయ్యాయి. చివరకు నా ప్రాణమే పొయ్యింది. చివరలో జ్ఞానోదయమయ్యింది, నే తలపెట్టిన కార్యం మంచిదే, గొప్పదే. కాని నేను అవలంభించిన మార్గాలు ఒట్టి దగాకోరువి. నా కాళ్ళు రెండు పచ్చడి అయిపోయి, అలా డోలీలో పడుండి, నా తల్లి కాళీమాత ఆలయ శిఖరం బయటకు వస్తుండగా ఇక ఆగలేక దూకేశాను, ఆ శిఖరం మీదపడి పైకొచ్చేశాను. ఇప్పుడంతా ప్రశాంతమే. ఈ బుధ్ధి నాకు మొదట్లోనే ఉంటే దాసరి వారు కథ ఎలా నడిపేవారో మరి.

జాంగ్లా:
నేను పూజారి కి గూఢచారిని. మెరమెచ్చు మాటలతో శిఖిముఖి, విక్రమకేసరి చెంత చేరాను. వారికి మోసం తలపెట్టాను, ఫలితం అనుభవించాను. నా కాలు పోయింది. శిఖిముఖి తోటి అడవి బిడ్డనైన నామీద ఎంత కనికరం చూపించాడు! తమకు ద్రోహం తలపెట్టినా నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను రక్షించాడు. అదే నాలో స్వామి భక్తిని పుట్తేట్టుగా చేసింది. చివరలో పూజారి గాడు పారిపోతుంటే నేనే వాడి శిఖపట్టుకుని, వాడు కత్తితో నా చేతులో పొడిచినా సరే వదలకుండా శిఖిముఖికి వప్పచెప్పి, నా ౠణం తీర్చుకున్నాను. ఇప్పుడు, శికిముఖి చల్లని నీడలో హాయిగా బతుకుతున్నాను.

ఇప్పుడు నేనే మాట్లాడేది. దాసరివారి/చిత్రావారి పాత్రలు కాదు. దాసరివారి కథా కథనం, చిత్రాగారి బొమ్మలు, ఈ ధారావాహికను, ఒక క్లాసిక్ గా మలిచాయి. ఆ బొమ్మలు ఇప్పటికీ చూస్తుంటాను. ధారావాహిక వస్తున్న రోజులలో నేను మా స్నేహితులు రకరకాల ఊహాగానాలు చేసేవాళ్ళం మరుసటి నెల ఏమౌతుందో అని. అసలు శిధిలాలయం సినిమా తీస్తే ఎవరు ఏపాత్ర వేస్తే బాగుంటుందని తర్జన భర్జనలు పడే వాళ్ళం. చివరకు మాకు ఈ కింది విధంగా ఏకాభిప్రాయం కలిగింది:

శిఖిముఖి రామారావు
విక్రమకేసరి కాంతారావు
పూజారి రాజనాల
శివాలుడు నాగయ్య (అతిధి పాత్రలో)
నాగుమల్లి కాంచన
గండుపోతు ఎస్వీ రంగారావు (అతిధి పాత్రలో)
విక్రమకేసరి తాతగా ముక్కామల (ఫొటోలోనే కనబడతారు)
విక్రమకేసరి తండి మిక్కిలినేని అతిధి పాత్రలో
జాంగ్లా నాగభూషణం

ఇలా అనేకమంది హేమాహేమీలను పెట్టి మేము సినిమాని (మా ఊహలలో ) తీసి ఆనందించేవాళ్ళం. సినిమా పరిశ్రమ దురదృష్టం , ఈ చక్కటి జానపదకథను సినిమాగా మలచలేకపోవటం. సరిగ్గా తియ్యగలిగితే , ఒక గొప్ప జానపద చలన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయి, హాలివుడ్ చిత్రాలకు సమానంగా సరితూగి నిలబడేది. కాని, మనకు ప్రాప్తంలేదు.



ఏది ఏమైనప్పటికి చందమామ దారావాహికలలో తలమానికమైనది శిధిలాలయం. కథలో వేగం, ఎన్నెన్నో ప్రాంతాల దర్శనం, అక్కడి ప్రజల పరిచయం, ఇలా దాసరి సుబ్రహ్మణ్యం గారు (ఫోటోలో ఉన్నవారు) తన అఖండమైన కల్పనా శక్తితో, చిక్కటి కథను పిల్లలకోసం కల్పించారు, పెద్దల ఆసక్తిని కూడ చూరగొన్నారు. దాసరి వారు ధన్యులు. దాసరి వారు వ్రాసి చందమామ ధారావాహికలలో కెల్లా ఎక్కువ పేరు తెచ్చుకున్న సీరియల్ ఇది.



మన సినిమాలన్నీ కూడా చివరకి ఒక గ్రూపు ఫోటో మీద శుభం కార్డు వెయ్యటం చూస్తుంటాము. అలాగే మన శిధిలాలయం సమీక్ష కూడా ఈ చక్కటి శిఖిముఖి, నాగుమల్లిల పెళ్లి సందడితో ముగిద్దాం.




మళ్ళీ శిధిలాలయం ధారావాహిక చదవాలని అనిపిస్తున్నదా ? తప్పకుండా మీ కోరిక తీరుతుంది. బ్లాగాగ్నిగారి కానుక ఇది, ఈ కింది లింకు నొక్కి అందుకోవచ్చు
శిధిలాలయం ధారావాహిక


*****************************************
మరిన్ని బొమ్మలు