30, జులై 2009, గురువారం

అహింసా జ్యోతి


చందమామలో 1959 జనవరి నుండి 1960 మార్చ్ వరకు బుద్ధుని జీవిత చరిత్రను ధారావాహికగా వెయ్యటం జరిగింది. చాలా పాత ధారావాహికల్లో ఒకటి ఇది. చందమామ వారు ఎందుకనో గాని ఈ ధారావాహికను పున:ప్రచురణ చేసినట్టులేదు. ఈ ధారావాహికకు ప్రముఖ చిత్రకారుడు చిత్రాగారు బొమ్మలు వేశారు. అప్పటికి ఇంకా వడ్డాది పాపయ్యగారు చందమామలో బొమ్మలు వెయ్యటం మొదలు పెట్టినట్టులేదు. అందుకని, అట్టమీద బొమ్మను ఎం.టి.వి.ఆచార్య గారు వేశారు. దొరికినంతవరకు ఆ అట్టమీద బొమ్మలనుకూడ సేకరించి ఇవ్వటం జరిగింది. కాని స్కానింగు నాణ్యం బాగాలేక బొమ్మలు అంతబాగా కనపడటంలేదు.

చిత్రాగారు ఈ ధారావాహికకు రంగులలో తన నైపుణ్యాన్నంతా చూపిస్తూ, విజృంభించి బొమ్మలు వేశారు. ఈ కింది లంకె ద్వారా ఈ ధారావాహికను అందుకుని ఆనందించండి.

http://rapidshare.com/files/261805025/AHIMSA_JYOTHI.pdf

అహింసా జ్యోతి ధారావాహిక మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013


ధర్మం శరణం గచ్చామి.

28, జులై 2009, మంగళవారం

ధారావాహికల డౌన్లోడ్

ఇప్పటివరకు నేను తయారుచేసిన చందమామ ధారావాహికలన్నిటిని ఒకచోట ఇస్తే బాగుంటుంది అనిపించింది. కాబట్టి కింద అన్ని లింకులను ఇస్తున్నాను. ఈ చక్కటి ధారావాహికలను చదివి ఆనందించండి
సింద్బాద్ యాత్రలు
http://rapidshare.com/files/241774209/SINDBAD_YAATRALU.pdf

అరణ్య పురాణం
http://rapidshare.com/files/243078608/ARANYA_PURAANAM_KSRP.pdf

పరోపకారి పాపన్న కథలు
http://rapidshare.com/files/260115101/PAROPAKARI_PAPANNA_KATHALU.PDF

అలీనూర్, అలీబాబ, మాయా వర్తఖుడు
http://rapidshare.com/files/260183111/ALINOOR_ALIBABA_MAYAVARTAKUDU_KSRP.pdf

దుర్గేశ నందిని & నవాబు నందిని
http://rapidshare.com/files/260303265/DURGESA_NAVABU_NANDINI.PDF

వడ్డాది పాపయ్య గారి బొమ్మల కొలువు
http://rapidshare.com/files/260322411/VAPA_EXHIBITION.exe

మాయదారి ముసలిది
http://rapidshare.com/files/260630867/MAYADARI_MUSALIDI_KSRP.pdf

అల్లదిన్ అద్భుత దీపం
http://rapidshare.com/files/261027480/ALLADIN___ADBHUTA_DEEPAM_KSRP.pdf

పురాణ గాధలు
http://rapidshare.com/files/261047665/PURANA_KATHALU.pdf

అలీబాబా 40 దొంగలు
http://rapidshare.com/files/261053677/ALIBABA_40_DONGALU_KSRP.pdf


పై లింకులు ఏవీ పనిచేయవు. ధారావాహికల  మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహికలను  డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

27, జులై 2009, సోమవారం

శివపురాణం & శివ లీలలు





1970, 1971 సంవత్సరాలలో అందరిని ఎంతగనో అలరించిన పురాణ ధారావాహిక శివపురాణం ఆ తరువాత శివ లీలలు. ఈ రెండు ధారావాహికలను కలిపి ఒకే సంపుటి కింద మీ అందరితో పంచుకునే భాగ్యం కలిగినందుకు నేనెంతో ఆనందిస్తున్నాను.

ఈ కింద ఇచ్చిన లంకె వాడి ఈ ధారావాహికను మీ కంప్యుటర్లోకి దింపుకోండి.

http://rapidshare.com/files/260627858/SIVAPURANAM_COMBINED_KSRP.pdf

శివపురాణం/శివలీలలు  ధారావాహికల  మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహికలను  డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

25, జులై 2009, శనివారం

THE VENTURES



నా చిన్నప్పుడు శ్రీలంకా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వారి రేడియో స్టేషన్ లో వచ్చే సంగీతం పక్కింటి లోంచి విని ఆకర్షితుణ్ణై, నానా తంటాలుపడి రకరకాల ఏరియల్స్ కట్టి పెద్దవాళ్ళచేత తిట్లుతిని ఎల్లాగయితేనేమి మా వాల్వు రేడియోలోకూడ ఆ స్టేషన్ వచ్చేట్లుగ చెయ్యగలిగాను. ఆ విధంగా ఆంగ్ల సంగీతం పరిచయం అయ్యింది. ముఖ్యంగా పాటలేకుండా వాద్య పరికరాల సంగీతమంటే ఎక్కువ ఇష్టం నాకు. అటువంటి చక్కటి సంగీతాన్ని అందించే ఒక గ్రూపు వెంచర్స్. నెట్లో వీరి సంగీతాన్ని విని ఆనందించే అవకాశం ఫ్రెడ్డి కలగచేస్తున్నారు. ఈ వెబ్ సైటులో ఆంగ్ల సంగీతంలో పేరెన్నికగన్న అనేక కళాకారుల పాటలు కూడా ఉన్నాయి.


http://jukebox.au.nu/instromania/instro_monsters/ventures/

విని ఆనందించండి.

22, జులై 2009, బుధవారం

పాత పాటల స్వర్గం




పాత పాటల గురించి మరొక్క టపా. నెట్లో ఇదొక లంకె బిందె. ఈ సైటునిండా ఎన్ని పాత పాటలో!! నాగయ్య గారు పాడినవి, ఎస్ రాజేశ్వర రావుగారు పాడినవి, రావు బాల సరస్వతి గారు గానం చెసినవి, మరెక్కడ దొరకని అనేక అరుదైన పాటలు ఉన్నయి. ఈ సైటులో ఉన్న మరొక అద్భుతమైన ప్రత్యేకత ఏమంటే, అక్కడ ఉన్న చక్కటి సెర్చ్ సౌకర్యం-సంగీత దర్శకుని పరంగా, సినిమా పరంగా, గాయకుని పరంగా, సంగీత దర్శకుని పరంగా పాటలను మనం వెతుక్కోవచ్చు. ఇంకెందుకు ఆలశ్యం!! వెను వెంటనే ఈ వెబ్ సైటు దర్శించి ఆనందించండి. అక్కడకు వెళ్ళటానికి మార్గం:

Old Telugu Songs Search Results (eemaata.com)

ఈ బ్లాగును నిర్వహిస్తున్న వారు
1. శ్రీనాధ్ జొన్నవిత్తుల,
2. శ్రీనివాస్ పరుచూరి మరియు
3 శ్రీనివాసరావు శనగవరపు

వారికి నా హృదయపూర్వక అభినందనలు

అమెరికన్ జానపద సంగీతం

నా చిన్నప్పుడు వాయిస్ ఆఫ్ అమెరికా రేడియో లో (అప్పట్లో శ్రీలంక నుండి రిలే అయ్యేది) అమెరికన్ కంట్రీ మ్యూజిక్ వినేవాణ్ణి. ఒక అరగంట సేపు వచ్చేది. ఈ పాటలు వినడానికి కారణం ముఖ్యంగా లిరిక్ అర్ధం అయ్యేది. ఆ విధంగా అమెరికన్ జానపద సంగీతం మీద మక్కువ పెరిగింది. నెట్లో వెతుకుతుండగా ఒక నిధి దొరికింది. ఆ నిధే ఓల్డ్ టైం కంట్రీ వెబ్ సైటు. ఈ కింద లంకె నొక్కండి విని ఆనందించండి. కాకపోతే మీ కంప్యుటర్ లో రియల్ ప్లయర్ ఉండటం తప్పనిసరి.

http://www.geocities.com/Heartland/Creek/9177/

ఈ వెబ్ సైటు ప్రత్యేకతలు:
1. రెండు జూక్ బాక్సులు (పాటలు వినిపించేవి). ఇందులో నెలకొకసారి పాటలను మారుస్తూ ఉంటారు.
2. జూక్ బాక్స్ ఫేవరైట్సు ఇందులో 1953 నుండి 1968 వరకు వచ్చిన కంట్రీ హిట్ పాటలన్నీ అందించారు.
3. ఓప్రీ స్టార్ స్పాట్లైట్ ప్రతినెలా ఒక కంట్రీ పాటల కళాకారుడి పాటలను ఉంచుతారు
4.చివరగా టాప్ కంట్రి సింగిల్స్ లో సంవత్సరాలవారిగా వచ్చిన టాప్ పాటలను అందిస్తారు. ఇక్కడ అప్పుడప్పుడు పాటలను మారుస్తుంటారు.

ఇలాగే మన జానపద పాటలకు కూడ ఒక వెబ్ సైటు ఉంటే ఎంత బాగుండును.

ఇల్లాలి ముచ్చట్లు



ఇల్లాలి ముచ్చట్లు ఒక చక్కటి సాహితీ ప్రయోగం. "ఇల్లాలి ముచ్చట్లు" అనే శీర్షిక మొదలు పెట్టినది, ఆంధ్రజ్యోతి
వార పత్రికలో. శీర్షికను 1967 సంవత్సరంలో మొదలు పెట్టారు. శీర్షికను "పురాణం సీత" నిర్వహించేవారు. అందరూ శీర్షికను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న పురాణం సుబ్రహ్మణ్య శర్మ సతీమణి వ్రాస్తున్నదని చాలా కాలం అనుకునేవారట. కాని, సుబ్రహ్మణ్య శర్మే, మహిళా రచనా శైలిని అనుకరిస్తూ చాలా కాలం ఎవరికీ అంతు చిక్కకుండా నిర్వహించారు. దీనికి కారణం, శీర్షిక పేరు మహిళా సంబంధమయి, రచయిత పురుషుడయితే పాఠకులు ఆదరించరేమో అన్న అనుమానం ఒకటి కాగా, అప్పటి రోజులలో, మహిళా రచయితలదే పైచేయి అవుతూ వారి రచనలే ప్రసిద్ధి చెంది ఉండటం మరొక కారణం కావచ్చును. పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఆంధ్రజ్యోతి వారపత్రికకు సంపాదకుడయిన తరువాత కూడ తన బాధ్యతలను నిర్వహిస్తూనే, శీర్షికను కూడ విజయవంతంగా కొనసాగించారు.

ఈ శీర్షికలో మనం రోజువారి చూసే సంఘటనలు, రాజకీయాలు, తగాదాలు, చిన్న పిల్లల ఆటలు వంటి విషయాల గురించి (చైనా రాజకీయాల దగ్గరనుంచి చీపురు కట్టవరకు) హాస్యభరితంగా, ఆహ్లాదకరంగా వ్రాస్తూనే అవసరమైనప్పుడు, అవసరమైనంతవరకు సునిసితమైన విమర్శదగ్గర నుండి, కత్తుల్లాంటి మాటలతో తీవ్ర విమర్శకూడా చేస్తూండేవారు. చక్కటి పొందికతో, ఎక్కడా కూడ తూకం చెడకుండా, ఈ శేర్షిక ప్రతి వారం ఒక పేజీ మాత్రమే ప్రచురించేవారు.
ఇల్లాలి ముచ్చట్లు చిహ్నం (LOGO)
వ్యాస శీర్షికకు ప్రత్యేక చిహ్నం ఉండటం అన్నది, తెలుగు వారపత్రికలలో ఇదే
మొదటిది అయిఉండవచ్చును. తెలుగు వారిళ్ళల్లో, మహిళలు వంట చెయ్యటం అన్నది సర్వ సామాన్యం. పూర్వం కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు. తరువాత, తరువాత, బొగ్గుల కుంపట్లు వచ్చినాయి. కట్టెల పొయ్యి, గ్యాస్ స్టౌవ్ కు మధ్య, తెలుగు మహిళలు ఎక్కువ కాలం బొగ్గుల కుంపట్ల మీదనే దశాబ్దాలపాటు వంటలు చేసి తమ తమ కుటుంబ సభ్యులకు ఆప్యాంయంగా వడ్డించారు. కుంపటి ముందు కూచుని, అవసరమైనప్పుడు విసినకర్రతో విసురుతూ, వంట చేస్తున్నప్పుడు, కొంత ఆలోచించటానికి మహిళలకు అవకాశం ఉండేది(కుంపట్ల మీద వంట నెమ్మదిగా జరుగుతుంది కనుక). అటువంటి ఆలోచనలను, తన బుర్రలో వండి పురాణం సీత పాఠకులకు అందిస్తున్నట్టు ఉంటుంది చిహ్నం . కుంపటి మీద బాణలి నుంచి అట్లకాడతో బయటకు తీయబడుతున్న పదార్ధం భూగోళం ఆకారంలో వెయ్యటంలో ఉద్దేశ్యం, శీర్షిక భూమ్మీద ఉండే/జరిగే ప్రతి విషయాన్ని సృశిస్తుందని సూచిస్తుంది.

రచనా శైలి
వ్యాసరచన ఎక్కువ భాగం స్వగతంలోనే జరిగింది. కొన్ని కొన్ని వ్యాసాలలో "పురాణం సీత" తన భర్తతోమా(పో)ట్లాడుతున్నట్టు వ్రాయటం జరిగింది. వార పత్రికలలో, వ్యాసాలను స్వగతంగాను లేదా ఏక వ్యక్తిసంభాషణ రూపంలో, కధలాగ చెప్పే పద్ధతి, వ్యాస శీర్షికతోనే మొదలు. వ్యాసాలన్నీ చక్కటి వ్యావహారికిభాషలో అవసరమైన చోట ఆంగ్ల పదాలను యధాతధంగా వాడుతూ, సంగీతంలో మెట్లు మెట్లుగా పరాకాష్టకుచేరుకున్నట్టుగా ముగింపుకు చేరువవుతాయి. దాదాపు అన్ని వ్యాసాలలోనూ ఒక విధమైన ఊపిరి సలపనివేగం ఉన్నది. పాఠకుడు వ్యాసం చదవటం మొదలుపెడితే ముగింపుగు వచ్చినాక మాత్రమే తెలుస్తుంది, చివరవరకూ చదివినట్టు. పాఠకుల ఆసక్తికి కారణం, కొంతవరకు వ్యాసంలో చర్చించబడ్డ కాలపు సామాజికసమస్యలు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొనేవి అయినప్పటికి, వ్యాస శైలి అటువంటి ఆసక్తినిఎక్కువగా నిలపగలిగిందని చెప్పక తప్పదు. వ్యాసాలన్నీ కూడ హాస్యభరితంగా ఉంటాయి. ఓక పక్క కన్నీళ్ళుపెట్టిస్తూ కూడా హాస్యం అంతర్లీనంగా వ్రాయగలగడం (నుదుటన్ వ్రాసిన వ్రాలు...దడిగాడువానసిరా ఒకఉదాహరణ) పురాణం సీతకే చెల్లింది. ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు విధంగా వ్రాయటమేమీతేలిక కాదని, తేలికని ఊహిస్తున్నవారు ప్రయత్నించి చూడవచ్చని సవాలు చేసి, శీర్షిక శైలినికొనియాడారు.


కొన్ని ముచ్చట్లు
శీర్షికలోని వ్యాసాలనుండి కొన్ని ముచ్చట్లను ఇక్కడ ఉదహరించటం జరిగింది.

ఎన్నికలలా వ్యాసం నుండి-"...వాళ్ళకు జాతీయ పతాకానికి, కాంగ్రెసు జండాకి వున్న తేడా తెలీదు. ఇలాంటిప్రజలుంటారనే మన నెహ్రూగారు కాంగ్రెసు జండాలో రాట్నం పీకిపారేసి చక్రం పెట్టారు. జండా జండాఒకటే అనే భావం కలిగేలా జాతీయ పతాకాన్ని రూపొందించకుండా వుండవలసింది.

గోవూవత్సం వ్యాసం నుండి-..."ఆడదానికొచ్చే బాధలన్నీ వ్యక్తిగతమైనవికావు. సమాజం అమె నెత్తిమీదరుద్దినవి....."

మూడే రంగులు వ్యాసం నుండి..."ఏయ్! రిక్షావాలా! కాలవంటే తెలుసు కదా! నహర్ అంటే కాలవట. కాలవపక్కనుండే వాళ్ళు కనుక నెహ్రూలన్నారట: కాలవ పక్కనుండే మీవాళ్ళంతా నెహ్రూ లౌతారట్రా ఇడియట్!(దాదాపు 1990 వరకు విజయవాడలో ఏలూరు కాలవ, బందరు కాలవ, రైవస్ కాలవల ఒడ్లమీదబీదవాళ్ళు-రిక్షావాళ్ళు తదితరులు- గుడిసెలు వేసుకుని జీవితాలు ఈడుస్తూ ఊండేవారు. వ్యాసంలోని వ్యాఖ్య, రచయిత వ్యంగ విమర్శనా పటిమకు పరాకాష్ట)
ధర్మ దర్శనం వ్యాసం నుండి ...."స్వర్గం, మోక్షం ఎంత మంచివైనా, ఎవరో దిక్కుమాలిన వాళ్ళకూఅభాగ్యులకూ తప్ప, ఎవరికీ స్వర్గస్థులం కావాలని వుండదు, అదేమి చిత్రమో..."

దడిగాడువానసిరా వ్యాసం నుండి..."జెరూస్లెంలో ఆక్రోశకుడ్యమని ఏడవటానికి గోడ కట్టేరుట. గోడదగ్గరకు వెళ్ళి ఏడిస్తే మనశ్శాంతి లభిస్తుందట. అలాటి ఎన్నో గోడలు మనకి కావాలే....మన బ్రతుకులుతల్చుకుంటే గోడకేసి తిరిగినా ఇంట్లో ఏడుపొచ్చేస్తుందే. మరి మనం వేరే ఎక్కడికి వెళ్ళనక్కర్లేదే....."

తారుమారు బలే పెళ్ళి వ్యాసం నుండి..."గొప్పగా, డాబుగా దర్జాగా వుండటానికి ఎంత ప్రయత్నిస్తేమనుష్యులు అంత అసహ్యంగా వుంటారు....."

చిత్తశుద్ధిలేని శివపూజలు వ్యాసం నుండి-ప్రభుత్వం చేస్తున్న కుటుంబ నియంత్రణ ప్రచారంగురించి..."ఉన్నమాట చెబుతున్నాను. పిల్లల్ని నిందిస్తే పిల్లల తల్లికి కష్టంగా వుంటుంది. పిల్లల తల్లికి కష్టంకలిగితే ఉద్యమ అంతా దెబ్బతింటుంది. ఎంతో సున్నితమైన సమస్యను పరమ మోటుగా డీల్చేస్తొంది..."

మనమాట మన పలుకు అందులోని కులుకు వ్యాసం నుండి-'...మన నిజమైన తెలుగు మన అట్టడుగు వర్గప్రజల దగ్గర ఇంకా మిగిలివుంది. మన అమ్మమ్మలు, అత్తలు, వదినలు, బామ్మలు వీరంతా ప్రాంణంలేచి వచ్చేహాయైన తెలుగు మాట్లాడుతారు. చాలా విచారకరమైన సంగతి ఏవంటే పుస్తకాలు రాసేవాళ్ళు చాలామందిదగ్గర ఆడ మగా అన్న తేడా లేకుండా ఒరిజనల్ ఒకటోరకం తెలుగు లేదు.....అనగా తెలుగు బిడ్డ కావటానికిబదులు తెలుగు పీడగా తయారవుతున్నాం...."

కర్రలూ-పాములూ వ్యాసం నుండి-"...మరి మనదేశంలో ఇన్ని పార్టీలేవిటి? చక్కగా రెండో మూడో పార్టీలుంటేఅందంగా వుటుందిగాని సంతలో దుకాణాల్లగ ఇన్ని పార్టీలేవిటీ? ఇందరు నాయకులేవిటి? వీళ్ళంతా ఏవిటిచేస్తారు?...."

ఆంధ్రా తుగ్లక్ లేక మా పిచ్చి మావయ్య వ్యాసం నుండి-"...శరీరాలు ఎదిగి మనసులు ఎదగకమూసుకుపోయిన బాపతు జనం ఆడవారిలోనేకాదు మగవారిలో కూడా హెచ్చుమందేవుండి వుంటారు..."

అభిప్రాయాలు
కొడవటిగంటి కుటుంబరావు-"...ఇల్లాలి ముచ్చట్లు శీర్షిక తెలుగు జర్నలిజంలో ఒక సరికొత్త ప్రయోగంకావటమే గాక, చాలా విజయవంతమైన ప్రయోగం....అది (ఇల్లాలి ముచ్చట్లు) ములుకు తాళ్ళ చరణాకోల. దాన్ని ఒక్కసారి ఝుళిపిస్తే అనేక చోట్ల గాయాలవుతాయి.......ఇట్లా రాయటం తేలిక అని ఎవరన్నభ్రమపడినట్టయితే, ప్రయత్నించి చూడవచ్చు.

నార్ల వెంకటేశ్వర రావు- పురాణంలోని సీతవలె, పురాణం సీత అందరి మన్ననలను పొందుతున్నది.

రాచకొండ విశ్వనాధ శాస్త్రి-".....మన దేశంలో నూటికి తొంభై తొమ్మిది మంది ఇల్లాళ్ళకి జీవితం ముచ్చట అనేప్రసక్తి లేకుండా పువ్వుల తోటలో నిప్పుల మంటలా ఉంటుందికదా! అటువటప్పుడు 'ఇల్లాలి ముచ్చట్లు" అనడంలో అర్ధం ఉందా అనిపించింది నాకు. చదివేక మాత్రం, 'ముచ్చట' వేరు 'ముచ్చట్లు' వేరు అనితెలుసుకున్నాను. తీన్ తారుగా చిక్కులు చిక్కులుగా బాధలు బాధలుగా ఉన్న, జీవితం ఎందుకు ఇలాఉంది అని తెలుసుకొందికి, వ్యాసాల్లో, ఇల్లాలు కొంత పయత్నించినట్టుగా నాకు తోస్తొంది.

నండూరి రామమోహనరావు-- పుస్తకానికి ఎవరూ సర్టిఫికెట్లు ఇవ్వనక్కర్లేదు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో పుస్తకంలోని శీర్షికలు వారంవారం పడుతున్నప్పుడు పాఠకుల నుంచి శరపరంపరగా వచ్చిపడిన ప్రశంసలేఅసలైన సర్టిఫికేట్లు....... ముచ్చట్లలో పేజీ తిరగేసినా బోలుడు గడుసుదనం, సెటైర్, పొగరు, వగరుకనిపిస్తాయి.

============================================

నేను పూర్వం తెలుగు వికీపీడియాలో వ్రాసిన వ్యాసం పున:ప్రచురణ. ఇందులోని చిత్రాలు, వ్యాఖ్యలు నవోదయా పబ్లిషర్స్, విజయవాద, సీతా బుక్స్. తెనాలి వారు ప్రచురించిన ఇల్లాలిముచట్లు సంపుటిలనుండి గ్రహింపబడినాయి.

చంద్రుడిమీద మానవుడు - 40వ వార్షికోత్సవం





చంద్రుడిమీద మానవుడు కాలుపెట్టి ఇవ్వాళ్టికి 40 సంవత్సరాలయింది. ఈ సందర్భంగా మన చందమామలో 1969వ సంవత్సరం దీపావళి సంచికలో ప్రచురించబడిన ప్రతేక వ్యాసం మీ అందరితో పంచుకోవలని నా తాపత్రయం. ఈ కింద ఇచ్చిన లంకె నొక్కంది, మీ కంప్యుటర్ లోకి ఈ వ్యాసం వచ్చేస్తుంది.

http://rapidshare.com/files/258429260/MAN_ON_THE_MOON_CHANDAMAMA.pdf

పై లింకు పనిచేయదు. గగన చందురుడు మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామ(1969 ఆగస్టు నెల ఇష్యూ) చదువుకోవచ్చు. ఆశగా ఈ  డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

21, జులై 2009, మంగళవారం

రాగతి పండరి-ప్రముఖ కార్టూనిస్ట్


రాగతి పండరి తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్టులలో (వాగ్దేవి,కె.సి లలిత అడపాదడపా వ్యంగ్య చిత్రాలను ప్రచురించినప్పటికీ), రాశిలోనూ, వాసిలోనూ సమానమైన కీర్తి ప్రతిష్టలను ఆర్జించుకున్న ఏకైక మహిళా కార్టూనిస్ట్. అదొక్కటే ప్రత్యేకత కాదు, అనతి కాలంలోనే తెలుగు వ్యంగ్య చిత్ర కళా రంగంలో చాలా మంచి పేరు తెచ్చుకుని, ఆ రంగంలో అగ్రగణ్యులైన బాపు, జయదేవ్, బాబు ల సరసన నిలబడగలిగిన స్థాయి చేరుకున్నారు . ఈ మంచి పేరుకు వెనుక అకుంఠిత దీక్ష, వ్యంగ్య చిత్ర కళ మీద ఎనలేని ప్రేమ, నిరంతర పరిశ్రమ ఉన్నాయి. దురదృష్టవశాత్తూ, ఈమెకు చిన్నతంలో వచ్చిన పోలియో మూలంగా శారీరకంగా చలాకీగా తిరగలేక పోయినా, అంతకు మించిన మానసిక చలాకీతనంతో, చకచకా కార్టూన్లు గీసి అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఆవిడ మాటలలోనె చెప్పాలంటే, "జీవితంలో వేదనని కాసేపు పక్కకు నెట్టి, నిండుగా నవ్వగలిగే శక్తినిచ్చే కార్టూన్లు, మనిషికి గ్లూకోజు డోసులాంటివి". ఏవిధమైన తటపటాయింపు లేకుండా, తాను కార్టూన్లు గియ్యాలన్న కోరిక మరియు స్పూర్తి, ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ కలగ చేశారని చెప్తారు. అలాగే, జయదేవ్ కూడ రాగతి పండరి తన నిజమైన శిష్యురాలని చెప్పుకుంటారు.

వ్యక్తిగతం
రాగతి పండరి 1965 సంవత్సరం జూలై 22 న విశాఖపట్టణంలో జన్మించారు. ఈమె తండ్రి రాగతి గోవిందరావు. తల్లి రాగతి శాంతకుమారి. ఈమె చదువు ఇంటివద్దనే కొనసాగింది. అతి చిన్నవయసులోనె పోలియో వల్ల వచ్చిన శారీరక లోపం వచ్చిననూ పట్టుదల, ధీరత్వం కలిగి జీవితాన్ని ఆత్మ విశ్వాసంతో,కఠోర పరిశ్రమతో ఎదుర్కొని, కార్టూన్ రంగంలో అగ్రగణ్యుల సరసన చేరారు .


వ్యంగ్య చిత్ర ప్రస్థానం


రాగతి పండరి కార్టొన్లలో ప్రచురించబడిన మొట్టమొదటి కార్టూన్.బొమ్మలో నాణ్యం అప్పటికి, ఇప్పటికి ఎంత పరిణితి చెందిందో గమనించండి.






రాగతి పండరి తన 8వ ఏటన 1973వ సంవత్సరంలో ప్రచురించిన మొట్టమొదటి వ్యంగ్య చిత్రంతిరిగొచ్చే కార్టూన్లు ఈమెను నిరాశపరచలేదు, పట్టుదలను పెంపొందించి మరింత కృషి సలపటానికి ఆలవాలమయ్యాయి. ఈమె తన వ్యంగ్యచిత్ర ప్రస్థానాన్ని 1973లో తన 8వ ఏటనే మొదలు పెట్టారు . బాల్యం వీడని రోజులలలోనే ఈమె వ్యంగ్య చిత్రాలు ప్రచురణ ప్రారంభమయ్యింది. 1980-1990 దశకాలు ఈమెవే అని చెప్పవచ్చు. కొన్ని వేల వ్యంగ్య చిత్రాలను శరపరంపరగా చిత్రించి పాఠకుల మీదకు వదిలారు. అన్ని ప్రముఖ వార, మాస పత్రికలలో ఈమె కార్టూన్లు ప్రచురించబడ్డాయి. పండుగలు వచ్చాయంటే, పత్రికల సంపాదకులు ఈమె కార్టూన్ల కోసరం ఎంతగానో కోరుకుని, అడిగి మరీ తెప్పించుకుని తమతమ పత్రికలలో ప్రచురిస్తారు.


వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు


సామన్యంగా, కార్టూన్లలో ఆడవారిని ఒక మూసలో ఇరికించి, ఒక గయ్యాళి భార్యగానో, అత్తగారిగానో, అప్పడాల కర్ర ఝుళిపిస్తున్నట్టుగా వేయటం పరిపాటి. రాగతి పండరి, అటువంటి మూసను అధిగమించి, ఆడవారిని తన వ్యంగ్య చిత్రాలలో అనేక ఇతర పాత్రలను, సృష్టించి, చూపించారు. మొదటిరోజులలో, వీరి వ్యంగ్య చిత్రాలు జయదేవ్ చిత్రాలలాగ కనిపించేవి. కాని, రాను రాను, తనదైన చక్కటి శైలి త్వరితగతిన ఏర్పరుచుకున్నారు. కుదురైన చక్కటి చిత్రీకరణ, గుండ్రటి చేతివ్రాత, తేట తెలుగులో సంభాషణలు వీరి వ్యంగ్య చిత్రాల ప్రత్యేకత.
వీరు సృష్టించిన నవగ్రహం అనుగ్రహం మహిళా ద్వయం మంచి పేరు తెచ్చుకున్నది. ఇందులో సన్నగా, పొడుగ్గ ఉన్న ఆమె, పొట్టిగా, లావుగా ఉన్న మరొకామె మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్య సంభాషణలతో చక్కటి హాస్యం మేళవించి, వీరు వేసిన వ్యంగ్య చిత్రాలు పాఠకులను అలరించాయి.ఇంకా ఇద్దరు అమ్మాయిలు,మగాడు, కాలేజి గర్ల్‌ వంటి శీర్షికల పేరు మీద వీరు వేసిన వ్యంగ్య చిత్రాలు కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాయి తెలుగు వ్యంగ్య చిత్రరంగంలో అనేక వ్యంగ్యచిత్ర ధారావాహికలు వార పత్రికలలో నిర్వహించిన ఘనత వీరిదే.
సమకాలీన వ్యంగ్య చిత్రాకారులలో, వార్తా పత్రికలలో పని చేస్తూ ఉన్న కార్టూనిస్ట్‌లను మినహాయిస్తే, రాజకీయ వ్యంగ్య చిత్రాలు వేసే ఏకైక ఫ్రీలాన్స్[తెలుగు పదము కావాలి]మహిళా కార్టూనిస్ట్. 'రాజకీయ చెదరంగం' అన్న పేరుతో వేసిన కార్టూన్లు ఎంతో పేరు తెచ్చుకున్నాయి. ఈ శీర్షికన ఒక దశాబ్దం పైగా రాజకీయ వ్యంగ్య చిత్రాలను ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురించబడటం తనకెంతో ఆనందం కలిగించిందని ఈమె చెప్తారు. వీరు వేసే రాజకీయ వ్యంగ్య చిత్రాలలో, నీజమైన రాజకీయ నాయకుల వ్యంగ్య చిత్రాలు ఉండవు. ఊహాజనిత రాజకీయ నాయకులను మాత్రమే చిత్రిస్తారు. మానవ ప్రవృత్తిలో ఉన్న ద్వంద్వ అలోచానావిధానం, సాఘిక దురాచారాలు, వీరి కార్టూన్లలో నిసితంగా విమర్శించి, హాస్యం ప్రధానంగా, ఆకర్షణీయంగా ఉండి, పాఠకులను నవ్వులలో ముంచెత్తటమే కాకుండా, ఆలోచించటానికి కూడ ఉద్యుక్తులను చేస్తాయి.

సత్కార సమాహారం
1991 సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా కలెక్టరు చేతుల మీదగా ప్రశంసా బహుమతి.
2001 సంవత్సరం ఉగాది పురస్కారం ఆంధ్ర ప్రదేశ్ అప్పటి గవర్నర్ సి.రంగరాజన్ చేతులమీదుగా అందుకోవటం

పుస్తకాలు
రాగతి పండరి ఆత్మకథ నా గురించి నేను...ముఖచిత్రం . రాగతి పండరి ఆత్మకథ వెనుక అట్టమీద చిత్రాన్ని క్లిక్ చేసి చూడండి. తనను గురువుగా చెప్పుకొనే శిష్యురాలి బొమ్మను తనదైన శైలిలో జయదేవ్ గారు గీసి అందించారు. ఇటువంటి అరుదైన గౌరవాన్ని అందుకున్నరు పండరి గారు. ఆపైన వివిధ పత్రికలవారు రాగతిపండరి వ్యంగ్య చిత్రాల మీద వ్యక్తీకరించిన అనేక చక్కటి అభిప్రాయాలు.


రాగతి పండరి ఆత్మకథ నా గురించి నేను...వెనుక అట్ట మీద పత్రికల ప్రశంసల జల్లువిశాలాంధ్ర ప్రచురణ సంస్థ 1997లో వీరి రెండొందల కార్టూన్లను ఒక సంపుటిగా "నవ్వుల విందు" పేరుమీద ప్రచురించారు .చిత్రకళా పరిషత్ వారు 2008 సంవత్సరంలో ఈమె ఆత్మకథ నా గురించి నేను ప్రచురించారు. ఈ పుస్తకాన్ని, ప్రముఖ సాహితీవేత్త ద్వాదశి నాగేశ్వరశాస్త్రి (ద్వా.నా. శాస్త్రి) చేతులమీదుగా 2008లో విశాఖపట్నంలో విడుదలైంది.[1]

ప్రముఖుల అభిప్రాయాలు

జయదేవ్ ప్రముఖ కార్టూనిస్ట్"....రాగతి పండరి కార్టూన్ సామ్రాజ్యాన్ని మొత్తం తన కైవసం చేసుకున్న ఏకైక మహిళ కార్టూనిస్టుగా పేరు ప్రఖ్యాతులనార్జించింది. సామజిక స్పృహతో, అను నిత్యం, కొత్త కొత్త అంశాలపై అమె విసిరిన విసురులు కోకొల్లలు. ముఖ్యంగా తెలుగు మహిళల జీవన సమస్యలను ఆకళింపు చేసుకుని వ్యంగ్యం జోడించి, తన సన్నటి, అతి స్వల్పమైన గీతలలో, పొందికైన వ్యాఖ్యలతో నవ్వుల పంటలు పండిస్తున్నది"

రామకృష్ణ ప్రముఖ కార్టూనిస్ట్-"....కాలక్రమేణా, తనకంటూ స్వంత శైలి ఏర్పరుచుకుని, చాలామంది మగ తెలుగు కార్టూనిస్టులు, వృత్తిపర-అసూయ పడేలా దూసుకు వచ్చిన ఒకే ఒక మహిళా కార్టూనిస్టు. నిత్య జీవితంలో అనేక సంఘటనలను తనదైన శైలిలో, చక్కని హాస్యం మేళవించి వేనవేల కార్టూన్లలో ప్రదర్శించారామె!"

పూర్వం తెలుగు వికీపీడియాలో నేను వ్రాసిన వ్యాసం పున:ప్రచురణ. నేను ఫోనులో ఆడిగిన వెంటనే అన్ని వివరాలు అందించిన రాగతి ఫండరి గారికి, వివరాలు సంపాయించటంలో ఎంతగానో సహకరించిన జయదేవ్ గారికి నా కృతజ్ఞతలు.

ఘంటసాల పాటలు




ఘంటసాల పాడిన అనేక పాటలను ఒకచోట చేర్చి అందరికీ అందచేస్తున్నరు. ఈ వెబ్ సైటులో వందల పాటలు ఉన్నాయి. పాటలన్నీ 1960ల వరకు మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా ఈ వెబ్ సైటులో ఉన్న నిధి ఏమంటే, ఘంటసాల పాడిన ప్రవైటు పాటలలో అనేకం ఉన్నాయి. ఈ వెబ్ నిర్వాహకులు ఇచ్చిన మరొక చక్కటి అవకాశం,పాటలన్నీ కూడ వినటమే కాకుండా డౌన్లోడ్ చేసుకోవటానికి లింక్ ఇవ్వటం. ఘంటసాల అభిమానులు తప్పనిసరిగా చూడవలసిన వెబ్ సైటు.




20, జులై 2009, సోమవారం

బాబు ప్రముఖ కార్టూనిస్ట్ (మొదటి భాగం)




వ్యక్తిగతం
కొలను వెంకటదుర్గాప్రసాద్ విజయవాడలో 1946, జూన్ 1న జన్మించారు. వీరి తండ్రి కొలను సత్యనారాయణ, తల్లి కొలను పిచ్చమ్మ. మొదట వీరి పేరును వెంకటరమణ అనుకున్నారట కాని ఈయన తండ్రి విజయవాడ దుర్గాదేవి మీద ఉన్న భక్తితో, పేరును వెంకటదుర్గాప్రసాదుగా నిర్ణయించారట. ఇంట్లో అందరూ "బాబు" అని ముద్దుపేరుతో పిలిచేవారు. 1962వ సంవత్సరంలో విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో పి.యు.సి (Pre University Course) చదివారు. సినిమా ప్రచార కార్యక్రమంలో (Publicity)లో కొంతకాలం పనిచేశారు కేంద్రప్రభుత్వ ఉద్యోగంలో 1966వ సంవత్సరంలో చేరి, 40 సంవత్సరాలు పనిచేసి గ్రూప్-బి అధికారిగా 2006లో పదవీ విరమణ చేసి ప్రస్తుతం విజయవాడలోని సీతారాంపురంలో నివాసముంటున్నారు. వీరి భార్య పేరు శాంతకుమారి. వీరికి ఇద్దరు కుమారులు కళ్యాణచక్రవర్తి, వేణు.


వ్యంగ్య చిత్రకారుని ప్రగతి

వీరు చలనచిత్ర ప్రచార రంగంలో పనిచేస్తున్న రోజులలో, స్నేహితుడు క్యానం భగవాన్ దాస్ ( ఈయన కూడ కార్టూనిస్టే-భగవాన్ పేరిట వ్యంగ్య చిత్రాలు గీశేవారు) మార్గదర్శనంలో, బాపు ఆడుగుజాడలలో, అతని ఏకలవ్య శిష్యరికం చేస్తూ కార్టూన్లను వెయ్యటం మొదలుపెట్టారు. మొట్టమొదటి కార్టూన్, ఆంధ్ర పత్రికలో 1963 సంవత్సరం, సెప్టెంబరు 6వ తారీకు సంచికలో ప్రచురితమయ్యింది. (పైన బొమ్మలో తన గురువు లాంటి స్నేహితుడు భగవాన్‌దాసుతో బాబు)
ఆ తరువాత డజన్ల కొద్దీ వ్యంగ్య చిత్రాలు ప్రచురించాడు. ఆంధ్ర పత్రిక సంపాదకులయిన శివలెంక రాధాకృష్ణ ఇతడిని ఎంతగానో ప్రొత్సహించారు. ఆంధప్రత్రికలోనే కాక తమ అనుబంధ ప్రచురణలైన భారతి (మాస పత్రిక), కలువబాలలో వీరి కార్టూన్లనే కాక, కథలకు బొమ్మలు, కథలు మరియు అనువాదాలను దాదాపు రెండు దశాబ్దాల పాటు, ప్రచురించారు. 1972 సంవత్సరంలో "వెంకన్నాస్ కోల్డ్" అన్న వ్యంగ్య చిత్ర ధారావాహికను ఆంధ్రపత్రికలో 24వారాల పాటు (6 నెలలు) ఏకధాటిగా ప్రచురించి పాఠకులను ఎంతగానో అలరించి మెప్పు పొందారు. అలాగే, "ఇ వేమన పద్యాలను" నాలుగు సంవత్సరాలపాటు ప్రచురించి, హాస్య ప్రధానంగా బొమ్మలు వేసి, వేమన పద్యాలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకుని వచ్చాడు. బారిష్టర్ పార్వతీశం నవల మొదటిభాగానికి బొమ్మలు వేశాడు. తెలుగులోని అన్ని ప్రముఖ వార/మాస పత్రికలలోనే కాక, ఆంగ్లంలో ప్రచురితమయ్యే, కార్వాన్(Carvan)లో చాలా కార్టూన్లను వేశారు. అలాగే ఉమెన్స ఎరా(Women's Era)పక్ష పత్రికలో మోడెస్ట్(Modest) అన్న శీర్షికన, రెండు సంవత్సరాల పాటు కార్టూన్లను ప్రచురించారు. 1970 ప్రాతాలలో, తన మిత్రుడు, ప్రముఖ కార్టూనిస్ట్ అయిన జయదేవ్‌తో కలసి "పేజీ కార్టూన్ల"ను వెయ్యటం ఒక మరుపురాని గొప్ప అనుభవం అని చెప్తారు బాబు. జపాన్, బెల్జియం, టర్కీ దేశాలలో జరిగిన వివిధ కార్టూన్ల పోటీలలో ఇతని కార్టూన్లను ప్రదర్శించారు. తనకు అన్నిటికంటే జరిగిన సన్మానం బాపు తన కార్టూన్‌ను మెచ్చుకోవటం అని చెప్పి మురిసిపోతారు. ఉద్యోగంనుండి మాత్రమే పదవీ విరమణ చేశారు, తన ప్రవృత్తి అయిన వ్యంగ్య చిత్ర పరంపరను మటుకు చక్కగా కొనసాగిస్తున్నారు, ప్రతివారం స్వాతి పత్రికలో కార్టూన్లను ప్రచురిస్తున్నారు.


కథాకారుని ప్రగతి
చాలామందికి తెలియని విషయం, ఈయన మంచి కథా రచయిత కూడ. తన కథలను తన అసలు పేరుతో ప్రచురించటం వల్ల, "బాబు" కార్టూనిస్ట్ మరియు కథా రచయిత కొలను వెంకటదుర్గాప్రసాద్ ఒకరే అన్న విషయం చాలామంది పాఠకులకు తెలియదు.
"ప్రముఖ కార్టూనిస్టు అయిన బాబు కథలు కూడ వ్రాస్తారు" అని చెప్పుకోవటానికి మాత్రమే కాకుండా, చక్కటి కథలను రచించి, ఆంధ్రపత్రిక ఆ రోజులలో (1970లలో)నిర్వహించే దీపావళి కథల పోటీలలో, మూడుసార్లు బహుమతులను సంపాదించారు.
వ్యంగ్య చిత్ర చిత్రీకరణ విషయంలో బాపును గురువుగా బావిస్తే, హాస్య రచనల విషయంలో ముళ్ళపూడి వెంకటరమణ ను తన గురువుగా భావిస్తారు.

బాబు-బాపు
కొత్తగా కార్టూన్లను చూడటం మొదలు పెట్టిన పాఠకులు, పేర్లలో ఉన్న సామ్యం వల్ల, బాబు-బాపు ఇద్దరూ ఒకరే అనుకునే అవకాశం ఉన్నది. బాపు తెలుగు వ్యంగ్య చిత్రాలకు ఆద్యుడు, పితామహుడయితే, ఆ ఒరవడిని అంది పుచ్చుకుని, తెలుగులో వ్యంగ్య చిత్రాల చిత్రీకరణలో చెయ్యగలిగిన ప్రయోగాలన్నీ చేసి పాఠకులను అలరించినవారు బాబు . అందుకనే, తన కార్టూన్ల సంపుటిలో బాబు ఎంతో ఒద్దికతో, "ఎవరి గీతలనయితే నేను చూచి గీయడం నేర్చుకున్నానో-ఆగీతాకారుడైన శ్రీ బాపూగార్కి" అని కృతజ్ఞతలు చెప్పుకున్నారు.


నేను పూర్వం తెలుగు వికీపేడియాలో వ్రాసిన వ్యాసం ఇక్కడ మూడు భాగాలుగా ఇస్తున్నాను

కావలిసిన వివరాలన్నీ ఓపికగా ఇచ్చిన "బాబు" గారికి, ఈ వివరాలు సంపాయించటంలో ఎంతగానో సహకరించిన "జయదేవ్" గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు

బాబు ప్రముఖ కార్టూనిస్ట్ (రెండవ భాగం)

ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్‌ గీసిన బాబు రేఖా చిత్రం.ఒక కార్టూనిస్ట్ బొమ్మను మరొక కార్టూనిస్ట్ వెయ్యటం ఇదేప్రధమం అనుకుంటాను. అడిగిన వెంటనే జయదేవ్ గారు తన స్నేహితుడు మరియు సహ కార్టూనిస్ట్ అయిన బాబు చిత్రాన్ని చిత్రంగా గీసి పంపించారు. బాబు పేరుననుసరించి, బాబును చిన్నపిల్లవాడిగా వేసి,పెద్దవాళ్ళ తలకాయ గీసారు. భాబుకు చిన్న పిల్లలో ఉండే ఉత్సుకత, పరిశీలనా జ్ఞానం ఇప్పటికీ ఉన్నాయని, వీటన్నిటిని పెద్ద తలకాయతో అలోచించి అద్భుతమైన కార్టూన్లు గీస్తున్నరని జయదేవ్ చెప్పకనే చెపుతున్నారు.

బాబు-జయదేవ్
బాపు తెలుగు కార్టూన్లకు ఆద్యుడయితే, బాబు-జయదేవ్ రెండు కళ్ళలాంటివారు. ఇద్దరూ ఓకరికొకరు స్పూర్తిగా, స్నేహపూర్వక పోటీ తత్వంతో, తెలుగు వ్యంగ్య చిత్ర విభాగానికి ఏనలేని సేవ చేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ నిజ జీవితంలో ప్రియ మిత్రులు.

బాబు కథ
మనకున్న అగ్రగామి వ్యంగ్య చిత్రకారులలో, బాపు మరియు బాబు తప్ప మిగిలిన అందరూ, తమ తమ పేర్లను లేదా తమ పేర్లలోని కొంత భాగాన్ని తమ వ్యంగ్య చిత్రానికి సంతకంగా వాడుతుంటారు. బాబు, ఈ విధంగా పొడి అక్షరాలను వాడటానికి కారణం, వీరి చిన్నతనంలో, కుటుంబ సభ్యులు, మేనమామలు ముద్దుగా "బాబు" అని పిలిచేవారట. తన ముద్దుపేరునే తన కలంపేరుగా మార్చుకుని కలకాలం నిలిచేట్టుగా చేశారు.

కార్టూన్ల ప్రత్యేకత
వ్యంగ్య చిత్రాలకు ప్రాణం బొమ్మలో నాణ్యం. వీరు గీసే కార్టూన్లలోని చిత్రాలన్నీ కూడా చాలా నాణ్యమయినవే! చక్కటి గీతల కలయికతో భావయుక్తమయిన కార్టూన్లను గీయటం వీరి ప్రత్యేకత. కార్టూన్‌లో ఎంతవరకూ అవసరమో అంతవరకే వివరాలను చిత్రీకరిస్తారు. అనవసరమైన ఆర్భాటాలు వీరి కార్టూన్లలో ఉండవు. బొమ్మలు చక్కగా కుదురుగా ఉండి చూసి ఆనందించటానికి అనువుగా ఉంటాయి. మంచి చేతివ్రాతతో, అంతకంటే మంచి మాటల పొందికతో చదవగానే అర్ధమయ్యి నవ్వు తెప్పించే సంభాషణలు వ్రాయటం వీరి మరొక ప్రత్యేకత.

ఏకవిషయ-వ్యంగ్య చిత్రాలు
సామాన్యంగా, వ్యంగ్య చిత్రకారులు, తమ కార్టూన్లలో, ఒక్కొక్క కార్టూన్‌లోఒక్కో విషయం మీద హాస్యాన్ని గుప్పిస్తూ ఉంటారు. కాని, బాబు ఏదో ఒక విషయం తీసుకుని ఏకవిషయ-వ్యంగ్య చిత్రాలు అనేకం గీయటంలో మంచి దిట్ట.

ఆనందమంటే:చిన్న చిన్న ఆనందాలు-పెళ్ళాంతో వాదించి గెలవటం(భర్త మొహంలో అనిర్వచనీయమైన మహదానందం), వచ్చిన చుట్టం వెళ్ళిపోవటం, స్నేహితుడు హోటలు బిల్లు చెల్లించటం(ఆ స్నేహితుని ముఖ భంగిమ పొట్ట చెక్కలు చేస్తుంది)

పొదుపుచేసి చూడండి:పొదుపు చెయ్యటంలో విపరీతాలు, కూరలు వండుకోకుండా పచ్చివి తినటానికి ప్రయత్నించటం-నూనె ఆదా కోసరం అందరికీ గుండు చేయించి, భార్యను మరి నువ్వో అనే భర్త.

బ్రాందీ పుట్టిన దేశంలో ఓ మహానాయకుని చరిత్ర:మామూలు వీధి రౌడీ పెరిగి పెద్దయ్యి రాజకీయనాయకుడూ ఆపైన మంత్రి అయిన తరువాత అతని జీవిత చరిత్రను ఒక్కొక్క సంఘటనకు రెండేసి బొమ్మలు-ఒకటి యదార్ధం, మరొకటి ఆ యదార్ధాన్ని ఎలా మసిపూసి మారేడుకాయచేసి చూపుతారు-ఎంతో హాస్యంతో నింపి వేసారు.

సినిమా పాటలు:సినిమా పాటలకు పారడీగా కొన్ని చక్కటి కార్టూన్లు.

సుమతి కార్టూన్లు:సుమతీ శతకంలోని కొన్ని పద్యాలకు వ్యంగ్య చిత్రీకరణ.

హోటలోపాఖ్యానం: హోటళ్ళలో జరిగే హాస్య సంఘటనలు.

విశాఖలో సిటీ బస్సులు:ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాధ శాస్త్రి విశాఖ పట్టణంలో సిటీ బస్సుల స్వైర విహారం గురించి కాప్షన్ వ్రాస్తే, బాబు ఆ విషయానికి చక్కటి కార్టూన్లను అందించారు.

శిల్పి: శిల్పి శిల్పాలు చెక్కుతుండగా ఏర్పడటానికి అవకాశమున్న హాస్య సంఘటనలు. ముందు కాళ్ళు చెక్కటం మొదలు పెట్టటంతో, ఆ శిలకు పైన బరువెక్కువై ముందుకు ఒరిగి శిల్పి మీదపడపోతుంటే ఆ శిలను పట్టుకు నిలవిరుస్తున్న ఒక కొత్త శిల్పిని చూసి, అనుబవజ్ణుడైన పెద్ద శిల్పి "ముందు పైభాగం చెక్కాలని చెప్పానా" అంటూ ఉంటాడు.

రాశిఫలాలు:వార పత్రికలలో రాశి ఫలాలలో సామాన్యంగా ప్రతివారం వ్రాసే కొన్ని పడికట్టు మాటలను ఎద్దేవా చేస్తూ వేసిన వ్యంగ్య చిత్రాలు.

ఇన్ఫ్లేషనంటే: ద్రవ్యోల్బణం పెచ్చరిల్లితే ఎలా ఉంటుంది అన్న విషయానికి చక్కటి హాస్యంతో కూడిన చిత్రాలు.

వయోజనవిద్య:చదువుకోని పెద్దలకు అక్షరాలు నేర్పటం, తెలుగు అక్షరమాలను అనుసరించి "అ" నుండి "అం" దాకా అకర్షణీయమైన వ్యంగ్య చిత్రాలు.

మందుమహాత్యం:మద్యం సేవించిన మనిషి చేసే అపభ్రంశపు పనులు.

వీరి కార్టూన్లు నవ్వు తెప్పించటమే కాక, చదువరిని అలోచింప చేస్తాయి. పైన ఉదహరించిన ఏకవిషయ-వ్యంగ్య చిత్రాలన్నీ కూడ ఆ కోవకు చెందినవే.

బాబు ప్రముఖ కార్టూనిస్ట్ (మూడవ భాగం)


బాబుగారు వేసిన ఈ కార్టూన్, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మీద చక్కటి చురక. సామాన్య వోటరును ఎంత వెర్రివాణ్ణి చేసి రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకుంటున్నారో చూపిస్తుంది ఈ కార్టూన్. ఇందులో చూడండి, ఆ సామాన్య వ్యక్తి ఆశగా తనకు కావాల్సినవి ఆబగా (కొవ్వొత్తి వెలుగులో, ఇంట్లో సరైన లైటుకూడ లేదన్నమ్మట) వ్రాస్తుంటే, ఇవన్నీ మనచెసేదా పెట్టేదా అని వ్యంగ్యంగా చూస్తున్న రాజకీయ నాయకుడు, బాబు గారి అద్భుత చిత్రీకరణ.

వ్యంగ్య చిత్ర ధారావాహిక1972లో ఆంధ్రపత్రిక వార పత్రికలో, సంచిక తెరువగానే ముఖచిత్రం వెనుక వెంకన్నాస్ కోల్డ్ (అప్పట్లో మనదేశంలో విడుదలయిన ప్రముఖ ఆంగ్ల చిత్రం మెకన్నాస్ గోల్డ్ కు పారడీగా-పేరువరకు మాత్రమే) 24 వారాల పాటు ప్రచురించబడి పాఠకులను ఎంతగానో అలరించింది. తెలుగులో వ్యంగ్య చిత్ర ధారావాహికలలో మొదటిది బుడుగు అయితే, వెంకన్నాస్ కోల్డ్ రెండవది.


ప్రముఖుల అభిప్రాయాలు

శివలెంక రాధాకృష్ణ-ఆంధ్ర పత్రిక సంపాదకులు-చక్కటి గీత, నొప్పించని హేళన, మొత్తం మీద అందంగా కనిపించే బొమ్మ-తెలుగు కార్టూన్‌లలో ఈ లక్షణాలు ఉన్న సంప్రదాయాన్ని బాపు మొదలు పెట్టారు. జయదేవ్, బాబుల హాస్య చిత్రాలు ఈ సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నాయి. బాబు మంచి కార్టూనిస్టుగానే కాదు, ప్రథమ శ్రేణికి చెందిన కథా రచయితగానూ పేరుపొందాడు.
బాపు-ప్రముఖ చిత్రకారులు, దర్శకులు, వ్యంగ్య చిత్రకారులు- వీరు మాటలతో కాకుండా తన గీతలతోనే బాబు కార్టూన్ల మీద తన అభిప్రాయాన్ని విన్నూత్నంగా వ్యక్తపరిచారు. ఆంగ్లంలో కుర్చీలోంచి పడిపోవటం(Falling off the Chair) అన్న వాడుక ఉన్నది . ఈ వాడుకను సామాన్యంగా ఆవతలి వ్యక్తి మీద ఎంతగానో మంచి అభిప్రాయాన్ని వ్యక్తపరచతానికి వాడతారు. భాపు గారు, ఆ ఆంగ్ల వాడుకననుసరించి తాను బాబు కార్టూన్లు చదువుతూ ఎంతగానో ఆనందిస్తున్నట్టుగా కార్టూన్ వేసి, బాబును ఎంతగానో మెచ్చుకున్నారు.
జయదేవ్-ప్రముఖ కార్టూనిస్ట్-తెలుగు కార్టూనుకు దర్పణం పట్టిన కార్టూనిస్టులు ఇద్దరే ఇద్దరు. ఒకరు బాపు, మరొకరు బాబు. ఇద్దరి కార్టూనుల్లో హావం, భావం, పదం, రేఖా విన్యాసం మెండుగా కనిపించి, పాఠకుడి మనసునాకట్టుకుంటాయి. బాపు కార్టూను కళాకోవిదుడు. ఆయన్ని అన్ని కోణాలనుంచి పరిశీలించి, చదివి వంటపట్టించుకుని, కార్టూన్ విద్యలో ఉత్తీర్ణుడయ్యారు బాబు. తన చుట్టూ కదిలే, మెదిలే, వస్తువుల్ని, అంశాల్ని, వ్యక్తుల్ని, వాసనతో సహా పట్టేసి, స్పృశించి, సందర్భానుసారంగా తన ఊహా శక్తిని ప్రదర్శించగల నేర్పు బాబు ఒక్కరికే వుంది. 1965లో "మకెన్నాస్ గోల్డ్" సినిమా రిలీజైంది (విజయవాడలో1970వ సంవత్సరంలో ఊర్వశీ సినిమా హాలులో మొదటి సినిమాగా విడుదలయ్యింది). ఆ సినిమా టైటిలును బాబు పట్టుకున్నారు. "వెంకన్నాస్‌ కోల్డ్" బొమ్మల కథను సృష్టించారు(1972లో). అతనికి స్పూర్తి ఏ విధంగా కలుగుతుందో చెప్పలేము. అన్ని రకాలుగా ఆలోచించి, వ్యంగ్యాన్ని పండించగల ధీమంతుడు బాబు!
వేమూరి బలరామ్‌-స్వాతి వారపత్రిక వ్యవస్థాపకులు, సంపాదకులు-ఎదుటివారిని ఏడిపించడం ఎందరికో వేడుక. కాని ప్రతి వార్ని నవ్వించాలని కొందరికే కోరిక. అలా నవ్వించగలిగిన కొందరిలో 'బాబు'ది ఓ ప్రత్యేక బాణి.
రామకృష్ణ-ప్రముఖ కార్టూనిస్ట్- "బాపు తరువాత అంత అలవోకగా,తేలికైన గీతలలో కార్టూన్ చిత్రించటంలో నేర్పరి బాబు........సామాన్యుడి దైనందిన జీవితంలోని అనుభవాలకు చాలా దగ్గరగా ఉంటాయి ఆయన కార్టూన్లు. అందుకే అవి అంత బాగా పేలతాయి........."


జయదేవ్-ప్రముఖ కార్టూనిస్ట్ (వ్యంగ్య చిత్రకారుడు) మొదటి భాగం

జయదేవ్(Jayadev) ప్రముఖ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు. 1940 అక్టోబర్ 9న కడపలో జన్మించారు. ఈయన పూర్తి పేరు 'సజ్జా జయదేవ్ బాబు'. 1959వ సంవత్సరం నుండి కార్టూన్లు (వ్యంగ్య చిత్రాలు) చిత్రిస్తూ ఉన్నారు. గీతల్లో ఒడుపే కార్టూన్ కు ప్రాణం అన్నమాటను నిత్య సత్యం చేస్తూంటాయి ఆయన కార్టూన్లు.



ఈయన తన బాల్యం లో ఎక్కువ భాగం మదరాసు లోని పాత చాకలి పేటలో గడిపారు. వృత్తిరీత్యా జంతుశాస్త్రాన్ని మదరాసులోని సర్ త్యాగరాయ కాలేజీ లో 1997 వరకు బోధించారు.


ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రికలో 1959లో మొదలు పెట్టి, తెలుగులో వచ్చిన దాదాపు అన్ని వార, మాస పత్రికలన్నిటిలోనూ తన వ్యంగ్య చిత్రాలను ప్రచురించారు. అన్ని ప్రముఖ పత్రికలు, ముఖ్యంగా యువ దీపావళి సంచికలలో ఈయన కార్టూన్లు లేకుండా ప్రచురించబడేవి కాదు. 2002 వరకు ఆయన చిత్రీకరించిన వ్యంగ్య చిత్రాల సంఖ్య 40,000 పైగా ఉన్నాయి.


కార్టూనిస్ట్ అయిన విధం

చిన్నతనంలో చదువు మొదలు పెట్టినప్పుడు పడిన పునాది చేతి వ్రాత గుడ్రంగా వ్రాసేవాడు. 6వ 7వ తరగతులు చదువుతున్నప్పుడు డ్రాయింగ్ మాష్టారి దగ్గర పెన్సిల్ తో బొమ్మలు గీయటం నేర్చుకున్నారు. 9వ తరగతిలో తరగతి పత్రిక (Class Magazine)కు ఆంగ్లకవి వర్డ్స్ వర్త్ (Wordsworth) పద్యానికి బొమ్మ గీసి మెప్పు సంపాదించారు. 1957లో కాలేజీలో చదువుకుంటున్నప్పుడు, బయాలజీ ప్రొఫెసర్ వ్రాయబోతున్న పుస్తకానికి బొమ్మలు వేయటంకోసం, పెన్సిల్ తో కాకుండా, ఇండియన్ ఇంక్ తో, బ్రిస్టల్ బోర్డు పేపరు మీద, సన్నటి క్రోక్విల్ పాళీతో బొమ్మలు వెయ్యటం నేర్చుకున్నారు .


1959లో మొదటి కార్టూన్ ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. కాని ఆ మొదటి కార్టూన్ ప్రస్తుతం అందుబాటులో లేదు. చివరికి, వేసిన జయదేవ్ దగ్గరకూడ లేదట. కాని వారు చెప్పిన ప్రకారం, ఆ మొదటి కార్టూన్ నిశ్శబ్ద వ్యంగ్యచిత్రమే. అందులో రెండు బొమ్మలు. మొదటి బొమ్మలో దొంగను తరుముతున్న పోలీస్. రెండో బొమ్మలో పోలీస్ దొంగ జుట్టుపట్టుకునేప్పటికి, ఆ దొంగ పెట్టుకున్న పెట్టుడు జుట్టు(విగ్) పోలీస్ చేతిలోకి ఊడొచ్చి, వాడు పారిపోవటం! తన మొదటి కార్టూన్ తనదగ్గరే లేదని బాధపడుతుంటారు జయదేవ్.
(సశేషం)
(నేను తెలుగు వికిపీడియాలో వ్రాసిన వ్యాసాన్ని మూడు భాగాలుగా అందిస్తున్నాను)
(నేను అడిగినదే తడవుగా నాకు అన్ని వివరాలు ఇచ్చి ఈ వ్యాసం వ్రాయటానికి ప్రోత్సహించిన జయదేవ్ గారికి నా కృతఙ్ఞతలు )

19, జులై 2009, ఆదివారం

జయదేవ్-ప్రముఖ కార్టూనిస్ట్ (వ్యంగ్య చిత్రకారుడు) రెండవ భాగం




కార్టూన్లతో సంఘ సేవ

పొగ తాగటం వల్ల వచ్చే దుష్పరిణామాలు, నలుగురూ ఉన్నచోట ధూమపానం వల్ల జరెగే అసౌకర్యం, ఇతరులకు అనారోగ్య హేతువు కావటం వంటి విషయాలమీద అవగాహన 1970లలోనే వచ్చింది. కాని, పబ్లిక్ ప్రదేశాలలో పొగతాగటాన్ని నిషేధించటానికి అప్పటినుండి, మూడు దశాభ్దాల పైన పట్టింది. 1960-1970 దశకాలలో మధ్యాహ్నం సమయంలో వేసే మ్యాటినీ ఆటలకు (అప్పట్లో ఎ.సి. హాళ్ళు లేవు, మొదటి ఆటకు బయట వెలుగు ఉండదు కనుక తలుపులు మొత్తం తీసేవారు)సినిమాకు వెళ్ళితే, పొగ మేఘాల మధ్య చూడవలసి వచ్చేది. పొగరాయుళ్ళు అంతగా తమ అలవాటును యధేచ్ఛగా అన్ని చోట్లా కొనసాగించేవారు. ఇది గమనించి బాధపడిన జయదేవ్, తన కార్టూన్లను మాధ్యమంగా వాడుకుంటూ, ధూమపానం వల్ల వచ్చే దుష్పరిణామాలను ప్రజలకు హాస్యంతో జతపరిచి చెప్పసాగారు. అంతేకాక, తాను స్వతహాగా ఆచార్యుడవటం వల్ల, తాను పాఠం మొదలు పెట్టటానికి ముందు విద్యార్ధులకు పొగ తాగవద్దని హితవు పలికేవారు. వీరి మాటలు సరైన సమయంలో, సరైన విధంగా ఆ విద్యార్ధుల మనస్సులమీద పనిచేసి అనేకమందిని ఆ చెడ్డ అలవాటు బారిన పడకుండా చేసింది. వీరు వేసిన కార్టూన్ సకల ప్రజాదరణ పొందటమే కాకుండా, భారత కాన్సర్ సొసైటీ(Cancer Society of India)వారు, తమ ధూమపాన వ్యతిరేక ఉద్యమ ప్రచారంలో కూడ వాడుకుంటున్నారట. భారత ట్రేడ్ ఫైర్ అథారిటీ(Trade Fair Authority of India) వారు జయదేవ్‌ను ఢీల్లికి ఆహ్వానించి సత్కరించారు.
వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు
బాపు తరువాత సంతకం అక్కర్లేని అతి కొద్దిమంది వ్యంగ చిత్రకారులలో జయదేవ్ ఒకడు. baabu -కొలను వెంకట దుర్గా ప్రసాద్ మరొకరు). చూడగానే ఇది జయదేవ్ కార్టూన్ అని తెలిసిపోతుంది. వీరు వేసిన కార్టూన్లలో చక్కటి పొందిక అకట్టుకునే ఆకర్షణ. బొమ్మ చిత్రీకరణలో ఎటువంటి విపరీతాలు (మిడి గుడ్లు, అసహజ రూపాలు వంటివి) ఉండవు. సహజత్వానికి దగ్గరగా కార్టూన్ల లోని అయా పాత్రల ముఖ భంగిమలు, సదర్భానికి సరిపొయే ముఖ కవళికలు హాస్యప్రధానంగా చిత్రీకరించటంలో జయదేవ్ దిట్ట. అలాగే కార్టూన్లలోని సంభాషణలు ఎంతో పొదుపుగా చక్కటి భాషలో ఉండి అరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తాయి. బొమ్మకి వ్యాఖ్యా, లేదా వ్యాఖ్యకు బొమ్మా అని తటపటాయించేవారికి, వ్యాఖ్య లేకుంటే బొమ్మ అర్ధం కాదు. బొమ్మలేకుంటే వ్యాఖ్య అర్ధంకాదు. కార్టూన్లలో ఈ రెండిటికీ మంచి సంబంధం ఉండాలి అని వివరిస్తారు జయదేవ్. నేపాళం, భూపాళం, (తాగుబోతు) బ్రహ్మం, మిస్టర్ నో, బాబాయ్-అబ్బాయ్ వంటి పాత్రలను కార్టూన్లలో సృష్టించి పాఠకులను అలరించారు జయదేవ్.

(సశేషం)

శ్రీ జయదేవ్-ప్రముఖ కార్టూనిస్ట్(వ్యంగ్య చిత్రకారుడు) మూడవ భాగం

మైలు రాళ్ళు
జయదేవ్ గారికి అనేకానేక బహుమతులు, అవార్డులు లభించాయి. అందులో మచ్చుకి కొన్ని:
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు నిర్వహించిన కార్టూన్ల పోటీలో మొదటి బహుమతి
1991:ఊర్కహోన్డె ఛార్టర్, న్నొకి-హైస్ట్, బెల్జియం-గౌరవ ప్రస్తావన (Honourable Mention)

1992: ఒక్ హొట్స్క్ అంతర్జాతీయ కార్టూన్ పోటీ, జపాన్-ప్రత్యేక బహుమతి (Work of Special Merit Prize)

1993: భారత ప్రభుత్వం నిర్వహించిన పర్యావరణ అవగాహన పోటీలో ప్రధమ బహుమతి (First Prize, Care for the Enivironment Cartoon Contest, Government of India)

1994: ఒక్ హొట్స్క్ అంతర్జాతీయ కార్టూన్ పోటీ, జపాన్-ప్రత్యేక బహుమతి (Work of Special Merit Prize)

1995: అంతర్జాతీయ సందేశాత్మక కార్టూన్ ఫెస్టా, 1994, మియాగవ, జపాన్- కంపెనీ సౌజన్య బహుమతి (Company Sponsored Award)

1996: 25వ అంతర్జాతీయ కార్టూన్ ఫెస్టివల్ లో జూరీ సభ్యునిగా నియామకం (Nominated as Member of International Jury for the 25th International Cartoon Festival)

1997-2000: వ్యవస్థాపక ప్రిన్సిపాల్, హార్ట్ ఏనిమేషన్ ఎకాడమీ,హైదరాబాదు. పూర్తి పాఠ్యాంశ నిర్ణయం అమెరికన్ నిపుణులతో కలసి

2002: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ ఎకాడమీ మరియు రాజకీయ వ్యంగ చిత్రకారుల ఫోరం వారి సన్మానం

ఔత్సాహిక వ్యంగ్య చిత్రకారులకు జయదేవ్ సూచనలు:

ఐడియాలు మెదడులో ఫ్లాష్ ఔతాయి. కార్టూనిస్ట్ ఆవిధంగా ఫ్లాష్ ఐన ఐడియాలను ఒక పాకెట్ నోట్ బుక్ లో, నోట్ చేసి పెట్టుకోవాలి.

మన కార్టూన్ ఐడియాలు మన దేశవాతావరణఅనికి అనుగుణంగా ఉండాలి. నోట్ బుక్కూ పెన్సిలూ రెడీగా పెట్టుకోవాలి. రఫ్ గా బొమ్మ వేసి, ఐడియాకు సరిపడా వ్యాఖ్య రాసేయాలి. కార్టూన్లు గీయడానికి ఉపక్రమించే ముందు, ఈ పాకెట్ నోట్ బుక్ చాలా ఉపయోగపడుతుంది.

కార్టూన్ అనుకున్నప్పుడు సీన్ ను చిత్రించడమే కాకుండా క్యారక్టర్స్ కు సంబంధించిన ఎక్సప్రెషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మాట్లాడే క్యారక్టరు నోరు తెరిచి ఉండాలి. ఆవతలి క్యారక్టర్ ఎక్సప్రెషన్ ను సూచించేలా ఉండాలి. క్యారక్టర్స్ చిత్రీకరణ అయ్యాక బాక్ గ్రౌండును క్రియేట్ చేయాలి. బాక్ గ్రౌండ్ లొకేషన్ ను సూచించాలి. ముఖ్యమైన అంశాలుంటే చాలు. అనవసరమైన డీటైల్సుతో బాక్ గ్రౌండు, క్యారక్టర్లను డామినేట్ చేయకుండా జాగ్రత్తపడాలి.

కార్టూన్ గీశాక ముందస్తుగా ఇంట్లో వాళ్ళకీ, స్నేహితులకి చూపించాలి. వాళ్ళి మెచ్చుకుంటే తప్పకుండా పత్రికల ఎడిటర్లు ఆ కార్టూన్ కు పాస్ మార్కులిచ్చినట్లే.

ఓపిక అలవరుచుకోండి. అలోచించండి. హాయిగా సరదాగా నోరువిప్పి మాట్లాడండి. ఇతరుల మాటలను వినండి. అబ్జర్వ్ చేయండి.......కార్టూన్లు గీయండి.

జయదేవ్ గారి కార్టూన్ల మీద ప్రముఖుల అభిప్రాయాలు

బాబు -ప్రముఖ కార్టూనిస్ట్ - కార్టూను గీతలు హడావిడిగా కాక, శ్రద్ధగా గీసినట్టుండి, అందంగా కనిపిస్తాయి. రాత అచ్చు అక్షరాల్లా ఉంటాయి. సంభాషణరహిత కార్టూన్లు వెయ్యటంలో దిట్ట. హాస్యం అతని కార్టూన్ గమ్యం. సైన్సు విషయాలమీద తెలుగులో కార్టూన్లు వెయ్యగల ఏకైక కార్టూనిస్ట్. మెగతా కార్టూనిస్టులకు ప్రొత్సాహం ఇచ్చే విషయంలో చాలా చొరవ చూపుతారు.

వంశీ-ప్రముఖ సినీ దర్శకుడు-అందరూ ఒక కోణంలో అలోచించగలిగితే, జయదేవ్ పలు కోణాల్లో అలోచించగల సామర్ధ్యం తన స్వంతం చేసుకున్న వ్యక్తి........అన్ని కార్టూనులూ చూసి అనందించాను. కొన్ని కడుపుబ్బ నవ్విస్తే మరికొన్ని చాలా అలోచింపజేశాయి. ఒక కార్టూనిస్టు ఏ విధంగా ఆలోచించాలో, ఎలా అలోచింపజేయాలో జయదేవ్ తన కార్టూన్ల ద్వారా విపులీకరించారు.

శివలెంక రాధాకృష్ణ ఆంధ్ర పత్రిక సంపాదకులు-చక్కటి గీత, నొప్పించని హేళన, మొత్తం మీద అందంగా కనిపించే బొమ్మ-తెలుగు కార్టూన్‌లలో ఈ లక్షణాలు ఉన్న సంప్రదాయాన్ని శ్రీ బాపు గారు మొదలు పెట్టారు. శ్రీయుతులు జయదేవ్, బాబుగారల హాస్య చిత్రాలు ఈ సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నాయి.

రామకృష్ణ - ప్రముఖ కార్టూనిస్ట్-జయదేవ్‌ది ఓ ప్రత్యేకమైన శైలి. ఆ శైలే, క్రింద సంతకం చూడనవసరం లేకుండానే తేలికగా పట్టించేస్తుంది......విషయం ఎన్నుకునే విధానం చాలా గొప్పగా ఉంటుంది. నిశ్శబ్ద వ్యంగ్య చిత్ర నేర్పరి. "ట్యూబ్‌లైటు" కార్టూన్లలో మరింత పరిశీలిస్తేకాని బుర్రలో లైటు వెలగని గొప్ప కార్టూన్లు వేశారాయన. చిన్న కార్టూన్లలోనే ఆయన చేసే బహు విశాలమైన సన్నివేశ చిత్రీకరణ అద్భుతం.....

జయదేవ్ కార్టూన్లతో చిన్న సినిమా(వ్యాఖ్యానం రచయితది)

నాటక రంగం


ఆంద్ర రంగస్థల నాటకాలను అభిమానించేవారిని అలరించే ఒక చక్కటి వెబ్ సైటు దొరికింది. ఇందులో, మన రంగస్థలం మంచి ఉన్నత స్థితిలో ఉన్నప్పటి ప్రముఖ నటులు పాడిన పద్యాలు ఉన్నాయి. మరికొన్ని ఏకపత్రాభినయాలు ఉన్నాయి. వీటితో పాటుగా, ఆకాశవాణి విజయవాడ కేద్రం నుంచి ప్రసారమైన కన్యాశుల్కం నాటకం నుండి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఇవే కాకుండా, ప్రముఖ సినీ నటుడు శ్రీ నాగభూషణం నటించిన రక్త కన్నీరు నాటకం నుండి కూడ కొన్ని ఘట్టాలు ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకోవటాంకి అవకాశం ఇవ్వలేదు, కాని విన్ ఏంప్‌లో వినవచ్చు.
ఈ వెబ్ సైటును నడుపుతున్న కాజ రామకృష్ణ మాధురి కార్లు అభినందనీయులు.
http://www.andhranatakam.com/Audios.html
శివరామప్రసాదు కప్పగంతు

18, జులై 2009, శనివారం

శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు


భమిడిపాటి హాస్య గుళికలు

శ్రీ భమిడిపాటి కామేశ్వరరావుగారు నాకేంతో ప్రీతిపాత్రుడైన రచయిత. నా చిన్నప్పుడు మా నాన్నగారు పరిచయం చేసిన (ఆయన దాచుకున్న అతికొద్ది పుస్తాకాల్లో ఒకటి) "ఎప్పుడూ ఇంతే", "కచటతపలు"
నాటికల సంపుటితో మొదలుపెట్టి, ఆయన రచనలన్నీ వెతికి, వెతికి చదివాను. 1982 ప్రాంతాలలో రాజమండ్రి వెళ్ళినప్పుడు, అక్కడ కోటగుమ్మం కూడలిలో కోడపల్లి వీరవెంకయ్య ప్రచురణల వారి వద్ద (నా ఎదురుకుండానే ఆ అమ్మే కుర్రాడు పుస్తకం మీదున్న రేటు చెరిపి దానికి మూడింతలు వ్రాస్తున్నా మారుమాట్టాడకుండా) దొరికినన్నని పుస్తకాలు కొన్నాను. అలాగే వారి పుస్తకాలన్నీ పోగుచెసే ప్రయత్నంలో ఇంకా ఉన్నాను. మానవ సంబంధాలు, మనందరిలో ఉండే ద్వంద ప్రవృత్తి గురించి తేటతెల్లంగా అద్భుతమైన హాస్యంతో వ్రాయటం, కామేశ్వరరావుగారి తరువాతనే ఎవరైనా. ఈయన వ్రాసిన పుస్తకాలు ఇప్పటికీ చాలమటుకు లభ్యం కావటంలేదు. ఈమధ్యనే, విజయవాడకు చెంధిన ప్రచురణ సంస్థ వారెవరో, వీరి రచనలన్నీ ఒక సంపుటిగా వేస్తున్నారని తెలిసి ఎంతగానో సంతోషించాను. కాని అటువంటి సంపుటి ఎప్పటికి బయటకు వస్తుందో తెలియదు. కామేస్వరరావుగారి గురించి నాకు తెలిసిన విషయాలను అందరితో పంచుకుందామని ఈ ప్రయత్నం.

వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఏప్రిల్ 28, 1897 సంవత్సరంలో నరసావధానులు, లచ్చమ్మ దంపతులకు జన్మించారు. వీరు భీమవరంలో పాఠశాల విద్యను పూర్తి చేసి, ప్రతిభావంతులైన విద్యార్ధులకిచ్చే ఉపకార వేతనం సహాయంతో, పిఠాపురం మహారాజా కళాశాలలో గణితంలో పట్టా పొందారు. తరువాత కొంతకాలం నరసాపురం మరియు కాకినాడలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1922లో ఎల్.టి పరీక్షలో ఉత్తీర్ణులై రాజమండ్రి వీరేశలింగం ఆస్తిక ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర అధ్యాపక పదవిలో స్థిరపడి, అదే పాఠశాలకు రెండు సంవత్సరాలు ప్రధానోధ్యాపక బాధ్యతలను కూడా నిర్వహించారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ వీరు చాలా నాటకాలు, నాటికలు, కథలు రచించారు. సమకాలీన సాంఘిక సమస్యలను వీరి రచనలలో హాస్యరసానురంజకంగా మలచిన ప్రజ్ఞాశాలి అవటం వలన పండితలోకం వీరిని హాస్య బ్రహ్మ అని కొనియాడారు. ఉత్తమమైన హాస్య రచనలతో ఎందరినో మనసారా నవ్వించిన వీరు 1958, ఆగష్టు 28న పరమపదించారు.


భమిడిపాటి కామేశ్వర రావు గారి అనేక హాస్య రచనల నుండి కొన్ని హాస్య పూరకమై, ఈనాటికి సందర్భ శుద్ధిగా ఉండేవి కొన్ని ఇక్కడ ముచ్చటించుకుందాము:





  • పాలక సంఘాల్లో ఎన్నికల మజా అన్న వ్యాసం నుండి
    ఇప్పటి పరిపాలనతో సంబంధించిన ఎన్నికల పోటీల్లో నెగ్గటానికి ఎవరికేనా, నంగోరు ధనం, నంగోరు నక్కజిత్తులూ ఉండాలి. లేక ఒకవేళ హీనుడైనా పరిపూర్ణమైన నక్కజిత్తు లుండి, ఇంకోడిచేత ధనం పెట్టుబడి పెట్టంచినా చాలు.
    ఒకడు పాడు పన్లు చేస్తూవుంటే, మనంకూడా, నెగ్గాలంటే, అంతకంటే పాడుపన్లు చెయ్యవలసి వచ్చేది ఎన్నికల్లోనే.
    ఎన్నికల నిఘంటువులో అసత్యం అధర్మం, అన్యాయం, ద్రోహం క్రౌర్యం, దారుణం లాంటి మాటలుండవు.
    పదవి లాక్కోవాలని ఒకరూ, ఉంచుగోవాలని ఒకరూ రాక్షస చాణక్యుల్లాగ ఎత్తుపై ఎత్తులు వేస్తూనే ఉంటారు. పాలకసంఘం పాలించవలసిన మేరలో ఉన్న జనంసంగతి ఎవర్కీ అక్కర్లేదు. జనం పంపినమీదట పాలకసంఘంలోకి వెళ్ళి, వెంటనే ఆ జనాన్ని మరచిపోడమే ఎన్నికల్లో మజా; ఒకవేళ జ్ఞాపకం ఉంచుగున్నా, ఆ జనుల్లో మొదటి జనుడు తనేగదా అనుకోడం మరీ మజా!!




  • వన్స్మోర్ వ్యాసంలో - మామూలు ధోరణి మారి, వ్యాపారం ముదిరినప్పుడు, చాలా మంది తెలుగువాళ్ళు లోగడ మాట్లాడుతూన్న తెలుగు మానేసి ఎక్కువ గంభీరంగా ఉండడానికి, యధాశక్తి ఇంగ్లీషులో కోపిస్తారు.




  • నాటకం-టాకీ వ్యాసంలో-(అంతకుముందు సినిమాలకు శబ్దం ఉండేదికాదు. శబ్ద చలన చిత్రాలు ఒచ్చిన కొత్తల్లో సినిమాలను "టాకీ" అనేవారు)టాకీలలోని కథ వగైరా గురించి-
    .....సరి మరి కథ. అది పురాణం అవాలి. లేకపోతే అంధ(అచ్చు తప్పేమో ఆంధ్ర బదులు అంధ అని ఉన్నదనుకోవటానికి వీలులేదు. రచయిత ఉద్దేశ్యం "అంధ" అంటే "గుడ్డి" అని) జనానికి గణ్యత ఉండదు. అంధ జనం నూటికి తొంభై. వాళ్ళంతా హాజరైనప్పుడుగాని టాకీ వర్తకం కిట్టదు. వాళ్ళకి భక్తి కుదిరేందుకు దేవుళ్ళూ, భయం వేసేందుకు అడివి మృగాలూ, హుషార్ కలిగేందుకు సుందరులూ వాళ్ళ స్నానాలూ, ఆటలకి గంభీరమైన శీర్షికలూ-సర్వంగిలాబా చెయ్యడంకోసం కైంయిమంటూ మంచి పీకవాళ్ళు పాటలూ! దాంతోటి జన బాహుళ్యం మొదట తమాషాకోసమున్నూ తరువాత తోచకానూ ఎగపడడం. 'వార ప్రతిష్ఠతో' డబ్బురావడం, డబ్బొచ్చిన టాకీ గనక గొప్పదని చెప్పడం! అందువల్ల అందులో యంత్రిపబడ్డ నటులు అసమానంగా అభినయించారనిన్నీ, వాళ్ళ కీర్తి మిన్ను ముట్టడం రూఢీ గనకనే వాళ్ళని 'తార' లు అంటున్నారనిన్నీ చెప్పుగోడం.
    ...బొమ్మకి కన్ను చాలు (టాకీలో మాటలకి గణ్యత తక్కువ గనక) అందుకని, టాకీ పామరుల్ని కూడా అకర్షిస్తుంది. కాదు పామరుల్నే ఆకర్షిస్తుంది....

  • తెలుగు నటుడు వ్యాసం నుండి-
    నటుడికి సౌష్టవమూ, బలమూగల విగ్రహమూ, అడే కాళ్ళూ, తిరిగే చేతులూ, కోటేసినట్టుండే ముక్కూ, చారెడేసి జిలజిలలాడే కళ్ళూ, హృదయభావాన్ని స్వీకరించి స్థిరం చేసుకోగల ముఖమూ, కంచుగీసినట్టూ మధురంగానూ ఉండగల గాత్రమూ, ఉచితమైన సంగీత సామగ్రీ, ఆరు వేషాలుగల తెలుగు ఉచ్చారణా, ఆంధ్ర భాషా, ఇతర సన్నిహిత భాషల్లో ప్రవేశమూ, వాటిల్లో ఉచ్చరణా పాటవమూ, అమోఘమైన ధారణా, ఉచితవేషం ధరించుకోగల తెలివీ,బోధనా శక్తీ, ఆకర్షణా, సౌశీల్యమూ, నాటకకర్త గిలికిన రచనకి మెరుగు పెట్టగల ప్రతిభా-ఇల్లాగా వీలైనన్ని శక్తులూ, సామర్ధ్యాలూ ఉంటేగాని ఎంతమాత్రము వీల్లేదని కోప్పడి శాసించారు.
    పరిక్షలు వ్యాసం నుండి-
    పరీక్షలకోసం, మార్కుల కోసం మాత్రమే బాధపడేవాడికి, విద్య అంటదు. విద్యకోసం పాటుపడేవాడికి పరీక్షవల్ల బాధే ఉండదు.
    ...జీవితం ఒక పెద్ద నిత్య పరీక్ష. జీవితపరీక్షకి ఎప్పుడో తయారు అవుతానులే అనడంకాక, అప్పటికప్పుడు తయారుగా ఉండడం మానవుడి విధి.
    మన తెలుగు వ్యాసం నుండి-
    ...నూటికి నూరుమంది పైచిలుకు మాట్టాడే తెలుగు కలగాపులగమే. ఈ పులగంలో సస్కృతం, పార్శీ, ఇంగ్లీషుమాత్రం జోరుగా పడ్డాయి. తెలుగు యొక్క మెత్తదనం వల్లనే ఇన్నిన్ని భాషల పదాలు బాణాల్లాగ హృదయం నాటేలాగ తెలుగులో గుచ్చుకుని ఉన్నాయి. తెలుగు శరీరంలో వాటిని నిల్చి ఉండనిస్తే అవి సెలలువేసి ప్రాణం తీసేస్తాయని కొందరూ, లేక వాటిని పైకిలాగిపారేస్తే వెంటనే ప్రాణపోకట అని కొందరూ!




  • ఎప్పుడూ ఇంతే నాటికలో ఒక పాత్ర
    ....చంపేస్తానని ఎంత పని చేయిస్తునావురా నీ తుపాకీ ఇదైపొనూ! నిన్నైనా మోస్తుం లెక్కలేకుండా!!మావాడైపోయాడు, అదీ మా విచారం, అదీ మా శిరఛ్ఛేదం. మావాణ్ణితప్ప విడిచి మరి ఇతరుణ్ణి ఎవణ్ణయినాసరే తెగ మోద్దుం చచ్చేవరకూను!....
    వాడు కేవలం నాశనం అయుపోవాలి. నాకది చాలు! నే బాగు పడక్కర్లేదు. దుర్యోధునుడికి పై అంతస్థు నాది. వాడు చేతగాని వాడు. ధర్మరాజుకి ఉందనీ, తనకి లేదనీ తనకి కూడా కలగాలనీ ఏడిచాడు. నేను, నాకక్కర్లేదు, ఇంకోడికి పోతే చాలనీ.....



  • లు నాటికలో-ఒక పాత్ర
    ..."ఈ వ్యాపారంలో ఎల్లానైనా నేనే ఓ గొప్పవాణ్ణికావాలి, కానీ ఖర్చుకాకుండా. అధమం వీణ్ణి కానియ్యకూడదు....
    ...పంపకాలు కుదరక పారపోసుగోడం మనకి కొత్తగాదు!...
    అద్దెకొంపలు వ్యాసం నుండి
    ....అద్దె యజమానురాలుగారు ఒక్కత్తే ఒక యెత్తూ! ఒక్కొక్క యజమానురాలి చర్య అద్భుతం! అసలు ఆవిడ గృహిణి, అందులో అద్దెకొంపల రాణీ. అందులో కాస్త స్వాతిశయంకూడా ఉంటే ఆవిడ అద్దెకొచ్చిన వాళ్ళని ఎలాచూస్తుందని తమ ఊహ? తప్పు చేసిన కోడల్ని అత్తగారు ఇంతగా రొకాయించదు! నీతితప్పిన పెళ్ళాన్ని తాళి గట్టినముగుడు ఇంతగా దండించడు! నేరంచేసిన పాపిని దండనాధికారి ఇంతగా దుయ్యబట్టడు! చవట పరిపాలన చేసే మండలేశ్వరుణ్ణి సామాజ్య మంత్రి ఇంతగా ఆజ్ఞ పెట్టడు! అద్దెల వాళ్ళ ఆచారం గర్వం, తన ఆచారం మడి. తన వస్తువు ఇంకోరి ఇంట్లో కనపడితే, వారిది దొంగతనం; ఇంకోరి వస్తువు తనింటోఉంటే "ఎక్కడికి పోతుందే! పొరపాటో" అవడం! అద్దెలవాటాల తూముల్లోంచి ప్రవహించేది అపవిత్రమైన కంపుముండానీరు, తన వాటా తూముల్లోంచి వెళ్ళేది పావనమైన అభిషేకజలం(ఇదంతా కలిపి ఒకటే తోము అయినా సరే ఆవిడ వాదన అంతే). దొడ్లో తక్కినవాళ్ళ వాటాల్లో కాసేవన్నీ కేవలం తనవే. నలుగురూ వచ్చే నూతిదగ్గర తమరి తాలూకు పిల్ల గుడ్డలు మాత్రమే జాడించవచ్చు! అద్దెలవాళ్ళుగనక ఆపనే అక్కడచేస్తే, "ఎవళ్ళకొచ్చింది ఈ వినాశకాలం! అన్నం తింటారా, గడ్డి తింటారా!" అంటో తను ఆపని చేస్తూనే, ధరీ అంచూ లేకుండా లెక్చరు పూర్వకంగా తిట్టడం........"(ఇలా ఇంకా రెండు పుటలు ఉన్నది, అప్పటి అద్దె ఇళ్ళల్లో ఉండేవారు ఎదుర్కోవలసిన బాధల చిట్టా)

కామేశ్వరరావుగారి గురించి నేను వ్రాసిన మొత్తం చదివినందుకు అభినందనతో ఒక చిన్న చిరు కానుక. వారు రచించిన మూడు పుస్తకాలు ఈ కింద ఇచ్చిన లంకె ద్వరా మీ కంప్యూటర్ లోకి దింపుకోవచ్చు. ఈ పుస్తకాలను జాగ్రత్తగా స్కాన్ చేసి వెబ్‌లో ఉంచిన ఆర్ఖైవ్ డాట్ ఆర్గ్ (http://www.archive.org/) వారికి నా కృతజ్ఞతలు. కాకపోతే వారు కామేశ్వరరావుగారి ఇంటిపేరు తప్పుగా ప్రచురించారు (భిమిడిపటి అని, భమిడిపాటికి బదులుగ) అందుకని, మీరు వెతకాలనుకున్నాప్పుడు సెర్చ్ లో bhimidipati అని టైపు చెయ్యాలి.

http://rapidshare.com/files/257422471/BHAMIDIPATI_BOOKS.zip
దయచేసి వ్యాఖ్యలు చూడండి. అక్కడ శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు మరిన్ని లంకెలు ఇచ్చారు. ఆ లింకులు అనుసరిం మరిన్ని భమిడిపాటి వారి పుస్తకాలను మీ కంప్యుటర్లోకి దింపుకోవచ్చును.

16, జులై 2009, గురువారం

శ్రీ వడ్డాది పాపయ్య (వ. పా.)

శ్రీ వడ్డాది పాపయ్య గారు నా అభిమాన చిత్రకారుడు. ఆయన వేసిన అనేక చిత్రాలను చందమామ లో చూసి ఆనందిస్తూ అనేక మంచి విషయాలను గ్రహిస్తూ పెరిగాను. శ్రీ వడ్డాది పాపయ్యగారు తెలుగువాడుగా పుట్టటం మన అదృష్టం. పాపయ్య గారు వేసిన చిత్రాలను గ్యాలరీలలో పెట్టారో లేదో తెలియదు కాని, ఆయన మీద ఉన్న అభిమానంతో ఒక కంప్యుటర్ మాయా గ్యాలరీని సృష్టించాను. అందులో ఆయన వేసిన బొమ్మలను ఉంచి చూడటానికి వీలుగా తయారు చెశాను. ఇది జిప్ ఫైలు , అన్ జిప్ చేసి రెండుసార్లు నొక్కగానే గ్యాలరీ ప్రత్యక్షం అవుతుంది. ఎఫ్1 నొక్కితే దానంతట అదే కదలటం మాని, మీరు మౌస్ తో కదుల్చుకోవచ్చును. మీ కంప్యుటర్ మెమెరీ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా కదులుతో గ్యాలరీ అంతా చూడవచ్చును. ప్రత్యేక వీడియో కార్డు ఉంటే మరీ మంచిది. ఈ కింది లంకే ద్వారా మీ కంప్యుటర్ లోకి దింపుకుని ఆనందించండి.
http://rapidshare.com/files/256517465/VAPA_EXHIBITION.జిప్

వపాగారి బొమ్మల మీద  మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామల అట్టల మీద ఉన్న ఆయన వేసిన బొమ్మలు చూసి ఆనందిమ్చావచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013
కప్పగంతు శివరామప్రసాదు
బెంగుళూరు, భారత్

పరోపకారి పాపన్న కథలు

చందమామ కథలలో ఎంతగానో ప్రాచుర్యం సంపాయించుకున్న కథలలో పరోపకారి పాపన్న కథలు మొట్టమొదటివి. రంగు ధారావాహికల తరువాత వెంటనే చదువుకునే ధారావాహిక, పాపన్నకథలే. మంచితనానికి మారు పెరు గా ఉండే ఫాపన్న, ఎదుర్కొనే సన్నివేశాలను కధలుగా ఊహించి అద్భుతంగా ఛందమామ లొ ప్రచురించారు. ఈ కథలను 1962లో మొదలు పెట్టి కొన్నాళ్ళు ధారావాహికగా ప్రతి నెలా, మరి కొంతకాలం అడపా దడపా 1968 వరకూ వేస్తూ వచ్చారు.

ఛందమామలో పాపన్న కథలను వ్రాసినది, చందమామ కార్యాలయంలో అప్పట్లో పని చేస్తున్న ఎం రంగారావుగారట పాపన్న కథలలో మొట్టమొదటిది, "పాపన్న చదువు", చివరి కథ "కూరగాయల తోట". చదువుతున్న చిన్నపిల్లలకే కాక, పెద్దలకు కూడ పరోపకారం చెయ్యటం ఎంతగానో బోధించిన కథలు పరోకారి పాపన్న కథలు. ఈ కింద ఉన్న లంకే నొక్కి మీరు మీ కంప్యుటర్లోకి దింపుకొని చదివి ఆనందించవచ్చు.

http://rapidshare.com/files/260115101/PAROPAKARI_PAPANNA_KATHALU.PDF

పరోపకారి పాపన్న కథలు  ధారావాహిక మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

12, జులై 2009, ఆదివారం

దుర్గేశ నందిని, నవాబు నందిని చందమామ ధారావాహికలు

దుర్గేశ నందిని మరియు నవాబు నందిని చందమామ లో ప్రచురించబడిన జంట ధారావాహికలు. సామాన్యంగా చందమామ ధారావాహికలన్నీ కూడా జానపద కథలే. కాని సాంఘిక/చారిత్రాత్మకమైన ఈ ధారావాహికలను, చక్రపాణిగారు బెంగాలి సాహిత్యం మీద తనకు ఉన్నమక్కువకొద్దీ ఈ ధారావాహికలను ప్రచురింపచేశారు. కాని,ఈ ధారావాహికలను చదువరులు అంతగా ఆదరించలేదు. పైగా చందమామ అమ్మకాలు ఈ ధారావాహిక ప్రచురించే సమయంలో తగ్గిపోయ్యాయట. అందుకని ఆ తరువాత ఇటువంటి ప్రయోగాన్ని చందమామ వారు మరెప్పటికి తలపెట్టలేదు.
ఏది ఏమైనా చందమామలో ప్రచురించబడిన ధారావాహికలలో నా చిన్నప్పటి జ్ఞాపకాలలో ఉన్నాటువంటి ఈ ధారావాహికను చందమామ అభిమానులందరితో పంచుకోవటం ఎంతగానో సంతొషంగా ఉన్నది. ఈ కింద ఇచ్చిన లంకె నొక్కండి, ధారావాహిక మీ కంప్యుటర్లోకి వస్తుంది.

http://rapidshare.com/files/260303265/DURGESA_NAVABU_NANDINI.PDF

దుర్గేశ/నవాబు నందిని  ధారావాహికల  మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహికలను  డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

శివరామప్రసాదు కప్పగంతు బెంగుళూరు భారత్

5, జులై 2009, ఆదివారం

పురాణ గాధలు








చందమామలో అరణ్యపురాణం ధారావాహిక ప్రచురణకు ముందు (1964-65 ప్రాంతాలలో) కొన్ని నెలలు అట్టవెనుక బొమ్మకు ధారావాహిక లేదు. ఆ చోటులో, అనేక పురాణ గాధలను ప్రచురించారు చందమామవారు. ఈ పురాణ గాధలు కొన్ని రెండు నెలలు, కొన్ని మూడునెలలు ధారావాహికలుగా కొన సాగినాయి. ఎక్కువగా ఒకనెలలో కథను ముగుంచినవే!! ఈ కథల ప్రాముఖ్యత ఏమంటే, అట్టవెనుక బొమ్మేకాదు, కధలకు కూడ శ్రీ వడ్డాది పాపయ్యగారే బొమ్మలు వేశారు. ఈ పురాణ గాధలను చదివి అనందించండి.
http://rapidshare.com/files/252237470/PURANA_KATHALU.pdf.html


పురాణ గాధలు  ధారావాహిక మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013
శివరామప్రసాదు కప్పగంతు
బెంగుళూరు, భారతదేశం